రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఎమర్జెన్సీపై శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యయిక స్థితి సమయంలో తాము ఎదుర్కొన్న అనుభవాలను లాలూ గుర్తు చేసుకున్నారు. ఇందిరా గాంధీ అనేకమంది నాయకులను కటకటాల వెనక్కి నెట్టారు.. కానీ, ఎప్పుడూ ఎవరిని హింసించలేదని పేర్కొన్నారు.
ఈ మేరకు లాలూ, జర్నలిస్ట్ నలిన్ వర్మ రాసిన "ది సంఘ్ సైలెన్స్ ఇన్ 1975" ఆర్టికల్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. ఇందులో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 1975 దేశ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అయినప్పటికీ 2024లోనూ ప్రతిపక్షాలను ప్రభుత్వం గౌరవించడం లేదనే విషయాన్ని మరిచిపోకూడదన్నారు.
"అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జయప్రకాష్ నారాయణ్ ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీకి నేను కన్వీనర్‌గా ఉన్నాను. నేను 15 నెలలకు పైగా భద్రతా చట్టం (మిసా) కింద జైలులో ఉన్నాను. ఈ రోజు ఎమర్జెన్సీ, స్వేచ్ఛ విలువ ఉపన్యాసాలు ఇస్తున్న మోదీ, జేపీ నడ్డా, ఇతర బీజేపీ మంత్రుల గురించి నాకు, నా సహచరులకు తెలియదు. వారి గురించి మేము అసలు వినలేదు.
ఇందిరా గాంధీ మనలో చాలా మందిని కటకటాల వెనక్కి నెట్టారు. కానీ ఆమె మమ్మల్ని ఎప్పుడూ దుర్భాషలాడలేదు. ఆమె లేదా మంత్రులు మమ్మల్ని జాతీ వ్యతిరేకులు, దేశభక్తి లేనివారని ఎప్పుడూ పిలవలేదు. మన రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతిని అపవిత్రం చేయడానికి ఆమె ఎప్పుడూ విధ్వంసకారులను అనుమతించలేదు. 1975 మన ప్రజాస్వామ్యానికి మచ్చ. కానీ 2024లోనూ ప్రతిపక్షాలను బీజేపీ గౌరవించడం లేదని విషయాన్ని మరచిపోకూడదు. ”అని లాలూ పేర్కొన్నారు.
కాగా జూన్ 25, 1975న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 21 నెలల అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ కాలాన్ని భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పద కాలాల్లో ఒకటిగా పరిగణిస్తారు. అయితే ఎమర్జెన్సీ విధించి జూన్ 26కు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ 'ఎమర్జెన్సీ' విధించడాన్ని విమర్శించారు. రాష్ట్రపతి వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేతలు ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment