వాట్సాప్.. అంతా ఉచితం | whatsapp .. All for free | Sakshi
Sakshi News home page

వాట్సాప్.. అంతా ఉచితం

Published Wed, Nov 12 2014 5:20 AM | Last Updated on Mon, Oct 22 2018 6:35 PM

వాట్సాప్.. అంతా ఉచితం - Sakshi

వాట్సాప్.. అంతా ఉచితం

* సోషల్ నెట్‌వర్క్‌పై పెరుగుతున్న ఆసక్తి
* అందుబాటులోకి సమాచార వ్యవస్థ
*టెక్నాలజీని సద్వినియోగపర్చుకొంటున్న వైనం

కంచిలి: పావురాలతో కబురుపంపడం, ఉత్తరాలతో సమాచారం చేరవేయడం, టెలిగ్రామ్‌తో అత్యవసర వార్తలు అందజేసే కాలం పోయింది... ఎస్టీడీ బూత్‌లు, కాయిన్ బాక్సులకు కాలం చెల్లింది... ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ నెట్‌వర్కింగ్ సిస్టం అందుబాటులోకి వచ్చింది. కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకునేందుకు యువత, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పోటీ పడుతన్నాయి. ఇంటర్నెట్‌ను సద్వినియోగం చేసుకుంటూ ఖర్చు, కాలాన్ని తగ్గించుకుంటున్నాయి. సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్లలో వాట్సాప్ నెట్‌వర్క్ అందుబాటులోకి రావడంతో సమాచారాన్ని చేరవేసేందుకు మార్గం మరింత సుగుమం అయింది.

సాధారణ పద్ధతిలో  మొబైల్ నెట్‌వర్క్‌లో మెసేజ్‌లు పంపాలంటే నెలకు ఇన్ని మాత్రమే ఉచితం, ఇంకా కావాలంటే దానికి నిర్దేశించిన ధర చెల్లించాల్సి వస్తుంది. అధికంగా ఎస్‌ఎంఎస్‌లు పంపాలంటే ఎస్‌ఎంఎస్ ఆఫర్ వేసుకోవాల్సి ఉంది. అయితే, వాట్సాప్ రంగప్రవేశంతో అటువంటి నిబంధనలేవీ అవసరం లేదు. మొదట్లో నెలకు పది రూపాయలు చొప్పున చెల్లించాల్సి వచ్చినప్పటికీ, ఇప్పడు అంతా ఉచితం అయిపోయింది. ఈ వాట్సాప్ ద్వారా టెక్స్ట్ మెసేజ్‌లే కాకుండా ఫొటోలు, చిన్నచిన్న వీడియోలు క్షణాల్లో అవతలివారికి చేరవేసే అవకాశం కలిగింది. ఈ సోషల్‌నెట్ వర్క్ వల్ల కొన్ని అనర్థాలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఉపయోగమే ఉందనే భావన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది.
 
అన్నివర్గాలకూ వినియోగమే...
వాట్సాప్ నెట్‌వర్క్‌ను జిల్లాలో రెవెన్యూ శాఖ విరివిగా ఉపయోగిస్తోంది. కలెక్టర్, ఆర్డీవోలు, తహశీల్దార్, రెవెన్యూ సిబ్బంది అంతా ఒక గ్రూపుగా ఏర్పడి వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసుకుంటున్నారు. పనులను చక్కబెట్టుకుంటున్నారు. అలాగే, జిల్లాలోని జర్నలిస్టులంతా ఒక గ్రూప్‌గా ఏర్పడి ఈ నెట్‌వర్క్ ద్వారా వార్తాంశాలను, న్యూస్‌ఫొటోస్‌ను షేర్ చేసుకొంటున్నారు. విదేశాల్లో ఉన్నవారు రోజువారీ కార్యకలాపాలను ఫొటోలు, వీడియోల రూపంలో వాట్సాప్‌లో పంపించుకుంటున్నారు.

షాపింగ్‌లో ఏదైనా వస్తువులు, దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడో ఉన్న తమ కుటుంబ సభ్యులకో, ఇష్టమైన స్నేహితులకో చూపించుకొని వారి చాయిస్‌కు అనుగుణంగా వాట్సాప్ ద్వారా అప్పటికప్పుడే ఫోటోలు తీసి పంపించి, వారి అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. గ్రూప్ చాట్స్, లొకేషన్ షేర్ చేసుకోవడం, ఫొటోలు, వీడియోలు పంపించుకొనే వీలుంటుంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సమాచారవ్యవస్థ అందుబాటులోకి రావడంతో వ్యక్తులు, వ్యవస్థల మధ్య దూరం రోజురోజుకూ తగ్గిపోతోంది. సంబంధాలు మెరుగుపడుతున్నారుు.
 
వాట్సాప్‌తో ఎంతో ఉపయోగం

వాట్సాప్ నెట్‌వర్కింగ్ వ్యవస్థతో సమాచారం చేరవేయడం సులభతరమైంది. పైసా ఖర్చులేకుండా నెట్‌లో సమాచారాన్ని పంపిస్తూ పనులు చక్కబెడుతున్నాం. సోషల్ నెట్‌వర్కింగ్ వ్యవస్థను సద్వినియోగపర్చుకొంటే సమాజంలో మంచి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంది.
 - కె. వెంకటసురేష్, ఎస్‌ఐ, కంచిలి
 
క్షణాల్లో సమాచారం...

వాట్సాప్ సోషల్ నెట్‌వర్కింగ్‌ను ఉపయోగించుకొని ఫొటోలు, వీడియోలను క్షణాల్లో పంపించవచ్చు. ఈ సదుపాయూన్ని వివిధ ప్రభుత్వ శాఖల్లోను, మీడియా, ఇతర వర్గాలు చక్కగా సద్వినియోగపర్చుకొంటున్నాయి.పని సులభమైంది. డబ్బుల ఖర్చు తగ్గింది. 
- రాంబాబు, పంచాయతీ కార్యదర్శి, మఖరాంపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement