
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : భాగ్యనగరంలో ఏటా వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతుండటం, ఒక్కోసారి ప్రమాదవశాత్తూ మ్యాన్‌హోల్స్ లేదా నాలాల్లో పడి పలువురు దుర్మరణం పాలవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ సమస్యకు వినూత్న పరిష్కారం కనుగొనేందుకు ఐఐటీ హైదరాబాద్ ముందుకొచ్చింది.
ప్రజలపై వరద ప్రభావాన్ని వీలైనంత తగ్గించేందుకు, నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం వివరాలను ముందుగానే కచ్చితత్వంతో అంచనా వేసేందుకు వీలుగా పట్టణ వరద సమాచార వ్యవస్థ (అర్బన్ ఫ్లడ్ ఇన్ఫ్‌ర్మేషన్ సిస్టం–యూఎఫ్‌ఐఎస్)ను అభివృద్ధి చేస్తోంది. తద్వారా నగరవాసులను ముందే అప్రమత్తం చేయడంతోపాటు వరద సన్నద్ధత చర్యల్లో వివిధ ప్రభుత్వ విభాగాలకు తోడ్పాటు అందించనుంది. ఐఐటీహెచ్ సివిల్ ఇంజనీరింగ్, క్‌లైమేట్ చేంజ్ విభాగానికి చెందిన అసోసియేట్ ఫ్రొఫెసర్ డాక్టర్ రేగొండ సతీష్‌కుమార్ నేతృత్వంలోని పరిశోధన బృందం ఈ దిశగా కసరత్తు ప్రారంభించింది.
విశ్లేషించి.. అంచనా వేసి..
ఇందుకోసం జీహెచ్‌ఎంసీలోని విపత్తుల నిర్వహణ విభాగంతోపాటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (హైదరాబాద్), తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం తదితర సంస్థలతో ఐఐటీ హైదరాబాద్ పరిశోధన బృందం సమన్వయం చేసుకోనుంది. ఆయా సంస్థలు అందించే వాతావరణ గణాంకాల ఆధారంగా నగరంలో ఎక్కడెక్కడ ఎంత మేర వర్షం కురిసే అవకాశం ఉందో విశ్లేషించనుంది. లోతట్టు ప్రాంతాలు, వరద వ్యాప్తిని సిములేషన్ మోడలింగ్ టెక్నిక్‌ల సాయంతో కచ్చితత్వంతో అంచనా వేయనుంది.
అలాగే స్నాప్‌ఫ్లడ్ టీఎం అనే సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫాం ద్వారా నగరవాసుల నుంచి ఎప్పటికప్పుడు రియల్‌టైంలో వరద వివరాలను సేకరించాలని ఐఐటీ హైదరాబాద్ ప్రణాళికలు రచిస్తోంది. దీనికి అదనంగా ఫ్లడ్ హాట్‌స్పాట్లను గుర్తించేందుకు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సంస్థల సహకారం సైతం తీసుకోనుంది. రెయిన్‌ఫాల్–రన్‌ఆఫ్ అనాలసిస్ మోడలింగ్ అండ్ ఫోర్‌కాస్టింగ్ టూల్స్ (రాఫ్ట్) పేరుతో ఈ పరిశోధన బృందం పనిచేయనుంది.
నగరాలకు ఎంతో ఉపయోగం
అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టం అనేది ఒక్క హైదరాబాద్ నగరానికే కాకుండా దేశంలోని ఇతర వరద పీడిత నగరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి తెలిపారు. తాము చేపట్టే పరిశోధనలు నిత్యం సమాజంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతాయన్నారు. ప్రొఫెసర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ భారీ వర్షాలతో వచ్చే వరదల ప్రభావాన్ని తగ్గించేందుకు అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు.
ఇవీ ప్రయోజనాలు..
♦ అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా వరద ముంచెత్తే ప్రాంతాలను ముందే గుర్తించొచ్చు. తద్వారా ఆ ప్రాంతాలవైపు ప్రజలు వెళ్లకుండా అప్రమత్తం చేయొచ్చు.
♦ వరద నీరు ఎటువైపు పారుతోంది.. ఏయే ప్రాంతాల్లో ఎంత మేర నిలిచి ఉంది... వరద హాట్‌స్పాట్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయి వంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకొనేందుకు వీలు కలుగుతుంది.