
ఆస్పత్రికి తరలించిన కాసేపటికే మృతిచెందిన కార్మికుడు
మరో కార్మికుడి ఆచూకీ కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు
భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగిన బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో విషా దం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమించి శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చిన కార్మికుడు చల్లా కామేశ్వరరావు (48).. ఆస్పత్రికి తరలించిన కాసేపటికే మృతి చెందాడు. తల, ఉదర భాగం మినహా నడుం కింది భాగంలో అవయవాలన్నీ శిథిలాల కింద నలిగిపోవడంతో ప్రాణాలు వదిలాడు. మరో కార్మికుడు పడిసర ఉపేందర్ ఆచూకీ కోసం శిథిలాల కింద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
కూలిన ఐదు స్లాబులను క్రేన్‌లతో డ్రిల్ చేస్తూ, కట్టర్‌లు, గ్యాస్ వెల్డింగ్‌తో ఇనుమును తొలగిస్తున్నారు. అయితే ఉపేందర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు బ్రిడ్జి సెంటర్‌లో, ఘటనాస్థలం వద్ద ఆందోళన చేశారు. సహాయక చర్యల్లో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కుటుంబ సభ్యులకు రూ. కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఇంటి యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సహాయక చర్యలను భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు.
