విప్లవోద్యమ అగ్నికెరటం ! | Annapragada Kameswara Rao Is Great Freedom Fighter Is First MLA From Tenali | Sakshi
Sakshi News home page

విప్లవోద్యమ అగ్నికెరటం !

Published Tue, Apr 2 2019 11:49 AM | Last Updated on Tue, Apr 2 2019 11:49 AM

Annapragada Kameswara Rao Is Great Freedom Fighter Is First  MLA From Tenali - Sakshi

అన్నాప్రగడ కామేశ్వరరావు

సాక్షి, తెనాలి : భారత స్వాతంత్య్ర ఉద్యమంలో విప్లవోద్యమ అగ్నికెరటం అన్నాప్రగడ కామేశ్వరరావు.చిరుప్రాయంలోనే బ్రిటీష్‌ సైన్యంలో చేరినా, నాలుగేళ్లకే తిరుగుబాటు చేశాడు. మడమ తిప్పని పోరాటంతో బ్రిటిష్‌ పోలీసులు, గుంటూరు జిల్లా కలెక్టర్‌ రూథర్‌ఫోర్డ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. ఆ క్రమంలో 18 ఏళ్ల అజ్ఞాతవాసం గడిపారు. తెనాలి నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికై గుంటూరు జిల్లా మొదటి ఎమ్మెల్యేల బృందంలో సభ్యుడయ్యారు. రాజకీయాలపై ఏవగింపు కలిగి పూనేలో స్థిరపడ్డారు అన్నాప్రగడ కామేశ్వరరావు.

యుక్తవయసులోనే విప్లవ భావాలు..
నాదెండ్ల మండలం కనుపర్తిలో 1902 అక్టోబర్‌ 21న అన్నాప్రగడ రోశయ్య, లక్ష్మీదేవి దంపతుల మూడో కుమారుడిగా కామేశ్వరరావు జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే వయసు ఎక్కువ చెప్పి బ్రిటిష్‌ సైన్యంలో చేరారు. బ్రిటిష్‌ అధికారుల ఆదేశంతో 1917లో మెసపుటేమియాలోని బానరలో ప్రజల తిరుగుబాటును అణచివేసేందుకు వెళ్లారు. అక్కడ ‘బద్దు’ జాతి తిరుగుబాటుదారుల ఉపదేశంతో దేశభక్తి ప్రేరేపితుడయ్యాడు.

అనంతరం సైన్యంలో ఉంటూనే బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడంతో ఖైదు చేశారు. 1921లో కరాచీ చేరి విప్లవ పోరాటాల్లో పాల్గొని, బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. అక్కడా జైలుపాలై 1922లో విడుదలై గుంటూరు వచ్చారు. నాదెండ్ల ప్రాంతంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. సొంత పోస్టాఫీసు, సొంత కరెన్సీతో స్వతంత్ర ప్రజాపాలన చేపట్టారు.

1922 జనవరి 22న ఆయన విప్లవ పోరాటంలో తొలిసారిగా నరసరావుపేటలో అరెస్టయ్యారు. కోర్టు ఆయనకు ఏడాది శిక్ష విధించింది. రాజమండ్రి జైలుకు తరలిస్తుండగా వేలాది ప్రజలు అడ్డుకున్నారు. ‘నా బిడ్డతోపాటు స్వాతంత్య్రం కోసం నేనూ పోరాటం చేస్తాను. నా బిడ్డకు అండగా నిలుస్తాను’ అని అన్నాప్రగడ తల్లి లక్ష్మీదేవి చేసిన ఉపన్యాసం ప్రజల్ని ఉత్తేజపరచింది.  

విప్లవయోధులతో స్నేహం, వివాహం
రాజమండ్రి జైల్లో గదర్‌ పార్టీ నాయకులు పండిత్‌ జగం రామ్, గణేష్‌ రఘరామ్, వైశంపాయన్‌లతో పరిచయం ఏర్పడింది. 1922లో జైలు నుంచి విడుదలయ్యాక గౌహతి కాంగ్రెస్‌ సభలకు వెళ్లారు. 1924లో సావర్కరు, అయ్యరు సలహాపై కరాచీ వెళ్లి కోటంరాజు పున్నయ్య సహకారంతో బెలూచిస్తాన్‌ చేరారు.

అక్కడ ఉద్యమానికి బీజాలు నాటి తిరిగొచ్చి బరోడాలోని ప్రొఫెసర్‌ మాణిక్యరావు వ్యాయామశాలలో శిక్షణ పొందారు. ఈ క్రమంలో భగత్‌సింగ్, చంద్రశేఖర్‌ ఆజాద్, భటుకేశ్వరదత్తు, సురేంద్రనాథ్‌ పాండే, రాజగురుతో స్నేహం కలిసింది. బరోడాలో పరిచయమైన గుజరాతీ మహిళ సరళాదేవిని వర్ణాంతర వివాహం చేసుకున్నారు. లాహోరు కుట్రకేసులో పోలీసులు అరెస్టు చేయబోగా, బరోడా మహారాజు శాయోజీ గైక్వాడ్‌ సహకారంతో తప్పించుకున్నాడు.

భగత్‌సింగ్‌ను జైలునుంచి తప్పించాలని..
అన్నాప్రగడ కొంతకాలం మాచర్ల వద్ద గల ఎత్తిపోతల జలపాతం వద్ద రహస్య జీవితం గడిపారు.  భగత్‌సింగ్‌ను జైలు నుంచి తప్పించి విదేశాలకు పంపించాలని  విశ్వప్రయత్నం చేశారు.  ఆంధ్ర ఇన్సూరెన్స్‌ కంపెనీ ఏజెంటుగా ఎ.కె.రావు పేరుతో 1931 సెప్టెంబర్‌ 22న నకిలీ పాస్‌పోర్టు సంపాధించినా ఆ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. 1931 మార్చి 23న భగత్‌సింగ్‌ బృందాన్ని ఉరితీశాక అదే నకిలీ పాస్‌పోర్టుతో అన్నాప్రగడ తన భార్యాపిల్లలను దక్షిణాఫ్రికా తీసుకెళ్లి బంధువుల ఇంట్లో వదిలేశారు. ఆ తర్వాత వివిధ దేశాల్లో ఆర్మీ గెరిల్లా యుద్ధరీతిలో శిక్షణ పొందారు.

కాంగ్రెస్‌ అభ్యర్థిగా మద్రాసు శాసనసభకు..
1935–36లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1939లో స్వగ్రామం కనుపర్తిలో గృహనిర్బంధం నుంచి తప్పించుకున్నారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు దేశరక్షణ చట్టం కింద అరెస్టయ్యారు. కమ్యూనిస్టు పార్టీతో విభేదించిన కామేశ్వరరావు క్రమంగా ఆ పార్టీకి దూరమయ్యారు. 1946లో తెనాలి– గుంటూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఉమ్మడి మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు.

రాజకీయ కాలుష్యం కారణంగా రాష్ట్రాన్ని వదిలి 1956లో పూనాలో స్థిరపడ్డారు. ఇందిరాగాంధీ హయాంలో ఆమె ఆదేశాల ప్రకారం అఖిల భారత స్వాతంత్య్రసమరయోధుల సంఘానికి రెండుసార్లు అధ్యక్షుడిగా దేశమంతటా తిరిగి స్వాతంత్య్రసమరయోధులకు పింఛన్లు ఇప్పించటంలో కీలకపాత్ర వహించారు. అన్నాప్రగడ 1987 జనవరి 30న తుదిశ్వాస విడిచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement