సోమవారం చెన్నైలో నీటమునిగిన ఒక రహదారి
సాక్షి, చెన్నై: తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. 10, 11 తేదీల్లో చెన్నై దాని శివారు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్య రుతు పవనాలు, ఉపరితల ఆవర్తనంతో తమిళనాడులో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మంగళవారం దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. దీంతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు తదితర 14 జిల్లాల్లో కొన్నిచోట్ల భారీగా, మరికొన్ని చోట్ల మోస్తరుగా వర్షాలు పడనున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
చెన్నై లోతట్టు ప్రాంతాల్లో ఎటు చూసినా మోకాలి లోతులో నీరు నిల్వ ఉండడంతో ఆ పరిసరాల్లోని ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధాన మార్గాల్లో వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టినా, వీడని వాన కారణంగా అనేక మార్గాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. నగరంలో కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. చెన్నైలో సహాయక చర్యలు విస్తృతం చేశారు. రెండో రోజు సోమవారం కూడా సీఎం ఎంకే స్టాలిన్ చెన్నై నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఆరణియారు పొంగి పొర్లుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో పిచ్చాటూరు – ఊత్తుకోట – తిరువళ్లూరు మార్గంలో రెండు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. కాగా, రాష్ట్రంలో వర్ష సంబంధ ఘటనల్లో నలుగురు చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment