హైడ్రా.. ఫ్లడ్‌ స్టడీ! | Ranganath Visits of the hinterland in Hyderabad | Sakshi
Sakshi News home page

హైడ్రా.. ఫ్లడ్‌ స్టడీ!

Published Mon, Sep 2 2024 5:14 AM | Last Updated on Mon, Sep 2 2024 5:14 AM

Ranganath Visits of the hinterland in Hyderabad

హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాల పరిశీలన

వరద ప్రాంతాలు, అడ్డంకులు క్షేత్రస్థాయిలో గుర్తింపు 

స్వయంగా రంగంలోకి దిగిన కమిషనర్‌ రంగనాథ్‌ 

డీఆర్‌ఎఫ్‌ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూనే కబ్జాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలో శని, ఆదివారాల్లో కురిసిన భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాలను హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) పరిశీలించింది. వరద ప్రభావిత ప్రాంతాలు, అక్కడి పరిస్థితులు, అడ్డంకులను క్షేత్రస్థాయిలో గుర్తించింది. చెరువులు, నాలాల కబ్జా వల్ల కలిగే ఇబ్బందులను ఆయా ప్రాంతాల్లో నివసించే వారికి వివరించే ప్రయత్నం చేసింది. 

హైడ్రా ఏర్పడ్డాక తొలి ముసురు... 
జీహెచ్‌ఎంసీలో అంతర్భాగంగా ఉన్న డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (డీఆర్‌ఎఫ్‌)ను వేరు చేయడంతోపాటు చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వం హైడ్రాకు రూపమిచ్చింది. ఈ మేరకు జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాతి రోజే హైడ్రా కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ బాధ్యతలు స్వీకరించారు. వెంటనే చెరువుల ఆక్రమణలపై దృష్టిపెట్టి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాల కూల్చివేతల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 

అయితే గత 40 రోజుల్లో నగరంలో పలుమార్లు వర్షం కురిసినా శని, ఆదివారాల మాదిరిగా ముసురుపట్టి వివిధ ప్రాంతాలు మునకేసే పరిస్థితి కనిపించలేదు. ఈ రెండు రోజుల వర్షాలతో నగరంలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించడంతోపాటు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి వరద ప్రవేశించింది. రోడ్లపై భారీగా వర్షపునీరు నిలిచిపోవడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. 

షేక్‌పేట, టోలిచౌకి, బేగంపేటలలో పర్యటిస్తూ. 
ఈ పరిణామాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ రంగంలోకి దిగారు. శని, ఆదివారాల్లో అనేక ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. షేక్‌పేట, టోలిచౌకి, బేగంపేట తదితర ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. నీళ్లు నిండిన రహదారులు, కాలనీల్లో తిరుగుతూ ఓపక్క డీఆర్‌ఎఫ్‌ సహాయ చర్యలను పర్యవేక్షిస్తూనే మరోపక్క ఆ ముంపునకు కారణాలను వారికి వివరించారు. చెరువులు, నాలాల కబ్జాల వల్లే ఈ విపత్కర పరిస్థితులు వస్తున్నాయని, దీని ప్రభావం కబ్జా చేసిన వారి కంటే ఎక్కువగా సామాన్యులపై ఉంటోందని చెప్పారు. ఎవరికి వారు బాధ్యతగా మెలిగేలా, కబ్జాలు, ఆక్రమణలపై వారు ఫిర్యాదు చేసేలా వారిని ప్రోత్సహించారు. 

ఆ వాదనకు తెరదించేలా... 
నగరంలో గతంలో వర్షాలు కురిసిన సందర్భంలోనూ రంగనాథ్‌ క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. అయితే అప్పట్లో జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం (ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) డైరెక్టర్‌గా వరద సహాయక చర్యలను పర్యవేక్షించారు. అందులో భాగంగా ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లను కూడా ప్రయోగించారు. 

తాజాగా ఆయన హైడ్రా పగ్గాలు చేపట్టగా ఓ వర్గానికి చెందిన వారు ఆ సంస్థ చర్యలపై దుష్ఫ్రచారం ప్రారంభించారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్ల పరిధిలో నిర్మాణాలు ఉన్నా ఇబ్బందుల్లేవని... కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వం హైడ్రాను ప్రయోగిస్తోందని ఆరోపించారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆయన శని, ఆదివారాల్లో క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా ఆ వర్గాల వాదన నిజం కాదని నిరూపించే ప్రయత్నం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement