సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో.. నదులు, చెరువుల్లోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌కు వరద నీరు పోటెత్తుతోంది. నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది.
హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం కారణంగా బంజారా హిల్స్, పికెట్, కూకట్‌పల్లి ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు హుస్సేన్ సాగర్‌లోకి చేరుతోంది. దీంతో, సాగర్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో తూముల ద్వారా వరద నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్‌లోని నీటిమట్టం 513.70 మీటర్‌లకు చేరుకుంది, అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ 515 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ ఇన్‌ఫ్లో 10270 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 9622 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
మరోవైపు.. ఎడతెరపి లేని వర్షాలతో జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. మూసీ నదికి వరద పోటెత్తింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసారంబాగ్ బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ, అందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.
ఈ సందర్బంగా జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి. నగరంలో వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలి. ఏదైనా సహాయం కావాలంటే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 040-21111111 ను సంప్రదించాలి. మ్యానువల్ ఎమర్జెన్సీ బృందాలు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలి. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ అందరూ అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment