1975 జూన్‌ 25.. అప్పుడేం జరిగింది? | June 25, 1975: A former PM Indira Gandhi imposed emergency in India | Sakshi
Sakshi News home page

1975 జూన్‌ 25.. అప్పుడేం జరిగింది?

Published Wed, Jun 26 2019 4:20 AM | Last Updated on Wed, Jun 26 2019 4:21 AM

June 25, 1975: A former PM Indira Gandhi imposed emergency in India - Sakshi

భారతదేశ చరిత్రలో చీకటి రోజు అది. ఒక్క కలం పోటుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన రోజు. సరిగ్గా 44 ఏళ్ల కిందట అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అధికారంకోసం యావత్‌ జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించిన రోజు. అప్పటి ఇందిర ప్రత్యర్థి రాజ్‌ నారాయణ్‌ తరఫున వాదించిన లాయర్లలో ఒకరైన జేపీ గోయెల్‌ అత్యవసర పరిస్థితి ప్రకటించిన రోజు జరిగిన ఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. గోయెల్‌ చెప్పిన ఆ విషయాలను ఆయన కుమార్తె రమా గోయెల్‌ ‘సేవింగ్‌ ఇండియా ఫ్రం ఇందిర’పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు.

అందులోని వివరాల ప్రకారం ఆ రోజు ఏం జరిగిందంటే..  పార్లమెంట్‌ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి గెలుపు సాధించేందుకు ఇందిర అక్రమాలకు పాల్పడ్డారని, ఆమె ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె ప్రధాన ప్రత్యర్థి రాజ్‌ నారాయణ్‌ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. నారాయణ్‌ ఆరోపణలకు తగిన ఆధారాలున్నందున ఇందిర ఎన్నిక చెల్లదంటూ 1975 జూన్‌ 12వ తేదీన అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఇందిర రాజీనామా చేయకుండా హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

జూన్‌ 25వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో జస్టిస్‌ కృష్ణ అయ్యర్‌ తాను ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని బయటకు చదివి వినిపించారు. అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తూనే ఇందిర ప్రధాని పదవిలో ఉండొచ్చని కానీ, తుది తీర్పు వెలువడే వరకు ఆమె ఎంపీగా కొనసాగరాదని స్పష్టం చేశారు.  పార్లమెంట్‌లో ఇందిర మాట్లాడవచ్చు కానీ ఓటు వేసే అధికారం ఆమెకు ఉండదని ఆ తీర్పులో పేర్కొ న్నారు. తీర్పు కాపీతో నేను బయటకు వచ్చేసరికి సుప్రీంకోర్టు ఆవరణ ఒక జనసంద్రంగా మారింది. పత్రికా విలేకరులు, ఇతర లాయర్లందరినీ దాటు కొని చాంబర్‌కు వెళ్లడానికి గంటకు పైగా పట్టింది.

ప్రతిపక్షాల తీర్మానం
చాంబర్‌లోకి వెళ్లిన కాసేపటికే రాజ్‌ నారాయణ్‌ ఆయనకు ఫోన్‌ చేశారు. అలహాబాద్‌ ఉత్తర్వులపై సుప్రీం పూర్తిస్థాయిలో స్టే విధించకపోవడంతో ఇందిర దిగిపోవాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలకు అర్థమయ్యేలా చెప్పాలంటూ అభ్యర్థించారు. అప్పటికే విపక్ష నేతలందరూ మొరార్జీ దేశాయ్‌ నివాసానికి చేరుకున్నారు. నేను అక్కడికి వెళ్లేసరికి జయప్రకాశ్‌ నారాయణ్, మొరార్జీ దేశాయ్‌ కలిసి కూర్చొని కనిపించారు. జస్టిస్‌ కృష్ణ అయ్యర్‌ తన తీర్పులో ఇందిర ప్రధాని పదవిలో ఉండాలని తీర్పు ఇచ్చినప్పటికీ ఆమె దోషి అన్న అర్థం వచ్చేలా రాజకీయ పరమైన ఆస్తులు, ప్రజాస్వామ్య ధర్మాలు వంటివి ప్రస్తావించారు.

దీంతో ఇందిర దిగాల్సిందేనంటూ కాంగ్రెస్‌ (ఒ), భారతీయ లోక్‌దళ్, జన్‌సంఘ్, సోషలిస్టు పార్టీ, అకాలీదళ్‌లతో కూడిన అయిదు పార్టీలు తీర్మానించాయి. అదే రోజు సాయంత్రం జయప్రకాశ్‌ నారాయణ్‌ ఢిల్లీలో రామ్‌లీలా మైదానంలో ప్రసంగించారు. ఇందిర వెంటనే గద్దె దిగకపోతే అయిదు విపక్షాల కో ఆర్డినేషన్‌ కమిటీ సభ్యులందరూ శాంతియుతంగా సత్యాగ్రహానికి దిగుతామని ప్రకటించారు. ఆ సభలో రాజ్‌ నారాయణ్‌ కూడా మాట్లాడారు. సభ ముగిసేసరికి రాత్రి 9.30 గంటలైంది. రాజ్‌ నారాయణ్‌ వాళ్లింటికి రమ్మని కోరడంతో వెళ్లాను. జరగరానిదేదో జరగనుందని అనుమానించిన రాజ్‌.. అక్కడే ఉండాలని కోరడంతో అక్కడే ఉండిపోయా.

క్లైమాక్స్‌ ఎలా మారిందంటే..
నాకింకా నిద్ర పట్టలేదు. అప్పట్లో రాజ్‌ నారాయణ్‌ కార్యదర్శిగా ఊర్మిలేశ్‌ నన్ను లేపారు. ఇంటిని పోలీసులు చుట్టుముట్టారన్నారు. అప్పటికే జయప్రకాశ్‌ నారాయణ్‌ని అరెస్ట్‌ చేశారని సమాచారం అందినట్టు తెలిపారు. నేను హుటాహుటిన రాజ్‌ నారాయణ్‌ గదిలోకి వెళ్లేసరికి పోలీసులు ఆయనను అంతర్గత భద్రతా వ్యవహారాల చట్టం, 1971 (మిసా) కింద అరెస్ట్‌ చేయడానికి సిద్ధమయ్యారు. అప్పుడే మాకు అర్థమైంది ఇందిర రాత్రికి రాత్రి ఎంతకి తెగించారో. అన్నింటికీ సిద్ధపడిన రాజ్‌ నారాయణ్‌ స్నానం చేసి కొన్ని పుస్తకాలు తీసుకువచ్చేవరకు పోలీసులు ఎదురు చూశారు. తర్వాత ఆయనను అరెస్ట్‌చేసి తీసుకువెళ్లిపోయారు.

ది స్టేట్స్‌మన్, హిందూస్తాన్‌ టైమ్స్‌ మరో రెండు పత్రికలు తప్ప మిగతావేవీ మర్నాడు రాలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌352 ప్రకారం అంతర్గత భద్రత ముప్పుగా మారడంతో దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినట్టు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ ఉత్తర్వులే అన్ని పత్రికల్లో ప్రముఖంగా కనిపించాయి. ఆ తర్వాత హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక నా స్పందన కోరితే నేను చెప్పింది ఒక్కటే. ఇది జాతీయ అత్యవసర పరిస్థితి కాదు. తన పదవి కాపాడు కోవడానికి ఇందిర విధించిన వ్యక్తిగత అత్యవసర పరిస్థితి. ఈ దేశంలో ప్రజాస్వామ్యమే నశించింది. అలహాబాద్‌ కోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇందిర పదవి దిగిపోయి ఉంటే హుందాగా ఉండేది.. అని లాయర్‌ జేపీ గోయల్‌ ముక్తాయించారు.

‘ఎమర్జెన్సీ హీరో’లకు ప్రధాని సెల్యూట్‌
న్యూఢిల్లీ: అత్యవసర పరిస్థితిని ఎదురించి, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారికి ప్రధాని మోది నివాళులర్పించారు. నియంతృత్వంపై ప్రజాస్వామ్యం విజయం సాధించిందన్నారు. ‘ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడిన మహనీయులందరికీ దేశం సెల్యూట్‌ చేస్తోంది. నియంతృత్వ విధానాలపై భారత దేశ ప్రజాస్వామ్య విలువలు విజయం సాధించాయి. 1975లో ఇదే రోజు అధికారం కోసం కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. దానికి వ్యతిరేకంగా ఎందరో భారతీయ జన్‌సంఘ్, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ముందుండి పోరాడారు’ అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ చీకటిరోజులుగా మిగిలిపోయాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసిన వారందరికీ నివాళులర్పించారు.

ఐదేళ్లుగా సూపర్‌ ఎమర్జెన్సీ:మమత
అప్పటి ప్రభుత్వం ఇదే రోజు 1975లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి దాదాపు రెండేళ్లు కొనసాగిందనీ, కానీ బీజేపీ ప్రభుత్వం హయాంలో గత ఐదేళ్లుగా దేశంలో సూపర్‌ ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement