kameshwar rao
-
భవనం కూలిన ఘటనలో ఒకరి మృతి
భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగిన బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో విషా దం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమించి శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చిన కార్మికుడు చల్లా కామేశ్వరరావు (48).. ఆస్పత్రికి తరలించిన కాసేపటికే మృతి చెందాడు. తల, ఉదర భాగం మినహా నడుం కింది భాగంలో అవయవాలన్నీ శిథిలాల కింద నలిగిపోవడంతో ప్రాణాలు వదిలాడు. మరో కార్మికుడు పడిసర ఉపేందర్ ఆచూకీ కోసం శిథిలాల కింద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కూలిన ఐదు స్లాబులను క్రేన్లతో డ్రిల్ చేస్తూ, కట్టర్లు, గ్యాస్ వెల్డింగ్‌తో ఇనుమును తొలగిస్తున్నారు. అయితే ఉపేందర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు బ్రిడ్జి సెంటర్లో, ఘటనాస్థలం వద్ద ఆందోళన చేశారు. సహాయక చర్యల్లో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు రూ. కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఇంటి యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సహాయక చర్యలను భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు. -
విప్లవోద్యమ అగ్నికెరటం !
సాక్షి, తెనాలి : భారత స్వాతంత్య్ర ఉద్యమంలో విప్లవోద్యమ అగ్నికెరటం అన్నాప్రగడ కామేశ్వరరావు.చిరుప్రాయంలోనే బ్రిటీష్ సైన్యంలో చేరినా, నాలుగేళ్లకే తిరుగుబాటు చేశాడు. మడమ తిప్పని పోరాటంతో బ్రిటిష్ పోలీసులు, గుంటూరు జిల్లా కలెక్టర్ రూథర్‌ఫోర్డ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. ఆ క్రమంలో 18 ఏళ్ల అజ్ఞాతవాసం గడిపారు. తెనాలి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికై గుంటూరు జిల్లా మొదటి ఎమ్మెల్యేల బృందంలో సభ్యుడయ్యారు. రాజకీయాలపై ఏవగింపు కలిగి పూనేలో స్థిరపడ్డారు అన్నాప్రగడ కామేశ్వరరావు. యుక్తవయసులోనే విప్లవ భావాలు.. నాదెండ్ల మండలం కనుపర్తిలో 1902 అక్టోబర్ 21న అన్నాప్రగడ రోశయ్య, లక్ష్మీదేవి దంపతుల మూడో కుమారుడిగా కామేశ్వరరావు జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే వయసు ఎక్కువ చెప్పి బ్రిటిష్ సైన్యంలో చేరారు. బ్రిటిష్ అధికారుల ఆదేశంతో 1917లో మెసపుటేమియాలోని బానరలో ప్రజల తిరుగుబాటును అణచివేసేందుకు వెళ్లారు. అక్కడ ‘బద్దు’ జాతి తిరుగుబాటుదారుల ఉపదేశంతో దేశభక్తి ప్రేరేపితుడయ్యాడు. అనంతరం సైన్యంలో ఉంటూనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడంతో ఖైదు చేశారు. 1921లో కరాచీ చేరి విప్లవ పోరాటాల్లో పాల్గొని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. అక్కడా జైలుపాలై 1922లో విడుదలై గుంటూరు వచ్చారు. నాదెండ్ల ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వానికి సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. సొంత పోస్టాఫీసు, సొంత కరెన్సీతో స్వతంత్ర ప్రజాపాలన చేపట్టారు. 1922 జనవరి 22న ఆయన విప్లవ పోరాటంలో తొలిసారిగా నరసరావుపేటలో అరెస్టయ్యారు. కోర్టు ఆయనకు ఏడాది శిక్ష విధించింది. రాజమండ్రి జైలుకు తరలిస్తుండగా వేలాది ప్రజలు అడ్డుకున్నారు. ‘నా బిడ్డతోపాటు స్వాతంత్య్రం కోసం నేనూ పోరాటం చేస్తాను. నా బిడ్డకు అండగా నిలుస్తాను’ అని అన్నాప్రగడ తల్లి లక్ష్మీదేవి చేసిన ఉపన్యాసం ప్రజల్ని ఉత్తేజపరచింది. విప్లవయోధులతో స్నేహం, వివాహం రాజమండ్రి జైల్లో గదర్ పార్టీ నాయకులు పండిత్ జగం రామ్, గణేష్ రఘరామ్, వైశంపాయన్‌లతో పరిచయం ఏర్పడింది. 1922లో జైలు నుంచి విడుదలయ్యాక గౌహతి కాంగ్రెస్ సభలకు వెళ్లారు. 1924లో సావర్కరు, అయ్యరు సలహాపై కరాచీ వెళ్లి కోటంరాజు పున్నయ్య సహకారంతో బెలూచిస్తాన్ చేరారు. అక్కడ ఉద్యమానికి బీజాలు నాటి తిరిగొచ్చి బరోడాలోని ప్రొఫెసర్ మాణిక్యరావు వ్యాయామశాలలో శిక్షణ పొందారు. ఈ క్రమంలో భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, భటుకేశ్వరదత్తు, సురేంద్రనాథ్ పాండే, రాజగురుతో స్నేహం కలిసింది. బరోడాలో పరిచయమైన గుజరాతీ మహిళ సరళాదేవిని వర్ణాంతర వివాహం చేసుకున్నారు. లాహోరు కుట్రకేసులో పోలీసులు అరెస్టు చేయబోగా, బరోడా మహారాజు శాయోజీ గైక్వాడ్ సహకారంతో తప్పించుకున్నాడు. భగత్‌సింగ్‌ను జైలునుంచి తప్పించాలని.. అన్నాప్రగడ కొంతకాలం మాచర్ల వద్ద గల ఎత్తిపోతల జలపాతం వద్ద రహస్య జీవితం గడిపారు. భగత్‌సింగ్‌ను జైలు నుంచి తప్పించి విదేశాలకు పంపించాలని విశ్వప్రయత్నం చేశారు. ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటుగా ఎ.కె.రావు పేరుతో 1931 సెప్టెంబర్ 22న నకిలీ పాస్‌పోర్టు సంపాధించినా ఆ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. 1931 మార్చి 23న భగత్‌సింగ్ బృందాన్ని ఉరితీశాక అదే నకిలీ పాస్పోర్టుతో అన్నాప్రగడ తన భార్యాపిల్లలను దక్షిణాఫ్రికా తీసుకెళ్లి బంధువుల ఇంట్లో వదిలేశారు. ఆ తర్వాత వివిధ దేశాల్లో ఆర్మీ గెరిల్లా యుద్ధరీతిలో శిక్షణ పొందారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మద్రాసు శాసనసభకు.. 1935–36లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1939లో స్వగ్రామం కనుపర్తిలో గృహనిర్బంధం నుంచి తప్పించుకున్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు దేశరక్షణ చట్టం కింద అరెస్టయ్యారు. కమ్యూనిస్టు పార్టీతో విభేదించిన కామేశ్వరరావు క్రమంగా ఆ పార్టీకి దూరమయ్యారు. 1946లో తెనాలి– గుంటూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఉమ్మడి మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. రాజకీయ కాలుష్యం కారణంగా రాష్ట్రాన్ని వదిలి 1956లో పూనాలో స్థిరపడ్డారు. ఇందిరాగాంధీ హయాంలో ఆమె ఆదేశాల ప్రకారం అఖిల భారత స్వాతంత్య్రసమరయోధుల సంఘానికి రెండుసార్లు అధ్యక్షుడిగా దేశమంతటా తిరిగి స్వాతంత్య్రసమరయోధులకు పింఛన్లు ఇప్పించటంలో కీలకపాత్ర వహించారు. అన్నాప్రగడ 1987 జనవరి 30న తుదిశ్వాస విడిచారు. -
భారత హాకీ జట్టు ప్రపంచ క్రీడారంగంలో ఓ అద్భుతం
ఒకప్పుడు రత్నాలు రాశులుగా పోసి అమ్మేవారట... రాజులనాటి ప్రాభవం గురించి చెబుతూ ఈ మాట వాడటం తరచూ వింటుంటాం. ఒకప్పుడు భారత హాకీ జట్టు అంటే ప్రపంచ క్రీడారంగంలో ఓ అద్భుతం. ఏకంగా ఎనిమిది ఒలింపిక్ స్వర్ణ పతకాలు నెగ్గిన ఏకైక దేశం. ప్రస్తుత భారత హాకీని నాటి వైభవంతో పోలిస్తే... అంతే అబ్బురం ఇప్పుడు. ఇతర క్రీడల జోరులో ఎదగలేక, మార్గదర్శనం కరువై మన హాకీ వెనుకబడిపోయింది. కించిత్ బాధ వెంటాడుతుంది. అయితే... అందరికీ హాకీ ఆట దూరం కాలేదు. స్టిక్ పట్టుకుంటేనే చేతిలోకి మంత్రదండం వచ్చేసినంతగా ఉప్పొంగిపోయే కుర్రాళ్లు... భవిష్యత్తుపై భరోసా లేకపోయినా హాకీ అంటే పడిచచ్చే పిల్లలు ఇంకా ఉన్నారు. ఇలాంటి ఈతరం ఆటగాళ్లతోనే హాకీ ఇంకా మనుగడ సాగిస్తోంది. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ పుట్టినరోజును ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నగరంలో హాకీపై అభిమానం పెంచుకున్న చిన్నారుల గురించి... సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో హాకీ ఆడేందుకు పెద్ద సంఖ్యలో చిన్నారులు వస్తుంటారు. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసే వారి సంఖ్య దాదాపు 50 వరకు ఉంటుంది. నగరంలో ఈ క్రీడకు ఇప్పుడు ఇదే కేంద్రం. గచ్చిబౌలి ఆస్ట్రో టర్ఫ్ స్టేడియంలో అవకాశమున్నా... అదంతా ఖరీదైన వ్యవహారం. ఇక్కడ మాత్రం పేద, పెద్ద తేడా లేకుండా ఆసక్తి ఉన్న చిన్నారులంతా హాకీ ఆడేందుకు వస్తారు. ఎక్కువగా రసూల్పురావారు వచ్చేవారు. గతంలో దీని వెనుక భాగంలో బేగంపేట ఆస్ట్రోటర్ఫ్ స్టేడియం ఉండేది. అక్కడి నుంచే అనేక మంది జాతీయ స్థాయిలో హాకీ ఆడారు. అయితే బేగంపేట స్టేడియం పోలీసుల అధీనంలోకి వెళ్లిపోవడంతో ఇప్పుడు వారు జింఖానా బాట పట్టాల్సి వచ్చింది. జాతీయ స్థాయిలో... ఇక్కడి ఆటగాళ్లకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కోచ్ శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్న వీరిలో పది మందికి పైగా జాతీయ స్థాయి పోటీల్లో రాణించారు. అండర్-12, అండర్-14తో పాటు ప్రతిష్టాత్మక కె.డి.సింగ్ బాబు జాతీయ చాంపియన్‌షిప్‌లో కూడా వీరు పాల్గొన్నారు. నలుగురు చిన్నారులు జాతీయ స్కూల్ గేమ్స్ సమాఖ్య పోటీ ల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కొన్నాళ్లుగా నగరంలో సీనియర్ స్థాయి టోర్నీలు లేక పరిస్థితి ప్రోత్సాహకరంగా లేకపోయినా... తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం లేదని వారు అంటున్నారు. హాకీ అంటే కొందరికి ప్రాణమని, మరికొందరికి పిచ్చి అని... అందుకే ఇదే ఆట ఎంచుకున్నామని వారు చెబుతున్నారు. ప్రోత్సాహకాలు, ఉద్యోగాల గురించి ఇప్పుడు ఆలోచన లేదని, బాగా ఆడితే అన్నీ వాటంతట అవే వస్తాయని వీరికి బలమైన నమ్మకం. టోర్నీలేవీ..! ఇక్కడి చిన్నారుల్లో చాలా ప్రతిభ ఉంది. క్లే కోర్టులోనే బాగా ఆడే వీరు అవకాశం దక్కితే ఆస్ట్రో టర్ఫ్లోనూ సత్తా చాటగలరు. సీనియర్ స్థాయిలో టోర్నమెంట్లు నిర్వహిస్తే వీరి ప్రతిభకు తగిన న్యాయం జరుగుతుంది. వీరిలో చాలా మంది ఆర్థిక స్థోమత లేనివారు. అయినా వారి పట్టుదల ముందు ఇలాంటివేవీ కనిపించవు. - కామేశ్వర రావు, హాకీ కోచ్