Indira Gandhi
-
ఆ లేఖల్లో ఏముంది?
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లేఖలు మరోసారి వార్తల్లోకెక్కాయి. స్వాతంత్య్ర పోరాట సమయంలో పుంఖానుపుంఖాలుగా ఆయన రాసిన లేఖలు అనంతర కాలంలో ఎంతగానో ప్రసిద్ధికెక్కాయి. బ్రిటిషర్ల చెరలో జైలు జీవితం అనుభవిస్తూ కూతురు ఇందిరకు రాసిన లేఖలైతే సంకలనాలుగా వెలువడి ఎంతో ఆదరణ కూడా పొందాయి. జయప్రకాశ్ నారాయణ్ వంటి రాజకీయ ఉద్ధండులు మొదలుకుని భౌతికశాస్త్ర దిగ్గజం ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ దాకా ప్రముఖులెందరితోనో నెహ్రూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు లోకప్రసిద్ధం. చక్కని రచనా శైలికే గాక అద్భుతమైన అభివ్యక్తికి వాటిని నిలువెత్తు నిదర్శనంగా చెబుతుంటారు. నెహ్రూ తదనంతరం ఆయన లేఖలన్నింటినీ ప్రధానమంత్రి మ్యూజియం, లైబ్రరీ (పీఎంఎంఎల్)లో భద్రపరిచారు. అయితే యూపీఏ హయాంలో 2008లో కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ వాటన్నింటినీ తన నివాసానికి తరలించిన వైనం ఇప్పుడు రాజకీయ రగడకు దారితీస్తోంది. నెహ్రూ లేఖలతో కూడిన ఏకంగా 51 పెట్టెలను తన సోనియా తరలించుకుని వెళ్లారని బీజేపీ ఆరోపిస్తోంది. వాటన్నింటినీ తిరిగివ్వాల్సిందిగా పీఎంఎంఎల్ తాజాగా సోనియాను కోరింది. కనీసం జిరాక్సులో, పీడీఎఫ్‌లో అయినా అందజేస్తే భద్రపరుస్తామంటూ విజ్ఞప్తి చేసింది. దాంతో, ‘‘అసలు నెహ్రూ లేఖలను సోనియా పనిగట్టుకుని తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచి్చంది? అందుకెవరు అనుమతించారు? 16 ఏళ్లుగా తన వద్దే ఎందుకు ఉంచుకున్నారు? ఎందుకు తిరిగివ్వడం లేదు? అంతగా దాచాల్సిన అంశాలు ఆ లేఖల్లో ఏమున్నాయి?’’ వంటి అనేకానేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీటికి సమాధానంగా అన్ని వేళ్లూ నెహ్రూ–ఎడ్వినా లేఖలవైపే చూపిస్తుండటం విశేషం. ఎడ్వినా నాటి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్ భార్య. ఆమెకు, నెహ్రూకు మధ్య చాలా సాన్నిహిత్యం ఉందంటారు. ‘‘నిజానికిది బహిరంగ రహస్యమే. అప్పట్లో రాజకీయ వర్గాల్లో నిత్యం అందరి నోళ్లలోనూ నానిన అంశం కూడా’’ అని చరిత్రకారులు కూడా చెబుతారు. ‘‘నెహ్రూ, ఎడ్వినా సాన్నిహిత్యానికి వారి నడుమ సాగిన లేఖలు అద్దం పట్టాయి. దాంతో అవి వెలుగు చూడకూడదని సోనియా భావించారు. అందుకే వాటితో పాటు అన్ని లేఖలనూ పీఎంఎంఎల్ నుంచి తరలించుకుపోయారు’’ అని బీజేపీ ఆరోపిస్తోంది. ‘గాం«దీ–నెహ్రూ కుటుంబం’ అంటూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అవకాశం దొరికినప్పుడల్లా పదునైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ లేఖల రగడ ఎంత దూరం వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సోనియా తరలించుకుపోయిన నెహ్రూ లేఖలన్నింటినీ తిరిగి ఇప్పించాలంటూ ఆమె కుమారుడు, విపక్ష నేత రాహుల్‌గాం«దీకి పీఎంఎంల్ సభ్యుడు, చరిత్రకారుడు రిజ్వాన్ కాద్రీ డిసెంబర్ 10న లేఖ రాశారు. ‘‘అవన్నీ ఎడ్వినా, ఐన్‌స్టీన్, జేపీ, పద్మజా నాయుడు, విజయలక్ష్మీ పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబూ జగ్జీవన్‌రాం, జేబీ పంత్ తదితరులకు నెహ్రూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు. 1971లో ఇందిర వాటిని పీఎంఎంల్ (అప్పట్లో నెహ్రూ మ్యూజియం)కు అప్పగించారు. అవి పీఎంఎంల్లో ఉంటే స్కాలర్లకు, పరిశోధకులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. దాంతో నెహ్రూతో ఎడ్వినా సాన్నిహిత్యం ఆయన మరణించిన 80 ఏళ్ల తర్వాత మరోసారి తెరపైకి వచ్చింది. మిగతా లేఖల సంగతి ఎలా ఉన్నా గత చరిత్ర, బీజేపీ ఆరోపణల పుణ్యమా అని నెహ్రూ–ఎడ్వినా లేఖలపైనే అందరికీ ఆసక్తి నెలకొంది. ‘‘వాటిలో అంత గోప్యంగా ఉంచాల్సిన అంశాలేమున్నాయి? ఎందుకు వాటిని సోనియా తన ఇంట్లో దాచిపెట్టుకున్నారు? ఆమె బదులిచ్చి తీరాలి’’ అంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ డిమాండ్ చేయడం విశేషం. పార్టీ మరో అధికార ప్రతినిధి సంబిత పాత్ర కూడా సోమవారం ఏకంగా లోక్‌సభలోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై సరైన చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బదులివ్వడం విశేషం. అనంతరం పాత్ర మీడియాతో కూడా దీనిపై మాట్లాడారు. ‘‘నెహ్రూ లేఖలు గాంధీ కుటుంబపు వ్యక్తిగత ఆస్తి కాదు. దేశ సంపద. వాటిని బయట పెట్టడానికి గాంధీ కుటుంబం వెనకాడుతుండటం ఎన్నో సందేహాలకు తావిస్తోంది. సరిగ్గా పీఎంఎంల్లోని లేఖల డిజిటైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టే ముందే నెహ్రూ లేఖలను సోనియా తీసుకెళ్లారు. వాళ్లేం దాస్తున్నారో తెలుసుకోవాలని దేశం భావిస్తోంది’’ అన్నారు. ‘గాఢమైన’ బంధం నెహ్రూ, ఎడ్వినా మధ్య నడిచిన లేఖలు ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేవు. అయితే ఎడ్వినా కూతురు పమేలా హిక్స్ తదితరులు వాటికి సంబంధించిన పలు విశేషాలను గతంలో పంచుకున్నారు. నెహ్రూ, ఎడ్వినా మధ్య ‘అత్యంత గాఢమైన’ బంధం కొనసాగిందని పమేలా తన పుస్తకంలో స్పష్టంగా పేర్కొనడం విశేషం! ‘‘నా తల్లి, నెహ్రూ పరస్పరం ఎంతగానో ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి చెప్పలేనంత గౌరవాభిమానాలుండేవి. దీన్ని నేను ఎన్నోసార్లు గమనించాను. మా అమ్మ తానెంతగానో తపించిన ఆదర్శ సాహచర్యాన్ని పండిట్జీ (నెహ్రూ) రూపంలో పొందింది. అయితే వారిద్దరి మధ్య శారీరక బంధానికి అంతగా అవకాశం లేకపోయింది. నిత్యం తమను చుట్టుముట్టి ఉండే సిబ్బంది తదితరుల వల్ల ఏకాంతం దొరకడం గగనంగా ఉండేది. ఎడ్విన్ భారత్ వీడేముందు నెహ్రూకు ఓ ఉంగరమివ్వాలని భావించారు. తీసుకుంటారో లేదోనని చివరికి ఆయన కుమార్తె ఇందిరకు ఇచ్చి వెళ్లారు’’ అని పమేలా చెప్పుకొచ్చారు. నెహ్రూ తన వీడ్కోలు ప్రసంగంలోనూ ఎడ్వినాను ఆకాశానికెత్తిన వైనాన్నీ ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సావర్కర్‌ను ప్రశంసించిన ఇందిరా గాంధీ: బీజేపీ
న్యూఢిల్లీ: సావర్కర్‌పై రాహుల్ గాంధీ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. సావర్కర్‌ను ఇందిరాగాంధీ కూడా ప్రశంసించారని పేర్కొంది. సావర్కర్ స్వాతంత్య్ర పోరాటం గురించి తెలియాలంటే అండమాన్‌లోని సెల్యూలార్ జైలును రాహుల్ సందర్శించాలని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ సూచించారు. ఎన్డీఏ భాగస్వామి శివసేన (షిండే) ఎంపీ శ్రీకాంత్ షిండే కూడా లోక్‌సభలో ఈ మేరకు పేర్కొన్నారు. ‘‘రాహుల్ నాన్నమ్మ ఇందిర కూడా సావర్కర్‌ను భారతదేశపు గొప్ప పుత్రుడంటూ పొగిడారు. సావర్కర్ గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు’’ అన్నారు. సావర్కర్‌ను కొనియాడుతూ పండిట్ బాఖ్లేకు ఇందిర రాసిన లేఖను సభలో చదివి వినిపించారు. సావర్కర్‌ను ప్రశంసించినందుకు ఇందిర కూడా కాంగ్రెస్ లెక్క ప్రకారం రాజ్యాంగ వ్యతిరేకి అవుతారా అని ప్రశ్నించారు. సావర్కర్‌పై విమర్శలు రాహుల్‌కు అలవాటుగా మారాయని మండిపడ్డారు. -
వయనాడ్‌లో ప్రియాంకం
సాక్షి, న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ భారీ విజయంతో బోణీ కొట్టారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామాతో అనివార్యమైన వయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో 6,22,338 ఓట్లు సాధించారు. కాగా తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకెరి కన్నా 4,10,931 ఓట్లు ఎక్కువ సాధించారు.ప్రియాంకతో పోలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ అత్యధికంగా 6,47,445 ఓట్లు సాధించడం విశేషం. ఆనాడు రాహుల్ 3,64,422 ఓట్ల తేడాతో గెలిస్తే శనివారం ప్రియాంక అంతకుమించిన మెజారిటీతో జయకేతనం ఎగరేయడం గమనార్హం. వయనాడ్‌లో గెలిచిన తర్వాత ప్రియాంక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఢిల్లీలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వయనాడ్ నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీకి, ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ‘ఎక్స్’వేదికగా వయనాడ్ ఓటర్లకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ప్రియతమ సోదరసోదరీమణులారా.. వయనాడ్‌లో మీరు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞతతో పొంగిపోయా. రాబోయే రోజుల్లో ఈ గెలుపు మీ విజయమని మీరు భావించేలా పనిచేస్తా. మీ కోసం నేను పోరాడతా. పార్లమెంట్లో మీ గొంతు వినిపించేందుకు నేను ఎదురుచూస్తున్నా. నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా తల్లి సోనియా, భర్త రాబర్ట్, రత్నాల్లాంటి పిల్లలు రైహాన్, మిరాయా... మీరు నాకు ఇచ్చిన ప్రేమ, ధైర్యానికి ఏ కృతజ్ఞతా సరిపోదు. నా సోదరుడు రాహుల్.. నువ్వు అందరికంటే ధైర్యవంతుడివి. నాకు దారి చూపినందుకు, ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు’’అని ప్రియాంక వ్యాఖ్యానించారు. తన విజయం కోసం కృషిచేసిన యూడీఎఫ్ కూటమి నేతలు, కాంగ్రెస్ నేతలు, వలంటీర్లకు రుణపడి ఉన్నానని ప్రియాంక అన్నారు. ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ వయనాడ్‌లో 74 శాతంగా నమోదైన పోలింగ్ ఈసారి నవంబర్ ఉప ఎన్నికల్లో 65 శాతానికి తగ్గింది. ప్రియాంకతో పోటీపడిన సత్యన్ మోకెరికి 2,11,407 ఓట్లు, బీజేపీ నాయకురాలు నవ్యా హరిదాస్‌కు కేవలం 1,09,939 ఓట్లు పడ్డాయి. నిఖార్సయిన నేత సోదరుడితో కలిసి ప్రచారవేదికల్లో సరదాగా సంభాషించినా, తండ్రి మరణం, తల్లి నిర్వేదంపై మనసుకు హత్తుకునేలా మాట్లాడి, ప్రజాసమస్యలపై గళమెత్తి తనలోని నిఖార్సయిన రాజకీయనేత పార్శా్యలను అద్భుతంగా ఆవిష్కరించి ఓటర్ల మనసును చూరగొన్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ 99 సీట్లు సాధించడంలో ప్రియాంక కృషి కూడా ఉంది. ‘‘ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తేమోగానీ రాజకీయాలకు కొత్తకాదు’’అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెగ ప్రాచుర్యం పొందాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 2019 జనవరిలో ఉత్తరప్రదేశ్ తూర్పు రీజియన్ ఎన్నికల ప్రచారబాధ్యతలను మోశారు. మొత్తం రాష్ట్రానికి జనరల్ సెక్రటరీ(ఇన్చార్జ్)గానూ పనిచేశారు. 1972 జనవరి 12న జని్మంచిన ప్రియాంక ఢిల్లీలోని మోడర్న్ స్కూల్, కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీ పాఠశాలల్లో చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సైకాలజీలో డిగ్ర పట్టా పొందారు. బుద్దుని బోధనలపై పీజీ చేశారు. My dearest sisters and brothers of Wayanad, I am overwhelmed with gratitude for the trust you have placed in me. I will make sure that over time, you truly feel this victory has been your victory and the person you chose to represent you understands your hopes and dreams and…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 23, 2024ఎట్టకేలకు లోక్‌సభకు పార్టీ ప్రచారకర్త నుంచి పార్లమెంట్‌దాకా 52 ఏళ్ల ప్రియాంక స్ఫూర్తిదాయక ప్రస్థానం కొనసాగించారు. టీనేజర్‌గా ఉన్నపుడు తండ్రి ప్రధాని హోదాలో పార్లమెంట్లో ప్రసంగిస్తున్నపుడు పార్లమెంట్లో తొలిసారిగా అడుగుపెట్టిన ప్రియాంక ఇప్పుడు తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌తో కలిసి పార్లమెంట్ మెట్లు ఎక్కబోతున్నారు. యూపీఏ ప్రభుత్వాల హయాంలో కాంగ్రెస్ హవా కొనసాగినా ప్రియాంక ఏనాడూ తేరగా పదవులు తీసుకోలేదు. ప్రజాస్వామ్యయుతంగా ఓటర్ల మెప్పుపొందాకే రాజ్యాంగబద్ధ హోదాకు అర్హురాలినని ఆనాడే చెప్పారు. అందుకే దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాసరే ఏనాడూ పదవులు తీసుకోలేదు. నెహ్రూ–గాంధీ కుటుంబం నుంచి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన 10వ సభ్యురాలుగా ప్రియాంక నిలిచారు. ఆమె కంటే ముందు వారి కుటుంబం నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాం«దీ, ఫిరోజ్ గాం«దీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాం«దీ, సోనియా గాం«దీ, మేనకా గాం«దీ, రాహుల్ గాం«దీ, వరుణ్ గాంధీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో అధికారంలోలేని ప్రస్తుత తరుణంలో సోదరుడు రాహుల్‌తో కలసి పార్లమెంట్ వేదికగా ప్రజా గొంతుకను బలంగా వినిపించాల్సిన తరుణం వచ్చింది. -
దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ఇందిరా గాంధీపై విమర్శలు: భట్టి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ స్థాయిలో భారత్‌ను నిలబెట్టడంతో దివంగత మాజీ ప్రధాని ఇంధిరా గాంధీ పాత్ర కీలకపాత్ర పోషించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ ప్రాణాలు విడిచారని తెలిపారు. మంగళవారం భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఇందిరా గాంధీపై నెగెటివ్‌గా సినిమాలు తీసే వారికి కౌంటర్ ఇచ్చారు.దేశ సమగ్రతపై అవగాహన లేని వారు కావాలని సినిమాలు చేస్తున్నారరని మండిపడ్డారు. గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారని, గతం గురించి తెలిసిన వారు ఆమెకు చేతులు ఎత్తి నమస్కరిస్తారని తెలిపారు. దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నారు..దేశాభిమానం లేనివారే ఇందిరా గాంధీపై విమర్శలు చేస్తున్నారని, ఉద్దేశ్యపూర్వకంగా ఆమెనె నెగెటీవ్‌గా చూపిస్తున్నారని అన్నారు. మాజీ ప్రధానిపై తప్పుడు ప్రచారం చేస్తూ దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. దేశం కోసం ప్రాణాలను తృణపాయంగా వదిలేసిన గొప్ప చరిత్ర ఇందిరా కుటుంబానిదని అన్నారు.‘ఇందిరమ్మ స్ఫూర్తితో మహిళలకు పథకాలు అందిస్తున్నాం. అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఆర్టీసీలో ఉచిత రవాణా కోసం నెలకు రూ. 400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇందిరమ్మ ఆశయ స్పూర్తితో ఇందిరమ్మ రుణాలు ఇవ్వబోతున్నాం.తెలంగాణ వైపు దేశం చూపు..బలహీన వర్గాల కోసమే సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరికీ వనరులు అందజేయడానికే ఈ సర్వేచేస్తున్నాం. యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూస్తోంది. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు సమానంగా అందాలనేది సర్వే ఉద్దేశ్యం. భూములు కోల్పోయే వారిని అన్ని రకాలు ఆదుకుంటాం. అందరికీ నచ్చ చెప్పే పరిశ్రమలకు భూమి తీసుకుంటాం. కొద్దిమంది రాజకీయ నేతలు కుట్రలతో అమాయకులను రెచ్చగొడుతున్నారు,యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత కాంగ్రెస్‌ది..బీజేపీ నేతలు ఊహల్లో బతుకుతున్నారు. దేశాన్ని విభజించి రాజకీయంగా లబ్ధి పొందే కుట్రపన్నుతున్నారు. బీజేపీ చెప్పిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? పేదల అకౌంట్లో 15 వేలు వేస్తామని మోసం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత కాంగ్రెస్‌ది. జాబ్ క్యాలెండర్, యూపీఎస్ సీ తరహాలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని తెలిపారు. -
అరశతాబ్ది కిందే విత్తులు చల్లిన నాయకత్వం
‘ఈ స్పృహ ఈనాటిది కాదు. దీనికి యాభయ్యేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. మానవకారక కాలుష్యాల వల్ల ముంచుకొస్తున్న ముప్పు పర్యావరణ మార్పు దుష్ఫలితాలను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సహాయం చేయాలన్నది ఒప్పందం. అంతే తప్ప, ఆ పేరుతో పెట్టుబడుల్ని సాయంగా చూపి వ్యాపారం చేయడం కాదని ఇవాళ మనం నిర్దిష్టంగా డిమాండ్ చేస్తున్నాం. పదమూడేళ్ల కింద (2011 కోపెన్‌హాగెన్) మీరే అంగీకరించి, సంసిద్ధత ప్రకటించినట్టు ఏటా ఇవ్వాల్సిన లక్ష కోట్ల డాలర్ల పర్యావరణ ఆర్థిక సహాయాన్ని మీ మీ వ్యాపారాల వృద్ధికి బంగారు బాట చేసుకోకండి’ అని తాజాగా భారత్ స్పష్టం చేసింది. అజర్‌బైజాన్‌లోని ‘బాకు’లో ‘కాప్–29’ సదస్సు జరుగుతున్న సందర్భంలో భారత్ ఈ ప్రకటన వెలువరించింది. ఇవాళ 140 కోట్ల మానవ వనరుల శక్తిగా, మార్కెట్ ప్రపంచానికి గమ్యస్థానంగా ఉన్న భారత్, శాసించాల్సిన చోట నామమాత్రపు పాత్రకే పరిమితమౌతోంది. కారణం, పర్యావరణ స్పృహ, దూరదృష్టి, ప్రపంచ దృక్పథం కలిగిన నాయకత్వం లేకపోవడమేనన్నది కొట్టొచ్చినట్టు కనిపించే వాస్తవం. యాభై ఏళ్ల కింద, నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ చూపిన పర్యావరణ దృక్పథం, చేసిన ఆలోచనలు కాలం కన్నా ఎంతో ముందున్నాయి. తదుపరి అయిదారు దశాబ్దాల్లో అభివృద్ధి– పర్యావరణ పరిరక్షణ మధ్య తలెత్తబోయే ఘర్షణను గుర్తించారు. ఇదే విషయమై సంపన్న–పేద దేశాల మధ్య బంధాలకు సరికొత్త నిర్వచనాల అవసరాన్ని ఆమె సహేతుకంగా అంచనా వేశారు. అభివృద్ధి పేరిట ప్రకృతి వనరులను అవసరాలకూ, దామాషాకూ మించి కొల్లగొట్టడాన్ని పర్యావరణ నేరంగానే చూశారామె! విఘాతం కలిగించిన వారే మూల్యం/ నష్టపరిహారం చెల్లించాలన్న ఆలోచనకు ఆమె నాడే బీజం వేశారు. భారతదేశపు పర్యావరణ దృక్పథానికి, భావధారకు మూలాలు 1971–72 నాటి పాలకుల ఆలోచనల్లో, కేంద్ర ప్రభుత్వ చర్యల్లో కనిపిస్తాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న వివిధ నిర్ణయాలు, చేపట్టిన పలు చర్యలు దీన్ని ధ్రువీకరిస్తాయి. స్వీడన్ వినతి మేరకు ఐక్యరాజ్యసమితి చొరవతో మొదటి ప్రపంచ పర్యావరణ సదస్సు స్టాక్‌హోమ్‌లో 1972 జూన్‌లో జరిగింది. కానీ, అంతకు ముందే 1972 ఫిబ్రవరిలోనే ‘పర్యావరణ ప్రణాళిక–సమన్వయ జాతీయ కమిటీ’ (ఎన్సీఈపీసీ) భారత్‌లో ఏర్పాటయింది. దీని ఏర్పాటుకు ఇంది రాగాంధీ చొరవ కారణం. ఆ కమిటీయే 1985లో కేంద్ర ‘పర్యావరణ అటవీ మంత్రిత్వ’ శాఖగా రూపాంతరం చెందింది. 1971 డిసెంబరులో ఆమె సిమ్లాలో ఉన్నారు. పాక్‌తో యుద్ధం, బంగ్లాదేశ్ అవతరణ తర్వాతి పరిణామాల్లో... పాకిస్తాన్ ప్రధాన మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోతో ఆమె దౌత్య చర్చలు జరుపుతున్నారు. అంతటి ఒత్తిడిలోనూ, సిమ్లా నుంచే ఆమె బిహార్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అభివృద్ధి పేరుతో చేపట్టిన ఒక ప్రాజెక్టుకు అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం బదలాయిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందనీ, అది పర్యావరణానికి హాని చేసే తప్పుడు చర్య అవుతుంది కనుక ఉపసంహరించుకోవాలనీ ఆ లేఖలో పేర్కొన్నారు.దక్షిణ ప్రపంచానికి గొంతిచ్చిన వైనంస్టాక్హోమ్ పర్యావరణ వేదికను ఇందిరాగాంధీ ఎంతో వ్యూహాత్మకంగా, ప్రభావవంతంగా వాడుకున్నారు. అక్కడ ఆమె ఒక అరుదైన ఆలోచనాత్మకమైన ప్రసంగం చేశారు. ఆతిథ్య స్వీడన్ కాకుండా ఆమె ఒక్కరే దేశాధినేత హోదాలో ‘ప్లీనరీ ప్రసంగం’ చేశారు. ‘ఆ సదస్సు తర్వాత పదేళ్లకు పైగా ఆ ఊపు ఆమెలో కనిపించింది. దాని ఫలితంగానే, ఇప్పటికీ దేశంలో గొప్ప రక్షణాయుధాలుగా ఉన్న పలు ప్రగతిశీల అటవీ, వన్యప్రాణి–సహజవనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఆ కాలంలోనే వచ్చాయ’ని ఆమె సమకాలికులైన ప్రభుత్వాధికారులు ఆయా సందర్భాల్లో వ్యాఖ్యానించేవారు. స్వల్ప జనాభా ఉన్న సంపన్న దేశాలు సౌఖ్యాలకు మరిగి, అసాధారణ స్థాయిలో ప్రకృతి సహజ వనరుల్ని కొల్లగొడుతూ చేస్తున్న పర్యావరణ హానిని ఆమె సోదాహరణంగా ఎండ గట్టారు. అభివృద్ధి–పర్యావరణ ఘర్షణను విడమర్చారు. కాలుష్య నివారణ కోసం విధించే కట్టుబాట్లు వెనుకబడ్డ దేశాల ప్రగతికి ప్రతిబంధకం అయ్యే తీరును ఎత్తిచూపడమే కాక ‘కాలుష్య కారకులే నష్టాల మూల్యం చెల్లించాల’నే వాదనను తెరపైకి తెచ్చి, మూడో ప్రపంచ దేశాల గొంతుకయ్యారు. ‘పర్యావరణ వాదననే మనం నెత్తికెత్తుకుంటే... యుద్ధం, పేదరికం వంటి సంక్షోభాలు అప్రాధాన్యమవుతాయేమో?’ అంటూ సదస్సు చైర్మన్‌గా ఉన్న యూఎన్ ప్రతినిధి మౌరిస్ స్ట్రాంగ్ వ్యక్తం చేసిన భయాన్ని ఆమె తిప్పికొట్టారు. ‘ప్రకృతి పరిరక్షణ’ అనేది అభివృద్ధి–పేదరిక నిర్మూలన బాధ్యతకు వ్యతిరేకం కాదనీ, అదే వారి జీవనప్రమాణాల వృద్ధికి దోహదపడుతుందనీ ఆమె అదే వేదిక నుంచి స్పష్టం చేశారు. సంపద, హోదా, అధికార పరంగా మనమెంత బలిష్టులమైనా, పర్యావరణ మార్పు విపరిణామాలకు ప్రభావితులం కాకుండా తప్పించు కోజాలమని ఆనాడే హెచ్చరించారు.పర్యావరణ స్పృహగల వారిప్పుడు వాడుతున్న ‘ఒకే పృథ్వి’ ‘జీవులున్న ఏకైక గ్రహం’ వంటి మాటల్ని ఇందిరా గాంధీ 70లలోనే వినియోగించారు. ‘ప్రపంచం ఏ మూల నుంచో తరచూ సమాచారం అందుతోంది, దేశం వెనుక దేశం అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసానికి తెగిస్తోంది, ఇలా సాగితే దీనికి ముగింపేమిటి?’ అని ఆమె ప్రశ్నించారు. సాటి మనుషుల్ని రక్షించడం, దోషుల్ని శిక్షించడమే కాదు, సకల జీవుల పట్ల కరుణతో ఉండాలని బుద్ధుడు, అశోకుడు 2 వేల ఏళ్ల కింద ఏర్పరచిన బాట, భారతీయ సంస్కృతిని ఆమె స్టాక్‌హోమ్ వేదిక నుంచి జగతికి వినిపించారు. అతి పురాతనమైన రుగ్వేదాన్ని ఉటంకిస్తూ ఇందిరాగాంధీ ఆనాడు స్టాక్‌హోమ్‌లో చెప్పిన ‘ప్రకృతి నుంచి తీసుకున్నంత, తిరిగి వెనక్కి ఇవ్వటం మానవ ధర్మం’ అన్న మాట, మనమంతా ఆచరించాల్సిన అక్షరసత్యం!- దిలీప్ రెడ్డి పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్(నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి) -
ఇందిరా గాంధీ తిరిగొచ్చినా ఆర్టికల్ 370 పునురుద్దరించబోం: అమిత్ షా
కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత ఇందిరా గాంధీ స్వర్గం నుంచి తిరిగొచ్చినా.. ఆర్టికల్ 370 పునరుద్దరించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. పదేళ్ల సోనియా గాంధీ-మన్మోహన్ సింగ్ పాలనలో ఉగ్రవాదులు సులభంగా జమ్ముకశ్మీర్‌లో ప్రవేశించి బాంబు దాడులకు పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌ను సందర్శించిన సందర్భంగా తాను భయపడ్డానని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై షా స్పందిస్తూ.. షిండే జీ, మీ మనవళ్లతో కలిసి ఇప్పుడు కాశ్మీర్‌కు వెళ్లండి, మీకు ఎటువంటి హాని జరగదు’ అని అన్నారు.కాగా జమ్ముకశ్మీర్‌లో ఇటీవల ఏర్పడిన ఓమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ ప్రభుత్వం.. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ను పునరుద్దరించాలని అసెంబ్లీలో తీర్మాణాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన మరో ర్యాలీలో కేంద్రమంత్రి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాహుల్ గాంధీ నాల్గో తరం కూడా కాశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేరని అన్నారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ చాలా కృషి చేశారని షా అన్నారు. -
ఆ రోజు ఏం జరిగిందంటే...
కొన్ని నిర్ణయాలు చరిత్ర గతినే మారుస్తాయి. స్వర్ణ దేవాలయంపై ‘ఆపరేషన్ బ్లూస్టార్’ పేర సైనిక చర్య జర పాలనే నిర్ణయం ఇందుకొక నిదర్శనం. 1984 జూన్‌లో పంజాబ్ స్వర్ణ దేవాలయంలో మకాం చేసుకున్న సిక్కు తీవ్రవాదులను బయటికి రప్పించడానికి మరో మార్గం లేక ప్రధాని ఇందిరాగాంధీ (67) భారత సైన్యాన్ని పంపాల్సి వచ్చింది. దీనికి దేశం పెద్ద మూల్యమే చెల్లించుకుంది. ఊహించని ఆ చర్యతో సిక్కు తీవ్రవాదం ఓ విధంగా సద్దుమణిగింది. కానీ, ఆ తర్వాత ఐరన్ లేడీగా పేరొందిన ఇందిరాజీ, జవసత్వాలు ఉడిగిన అబలగా ప్రవర్తించారని అంటారు. ప్రభుత్వ కార్యభారాలు చాల వరకు తగ్గించుకుని ఆమె, ప్రధాని నివాసం... 1, సఫ్దర్ జంగ్ రోడ్డుకే పరి మితం అయ్యారు. రాత్రి పూట ఆమెకు ఏవో పీడ కలలు కూడా వచ్చేవట. తన కుటుంబ సభ్యులను ఏవో శక్తులు కిడ్నాప్ చేస్తాయని తెలీని ఆందోళన ఆమెలో ఆవహించ సాగింది. వీలు దొరికితే సామాన్య మహిళలా, రాత్రి కొడుకు, కోడలు, మనవడు (రాహుల్), మనవరాలు (ప్రియాంక)తో కలిసి డిన్నర్ చేయటానికి ఉవ్విళ్ళూరేవారట. 12 ఏళ్ల ప్రియాంకతో, పెద్దయాక, తను వాడే పట్టుచీరలు ధరించి రాయ బరేలి, ఆమేథి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లా లని, నవ్వుతూ అనేదట (వింత కోరికలు!).‘ఆపరేషన్ బ్లూ స్టార్’కు నిరసనగా సిక్కు సమాజం కాంగ్రెస్ పార్టీకి, ఇందిరా ప్రభుత్వానికి దూరమయింది. ఇందిరా భక్తుడు, ప్రముఖ పాత్రి కేయుడు ఖుష్వంత్ సింగ్ రాజ్యసభ సీటుకు రాజీనామా చేసి ప్రభుత్వం ఇచ్చిన పద్మ భూషణ్ అవార్డును వాపస్ చేశారు. అప్పటి పరిస్థితుల దరిమిలా ఇంటెలిజెన్స్, దర్యాప్తు సంస్థలు ప్రధానిని కొంతకాలం సిక్కు యువతకు దూరంగా ఉండాలని తేల్చాయి. సెక్యులర్ దేశానికి ప్రధానిగా ఉండి అలా చేయడం బావోదని, తన నివాసంలో ఉన్న ఇద్దరు సిక్కు సెక్యూ రిటీ యువకులను మార్చనీయలేదు ఇందిర. 22 ఏళ్ల సెక్యూరిటీ కానిస్టేబుల్ సత్వంత్ సింగ్‌ను చూపిస్తూ ఒకసారి... ‘ఈ బహదూర్ నౌ జవాన్ పర్యవేక్షణలో నాకు ఏ ప్రాణహాని లేదని’ కూడా ధీమా వ్యక్తం చేశారు. ఆశ్చర్యం! వారంలోపే అదే యువకుని తుపాకి తూటాలకు ఆమె బలైపోయారు.1984 అక్టోబర్ 31 బుధ వారం ప్రొద్దుట రాహుల్, ప్రియాంకలను స్కూలుకెళ్ళే ముందు నానమ్మ ఇందిర, దగ్గరకి తీసుకుని గట్టిగా వాటేసుకుంది. ఏదో ఉద్వేగ పూరిత అనుభూతి ఆమెతో అలా చేయించింది. ఆ తర్వాత 9 గంటలకు, ముదురు ఆవరంగు కాటన్ శారీలో వడి వడిగా అడుగు లేస్తూ, ప్రక్కనే ఉన్న 1, అక్బరు రోడ్డులోని పార్టీ ఆఫీసు వైపు నడుస్తున్నా రామె. ఆమె వెంట పర్సనల్ స్టాఫ్ నారాయణ్ సింగ్ ఆమెకు ఎండ తగులకుండా గొడుగు పడుతూ పోతున్నాడు. అతని వెనకాలే ‘మేడం మేన్ ఫ్రైడే’గా పేరొందిన పీఏ... ఆర్కే థావన్ కూడా నడుస్తున్నాడు. బ్రిటన్ యాక్టర్ పీటర్ ఉస్తినోవ్, ఐరిష్ టీవీ యూనిట్‌తో ప్రధానిని ఇంటర్వ్యూ షూటింగ్ కోసం అక్కడ ఎదిరి చూస్తూ, రిస్ట్ వాచి చూసుకున్నాడు. సరిగ్గా 9.10 గంటలు. మేడం పది నిమిషాలు లేటు, ఎందుకో అని అనుకుంటుండగానే, అటు వైపు గన్ ఫైరింగ్ సౌండ్! ప్రధాని సెక్యూరిటీ స్టాఫ్ సబ్ ఇన్స్పెక్టర్ బియాంత్ సింగ్... వెళ్తున్న ప్రధానికి ఎదురెళ్లి శాల్యూట్ చేస్తూనే, సర్వీస్ రివాల్వర్ తీసి ఆమెను షూట్ చేశాడు. ఈ హఠాత్ పరిణామానికి జడుసుకుని నారాయణ్ సింగ్ గొడుగును గాలిలో వదలి ‘బచావ్’ అంటూ కేక లేశాడు. అంతలోనే, అటు సత్వంత్ సింగ్ స్టెర్లింగ్ సబ్ మెషిన్ గన్ నుండి 30 బుల్లెట్లు మేడం శరీరంలో కెళ్ళాయి. క్షణాల్లో రక్త ప్రవాహంతో నేల కొరిగింది ఇందిర. గత కొద్ది రోజులుగా పొంచి ఉన్న మృత్యువు హుటాహుటిన ఆమెను అలా తీసుకెళ్ళింది. రక్తం చుక్కల డైలాగ్...క్రితం రోజే (అక్టోబరు 30) సాయంత్రం, భువ నేశ్వర్ (ఒరిస్సా) అసెంబ్లీ ఆవ రణలో జరిగిన బహిరంగ సమా వేశంలో ఇందిరాజీ ప్రసంగిస్తూ, ‘... మై ఆజ్ యహన్ హూ. కల్ శాయద్ యహాన్ న రహూ. ముఝే చింతా నహి. జబ్ మై మరూంగీతో, మేరీ ఖూన్ కా ఏక్ ఏక్ బూంద్ భారత్ కో మజ్బూత్ కర్నేమే లగేగా’ (ఇవ్వాళ నేను ఇక్కడ ఉన్నాను. బహుశా రేపు ఇక్కడ లేకపోవచ్చు. నాకు బెంగ లేదు. నేను ఒకవేళ చనిపోతే, నా ప్రతీ రక్తం చుక్క దేశ పటిష్ఠతకు తోడ్పడుతుంది) అని అన్నారు. ఆవేశపూరితమైన ఈ రక్తం చుక్కల డైలాగు, ఆమెతో మృత్యు దేవతే పలికించిందని అప్పటి కాంగ్రెస్ నాయకులు చెప్పుకోసాగారు. ఇందిర హత్యానంతరం రాజధాని డిల్లీలో చెలరేగిన మత ఘర్షణల్లో 3 వేల మంది సిక్కులు చనిపోయారని ఖుష్వంత్ సింగ్ ఒక వ్యాసంలో పేర్కొన్నారు. జిల్లా గోవర్ధన్ (రషీద్ కిద్వాయి రాసిన ‘24, అక్బర్ రోడ్ ’ ఆధారం)వ్యాసకర్త మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబై (రేపు ఇందిరా గాంధీ హత్యకు గురైన రోజు) -
ఎట్టకేలకు ప్రియాంక బరిలోకి : ఇందిర వారసత్వాన్ని నిలుపుకుంటుందా?
కాంగ్రెస్ శ్రేణుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. తమ ప్రియతమ నేత ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న కోరిక నెరవేరబోతోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. కొన్నేళ్లుగా, తన సోదరుడు రాహుల్ గాంధీకి అండగా ఉంటూ పరోక్షంగా కీలక పాత్ర పోషించిన ప్రియాంక ఇక గాంధీ వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్ ప్రచారానికి బాధ్యత వహించిన, రాజకీయాల్లోకి అధికారిక ప్రవేశించినప్పటికీ ఎన్నికల సమరంలోకి దూకడం మాత్రం ఇదే ప్రథమం. రాహుల్ గాంధీ విజయం సాధించి (రెండు చోట్ల గెల్చిన సందర్భంగా ఇక్కడ రాజీనామా చేయాల్సి వచ్చింది) కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. పలువురు కాంగ్రెస్ పెద్ద సమక్షంలో బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ గురించి కొన్ని అంశాలను పరిశీలిద్దాం.రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ ప్రియాంక గాంధీ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె. ఆమె ముత్తాత దివంగత జవహర్ లాల్ నెహ్రూ , దేశానికి స్వాతంత్ర ఉద్యమ నేత. దేశ తొలి ప్రధానమంత్రి. ప్రియాంక నానమ్మ ఇందిరాగాంధీ , తండ్రి రాజీవ్ గాంధీ ఇద్దరూ నెహ్రూ అడుగుజాడల్లో నడిచినవారే. ఇద్దరూ ప్రధానమంత్రులుగా దేశానికి సేవ చేసిన వారే. అంతేకాదు ఇద్దరూ పీఎంలుగా పదవిలో ఉన్నపుడే హత్యకు గురయ్యారు. 1984లో కేవలం 12 సంవత్సరాల వయస్సులో, నానమ్మ ఇందిర అంగరక్షకులచే హత్యకు గురి కావడాన్ని చూసింది., రాహుల్ గాంధీకి 14 ఏళ్లు. ఆ దుఃఖంనుంచి తేరుకోకముందే ఏడేళ్లకు తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో జరిగిన ఆత్మాహుతి దాడిలో తండ్రి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని పొగొట్టుకుంది. అప్పటికి ప్రియాంకకు కేవలం 19 ఏళ్లు. అంత చిన్న వయసులోనే తల్లికి, సోదరుడుకి అండగా నిలబడింది. ఆ సమయంలోనే ఇందిర గాంధీ పోలికలను పుణికి పుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తుందని అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు రాజకీయ పండితులు భావించారు. కానీ అనూహ్యంగా సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలను పుచ్చుకున్నారు. ఇక ప్రియాంక 25 సంవత్సరాల వయస్సులో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాతో పెళ్లి తరువాత రాజకీయాలకు చాలా దూరంగా ఉంది. బిడ్డల పెంపకంలో నిమగ్నమైంది.అయితే 1990ల చివరి నాటికి, కాంగ్రెస్ కష్టాలు మొదలైనాయి. ప్రియాంక రంగంలోకి దిగినప్పటికీ ఆమె పాత్ర తెరవెనుకకు మాత్రమే పరిమితమైంది. సోదరుడు రాహుల్‌కు మద్దతు ఇస్తూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ పరోక్షంగా రాహుల్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సమయంలో ఆమె ప్రదర్శించిన రాజకీయ నైపుణ్యం, ప్రజలతోసులువుగా మమేకం కావడం సీనియర్ నాయకులను, ప్రజలను ఆకట్టుకుంది. స్టార్ క్యాంపెయినర్‌గా నిలిచింది. బ్యాక్‌రూమ్ వ్యూహకర్తగా, ట్రబుల్షూటర్గా, కాంగ్రెస్‌కు టాలిస్ మాన్‌గా పేరు తెచ్చుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చురుగ్గా పాల్గొంది. దీంతో ముఖ్యంగా పేద ప్రజలతో ఆమెలో అలనాటి ఇందిరమ్మను చూశారు.అంతేకాదు సామాజిక సమస్యలు, ఉద్యమాల పట్ల ఆమె స్పందించిన తీరు, చూపించిన పరిణితి ప్రశంసలు దక్కించుకుంది. ముఖ్యంగా 2008లో, ఆమె తన తండ్రి ,రాజీవ్ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినిని జైలులో కలుసుకోవడం, ఆమెతో సంభాషించడం విశేషంగా నిలిచింది. అలాగే ఇటీవలి ఎన్నికల్లో మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొని రాయబరేలీలో సోదరుడు రాహుల్‌ని, అప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కిషోరీ లాల్ శర్మను గెలిపించి అమేథీని దక్కించుకుని పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేసింది. 2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి. చివరికి ఇన్నాళ్లకు కేరళనుంచి ఎన్నికల సమరంలోకి దిగింది ప్రియాంక గాంధీ వాద్రా. అనేక సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య దేశాన్ని ఏలి శక్తివంతమైన మహిళగా ఖ్యాతికెక్కిన ఇందిదా గాంధీ వారసత్వాన్ని నిలుబెట్టుకుందా? ప్రజల ఆదరణను నోచుకుంటుందా? బహుళ ప్రజాదరణ నేతగా ఎదుగుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ప్రియాంక చదువు,కుటుంబం1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ.మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రియాంక గాంధీ, భర్త రాబర్ట్ వాద్రాపై మనీ లాండరింగ్, వివాదాస్పద భూముల కొనుగోళ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలని వాద్రా ఖండిచారు. అలాగే ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, గాంధీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేందుకు ఉద్దేశించినవని పార్టీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. -
ఆర్ధికమంత్రి లేకపోతే బడ్జెట్ ఎవరు సమర్పిస్తారు.. మీకు తెలుసా?
బడ్జెట్ అనేది ఎప్పుడైనా ఆర్ధిక మంత్రులే ప్రవేశపెడతారని అందరూ అనుకుంటారు. ఆర్థిక మంత్రులు అందుబాటులో లేకుంటే?.. ఈ ప్రశ్న బహుశా ఎవరికైనా వచ్చి ఉంటే.. సమాధానం కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ప్రశ్నకు జవాబు ఈ కథనంలో తెలుసుకోండి.బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన ఆర్థిక మంత్రి రాజీనామా చేస్తే.. లేదా ఇతరత్రా కారణాల వల్ల అందుబాటులో లేకుంటే.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ప్రధానమంత్రులు స్వీకరిస్తారు. ముంద్రా కుంభకోణంలో అవినీతి, అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 1958 ఫిబ్రవరి 22న అప్పటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి తన పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి రాజీనామాతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే బాధ్యత అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై పడింది.1958లో ప్రధానమంత్రిగా.. విదేశీ వ్యవహారాలు & అణు ఇంధన శాఖలను నిర్వహిస్తున్న నెహ్రూ ఆర్థిక మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించడానికి ఆ సమయంలో బాధ్యత వహించి 1958 ఫిబ్రవరి 28 బడ్జెట్ సమార్పించారు. ఆర్థిక మంత్రి కాకుండా ప్రధానమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం అదే మొదటిసారి.నెహ్రూ తర్వాత.. మొరార్జీ దేశాయ్ భారత ప్రధానిగా ఉన్న సమయంలో 1967-68 నుంచి 1969-70 వరకు ప్రతి సంవత్సరం బడ్జెట్లను, అలాగే 1967-68 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. మాజీ ప్రధాని 1959 నుంచి 1969 వరకు మొత్తం 10 బడ్జెట్లను సమర్పించారు.1970లో దేశాయ్ రాజీనామా చేసిన తర్వాత, ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తన పదవీకాలంలో రెండుసార్లు బడ్జెట్‌ను సమర్పించారు. ఆమె బడ్జెట్లు పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు మరియు బ్యాంకుల జాతీయీకరణపై దృష్టి సారించాయి. 1987లో వీపీ సింగ్ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత రాజీవ్ గాంధీ 1987-89లో బడ్జెట్‌ను సమర్పించారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ కూడా 1991లో ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను సమర్పించారు.ఇదీ చదవండి: 'ఇన్కమ్ ట్యాక్స్' ఎలా వచ్చింది.. భారత్ మొదటి బడ్జెట్ గురించి తెలుసా?ఇకపోతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. ఇది BJP నేతృత్వంలోని NDA ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత సమర్పిస్తున్న మొదటి బడ్జెట్. జూలై 22 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సెషన్ ఆగస్టు 12తో ముగియనుంది. -
ఎమర్జెన్సీ తప్పేనని నాడు ఇందిరనే ఒప్పుకున్నారు: చిదంబరం
ఢిల్లీ: దేశంలో ప్రస్తుతం 1975 నాటి ఎమర్జెన్సీపైనే ప్రత్యేకంగా రాజకీయంగా చర్చ జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ విధించడం పొరపాటని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా అంగీకరించారని చిదంబరం చెప్పుకొచ్చారు.కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ చిదంబరం తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘దేశంలో నేడు ఎన్నో సమస్యలు ఉన్నాయి. గతాన్ని బీజేపీ మర్చిపోవాలి. ఇవాళ దేశంలో నివసిస్తున్న 75 శాతం ప్రజలు 1975 తర్వాత పుట్టినవారే ఉన్నారు. 50 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీ గురించి ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం లేదు కాదా?. గతం నుంచి పాఠాలు నేర్చుకుంటే సరిపోతుంది. అయినా, ఎమర్జెన్సీ విధించడం పొరపాటు అని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కూడా అంగీకరించారు’ అని గుర్తు చేశారు.ఇదిలా ఉండగా.. కేంద్రం జూలై 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించడంపై అంతకుముందు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిరోజూ ‘రాజ్యాంగ హత్య’కు పాల్పడుతోందన్నారు. దేశంలోని పేదలు, అణగారిన ప్రజల ఆత్మగౌరవాన్ని దోచుకుంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. సీనియర్ నేత జైరాం రమేష్.. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఫలితాలు విడుదలైన రోజును(జూన్ 4)ను మోదీ ముక్తీ దివస్‌గా జరుపుకోవాలని సూచించారు. -
ఇందిరా గాంధీ మమ్మల్ని జైల్లోకి నెట్టారు.. కానీ: ఎమర్జెన్సీపై లాలూ యాదవ్
రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఎమర్జెన్సీపై శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యయిక స్థితి సమయంలో తాము ఎదుర్కొన్న అనుభవాలను లాలూ గుర్తు చేసుకున్నారు. ఇందిరా గాంధీ అనేకమంది నాయకులను కటకటాల వెనక్కి నెట్టారు.. కానీ, ఎప్పుడూ ఎవరిని హింసించలేదని పేర్కొన్నారు.ఈ మేరకు లాలూ, జర్నలిస్ట్ నలిన్ వర్మ రాసిన "ది సంఘ్ సైలెన్స్ ఇన్ 1975" ఆర్టికల్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. ఇందులో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 1975 దేశ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అయినప్పటికీ 2024లోనూ ప్రతిపక్షాలను ప్రభుత్వం గౌరవించడం లేదనే విషయాన్ని మరిచిపోకూడదన్నారు."అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జయప్రకాష్ నారాయణ్ ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీకి నేను కన్వీనర్‌గా ఉన్నాను. నేను 15 నెలలకు పైగా భద్రతా చట్టం (మిసా) కింద జైలులో ఉన్నాను. ఈ రోజు ఎమర్జెన్సీ, స్వేచ్ఛ విలువ ఉపన్యాసాలు ఇస్తున్న మోదీ, జేపీ నడ్డా, ఇతర బీజేపీ మంత్రుల గురించి నాకు, నా సహచరులకు తెలియదు. వారి గురించి మేము అసలు వినలేదు.ఇందిరా గాంధీ మనలో చాలా మందిని కటకటాల వెనక్కి నెట్టారు. కానీ ఆమె మమ్మల్ని ఎప్పుడూ దుర్భాషలాడలేదు. ఆమె లేదా మంత్రులు మమ్మల్ని జాతీ వ్యతిరేకులు, దేశభక్తి లేనివారని ఎప్పుడూ పిలవలేదు. మన రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతిని అపవిత్రం చేయడానికి ఆమె ఎప్పుడూ విధ్వంసకారులను అనుమతించలేదు. 1975 మన ప్రజాస్వామ్యానికి మచ్చ. కానీ 2024లోనూ ప్రతిపక్షాలను బీజేపీ గౌరవించడం లేదని విషయాన్ని మరచిపోకూడదు. ”అని లాలూ పేర్కొన్నారు.కాగా జూన్ 25, 1975న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 21 నెలల అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ కాలాన్ని భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పద కాలాల్లో ఒకటిగా పరిగణిస్తారు. అయితే ఎమర్జెన్సీ విధించి జూన్ 26కు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ 'ఎమర్జెన్సీ' విధించడాన్ని విమర్శించారు. రాష్ట్రపతి వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేతలు ఖండించారు. -
Parliament Special Session: కాక రేపిన ఎమర్జెన్సీ తీర్మానం
న్యూఢిల్లీ: స్పీకర్‌గా బాధ్యతలు చేపడుతూనే బుధవారం బిర్లా తీసుకున్న తొట్ట తొలి నిర్ణయమే లోక్‌సభలో కాక రేపింది. విపక్షాల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి తీవ్ర నిరసనలకు, వ్యతిరేకతకు దారి తీసింది. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని ఖండిస్తూ స్పీకర్ సభలో స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టారు! ‘‘భారత్ ఎప్పుడూ ప్రజాస్వామిక విలువలకు పెద్దపీట వేసింది. అలాంటి దేశంలో ఇందిర 50 ఏళ్ల క్రితం ఇదే రోజున ఎమర్జెన్సీ విధించారు. ప్రజాస్వామిక విలువలపై, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపారు. విపక్ష నేతలను జైళ్లలో కుక్కారు. రాజ్యాంగంపై నేరుగా దాడి చేశారు. ఎమర్జెన్సీ విధించిన 1975 జూన్ 26 దేశ చరిత్రలో ఎన్నటికీ చెరగని మచ్చగా మిగిలిపోతుంది’’ అంటూ తీర్మానాన్ని చదవి విన్పించారు. ఇందిర తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘ఎమర్జెన్సీ కాలంలో ప్రజలపై ఇందిర సర్కారు చెప్పలేనన్ని అకృత్యాలకు పాల్పడింది. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఎమర్జెన్సీ బాధితుందరికీ 18వ లోక్‌సభ సంతాపం తెలుపుతోంది. ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తోంది’’ అన్నారు. ఎమర్జెన్సీకి నిరసనగా నిమిషం పాటు మౌనం పాటించాలని సభ్యులను కోరారు. ఎన్డీఏ సభ్యులంతా నిలబడి మౌనం పాటించగా విపక్షాలన్నీ స్పీకర్ తీరును తీవ్రంగా ఖండించాయి. ఎమర్జెన్సీ ప్రస్తావనను నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దాంతో స్పీకర్‌గా తొలి రోజే సభను బిర్లా వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం విపక్షాల నిరసనలకు ప్రతిగా బీజేపీ సభ్యులంతా పార్లమెంటు ప్రాంగణంలో ప్రదర్శనకు దిగారు. ఎమర్జెన్సీ విధింపుపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ తీరు ప్రశంసనీయం: మోదీ ఎమర్జెన్సీని స్పీకర్ గట్టిగా ఖండించడం హర్షణీయమని మోదీ అన్నారు. ‘‘ఇందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఎమర్జెన్సీ వేళ జరిగిన అకృత్యాలను స్పీకర్ తన తీర్మానంలో ఎత్తి చూపారు. రాజ్యాంగాన్ని తోసిరాజంటే, ప్రజాభిప్రాయాన్ని అణగదొక్కితే, వ్యవస్థలను నాశనం చేస్తే ఏమవుతుందో చెప్పేందుకు ఇందిర తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం ఒక చక్కని ఉదాహరణ’’ అని ఎక్స్‌లో ప్రధాని పేర్కొన్నారు. -
నాటి ఎమర్జెన్సీని తలపించేలా ఏపీలో నియంత పాలన
-
ట్రెండింగ్‌లోకి ఎమర్జెన్సీ.. 50 ఏళ్లు పూర్తి (ఫొటోలు)
-
పదేళ్లపాటు మోదీ అప్రకటిత ఎమర్జెన్సీ
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. అప్పట్లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ప్రకటించి అమలుచేస్తే, గత పదేళ్లలో నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ ప్రకటించకుండానే అమలు చేశారని విమర్శించారు. మోదీ విధించిన అప్రకటిత అత్యవసర పరిస్థితికి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ముగింపు పలికారని పేర్కొన్నారు. ఈ మేరకు ఖర్గే సోమవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని వెల్లడించారు. ఎన్నికల్లో నైతికంగా ఓడిపోయినప్పటికీ మోదీలో అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదని మండిపడ్డారు. పరీక్ష పేపర్లు లీక్ కావడంతో యువత నష్టపోయారని, ప్రధాని మోదీ కనీసం సానుభూతి తెలపడం లేదని తప్పుపట్టారు. బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదంపై మాట్లాడడం లేదని ఆక్షేపించారు. -
విశాఖ జూకు గుజరాత్ వన్యప్రాణులు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కుకు కొద్ది రోజుల్లో గుజరాత్ రాష్ట్రం నుంచి మరికొన్ని కొత్త వన్యప్రాణులు రానున్నాయి. వీటి కోసం జూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని ఇక్కడకు తీసుకురావడానికి జూ అథారిటీ ఆఫ్ ఇండియా(సీజెడ్ఏ) నుంచి అనుమతులు లభించాయి. కొన్నాళ్లుగా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు ఇతర జూ పార్కుల నుంచి జంతు మార్పిడి విధానం ద్వారా కొత్త జంతువులు, అరుదైన పక్షులను తీసుకువస్తున్నారు.రెండు నెలల కిందట కోల్‌కతా రాష్ట్రం అలీపూర్ జూ పార్కు నుంచి జంతు మార్పిడి విధానం ద్వారా జత జిరాఫీలు, ఏషియన్ వాటర్ మానిటర్ లిజర్డ్స్, స్కార్లెట్ మకావ్స్ ఇక్కడకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయా వన్యప్రాణులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. మరికొన్ని వన్యప్రాణులను గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి ఒకటి, రెండు వారాల్లో ఇక్కడకు తీసుకురానున్నారు. వాటి కోసం జూలో ఒక్కో జాతి జంతువులు, పక్షులు వేర్వేరుగా ఎన్క్లోజర్లు కూడా సిద్ధం చేశారు. ఆయా వన్యప్రాణులు చేరితే విశాఖ జూకి మరింత కొత్తదనం లభించనుంది. కొత్తగా రానున్నవి ఇవే.. గ్రీన్ వింగ్డ్ మెకావ్ రెండు జతలు, స్కార్లెట్ మెకావ్స్ రెండు జతలు, మిలటరీ మెకావ్స్ రెండు జతలు, మీడియం సల్ఫర్ క్రెస్టెడ్ కాక్టూ రెండు జతలు, స్క్వైరల్ మంకీస్ రెండు జతలు, కామన్ మార్మోసెట్స్ రెండు జతలు, మీర్కాట్ ఒక జత, రెడ్ నెక్డ్ వాల్లబీ ఒక జత కొత్తగా ఇక్కడకు తీసుకురానున్నారు.ప్రత్యేక ఎన్క్లోజర్లు సిద్ధంవిశాఖ జూకు కొత్త వన్యప్రాణులు రానున్నాయి. గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి వాటిని తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్త వన్యప్రాణుల కోసం ప్రత్యేకంగా ఎన్క్లోజర్లు సిద్ధం చేశాం. –డి.మంగమ్మ, జూ క్యూరేటర్(ఎఫ్ఏసీ), ఇందిరాగాంధీ జూ పార్కు, విశాఖపట్నం -
తను.. గూంగీ గుడియా కాదు.. ఉక్కు మహిళ!
బొట్టు, గాజులు, పువ్వులు.. భారతీయ స్త్రీకి అలంకారంగానే చూస్తున్నారు! వాటి చుట్టూ ఆర్థిక, సామాజిక భద్రత చట్రాన్ని బిగించి మహిళను బందీ చేశారు! అయితే స్వాతంత్య్రానికి పూర్వమే బుద్ధిజీవులు ఆ కుట్రను పసిగట్టారు. అలంకారం స్త్రీ హక్కు.. అది ఆత్మవిశ్వాసానికి ప్రతీక.. ఆ ఆత్మవిశ్వాసమే ఆమె ఆర్థిక, సామాజిక సాధికారతకు పునాది అని నినదించారు! వితంతు చదువు, కొలువు, పునర్వివాహం కోసం పోరాడారు. సమాజాన్ని చైతన్యపరచడానికి చాలానే ప్రయత్నించారు. అయినా .. వితంతువుల జీవితాలేం మారలేదు.. సంఘసంస్కర్తల పోరు చిన్న కదలికగానే మిగిలిపోయింది! పురోగమిస్తున్న.. పురోగమించిన సమాజాల్లో ఎన్నో అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి.. చట్టాలు వస్తున్నాయి!కానీ ఆల్రెడీ చట్టాల తయారీ వరకు వెళ్లిన విడో సమస్యల మీద మాత్రం ఆ సమాజాల్లో కనీస అవగాహన కొరవడుతోంది! చర్చలు అటుంచి ఆ పేరు ఎత్తితేనే అపశకునంగా భావించే దుస్థితి కనపడుతోంది! అందుకే యూఎన్ఓ ‘ఇంటర్నేషనల్ విడోస్ డే’ను నిర్వహించడం మొదలుపెట్టింది.. ఏటా జూన్ 23న. ఆ రకంగానైనా ప్రపంచ దేశాలు విడో సమస్యలను పట్టించుకుని వాళ్ల రక్షణ, సంరక్షణ బాధ్యతను సీరియస్‌గా తీసుకుంటాయని.. ప్రజలూ వాళ్లను సమదృష్టితో చూసే పెద్దమనసును అలవరచుకుంటారని! ఆ సందర్భాన్నే ఈ వారం కవర్ స్టోరీగా మలిచాం!మోదీ 3.0 కేబినేట్లో అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి పొందిన వ్యక్తిగా రక్షా ఖడ్సే రికార్డులోకి ఎక్కారు. ఆ ఘనత ఆమెకు గాలివాటంగా రాలేదు. దాని వెనుక పెద్ద కథే ఉంది. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన రక్షా భర్త, ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అనివార్యంగా రక్షా ఖడ్సే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. వరుసగా మూడుసార్లు మహరాష్ట్రలోని రావేర్ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. భర్త తరఫు కుటుంబం నుంచి సహకారం అందడంతో ఆమె రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. అయితే అందరికీ రక్షా ఖడ్సేలా çకుటుంబం నుంచి, సమాజం నుంచి సహాయ సహకారాలు అందడం లేదనడానికి ఒక ఉదాహరణ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇటీవల కనిపించింది.తెలుగు రాష్ట్రాల్లోని ఓ గ్రామంలో కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంచాయతీ ముదిరింది. ఒత్తిడి తట్టుకోలేక ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడి తరఫు బంధువులు ఆస్తి పంపకం విషయంలో మృతుడి భార్య తరఫువారు వెనక్కి తగ్గితేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఈ ప్రతిపాదనకు అవతలి వారు ఒప్పుకోలేదు. ఫలితంగా మూడు రోజులైనా దహన సంస్కారాలు జరగలేదు. చివరకు మృతుడి కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గడంతో మూడు రోజుల తర్వాత అంత్యక్రియల ప్రక్రియ ముందుకు సాగింది. ఓవైపు భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మహిళ అదే సమయంలో తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. లేదంటే తనకు, తన పిల్లలకు ఈ సమాజం నుంచి ఎంతమేరకు మద్దతు లభిస్తుందనేది ప్రశ్నార్థకమే! ఆనాటి నుంచి ఈనాటి వరకు భర్తను కోల్పోయి ఒంటరైన మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలపై జరగాల్సినంత చర్చ జరగడం లేదు.మధ్యయుగాల్లో..భర్త చనిపోతే అతని చితిపైనే బతికున్న భార్యకు కూడా నిప్పంటించే సతీ సహగమనం అనే అమానవీయ ఆచారాలను రూపుమాపే ప్రయత్నాలు బ్రిటిష్ జమానాలోనే మొదలయ్యాయి. భర్త చనిపోయిన స్త్రీలకు గుండు చేసి, తెల్ల చీరలు కట్టించి, ఇంటి పట్టునే ఉంచే దురాచారాన్ని పోగొట్టేందుకు రాజా రామమోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారు అలుపెరగని పోరాటం చేశారు. వీరి కృషి ఫలితంగా ఈరోజు సతీసహగమనం కనుమరుగైంది. తెల్లచీర, శిరోముండన పద్ధతులూ దాదాపుగా కనుమరుగయ్యాయి. అంతగా కాకపోయినా పునర్వివాహాల ఉనికీ కనపడుతోంది. అయితే ఇంతటితో భర్తను కోల్పోయిన మహిళల జీవితాల్లో వెలుగు వచ్చేసిందా? వారి కష్టాలన్నీ తీరిపోయాయా? అని ప్రశ్నించుకుంటే కాదనే సమాధానమే స్ఫురిస్తుంది. భర్తపోయిన స్త్రీలకు కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు మన దగ్గరే కాదు చాలా దేశాల్లో కనిపిస్తున్నాయి.ప్రస్తుత ప్రపంచ జనాభాను దాదాపు ఎనిమిది వందల కోట్లకు అటూ ఇటూగా పరిగణిస్తే అందులో వితంతువుల సంఖ్య 25 కోట్లకు పైమాటే! సమాజంలో అందరికంటే అత్యంత నిరాదరణ, అవమానాలు, కనీస మద్దతు వంటివీ కరువైనవారిలో వితంతువులే ముందు వరుసలో ఉన్నారు. జాతి, మతం, కులం, వర్గంతో సంబంధం లేకుండా భర్తను కోల్పోయిన స్త్రీకి సమాజం నుంచి కనీస నైతిక మద్దతు కూడా లభించకపోగా అవమానాలు, అవాంతరాలు ఎదురవుతున్నాయి. సమాజం పుట్టుక నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ జాతి వివక్ష, లింగ వివక్ష, కుల వివక్ష, ఆర్థిక అంతరాల మీద జరుగుతున్నంత చర్చ వితంతు సమస్యల మీద జరగడం లేదు. విపత్తులు, యుద్ధాలు, మహమ్మారులు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నప్పుడు ఈ సమస్య పెరుగుతోంది. కరోనా, రష్యా– ఉక్రెయిన్, ఇజ్రాయేల్– పాలస్తీనా యుద్ధాల నేపథ్యంలోనూ వితంతువుల సమస్యలను ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది.గూంగీ గుడియా..మన దేశ తొలి మహిళా ప్రధాని, ఉక్కు మహిళగా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులరాలైన ఇందిరా గాంధీ తన 43వ ఏట భర్త (ఫిరోజ్ గాంధీ)ను కోల్పోయారు. ఆ తర్వాత రెండేళ్లకు తండ్రి జవహర్ మరణంతో ఆమె రాజకీయ ప్రవేశం అనివార్యమైంది. ఇందిరా రాజకీయ జీవితం తొలినాళ్లలో సోషలిస్ట్ నేత రామ్మనోహర్ లోహియా ఆమెను గూంగీ గుడియా (మూగ బొమ్మ)గా అభివర్ణించేవారు. తర్వాత ఆమె తీసుకున్న బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి నిర్ణయాలు, చేపట్టిన ప్రజాదరణ పథకాలు, గరీబీ హఠావో వంటి నినాదాలతో పాటు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి నాంది పలకడం వంటి సాహసాలతో ఆమె గూంగీ గుడియా కాదు ఐరన్ లేడీ అనే ప్రతిష్ఠను సాధించింది. అప్పటిదాకా వితంతువు దేశానికి అపశకునం అని నిందించిన నోళ్లే ఆమె రాజకీయ చతురతను చూసి దుర్గాదేవిగా కీర్తించటం మొదలుపెట్టాయి. ఆ తరానికి చెందిన ఎంతోమంది తమ పిల్లలకు ఇందిరా ప్రియదర్శిని అనే పేరు పెట్టుకునేలా ప్రేరణను పంచారు ఆమె. ఆఖరికి ఇందిరా సమాధిని శక్తిస్థల్గా పిలిచే స్ఫూర్తిని చాటారు.కరోనాతో మరోసారి..రెండు ప్రపంచ యుద్ధాల సందర్భంగా ఈ ప్రపంచం గతంలో ఎన్నడూ చూడనంతగా వితంతు సమస్యను ఎదుర్కొంది. ఆ గాయాల నుంచి బయటపడే సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదం పెచ్చరిల్లింది. మరోవైపు సామ్రాజ్యవాదం నాటిన విషబీజాల కారణంగా ఆర్థికంగా, రాజకీయంగా బలహీనంగా ఉన్న దేశాల్లో అంతర్యుద్ధాలు గడిచిన రెండు దశాబ్దాల్లో పెరిగాయి. వెరసి ఆయుధాల నుంచి తూటాలు దూసుకువస్తున్నాయి. ఆకాశం నుంచి జారిపడే బాంబుల గర్జన పెరిగింది. ఫలితంగా ఎందరో మృత్యువాత పడుతున్నారు. వీటి వల్ల అనూహ్యంగా వితంతువుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం వీరి సంఖ్య .. ఇరాక్, అఫ్గానిస్తాన్, పాలస్తీనా వంటి ఆసియా దేశాలతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోనూ అధికంగా ఉంది. యుద్ధాలు, అంతర్యుద్ధాలకు తోడు కరోనా వైరస్ ఒకటి. అది సృష్టించిన భయోత్పాతానికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. రోజుల తరబడి స్తంభించిపోయాయి. 2020, 2021లలో లక్షలాది మంది జనం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలో అధికారిక లెక్కల ప్రకారమే నాలుగున్న లక్షల మంది కరోనాతో చనిపోయారు. అనధికారికంగా ఈ సంఖ్య మరో పది రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అంచనా. కరోనా చేసిన గాయాల కారణంగా మనదేశంలోనూ వితంతువుల సంఖ్య పెరిగింది.మరిన్ని రూపాల్లో.. యుద్ధాలు, విపత్తులు, మహమ్మారుల రూపంలోనే కాకుండా ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు, రైతుల ఆత్మహత్యలు వంటివీ మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వితంతువుల సంఖ్య పెరగడానికి కారణాలవుతున్నాయి. కష్టనష్టాలకు ఓర్చి సాగు చేసిన రైతులు అప్పుల పాలవుతున్నారు. మార్కెట్ స్థితిగతులపై అవగాహన లేకపోవడం, కరువు, అధిక వడ్డీలు, ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం వంటి కారణాల వల్ల ఏ ఏటికి ఆ ఏడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరకు అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. అప్పటికే అప్పుల పాలైన సదరు రైతు కుటుంబం, ఆ రైతు జీవిత భాగస్వామి అలవికాని కష్టాల్లో మునిగిపోయుంటోంది. మరోవైపు వెనుకబడిన ప్రాంతాల్లో మద్యం ప్రాణాలను కబళిస్తోంది. తాగుడు అలవాటైన వ్యక్తులు అందులోనే జోగుతూ కుటుంబాలను అప్పుల్లోకి నెడుతూ అనారోగ్యంపాలై చనిపోతున్నారు. ఆఖరికి ఆ కుటుంబం చిక్కుల్లో పడుతోంది. అందులో అత్యంత వేదనను భరిస్తోంది సదరు మృతుడి జీవిత భాగస్వామే!అత్యంత సంపన్న మహిళ..33.50 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళాగా గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్ కూడా ఒంటరి మహిళే! తన ¿¶ ర్త.. జిందాల్ గ్రూప్ ఫౌండరైన ఓంప్రకాశ్ జిందాల్ మరణం తర్వాత.. స్టీల్, పవర్, సిమెంటుకు చెందిన జిందాల్ గ్రూప్ వ్యాపార సంస్థలకు చైర్పర్సన్ గా ఆ గ్రూప్ వ్యాపార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.సమస్యల వలయం..హఠాత్తుగా భర్తను కోల్పోవడం స్త్రీ జీవితంలో అతి పెద్ద కుదుపు. అప్పటి వరకు తనతో జీవితాన్ని పంచుకున్న వ్యక్తితో ఉండే అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఒక్కసారిగా దూరం అవుతాయి. దీంతో మానసిక తోడును ఒక్కసారిగా కోల్పోతారు. ఆ స్థితిని అర్థం చేసుకుని మానసికంగా తమను తాము కూడగట్టుకోక ముందే ఆచారాలు, సంప్రదాయాలు ఆ స్త్రీ పై తమ దాడిని మొదలెడతాయి. ఆ వెంటనే ఆస్తి పంపకాలు, బాధ్యతల విభజన విషయంలో భర్త తరఫు కుటుంబ సభ్యుల ఒత్తిడి మొదలవుతుంది. కాస్త చదువు, అదిచ్చిన ధైర్యం ఉన్న స్త్రీ అయితే స్వయంగా నిర్ణయం తీసుకుని తనకు, తన పిల్లలకు సురక్షితంగా ఉన్న దారిని ఎంచుకుంటుంది. ఆ రెండూ లేని వితంతువులు భర్త తరఫు కుటుంబం లేదా పుట్టింటి వారి దయాదాక్షిణ్యాలకు తల ఒగ్గుతారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఆ రెండు ఇళ్లలో ఏదో ఒక ఇంటికి స్వచ్ఛంద వెట్టి చాకిరికి కుదిరిపోతారు వారి తుది శ్వాస వరకు. కాలం మారినా ఈ దృశ్యాలు మాత్రం మారలేదు. పై చదువులు, కొలువుల కోసం అమ్మాయిలు ఒంటరిగా విదేశాలకు వెళ్లే పురోగతి ఎంతగా కనిపిస్తోందో.. దేశానికి ఇంకోవైపు భర్తపోయిన ఒంటరి స్త్రీల దయనీయ జీవితపు అధోగతీ అంతే సమంగా దర్శనమిస్తోంది.కుటుంబాల మద్దతు లేకపోయినా, మెరుగైన జీవితం కోసం ధైర్యంగా అడుగు ముందుకు వేసి జీవన పోరాటం మొదలుపెట్టినా.. పొద్దునే ఆమె ఎదురొస్తే సణుక్కుంటూ మొహం తిప్పుకుని వెళ్లడం, శుభకార్యాలకు ఆమెను దూరంగా పెట్టడం, నోములు వ్రతాలకు ఆమెను బహిష్కరించడం, అంతెందుకు దేవుడి గుడిలోనూ అలాంటి అవమానాన్నే పంటి బిగువున భరించాల్సి వస్తోంది ఆమె! వీటన్నిటినీ జయించే శక్తిని కూడదీసుకున్నా, భర్త పోయిన ఆడవాళ్లకు ఇంటా, బయటా ఎదురయ్యే లైంగిక వేధింపుల చిట్టా మరొక కథ. ఇలా విడో అన్నిటికీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిన తీరు అభివృద్ధి చెందుతున్న, చెందిన సమాజాల్లోనూ కామన్ సీన్‌గా ఉందంటే లేశమాత్రం కూడా అతిశయోక్తి లేదు. మరోవైపు వారికి అందాల్సిన ఆర్థిక మద్దతు కరువైన కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆఖరికి యాచకుల్లో కూడా విడోలకు ఆదరణ ఉండదనేది చేదు వాస్తవం. యాచనకు దిగిన వితంతువులను అపశకునంగా భావించి దానం చేసేందుకు నిరాకరించే జనాలు కోకొల్లలు. ఇలా నిరాశ్రయులైన వారికి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తోన్న శరణాలయాలు ప్రధాన దిక్కుగా ఉంటున్నాయి. ఇక్కడ కూడా మానవత్వం లోపించిన వారి నుంచి వితంతువులకు ఇక్కట్లు తప్పడం లేదు.వరల్డ్ విడోస్ డే..ప్రపంచవ్యాప్తంగా వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, వాటి పట్ల అవగాహన కల్పిస్తూ వారికి మద్దతుగా నిలవడానికి ఐక్యరాజ్య సమితి ‘వరల్డ్ విడోస్ డే’ను నిర్వహించాలని 2011లో నిర్ణయించింది. అందుకు జూన్ 23వ తేదీని ఎంచుకుంది. నాటి నుంచి ‘వరల్డ్ విడోస్ డే’ ద్వారా భర్తపోయిన స్త్రీల రక్షణ, సంరక్షణల కోసం ప్రపంచ దేశాలు తమ పరిధిలో చట్టాలను తీసుకురావడానికి కృషి చేస్తోంది. దీంతో పాటు వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సమాజంలోని అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించడం, ఆచారాలు, సంప్రదాయాల పేరిట వారిపై జరుగుతున్న మానసిక, శారీరక దాడుల నుంచి విముక్తి కల్పించడం వంటివి ఐరాస ముఖ్య ఉద్దేశాల్లో కొన్నిగా ఉన్నాయి.మెహినీ గిరి..మన దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం నుంచే వింతతు సమస్య తీవ్రంగా ఉంది. దీనికి ముఖ్య కారణాలు ఆడపిల్లలకు చదువు లేకపోవడం, మూఢవిశ్వాసాలు, కన్యాశుల్కం. ఈ సమస్యను స్వాతంత్య్రానికి పూర్వమే గ్రహించారు రాజా రామమోహన్ రాయ్, జ్యోతిబా పూలే, కందుకూరి విరేశలింగం వంటి సంఘసంస్కర్తలు. అందుకే ఆడపిల్లలు, బాల వితంతువులకు చదువు, స్వావలంబన, వితంతు వివాహాల కోసమూ అంతే పోరాటం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అంబేడ్కర్ సైతం ఈ అంశంపై దృష్టి సారించారు. అయితే వితంతువుల జీవితాల్లో వెలుగు నింపేందుకు శ్రమించిన వారిలో మోహినీ గిరికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తన జీవితంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ సమస్యపై చర్చను సమాజంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఆమె పాటుపడ్డారు. ఆమె చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2007లో ఆమెకు పద్మభూషణ్ సత్కారాన్ని అందజేసింది.వార్ విడోస్ అసోసియేషన్..స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో లక్నో యూనివర్సిటీలో సైన్ ్స డిపార్ట్మెంట్ను ప్రారంభించడంలో మోహిరీ గిరి తండ్రి కీలకమైన పాత్ర పోషించారు. దీంతో యూనివర్సిటీలో మోహినీ గిరి తండ్రికి ఒక పెద్ద బంగ్లాను కేటాయించడంతో పాటు విశేషమైన గౌరవ మర్యాదలనూ ఆ కుటుంబానికి ఇచ్చేవారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే అంటే మోహినీ పదేళ్ల వయసులో ఆమె తండ్రి చనిపోయాడు. దీంతో ఆ యూనివర్సిటీలో ఆమె కుటుంబ పరిస్థితి తారుమారైంది. అప్పటికే ఆమె తల్లికి సంగీతంలో డాక్టరేట్ పట్టా ఉన్నా, యూనివర్సిటీ నుంచి సరైన రీతిలో ప్రోత్సాహం లభించలేదు. పిల్లల పెంపకం కష్టం కావడంతో ఆమె యూనివర్సిటీని వదిలి బయటకు వచ్చారు. ఒంటరి తల్లిగా ఆమెకు ఎదురైన కష్టాలు, తమను పెంచి పెద్ద చేయడంలో ఆమె పడ్డ ఇబ్బందులను మోహినీ దగ్గరగా చూశారు. ఆ తర్వాత ఆమె మాజీ రాష్ట్రపతి వరహాగిరి వెంకటగిరి ఇంటికి కోడలిగా వెళ్లారు. ఆ సమయంలోనే అంటే 1971లో ఇండో–పాక్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్‌కు విముక్తి లభించింది. అయితే ఆ పోరులో ఎందరో జవాన్లు అమరులయ్యారు. వారి భార్యలు తమ జీవిత భాగస్వాములను కోల్పోయి ఒంటరయ్యారు. దీంతో ఆమె 1972లో దేశంలోనే తొలిసారిగా ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ను ప్రారంభించారు.దాడులు..ఆ రోజుల్లో (ఇప్పటికీ చాలా చోట్ల) వితంతువులు బయటి పనులకు వెళ్లడాన్ని అనాచారంగా భావించే వారు. అంతేకాదు రంగురంగుల దుస్తులు ధరించడంపైనా ఆంక్షలు ఉండేవి. జీవితాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రత్యేక నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలు అందుబాటులో ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ ఆధ్వర్యంలో మోహినీ గిరి.. వారణాసి, బృందావన్, పూరి, తిరుపతి వంటి ప్రాంతాల్లో వితంతు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ వారికి ఆశ్రయం కల్పించి ఆ కేంద్రాలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా తీర్చిదిద్దారు. వారి పిల్లలకు చదువులు చెప్పించారు. వీవీ గిరి ప్రభుత్వపరంగా పెద్ద పోస్టుల్లో ఉన్నంత వరకు మోహినీ గిరి చేపట్టిన కార్యక్రమాలన్నింటికీ సహకారం అందించిన సమాజం.. ఆయన పదవుల్లోంచి దిగిపోయిన వెంటనే తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. మోహినీ గిరి.. వితంతువులకు రంగురంగుల దుస్తులు వేసుకోమని ప్రోత్సహిస్తోందంటూ మన తిరుపతిలోనే ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. కోడిగుడ్లు, టొమాటోలు విసిరారు. ఆ దాడులకు ఆమె వెరవలేదు. తన ప్రయాణాన్ని ఆపలేదు. నేటికీ ఆ స్ఫూర్తి కొనసాగుతోంది. ఎందరో బుద్ధిజీవులు మోహినీ గిరి అడుగుజాడల్లో నడుస్తూ వితంతు జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు.వితంతు రక్షణ చట్టాలు..వితంతువులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్రంతో పాటు దేశంలో అనేక రాష్ట్రాలు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇవి కనిష్ఠంగా నెలకు రూ. 300ల నుంచి రూ.3,000ల వరకు ఆయా ప్రభుత్వాల వారీగా అందుతున్నాయి. పెన్షన్ తో పాటుగా వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిం చేందుకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలనూ పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 నుంచి ఇప్పటి వరకు వితంవులు రక్షణ, భద్రత కోసం అనేక చట్టాలను రూపొందించినా, సామాజిక రుగ్మతల కారణంగా చాలా సందర్భాల్లో అవి నిస్తేజమవుతున్నాయి. చట్టాల రూపకల్పన, ప్రత్యేక పథకాల అమలుతో పాటు వివక్ష, సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలు వంటివాటిని దూరం చేసేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకరిపై ఆధారపడే స్థితి నుంచి అద్భుతాలు సాధించే దశకు చేరుకుంటారు. – తాండ్ర కృష్ణ గోవింద్ -
ఇందిరాగాంధీ.. భారతమాత: సురేశ్ గోపీ
త్రిసూర్: ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ తరఫున కేరళ నుంచి గెలిచిన ఏకైక ఎంపీ, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ప్రధాని ఇందిరను ఆయన భారత మాత(మదర్ ఆఫ్ ఇండియా)గాను, కేరళ దివంగత సీఎం కె.కరుణాకరన్‌ను సాహసోపేతుడైన పాలకుడిగాను అభివర్ణించారు. త్రిసూర్ జిల్లా పుంకున్నమ్లో ఉన్న కరుణాకరన్ సమాధి ‘మురళి మందిరం’ను సురేశ్ గోపీ ఇటీవల సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన గురువుకు నివాళులర్పించేందుకే ఇక్కడికి వచ్చానని, దీనిని రాజకీయం చేయొద్దంటూ కోరారు. -
జూలో ఆఫ్రికన్ కోతులు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో అరుదైన కోతి జాతులున్నాయి. ఇటీవల శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులు వీటిని విశాఖ జూ పార్కుకు అప్పగించారు. అప్పటి నుంచి ఆ కోతులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. కొందరు ఒడిశా రాష్ట్రం మీదుగా వేరే చోటకు అనధికారికంగా ఆఫ్రికన్ జాతికి చెందిన రెండు కోతులను తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులకు పట్టుబట్టారు. వీటిని జూకు అప్పగించినట్టు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. వీటిని జూలో కోతుల జోన్లో ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో సందర్శకుల కోసం అందుబాటులో ఉంచామన్నారు. ఈ జాతి కోతులను ‘లోయిస్ట్ మంకీస్’ అని పిలుస్తారన్నారు. ఈ జాతి ఆఫ్రికా ఖండం కాంగో ప్రాంతంలో సంచరిస్తాయన్నారు. ఈ జాతి కోతులు మన దేశంలో ఎక్కడా కనిపించవని తెలిపారు. ఇవి అరుదైన జాతికి చెందినవని తెలిపారు. -
మహామహులకూ తప్పని... ఓటమి
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ప్రజలు ఎప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తారో, ఏ అనామకున్ని అందలమెక్కిస్తారో, ఏ దిగ్గజాన్ని తిరస్కరిస్తారో అనూహ్యం. తిరుగులేదనుకున్న మహామహ నేతలు ఓటమిపాలైన ఉదంతాలు మన దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నో! అలాంటి పది మంది దిగ్గజ నేతల అనూహ్య ఓటమి చరిత్రను ఓసారి చూద్దాం... – సాక్షి, నేషనల్ డెస్క్బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాతగా యావద్దేశానికీ ప్రాతఃస్మరణీయుడు. అంతటి మహా నాయకుడు కూడా ఎన్నికల్లో ఓడతారని ఊహించగలమా?! కానీ 1951–52లో జరిగిన దేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో అంబేడ్కర్ ఓటమి చవిచూడాల్సి వచి్చంది! నార్త్ బాంబే లోక్‌సభ నుంచి పోటీచేసి ఓడిపోవడమే కాదు, ఏకంగా నాలుగో స్థానంలో నిలిచారాయన! ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విఠల్ బాలకృష్ణ గాంధీ గెలుపొందారు. ఇందిరాగాంధీ దేశ రాజకీయాల్లో అజేయ శక్తిగా వెలిగిపోయిన నాయకురాలు. తొలి, ఏకైక మహిళా ప్రధాని. దశాబ్దానికి పైగా తిరుగులేని అధికారం చలాయించిన ఇందిర 1977 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోయారు. ఎమర్జెన్సీ నిర్ణయం ఆమె ఏకైక ఎన్నికల ఓటమికి బాటలు వేసింది. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానంలో సోషలిస్టు పార్టీ ప్రముఖుడు, రాం మనోహర్ లోహియా సన్నిహితుడు రాజ్ నారాయణ్ చేతిలో ఇందిర ఓటమి చవిచూశారు. ఆయన 1971 లోక్‌సభ ఎన్నికల్లో కూడా సంయుక్త సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఇందిరపై పోటీ చేసి ఓడిపోయారు.కానీ ఇందిర అవినీతికి పాల్పడ్డారని, ఆమె ఎన్నిక చెల్లదని కోర్టుకెక్కారు. ఇది అంతిమంగా ఎమర్జెన్సీ విధింపుకు దారి తీయడం విశేషం! రాజ్‌నారాయణ్ వాదనతో అలహాబాద్ హైకోర్టు ఏకీభవించింది. రాయ్‌బరేలీ నుంచి ఇందిర ఎన్నిక చెల్లదని ప్రకటించింది. అంతేగాక ఆరేళ్ల పాటు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించింది. దాంతో చిర్రెత్తుకొచి్చన ఇందిర 1975లో దేశమంతటా ఎమర్జెన్సీ విధించారు. 1977లో ఎమర్జెన్సీ ఎత్తేసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లి రాజ్‌నారాయణ్ చేతిలో 50 వేల పైగా ఓట్ల తేడాతో ఓడారు. ఇది భారత ఎన్నికల చరిత్రలోనే సంచలనాత్మక ఫలితంగా నిలిచిపోయింది.మినూ మసాని మినోచర్ రుస్తోమ్ మసాని. స్వాతంత్య్ర సమరయోధుడు. స్వతంత్ర పార్టీ అగ్ర నేత. మూడుసార్లు పార్లమెంటు సభ్యుడు, ఇండియన్ లిబరల్ గ్రూప్ థింక్ ట్యాంక్ వ్యవస్థాపకుల్లో ఒకరు. సంపాదకుడు, సామాజిక కార్యకర్త. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. అసమానతలకు వ్యతిరేకంగా బలమైన గొంతుక వినిపించిన మసాని 1971 లోక్‌సభ ఎన్నికల్లో రాజ్‌కోట్ నుంచి ఓటమి చవిచూడాల్సి వచి్చంది. కాంగ్రెస్ నాయకుడు ఘన్‌శ్యామ్ బాయ్ ఓజా చేతిలో 60,000 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు.అటల్ బిహారీ వాజ్‌పేయ్ రాజకీయ దురంధరుడు. భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు. అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న ఆయనకూ ఎన్నికల ఓటమి తప్పలేదు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కీలక కాంగ్రేసేతర నేతల్లో వాజ్‌పేయి ఒకరు. గ్వాలియర్‌లో కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా రెండు లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఆయనపై విజయం సాధించారు.సీకే జాఫర్ షరీఫ్ భారత రైల్వేల్లో స్వర్ణ యుగానికి నాంది పలికిన దార్శనికుడు. కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరు. 2004లో తొలిసారి లోక్‌సభ ఎన్నికల ఎన్నికల బరిలో దిగిన హెచ్‌టీ సాంగ్లియానా చేతిలో ఓటమి చవిచూశారు. అప్పటిదాకా డీజీపీగా ఉన్న సాంగ్లియానా బీజేపీ ఆహా్వనం మేరకు పదవీ విరమణ చేసి పారీ్టలో చేరారు. పాత బెంగళూరు ఉత్తర లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగి షరీఫ్‌పై విజయం సాధించారు.దేవెగౌడఅత్యంత అనుభవజు్ఞడైన నాయకుడు. ప్రధానిగా దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. అనంతరం కర్నాటక రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యారు. ఆయనకు కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. 2004లో కర్నాటకలోని కనకపుర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత తేజస్వినీ గౌడ రమేశ్ చేతిలో లక్ష పై చిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.బిజోయ్ కృష్ణ హండిక్ గొప్ప విద్యావేత్త. కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన తిరుగులేని అస్సామీ నేత. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కేపీ తాసా ఆయనపై లక్ష ఓట్ల పై చిలుకు మెజారిటీతో గెలుపొందారు.సోమనాథ్ ఛటర్జీ సీపీఎం దిగ్గజం. పదిసార్లు లోక్‌సభ సభ్యునిగా గెలిచిన ఎదురులేని నేత. 1971లో తొలిసారి సీపీఎం తరఫున పశి్చమబెంగాల్‌లోని బుర్ద్వాన్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1984లో మాత్రం జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానంలో యువ సంచలనం మమతా బెనర్జీ చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత మాత్రం 1989 నుండి 2004 వరకు సోమనాథ్ విజయ పరంపర సాగింది. సీపీఎం కంచుకోటగా భావించే బోల్పూర్ లోక్‌సభ స్థానం నుంచి 2004లో పదోసారి గెలిచి 14వ లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అరుణ్ జైట్లీపారీ్టలకతీతంగా అందరూ మెచ్చిన నేత. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. కేంద్ర ఆర్థిక మంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలిసారి మోదీ హవా కొనసాగిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో అరుణ్ జైట్లీ మాత్రం ఓటమి చవిచూశారు. అమృత్సర్ లోక్‌సభ స్థానం నుంచి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెపె్టన్ అమరిందర్ సింగ్ లక్ష ఓట్ల పై చిలుకు మెజారిటీతో జైట్లీపై గెలుపొందారు. పీవీ నరసింహారావుపాములపర్తి వేంకట నరసింహారావు. ప్రధాని పదవిని అధిష్టించిన తొలి దక్షిణాది వ్యక్తి. ఒకే ఒక్క తెలుగువాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. కుదేలైన దేశ ఆరి్ధక వ్యవస్థను విప్లవాత్మక సంస్కరణలతో పట్టాలెక్కించి ఆధునిక బాట పట్టించిన దార్శనికుడు. అంతటి నాయకునికి కూడా ప్రధాని కాకమునుపు ఓటమి తప్పలేదు. 1984 ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా గెలిచిన రెండు లోక్‌సభ స్థానాల్లో తెలంగాణలోని హన్మకొండ ఒకటి. బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి అక్కడ పీవీపై విజయం సాధించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పై సానుభూతి వెల్లువెత్తినా ఆ పార్టీ తరఫున పోటీ చేసిన పీవీ మాత్రం ఓటమి చవిచూడటం విశేషం. -
1984: రాజీవం
ఇందిర వారసునిగా గద్దెనెక్కిన రాజీవ్ 1984లో జరిగిన 8వ లోక్‌సభ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందుకున్నారు. ఇందిర హత్య తాలూకు సానుభూతి కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చింది. ఏకంగా 404 స్థానాల్లో ఘనవిజయం సాధించి రికార్డు సృష్టించింది. బీజేపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఈ తొలి ఎన్నికలివి. ఆ పార్టీకి భారీగా ఓట్లు పడ్డా సీట్లు మాత్రం రెండే దక్కాయి. అయితే ఈ ఎన్నికల నుంచి కాంగ్రెస్ బలం క్రమంగా తగ్గుతూ పోగా, బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ రావడం విశేషం... అభివృద్ధికి ప్రజామోదం 1984 అక్టోబర్ 31న ఇందిర హత్య యావత్ ప్రపంచాన్నీ షాక్‌కు గురి చేసింది. అదే రోజు సాయంత్రం రాజీవ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినా ఏడో లోక్‌సభ పదవీకాలం ముగుస్తుండడంతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. 1984 డిసెంబర్ 24, 27, 28 తేదీల్లో 514 లోక్‌సభ స్థానాలకే ఎన్నికలు జరిగాయి. ఉగ్రవాదంతో అట్టుడుకుతున్న అసోం, పంజాబ్‌ల్లోని మిగతా స్థానాల్లో 1985లో ఎన్నికలు జరిగాయి. సానుభూతికి తోడు ఇందిర దూరదృష్టితో చేపట్టిన అభివృద్ధి పనులు కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చాయి. హరిత విప్లవంతో పంటల దిగుబడి భారీగా పెరిగింది. రక్షణ, ఆర్థిక రంగాల్లో కీలక నిర్ణయాలను జనం హర్షించారు. ఇందిర హయాంలోని 1980–85 ఆరో పంచవర్ష ప్రణాళికను అత్యంత విజయవంతమైనదిగా చెబుతారు. జీవన వ్యయం పెరిగినా ఆర్థిక వృద్ధి 5.4 శాతానికి చేరింది. వీటన్నింటి ఫలస్వరూపంగా కాంగ్రెస్‌కు ఏకంగా 49.1 శాతం ఓట్లు, 404 సీట్లు దక్కాయి. నెహ్రూ, ఇందిర నాయకత్వంలోనూ ఇన్ని సీట్లు రాలేదు. యూపీలో కాంగ్రెస్ 85కు ఏకంగా 83 సీట్లను గెలుచుకుంది! బెంగాల్ మినహా పెద్ద రాష్ట్రాలన్నింట్లోనూ దుమ్ము రేపినా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎనీ్టఆర్ స్థాపించిన తెలుగుదేశం ధాటికి ఆరింటితోనే సరిపెట్టుకుంది. టీడీపీ ఏకంగా 30 సీట్లు నెగ్గింది. బోఫోర్స్ మరక... రాజీవ్ హయాంలో పలు వివాదాలూ రేగాయి. బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలులో అవినీతి మరక వాటిలో ముఖ్యమైనది. ఈ కాంట్రాక్ట్ కోసం గాను భారత రాజకీయ నాయకులకు బోఫోర్స్ కంపెనీ రూ.820 కోట్ల ముడుపులు చెల్లించినట్టు 1987 మేలో స్వీడిష్ రేడియో స్టేషన్ ప్రసారం చేసిన కథనం సంచలనం రేపింది. బోఫోర్స్ తరఫున మధ్యవర్తిత్వం వహించిన ఒట్టావియో ఖత్రోచికి రాజీవ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అలాగే జాతుల పోరుతో అట్టుడుకుతున్న శ్రీలంకలో శాంతి పేరుతో జోక్యంపైనా రాజీవ్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పేరిట ఆయన పంపిన భారత సైన్యం ఎల్టీటీఈతో నేరుగా యుద్ధానికి దిగింది! ఈ పరిణామం అంతిమంగా రాజీవ్ హత్యకు దారితీసింది. నాడేం జరిగిందంటే..? ఇందిర హత్యకు గురైనప్పుడు రాజీవ్ పశి్చమబెంగాల్లో పర్యటిస్తున్నారు. ఆయనతో పాటున్న కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీకి తొలుత హత్య వార్త ఉదయం 9.30కు తెలిసింది. ఇందిరపై కాల్పులు జరిగాయని మాత్రం రాజీవ్‌కు చెప్పి విమానంలో ఢిల్లీ బయల్దేరదీశారు. కాక్‌పిట్‌లోకి వెళ్లిన రాజీవ్ కాసేపటికి బయటికొచ్చి ‘అమ్మ మరణించింది’ అని ప్రకటించారు. అందరూ మౌనం దాల్చారు. మరిన్ని విశేషాలు... ► బీజేపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఈ తొలి ఎన్నికల్లో పార్టీ 7.74 శాతం ఓట్లు సాధించింది. ► బీజేపీ నెగ్గిన రెండు సీట్లలో ఒకటి హన్మకొండ. అక్కడ బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పీవీ నరసింహారావును ఓడించారు. బీజేపీకి రెండో స్థానం గుజరాత్‌లోని మెహ్సానాలో దక్కింది. ► 1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజీవ్ తీసుకొచ్చారు. ► ఓటు హక్కు వయో పరిమితిని 1988లో 21 ఏళ్ల నుంచి 18కి తగ్గించారు. ► ఎన్నికల్లో ఈవీఎంలు వాడేలా 1988లో చట్ట సవరణ చేశారు. సెబీని ఏర్పాటు చేశారు. ► 1989లో కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీకి తోడు మరో ఇద్దరు కమిషనర్లను నియమించారు. ► విద్య ఆధునికీకరణకు జాతీయ విధానాన్ని ప్రవేశపెట్టారు. నవోదయ విద్యాలయ వ్యవస్థ తెచ్చారు. ► కంప్యూటర్లు, విమానయాన పరిశ్రమ, రక్షణ, రైల్వేల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ► వృద్ధి రేటు పెంపే లక్ష్యంగా కొర్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు అందించారు. ► దేశంలో టెలికం, ఐటీ రంగ అభివృద్ధికి రాజీవే ఆద్యుడని చెబుతారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: మళ్లీ ఇందిర
అంతర్గత కుమ్ములాటలతో కేంద్రంలో తొలి కాంగ్రెసేతర సర్కారుకు మూడేళ్లకే నూరేళ్లు నిండాయి. ఫలితంగా వచ్చిన ఏడో లోక్‌సభ ఎన్నికల్లో ఉల్లి ధరల ఘాటు తదితరాలు జనతా సర్కారు పుట్టి ముంచాయి. మళ్లీ ఇందిరకే ప్రజలు హారతి పట్టారు. కాంగ్రెస్‌లో రెండో చీలికనూ ఇందిర సమర్థంగా ఎదుర్కొని తిరుగులేని ప్రజా నేతగా నిలిచారు. 1984లో అమృత్సర్ స్వర్ణదేవాలయం సంక్షోభం, అనంతర పరిణామాలు ఇందిర దారుణ హత్యకు దారితీయడం, ఆమె వారసునిగా రాజీవ్‌గాంధీ పగ్గాలు చేపట్టడం వంటివి 1980–84 మధ్య చోటుచేసుకున్న పరిణామాలు... ‘జనతా’ బలహీనత ఇందిర విధానాలకు విసిగి కూటమి అయితే కట్టారు గానీ సిద్ధాంతాలపరంగా విపక్ష నేతలు భావ సారూప్యతకు రాలేకపోయారు. ప్రధాని కావాలన్న ఆకాంక్షలు ఇందుకు తోడయ్యాయి. జనతా కూటమి తరఫున ప్రధాని అయిన మొరార్జీ దేశాయ్‌ని చరణ్ సింగ్ (లోక్‌దళ్), బాబూ జగ్జీవన్‌రాం (కాంగ్రెస్ ఫర్ డెమొక్రసీ) తదితర నేతలు తొలినుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చివరికి ఇందిర మద్దతుతో చరణ్‌సింగ్ ప్రధాని అయినా తనపై ఎమర్జెన్సీ నాటి కేసులను ఎత్తేయాలన్న ఇందిర ఒత్తిళ్లకు తలొగ్గలేక 24 రోజుల్లోనే తప్పుకున్నారు. అలా మూడేళ్లకే 1980లో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలొచ్చాయి. ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఐ) అఖండ మెజారిటీతో విజయం సాధించింది. ఏకంగా 353 సీట్లు సాధించింది. 1977 ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో ఇందిరకు ఇది గొప్ప ఘనతే. ఆనియన్ ఎలక్షన్ హామీలను నెరవేర్చడంలో, ధరల పెరుగుదలను అరికట్టడంలో జనతా సర్కారు తీవ్రంగా విఫలమైంది. ముఖ్యంగా ఉల్లి ధరలు కిలో ఏకంగా 6 రూపాయలు దాటేశాయి. దాంతో ఇందిర కూడా ఉల్లినే ప్రధాన ప్రచారాస్త్రం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పత్రికా ప్రకటనల రూపంలోనూ సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టారు. తనను గెలిపిస్తే ధరలను నేలకు దించుతామంటూ అధికారంలోకి వచ్చారు. కానీ ఇందిర హయాంలో 1981లో ఉల్లి ధరలు మరోసారి మోతెక్కడం విశేషం! కాంగ్రెస్‌లో మరో చీలిక 1969లో తొలిసారి రెండుగా చీలిన కాంగ్రెస్ సరిగ్గా పదేళ్లకు 1979లో మళ్లీ రెండు ముక్కలైంది. 1979 జూలైలో నాటి కర్ణాటక సీఎం దేవరాజ్ అర్స్ కాంగ్రెస్‌ను వీడి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (యూ) ఏర్పాటు చేసుకున్నారు. ఇందిర కుమారుడు సంజయ్‌గాంధీ మళ్లీ పార్టీలో కీలకంగా వ్యవహరించడం నచ్చకే దేవరాజ్ వేరుబాట పట్టారు. ఆ పార్టీకి 1980 ఎన్నికల్లో కేవలం 13 స్థానాలు దక్కాయి. ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్–రెక్విజిషన్) కాస్తా కాంగ్రెస్ (ఐ)గా మారింది. ఐ అంటే ఇందిర! విశేషాలు... ఇందిర దారుణహత్య ► 1980 ఎన్నికలైన మూడు నెలలకే చరిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న బీజేపీ ఏర్పాటైంది. ► రాజకీయాల్లో ఇందిరకు చేదోడువాదోడుగా ఉంటున్న చిన్న కుమారుడు సంజయ్‌గాంధీ 1980 జూన్ 23న విమాన ప్రమాదంలో మరణించారు. ► 1981 ఫిబ్రవరి 16న రాజీవ్ రాజకీయ రంగప్రవేశం చేశారు. సంజయ్ ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి ఉప ఎన్నికలో లోక్‌దళ్ అభ్యర్థి శరద్ యాదవ్‌పై 2,37,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ► బింద్రన్‌వాలే సారథ్యంలోని సిక్కు వేర్పాటువాదాన్ని అణచేందుకు అమృత్సర్ స్వర్ణ దేవాలయంపై చేపట్టిన సాయుధ చర్య చివరికి ఇందిరను బలి తీసుకుంది. 1984లో ఆమె తన సిక్కు అంగరక్షకుల చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ► ఇందిర వారసునిగా ప్రధాని పదవి చేపట్టిన రాజీవ్ ఆ వెంటనే ప్రజాతీర్పు కోరి కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత ఘనవిజయం సాధించారు. ఏడో లోక్‌సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 542) పార్టీ స్థానాలు కాంగ్రెస్ 353 జనతా (ఎస్) 43 సీపీఎం 39 జనతా పార్టీ 31 డీఎంకే 16 కాంగ్రెస్(యూ) 13 సీపీఐ 10 ఇతరులు 28 స్వతంత్రులు 9 – సాక్షి, నేషనల్ డెస్క్ -
Janata Party: కేంద్రంలో తొలిసారి కాంగ్రెసేతర సర్కారు
ప్రజల హక్కులను కాలరాస్తే, ప్రజాస్వామ్యా నికి పాతరేస్తే ఏమవుతుందో ఆరో లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాం«దీకి అనుభవంలోకి వచి్చంది. ఇందిరకు, కేంద్రంలో కాంగ్రెస్‌కు తొలి ఓటమి రుచి చూపడమే గాక తొలి కాంగ్రెసేతర సర్కారుకు బాటలు పరిచిన ఎన్నికలుగా అవి చరిత్రలో నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ ముసుగులో ప్రతిపక్షాల నేతలందరినీ జైల్లోకి నెట్టిన ఇందిర వారి చేతుల్లోనే మట్టికరిచారు. జనతా పతాకం కింద ప్రధాన విపక్షాలన్నీ ఒక్కటై ‘ఇందిర హటావో, దేశ్ బచావో’ నినాదంతో కాంగ్రెస్‌ను ఓడించాయి... 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 దాకా 21 నెలల కొనసాగిన ఎమర్జెన్సీ దేశ ప్రజలకు పీడకలగా మారింది. పౌర హక్కులను హరించడం మొదలుకుని తీవ్ర నిర్బంధం అమలైంది. పత్రికా స్వేచ్ఛను కాలరాశారు. మగవాళ్లకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వంటి చేష్టలతో ఇందిర సర్కారు బాగా చెడ్డపేరు తెచ్చుకుంది. మొరార్జీ దేశాయ్ మొదలుకుని జయప్రకాశ్ నారాయణ్ దాకా విపక్ష నేతలంతా జైలుపాలయ్యారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విపక్షాల కార్యకర్తలు ఊచలు లెక్కించారు. ఎమర్జెన్సీ అనంతరం ఏడాది ఆలస్యంగా 1977లో ఇందిర ఎన్నికలకు వెళ్లారు. ఆమెను ఢీ కొట్టేందుకు కమ్యూనిస్టేతర ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. భారతీయ జనసంఘ్, భారతీయ లోక్‌దళ్, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ ఫర్ డెమక్రసీతో పాటు కాంగ్రెస్ (వో) కూడా జేపీ స్థాపించిన జనతా పారీ్టలో కలసిపోయాయి. మొరార్జీ దేశాయ్‌ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. జేపీ ‘ఇందిరా హటావో, దేశ్ బచావో’ నినాదం దుమ్మురేపింది. ఎమర్జెన్సీపై జనాగ్రహం ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది. జనతా పార్టీ 41.32 శాతం ఓట్లతో 295 స్థానాలు సాధించింది. మిత్రపక్షాలతో కలిపి జనతా బలం 330కి చేరింది. 492 స్థానాల్లో పోటీ చేసిన ఇందిర కాంగ్రెస్ (ఆర్) కేవలం 154 స్థానాలతో కుదేలైంది. అంతటి ప్రజా వ్యతిరేకతలోనూ దక్షిణాది 92 స్థానాలతో ఇందిరకు అండగా నిలిచింది. వాటిలో 41 ఆంధ్రప్రదేశ్ చలవే. హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది రెండే సీట్లు! రాయ్‌బరేలీలో ఇందిర ఓటమి చవిచూశారు! ఎమర్జెన్సీ వేళ రాజ్యాంగేతర శక్తిగా మారిన చిన్న కొడుకు సంజయ్‌గాంధీ కూడా అమేథీలో పరాజయం పాలయ్యారు. తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మొరార్జీ దేశాయ్ 1977 మార్చి 24న ప్రమాణం చేశారు. అయితే మూడేళ్లకే సర్కారులో లుకలుకలు మొదలయ్యాయి. నేతలు జనతా పార్టీని వీడడంతో లోక్‌సభలో బలం తగ్గింది. దాంతో మొరార్జీ గద్దె దిగాల్సి వచి్చంది. రాజ్ నారాయణ్... జనతాలో ముసలం ఈ సందర్భంగా రాజ్ నారాయణ్ గురించి తప్పక చెప్పుకోవాలి. 1977 ఎన్నికల్లో రాయ్‌బరేలిలో ఇందిరను ఓడించిన ఈయన తదనంతరం జనతాపారీ్టలో ముసలానికీ కారకుడయ్యారు. జనతాను వీడి జేడీ(ఎస్)ను స్థాపించారు. మొరార్జీ రాజీనామాతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాలంటూ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిని అభ్యరి్థంచారు. కానీ ఇందిరా కాంగ్రెస్ సహకారంతో జనతా పార్టీ నేత చౌధరీ చరణ్‌సింగ్ 1979 జూలై 28న ప్రధాని అయ్యారు. అయితే ఇందిర బ్లాక్మెయిల్ రాజకీయాలకు విసిగి నెలలోపే రాజీనామా చేశారు! విశేషాలు... పెరిగిన ఓటింగ్ ► 1977 లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 60.49 శాతానికి పెరిగింది. ► 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ స్థానాలను 542కు పెంచారు. ► 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. ► ఐదు జాతీయ పార్టీలు, 15 రాష్ట్ర పారీ్టలు, 14 రిజిస్టర్డ్ పారీ్టలు లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొన్నాయి. ► ఎమర్జెన్సీ విధింపు పట్ల ఇందిర ఏనాడు పశ్చాత్తాపడలేదు. మరో దారి లేకపోయిందంటూ సమర్థించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం 1976లోనే ఎన్నికలు జరిపి ఉంటే తానే గెలిచేదాన్నని కూడా ఇందిర అభిప్రాయపడటం విశేషం! ఆరో లోక్‌సభలో పారీ్టల బలాబలాలు (మొత్తం స్థానాలు 542) పారీ్ట స్థానాలు జనతా పారీ్ట 295 కాంగ్రెస్ 154 సీపీఎం 22 అన్నాడీఎంకే 18 ఇతరులు 43 స్వతంత్రులు 10 – సాక్షి, నేషనల్ డెస్క్ -
Indira Gandhi: ముందస్తు ఎమర్జెన్సీ పరాజయం
సొంత పార్టీయే బయటకు పొమ్మంది. అయినా, ఆమె తగ్గలేదు. ఉక్కు సంకల్పంతో పోరాడారు. ప్రజాక్షేత్రంలోనే బలం నిరూపించుకున్నారు. తిరుగులేని ఎత్తులతో ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలోని తస్మదీయులనూ చిత్తు చేశారు. లోక్‌సభను ఏడాది ముందే రద్దు చేసి ప్రజాతీర్పు కోరిన ఇందిరాగాంధీ అనుకున్నది సాధించారు. ఘర్షణకు దిగిన పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పడమే గాక పోఖ్రాన్ అణు పరీక్షతో మన శక్తిని ప్రపంచానికి చాటారు. కానీ దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత చీకటి కోణంగా చెప్పదగ్గ ఎమర్జెన్సీ విధింపు నిర్ణయంతో చెరగని మచ్చ మిగుల్చుకున్నారు. ఇలాంటి ఎన్నో విశేషాలకు 1971–77 ఐదో లోక్‌సభ కాలం సాక్షిగా నిలిచింది... సాక్షి, నేషనల్ డెస్క్: నాలుగో లోక్‌సభను ప్రధాని ఇందిర 1970 డిసెంబర్లో ఏడాది ముందే రద్దు చేయడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్ అప్పటికే రెండుగా చీలింది. ఇందిర తీరు నచ్చని వ్యతిరేక వర్గం సిండికేట్‌గా ఏర్పడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక ఇరు వర్గాల బలపరీక్షకు వేదికైంది. నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా సిండికేట్ ప్రకటించింది. తన విశ్వాసపాత్రుడే ఆ పదవిలో ఉండాలని ఇందిర భావించారు. ఉప రాష్ట్రపతి వి.వి.గిరిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించారు. విప్ జారీ చేయకున్నా, ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చి అనుకున్నది సాధించారు. గిరిని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఇందిర బహిష్కరణ తర్వాత 68 ఎంపీలు కాంగ్రెస్ (ఓ) వైపు నిలిచారు. దాంతో లోక్‌సభలో ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్) బలం 220 మంది ఎంపీలకు పడిపోయింది. డీఎంకే, అకాలీదళ్, లెఫ్ట్, స్వతంత్రుల మద్దతుతో ఆధికారాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఇందిర. నాలుగో లోక్‌సభను ప్రధాని ఇందిర 1970 డిసెంబర్లో ఏడాది ముందే రద్దు చేయడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్ అప్పటికే రెండుగా చీలింది. ఇందిర తీరు నచ్చని వ్యతిరేక వర్గం సిండికేట్‌గా ఏర్పడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక ఇరు వర్గాల బలపరీక్షకు వేదికైంది. నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా సిండికేట్ ప్రకటించింది. తన విశ్వాసపాత్రుడే ఆ పదవిలో ఉండాలని ఇందిర భావించారు. ఉప రాష్ట్రపతి వి.వి.గిరిని స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దించారు. విప్ జారీ చేయకున్నా, ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చి అనుకున్నది సాధించారు. గిరిని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఇందిర బహిష్కరణ తర్వాత 68 ఎంపీలు కాంగ్రెస్ (ఓ) వైపు నిలిచారు. దాంతో లోక్‌సభలో ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్) బలం 220 మంది ఎంపీలకు పడిపోయింది. డీఎంకే, అకాలీదళ్, లెఫ్ట్, స్వతంత్రుల మద్దతుతో ఆధికారాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఇందిర. విపక్షాలు గుంపుగా వచ్చిన... ఇందిరను ఏకాకిని చేసేందుకు భారతీయ జనసంఘ్, స్వతంత్ర, సోషలిస్టు పార్టీలతో కాంగ్రెస్ (ఓ) చేతులు కలిపినా లాభం లేకపోయింది. 238 స్థానాల్లో పోటీ చేసి కాంగ్రెస్ (ఓ) గెలిచింది 16 మాత్రమే. బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణం రద్దు వంటి నిర్ణయాల ప్రాతిపదికన ప్రజామోదం కోరి ఇందిర ఘనవిజయం సాధించారు. అభ్యర్థులను కాకుండా తనను చూసి ఓటేయాలన్న ఆమె పిలుపు బాగా క్లిక్కయింది. అలాగే ‘గరీబీ హటావో, దేశ్ బచావో’ నినాదమూ సూపర్‌హిట్టయింది. ఇందిరా కాంగ్రెస్43.68 శాతం ఓట్లతో ఏకంగా 352 సీట్లు సొంతం చేసుకుంది. ప్రాంతీయ పారీ్టల ఎదుగుదలను మాత్రం ఇందిర అడ్డుకోలేకపోయారు. సీపీఎం 25, సీపీఎం 23, భారతీయ జనసంఘ్ 22 సీట్లు నెగ్గగా స్వతంత్ర పార్టీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. డీఎంకే 23 లోక్‌సభ స్థానాలతో బలమైన ప్రాంతీయ పారీ్టగా నిలదొక్కుకుంది. విశేషాలు... ► ఐదో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ 1971 మార్చి 1 నుంచి 10 మధ్య కేవలం పది రోజుల్లోనే పూర్తయింది. ► 1952 నుంచి లోక్‌సభ, దేశవ్యాప్తంగా అసెంబ్లీలకు జమిలిగా కొనసాగుతూ వస్తున్న ఎన్నికలకు ఇందిర ముందస్తు నిర్ణయంతో తొలిసారి తెర పడింది. ► దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. హరిత విప్లవ ఫలాలు అందివచ్చాయి. ► 1971లో పాక్ మనపై యుద్ధానికి తెగబడింది. తూర్పు పాకిస్తాన్ ప్రజల స్వతంత్ర పోరాటానికి మద్దతుగా భారత బలగాలు బరిలో దిగి 13 రోజుల్లోనే పాక్ పీచమణిచాయి. పాక్ ► ఆర్మీ చీఫ్ జనరల్ నియాజీ ఏకంగా 93,000 మంది సైనికులతో లొంగిపోయారు. ► డిసెంబర్ 16న బంగ్లాదేశ్ అవతరించింది. ► 1974 మే 18న రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో తొలి అణ్వస్త్ర పరీక్షలు విజయవంతంగా జరిగాయి. అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా తర్వాత అణు సామర్థ్యమున్న దేశంగా భారత్ అవతరించింది. చెరగని మరక... ఎమర్జెన్సీ 1975 జూన్ 25. ఎమర్జెన్సీ విధిస్తూ ఇందిర నిర్ణయం తీసుకున్న రోజు. భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే దుర్దినంగా మిగిలిపోయింది. ప్రజల సాధారణ హక్కులనూ కర్కశంగా కాలరాసిన ఈ కఠిన నిర్ణయానికి ఇందిర మొగ్గు చూపడానికి పలు కారణాలు చెబుతుంటారు. వాటిలో ముఖ్యమైంది మాత్రం 1971 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా ఆమె గెలుపు చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచి్చన తీర్పే! అధికార యంత్రాంగాన్ని ఇందిర దుర్వినియోగం చేశారని, అనుమతించిన పరిమితికి మించి ఖర్చు చేశారని ఆమె చేతిలో ఓడిన రాజ్ నారాయణ్ కోర్టుకెక్కారు. ఇందిర ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారంటూ 1975 జూన్ 12న కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆమె ఎన్నికను రద్దు చేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ సిన్హా ప్రకటించారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఏ పదవినీ చేపట్టకుండా నిషేధం విధించారు. ఇందిర సుప్రీంకోర్టుకు వెళ్లగా కొన్ని షరతులతో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ జూన్ 24న తీర్పు వెలువరించింది. మర్నాడే లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో లక్ష మందితో కూడిన ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీని ఉద్దేశించి ఉర్రూతలూగించే ప్రసంగం చేశారు. దాంతో అదే రోజు ఇందిర ఎమర్జెన్సీ విధించారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా వెనక్కు తగ్గలేదు. 1977 మార్చి 21 దాకా ఎమర్జెన్సీ అరాచకాలు కనీవినీ ఎరగని రీతిలో కొనసాగాయి. ఫలితంగా 1977 ఎన్నికల్లో ఇందిర ఘోర ఓటమి చవిచూడటంతో కేంద్రంలో తొలి కాంగ్రెసేతర సర్కారు గద్దెనెక్కింది. -
1966 to 1977: ఇందిరమ్మ శకం
భారత ప్రజాస్వామ్య చరిత్రలో మూడో లోక్‌సభ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ కాలంలోనే దేశం ఇద్దరు ప్రధానులను కోల్పోయింది. రెండు యుద్ధాలనూ చవిచూసింది. నెహ్రూ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తొలి రెండు విడతలతో పోలిస్తే ఎన్నికల నిర్వహణ కాలం మరింత తగ్గి రెండు నెలల్లోనే క్రతువు ముగిసింది. పదేళ్ల పాటు తండ్రి చాటు బిడ్డగా, నెహ్రూ సహాయకురాలిగా పనిచేసిన ఇందిరాగాంధీ 1959లో కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ఆమె నాయకత్వంలోనే పార్టీ 1962 ఎన్నికలకు వెళ్లింది. అనూహ్య పరిణామాలతో 1966లో ఇందిర ప్రధాని అయ్యారు. ద్విసభ్య నియోజకవర్గాలు రద్దయ్యాయి. సి.రాజగోపాలాచారి సారథ్యంలో కొత్త జాతీయ పార్టీ తెరపైకి వచి్చంది. ఇలా ఎన్నో అనూహ్య పరిణామాలు, విశేషాలకు 1962–67 మూడో లోక్‌సభ కాలం వేదికగా నిలిచింది. ఇందిరాగమనం... పదేళ్ల పాలన తర్వాత కూడా దేశంలో బలమైన ప్రతిపక్షమంటూ వేళ్లూనుకోలేదు. ప్రజల మనసుల్లో నెహ్రూ స్థానం చెక్కు చెదరలేదు. 1962 మూడో లోక్‌సభ ఎన్నికల్లో 28 పార్టీలు పోటీ చేశాయి. కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ 60 శాతానికి పైగా సీట్లు కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. 1957 కంటే కేవలం 10 సీట్లు, ఒక శాతం ఓట్లు తగ్గాయి. సీపీఐకి 29, రాజాజీ స్థాపించిన స్వతంత్ర పార్టీకి 18 స్థానాలు దక్కాయి. ప్రజా సోషలిస్ట్ పార్టీ 12, భారతీయ జనసంఘ్ 14 స్థానాలను గెలుచుకున్నాయి. 361 స్థానాలతో కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టి నెహ్రూ మూడోసారి ప్రధాని అయ్యారు. ముందుచూపుతో కుమార్తె ఇందిరను అప్పటికే కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టారు. కానీ ఇందిర తీరు పార్టీలో అన్ని వర్గాలకూ నచ్చలేదు. ఆమె నాయకత్వ పటిమపై అనుమానాలూ రేకేత్తాయి. పలువురు సీనియర్లు బాహాటంగానే వ్యతిరేకత వ్యక్తం చేశారు. పార్టీలో ఇందిర అనుకూల, వ్యతిరేక వర్గాలు ఏర్పడ్డాయి. నెహ్రూ ఉన్నంత కాలం సజావుగానే సాగినా 1964 మే 27న గుండెపోటుతో నెహ్రూ హఠాన్మరణం అనూహ్య మార్పులకు దారి తీసింది. గుల్జారీలాల్ నందా తాత్కాలికంగా 13 రోజులు ప్రధానిగా వ్యవహరించాక 1964 జూన్ 9న లాల్‌బహదూర్ శాస్త్రి గద్దెనెక్కారు. ఆయన దురదృష్టవశాత్తూ 1966 జనవరి 11న ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్లో ఆకస్మిక మరణానికి గురయ్యారు. మరోసారి నందా 13 రోజులు తాత్కాలిక ప్రధానిగా ఉన్నాక ఇందిర రంగప్రవేశం చేశారు. 1966 జనవరి 24న దేశ తొలి, ఏకైక మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికామె యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1959లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఇందిర రాజకీయ కెరీర్ మొదలైంది. అదే ఏడాది నెహ్రూతో విభేదించి సి.రాజగోపాలాచారి స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేశారు. తమిళనాట కొత్తగా ఏర్పడ్డ ద్రవిడ మున్నేట్ర కజగం 1962 లోక్‌సభ ఎన్నికల్లో (డీఎంకే) 2 శాతం ఓట్లతో ఏడు సీట్లు గెలిచింది. చైనా, పాక్‌తో యుద్ధాలు నెహ్రూ మూడోసారి అధికారం చేపట్టిన నెలల వ్యవధిలోనే చైనా దురాక్రమణను ఎదుర్కోవాల్సి వచి్చంది. టిబెట్ బౌద్ధ గురువు దలైలామాకు 1959లో భారత్ ఆశ్రయం కలి్పంచడం దీనికి నేపథ్యమంటారు. చైనా దళాలు లద్దాఖ్‌లో భారత భూభాగాన్ని ఆక్రమించడం 1962 అక్టోబర్ 20న ఘర్షణ మొదలైంది. నవంబర్ 20న చైనా కాల్పుల విరమణ ప్రకటించింది. 5,000 మంది సైనికులు అసువులు బాయడమో, అదృశ్యమవడమో జరిగింది. శాస్త్రి హయాంలో పాక్ మనతో కయ్యానికి కాలు దువి్వంది. భారత్‌లో అశాంతిని రాజేయడానికి ఉగ్రవాదులను దేశంలోకి చొప్పించే ప్రయత్నం యుద్ధానికి దారితీసింది. 1965 ఆగస్ట్ 5 నుంచి సెపె్టంబర్ 23 దాకా సాగిన ఈ యుద్ధంలోనూ 4,000 మంది దాకా సైనికులు అమరులయ్యారు. 1966 జనవరి 10న పాక్‌తో తాషె్కంట్ ఒప్పందం కుదిరింది. కానీ ఆ తర్వాత గంటల వ్యవధిలోనే అక్కడే శాస్త్రి కన్నుమూసిన తీరు మిస్టరీగానే మిగిలింది. గుండెపోటని వార్తలొచి్చనా అసలు కారణం ఇప్పటికీ వెలుగు చూడలేదు. సిరా చుక్కకు నాంది ఓటేశాక వేలిపై సిరా చుక్క పెట్టే విధానాన్ని 1962 ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు. తయారీ కంపెనీ మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ ఎన్నో దేశాలకు ఇంకును ఎగుమతి చేసేది. మూడో లోక్‌సభ కాలంలో ముఖ్య పరిణామాలు ► దేశవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, కమ్యూనికేషన్, పారిశ్రామికాభివృద్ధి తదితర రంగాలపై నెహ్రూ దృష్టి ► దేశంలో పలు ప్రాంతాల్లో స్టీల్ ఫ్యాక్టరీల తదితర చర్యల ద్వారా పారిశ్రామికీకరణకు మరింత ఊతం ► నెహ్రూ ఆకస్మిక మృతి, లాల్‌బహదూర్ శాస్త్రి మిస్టరీ మరణం ► భాషా ప్రాతిపదికన 1960లో మహారాష్ట్ర, గుజరాత్‌గా విడిపోయిన బొంబాయి రాష్ట్రం ► ఆహార కొరతకు విరుగుడుగా హరిత విప్లవం మూడో లోక్‌సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 494) పార్టీ సీట్లు కాంగ్రెస్ 361 సీపీఐ 29 స్వతంత్ర పార్టీ 18 ప్రజా సోషలిస్ట్ పార్టీ 12 భారతీయ జన సంఘ్ 14 ఇతరులు 40 స్వతంత్రులు 20 – సాక్షి, నేషనల్ డెస్క్