ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన తొలి కేంద్ర కమిటీ సభ్యుడు
ఏపీలోని చిత్తూరు జిల్లా మత్యం పైపల్లె స్వగ్రామం
1990 సమయంలో పీపుల్స్‌వార్‌లో చేరి అజ్ఞాతంలోకి..
మిలిటరీ వ్యూహాలు, గెరిల్లా వార్‌ఫేర్‌లో దిట్టగా గుర్తింపు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చిత్తూరు అర్బన్/ మల్కన్‌గిరి: వరుస ఎన్‌కౌంటర్లతో కుదేలవుతున్న మావోయిస్టులకు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి అలియాస్ ప్రతాప్‌రెడ్డి అలియాస్ అప్పారావు మరణించారు. కేంద్ర కమిటీ సభ్యుడు ఇలా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందడం మావోయిస్టు పార్టీ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. చలపతిపై రూ.కోటి రివార్డు ఉన్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు.
ఏపీలోని చిత్తూరు జిల్లాలో జన్మించి...
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మత్యం పైపల్లెకు చెందిన శివలింగారెడ్డి, లక్ష్మమ్మ దంపతుల మూడో కుమారుడు చలపతి. ఆయన తండ్రి సాధారణ రైతు. వారికి మత్యం పైపల్లెలో ఇప్పటికీ సొంతిల్లు ఉంది. ప్రస్తుతం ఆ ఇంట్లో చలపతి అన్న కుమారుడి కుటుంబం నివసిస్తోంది. ప్రాథమిక విద్యను మత్యంలోనే అభ్యసించిన చలపతి.. పదో తరగతి వరకు బంగారుపాళెం, డిగ్రీ ఒకేషనల్ కోర్సును చిత్తూరులో పూర్తిచేశారు.
పీపుల్స్‌వార్ పార్టీకి ఆకర్షితుడై 1990–91లో అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసు రికార్డుల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మావోయిస్టు పార్టీ విస్తరణకు కృషి చేశారు. శ్రీకాకుళం– కోరాపుట్ డివిజన్ ఇన్‌చార్జిగా పనిచేసిన ఆయన.. గెరిల్లా వార్‌ఫేర్‌లో చూపిన ప్రతిభతో అనతి కాలంలోనే డివిజనల్ కమిటీ సభ్యుడిగా ఎదిగారు.
2000 నాటికి ఆంధ్రా– ఒడిశా బోర్డర్ (ఏఓబీ) స్పెషల్ జోనల్ కమిటీ, ఏవోబీ స్టేట్ మిలిటరీ కమిషన్లలో సభ్యుడి హోదా పొందారు. 2010లో తోటి మావోయిస్టు అరుణ అలియాస్ చైతన్యను వివాహం చేసుకున్నారు. 2012లో జరిగిన ఒక దాడిలో చలపతి పొరపాటు కారణంగా ఒక కామ్రేడ్ చనిపోవడంతో పార్టీ ఆయనను కొంతకాలం డీమోట్ చేసింది. చలపతి భార్య అరుణ 2019 మార్చిలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.
మహేంద్ర కర్మపై దాడితో మళ్లీ తెరపైకి...
సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై 2015లో చేసిన దాడితో చలపతి మరోసారి వెలుగులోకి వచ్చారు. తరా>్వత మావోయిస్టు రీజనల్ కమిటీ చీఫ్ కుడుముల వెంకట రమణ అలియాస్ రవి ఎదురుకాల్పుల్లో మృతి చెందడం, గెమ్మెలి నారాయణరావు అలియాస్ జాంబ్రి 2017లో చనిపోవడంతో.. చలపతికి ప్రాధాన్యత దక్కింది. తర్వాతి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకున్నారు.
2003లో దమాన్‌జోడి మైన్స్ కంపెనీపై దాడి, మాచ్‌ఖండ్ పోలీసుస్టేషన్‌పై దాడి, చిత్రకొండ సమితిలో సెల్ టవర్ల పేల్చివేత, 2009లో ఏపీ గ్రేహౌండ్స్‌పై చిత్రకొండ జలాశయంలో దాడి, 2018లో జరిగిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యను ప్లాన్ చేసినది చలపతేనని చెబుతారు. 2011లో చలపతి ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో కలెక్టర్ వినీల్‌కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.
ఆర్‌కే సన్నిహితుడిగా.. హిడ్మాకు గురువుగా..
మావోయిస్టు పార్టీ మాస్టర్ మైండ్స్‌లో ఒకరిగా చలపతికి గుర్తింపు ఉంది. మావోయిస్టు అగ్రనేత ఆర్‌కేకు అత్యంత సన్నిహితంగా చలపతి మెలిగారు. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ వన్ కమాండర్‌గా ఉన్న మడావి హిడ్మాకు చలపతిని గురువుగా పేర్కొంటారు. ఆయన ఎలా ఉంటారనేది చాలా కాలం పాటు పోలీసులకు తెలియలేదు. 2016లో ఓ మావోయిస్టు చనిపోగా.. అతడి ల్యాప్‌టాప్‌లో చలపతి, ఆయన సహచరి అరుణ సెల్ఫీ వీడియో లభించింది.
Comments
Please login to add a commentAdd a comment