కుప్పకూలిన సమాచార వ్యవస్థ
విశాఖపట్నం:హుదూద్ తుపాను సృష్టించిన ప్రళయం విశాఖలోని వాతావరణ కేంద్రానికీ ఆటంకం కలిగించింది. సిబ్బంది విధులు నిర్వహించలేని పరిస్థితిని కల్పించింది. ఆదివారం హుదూద్ తుపాను తీరం దాటిన కొద్దిసేపటికే ఇక్కడి సమాచార వ్యవస్థ కుప్పకూలింది. కైలాసగిరిపై ఉన్న రాడార్ వ్యవస్థకూ ఆ సెగ తాకింది. తుపాను అనంతరం వచ్చిన వర్షం, గాలుల కారణంగా అప్పటికే రాడార్ కార్యాలయంలో విధులు నిర్వహించిన సిబ్బంది బయటకు రాలేకపోయారు. కార్యాలయం వద్ద భారీగా నీరు చేరింది. చెట్లు కూలిపోయాయి. అద్దాలు పగిలిపోయాయి. ఫలితం గా రాడార్ సాయంతో గ్రాఫ్, మ్యాప్‌ల ద్వారా వాతావరణ సమాచారాన్ని సేకరించాల్సిన అధికారులు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం సాయంత్రం వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉంది.
మరోవైపు ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం సమీపంలో ఉన్న వాతావరణ శాఖ కార్యాలయం వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అక్కడ ఏర్పాటు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ కేబుల్ వ్యవస్థ నిలిచిపోవడంతో తుపాను అనంతరం వాతావరణంలో కలిగే మార్పుల్ని అధికారులు చెప్పలేకపోతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇన్‌వర్టెర్ ద్వారా మాత్రమే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా కీలక సమాచారాన్ని తెలియజేయలేకపోతున్నారు. ఇదే విషయాన్ని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులకు వాతావరణశాఖ అధికారులు విజ్ఞప్తి చేసినా సమీపంలో ఉన్న కేబులింగ్ వ్యవస్థ పనిచేయడం లేదని, మరో 24 గంటలపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని తేల్చి చెప్పినట్టు తెలిసింది. ట్రాన్స్‌మిషన్ పనిచేస్తున్నా ఫలితాలు రావడం లేదని కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు.
నేడూ వర్షాలు!: హుదూద్ తుపాను ప్రభావం మంగళవారం కూడా కొనాసాగే అవకాశం ఉందని, ఫలితంగా తేలికపాటి వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఈదురుగాలులు కూడా వీచే అవకాశముంటుందన్నారు.