Information system
-
వరద రాకముందే పసిగట్టొచ్చు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : భాగ్యనగరంలో ఏటా వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతుండటం, ఒక్కోసారి ప్రమాదవశాత్తూ మ్యాన్‌హోల్స్ లేదా నాలాల్లో పడి పలువురు దుర్మరణం పాలవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ సమస్యకు వినూత్న పరిష్కారం కనుగొనేందుకు ఐఐటీ హైదరాబాద్ ముందుకొచ్చింది. ప్రజలపై వరద ప్రభావాన్ని వీలైనంత తగ్గించేందుకు, నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం వివరాలను ముందుగానే కచ్చితత్వంతో అంచనా వేసేందుకు వీలుగా పట్టణ వరద సమాచార వ్యవస్థ (అర్బన్ ఫ్లడ్ ఇన్ఫ్ర్మేషన్ సిస్టం–యూఎఫ్ఐఎస్)ను అభివృద్ధి చేస్తోంది. తద్వారా నగరవాసులను ముందే అప్రమత్తం చేయడంతోపాటు వరద సన్నద్ధత చర్యల్లో వివిధ ప్రభుత్వ విభాగాలకు తోడ్పాటు అందించనుంది. ఐఐటీహెచ్ సివిల్ ఇంజనీరింగ్, క్లైమేట్ చేంజ్ విభాగానికి చెందిన అసోసియేట్ ఫ్రొఫెసర్ డాక్టర్ రేగొండ సతీష్‌కుమార్ నేతృత్వంలోని పరిశోధన బృందం ఈ దిశగా కసరత్తు ప్రారంభించింది. విశ్లేషించి.. అంచనా వేసి.. ఇందుకోసం జీహెచ్ఎంసీలోని విపత్తుల నిర్వహణ విభాగంతోపాటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (హైదరాబాద్), తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం తదితర సంస్థలతో ఐఐటీ హైదరాబాద్ పరిశోధన బృందం సమన్వయం చేసుకోనుంది. ఆయా సంస్థలు అందించే వాతావరణ గణాంకాల ఆధారంగా నగరంలో ఎక్కడెక్కడ ఎంత మేర వర్షం కురిసే అవకాశం ఉందో విశ్లేషించనుంది. లోతట్టు ప్రాంతాలు, వరద వ్యాప్తిని సిములేషన్ మోడలింగ్ టెక్నిక్‌ల సాయంతో కచ్చితత్వంతో అంచనా వేయనుంది. అలాగే స్నాప్ఫ్లడ్ టీఎం అనే సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫాం ద్వారా నగరవాసుల నుంచి ఎప్పటికప్పుడు రియల్‌టైంలో వరద వివరాలను సేకరించాలని ఐఐటీ హైదరాబాద్ ప్రణాళికలు రచిస్తోంది. దీనికి అదనంగా ఫ్లడ్ హాట్స్పాట్లను గుర్తించేందుకు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సంస్థల సహకారం సైతం తీసుకోనుంది. రెయిన్‌ఫాల్–రన్ఆఫ్ అనాలసిస్ మోడలింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ టూల్స్ (రాఫ్ట్) పేరుతో ఈ పరిశోధన బృందం పనిచేయనుంది. నగరాలకు ఎంతో ఉపయోగం అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టం అనేది ఒక్క హైదరాబాద్ నగరానికే కాకుండా దేశంలోని ఇతర వరద పీడిత నగరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి తెలిపారు. తాము చేపట్టే పరిశోధనలు నిత్యం సమాజంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతాయన్నారు. ప్రొఫెసర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ భారీ వర్షాలతో వచ్చే వరదల ప్రభావాన్ని తగ్గించేందుకు అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ఇవీ ప్రయోజనాలు.. ♦ అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా వరద ముంచెత్తే ప్రాంతాలను ముందే గుర్తించొచ్చు. తద్వారా ఆ ప్రాంతాలవైపు ప్రజలు వెళ్లకుండా అప్రమత్తం చేయొచ్చు. ♦ వరద నీరు ఎటువైపు పారుతోంది.. ఏయే ప్రాంతాల్లో ఎంత మేర నిలిచి ఉంది... వరద హాట్స్పాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి వంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకొనేందుకు వీలు కలుగుతుంది. -
సూర్యుడిపై అధ్యయనానికి ఆదిత్య–ఎల్1
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సౌరగోళంపై అధ్యయనం కోసం ఇస్రో పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా 1,475 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ఆగస్ట్ మూడో వారంలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. సౌర తుపాను సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీంతోపాటు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్‌లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించేందుకు ఈ ప్రయోగాన్ని నిర్వహించబోతున్నారు. బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్లో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఆస్ట్రోశాట్‌తో పాటు చంద్రయాన్–1, చంద్రయాన్–2 మిషన్లలో పాల్గొన్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.శంకర సుబ్రమణియన్ ఆధ్వర్యంలో ఆదిత్య–ఎల్1 ఉపగ్రహానికి రూపకల్పన చేశారు. 1,475 కేజీల బరువు కలిగిన ఆదిత్య–ఎల్1లో ఉండే ఆరు పేలోడ్స్ బరువు 244 కేజీలే. మిగిలిన 1,231 కేజీలు ద్రవ ఇంధనంతో నింపి ఉంటాయి. ఉపగ్రహాన్ని సూర్యునివైపు తీసుకెళ్లేందుకు ద్రవ ఇంధనం ఎక్కువ అవసరం. మొదట ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన తర్వాత.. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజ్ బిందువు–1లోకి చేరవేయడానికి 177 రోజులు పడుతుంది. అక్కడి నుంచి ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేకుండా సూర్యుడిని నిరంతరం పరిశోధించేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు. ఆదిత్య–ఎల్1లో యాస్పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్ అనే ఆరు పేలోడ్స్ అమర్చి పంపిస్తున్నారు. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్ వరకు.. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్ డిగ్రీల వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి గల కారణం అంతు చిక్కడం లేదు. ఈ అంశంపై కూడా ఆదిత్య–ఎల్1 పరిశోధనలు చేయనుంది. సూర్యుడికి ఉన్న మరో పేరే ఆదిత్య. ఈ ఉపగ్రహాన్ని ‘లాగ్రేంజ్’ అనే బిందువు వద్ద ప్రవేశపెడుతున్నందున ఎల్ అని.. సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి ఉపగ్రహమైనందున ‘1’ అని పెట్టారు. దీని పూర్తి పేరు ఆదిత్య–ఎల్1 అని ఖరారు చేశారు. -
మంచి అడుగే... మార్పులు అవసరం
టెలికాం నియంత్రణ వ్యవస్థల్లో సంస్కరణలు, లోపాల సవరణలు లక్ష్యంగా టెలికాం డిపార్ట్మెంట్ ‘ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్, 2022’ ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. టెలికమ్యూనికేషన్ రంగానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను ఆధునికీకరించే దిశగా వేసిన మేలి అడుగుగా దీన్ని అభివర్ణించవచ్చు. అయితే ఈ రంగం మిగిలిన ఏ రంగంతోనూ సంబంధం లేనట్టుగా ఈ ముసాయిదా బిల్లు సిద్ధమైనట్లు అనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం, ప్రాచుర్యం పొందుతున్న కృత్రిమ మేధ, బ్లాక్‌చెయిన్ వంటి టెక్నాలజీల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే దాని ప్రభావం టెలికమ్యూనికేషన్స్ రంగంపైనా పడే ప్రమాదం ఉంది. ముసాయిదా బిల్లులో ఈ అంశాల ప్రస్తావనే లేకపోవడం మనం గమనించాలి! టెలికమ్యూనికేషన్ రంగంలో ఆధునికమైన, భవిష్యత్తు అవసరాలు తీర్చే సామర్థ్యం ఉన్న చట్టపరమైన నిర్మాణాత్మక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వశాఖ గత నెలలో ‘ఇండియన్ టెలికమ్యూనికేషన్ ముసాయిదా బిల్లు–2022’ ను రూపొందించి ఇప్పటికే ప్రజా సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. అందుకోసం ప్రతిపాదిత బిల్లు సారాంశాన్ని దేశ పౌరులకు అందుబాటులో ఉంచింది. దీనివల్ల బిల్లులోని లోతుపాతులను పరిశీలించడానికీ, అభిప్రాయాలను వ్యక్తం చేయడానికీ నిపుణులకు, సాధారణ వినియోగదారులకు సైతం అవకాశం లభించినట్లయింది. భారతదేశంలో సైబర్ భద్రతపై పూర్తిస్థాయి ప్రత్యేక చట్టం లేదు. అందువల్ల, టెలికాం రంగంలో సైబర్ భద్రత తాలూకు సమస్యలను పరిష్కరించడం మరింత అవసరం. ఈ నేపథ్యంలో టెలికాం రంగంలోనూ ఈ సైబర్ భద్రతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. ఇంటర్నెట్, సైబర్ స్పేస్‌కు టెలికమ్యూనికేషన్ రంగం కీలకమన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ‘ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్, 2022’ ముసాయిదా బిల్లులో ఈ అంశాల ప్రస్తావనే లేకపోవడాన్ని మొదటగా మనం గమనించాలి! టెలికమ్యూనికేషన్ రంగం మిగిలిన ఏ రంగంతోనూ సంబంధం లేనట్టుగా ఈ ముసాయిదా బిల్లు సిద్ధమైనట్లు అనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం, ప్రాచుర్యం రెండూ పొందుతున్న కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆధారితాలు, బ్లాక్‌చెయిన్ వంటి టెక్నాలజీల విషయంలోనూ నిర్లక్ష్యం వహిస్తే దాని ప్రభావం టెలికమ్యూనికేషన్స్ రంగంపైనా పడే ప్రమాదం ఉంది. భారతదేశం ఒక అనుసంధానిత టెలికాం పర్యావరణ వ్యవస్థ వైపు కదులుతున్నప్పుడు, కృత్రిమ మేధపై ఆధారపడటం అన్నది పెరుగుతున్నప్పుడు ప్రతిపాదిత చట్టం కొత్త సాంకేతికతల ఆగమనానికి సంబంధించినదిగా ఉండేలా విస్తృతమైన భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి కదా. కృత్రిమ మేధ, బ్లాక్‌చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి టెక్నాలజీలు టెలికమ్యూనికేషన్స్ రంగంపై చూపే ప్రభావాలు, కొత్త టెక్నాలజీల అవసరాన్ని గుర్తించేందుకు తగిన అంశాలు ఈ ముసాయిదా బిల్లులో లేవన్నది స్పష్టం. దేశంలో టెలికాం రంగం ఏకీకృతమయ్యే దిశగా వెళుతున్న, కృత్రిమ మేధపై ఆధారపడటమూ పెరిగిపోయిన ఈ దశలో టెలికామ్ ముసాయిదా బిల్లు దార్శినికంగానూ, విశాల దృక్పథంతోనూ ఉండి ఉంటే ఈ కొత్త టెక్నాలజీల వ్యాప్తికి మరింత ఉపయోగకరంగా ఉండేది. సమాచార వ్యవస్థకు కీలకమైన అంశమైన టెలికమ్యూనికేషన్స్ భారతీయ సైబర్ సార్వభౌమత్వంలోనూ ఎంతో ముఖ్యమైంది. అయితే ఈ రంగానికి తగినంత ప్రాధాన్యం లభించడం లేదు. టెలికమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌లపై తరచూ దాడులు జరుగుతున్నాయి. అయినా మన సైబర్ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు తగిన న్యాయపరమైన సౌకర్యాలు లేవు. భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే దిశగా ముందుకు వెళ్లాలంటే ఈ ముసాయిదా బిల్లులో నిర్దిష్ట ప్రమాణాలను ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం. ముసాయిదా బిల్లులో టెలికమ్యూనికేషన్స్కి సంబంధించిన మౌలిక సదుపాయాల సైబర్ సెక్యూరిటీకి ఎలాంటి ఏర్పాట్లూ లేవు. వీటిని కాపాడుకునేందుకు ఏ రకమైన చర్యలనూ ఈ ముసాయిదా చట్టంలో నిర్దేశించలేదు. సైబర్ సెక్యూరిటీ చట్టం లేనే లేని నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడుతోంది. సైబర్ సెక్యూరిటీకి భంగం కలిగితే, లేదా నెట్‌వర్క్‌లోకి చొరబాట్లు జరిగితే ఆయా సేవలందించే వారి బాధ్యత ఏమిటన్నది కూడా ఈ చట్టంలో స్పష్టం చేయలేదు. జాతీయ భద్రత, అందులో టెలికమ్యూనికేషన్స్ పాత్రలను పరిగణలోకి తీసుకున్నా ఈ అంశాలకు ప్రాధాన్యం లభించి ఉండాల్సింది. దీనినే ఇంకోలా చెప్పాలంటే... టెలికమ్యూనికేషన్, టెలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్, సేవల భద్రత, సంరక్షణల కోసం ఎటువంటి పరిమితులనూ నిర్దేశించలేదు. సైబర్ భద్రత ఉల్లంఘనల సందర్భంలో సర్వీస్ ప్రొవైడర్ల బాధ్యత ఏ మేరకు ఉంటుందో కూడా స్పష్టం చేయలేదు. జాతీయ భద్రతతో టెలికమ్యూనికేషన్ల సంబంధం అత్యంత కీలకమైనది. అయితే ఈ ముసాయిదా జాతీయ భద్రతను ఎలా రక్షించవచ్చనే దానిపై అరకొరగా మాత్రమే వివరణలు కనిపిస్తున్నాయి! ప్రతిపాదిత టెలికమ్యూనికేషన్స్ ముసాయిదాకు ప్రత్యేక హోదా ఇవ్వడం మరిన్ని చిక్కులకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ హోదా కారణంగా ఇతర చట్టాలన్నింటి కంటే ఇది ఉన్నతమైందిగా మారుతుంది. ఈ క్రమంలోనే ఈ బిల్లు 2000లో తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్తోనూ వైరుద్ధ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి, ఈ ముసాయిదా బిల్లు కాస్తా చట్టంగా మారే లోపు ఈ రకమైన వైరుద్ధ్యాన్ని నివారించాల్సిన అవసరముంది. అంతేకాదు... ఈ ముసాయిదా చట్టంలో డ్యూ డిలిజెన్స్‌కు సంబంధించిన అంశాలను సక్రమంగా నిర్వచించనూ లేదు. డూ నాట్ డిస్టర్బ్ రిజిస్టర్ నిర్వహణనే ఉదాహరణగా తీసుకుంటే ఇందులో వినియోదారుల రక్షణకు తగిన ఏర్పాట్లు లేవు. రిజిస్టర్‌ను సమర్థంగా అమలు చేసే విషయంలోనూ ప్రమాణాలు స్పష్టంగా లేవు. గతంలో ఉన్న ‘డూ నాట్ కాల్’ రిజిస్ట్రీ విఫలమైన నేపథ్యంలో తాజా చట్టంలోని లోటుపాట్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఏర్పడుతోంది. టెలికాం ఎకోసిస్టమ్లోనూ వినియోగదారుల రక్షణకు సంబంధించిన అంశాలపై పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించదు. టెలికాం సేవలు పొందే క్రమంలో తమ గుర్తింపును రుజువు చేసుకునేందుకు తప్పుడు సమాచారం ఇవ్వకపోవడం వినియోగదారుల బాధ్యతేనని ఈ ముసాయిదాలో పేర్కొన్నారు. అలాగైతే ఐటీ చట్టం, ఐపీసీల కింద దీనిని నేరంగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది. అలాగే బిల్లును రూపొందించేటప్పుడు టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీ లక్ష్యాలను ఎలా చేరుకోవడం అనేదానిపై మరికొంత స్పష్టంగా ఉండాల్సింది. ప్రతిపాదిత బిల్లులో పేర్కొన్న నేరాలలో ఎక్కువ భాగం బెయిలు ఇవ్వదగినవే కనుక... కేసును వెనక్కు తీసుకునే నిర్ణయానుకూలతకు కాకుండా, నేర నిరోధానికి ప్రాధాన్యం ఇవ్వవలసింది. ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలూ టెలికమ్యూనికేషన్ రంగం మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోకుండా చూసేందుకు ఏం చేయాలన్నది కూడా ఈ ముసాయిదా బిల్లులో కనిపించడం లేదు. బిల్లులోని పలు నేరాలకు బెయిల్ లభిస్తుంది. అయితే ప్రతి నేరానికీ జరిమానాలు విధించడం ద్వారా ఈ చట్టం నేరాలు జరక్కుండా చూసే దిశగా కాకుండా జరిమానాలు వసూలు చేసే దిశగా ఉందని అనిపిస్తుంది. సెక్షన్ 38లో సివిల్ లయబిలిటీ ప్రస్తావన ఉన్నా... కేంద్రం ఈ విషయంలో ఏం చేయాలన్న విషయంలో స్పష్టత కరవైంది. ముసాయిదా బిల్లులో ఈ అంశాలకూ చోటు దక్కాలి. అంతేకాకుండా... పబ్లిక్, ప్రైవేట్ రంగాల్లోని భాగస్వాములందరి ఆందోళనలను గుర్తిస్తూ తగిన మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా మాత్రమే ఈ కొత్త చట్టం సమర్థంగా మారగలదు. అప్పీళ్లకు సంబంధించి సెక్షన్ –10లో వివరాలు ఉన్నాయి. అయితే అప్పీలేట్ అథారిటీకి సంబంధించిన వివరాలు మాత్రం స్పష్టం చేయలేదు. అంతేకాకుండా... తమకు జరిగిన నష్టాలకు తగిన పరిహారాన్ని కోరే ప్రాథమిక హక్కును కూడా వినియోగదారులకు లేకుండా చేశారు. అంటే టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించి వినియోగదారుల రక్షణ అన్న విషయానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదన్నమాట. ఇప్పుడున్న వినియోగదారుల చట్టాలతోనూ పెద్దగా ప్రయోజనం లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. మొత్తమ్మీద చూస్తే... ఈ చట్టం సరైన దిశగా వేసిన ముందడుగనే చెప్పాలి. కానీ కొన్ని మార్పులు చేర్పులు అవసరమవుతాయి. తద్వారా మాత్రమే మనం సమర్థమైన చట్టాన్ని చేసే అవకాశం ఏర్పడుతుంది. పవన్ దుగ్గల్ వ్యాసకర్త సైబర్ న్యాయ నిపుణులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
చుక్ చుక్ రైలు వస్తోంది..యాప్‌లో చూసి ఎక్కండి!
సాక్షి, హైదరాబాద్: రైళ్ల రాకపోకలపై ప్రత్యక్ష సమాచారం అందుబాటులోకి రానుంది. ఏ రైలు ఎక్కడుందో క్షణాల్లో తెలిసిపోనుంది. రైళ్ల సమయ పాలనపైన ప్రయాణికులకు కచ్చిత మైన సమాచారం లభించనుంది. ఇప్పటివరకు కంట్రోల్ కేంద్రాల ద్వా రా మాత్రమే లభించే రైళ్ల రాకపోకల వివరాలు ఇక నుంచి ఆన్లైన్లో ప్రత్యక్షం కానున్నాయి. ప్రతి 30 సెకన్లకోసారి రైలు కదలికలు నిక్షిప్త మవుతాయి. ప్రయాణికులు మొబైల్ ఫోన్ల ద్వారా కూడా రైళ్ల రాకపోకల ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసు కోవచ్చు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక మొబైల్ యాప్ త్వరలో అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలపై ప్రత్యక్ష సమాచారం కోసం చేపట్టిన ‘రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్’(ఆర్టీఐఎస్) ప్రాజెక్టు దక్షిణమధ్య రైల్వేలో తుది దశకు చేరుకుంది. శాటిలైట్స్ కమ్యూనికేషన్స్ ద్వారా ఈ వ్యవస్థను బలోపేతం చేస్తారు. ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా రైళ్ల రాక పోకల ప్రత్యక్ష సమాచారానికి అంతరాయం లేకుండా శాటిలైట్ కమ్యూనికేషన్స్ దోహదం చేస్తుంది. ఈ ఆర్టీఐఎస్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వేలోని 334 డీజిల్ లొకోమోటివ్లు, 186 ఎలక్ట్రికల్ లొకోమోటివ్ ఇంజన్లను ఆర్టీఐఎస్ డివైజెస్‌తో అనుసంధానం చేశారు. వచ్చే జనవరి నాటికి అన్ని ఎలక్ట్రిక్, డీజిల్ ఇంజన్లను ఈ ఆర్టీఐఎస్తో అనుసంధానం చేసి ప్రయాణికులకు ప్రత్యక్ష సమాచారాన్ని అందజేసే దిశగా దక్షిణ మధ్య రైల్వే సన్నద్ధమవుతోంది. దీంతో ప్రస్తుతం ‘హైలైట్స్’(హైదరాబాద్ లైవ్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్) మొబైల్ యాప్ ద్వారా 121 ఎంఎంటీఎస్ సర్వీసుల ప్రత్యక్ష సమాచారాన్ని అందజేస్తున్నట్లుగానే ఆర్టీఐఎస్ ద్వారా దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని ఎక్స్‌ప్రెస్/మెయిల్ సర్వీసుల ప్రత్యక్ష సమాచారం త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఎలా పని చేస్తుంది.. ఇప్పటివరకు రైళ్ల సమాచారానికి కంట్రోల్ కేంద్రాలే ఆధారం. రైలు బయలుదేరిన సమాచారాన్ని ఒక కంట్రోల్ రూమ్ నుంచి మరో కంట్రోల్ రూమ్‌కు చేరవేయడం ద్వారా మాత్రమే రైల్వేస్టేషన్లలో ఏ రైలు ఏ సమయానికి చేరుకుంటుంది.. అక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతుంది అనే సమాచారాన్ని అనౌన్స్మెంట్ చేసేవారు. కానీ ఆర్టీఐఎస్లో భాగంగా అన్ని లోకో ఇంజన్లలో జీపీఎస్ డివైజ్‌లను ఏర్పాటు చేస్తారు. లోకో ఇంజన్‌కు బయటివైపు రూఫ్టాప్పైన ఏర్పాటు చేసే డివైజ్‌ను రైల్ ఎంఎస్ఎస్ టెర్మినల్ (ఆర్ఎంటీ) మొబైల్ శాటిలైట్ సర్వీస్ (ఎంఎస్ఎస్)తో, మరో రెండు 4జీ మొబైల్ నెట్వర్క్స్తో అనుసంధానం చేస్తారు. రైలు ఇంజన్ లోపలి భాగంలో లోకో పైలెట్‌కు అందుబాటులో ఇండియన్ రైల్ నావిగేటర్ (ఐఆర్ఎన్) అనే మరో డివైజ్‌ను ఏర్పాటు చేస్తారు. రైలు బయలుదేరడానికి ముందు లోకోపైలెట్ తన వద్ద ఉన్న జీపీఎస్ డీవైజ్లో ట్రైన్ నెంబర్, ఐడీ, బయలుదేరే సమయం, తదితర వివరాలను నమోదు చేసి ‘స్టాట్ జర్నీ’బటన్ నొక్కుతాడు. దీంతో ప్రతి 30 సెకన్లకోసారి రైలు కదలికలు నమోదవుతాయి. ఈ సమాచారం ఎప్పటికప్పుడు ఢిల్లీల్లోని సెంట్రల్ లొకేషన్ సర్వర్ (సీఆర్ఐఎస్)కు చేరుతుంది. సెంట్రల్ సర్వర్‌కు అందిన సమాచారం ఆటోమేటిక్‌గా కంట్రోల్ ఆఫీస్ అప్లికేషన్‌కు వెళ్లిపోతుంది. ఇక్కడ్నుంచి నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (ఎన్టీఈఎస్) ద్వారా ఆన్లైన్లో ప్రత్యక్షమవుతుంది. రైలు బయలుదేరినప్పటి నుంచి ఈ మొత్తం వ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది. ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా మొబైల్ యాప్ ద్వారా ఈ ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసుకోవచ్చు. రైళ్ల నిర్వహణలో ఈ సమాచారం ఎంతో కీలకమైనది. ట్రైన్ నడిపే లోకోపైలెట్ ఎలాంటి అత్యవసర సమాచారాన్ని అయినా నేరుగా సెంట్రల్ సర్వర్‌కు చేరవేయవచ్చు. ప్రతికూల వాతావరణం, వరదలు, ముంపు పరిస్థితులు, సిగ్నలింగ్ వ్యవస్థ, తదితర అన్ని అంశాలపైన ప్రత్యక్ష సమాచారం లభిస్తుంది. సమయం సద్వినియోగం.. ‘ప్రతిరోజు సుమారు 10 లక్షల మంది దక్షిణ మధ్య రైల్వే సేవలను వినియోగించుకుంటున్నారు. వీరంతా ఇప్పటివరకు తాము బయలుదేరాల్సిన ట్రైన్ కోసం రైల్వే నుంచి లభించే సమాచారం పైనే ఆధారపడాల్సి వచ్చేది. ఆలస్యంగా నడిచే రైళ్ల వివరాలు, ఆలస్యానికి కారణాలు వంటి సమాచారం కూడా అందుబాటులో ఉండదు. ఇక నుంచి ప్రత్యక్షంగా ఈ సమాచారమంతా లభించడం వల్ల ప్రయాణికులు తమ సమయాన్ని మరింత సమర్థంగా వినియోగించుకొనేందుకు అవకాశముంటుంది. అలాగే రైళ్ల నిర్వహణలో మరింత పారదర్శకతకు అవకాశం లభిస్తుంది.’ –దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ దక్షిణ మధ్య రైల్వేలో డీజిల్ లోకోమోటివ్స్ - 582 ఇప్పటివరకు అనుసంధానమైనవి - 334 ఇంకా అనుసంధానం కావల్సినవి - 248 అనుసంధానం కావల్సిన లోకోమోటివ్స్ - 80 లాలాగూడ, విజయవాడ వర్క్ షాపుల్లో ఉన్న మొత్తం ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్- 266 ఇప్పటివరకు అనుసంధానమైనవి - 186 -
కొత్త డౌటు గురూ
వాట్సప్‌లో హెల్త్ అలర్ట్ చూస్తే బెంగ.న్యూస్ పేపర్లో హెల్త్ కాలమ్ కనపడితే కంగారు.టీవీలో డాక్టర్ ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపు ఆ డాక్టర్ చెబుతున్నది తన గురించేనా అని ఆందోళన.ఆరోగ్యం గురించి చైతన్యవంతం కావడం వేరు.ఆరోగ్యం గురించిన సమాచారంలో మునిగి దానినో పెనుభూతంగా మార్చుకోవడం వేరు.ప్రతిదీ చదవాలనీ, ఆ చదివింది ఉందో లేదో చూసుకోవాలని అనుకోవడం పెద్దజబ్బు.దాని పేరే‡ ‘ఆర్థోరెక్సియా నర్వోజా’. సమాచార వ్యవస్థ పెరిగిపోయి హెల్త్ అవేర్నెస్ విపరీతమయ్యేసరికి ఆరోగ్యం గురించిన డౌట్లే ఒక జబ్బుగా బాధపడుతున్నవారి అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. ‘ఆర్థోరెక్సియా నర్వోజా’ను తెలుసుకునే ముందు... అదే కోవకు చెందిన ‘అనొరెక్సియా’, ‘బులీమియా’ల గురించి కొంచెం తెలుసుకోవాలి. తాము బాగా లావెక్కి ఓబేస్గా మారితే అందంగా ఉండబోమన్న భావనతో, ఏ పదార్థాన్నీ ఇష్టపడకుండా, అసలు ఒక దశలో ఆహారాన్నే పూర్తిగా అసహ్యించుకునే స్థితికి చేరే రుగ్మతే ‘అనొరెక్సియా నర్వోజా’. ఇక ‘బులీమియా’ కూడా ఇంచుమించూ ఇలాంటిదే. కాకపోతే వీళ్లు రుచి కోసం కొద్దిగా ఆహారాన్ని తిని, వెంటనే వాంతి చేసుకుంటారు. మరి ఈ ఆర్థోరెక్సియా నర్వోజా అంటే?‘అనొరెక్సియా’, ‘బులీమియా’లలో అందం ప్రధానం కాగా... ‘ఆర్థోరెక్సియా’లో ఆరోగ్యం ప్రధానమవుతుంది. అనొరెక్సియా, బులీమియా కండిషన్లకు మోడలింగ్ చేసేవారు, బాలే డాన్సర్లు, యాక్టింగ్ వంటి వృత్తుల్లో ఉన్నవారు ప్రభావితం అయ్యే అవకాశం ఎక్కువగా ఉండగా, మితిమీరిన ఆరోగ్య స్పృహ ఉన్నవారంతా ఆర్థోరెక్సియాకు లోనయ్యే అవకాశం ఉంది. ఎలా కనుగొన్నారీ కొత్త జబ్బును...? కొంతకాలం క్రితం యూనివర్సిటీ ఆఫ్ రోమ్కు చెందిన దాదాపు 400కు పైగా విద్యార్థులు ఒక ఆరోగ్య సర్వే నిర్వహించారు. అందంగా కనిపించడానికి ఆస్కారం ఉండే కొన్ని వృత్తుల్లో ఉన్నవారికి మాత్రమే ఉండాల్సిన అనొరెక్సియా, బులీమియా రుగ్మతలు తాము సర్వే జరిపిన శాంపిల్‌లోని సాధారణ వ్యక్తులలో దాదాపు 7 శాతం మందికి ఉన్నట్లు కనుగొన్నారు. ఈ రెండు వ్యాధులూ కలగలసి ఉన్న ఒక కొత్త రుగ్మతను కలిగి ఉన్నవారు కూడా తాము సర్వే నిర్వహించిన జనాభాలో ఉన్నట్లుగా గ్రహించారు. ఈ విషయాన్ని మరింత నిర్దిష్టంగా తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ రోమ్ విద్యార్థులు ఒక ప్రశ్నావళి రూపొందించారు. ఆ ప్రశ్నావళి ఆధారంగా నిర్వహించిన సర్వేలో చాలా విచిత్రమైన విషయాలు తెలిసివచ్చాయి. అప్పుడు తెలిసిన రుగ్మతకు ‘ఆర్థోరెక్సియా నర్వోజా’ అని పేరు పెట్టారు. లక్షణాలేమిటి? ఒక మోస్తరు స్థాయిలో జీవనం సాగించే అందరికీ సాధారణంగా కొన్ని ఆరోగ్య సూత్రాలు తెలిసే ఉంటాయి. ఉదాహరణకు ఉప్పు ఎక్కువగా తినకూడదు, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి, పిజ్జాలు, బర్గర్లు, ఇతర జంక్‌ఫుడ్, బేకరీ ఐటమ్స్ అన్నీ అనారోగ్య కారకాలు, బయటి పదార్థాలు తింటే గ్యాస్ట్రైటిస్, డయేరియా వంటి జబ్బులొస్తాయి... ఇలాంటివి. ఇవన్నీ ప్రాథమిక అవగాహన వల్ల ఇవి మనకు తెలిసిన సంగతులు. అయితే ఇవే సూత్రాలను మితిమీరి పాటిస్తుంటే మాత్రం ఆర్థోరెక్సియా ఉందని అనుమానించాల్సి ఉంటుంది. ఉదాహరణకు... ఉప్పు ఎక్కువగా తినకూడదనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడో ఒకసారి బాగా రుచిగా అనిపించినప్పుడు ఒక అప్పడం అదనంగా తినేస్తాం. లేదా కొత్త ఆవకాయ పెట్టిన సందర్భంలోనో లేదా అసలు ఆవకాయ పెట్టేలోపు పచ్చిమామిడితో తాత్కాలికంగా చేసుకున్న పచ్చడితో కాస్తంత ఎక్కువగా అన్నం తింటాం. ఇక అలా తిన్నప్పట్నుంచి వారిలో ఒక అపరాధ భావన మొదలవుతుంటుంది. ఆ ఉప్పు వల్ల ఆరోగ్యానికి కీడు కలుగుతుందేమో లేదా అది కిడ్నీలను దెబ్బతీస్తుందేమో అనిపిస్తుంటుంది. మాటిమాటికీ మనలో రక్తపోటు పెరిగిపోయిన భావన కలుగుతుంటుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు కనిపించే సాధారణ లక్షణాలైన తల తిరుగుతున్నట్లు, తలనొప్పిగా అనిపించవచ్చు. ఒక స్నేహితుడు అమెరికా నుంచి వస్తూ ఇచ్చిన చాక్లెట్ తిన్నారనుకుందాం. అప్పట్నుంచి ఆ చాక్లెట్ వల్ల ఇక తమకు డయాబెటిస్ వస్తుందేమో అనే ఆందోళన పెరిగిపోతుంటుంది. ఇలాంటి ఫీలింగ్స్ పెంపొందించుకున్నవారు తమకు ఎవరు చాక్లెట్, ఐస్‌క్రీమ్ లాంటివి ఆఫర్ చేసినా తిరస్కరిస్తుంటారు. ఈ కండిషన్‌ను ‘హైపర్ యాక్యురసీ’ అంటారు. ఈ హైపర్ యాక్యురసీ భావనను అధిగమించడానికి రోజూ చేయాల్సిన దాని కంటే మరింత ఎక్కువగా వ్యాయామం చేస్తూ ఉండటం, ఈ వ్యాయామం తాము తిన్న ఆహారాన్ని పూర్తిగా బర్న్ చేసిందో లేదో అంటూ ఆందోళన చెందడం, మరింత సేపు వ్యాయామాన్ని కొనసాగిస్తూ తమను తాము బాధపెట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. వ్యాయామంతో ఆనందించే స్థాయి నుంచి క్రమంగా వారు వ్యాయామంతో తమను తాము హింసించుకోవడం స్థాయికి చేరుతారు. ఆధ్యాత్మిక ఆర్థోరెక్సియా కూడా... దేవుడి ప్రసాదాన్ని మనమంతా పవిత్రంగా భావిస్తాం. ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా భక్తిభావనతో తిన్నవారు కొద్దిసేపట్లోనే దాన్ని మరచిపోతారు. ఆధ్యాత్మిక ఆర్థోరెక్సియా ఉన్నవారు ఆ ప్రసాదంలోని కొన్ని పదార్థాలతో తమ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందేమోనని అనుక్షణం ఆందోళన చెందుతుంటారు. ఉదాహరణకు ప్రసాదంలో అరటిముక్కలు, కొబ్బరిముక్కలు, చక్కెర ఉంటే ఆర్థోరెక్సియా ఉన్నవారి ఆలోచనలు ఇలా సాగుతుంటాయి. ‘అరటిపండులో చక్కెరపాళ్లు ఎక్కువ అంటారు. పైగా దాన్ని చక్కెరతో కలిపి తిన్నాం. ఇక మనలో షుగర్పాళ్లు పెరుగుతాయేమో. దాంతో నాకు డయాబెటిస్ వస్తుందేమో’ అని ఆలోచిస్తూ ఆందోళన పెంచుకుంటారు. ఇక కొన్ని ప్రసాదాల్లో బూందీలడ్డూతో పాటు అక్కడక్కడ జీడిపప్పు వచ్చి, దాన్ని నమిలారనుకుందాం. అప్పుడు ‘అయ్యో... ప్రసాదంలోని జీడిపప్పు తిన్నాను. జీడిపప్పులో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువట. ఇక ఈ లడ్డూలను నెయ్యితోనే చేసి ఉంటారు.ఇప్పుడెలా? ఒంట్లో కొవ్వు పెరిగి నాకు గుండెజబ్బులు వస్తాయేమో? రక్తనాళాల్లో కొవుపదార్థాలు చేరి, హార్ట్ ఎటాక్ వస్తుందేమో’ అంటూ ఆందోళన చెందుతుంటారు. ఈ ఆందోళన భావన ఎంతగా పెరుగుతుందంటే ఒక్కోసారి టీ, కాఫీలలో చక్కెర ఎక్కువైతే అది తమకు హాని చేస్తుందని భయపడుతూ, ఆ హానిని నివారించేందుకు ఆ చక్కరను బర్న్ చేయడానికి అనవసరంగా మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండటం, తాము క్యాజువల్‌గానే ఉన్నామనే భావనను ఎదుటివారిలో కలిగిలా నటిస్తూ... అటూ ఇటూ తిరగడం చేస్తుంటారు. మరోవైపు ఇలాంటి ఆలోచనల వల్ల ప్రసాదం వద్దనుకుంటే తాము భగవంతుడి పట్ల ద్రోహచింతనతో మెలుగుతున్నామనే ఫీలింగ్ వి పెరిగిపోయి క్రమంగా అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ)గా కూడా పరిణమించవచ్చు. తమకు తామే సామాజిక బహిష్కరణ... ఆర్థోరెక్సియా నర్వోజా తరహా ఆలోచనలు పెరుగుతున్నవారు ఒంటరిగా ఉండటం మొదలుపెడతారు. క్రమంగా తమను తాము సామాజికంగా బహిష్కరించుకుంటారు. నెలవారీ సరుకుల జాబితా నుంచి కొన్ని ఆహారపదార్థాలను తొలగించుకుంటూ పోతారు. లేదా కొన్నింటి కోసం ఆర్గానిక్ మాల్స్‌లో వెతుకుతుంటారు. అవి కొన్న తర్వాత... అవి ఆర్గానిక్ తరహాలో పండించినవేనా లేదా మామూలు వాటినే ఆ మాల్స్‌లో పెట్టి ఆర్గానిక్ అంటూ అమ్ముతున్నారా అని మళ్లీ ఆందోళన చెందుతుంటారు. అవి మంచివే కదా అంటూ వాటి నాణ్యతను గురించి షాపు యజమానులతో మితిమీరి వాకబు చేస్తుంటారు. ఏది తినమన్నా ఏదో కారణం చెప్పి వాటిని తిరస్కరిస్తుంటారు. ఇక బయట ఎక్కడైనా రెస్టారెంట్లో తినాల్సి వస్తే వారు ఎలాంటి ఆహారాలను ఎంపిక చేశారో, అవి మంచివో–కావో, బాగా వండారో–లేదో, ఎలాంటి నూనెలు ఎంపిక చేసుకున్నారో, ఆరోగ్యవంతమైనవి కాకపోవచ్చేమో అని ఆందోళన పెంచుకుంటుంటారు. ఆ తర్వాత ఇంటి వంటలోనూ చాలా పద్ధతులు పాటిస్తూ, ఎన్నో రకాల పరిమితులు విధించుకుంటూ తమను తాము బాధించుకుంటుంటారు. ఇది బాధించుకోవడం స్థాయి దాటి హింసించుకునే స్థాయికి చేరుతుంది. సొంతంగా కూడా బయటపడవచ్చు... ఆర్థోరెక్సియా నర్వోజా నుంచి బయటపడటం చాలా తేలిక. ఆరోగ్యంగా ఉండటం మంచిదే... కానీ అది తమ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకూడదంటూ తమకు తాము కౌన్సెలింగ్ చేసుకుంటూ ఉండాలి. అరుదుగా కొద్దిపాటి తీపిపదార్థాలతో, ప్రసాదం వంటి పరిమిత ఆహారాలతో ప్రమాదం జరగదని సర్దిచెప్పుకోవాలి. అనారోగ్యకరమైన ఆహారాలను కూడా దీర్ఘకాలం తీసుకుంటేనే ప్రమాదంగానీ... ఎప్పుడో ఒకసారి తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతినదని గ్రహించాలి. అయితే ఇలా తమకు తాము సర్దిచెప్పుకున్నా పరిస్థితిని అధిగమించలేకపోతే మాత్రం మానసిక నిపుణుల/ప్రొఫెషనల్స్ సలహా తీసుకోవాలి. – డా.కళ్యాణ్ చక్రవర్తి, సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, లూసిడ్ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్ తమకు చాక్లెట్, ఐస్‌క్రీమ్ లాంటివి ఆఫర్ చేసినా తిరస్కరిస్తుంటారు. ఈ కండిషన్‌ను ‘హైపర్ యాక్యూరసీ’ అంటారు. ఈ హైపర్ యాక్యురసీ భావనను అధిగమించడానికి రోజూ చేయాల్సిన దాని కంటే మరింత ఎక్కువగా వ్యాయామం చేస్తూ ఉండటం, ఈ వ్యాయామం తాము తిన్న ఆహారాన్ని పూర్తిగా బర్న్ చేసిందో లేదో అంటూ ఆందోళన చెందుతుంటారు. మరింత సేపు వ్యాయామాన్ని కొనసాగిస్తూ తమను తాము బాధపెట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. వ్యాయామంతో ఆనందించే స్థాయి నుంచి క్రమంగా వారు వ్యాయామంతో తమను తాము హింసించుకోవడం స్థాయికి చేరుతారు. -
డీఎన్ఏలో మరో సమాచార వ్యవస్థ
మన శరీర కణాల్లోని క్రోమోజోములపై ఉండే జన్యువులే మన రూపురేఖలు, ఆరోగ్య అంశాలను నిర్ణయిస్తాయని భావిస్తున్నాం. కానీ ఈ నియంత్రణలో ఒక్క జన్యువులే గాకుండా మరో సమాచార వ్యవస్థ కూడా భాగం పంచుకుంటోందని లెయిడెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీరంలోని కణాలన్నింటిలో ఉండే డీఎన్ఏ పోగులు, జన్యువులు ఒకేలా ఉన్నా... ఒక్కో అవయవం ఉత్పత్తి చేసే ప్రొటీన్లు, ఎంజైమ్‌లు వేర్వేరుగా ఎందుకు ఉంటాయన్నది శాస్త్రవేత్తలకు చాలాకాలంగా పజిల్‌గానే ఉంది. జన్యు సమాచారానికి అదనంగా మరో సమాచార వ్యవస్థ ఏదో కణాల్లో ఉండి ఉండాలని కొందరు శాస్త్రవేత్తలు భావించారు. దీనినే లెయిడన్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అసలు ఈ రెండో సమాచార వ్యవస్థ ఏమిటో తెలుసా? ఒక్కో కణంలోని డీఎన్ఏ ఉండ చుట్టుకుని ఉండే తీరే. ఇలా చుట్టుకుని ఉండడం ద్వారా దానిలో కొన్ని జన్యువుల సమాచారం మాత్రమే చదివేందుకు వీలవుతుందని.. అందుకు అనుగుణంగానే ప్రొటీన్లు, ఎంజైమ్‌ల ఉత్పత్తి జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే కంటిలో ఉండే కణాల్లోని డీఎన్ఏ పోగు అక్కడ అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేసే జన్యువులు మాత్రమే కనిపించేలా ఉండచుట్టుకుని ఉంటే... గుండె కణాల్లో ఆ అవయవానికి తగ్గట్టుగా ముడతలు పడి ఉంటుందన్నమాట! లెయిడెన్ శాస్త్రవేత్తలు కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా బేకర్ ఈస్ట్, ఫిషన్ ఈస్ట్‌ల డీఎన్ఏలను విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. - సాక్షి, హైదరాబాద్ -
సంక్షిప్తంగా.. ఉచితంగా..
► కొత్తపుంతలు తొక్కుతున్న సమాచార వ్యవస్థ ► మాటల కంటే ఎస్ఎంఎస్, మెసేజ్‌లకు ప్రాధాన్యం ► ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటున్న ప్రజలు ► జిల్లాలో నెలకు రూ.2 కోట్లు విలువైన ఎస్ఎంఎస్ల వినియోగం తణుకు : క్రిస్మస్.. నూతన సంవత్సరం.. సంక్రాంతి.. దసరా.. దీపావళి.. ఏ పండగైనా.. ఏ శుభకార్యమైనా సన్నిహితులకు శుభాకాంక్షలు తెలుపుకోవడం పరిపాటి. రోజురోజుకీ మారిపోతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా శుభాకాంక్షలు తెలుపుకోవడం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు గ్రీటింగ్ కార్డులు, బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పేవారు. కాలక్రమేణా అవన్నీ కాలగర్భంలోకి కలిసిపోయూరుు. అంతకుముందు సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి సమాచారం పంపాలంటే ఫోన్ చేయడం లేదా ఉత్తరాలు రాసుకునేవారు. ఇప్పుడు స్కూల్‌కు పిల్లలు వెళ్లకపోయినా.. మార్కెట్లోకి కొత్త మోడళ్లు వచ్చినా.. ఏదైనా సమావేశం జరుగుతున్నా.. ఇలా ప్రతి సందర్భంలో ఎస్ఎంఎస్లు (సంక్షిప్త సందేశాలు) అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు సమాచారాన్ని చేరవేయాలంటే ఉత్తరం తర్వాత ల్యాండ్ ఫోన్ ఇప్పుడు సెల్‌ఫోన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం ఎస్ఎంఎస్లు కీలకంగా మారుతున్నాయి. వాటిలో ముఖ్యంగా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, మెసెంజర్ వంటి యాప్‌లు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. సెల్‌ఫోన్ వచ్చిన తొలినాళ్లలో అధిక శాతం సంభాషణలకే ఉపయోగిస్తే ఇప్పుడు మాటల్లేవ్... మాట్లాడుకోవడాల్లేవ్... అంటూ కేవలం సంక్షిప్త సందేశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్నీ ఉచితమే ఎస్ఎంఎస్లు కేవలం సెల్‌ఫోన్ ద్వారానే కాకుండా నెట్ ద్వారా కొన్ని వెబ్సైట్లలోకి వెళ్లి సమాచారాన్ని పంపవచ్చు. తరచూ ఎవరికైతే మెసేజ్‌లు పంపుతున్నామో ఆయా నంబర్లను నెట్లో నిక్షిప్తం చేసుకుని తర్వాత రోజుకు వంద చొప్పున ఉచితంగా ఎస్ఎంఎస్లు పంపుకునే వెసులుబాటు ఉంది. ఈ విధానం ఎక్కువగా విద్యాసంస్థలు, దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు వినియోగిస్తున్నాయి. మరోవైపు కొంతకాలం క్రితం అందుబాటులోకి వచ్చిన వాట్సప్ ద్వారా నెట్ అందుబాటులో ఉంటే అపరిమితంగా ఎస్ఎంఎస్లు పంపుకునే వీలు కలిగింది. ఆయా నెట్వర్క్ కంపెనీలు ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కల ఆధారంగా ఆయా కంపెనీల ద్వారా జిల్లాలో సుమారు 40 లక్షల మంది సెల్‌ఫోన్ వినియోగదారులు ఉన్నారు. ఆయా నెట్వర్క్ కంపెనీలు ఎస్ఎంఎస్ల కోసం వినియోగదారులకు వివిధ ఆఫర్లు అందజేస్తున్నారు. మొత్తమ్మీద వీరంతా నెలకు రూ. 2 కోట్లు విలువ చేసే ఎస్ఎంఎస్లు వినియోగిస్తున్నారు. సాంకేతికతను వినియోగించుకుంటున్నాం గతంలో స్నేహితులతో మాట్లాడాలంటే సెల్‌ఫోన్ ద్వారా మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు యాంత్రిక జీవనంలో మాట్లాడాలంటే కష్టమవుతోంది. దీంతో అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకుంటూ ఎస్ఎంఎస్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. శుభాకాంక్షలు తెలపాలన్నా, సమాచారం చేరవేయాలన్నా సమయం వృథా కాకుండా ఇవి తోడ్పడుతున్నాయి. - టి.శివశంకర్, తణుకు -
పేకాడేస్తున్నారు
*జూద గృహాలపై పోలీసుల ఉక్కుపాదం *ఐదు నెలల్లో 146 శిబిరాలపై దాడులు *పట్టుబడిన 1089 మంది జూదగాళ్లు *20 కార్లు, 265 బైక్‌లు.1037 సెల్ఫోన్లు సీజ్ సిటీబ్యూరో: పేకాట శిబిరాలపై సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు ఉక్కుపాదం మోపారు. గడిచిన ఐదు నెలల్లో పేకాట శిబిరాలపై జరిపిన వరుస దాడులే ఇందుకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం నగరంలో పేకాట క్లబ్బులు మూసివేయడంతో పేకాటరాయుళ్లు నగర శివార్లతో పాటు తమ ఇళ్లను అడ్డాగా చేసుకొని రహస్యంగా పేకాటాడుతున్నారు. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఎస్ఓటీ పోలీసులు అన్ని ఠాణాల పరిధిలో పేకాట శిబిరాల గురించి తెలుసుకొనేందుకు పకడ్బందీ సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. గత ఐదు నెలల్లోనే 146 పేకాట శిబిరాలపై దాడి చేశారు. నిందితుల నుంచి సుమారు కోటి రూపాయలు, 26 కార్లు, 277 బైక్‌లు, 1040 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో పారిశ్రామికవేత్తలు, బడా బాబుల పిల్లలు, మహిళలు, పోలీసులు, విలేకరులు ఉండటం గమనార్హం. మహిళల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పేకాట శిబిరాల గుట్టును కూడా ఎస్ఓటీ పోలీసులు బట్టబయలు చేశారు. నగరంలోని క్లబ్‌లు మూసివేయడంతో హోటళ్లలో పేకాటాడితే పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశంతో నగర శివార్లలో శిబిరాలు ఏర్పాటు చేసుకొని పేకాటాడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎస్ఓటీ పోలీసులు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 30 ఠాణాల పరిధిలో దాడులు నిర్వహిస్తున్నారు. శివార్లలోని హోటళ్లు, ఫామ్‌హౌస్‌లతో పాటు గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లల్లో నిర్వహిస్తున్న జూదగృహాలపైనా దృష్టి పెట్టి దాడులు కొనసాగిస్తున్నారు. ఎస్ఓటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి, ఇన్స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, ఉమేందర్, గురురాంఘవేంద్ర, వెంకట్‌రెడ్డి, ఎస్ఐలు ఆంజనేయులు, రాములు నాలుగు బృందాలుగా ఏర్పడి తరచూ దాడులు నిర్వహిస్తున్నారు. వీరి దాడులకు వెరసి పేకాట రాయుళ్లు దారి మార్చారు. హైదరాబాద్ టూ విజయవాడ... జూదాన్ని వృత్తిగా పెట్టుకున్న కొందరు విజయవాడకు తమ మకాం మార్చుకున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. అక్కడ కొన్ని క్లబ్బులు ఇక్కడి పేకాటరాయుళ్లతో నిత్యం సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వారికి రవాణా సౌకర్యంతో పాటు వసతి వంటి సకల సదుపాయాలు కల్పిస్తున్నాయి. మరికొందరైతే గోవాకు వెళ్లి పేకాడుతున్నారు. ఖాళీ చేయని క్లబ్‌లు.... మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తున్న పేకాట క్లబ్బులు ఒక్కసారిగా బంద్ కావడంతో నిర్వాహకుల గొంతులో పచ్చివెలక్కాయపడినట్టు కాగా... సాధారణ ప్రజలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని కొనియాడుతున్నారు. క్లబ్బులు ఇక తెరిచేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్వయంగా ప్రకటించినా... నిర్వాహకులు మాత్రం క్లబ్బులను ఇంకా ఖాళీ చేయడం లేదు. క్లబ్బులపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని తెరిచేందుకు రేపో మాపో అనుమతి ఇస్తుందనే ఆశతో ఉన్నారు. ఈనేపథ్యంలోనే అద్దె భవనాల్లో ఉన్న క్లబ్బులకు వేలాది రూపాయల అద్దె చెల్లిస్తూనే ఉన్నారు. నగరంలోని ఓ క్లబ్ నిర్వాహకులు రోజుకు రూ.50 వేలు అద్దె చెల్లిస్తున్నారు. ఇప్పటికైనా క్లబ్ నిర్వాహకులు అప్పుల్లో కూరుకుపోకుండా వెంటనే భవనాలు ఖాళీ చేసి ఇతర వ్యాపారాలు చేసుకుంటే మంచిదని పోలీసులు హితవు పలుకుతున్నారు. ఆటలు సాగనివ్వం పేకాట శిబిరాలపై దాడులు కొనసాగిస్తాం. గుట్టుచప్పుడు కాకుండా నాలుగు గోడల మధ్య కూర్చొని పేకాటాడుకుంటున్నామని ఎవరూ అనుకోవద్దు. ఇలాంటి శిబిరాల సమాచారం సేకరించేందుకు అన్ని ఠాణాల పరిధిలో పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. జూదం ఆడుతుంటే క్షణాల్లో మాకు తెలిసిపోతుంది. వెంటనే వెళ్లి నిర్వాహకులతో పాటు పేకాటాడుతున్నవారిని పట్టేస్తాం. జూదగృహాల గురించి తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరుతున్నా. పేకాటాడుతూ తరచూ పట్టుబడే వారిపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే నిర్వాహకులపై రౌడీషీట్ తెరుస్తాం. రామచంద్రారెడ్డి, ఎస్ఓటీ అదనపు డీసీపీ జూదకేంద్రాలపై దాడి: 16 మంది అరెస్టు సిటీబ్యూరో: ఉప్పల్, మైలార్‌దేవ్‌పల్లి ఠాణాల పరిధిలోని పేకాట కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. లక్ష నగదులో పాటు 16 మందిని అరెస్టు చేశారు. ఎస్ఓటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, ఉమేందర్, ఎస్ఐలు ఆంజనేయులు, రాములు ఈ దాడులు నిర్వహించారు. -
వాట్సాప్.. అంతా ఉచితం
* సోషల్ నెట్‌వర్క్‌పై పెరుగుతున్న ఆసక్తి * అందుబాటులోకి సమాచార వ్యవస్థ *టెక్నాలజీని సద్వినియోగపర్చుకొంటున్న వైనం కంచిలి: పావురాలతో కబురుపంపడం, ఉత్తరాలతో సమాచారం చేరవేయడం, టెలిగ్రామ్‌తో అత్యవసర వార్తలు అందజేసే కాలం పోయింది... ఎస్టీడీ బూత్‌లు, కాయిన్ బాక్సులకు కాలం చెల్లింది... ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ నెట్వర్కింగ్ సిస్టం అందుబాటులోకి వచ్చింది. కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకునేందుకు యువత, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పోటీ పడుతన్నాయి. ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకుంటూ ఖర్చు, కాలాన్ని తగ్గించుకుంటున్నాయి. సోషల్నెట్వర్కింగ్ సైట్లలో వాట్సాప్ నెట్వర్క్ అందుబాటులోకి రావడంతో సమాచారాన్ని చేరవేసేందుకు మార్గం మరింత సుగుమం అయింది. సాధారణ పద్ధతిలో మొబైల్ నెట్‌వర్క్‌లో మెసేజ్‌లు పంపాలంటే నెలకు ఇన్ని మాత్రమే ఉచితం, ఇంకా కావాలంటే దానికి నిర్దేశించిన ధర చెల్లించాల్సి వస్తుంది. అధికంగా ఎస్ఎంఎస్లు పంపాలంటే ఎస్ఎంఎస్ ఆఫర్ వేసుకోవాల్సి ఉంది. అయితే, వాట్సాప్ రంగప్రవేశంతో అటువంటి నిబంధనలేవీ అవసరం లేదు. మొదట్లో నెలకు పది రూపాయలు చొప్పున చెల్లించాల్సి వచ్చినప్పటికీ, ఇప్పడు అంతా ఉచితం అయిపోయింది. ఈ వాట్సాప్ ద్వారా టెక్స్ట్ మెసేజ్‌లే కాకుండా ఫొటోలు, చిన్నచిన్న వీడియోలు క్షణాల్లో అవతలివారికి చేరవేసే అవకాశం కలిగింది. ఈ సోషల్నెట్ వర్క్ వల్ల కొన్ని అనర్థాలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఉపయోగమే ఉందనే భావన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. అన్నివర్గాలకూ వినియోగమే... వాట్సాప్ నెట్‌వర్క్‌ను జిల్లాలో రెవెన్యూ శాఖ విరివిగా ఉపయోగిస్తోంది. కలెక్టర్, ఆర్డీవోలు, తహశీల్దార్, రెవెన్యూ సిబ్బంది అంతా ఒక గ్రూపుగా ఏర్పడి వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసుకుంటున్నారు. పనులను చక్కబెట్టుకుంటున్నారు. అలాగే, జిల్లాలోని జర్నలిస్టులంతా ఒక గ్రూప్‌గా ఏర్పడి ఈ నెట్వర్క్ ద్వారా వార్తాంశాలను, న్యూస్ఫొటోస్ను షేర్ చేసుకొంటున్నారు. విదేశాల్లో ఉన్నవారు రోజువారీ కార్యకలాపాలను ఫొటోలు, వీడియోల రూపంలో వాట్సాప్‌లో పంపించుకుంటున్నారు. షాపింగ్‌లో ఏదైనా వస్తువులు, దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడో ఉన్న తమ కుటుంబ సభ్యులకో, ఇష్టమైన స్నేహితులకో చూపించుకొని వారి చాయిస్‌కు అనుగుణంగా వాట్సాప్ ద్వారా అప్పటికప్పుడే ఫోటోలు తీసి పంపించి, వారి అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. గ్రూప్ చాట్స్, లొకేషన్ షేర్ చేసుకోవడం, ఫొటోలు, వీడియోలు పంపించుకొనే వీలుంటుంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సమాచారవ్యవస్థ అందుబాటులోకి రావడంతో వ్యక్తులు, వ్యవస్థల మధ్య దూరం రోజురోజుకూ తగ్గిపోతోంది. సంబంధాలు మెరుగుపడుతున్నారుు. వాట్సాప్‌తో ఎంతో ఉపయోగం వాట్సాప్ నెట్వర్కింగ్ వ్యవస్థతో సమాచారం చేరవేయడం సులభతరమైంది. పైసా ఖర్చులేకుండా నెట్లో సమాచారాన్ని పంపిస్తూ పనులు చక్కబెడుతున్నాం. సోషల్ నెట్వర్కింగ్ వ్యవస్థను సద్వినియోగపర్చుకొంటే సమాజంలో మంచి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంది. - కె. వెంకటసురేష్, ఎస్ఐ, కంచిలి క్షణాల్లో సమాచారం... వాట్సాప్ సోషల్ నెట్‌వర్కింగ్‌ను ఉపయోగించుకొని ఫొటోలు, వీడియోలను క్షణాల్లో పంపించవచ్చు. ఈ సదుపాయూన్ని వివిధ ప్రభుత్వ శాఖల్లోను, మీడియా, ఇతర వర్గాలు చక్కగా సద్వినియోగపర్చుకొంటున్నాయి.పని సులభమైంది. డబ్బుల ఖర్చు తగ్గింది. - రాంబాబు, పంచాయతీ కార్యదర్శి, మఖరాంపురం -
కుప్పకూలిన సమాచార వ్యవస్థ
విశాఖపట్నం:హుదూద్ తుపాను సృష్టించిన ప్రళయం విశాఖలోని వాతావరణ కేంద్రానికీ ఆటంకం కలిగించింది. సిబ్బంది విధులు నిర్వహించలేని పరిస్థితిని కల్పించింది. ఆదివారం హుదూద్ తుపాను తీరం దాటిన కొద్దిసేపటికే ఇక్కడి సమాచార వ్యవస్థ కుప్పకూలింది. కైలాసగిరిపై ఉన్న రాడార్ వ్యవస్థకూ ఆ సెగ తాకింది. తుపాను అనంతరం వచ్చిన వర్షం, గాలుల కారణంగా అప్పటికే రాడార్ కార్యాలయంలో విధులు నిర్వహించిన సిబ్బంది బయటకు రాలేకపోయారు. కార్యాలయం వద్ద భారీగా నీరు చేరింది. చెట్లు కూలిపోయాయి. అద్దాలు పగిలిపోయాయి. ఫలితం గా రాడార్ సాయంతో గ్రాఫ్, మ్యాప్‌ల ద్వారా వాతావరణ సమాచారాన్ని సేకరించాల్సిన అధికారులు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం సాయంత్రం వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉంది. మరోవైపు ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం సమీపంలో ఉన్న వాతావరణ శాఖ కార్యాలయం వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అక్కడ ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ కేబుల్ వ్యవస్థ నిలిచిపోవడంతో తుపాను అనంతరం వాతావరణంలో కలిగే మార్పుల్ని అధికారులు చెప్పలేకపోతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇన్వర్టెర్ ద్వారా మాత్రమే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా కీలక సమాచారాన్ని తెలియజేయలేకపోతున్నారు. ఇదే విషయాన్ని బీఎస్ఎన్ఎల్ అధికారులకు వాతావరణశాఖ అధికారులు విజ్ఞప్తి చేసినా సమీపంలో ఉన్న కేబులింగ్ వ్యవస్థ పనిచేయడం లేదని, మరో 24 గంటలపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని తేల్చి చెప్పినట్టు తెలిసింది. ట్రాన్స్మిషన్ పనిచేస్తున్నా ఫలితాలు రావడం లేదని కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. నేడూ వర్షాలు!: హుదూద్ తుపాను ప్రభావం మంగళవారం కూడా కొనాసాగే అవకాశం ఉందని, ఫలితంగా తేలికపాటి వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఈదురుగాలులు కూడా వీచే అవకాశముంటుందన్నారు. -
సమాచార వ్యవస్థపై మావోల పంజా
దుమ్ముగూడెం, న్యూస్‌లైన్: సమాచార వ్యవస్థపై మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. దుమ్ముగూడెం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ కంపెనీ సెల్ టవర్ క్యాబిన్, జనరేటర్, ఏసీ రూంలను దగ్ధం చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్తపల్లిలో రెండు సంవత్సరాల క్రితం ఎయిర్టెల్ కంపెనీ వారు సెల్ టవర్ ఏర్పాటు చేశారు. ఈ సెల్ టవరకు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మావోయిస్టులు నిప్పంటించారు. మావోయిస్టు వెంకటాపురం ఏరియా కార్యదర్శి రాజు, శబరి ఏరియా కమిటీ కార్యదర్శి నగేష్, దుమ్ముగూడెం ఇన్చార్జ్ సంతు ఆదేశాల మేరకు 10 మంది మిలీషియా సభ్యులు సైకిళ్లపై ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం నుంచి మండలంలోని కొమ్మనాపల్లి మీదుగా కొత్తపల్లి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కనే ఉన్న వరిగడి, తాటాకులను ఉపయోగించి పెట్రోల్ సహాయంతో సెల్ టవర్ క్యాబిన్, ఏసీ రూం, జనరేటర్లకు నిప్పంటించారు. ఈ సమయంలో కొంత మంది మిలీషియా సభ్యులు రహదారికి ఇరువైపులా కాపలా ఉండగా మిగిలిన సభ్యులు పని పూర్తి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం వారు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లినట్లు తెలిసింది. సంఘటన జరిగిన సమయంలో టవర్ సెక్యూరిటీ గార్డు, ఆపరేటర్ ఆ ప్రాంతంలో లేనట్లు తెలిసింది. బుధవారం ఉదయం సెక్యూరిటీ గార్డు కనుగట్టు శ్రీనివాస్ ఈ ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 28లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2009లో చినబండిరేవులోని బీఎస్ఎన్ఎల్ టవర్‌ను, 2014 ఫిబ్రవరిలో ఆర్లగూడెంలో ఎయిర్టెల్ టవర్‌ను దగ్ధం చేసి సమాచార వ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు మావోయిస్టులు యత్నించిన విషయం విదితమే. సంఘటన స్థలంలో పోస్టర్లు... అనంతరం మావోయిస్టులు సంఘటన స్థలంలో మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ, శబరి ఏరియా కమిటీ పేరుతో పోస్టర్లు వదిలి వెళ్లారు. ఆదివాసీ ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని, పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. అలాగే ఆదివాసీ యువకులకు పోలీసులు డబ్బు ఆశ చూపి ఇన్ఫార్మర్లుగా ఉపయోగించుకుంటున్నారని, ఛత్తీస్‌గఢ్ ఏరియాలో మావోయిస్టులను అణచివేసేందుకు పోలీసులు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లా ఎస్పీ రంగనాథ్, కొత్తగూడెం ఓఎస్డీలు ఆదివాసీలపై కేసులు బనాయించడంతో పాటు ఇన్ఫార్మర్ వ్యవస్థను నడుపుతున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ విరమించుకోకపోతే తర్వాత వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ పోస్టర్లను బుధవారం ఉదయమే పోలీసులు తొలగించారు.