శ్రీనగర్: ప్రముఖ ప్రాంతాలు, కట్టడాలకున్న నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి పేర్లను తొలగించినంత మాత్రాన చరిత్ర దాగదు, మారదని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీకి చెందని ప్రతి నేత పేరును కనిపించకుండా చేస్తోందని ఆయన విమర్శించారు. అయితే, చరిత్ర ఎన్నటికీ మారదు, శాశ్వతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
తన తండ్రి, ఎన్‌సీ వ్యవస్థాపకుడు షేక్ మహ్మద్ అబ్దుల్లాను అందరూ పిలుచుకునే షేర్ అనే పేరును ‘షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’నుంచి అధికారులు తొలగించడంపై ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం మొఘలుల 800 ఏళ్ల పాలనను చరిత్ర పుస్తకాల నుంచి తొలగించింది. దానర్థం వారు లేనట్లేనా? తాజ్ మహల్, ఎర్రకోట, జామా మసీదు, కుతుబ్‌మినార్.. తదితర చారిత్రక నిర్మాణాలకు కారకులెవరని చెబుతారు?, మనం, వాళ్లు శాశ్వతం కాదు. చరిత్ర శాశ్వతం, అది మారదు. ఎప్పటికీ అలాగే ఉంటుంది’అని అబ్దుల్లా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment