చెన్నైలో జలప్రళయం  | Sakshi
Sakshi News home page

చెన్నైలో జలప్రళయం 

Published Tue, Dec 5 2023 4:56 AM

Cyclone Michaung effect in Chennai - Sakshi

సాక్షి, చెన్నై: ఎక్కడ చూసినా నీరే. అంతటా వరద ప్రవాహమే. తమిళనాడు రాజధాని చెన్నై సముద్రాన్ని తలపించింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మిచాంగ్‌ తుపానుగా మారి తమిళనాడు రాజధానితో పాటు శివారు జిల్లాల్లో జల ప్రళయమే సృష్టించింది. ఆది­వారం రాత్రి నుంచీ ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కొనసాగింది. సోమవారం మధ్యాహ్నానికే చెన్నై, శివారు జిల్లాల్లో 35 సెంటీమీటర్ల వర్షం నమోదైంది! దాంతో వీధులన్నీ వాగులుగా మారాయి.

నగరంలో ఎటు చూసినా వరద పోటెత్తింది. ఇళ్లు, పార్కింగ్‌ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి! నడుం లోతుకు పైగా నీరు చేరడంతో నగరంలోని అన్ని హైవేలను, సబ్‌వేలను మూసేశారు. రన్‌ వేపైకి నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయాన్ని కూడా మంగళవారం ఉదయం దాకా మూసేస్తున్నట్టు ప్రకటించారు. 160 విమాన సేవలు రద్దయ్యాయి. వండలూరు జూలోకి వరదనీరు పోటెత్తడంతో పెద్ద సంఖ్యలో మొసళ్లు తప్పించుకున్నాయి.

దివంగత సీఎం జయలలిత నివాసం, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వంటి ప్రముఖులుండే పోయెస్‌ గార్డెన్‌ హైవే 7 అడుగుల మేర కుంగింది! అక్కడ టాన్స్‌ఫార్మర్లు, వాహనాలు అందులో పడిపోయాయి. వాన బీభత్సం కొనసాగుతుండటంతో సహాయ చర్యలూ చేపట్టలేని పరిస్థితి ఉంది. ప్రజలంతా ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటున్నారు. మంగళవారం కూడా వర్షాలు కొనసాగుతాయన్న హెచ్చరికలు గుబులు పుట్టిస్తున్నాయి. చెన్నై శివారులోని జాతీయ రహదారి వరద నీటిలో మునగడంతో రాకపోకలు స్తంభించాయి. నగరం, శివార్లలోని చెరువులు, రిజర్వాయర్లు నిండడంతో అడయార్, కూవం నదులు, బకింగ్‌ హాం కాలువల ద్వారా చెన్నై వైపుగా వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

నగరాన్ని చుట్టుముడుతున్న వరదను తొలగించేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో మంగళవారం కార్యాలయాలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తమిళనాడు సీఎం స్టాలిన్‌తో ఫోన్లో సహాయక చర్యలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. వేలాది మంది నిర్వాసితులై చెన్నై, శివార్లలో వందలాది శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వర్షాలకు చెన్నైలో ఐదుగురు మృతి చెందారు. వందలాది రైళ్లు రద్దయ్యాయి.

47 ఏళ్లలో అతి భారీ వర్షం
తాజా వర్ష బీభత్సం చెన్నై నగరంలో గత 47 ఏళ్లలో అత్యంత భారీ వర్షంగా నమోదైంది. 2015 నాటి కుంభవృష్టిని కూడా మించిపోయింది. అప్పటి కష్టాలు పునరావృతం కాకుండా చూసేందుకు డీఎంకే ప్రభుత్వం నగరంలో రూ.4 వేల కోట్లతో నిర్మించిన వరద కాల్వలు పూర్తిగా వాడకంలోకి రాకపోవడంతో ఈసారీ ముంపు సమస్య తలెత్తింది. మంగళవారం నాటికి 10 సెం.మీ. వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement