రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 31 మంది నక్సలైట్లు మృతిచెందారు. దాదాపు 48 గంటల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కమాండర్లు కమలేశ్ అలియాస్ ఆర్కే, నీతి అలియాస్ ఊర్మిళ మరణించినట్లు సమాచారం.
వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు ఘటనా స్థలం నుంచి ఇప్పటివరకు 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీ ఎత్తున కూంబింగ్ కొనసాగుతోంది. దాదాపు 1,500 మంది భద్రత సిబ్బందితో 48 గంటలపాటు ఆపరేషన్ సాగినట్లు అధికారుల వెల్లడించారు. పొలాలు, చిత్తడి దారుల గుండా 10 కిలోమీటర్లు ప్రయాణించి, అక్కడినుంచి 12 కిలోమీటర్ల మేర కొండలు ఎక్కి ఎన్‌కౌంటర్ ప్రాంతానికి బలగాలలు చేరుకున్నాయి.
ఇక, ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారిలో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కమలేష్ అలియాస్ ఆర్కె, నీతి అలియాస్ ఊర్మిళ మరణించినట్లు సమాచారం. ఊర్మిళ బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతానికి చెందినవారు కాగా, కమలేశ్ ఏపీలోని విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.
మరోవైపు.. ఎన్‌కౌంటర్‌పై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం అంతమై శాంతి నెలకొంటుంది. మన బలగాలు గొప్ప విజయాన్ని సాధించాయి. 31 మంది నక్సల్స్‌ను హతమార్చారు. మన సైనికులు గత రికార్డును బద్దలు కొట్టారు. ఎన్‌కౌంటర్ విషయంలో మా సైనికులను అభినందిస్తున్నాము. వారి ధైర్యానికి వందనం. ఈ ఘటన మావోయిస్టులు అణిచివేతకు మార్గం చూపించింది అంటూ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘాల నేతలు స్పందించారు. మృతుల ఫొటోలు, వివరాలను పోలీసులు వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే, ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: బెంగాల్‌లో మరో దారుణం
Comments
Please login to add a commentAdd a comment