సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సౌరగోళంపై అధ్యయనం కోసం ఇస్రో పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్ ద్వారా 1,475 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ఆగస్ట్ మూడో వారంలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. సౌర తుపాను సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీంతోపాటు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్‌లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించేందుకు ఈ ప్రయోగాన్ని నిర్వహించబోతున్నారు. బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్‌లో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు.
ఆస్ట్రోశాట్‌తో పాటు చంద్రయాన్–1, చంద్రయాన్–2 మిషన్లలో పాల్గొన్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.శంకర సుబ్రమణియన్ ఆధ్వర్యంలో ఆదిత్య–ఎల్1 ఉపగ్రహానికి రూపకల్పన చేశారు. 1,475 కేజీల బరువు కలిగిన ఆదిత్య–ఎల్1లో ఉండే ఆరు పేలోడ్స్ బరువు 244 కేజీలే. మిగిలిన 1,231 కేజీలు ద్రవ ఇంధనంతో నింపి ఉంటాయి. ఉపగ్రహాన్ని సూర్యునివైపు తీసుకెళ్లేందుకు ద్రవ ఇంధనం ఎక్కువ అవసరం. మొదట ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన తర్వాత.. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజ్ బిందువు–1లోకి చేరవేయడానికి 177 రోజులు పడుతుంది.
అక్కడి నుంచి ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేకుండా సూర్యుడిని నిరంతరం పరిశోధించేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు. ఆదిత్య–ఎల్1లో యాస్‌పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్ అనే ఆరు పేలోడ్స్ అమర్చి పంపిస్తున్నారు. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్ వరకు.. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్ డిగ్రీల వరకు ఉంటుంది.
కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి గల కారణం అంతు చిక్కడం లేదు. ఈ అంశంపై కూడా ఆదిత్య–ఎల్1 పరిశోధనలు చేయనుంది. సూర్యుడికి ఉన్న మరో పేరే ఆదిత్య. ఈ ఉపగ్రహాన్ని ‘లాగ్రేంజ్’ అనే బిందువు వద్ద ప్రవేశపెడుతున్నందున ఎల్ అని.. సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి ఉపగ్రహమైనందున ‘1’ అని పెట్టారు. దీని పూర్తి పేరు ఆదిత్య–ఎల్1 అని ఖరారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment