దుమ్ముగూడెం, న్యూస్‌లైన్: సమాచార వ్యవస్థపై మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. దుమ్ముగూడెం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ కంపెనీ సెల్ టవర్ క్యాబిన్, జనరేటర్, ఏసీ రూంలను దగ్ధం చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్తపల్లిలో రెండు సంవత్సరాల క్రితం ఎయిర్‌టెల్ కంపెనీ వారు సెల్ టవర్ ఏర్పాటు చేశారు. ఈ సెల్ టవరకు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మావోయిస్టులు నిప్పంటించారు.
మావోయిస్టు వెంకటాపురం ఏరియా కార్యదర్శి రాజు, శబరి ఏరియా కమిటీ కార్యదర్శి నగేష్, దుమ్ముగూడెం ఇన్‌చార్జ్ సంతు ఆదేశాల మేరకు 10 మంది మిలీషియా సభ్యులు సైకిళ్లపై ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం నుంచి మండలంలోని కొమ్మనాపల్లి మీదుగా కొత్తపల్లి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కనే ఉన్న వరిగడి, తాటాకులను ఉపయోగించి పెట్రోల్ సహాయంతో సెల్ టవర్ క్యాబిన్, ఏసీ రూం, జనరేటర్‌లకు నిప్పంటించారు. ఈ సమయంలో కొంత మంది మిలీషియా సభ్యులు రహదారికి ఇరువైపులా కాపలా ఉండగా మిగిలిన సభ్యులు పని పూర్తి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అనంతరం వారు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లినట్లు తెలిసింది. సంఘటన జరిగిన సమయంలో టవర్ సెక్యూరిటీ గార్డు, ఆపరేటర్ ఆ ప్రాంతంలో లేనట్లు తెలిసింది. బుధవారం ఉదయం సెక్యూరిటీ గార్డు కనుగట్టు శ్రీనివాస్ ఈ ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 28లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2009లో చినబండిరేవులోని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను, 2014 ఫిబ్రవరిలో ఆర్లగూడెంలో ఎయిర్‌టెల్ టవర్‌ను దగ్ధం చేసి సమాచార వ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు మావోయిస్టులు యత్నించిన విషయం విదితమే.
సంఘటన స్థలంలో పోస్టర్లు...
అనంతరం మావోయిస్టులు సంఘటన స్థలంలో మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ, శబరి ఏరియా కమిటీ పేరుతో పోస్టర్లు వదిలి వెళ్లారు. ఆదివాసీ ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని, పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. అలాగే ఆదివాసీ యువకులకు పోలీసులు డబ్బు ఆశ చూపి ఇన్‌ఫార్మర్లుగా ఉపయోగించుకుంటున్నారని, ఛత్తీస్‌గఢ్ ఏరియాలో మావోయిస్టులను అణచివేసేందుకు పోలీసులు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లా ఎస్పీ రంగనాథ్, కొత్తగూడెం ఓఎస్‌డీలు ఆదివాసీలపై కేసులు బనాయించడంతో పాటు ఇన్‌ఫార్మర్ వ్యవస్థను నడుపుతున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ విరమించుకోకపోతే తర్వాత వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ పోస్టర్లను బుధవారం ఉదయమే పోలీసులు తొలగించారు.
సమాచార వ్యవస్థపై మావోల పంజా
Published Thu, May 22 2014 2:10 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement