ఛత్తీస్‌గఢ్‌లో పేలిన 70 కిలోల మందుపాతర
8 మంది జవాన్లు, డ్రైవర్ దుర్మరణ
కూంబింగ్ ముగించుకుని వస్తుండగా దారుణం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏడాదిన్నర కాలంగా మావోయిస్టుల ఏరివేతలో ఎదురన్నదే లేకుండా దూసుకెళ్తున్న భద్రతా బలగాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లా కుట్రు సమీపంలో మావోయిస్టులు అమర్చిన శక్తిమంతమైన మందుపాతర పేలిన ఘటనలో 8 మంది జవాన్లు, డ్రైవర్ మృత్యువాత పడ్డారు.
బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అబూజ్‌మడ్ అడవుల్లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య శనివారం సాయంత్రం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మావోయిస్టులు చనిపోగా ఓ జవాన్ కూడా నేలకొరిగారు. ఎదురుకాల్పుల సమయంలో తప్పించుకున్న మావోయిస్టుల కోసం దళాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో కూంబింగ్ అనంతరం సోమవారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో క్యాంపునకు తిరిగి వస్తున్న డీఆర్‌జీ బలగాల స్కారి్పయో వాహనాన్ని బెదిరే –కుట్రు రోడ్డులో నక్సల్స్ ఐఈడీ ద్వారా పేల్చేశారు.
పేలుడు తీవ్రతకు ఘటనాస్థలి భయానకంగా మారింది. పోలీసు వాహనం శకలాలుగా మారిపోగా, అందులో ఉన్న 8 మంది జవాన్లు, డ్రైవర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలిలో సిమెంట్ రోడ్డు పెచ్చులుగా లేచి 10 అడుగుల లోతైన గొయ్యి ఏర్పడింది. జవాన్ల వాహనం భాగాలు పక్కనున్న ఎత్తయిన చెట్ల కొమ్మల చివర వరకు ఎగిరిపడ్డాయి. స్టీరింగ్ రాడ్ మొత్తం వంగిపోయింది.
జవాన్ల శరీరాలు తల, మొండెం, కాళ్లు, చేతులు ఛిద్రమై రోడ్డు పక్కన పొలాల్లో పడ్డాయి. అక్కడికి చేరుకున్న బలగాలు సహచరుల శరీర భాగాలను పాలిథిన్ కవర్లలో సేకరించాల్సి వచ్చింది. నేలకొరిగిన జవాన్లంతా స్థానిక గిరిజనులు, లొంగిపోయిన మావోయిస్టులేనని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ చెప్పారు. ఘటన నేపథ్యంలో గాలింపు మరింత ముమ్మం చేశామన్నారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్లను.. కోర్స బుధ్రం, సోమడు వెంటిల్, డుమ్మా మడకం, బోమన్ సోది, హరీష్ కొర్రమ్, పండరు పద్యం, సుదర్శన్ వీటి, శుభర్నాథ్ యాదవ్‌గా గుర్తించారు. డ్రైవర్ వివరాలు తెలియరాలేదు.
ఫాక్స్‌హోల్ పద్ధతి
యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో మావోయిస్టులు పన్నిన ఉచ్చులో చిక్కకుండా భద్రతా దళాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తాము ప్రయాణించే మార్గంలో ముందుగానే యాంటీ ల్యాండ్‌మైన్ వాహనాలతో తనిఖీలు చేస్తుంటాయి. అయితే వీటికి సైతం చిక్కని రీతిలో ఫాక్స్‌హోల్ పద్ధతిలో మావోయిస్టులు 70 కిలోల పేలుడు పదార్థాలను రోడ్డు మధ్యలో అమర్చినట్టు తెలుస్తోంది. 2023 ఏప్రిల్ 26న దంతెవాడ జిల్లాలో చోటుచేసుకున్న పేలుడులో 10 మంది డీఆర్‌జీ జవాన్లు, డ్రైవర్ మరణించారు. అప్పుడు కూడా ఫాక్స్‌హోల్ పద్ధతినే మావోయిస్టులు ఉపయోగించినట్టుగా పోలీసులు గుర్తించారు.
ప్రొటోకాల్ తప్పారా?
సాధారణంగా డీఆర్‌జీ జవాన్లు కాలినడక లేదా బైక్‌లపైనే ఎక్కువగా కూంబింగ్‌కు వెళ్తారు. సోమవారం ఘటనలో వారు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌కు దూరంగా వాహనాన్ని ఉపయోగించారు. అది కూడా ల్యాండ్‌మైన్ ప్రూఫ్ కాకుండా సాధారణ వాహనం. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. గతేడాది భద్రతా దళాల ప్రయాణించే వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోలు పేలుడు పదార్ధాలు ఉపయోగించారు. అయితే అది సరుకు రవాణా వాహనం కావడంతో మృతుల సంఖ్య రెండుకు పరిమితమైంది.
ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో జర్నలిస్టు హత్య..హైదరాబాద్‌లో నిందితుడి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment