కాంగ్రెస్‌ని వెంటాడుతున్న చేదు జ్ఞాపకం.. | Why Did Former PM Indira Gandhi imposed Emergency 45 Years Ago | Sakshi
Sakshi News home page

ఇందిర ఎందుకు ఎమర్జెన్సీ విధించారు?

Published Thu, Jun 25 2020 10:49 AM | Last Updated on Mon, Sep 28 2020 4:31 PM

Why Did Former PM Indira Gandhi imposed Emergency 45 Years Ago - Sakshi

న్యూఢిల్లీ: దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం. ప్రజాస్వామ్యంపై జరిగిన హేయమైన దాడి. ఉక్కు మహిళగా పేరొందిన దివంగత ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పిదం. కాంగ్రెస్‌ పార్టీని నేటికీ వెంటాడుతున్న చేదు జ్ఞాపకం. దేశ ప్రజల స్వేచ్ఛ, హక్కులను హరించిన ఆ ‘అత్యవసర పరిస్థితి’ విధించి నేటికి 45 ఏళ్లు. ఆనాడు తన అధికారాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. జూన్‌ 25, 1975 నుంచి మార్చి 21, 1977 వరకు దాదాపు 21 నెలల పాటు నియంతృత్వ పాలనలో ప్రజలు అల్లాడిపోయారు. లక్షలాది మంది జైలు పాలయ్యారు. చిత్రవధ అనుభవించారు. ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించడానికి దారి తీసిన పరిణామాలను పరిశీలించినట్లయితే..

గూంగీ గుడియా నుంచి ఐరన్‌ లేడీగా
కాంగ్రెస్‌ పార్టీ 1971 సాధారణ ఎన్నికల్లో 352 సీట్లు కైవసం చేసుకుంది. అప్పటికే బ్యాంకులను జాతీయం చేయడం, లౌకికవాదిగా.. పేదల పెన్నిధిగా ప్రజాభిమానం చూరగొని.. ప్రియతమ ప్రధానిగా పేరొందిన ఇందిరా గాంధీ.. భారీ మెజారిటీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్‌ ఏర్పాటు(పాకిస్తాన్‌తో యుద్ధం)లో ప్రధాన పాత్ర పోషించి తిరుగులేని నేతగా ఎదిగారు. తనను విమర్శించిన వాళ్లతోనే అపరకాళిక అవతారమంటూ ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ఇందిరకు ఉన్న గూంగీ గుడియా(మూగ బొమ్మ) అనే ఇమేజ్‌ తొలగిపోయి దుర్గామాత, ఐరన్‌ లేడీగా అత్యంత శక్తిమంతురాలైన మహిళగా ఆమె అవతరించారు.(ఇందిరా గాంధీపై సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు)

అయితే నాలుగేళ్ల తర్వాత కథ పూర్తిగా మారిపోయింది. దేశంలో కరువు, కాటకాలు, నిరుద్యోగం పెరిగిపోయాయి. పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడింది. వెరసి అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు రగిలాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వాస్తవానికి జూన్‌ 25 అర్ధరాత్రి నుంచి అత్యయిక పరిస్థితి విధించినట్లు కనిపించినా.. అంతకు దాదాపు 10 రోజుల ముందు అంటే జూన్‌ 12నే ఇందుకు బీజం పడిందని సీనియర్‌ పాత్రికేయులు, జీ న్యూస్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ సుధీర్‌ చౌదరి అభిప్రాయపడ్డారు. దేశంలోని పరిస్థితులకు తోడు ఎంపీగా ఇందిర ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎమర్జెన్సీ విధింపులో కీలక పాత్ర పోషించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.(కాంగ్రెస్‌లో ఎమర్జెన్సీ పోకడలు.. అమిత్‌ షా ఫైర్‌)

ఆరేళ్ల పాటు దూరంగా ఉండాలి..
1971 ఎన్నికల్లో రాయ్‌ బరేలీ నుంచి ఎన్నికల బరిలో దిగిన ఇందిరకు పోటీగా.. యునైటెడ్‌ సోషలిస్టు పార్టీ తమ అభ్యర్థిగా రాజ్‌నారాయణ్‌ను నిలబెట్టింది. అయితే ఈ ఎన్నికల సమయంలో ఇందిర తన పదవి, పలుకుబడి ఉపయోగించి అక్రమాలకు పాల్పడి, ఓటర్లకు లంచాలు ఇచ్చి విజయం సాధించారని ఆరోపిస్తూ ఆయన అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో 1975, జూన్‌ 12న తీర్పు వెలువరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జగ్‌మోహన్‌ లాల్‌ సిన్హా.. ఎన్నికల్లో ఇందిర ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇందిర ఎన్నికను రద్దు చేయడమే గాక.. మరో ఆరేళ్లపాటు ఆమె ఎన్నికల్లో పోటీ చేయవద్దని తీర్పునిచ్చారు. దీంతో ప్రధాని పదవి నుంచి ఇందిర దిగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఎన్నిక చెల్లదు కానీ..
ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు 1 సఫ్దార్‌జంగ్‌ రోడ్‌లోని ప్రధాని అధికార నివాసంలో ఇందిర అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తనకు విశ్వాసపాత్రులైన నాయకులు, సన్నిహితులను సూచనలు ఇవ్వాల్సిందిగా కోరారు. అప్పుడు ఇందిర తనయుడు సంజయ్‌ గాంధీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్దామని ఆమెకు చెప్పారు. ఈ నేపథ్యంలో నిబంధనలు అనుసరించి ఇందిర ప్రధానిగా కొనసాగవచ్చన్న సర్వోన్నత న్యాయస్థానం.. అయితే తుది తీర్పు వచ్చేంత వరకు ఒక ఎంపీగా మాత్రం ఆమె ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా ఇందిర వ్యతిరేక, అనుకూల నిరసనలు మిన్నంటాయి.

అందుకే ఎమర్జెన్సీ..
ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్గత కల్లోల పరిస్థితుల దృష్ట్యా ఎమర్జెన్సీ డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందిగా ఇందిర అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ మహ్మద్‌ను కోరారు. ఆయన ఆమోదంతో భారత రాజ్యాంగంలోని 352 (1) అధికరణ ప్రకారం జూన్‌ 25న అత్యవసర పరిస్థితి విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే విపక్ష నాయకులు జయప్రకాశ్‌ నారాయణ్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, మొరార్జీ దేశాయ్‌ అరెస్టయ్యారు. అంతేగాక దేశవ్యాప్తంగా వివిధ నాయకులు, సీనియర్‌ జర్నలిస్టులు ఇలా దాదాపు 11 లక్షల మందిని జైళ్లల్లో నిర్బంధించారు. 

అదే విధంగా భావప్రకటనా స్వేచ్చను హరిస్తూ అన్ని వర్గాలను అణగదొక్కారు. పత్రికలు, ప్రసార మాధ్యమాలను సెన్సార్‌ చేశారు. మానవ హక్కుల ఉల్లంఘన పెద్ద ఎత్తున జరిగింది. ఈ క్రమంలో ఇందిర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రాగా.. దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో మాట్లాడిన ఆమె.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రల నేపథ్యంలోనే ఎమర్జెన్సీ విధించామంటూ తనను తాను సమర్థించుకున్నారు. వాస్తవానికి అప్పుడు ప్రధాని కార్యాలయం నుంచి గాక ప్రధాని నివాసం నుంచి పాలన కొనసాగింది. నాలుగుసార్లు ఆరు నెలల చొప్పున ఎమర్జెన్సీ పొడిగిస్తూ.. ఎట్టకేలకు 1977, మార్చి 21న ఎత్తివేశారు. కానీ నాయకుల స్వప్రయోజనాలకు బలైన ప్రజలు మాత్రం తమ స్వేచ్ఛను హరించిన.. ఎమర్జెన్సీకి కారణమైన వారిని అంతసులువుగా మర్చిపోలేదు. 1977 ఎన్నికల్లో ఓడించడం ద్వారా వారికి గట్టి బుద్ధి చెప్పారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement