దక్షిణ అయోధ్యలో ‘పంచారామ క్షేత్రాలు’ | Pancharama Kshetras in South Ayodhya | Sakshi
Sakshi News home page

దక్షిణ అయోధ్యలో ‘పంచారామ క్షేత్రాలు’

Apr 6 2025 5:06 AM | Updated on Apr 6 2025 5:06 AM

Pancharama Kshetras in South Ayodhya

రాముడు నడయాడిన చరిత్ర ఆనవాళ్లు

భక్తులు చూడదగిన పర్యాటక కేంద్రాలు

భద్రాచలం: దేశంలో దక్షిణ అయోధ్యగా విరాజిల్లు తున్న భద్రాచలం.. భద్రుని తపో ఫలంతో ఆవిర్భా వమైన పుణ్యక్షేత్రం. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్న పంచారామ క్షేత్రాల వివరాలు..

వైకుంఠ రాముడు (భద్రాచలం)
పంచారామ క్షేత్రాలలో మొదటిది భద్రాచలంలో ఉన్న సీతారామచంద్రస్వామి దేవస్థానం. దక్షిణ అ యోధ్యగా పిలుచుకునే ఈ క్షేత్రంలోని శ్రీరాముడిని భోగరాముడుగానూ పిలుస్తారు. చతుర్భుజాలతో శ్రీరాముడు దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం ఇది. భక్త­రామదాసుగా పేరు తెచ్చుకున్న కంచర్ల గోపన్న ఈ ఆలయాన్ని నిర్మించడంతో పాటు పూజాధికాలను ఏర్పాటు చేశారు. నేటికీ ఈ క్షేత్రంలో ఇంచుమించుగా అవే పూజలు కొనసాగుతున్నాయి.

శోకవిరాముడు (పర్ణశాల)
తులసీదాసు రచించిన రామచరిత మానస్‌లో సీతా­రాములు వనవాసం (11మాసాల 10 రోజులు) చేసిన ప్రదేశాన్ని పర్ణశాలగా పేర్కొంటారు. ఇక్కడ పంచవటి కుటీరం, సీతమ్మను అపహరించిన ప్రాంతం, మాయ­లేడి పాదముద్రలు, శూర్పణఖ దాగి.. వేషాన్ని మార్చు­కున్న చుప్పనాతి చెట్టు గల ప్రాంతం, సీతమ్మ పసుపు కుంకుమలుగా వాడుకున్న పసుపురాళ్లు. 

కుంకుమరాళ్లు, నారచీరలు ఆరవేసుకున్న చారబండలు, సీతారాములు ఆడుకున్న వామనగుంటలు, కందమూలాలను ఆరగించిన రాతి కంచాలు, సీతమ్మ ప్రత్యేక దినములలో స్నానం చేసిన పద్మసరస్సు (సీత వాగు) ఆమెకు రక్షణగా శ్రీరాముడు కూర్చున్న రాతి సింహాసనం వంటి గుర్తులు కనిపిస్తాయి. సీతాపహరణం తర్వాత శ్రీరాముడు శోకించిన ప్రాంతం కావడంతో ఇక్కడున్న రాముడిని శోకవిరాముడిగా పేర్కొంటారు.

ఆత్మారాముడు (దుమ్ముగూడెం)
ముక్కు, చెవులు కోసిన తర్వాత తన అన్నదమ్ము లైన ఖర–దూషణ, త్రిశిర తదితర 14 వేలమంది రాక్షసులతో శూర్పణఖ మొరపెట్టుకుంది. దీంతో వారంతా రాముడిపైకి యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధంలో వారంతా రాముడి చేతిలో అంతమ­య్యారు. 14 వేలమందితో రాముడొక్కడే యుద్ధం చేస్తున్నా... రాక్షసులకు ఒక్కొక్కరితో ఒక్కో రాము­డు తలపడినట్లుగా యుద్ధం సాగిందని, రాము­డొక్కడే అంతమందిగా అత్మస్వరూపంతో యుద్ధం చేసినందున ఇక్కడి రాముడిని ఆత్మారాముడని అంటారు. ఇక్కడే రాక్షసులకు రాముడికి దొమ్మి­(యుద్ధం) జరిగిన ప్రాంతం కావడం వల్ల దొమ్మి­గూడెం గాను, క్రమేణా దుమ్ముగూడెం గానూ మా­రి­నట్లు స్థానిక చరిత్ర చెబుతోంది. 

యోగరాముడు (శ్రీరామగిరి క్షేత్రం)
ఇది గోదావరి, శబరి నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రాంతం. నిండుగా ప్రవహించే గోదావరి నదీతీరాన ఎత్తయిన కొండపై నెలకొన్న క్షేత్రానికి శ్రీరామగిరి అని పేరు. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంతం ఏపీలోకి వెళ్లింది. ఈ కొండపై శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై చాతుర్మాస్యవ్రతాన్ని ఆచరించాడని స్థలపురాణం. పర్ణశాలలో సీతాపహరణం తర్వాత శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ వనక్షేత్రం చేరి, సేదతీరి మళ్లీ సీతమ్మను వెదుకుతూ ఈప్రాంతానికి చేరుకున్నారు. 

ఇది అప్పుడు మాతంగముని ఆశ్రమ ప్రాంతం. ఇక్కడే శబరిని కలసి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆ తల్లికి ముక్తిని ప్రసాదించాడని పురాణ కథనం. ఈ విధంగా శ్రీరామాయణ కథకు సన్నిహిత సంబంధం గల పవిత్ర ప్రాంతమిది. ఈ ప్రాంతానికి సమీపంలో రేఖపల్లిలో (రెక్కపల్లి) (జటాయువు యొక్క రెండో రెక్క పడిపోయిన చోటు) జటాయువును చూశారు. రామలక్ష్మణులు జటాయువు ద్వారా సీత వృత్తాంతాన్ని తెలుసుకుని, మరణించిన జటాయువుకు శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు చేశారు. 

గోదావరి తీరంలో ఓ పెద్దశిలపై దానికి పిండ ప్రదానం చేసినట్లు స్థల చరిత్ర చెబుతోంది. ఈ కొండపై శ్రీరాముడు యోగం చేయడం వల్ల ఇక్కడి రాముడిని ఈ ప్రాంతవాసులు యోగరాముడుగా పిలుస్తారు. జటావల్కలధారిగా ఉండే ఈ స్వామికి సుందరరాముడు అని కూడాపేరు. ఎక్కడా లేనివిధంగా ఇక్కడ లక్ష్మణస్వామి అంజలి ఘటిస్తూ ఉంటాడు. తొలుత ఈ కొండపై రామలక్ష్మణుల విగ్రహాలు, ఆ తరువాత మాతంగి మహర్షి వంశీయ మహర్షులు సీతమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు స్థల చరిత్ర చెబుతోంది

వన రాముడు (దండకారణ్య భాగం) 
దండకారణ్య భాగం భద్రాచలం క్షేత్రానికి తూర్పు ఆగ్నేయ దిశలో శబరి నది దాటగానే ఉన్న వరరామచంద్రపురానికి (వీఆర్‌పురం) 23 కి.మీ. దూరంలో ఉంది (ప్రస్తుతం ఇది ఏపీలో ఉంది). ఇక్కడికి కాలిబాట తప్ప మరో మార్గం లేదు. సీతాపహరణం జరిగిన తర్వాత బాధలో ఉన్న శ్రీరాముడిని లక్ష్మణుడు ఓదార్చిన ప్రాంతమని భక్తుల విశ్వాసం. ఇక్కడి రాముడిని ఒక వృక్షరూపంలో ఆరాధిస్తారు. 

కొన్ని వందల ఏళ్లకు ముందు నుంచి ఇక్కడున్న రెండు భారీ టేకు, మద్ది చెట్లను ఆ ప్రాంత గిరిజనులు కొలుస్తున్నారు. అటవీశాఖ వారు కూడా చాలాకాలం క్రితమే వాటిని పురాతన వృక్షాలుగా గుర్తించి, ఆ రెండు చెట్లకు రామ, లక్ష్మణ వృక్షాలని పేరు పెట్టారు. ఆ రెండింటినీ దండకారణ్య వృక్షాల ప్రతినిధులుగా భావిస్తారు. ఆ ప్రాంతాన్ని వన రామక్షేత్రంగా సంబోధిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement