National Conference
-
గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అధికారులనుఆదేశించారు. పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నీటిపారుదల శాఖపై శనివారం ఆయన జలసౌధలో సమీక్షించారు. రాజస్తాన్‌లో ఈ నెల 18, 19 తేదీల్లో జరగనున్న అఖిల భారత నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సుకు రాష్ట్ర సాగునీటి రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, డిజిటల్ మానిటరింగ్ వంటి అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలన్నారు.కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సు కేంద్ర ప్రభుత్వ విధానకర్తలు, నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురానుందన్నారు. నీటి నిర్వహణ, నిల్వల పెంపుదల, సాగునీటి సామర్థ్యం పెంపు వంటి అంశాలు ఈ సదస్సులో చర్చకు వస్తాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అవలంబిస్తున్న సూక్ష్మ సేద్యం, జలాశయాల్లో పూడికతీత, తక్కువ వ్యయంతో అధిక ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అమలు చేస్తున్న ప్రణాళిక, నదుల పరిరక్షణ వంటి విధానాలను జాతీయ వేదికపైకి తెలియజేయాల్సిన అవసరముందని చెప్పారు.సదస్సులో రాష్ట్రం తరఫున ఏర్పాటు చేయనున్న ఎగ్జిబిషన్లో ప్రదర్శించడానికి గణాంకాలు, కేస్ స్టడీస్‌తో ద్యశ్యరూపాలను సిద్ధం చేయాలన్నారు. ఈ జాతీయ సదస్సులో తెలంగాణ నీటి పారుదల వ్యూహాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించేందుకు గొప్ప వేదిక కానున్నట్టు ఉత్తమ్ చెప్పారు. గత ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేసినా పరిమిత ఫలితాలనే సాధించిందని చెప్పారు. ఎస్ఎల్బీసీ, డిండి, పాలమూరు–రంగారెడ్డి, దేవాదుల తదితర ప్రాజెక్టుల పురోగతిపై అధికారులు ఈ సమావేశంలో మంత్రికి నివేదిక సమర్పించారు. -
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తొలిరోజు సమావేశాల్లో గందరగోళం
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.. ఆరేళ్ల తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే గందరగోళం నెలకొంది. నేటి సమావేశంలో భాగంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) ఎమ్మెల్యే వహీద్ పారా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పుల్వామా నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న పారా.. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన స్పీకర్ అబ్దుల్రహీమ్ రాథర్‌కు తీర్మానాన్ని సమర్పించారు. అయిదు రోజుల అసెంబ్లీ సెషన్ ఎజెండాలో ఈ అంశం లేకపోయినప్పటికీ ప్రజల కోరకు మేరకు స్పీకరర్గా తన అధికారాలను ఉపయోగించి దీనిపై చర్చించాలని ఆయన కోరారు.అయితే ఈ తీర్మానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనిని అనుమతించకూడదని కాషాయ పార్టీకి చెందిన 28 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తీర్మానం తీసుకొచ్చినందుకు పారాను సస్పెండ్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే షామ్ లాల్ శర్మ డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ పదేపదే అభ్యర్థించినప్పటికీ వారు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో కాసేపు అసెంబ్లీలో రగడ చోటుచేసుకుంది.అనంతరం అధికారిక నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన స్పీకర్ రహీమ్ రాథర్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు లాంటి తీర్మానాన్ని తాను ఇంకా అంగీకరించలేదని చెప్పారు. ఈ తీర్మానానికి ప్రాధాన్యత లేదని సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా తేల్చిచెప్పారు. సభ ఎలా జరగాలనేది, ఏం చర్చించాలనే ఏ ఒక్క సభ్యులచే నిర్ణయించరాదని అన్నారు. 2019 ఆగస్టు 5న తీసుకున్న ఆర్టికల్ 370ని రద్దు నిర్ణయాన్ని జమ్ముకశ్మీర్ ప్రజలు ఆమోదించడం లేదని అన్నారు. అయితే రాష్ట్ర పునరుద్దరణకు తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. దీంతో, ఆ ప్రాంతం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేస్తోంది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ఇటీవల ఒమర్ మంత్రివర్గం తీర్మానం చేసింది. దానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం కూడా తెలిపారు. ఈ పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించే యోచనలో కేంద్రం ఉందని, ఈమేరకు హామీ లభించిందని ప్రచారం జరుగుతోంది. -
‘అది ఎప్పటికీ జరగదు’.. పాకిస్థాన్‌కు ఫరూక్ అబ్దుల్లా వార్నింగ్!
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులకు పాకిస్థాన్‌లోనే మూలాలు ఉన్నాయని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, నిరంతర దాడులు చేయడం ఆపాలని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఇరుదేశాలు స్నేహితులుగా కలిసి ఉండేందుకు ఇస్లామాబాద్ మార్గాన్ని వెతకాలని, లేదంటే పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు.అయతే జమ్ముకశ్మీర్‌లో ఇటీవల ఉగ్రదాడులు ఎక్కువైన సంగతి తెలిసిందే. గురువారం కూడా బారాముల్లాలో ఆర్మీ వాహనంపై జరిగిన దాడిలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు మృతిచెందారు. అంతకు మూడు రోజుల ముందు ఆరుగురు నిర్మాణ కార్మికులు, ఓ డాక్టర్‌ను ఉగ్రవాదులను కాల్చి చంపారు.దీనిపై ఆయన మాట్లాడుతూ.. దాడులకు పరిష్కారం కనుగొనే వరకు ఇవి కొనసాగుతూనే ఉంటాయని, సరైన పరిష్కారం కనుగొనేందుకు కేంద్రంతో కలిసి పని చేస్తామని చెప్పారు. వీటికి మూలాలు తమకు తెలుసని, అమాయక ప్రజల్ని చంపే ఘటనలను 30 ఏళ్లుగా కళ్లారా చూస్తున్నానని అన్నారు. సామాన్యులతోపాటు ఎంతో మంది సైనికులు అమరులయ్యారని తెలిపారు.‘ఇలా తరచూ దాడులకు పాల్పడితే పాకిస్థాన్‌లో కశ్మీర్ భాగమవుతుందని ఆ దేశం తప్పుడు ఉద్దేశంతో ఉంది. అదెప్పటికీ జరగదు. ఎందుకు పాకిస్థాన్ ఈ దాడులకు విధ్వంసానికి పాల్పుడుతోంది. వారి స్వంత భవిష్యత్తునే ఎందుకు నాశనం చేసుకుంటుంది. మేమేమీ పాకిస్థాన్‌లో భాగం కాదు’ అని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. -
Jammu & Kashmir: రాష్ట్ర హోదా పునరుద్దరణకు తీర్మానం ఆమోదం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ నూతన సీఎం ఓమర్ అబ్దుల్లా నేతృత్వంలోని కేబినెట్ రాష్ట్ర హోదా పునరుద్దరణకు తీర్మానాన్ని ఆమోదించింది. గురువారం జరిగిన మొదటి సమావేశంలో జమ్ముకశ్మీర్ మంత్రివర్గం రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి, మంత్రులు సకీనా మసూద్ ఇటూ, జావేద్ అహ్మద్ రాణా, జావైద్ అహ్మద్ దార్, సతీష్ శర్మ హాజరయ్యారు.‘తీర్మానం ముసాయిదా సిద్ధం అయ్యింది. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ తీర్మానం ముసాయిదాను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయడానికి ముఖ్యమంత్రి రెండు రోజుల్లో న్యూఢిల్లీకి వెళతారు’ అంటూ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.కాంగ్రెస్ జమ్ముకశ్మీర్ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర హోదాను పునరుద్ధరించకపోతే తమ పార్టీ కేబినెట్లో భాగం అవ్వదని వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదాను కేంద్రం పునరుద్ధరిస్తుందని ఆశిస్తున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విశ్వాసం వ్యక్తం చేశారు."మేము రాజ్యాధికారం గురించి ఇంతకు ముందు కూడా మాట్లాడాము. ఇప్పుడు కూడా అదే కోరుతున్నాం. రెండు నెలల్లో రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషిన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం త్వరలోదీనిని ఖచ్చితంగా పునరుద్ధరిస్తుందని భావిస్తున్నాను’ అని అబ్దుల్లా తెలిపారు. ఇదిలా ఉండగా 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా, స్వయంప్రతిపత్తి నికూడా రద్దు చేసింది. దాంతో పాటు, జమ్మూ కాశ్మీరు రాష్ట్ర హోదాను తొలగిస్తూ జమ్ము కశ్మీర్. అలాగే లడఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.. -
J&K cabinet: మంత్రి పదవి ఆఫర్.. తిరస్కరించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత బుధవారం కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శ్రీనగర్‌లో ఉన్న షేర్ యే కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. అయితే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓ మినిస్టర్ బర్త్ ఇచ్చేందుకు ఎన్సీ ఆఫర్ చేసింది. కానీ జమ్ముకశ్మీర్ పరిపాలనలో భాగం కావడానికి అయిష్టత చూపుతున్న హస్తం పార్టీ.. ఎన్సీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. ప్రభుత్వానికి బయట నుంచే సపోర్టు ఇవ్వాలని భావిస్తున్నట్లు వినికిడి.కాగా 2014 తర్వాత పదేళ్లకు జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 90 సీట్లకుగానూ 42 చోట్ల విజయం దక్కించుకుంది. ఎన్సీతో పొత్తుతో వెళ్లిన కాంగ్రెస్ కేవలం ఆరు చోట్ల మాత్రమే గెలిచింది.ఇక నేడు ఒమర్ అబ్ధుల్లాతోపాటు 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమానికి ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలకు ఆహ్వానాలు అందాయి.ఇప్పటికే ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్, డీఎంకే నేత కనిమొళితో పాటు ఇతర నేతలు శ్రీనగర్ చేరుకున్నారు. ఫారూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతో కలిసి ఆ నేతలు ఫోటోలు దిగారు. చెన్నైలో వర్షాల వల్ల ప్రమాణ స్వీకారోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరుకాలేకపోతున్నారు. -
జమ్ముకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఆప్ మద్దతు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా.. నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది. నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొంటూ ఒక లేఖను లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించింది. కాగా మ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తొలిసారిగా గెలుపొందింది. దోడా నియోజకవర్గం నుంచి ఆప్ తరుపున పోటీ చేసిన మెహ్రాజ్ మాలిక్- బీజేపీ అభ్యర్థిపై గజయ్ సింగ్ రాణాపై 4,538 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కన్నా రెండు సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. ఎన్సీ 42 చోట్ల, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయ దుందుభి మోగించాయి. బీజేపీ 29 సీట్లను సొంతం చేసుకుంది. పీడీపీ మూడు స్థానాలకు పరిమితమైంది. 10 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. -
జమ్ము కశ్మీర్: ‘ఆమె మద్దతిస్తే.. తీసుకుంటాం’
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఫలితాలు హంగ్ దిశగా వెలువడతాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం లేకున్నా పీడీపీ మద్దతు ఇస్తానంటే తాము అంగీకరిస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి మద్దతు ఇచ్చేందుకు మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ సిద్ధంగా ఉందని వస్తున్న వార్తలపై సోమవారం ఫరూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు.‘‘జమ్ము కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం లేకపోయినా మద్దతు ఇస్తానంటే తీసుకుంటాం. ఎందుకంటే అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు మనమందరం కృషి చేయాలి. జమ్ము కశ్మీర్ ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. అయితే ఎన్నికల తర్వాత పొత్తుపై నేను మెహబూబా ముఫ్తీతో మాట్లాడలేదు. నేను ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.#WATCH | Srinagar: JKNC chief Farooq Abdullah says, "Even if we don't need it, we will take the support (from PDP) because if we have to go ahead, we have to do it together. We all have to make an effort to save this state. This state is in a lot of difficulties..." pic.twitter.com/apwy9ZSry1— ANI (@ANI) October 7, 2024 ..మేమందరం కలిసి ఈ రాష్ట్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తాం. అయితే ప్రస్తుతానికి నేను ముఫ్తీతో మాట్లాడలేదు. ఆమె మద్దతు ఇస్తానన్న విషయాన్ని పేపర్లలో మాత్రమే చదివాను. ఎగ్జిట్ పోల్స్ గురించి నేను ఉత్సాహంగా లేను. ఎందుకంటే అవి సరైనవి కావోచ్చు. తప్పు కూడా కావచ్చు. ఓట్ల లెక్కింపు తర్వాత అసలు నిజం వెల్లడి అవుతుంది. కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశిస్తున్నాం. మా ప్రభుత్వ ఏర్పాటుకు ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.చదవండి: హర్యానా: ‘సీఎం సైనీ మంచి వ్యక్తి.. కానీ’ -
PM Narendra Modi: కుటుంబ పార్టీలు రాజ్యాంగానికి శత్రువులు
జమ్మూ: కుటుంబ పార్టీలైన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) భారత రాజ్యాంగానికి అతిపెద్ద శత్రువులని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఓటు బ్యాంక్ కోసం సమాజంలో అణగారిన వర్గాల హక్కులను కాలరాశాయని, రాజ్యాంగ స్ఫూర్తిని హత్య చేశాయని నిప్పులు చెరిగారు. ఆ మూడు పార్టీలు జమ్మూకశ్మీర్‌కు తీవ్ర గాయాలు చేశాయని ఆరోపించారు. జమ్మూకశీ్మర్ ప్రజలు తమ బిడ్డల బంగారు భవిష్యత్తు, శాంతి కోసం అవినీతి, ఉగ్రవాదం, వేర్పాటువాదం లేని మంచి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. శనివారం జమ్మూలోని ఎంఏఎం స్టేడియంలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కుటుంబ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని ఇక్కడి ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలు, ఉగ్రవాదం, వేర్పాటువాదం, రక్తపాతం, ఉద్యోగాల్లో వివక్షను జనం కోరుకోవడం లేదని తేలి్చచెప్పారు. బీజేపీ ప్రభుత్వం రావాలన్నదే వారి ఆకాంక్ష అని స్పష్టంచేశారు. మొదటి రెండు దశల పోలింగ్ ఓటర్ల మనోగతాన్ని ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. బీజేపీ పూర్తి మెజార్టీతో సొంతంగా అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. పాకిస్తాన్ భాషలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ను ప్రజలు క్షమిస్తారా అని మోదీ ప్రశ్నించారు. హరియాణాలో కాంగ్రెస్ వస్తే అస్థిరతే: మోదీ హిస్సార్: హరియాణాలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అస్థిరత తప్పదని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఆ పార్టీలో అంతర్గత పోరాటం సాగుతోందని, ముఖ్యమంత్రి పదవి కోసం నేతలంతా పోటీ పడుతున్నారని చెప్పారు. బాపు(భూపీందర్ సింగ్), బేటా(దీపేందర్ సింగ్) పోటీలో ఉన్నారని తెలిపారు. శనివారం హరియాణాలోని హిసార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. -
‘హంగ్’ రావొద్దనే... కాంగ్రెస్‌తో పొత్తుపై ఒమర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల అనంతరం హంగ్ పరిస్థితి రాకుండా ప్రజలకు ఒక అవకాశం కల్పించేందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దులా వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు కాదేమోనన్న అనుమానాలు అక్కర్లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. దాల్ సరస్సులో ఆదివారం షికారా(పడవ)లతో చేపట్టిన ర్యాలీలో అబ్దుల్లా మాట్లాడారు. ఎన్నికల తర్వాత జమ్మూకశ్మీర్‌లో హంగ్ ఏర్పడాలని బీజేపీ కోరుకుంటోందని, తద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ పాలనను పొడిగించాలని చూస్తోందని ఆరోపించారు. అయితే, ప్రజలు బీజేపీకి ఆ అవకాశం ఇవ్వబోరని చెప్పారు. కశ్మీర్ లోయలో ప్రచారంతో ఫలితం ఉండదని ముందుగానే గ్రహించిన బీజేపీ నేతలు జమ్మూలో మాత్రమే పర్యటిస్తున్నారని ఒమర్ వ్యాఖ్యానించారు. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జమ్మూకశ్మీర్‌లో మూడు కుటుంబాల పాలన అంటూ విమర్శలు చేస్తోందన్నారు. -
కశ్మీర్లో నేడే తొలి దశ
శ్రీనగర్/జమ్మూ: జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. 7 జిల్లాల పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలకు బుధవారం తొలి విడతలో పోలింగ్ జరగనుంది. వీటిలో 8 స్థానాలు జమ్మూలో, 16 కశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయి. 90 మంది స్వతంత్రులతో కలిపి మొత్తం 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారి భవితవ్యాన్ని 23 లక్షల పై చిలుకు ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. జమ్మూ కశ్మీర్లో పదేళ్ల అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం విశేషం. పైగా జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను, ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆరి్టకల్ 370ని రద్దు చేశాక జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలివి. దాంతో ప్రజల తీర్పు ఎలా ఉండనుందోనని ఆసక్తి నెలకొంది. ఉగ్ర ముప్పు నేపథ్యంలో సీఏపీఎఫ్, స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లకు, సిబ్బందికి అదనపు భద్రత కల్పిస్తున్నారు. సెపె్టంబర్ 25, అక్టోబర్ 1న రెండు, మూడో విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడవుతాయి. పారీ్టలన్నింటికీ ప్రతిష్టాత్మకమే ప్రధాన ప్రాంతీయ పారీ్టలు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో పాటు కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వేర్పాటువాద జమాతే ఇస్లామీ, అవామీ ఇత్తెహాద్ పార్టీ, డీపీఏపీ కూడా బరిలో ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీ పొత్తు పెట్టుకున్నా మూడుచోట్ల స్నేహపూర్వక పోటీ చేస్తున్నాయి. మరో చోట ఎన్సీ రెబెల్ బరిలో ఉన్నారు. కశ్మీర్‌పై కాషాయ జెండా ఎగరేయజూస్తున్న బీజేపీనీ రెబెల్స్ బెడద పీడిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో హిందూ ప్రాబల్య జమ్మూ ప్రాంతంలో సీట్లు 37 నుంచి 43కు పెరిగాయి. ముస్లిం ప్రాబల్య కశ్మీర్లో ఒక్క సీటే పెరిగింది.బరిలో ప్రముఖులు: మొహమ్మద్ యూసుఫ్ తరిగమీ (సీపీఎం) కుల్గాం నుంచి వరుసగా ఐదో విజయంపై కన్నేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్దూరు నుంచి మూడోసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత సకీనా (దమ్హాల్ హాజిపురా), పీడీపీ నేతలు సర్తాజ్ మద్నీ (దేవ్సర్), అబ్దుల్ రెహా్మన్ వీరి (షంగుస్–అనంత్‌నాగ్), మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా (శ్రీగుఫ్వారా–బిజ్బెహరా), వహీద్ పరా (పుల్వామా) తదితర ప్రముఖులు తొలి విడతలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ప్రధాన సమస్యలు ఇవే...→ నిరుద్యోగం, అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘన వంటివి జమ్మూ కశ్మీర్ ప్రజలు ఎదుర్కొటున్న ప్రధాన సమస్యలు. → పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభిస్తేనే సమస్యలు తీరి తమ ప్రయోజనాలు నెరవేరతాయని వారు భావిస్తున్నారు. దాంతో దాదాపుగా పారీ్టలన్నీ దీన్నే ప్రధాన హామీగా చేసుకున్నాయి. → ఆర్టికల్ 370ని తిరిగి తెస్తామని కూడా ఎన్సీ వంటి పార్టీలు చెబుతున్నాయి. విద్య, వివాహాలు, పన్నులు, సంపద, అడవుల వంటి పలు అంశాలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తామంటున్నాయి. → ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీరీలు భారీ సంఖ్యలో ఓటువేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నారు. -
మహిళలపై నేరాల్లో... సత్వర తీర్పులు
న్యూఢిల్లీ: మహిళలపై అత్యాచారం, హత్య వంటి హేయమైన నేరాల విషయంలో తీర్పులు ఇవ్వడంలో కోర్టులు ఎంతమాత్రం జాప్యం చేయొద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. సత్వర తీర్పులతో బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. ‘‘ఇలాంటి కేసుల్లో తీర్పులు ఆలస్యమైతే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది. న్యాయ వ్యవస్థ సున్నితత్వం కోల్పోయిందని భావించే ప్రమాదముంది’’ అన్నారు. జిల్లా న్యాయ వ్యవస్థపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆదివారం ముర్ము ప్రసంగించారు. హేయమైన నేరాలకు సంబంధించి కూడా కొన్నిసార్లు ఒక తరం ముగిసిన తర్వాత తీర్పులు వస్తున్నాయని ఆక్షేపించారు. కోర్టుల్లో వాయిదాల సంస్కృతి మారాలని సూచించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, బ్యాక్లాగ్ కేసులు న్యాయ వ్యవస్థకు పెను సవాలుగా నిలుస్తున్నాయన్నారు. వీటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘తరచూ ప్రత్యేక లోక్ అదాలత్‌లు నిర్వహించాలి. ప్పారు. పెండింగ్ కేసులను తగ్గించడానికి అధిక ప్రాధాన్యమివ్వాలి’’ అని సూచించారు. న్యాయం కోసం పోరాడితే మరిన్ని కష్టాలు: అంగ బలం, అర్థబలం కలిగిన కొందరు నేరగాళ్లు యథేచ్ఛగా బయట సంచరిస్తున్నారని రాష్ట్రపతి ఆవేదన వెలిబుచ్చారు. ‘‘వారికి సకాలంలో శిక్షలు పడడం లేదన్నారు. అలాంటి నేరగాళ్ల వల్ల నష్టపోయిన బాధితులు మాత్రం భయాందోళనల మధ్య బతుకుతున్నారు. గ్రామీణ పేదలు కోర్టులకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వారు కోర్టుల దాకా వస్తున్నారు’’ అన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. కోర్టుల్లో మహిళలకు వసతులు మెరుగుపడాలి: సీజేఐ జిల్లా స్థాయి కోర్టుల్లో మహిళలకు తగిన మౌలిక వసతులు లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. న్యాయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం బాగా పెరుగుతున్నా కోర్టుల్లో వారికి సరిపడా సదుపాయాలు లేకపోవడం గర్హనీయమన్నారు. జిల్లా స్థాయి న్యాయస్థానాల్లోని మౌలిక సదుపాయాల్లో కేవలం 6.7 శాతమే మహిళలకు అనువుగా ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరముందని ఉద్ఘాటించారు. ‘‘కొన్ని రాష్ట్రాల్లో న్యాయ నియామకాల్లో 70 శాతం మహిళలే ఉంటున్నారు. వారికి వసతులు మెరుగుపడాలి. కోర్టు ప్రాంగణాల్లో వైద్య సదుపాయాలు, పిల్లల సంరక్షణ కేంద్రాలు రావాలి. కక్షిదారుల కోసం ఈ–సేవా కేంద్రాలు, వీడియో కాన్ఫరెన్స్ వంటివాటితో న్యాయం సులువుగా అందుబాటులోకి వస్తుంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సురక్షితమైన, సానుకూల పరిస్థితులు కలి్పంచే చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. ప్రధానంగా మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు, అణగారిన వర్గాల సంక్షేమం న్యాయస్థానాల కర్తవ్యం కావాలి’’ అని పిలుపునిచ్చారు. -
‘సత్వర న్యాయం’తోనే భద్రతపై భరోసా
న్యూఢిల్లీ: మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం లభించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వేగంగా న్యాయం చేకూర్చే పరిస్థితి ఉంటే భద్రత పట్ల మహిళలకు గొప్ప భరోసా దక్కుతుందని ఉద్ఘాటించారు. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య, మహారాష్ట్రలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీలో శనివారం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జిల్లా న్యాయ వ్యవస్థపై ప్రారంభమైన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగానికి దేశ న్యాయ వ్యవస్థను ఒక సంరక్షకురాలిగా పరిగణిస్తుంటామని చెప్పారు. సుప్రీంకోర్టుతోపాటు మొత్తం న్యాయ వ్యవస్థ ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పని చేస్తే సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... క్రియాశీలకంగా మానిటరింగ్ కమిటీలు ‘‘దేశంలో మహిళలు, చిన్నారులపై వేధింపులు, నేరాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహిళల భద్రత కోసం చట్టాల్లో కఠినమైన నిబంధనలు చేరుస్తున్నాం. 2019లో ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టుల పథకాన్ని ప్రారంభించాం. అడబిడ్డలపై జరిగే నేరాల విషయంలో తీర్పులు వేగంగా రావాలి. నేరగాళ్లకు శిక్షలు పడాలి. బాధితులకు సత్వర న్యాయం దక్కాలి. అలా జరిగితేనే జనాభాలో సగం మందికి వారి భద్రతపై ఒక భరోసా, నమ్మకం లభిస్తాయి. మహిళలపై నేరాలు అరికట్టే విషయంలో జిల్లా జడ్జి, మేజి్రస్టేట్, ఎస్పీతో కూడిన జిల్లా మానిటరింగ్ కమిటీల పాత్ర చాలా కీలకం. కింది కోర్టులే మొదటి మెట్టు దేశంలో రాజ్యాంగాన్ని, చట్టాల స్ఫూర్తిని న్యాయ వ్యవస్థ చక్కగా పరిరక్షిస్తోంది. సుప్రీంకోర్టు పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల దేశ ప్రజలు ఏనాడూ అపనమ్మకం వ్యక్తం చేయలేదు. న్యాయ వ్యవస్థపై వారికి ఎంతో విశ్వాసం ఉంది. దేశ న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ ఒక బలమైన పునాది అనడంలో సందేహం లేదు. బాధితులకు న్యాయం చేకూర్చడంలో కింది కోర్టులే మొదటి మెట్టు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం. కోర్టులను ఆధునీకరిస్తున్నాం. పెండింగ్ కేసులను విశ్లేíÙంచడానికి, భవిష్యత్తులో రాబోయే కేసులను అంచనా వేయడానికి కృత్రిమ మేధ(ఏఐ), ఆప్టికల్ క్యారెక్టర్ రికగి్నషన్ వంటి నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం’’ అని ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటించారు. భారత సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్మారక పోస్టల్ స్టాంప్, నాణేన్ని ఆవిష్కరించారు. బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరమెందుకు: కపిల్ సిబల్ ఎలాంటి సంకోచాలు, పక్షపాతానికి తావులేకుండా తీర్పులు ఇచ్చేలా ట్రయల్ కోర్టులు, జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టులు బలోపేతం కావాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ చెప్పారు. క్షేత్రస్థాయిలోని కింది కోర్టులు ఒత్తిళ్లను తట్టుకొని స్థిరంగా నిలవకపోతే మొత్తం న్యాయ, రాజకీయ వ్యవస్థ సమగ్రత ప్రమా దంలో పడుతుందని అన్నారు. జిల్లా కోర్టులపై సదస్సులో ఆయన మాట్లాడుతూ... బెయిల్ ఒక నియమం, జైలు ఒక మినహాయింపు అంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును ప్రస్తావించారు. కీలకమైన కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వడానికి ట్రయల్ కోర్టులు, జిల్లా కోర్టులు నిరాకరిస్తున్నాయని ఆక్షేపించారు. తన వృత్తి జీవితంలో కింది కోర్టులు బెయిల్ ఇవ్వగా చూసిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇది కేవలం తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదని చెప్పారు. బెయిల్‌ను కింది కోర్టులు ఒక మినహాయింపుగా భావిస్తుండడంతో పై కోర్టులపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల చెప్పారని గుర్తుచేశారు. కింది కోర్టుల్లో బెయిల్ రాకపోవడంతో నిందితులు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని సూచించారు. జిల్లా కోర్టుల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని, న్యాయమూర్తుల వేతనా లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కోర్టులే వెన్నెముక: జస్టిస్ చంద్రచూడ్ దేశంలో మొత్తం న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ వెన్నుముక అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభివరి్ణంచారు. చట్టబద్ధ పాలనకు జిల్లా జ్యుడీíÙయరీ అత్యంత కీలకమని చెప్పారు. జిల్లా కోర్టులను కింది కోర్టులు అని పిలవడం ఆపేయాలని సూచించారు. జిల్లా కోర్టులపై జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లా న్యాయ వ్యవస్థలో కొన్నేళ్లుగా మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోందని అన్నారు. న్యాయాన్ని పొందడానికి ప్రజలకు మొదటి వేదిక జిల్లా కోర్టులేనని తెలిపారు. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. 2023–24లో 46.48 కోట్ల పేజీల కోర్టు రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్చామని వెల్లడించారు. 3,500 కోర్టు కాంప్లెక్స్‌లను, 22,000 కోర్టు రూమ్‌లను కంప్యూటరీకరించడానికి ఈ–కోర్టుల ప్రాజెక్టును ప్రారంభించినట్లు చెప్పారు. న్యాయమూర్తులపై ఒత్తిడి అధికంగా ఉంటుందని, వారు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. -
Kai Madison Trump: మా మంచి తాతయ్య!
మిల్వాకీ: అది రిపబ్లికన్ల నేషనల్ కాన్ఫరెన్స్. బుధవారం రాత్రి ఓ 17 ఏళ్ల అమ్మాయి వేదికనెక్కింది. తొలి ప్రసంగమే అయినా ఎక్కడా ఆ ఛాయలే లేవు. అనేకానేక అంశాలపై తడుముకోకుండా మాట్లాడి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. దాంతో హాలంతా పదేపదే చప్పట్లతో మార్మోగింది. ార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనను అబ్బురంగా, ఒకింత గర్వంగా చూసుకుంటూ మురిసిపోయారు. ఆ టీనేజర్ కాయ్ మాడిసన్. ట్రంప్ మనవరాలు. ‘‘తాతా! మీరే నాకు స్ఫూర్తి’’ అని కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారామె. 10 మంది మనవలూ, మనవరాళ్లలో కాయ్ అందరికంటే పెద్ద. ట్రంప్ పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్, ఆయన మాజీ భార్య వనెసా కూతురు. నేనూ ట్రంప్‌నే... తాతయ్య ఎప్పుడూ దేశం మంచినే కోరతారని కాయ్ చెప్పుకొచ్చారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చేందుకు పోరాడుతున్నారన్నారు. ఎందరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొని నిలిచారంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ‘‘ఆయనలో బయటికి ప్రపంచానికి పెద్దగా తెలియని కోణాన్ని మీతో పంచుకోదలిచా. తాతగా ఆయనెంతో ప్రేమాస్పదుడు. మేం చిన్నపిల్లలుగా ఉండగా అందరు తాతల్లాగే మమ్మల్నెంతో గారాబం చేసేవారు. మా పేరెంట్స్ చూడకుండా చాక్లెట్లు, కూల్డ్రింకులు ఇప్పించేవారు. మేం ఆనందపడితే చూసి మురిసిపోయేవారు. స్కూల్లో ఎలా చదవుతున్నామో ఎప్పటికప్పుడూ తెలుసుకునేవారు. ఓసారి నాకు బాగా మార్కులొస్తే ఆ ప్రోగ్రెస్ కార్డును ప్రింట్ తీయించి మరీ మిత్రులందరికీ చూపించుకుని సంబరపడ్డారు. నాకు తరచూ కాల్ చేసి గోల్ఫ్ ఎలా ఆడుతున్నానో ఆరా తీసేవారు. తన గోల్ఫ్ కథలన్నీ పంచుకునేవారు. ‘స్కూల్లో ఉన్నా తాతయ్యా, మాట్లాడలేను’ అని చెప్పాల్సి వచ్చేది. ఇద్దరం కలిసి గోల్ఫ్ ఆడేప్పుడు నన్ను ఓడించడానికి ప్రయతి్నంచేవారు. కానీ పడనిచ్చేదాన్ని కాదు. నేను కూడా ట్రంప్‌నే తాతయ్యా అనేదాన్ని!’’ అంటూ గుర్తు చేసుకున్నారు. 2015లో ట్రంప్ తొలిసారి అధ్యక్ష అభ్యర్థి అయినప్పటి నుంచీ కాయ్ ఆయనతో కలిసి పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రధాన ప్రచార వేదికపై కనిపించడం, మాట్లాడటం ఇదే తొలిసారి. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారామె. ట్రంప్‌పై కాల్పులు జరిగిన వెంటనే ఆయన పిడికిలెత్తి నినదిస్తున్న ఫొటోను పోస్ట్ చేసి, ‘‘తాతా, ఐ లవ్యూ. పోరాడుతూనే ఉండు!’’ అని రాశారు. ఆమెకు సొంత యూట్యూబ్ చానల్ ఉంది.మా నాన్నసింహసదృశుడు హత్యా యత్నాన్ని ట్రంప్ గొప్పగా ఎదుర్కొన్నారని ఆయన పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్ (46) అన్నారు. ‘‘రక్తం ధారగా కారుతున్నా రొమ్ము విరిచి నిలబడ్డారు. నేపథ్యంలో జాతీయ పతాకం రెపరెపలాడుతుండగా చెయ్యెత్తి పిడికిలి బిగించి పోరాట నినాదాలు చేశారు. అమెరికా పోరాట స్ఫూర్తికే ప్రతీకగా నిలిచారు. కాబోయే దేశాధ్యక్షుడు సింహసదృశుడని నిరూపించారు’’ అంటూ కొనియాడారు. ట్రంప్ భార్య మెలానియా, కూతురు ఇవాంకా, అల్లుడు జరేద్ కుష్నర్ తదితర కుటుంబ సభ్యులు గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) సదస్సులో పాల్గొంటారు. -
అనంత్‌నాగ్–రాజౌరీలో... అంతుపట్టని ఓటరు నాడి
జమ్మూ కశీ్మర్లో అనంత్‌నాగ్–రాజౌరీ స్థానంలో పోటీ ఈసారి ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ చీఫ్ మెహబూబా ముఫ్తీ బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ పోలింగ్ మే 7న మూడో విడతలో జరగాల్సింది. బీజేపీ, ఇతర పారీ్టల విజ్ఞప్తి మేరకు ఆరో విడతలో భాగంగా మే 25కు కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది... 2022 పునర్విభజనలో అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానం కాస్తా అనంత్‌నాగ్–రాజౌరీగా మారింది. విపక్ష ఇండియా కూటమి భాగస్వాములైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ కశీ్మర్ లోయలో మాత్రం పరస్పరం పోటీ పడుతున్నాయి. లోయలోని 3 లోక్‌సభ స్థానాలూ 2014లో పీడీపీకే దక్కాయి. 2019లో వాటన్నింటినీ ఎన్సీ కైవసం చేసుకుంది. సిట్టింగ్ ఎంపీ హస్నాయిన్ మసూదీ కేవలం 6,676 ఓట్లతో గట్టెక్కారు. ఎన్సీ ఈసారి వ్యూహాత్మకంగా గుజ్జర్ బకర్వాల్ మత నాయకుడు, పార్టీ సీనియర్ నేత మియా అల్తాఫ్‌ను బరిలో దింపింది. ఆయనకు పూంచ్, రాజౌరిలో గట్టి మద్దతుంది. ఇది ఇతర పారీ్టల ఓట్లను చీల్చే అవకాశముంది. మోదీ ప్రభుత్వం ఫిబ్రవరిలో పహాడీ జాతి సమూహాలకు షెడ్యూల్డ్ తెగ హోదా ఇచ్చాక సమీకరణాలు మారాయి. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి వేరు కుంపటి పెట్టుకున్న గులాం నబీ ఆజాద్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) నుంచి మహమ్మద్ సలీమ్ పారే, అప్నీ పార్టీ నుంచి జాఫర్ ఇక్బాల్ మన్హాస్ బరిలో ఉన్నారు. ఆరి్టకల్ 370 రద్దు నేపథ్యంలో బల్దేవ్ కుమార్ రూపంలో జమ్మూకశీ్మర్‌లో తొలిసారిగా ఓ స్థానికేతరుడు పోటీ చేస్తుండటం విశేషం. ఆయన స్వస్థలం పంజాబ్. లెక్కలు మార్చేసిన డీలిమిటేషన్! 2022కు ముందు జమ్మూలో రెండు (జమ్మూ, ఉధంపూర్), కశ్మీర్లో మూడు (శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్), లద్దాఖ్‌లో ఒక లోక్‌సభ స్థానముండేవి. డీలిమిటేషన్ తర్వాత జమ్మూలో రెండు స్థానాలు కొనసాగినా అక్కడి పూంచ్, రాజౌరి జిల్లాల్లో చాలా భాగాన్ని కశీ్మర్లోని అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానంతో కలిసి అనంత్‌నాగ్–రాజౌరీగా చేశారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో 18 అసెంబ్లీ సీట్లున్నాయి. మొత్తం 18.3 లక్షల ఓటర్లున్నారు. 10.94 లక్షల మంది కశీ్మర్ ప్రాంతంలో, 7.35 లక్షల మంది జమ్మూలో ఉన్నారు. మెజారిటీ కశీ్మరీలు ముస్లింలు. జమ్మూలో 3 లక్షల మేర గుర్జర్లు, బేకర్వాల్ సామాజిక వర్గం ఉంది. మిగతా జనాభా పహాడీలు (హిందువులు, సిక్కులు ఇతరత్రా). వారిని ఎస్టీ జాబితాలోకి చేర్చడం వంటి చర్యల ద్వారా బీజేపీ నెమ్మదిగా లోయలో పాగా వేయజూస్తోంది. ఈసారి పోటీ చేయకున్నా వేరే పారీ్టలకు మద్దతిస్తోంది. బీజేపీ నేతలు తీవ్రంగా ప్రచారమూ చేస్తున్నారు. ఎన్సీ, కాంగ్రెస్, పీడీపీలపై సభలు పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు! ఆ మూడింటికి కాకుండా ఎవరికైనా ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.కశీ్మరీ పండిట్ ఒంటరి పోరు కశీ్మరీ పండిట్లు. 1980ల్లో పెచ్చరిల్లిన హింసాకాండకు తాళలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలసపోయిన ప్రజలు. ఏళ్ల కొద్దీ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ వర్గానికి చెందిన దిలీప్ కుమార్ పండిత (54) ఈసారి అనంత్‌రాగ్–రాజౌరి నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు! ముఫ్తి, మియా అల్తాఫ్ అహ్మద్‌లకు గట్టి సవాల్ విసురుతున్నారు. పౌర చర్చల ద్వారా పండిట్లు, ముస్లింలతో పాటు కశ్మీరీలందరినీ ఏకం చేస్తానన్నది ఆయన హామీల్లో ప్రధానమైనది. నిజాయితీగా ఆయన చేస్తున్న ప్రయత్నం స్థానికులను ఆకర్షిస్తోంది. ప్రతి గడపకూ వెళ్లి ఓట్లడుగుతున్నారు. స్థానికులతో భేటీ అవుతున్నారు. ఐదు వలస శిబిరాల్లో ఉన్న 35,000 మంది పండిట్లను తనకే ఓటేయాలని కోరారు. ‘‘35 ఏళ్లుగా ఇంటికి దూరంగా బతుకుతున్నాం. మాకిప్పటికీ న్యాయం జరగలేదు. కశీ్మరీ పండిట్లకు న్యాయం కోసం, వారు లోయలోకి సురక్షితంగా తిరిగొచ్చే పరిస్థితులను నెలకొల్పడం కోసం పోరాడుతున్నాను’’ అని మీడియాకు తెలిపారు పండిత.బీజేపీ అడ్డుకుంటోంది: ముఫ్తీ తాము ప్రజలను కలవకుండా మోదీ సర్కారు అడ్డుకుంటోందని ముఫ్తీ ఆరోపిస్తున్నారు. ‘‘ఆరి్టకల్ 370 రద్దుతో వారు నెలకొల్పామంటున్న శాంతి నిజానికి శ్మశాన వైరాగ్యం. మాకది ఆమోదయోగ్యం కాదు. జమ్మూ కశ్మీర్ యంత్రాంగం దన్నుతో దక్షిణ కశీ్మర్లో ఎన్కౌంటర్లు మొదలయ్యాయి’’ అని మండిపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కుదిరిన ఒప్పందం.. చెరో మూడు సీట్లలో కాంగ్రెస్, ఎన్సీ పోటీ
శ్రీనగర్: రానున్న లోక్‌సభ ఎన్నికలల్లో జమ్ముకశ్మీర్, లడఖ్‌లో కలిసి పోటీచేయనున్నట్లు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించాయి. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని మిత్రపక్షాలలైన ఈ రెండు పార్టీల మధ్య తాజాగా సీట్ల ఒప్పందం ఖరారైంది. చెరో మూడు స్థానాల్లో ఈ రెండు పార్టీలు పోటీ చేయనున్నాయి. ఉదంపూర్, జమ్ము, లడఖ్ లోక్‌సభ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడనున్నారు. అనంత్‌నాగ్, బారాముల్లా, శ్రీనగర్ లోక్‌సభ స్థానాల నుంచి ఎన్సీ అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, సల్మాన్ ఖుర్షీద్‌తో జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా సీటు షేరింగ్ ఒప్పందాన్ని ప్రకటించారు. ఇదిలా ఉండగా పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఇప్పటికే కశ్మీర్‌లోని మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. అనంత్‌నాగ్ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎన్సీ అభ్యర్థితోపాటు గులాం నబీ ఆజాద్‌తో ముఫ్తీ తలపడనున్నారు. చదవండి: టీఎంసీ ఎంపీల ఆందోళన.. ఈడ్చుకెళ్లిన పోలీసులు -
జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు - నిపుణుల చర్చలు
హైదరాబాద్: 2023 ఆల్ ఇండియా స్పైసెస్ ఎక్స్‌పోర్టర్స్ ఫోరం (AISEF) వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ (WSO), 2వ ఎడిషన్ నేషనల్ స్పైసెస్ కాన్ఫరెన్స్ 2023 మొదటి రోజును విజయవంతంగా ముగించింది. ఈ సదస్సులో నిపుణులు, పరిశ్రమ నాయకులు సుగంధ ద్రవ్యాల భద్రత, స్థిరత్వానికి సంబంధించిన కీలకమైన సమస్యలపై చర్చించారు. ఈ సదస్సులో పాల్గొనేవారికి ఆత్మీయ స్వాగతం పలికిన వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ 'రామ్‌కుమార్ మీనన్' మాట్లాడుతూ.. సుగంధ ద్రవ్య పరిశ్రమ భద్రత దాని స్థిరత్వాన్ని నిర్ధారించడంలో సామూహిక ప్రయత్నాల ప్రాముఖ్యతను గురించి వ్యాఖ్యానించారు. సుగంధ ద్రవ్యాల భద్రత కేవలం బాధ్యత మాత్రమే కాదు, స్థిరమైన భవిష్యత్తును నిర్మించటానికి చూపాల్సిన నిబద్ధత అని వెల్లడించారు. ఈ పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ మంచి స్థిరమైన ఆదాయానికి అవకాశాలు వున్నాయని చెప్పారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ అఫ్ అరేకనట్ అండ్ స్పైస్ డెవలప్మెంట్ (DASD) డైరెక్టర్ డాక్టర్ హోమి చెరియన్, మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధికి సుగంధ ద్రవ్యాలు ఉత్తమమైన మార్గం, స్థిరమైన వృద్ధి, ఆహార భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తోందన్నారు. డాక్టర్ ఎబి రీమాశ్రీ, డైరెక్టర్ - రీసెర్చ్, స్పైసెస్ బోర్డ్ మాట్లాడుతూ.. మసాలా సాగును ప్రోత్సహించడానికి అవసరమైన పరిజ్ఞానం గురించి వివరిస్తూ.. ఆహార భద్రత పరంగా సుగంధ ద్రవ్యాల పరిశ్రమలో రాజీ పడటం జరగదు, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సురక్షితమైన, అధిక నాణ్యత గల సుగంధ ద్రవ్యాలను అందించడానికి మనం వ్యూహాలు ఖచ్చితంగా ప్రతిబింబించాలని వెల్లడించారు. NSC 2023 వ్యాపార కమిటీ చైర్మన్ చెరియన్ జేవియర్ మాట్లాడుతూ.. 'ఫుడ్ సేఫ్ స్పైసస్ - ది వే ఫార్వార్డ్ టూ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇన్కమ్' సదస్సు కేవలం ఒక సదస్సు మాత్రమే కాదు, మన భవిష్యత్తును బాధ్యతాయుతంగా, స్థిరంగా పరిశ్రమ తీర్చిదిద్దటానికి ఇది పిలుపు అని అన్నారు. సెషన్ రెండవ రోజు మెరుగైన ఇన్పుట్ నిర్వహణ, ఉత్పాదకత, వినూత్న ప్రక్రియలు, మార్కెట్ పోకడలు, సుగంధ ద్రవ్యాల వినూత్న ప్యాకేజింగ్ సవాళ్లు, అవకాశాలు వంటి అంశాలపై మరింత పరిజ్ఞానం ప్రదర్శిస్తుంది. ఈ సదస్సులో పాల్గొనేవారు ఆహార సురక్షిత పద్ధతులు, సుగంధ ద్రవ్యాలు రైతులకు స్థిరమైన, నిలకడతో కూడిన ఆదాయానికి దారితీసే భవిష్యత్తు కోసం ఆకర్షణీయమైన చర్చలు, నిపుణుల సూచనలు, క్రియాత్మక వ్యూహాలను ఆశించవచ్చు. నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ 2023 పరిశ్రమ నాయకులు, నిపుణులు, వాటాదారులకు చర్చలలో పాల్గొనడానికి, మొత్తం సుగంధ ద్రవ్యాల రంగాన్ని పెంచే లక్ష్యంతో వ్యూహాలను అమలు చేయడానికి ఒక వేదికను అందిస్తుంది. ఈ కార్యక్రమానికి వివిధ ఎఫ్పిఓలు, ఎన్జిఓలు హాజరయ్యారు. -
నాలెడ్జ్ క్యాపిటల్‌గా తిరుపతి
తిరుపతి సిటీ : తిరుపతి ఇప్పటికే నాలెడ్జ్ హబ్‌గా పేరుగాంచిందని, త్వరలో నాలెడ్జ్ క్యాపిటల్‌గా తయారవుతుందని ఐజర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్య చెప్పారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియంలో గురువారం సుస్థిర గ్రామీణ జీవనోపాధి సాధనపై జరిగిన జాతీయ సదస్సుకు దేశంలోని పలు వెటర్నరీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వీసీలు, విభాగాల డైరెక్టర్లు, డీన్లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ అనేక ఏళ్లుగా జంతు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. దేశంలో జీవనోపాధికోసం గ్రామీణ ప్రజలు సగటున రోజుకు 30 మంది పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారని, సుస్థిర గ్రామీణ జీవనోపాధికోసం వర్సిటీలు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. జంతు సంరక్షణపై దృష్టి సారించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి మూలాలకు పరిష్కార మార్గాలను కనుగొనాలని పిలుపునిచ్చారు. అనంతరం సదస్సుకు హాజరైన వీసీలు మాట్లాడుతూ మొబైల్ యాప్స్ ద్వారా రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించి వారి ప్రమాణాలను మెరుగుపర్చాలని సూచించారు. పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై జాతీయ సదస్సు దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. పరిశోధనల సంపుటిని ఆవిష్కరించి, అనంతరం శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు పలు అంశాలపై వక్తలు అవగాహన కల్పించారు. సదస్సులో కర్ణాటక బీదర్ వర్సిటీ వీసీ కేసీ వీరన్న, తిరుపతి పద్మావతీ మహిళా వర్సిటీ వీసీ డి భారతి తదితరులు పాల్గొన్నారు. -
చట్టాల్లో మార్పులు అవసరం
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఖైదీలను దండించడానికే రూపొందించిన బ్రిటిష్ కాలం నాటి చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని, కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా తెలిపారు. విశాఖలో సాయిప్రియ రిసార్ట్‌లో రెండు రోజుల పాటు జరిగే అన్ని రాష్ట్రాల జైళ్ల అధిపతుల 8వ జాతీయ సదస్సుకు సోమవారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్రమంత్రి మాట్లాడుతూ.. దేశంలో జైళ్ల సామర్థ్యం కంటే 25 శాతం అధికంగా ఖైదీలు ఉన్నట్టు చెప్పారు. అందులో 80 శాతం మంది అండర్ ట్రయిల్ ఖైదీలేనని వెల్లడించారు. పూర్వకాలం నాటి చట్టాల కారణంగా ఈ సమస్య తలెత్తుతోందన్నారు. జైళ్లు దండించడానికి కాదని, ఖైదీలలో పరివర్తన తీసుకువచ్చి వారికి పునరావాసం కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిటిషర్ల ఆలోచనా ధోరణితో రూపుదిద్దుకున్న చట్టాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందుకు సంబంధించి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టినట్టు తెలిపారు. కేసు దర్యాప్తు నుంచి విచారణ వరకు అన్నీ వేగవంతంగా జరిగేలా మార్పులు చేస్తున్నట్టు వివరించారు. కొత్త బిల్లుతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో జైళ్ల ఆధునికీకరణకు రూ.950 కోట్లు మంజూరు చేసినట్టు కేంద్రమంత్రి వెల్లడించారు. రూ.100 కోట్లతో చేపట్టిన జైళ్ల కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోందన్నారు. ఇప్పటికే 1,100 జైళ్లలో కంప్యూటరీకరణ పూర్తయిందన్నారు. కేంద్ర కారాగారాల్లో నైపుణ్య కేంద్రాలు సదస్సుకు హాజరైన రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జైలు అభివృద్ధి నిధి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పారిశ్రామిక కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయాలు జైలు అభివృద్ధి నిధి ఖాతాలోకి వెళ్తాయని చెప్పారు. ఆ నిధి ఖైదీల సంక్షేమానికి వినియోగిస్తున్నట్టు చెప్పారు. అన్ని కేంద్ర కారాగారాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. గర్భిణి ఖైదీలకు, వారి పిల్లలకు, వృద్ధ మహిళా ఖైదీలకు ప్రత్యేక ఆహారాన్ని అందజేస్తున్నామని వెల్లడించారు. సదస్సులో బీపీఆర్ అండ్ డీ డైరెక్టర్ జనరల్ బాలాజీ శ్రీవాస్తవ్, రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్‌కుమార్ గుప్తా పాల్గొన్నారు. -
నాడు పాక్ అనుకూల నినాదాలు.. నేడు సుప్రీంకోర్టులో చుక్కెదురు..
ఢిల్లీ: పాక్ అనుకూల నినాదాలు చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, ఆర్టికల్ 370 రద్దు ప్రధాన పిటీషనర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. భారత రాజ్యాంగానికి విధేయత చూపుతున్నట్లు లిఖితపూర్వకంగా ప్రమాణం చేయాలని మహ్మద్ అక్బర్ లోన్‌ను ధర్మాసనం కోరింది. 2018లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశాడని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆరోపించడంతో సర్వోన్నత న్యాయస్థానం చర్యలకు పూనుకుంది. "జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని, విధేయత చూపుతానని అక్బర్ లోన్ బేషరతుగా అంగీకరిస్తున్నాడని మేము కోరుకుంటున్నాము" అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. భారత రాజ్యాంగానికి విధేయత చూపుతున్నానని పేర్కొంటూ జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు రేపటిలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కోరింది. నాయకుల మాటలు సమాజంపై ప్రభావం చూపుతాయని పేర్కొంటూ.. క్షమాపణలు కోరకపోతే ఇలాంటి చర్యలను ప్రోత్సహించినట్లవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇది జమ్మూ కశ్మీర్లో శాంతి భద్రతలను కాపాడుతున్న కేంద్రం చర్యలపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే 370 ఆర్టికల్ రద్దు అంశాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై గత కొన్ని రోజులుగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర హోదా మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారని కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..? -
పేర్లు తొలగిస్తే చరిత్ర మారదు
శ్రీనగర్: ప్రముఖ ప్రాంతాలు, కట్టడాలకున్న నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి పేర్లను తొలగించినంత మాత్రాన చరిత్ర దాగదు, మారదని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీకి చెందని ప్రతి నేత పేరును కనిపించకుండా చేస్తోందని ఆయన విమర్శించారు. అయితే, చరిత్ర ఎన్నటికీ మారదు, శాశ్వతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి, ఎన్సీ వ్యవస్థాపకుడు షేక్ మహ్మద్ అబ్దుల్లాను అందరూ పిలుచుకునే షేర్ అనే పేరును ‘షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’నుంచి అధికారులు తొలగించడంపై ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం మొఘలుల 800 ఏళ్ల పాలనను చరిత్ర పుస్తకాల నుంచి తొలగించింది. దానర్థం వారు లేనట్లేనా? తాజ్ మహల్, ఎర్రకోట, జామా మసీదు, కుతుబ్‌మినార్.. తదితర చారిత్రక నిర్మాణాలకు కారకులెవరని చెబుతారు?, మనం, వాళ్లు శాశ్వతం కాదు. చరిత్ర శాశ్వతం, అది మారదు. ఎప్పటికీ అలాగే ఉంటుంది’అని అబ్దుల్లా పేర్కొన్నారు. -
ప్రజల గొంతు నొక్కేయగలరా?
న్యూఢిల్లీ: భారతదేశంలో ఉన్నంత భావ ప్రకటన స్వేచ్ఛ ప్రపంచంలో ఇంకెక్కడా లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. దేశంలో బీజేపీ పాలనలో ప్రజల గొంతు నొక్కేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇటీవల ఓ పత్రిక వ్యాసంలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అవి తనకు బాధ కలిగించాయన్నారు. ప్రజల గొంతును ఎవరూ నొక్కేయలేరని చెప్పారు. బుధవారం ‘మన్‌కీ బాత్ 100 జాతీయ సదస్సు’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినెలా నిర్వహించే ఈ రేడియో కార్యక్రమం దేశానికి ఒక ఆశాదీపమన్నారు. దీనిద్వారా రాజకీయాలకు అతీతంగా మోదీ దేశానికి సందేశమిస్తున్నారని ప్రశంసించారు. కొందరు నాయకులు విదేశాలకు వెళ్లి, మన దేశాన్ని తూలనాడుతున్నారని మండిపడ్డారు. మోదీ హయాంలో ఎంతో అభివృద్ధి జరుగుతోందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మన్ కీ బాత్ 100 కాఫీ టేబుల్ బుక్ తదితరాలను ధన్‌ఖడ్ విడుదల చేశారు. ముఖ్యమైన భావప్రసారం: ఆమిర్ ఖాన్ మన్ కీ బాత్ చాలా ముఖ్యమైన భావప్రసార కార్యక్రమమని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ప్రశంసించారు. మన్ కీ బాత్ ద్వారా మోదీ దేశ ప్రజలతో అనుసంధానం అవుతున్నారని తెలిపారు. అత్యంత కీలకమైన అంశాలపై చర్చిస్తున్నారని, తన ఆలోచనలు పంచుకుంటూ చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారని అమీర్ ఖాన్ ప్రశంసించారు. -
మన్ కీ బాత్ @100.. నేడు జాతీయ సదస్సు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోదీ మాసాంతపు ‘ఆలిండియా రేడియో’ప్రాసంగిక కార్యక్రమం మన్ కీ బాత్ 100 ఎపిసోడ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ జాతీయ సదస్సు నిర్వహించనుంది. దీన్ని బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో నాలుగు ప్రత్యేకచర్చా కార్యక్రమాలుంటాయి. వీటిలో నటులు అమీర్ ఖాన్, రవీనాటాండన్, తెలంగాణ నుంచి నిఖత్ జరీన్, పూర్ణ మలావత్లతో పాటు మన్ కీ బాత్‌లో ప్రధాని ప్రస్తావించిన 100 మందికి పైగా ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. ‘మన్ కీ బాత్’100 ఎపిసోడ్లకు గుర్తుగా పోస్టల్ స్టాంప్, నాణేలను హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు. -
24 కోట్ల ముస్లింలను చైనాకు పంపిస్తారా?
జమ్మూ: దేశాన్ని మత ప్రాతిపదికన విడదీయవద్దని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మోదీ ప్రభుత్వాన్ని కోరారు. ‘‘దేశంలోని 24 కోట్ల ముస్లింలను ఏం చేయాలనుకుంటున్నారు? సముద్రంలోకి విసిరేస్తారా? లేక చైనాకు పంపిస్తారా?’’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ సమానాకాశాలను పొందగలిగే రామరాజ్యం కావాలన్నారు. జమ్మూ కశ్మీర్లో తొందరగా ఎన్నికలు జరపాలని, రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ఈసీని కలిసి కోరాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. -
సకాలంలో సత్యాన్ని వెలికితీయాలి
సాక్షి, హైదరాబాద్: నేరాలు జరిగినప్పుడు సకాలంలో సత్యాన్ని వెలికితీయడం కత్తిమీద సాము లాంటిదని, దీనిలో ఫోరెన్సిక్ సైన్స్ ప్రధాన భూమిక పోషిస్తుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ అన్నారు. ట్రూత్ ల్యాబ్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఫోరెన్సిక్ సైన్స్ వినియోగంపై నల్సార్ యూనివర్సిటీ శనివారం ఇక్కడ నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. క్రిమినల్ కేసుల్లోనే కాదు, సివిల్ కేసుల్లోనూ ఫోరెన్సిక్ సైన్స్ సేవలు అందించాలని సూచించారు. పరిశోధనకు కొత్త మార్గాలను అనుసరించడంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీని ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని మరో మాజీ సీజేఐ జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య అభిప్రాయపడ్డారు. శాస్త్రీయంగా సాక్ష్యాన్ని సమర్థవంతంగా రూపొందించడంలో ఫోరెన్సిక్ పాత్ర కీలకమైనదని అన్నారు. ఆధారాలను వెలికితీయడంలో... న్యాయ రంగంలో ఫోరెన్సిక్ సైన్స్ సహకారం అవసరమని, తద్వారా క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించే వీలు కలుగుతుందని తమిళనాడు మాజీ గవర్నర్ రాంమోహన్‌రావు అన్నారు. క్రిమినల్ కేసులు, మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో ఆధారాలను వెలికితీసేందుకు ఫోరెన్సిక్ సైన్స్ తోడ్పడుతుందని తెలంగాణ హైకోర్టు సీజే, నల్సార్ వర్సిటీ చాన్స్‌లర్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వ్యాఖ్యానించారు. ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను పెంచాలని మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ సూచించారు. రాంమోహన్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్‌మిశ్రా, లా కమిషన్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ జస్టిస్ ఎం.జగన్నాథరావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీవీ రెడ్డి తదితరులు మాట్లాడారు. డీజీపీ అంజనీకుమార్, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ భవానీ ప్రసాద్, జస్టిస్ రఘురామ్, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కృష్ణదేవరావు, డా.గాంధీ పీసీ కాజా, పలువురు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో అభివృద్ధి కన్నా రాజకీయాలపైనే దృష్టి
సాక్షి, హైదరాబాద్/మాదాపూర్: యువతకు ఉద్యోగాల కల్పన దిశగా ఆలోచించే నాయకత్వం దేశానికి అవసరమని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ప్రపంచంలో గుర్తించదగిన బ్రాండ్స్ మన దేశం నుంచి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని, భారత్‌లో మాత్రం ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని దుయ్యబట్టారు. మన దేశంలో కూడా ఆర్థిక అభివృద్ధిపై దృష్టిసారిస్తే నంబర్ వన్‌గా ఎదుగుతామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ (ఆవిష్కరణ,), ఇన్ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక వసతులు), ఇన్‌క్లూజివ్ గ్రోత్ (సమ్మిళిత అభివృద్ధి) అనే మూడు ‘ఐ’ల పై దృష్టి సారించిందని చెప్పారు. దేశ జనాభాలో కేవలం 2.5 శాతమే ఉన్న తెలంగాణ.. దేశ జీడీపీకి 5 శాతం సమకూరుస్తోందన్నారు. దేశానికి నాయకత్వం వహిస్తున్న వారు కేవలం ఎన్నికల కోసమే పనిచేస్తున్న పరిస్థితి ఉందని పరోక్షంగా ప్రధాని మోదీనుద్దేశించి విమర్శించారు. తెలంగాణలో అతిపెద్ద లైఫ్‌సైన్స్ యూనివర్సిటీ, ఏవియేషన్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఎన్హెచ్ఆర్డీ ‘డీకోడ్ ది ఫ్యూచర్’ అనే అంశంలో భాగంగా ‘5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ– తెలంగాణ తోడ్పాటు’పై గురువారం నిర్వహించిన జాతీయస్థాయి సదస్సుకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యువత ఎదురుచూస్తోంది.. మన దేశంలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, మొత్తం జనాభాలో 60 శాతం మంది యువతేనని కేటీఆర్ చెప్పారు. దేశంలో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోందని, ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని ఆలోచన చేయకపోవడం బాధాకరమని అన్నారు. హైదరాబాద్ కన్నా విస్తీర్ణంలో చిన్నగా ఉండే సింగపూర్ అభివృద్ధిలో మాత్రం వేగంగా ముందుకెళ్తున్నదని చెప్పారు. గత ఎనిమిదేళ్లుగా అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ.. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ ప్రఖ్యాతిచెందిన సంస్థలు తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం శుభపరిణామమని చెప్పారు. ఎనిమిదేళ్లలో 47 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులు ఆకర్షించినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను నాలుగేళ్లలోనే పూర్తిచేశామన్నారు. భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ సీపీవో శ్రీనివాస్ ఉడుముల తదితరులు పాల్గొన్నారు. -
4 ‘ఐ’లపైనే దృష్టి: మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ శనివారం దేశవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన బ్లాక్‌ల అభివృద్ధి కోసం ఉద్దేశించిన అభిలషణీయ బ్లాక్ పథకం(అస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం)ను ప్రారంభించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి పథకంలో మాదిరిగానే ఈ కార్యక్రమంలో కూడా భారత్ అభివృద్ధికి నాలుగు స్తంభాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్(మౌలికరంగం), ఇన్వెస్ట్మెంట్(పెట్టుబడి), ఇన్నోవేషన్(ఆవిష్కరణ), ఇంక్లూజన్(సమ్మిళితం)లపైనే దృష్టి సారించాలన్నారు. రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల రెండో జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని శనివారం ప్రసంగించారు. ప్రపంచ సప్లై చైన్‌ను స్థిరతను సాధించేందుకు దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయన్నారు. ఇందుకోసం చిన్న, మధ్య శ్రేణి పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్రాలే చొరవచూపాలన్నారు. అసంబద్ధ అనుమతులు, కాలం చెల్లిన చట్టాలు, నిబంధనలను పక్కనబెట్టాలని చీఫ్ సెక్రటరీలను కోరారు. -
జన భాగస్వామ్యంతోనే జల సంరక్షణ
న్యూఢిల్లీ: దేశంలో జల సంరక్షణ విషయంలో కేవలం ప్రభుత్వం తీసుకొనే చర్యలే సరిపోవని, ప్రజలందరి భాగసామ్యంతోనే అది సాధ్యమవుతుందని, ఆశించిన ఫలితాలు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జల సంరక్షణ ఉద్యమంతో అనుసంధానమైతేనే ప్రజలకు ఇందులోని తీవ్రత, ప్రాధాన్యం తెలుస్తుందని అన్నారు. కార్యక్రమ ఉద్దేశం అర్థమైతే వారు దాన్ని సొంతం చేసుకుంటారని తెలిపారు. గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిర్వహించిన రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల తొలి జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, భాగస్వామ్యానికి నీరు ఒక కీలకాంశం కావాలని చెప్పారు. దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నీటి పంపకాలపై ముందుగానే దృష్టి పెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల మధ్య నడుమ దశాబ్దాలుగా జల వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘వాటర్ విజన్–2047’ మన రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం జలం అనేది రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. మనం నిర్దేశించుకున్న సమ్మిళిత లక్ష్యాల సాధనకు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే 25 ఏళ్లలో సాగించబోయే ‘అమృతకాల’ ప్రయాణంలో ‘వాటర్ విజన్–2047’ అనేది అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎక్కువ శాతం పనులు జల సంరక్షణ దిశగానే జరగాలని చెప్పారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు. ప్రజలతోపాటు సామాజిక సంస్థలు, పౌర సంస్థలు సైతం జల సంరక్షణ ఉద్యమాల్లో పాలుపంచుకోవాలని కోరారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం అంటే దాని అర్థం ప్రభుత్వపరంగా పారదర్శకత తగ్గించడం కాదన్నారు. అలాగే మొత్తం బాధ్యతను ప్రజలపై మోపడం కాదని తేల్చిచెప్పారు. జల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడానికి స్థానికంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి జిల్లాలో అమృత సరోవరాలు ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ తెలియజేశారు. ఇప్పటికే 25,000 సరోవరాలు నిర్మించినట్లు చెప్పారు. ప్రతి సరోవరం కనీసం ఎకరం వైశాల్యంలో ఉంటుందని, ఇందులో 10,000 క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయొచ్చని అన్నారు. జల సంరక్షణకు జియో–సెన్సింగ్, జియో–మ్యాపింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలు వాడుకోవాలని సూచించారు. టెక్నాలజీ–పరిశ్రమలు–స్టార్టప్‌లను అనుసంధాస్తే చక్కటి ఫలితాలు వస్తాయన్నారు. నమామి గంగా మిషన్ తరహాలో నదుల ప్రక్షాళనకు రాష్ట్రాలు సైతం నడుం బిగించాలని ప్రధానమంత్రి విన్నవించారు. నదుల, జల వనరులను కాపాడుకోవాలన్నారు. ప్రతి రాష్ట్రంలో చెత్త నిర్మూలన, మురుగునీటి శుద్ధి కోసం నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. తాజా నీటిని సంరక్షించుకోవడం, మురుగునీటిని శుద్ధి చేసి మళ్లీ వాడుకోవడం పర్యావరణానికి చాలా మేలు చేస్తుందని వివరించారు. ‘ప్రైమ్ మినిస్టర్ అగ్రికల్చర్ ఇరిగేషన్ స్కీమ్’ కింద 70 లక్షల హెక్టార్లకుపైగా భూమిని సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. -
‘పాజిటివ్’గా ఉండండి
బంజారాహిల్స్: అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణకు సంబంధించిన పాజిటివ్ వార్తలను మీడియా చూపాలని మున్సిపల్, ఐటీమంత్రి కె. తారక రామారావు సూచించారు. ప్రస్తుతం ఏ మీడియాలో అయినా పాజిటివ్ కంటే నెగెటివే ఎక్కువ వ్యాప్తి చెందుతోందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ‘మీడియా ఇన్ తెలంగాణ పాస్ట్–ప్రజంట్–ఫ్యూచర్’ అనే అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ హైదరాబాద్‌లో వర్షం వచ్చినప్పుడు రెండు కాలనీలు మునిగితే హైదరాబాద్ మునిగినంత హడావుడిగా వార్తలు పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయన్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రయాణించే హెలికాప్టర్ క్యాబిన్ హైదరాబాద్‌లో తయారవుతున్నా అది పతాక శీర్షికలకు ఎందుకు ఎక్కడం లేదని ప్రశ్నించారు. చైనాలో భారీ ప్రాజెక్టు కడితే అది వార్త అవుతోందని.. అదే తెలంగాణలో కడితే మాత్రం వార్తల్లోకి ఎందుకు ఎక్కడంలేదని... ఇదెక్కడి పక్షపాతమన్నారు. మిషన్ భగీరథ వల్ల చెరువు కట్టలు బలంగా ఉండి తెగడం లేదని... అయితే ఇది వార్త కానట్లుగా కట్ట తెగితేనే హెడ్‌లైన్స్‌లో వార్తలు ప్రచురిస్తున్నారన్నారు. పాలు, చేపలు, ధాన్యం ఉత్పత్తిలో అందరికంటే తెలంగాణ ముందుందని ఇవి ఎందుకు వార్తలు కావడంలేదన్నారు. ప్రతిభ లేకుండా రాజకీయాల్లో రాణించలేరు.. ప్రతిభ లేకుండా రాజకీయాల్లో ఎవరూ రాణించలేరని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో వారసత్వం ఎంట్రీ కార్డ్‌గా మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని కూడా ప్రజలు భరించరన్నారు. ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ప్రజలు ఓడించారని గుర్తుచేశారు. సిరిసిల్లలో తొలిసారి పోటీ చేసిన తాను కేవలం 150 ఓట్ల తేడాతో గెలిచానని.. తన పనితీరుతో ప్రతి ఎన్నికల్లోనూ మెజారిటీ పెంచుకుంటూ వచ్చానని చెప్పారు. పరిశోధనాత్మక జర్నలిస్టులేరీ? దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమవుతున్నా అవి వార్తలుగా రావడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం పరిశోధనాత్మక జర్నలిస్టులు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను పాత్రికేయులను నిందించడం లేదన్నారు. దేశంలో మీడియా ప్రస్తుతం ‘మోడియా’గా మారిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, అంబేడ్కర్ వర్సిటీ వీసీ సీతారామారావు, వర్సిటీ అకడమిక్ డైరెక్టర్ ఘంటా చక్రపాణి, ఎఫ్‌సీసీ చైర్ అడ్వయిజరీ కమిటీ ఇంటర్నేషనల్ జర్నలిస్టు ఎస్. వెంకట్ నారాయణ్, సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి, సాక్షి సీనియర్ జర్నలిస్టు విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పత్రికా పఠనం తండ్రి నేర్పిన అలవాటు.. తన తండ్రి కేసీఆర్ నేర్పిన కొన్ని అలవాట్లలో పేపర్ చదవడం కూడా ఒకటని కేటీఆర్ చెప్పారు. దీపావళి, దసరా సందర్భంగా రెండుసార్లు పత్రికలు రాకపోతే ఏదో కోల్పోయిన భావన తనకు ఏర్పడుతుందన్నారు. నిత్యం తాను 13 పత్రికలు చదువుతున్నానని వివరించారు. కొన్ని పత్రికలు చంద్రబాబును ఆహా.. ఓహో అన్నాయి తెలంగాణ ఉద్యమం సహా టీఆర్ఎస్ స్థాపన సమయంలో తమకు మీడియా మద్దతు లభించలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా 2001లో టీఆర్ఎస్ను స్థాపించిన సమయంలో రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని.. కొన్ని పత్రికలు మాత్రం ఆయన గురించి ఆహా... ఓహో అంటూ, ఇంద్రుడు, చంద్రుడు అంటూ రాసేవని గుర్తుచేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వార్తలు కొన్ని పత్రికల్లో పతాక శీర్షికల్లో నిత్యం నిలిచేవని, కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు, ఉద్యమ సమయంలోనూ ఆ స్థాయి వార్తలు రాలేదన్నారు. అయినప్పటికీ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ముందుకు సాగిందంటే అందుకు తెలంగాణ జర్నలిస్టులే కారణమన్నారు. వారే తమకు అండగా నిలబడ్డారని.. అందుకే ఉద్యమానికి అండగా నిలిచిన చాలా మంది జర్నలిస్టులకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించుకున్నామని కేటీఆర్ చెప్పారు. -
ప్లీనరీలో జిన్‌పింగ్ వర్క్ రిపోర్ట్
బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదివారం అధికార కమ్యూనిస్ట్ పార్టీ ప్లీనరీ నిర్వహించారు. తన పాలనలో సాధించిన విజయాలు, భవిష్యత్తు దార్శనికతపై ఒక వర్క్ రిపోర్ట్‌ను ఈ సందర్భంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 400 మంది సీనియర్ నేతలు పాల్గొన్నారు. కొన్ని కీలక విధానాలు, డాక్యుమెంట్లపై చర్చించారు. ఈ నెల 16న జరగబోయే కమ్యూనిస్ట్ పార్టీ 20వ జాతీయ సదస్సుకు సన్నాహకంగా ఈ ప్లీనరీని నిర్వహించినట్లు తెలుస్తోంది. జిన్‌పింగ్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ జాతీయ సదస్సులో తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. ఆయన గత పదేళ్లుగా పదవిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చైనా కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సదస్సును ఐదేళ్లకోసారి నిర్వహిస్తారు. చైనా అధ్యక్షుడు పదేళ్లకు మించి అధికారంలో ఉండడానికి వీల్లేదు. కానీ, 2018లో రాజ్యాంగాన్ని సవరించారు. పదేళ్ల పదవీ కాలం నిబంధనను తొలగించారు. జిన్‌పింగ్ మరో ఐదేళ్లు అధ్యక్షుడిగా పదవీలో ఉండడానికి వీలు కల్పించారు. -
పర్యాటకంలో ప్రైవేటు భాగస్వామ్యం కావాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ పర్యాట క రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు భాగస్వామ్యం కూడా అవసరమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా అనంతర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులకు గురైన పర్యాటక రంగానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం లభించే ఏకైక రంగం పర్యాటకమేనని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరుగుతున్న రాష్ట్రాల పర్యాటక మంత్రుల జాతీయ సదస్సు రెండో రోజున కిషన్‌రెడ్డి మాట్లాడారు. దేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటోందని.. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పో టీ అత్యంత అవసరమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరిగే గిరిజన పండుగలు, వినాయక చవితి ఉత్సవాలు, బతుకమ్మ, విజయదశమి, సమ్మక్క–సారలమ్మ, కుంభమేళా వంటి జాతరలను ఘనంగా నిర్వహించడం ద్వారా పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం ఇవ్వగలమన్నారు. -
కార్మిక చట్టాల పటిష్టతకు ఏపీ నుంచి పూర్తి సహకారం అందిస్తాం: సీఎం జగన్
-
ఏపీ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో 47వ జాతీయ కార్మిక సదస్సు రెండు రోజులపాటు అట్టహాసంగా జరిగింది. 19 రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులు విచ్చేయగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ జాతీయ కార్మిక సదస్సు ముగింపు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. 'ఈ సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. తిరుపతిలో జరుగుతున్న ఈ సదస్సుకి ముఖ్యులంతా రావడం సంతోషకరం. ఒక జాతీయ సదస్సుకి తిరుపతిని వేదికగా చేసిన కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఈ సదస్సుకి వచ్చిన అందరికీ తిరుమల బాలాజీ దీవెనలు ఉంటాయని భావిస్తున్నాను. గడిచిన రెండు రోజులుగా ఈ సదస్సులో చర్చించిన అంశాలు కార్మిక చట్టాల పటిష్టతకు మరింతగా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాల రూపకల్పన, బలోపేతంలో ఈ సదస్సు ద్వారా చేసిన మేధోమధనం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఏపీలో ఈ సదస్సు జరగడం ఆనందదాయకం, అంతేకాక ఇది గౌరవంగా భావిస్తున్నాం. అందరికీ బెస్ట్ విషెష్ చెబుతూ' సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. చదవండి: (భారతదేశం శ్రామికుడి శక్తి : ప్రధాని) -
ఓటర్ల జాబితాపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఓటర్ల జాబితా విషయంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) చేసిన ప్రకటనపై కొన్ని దుష్టశక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సీఈఓ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ శనివారం స్థానిక దినపత్రికల్లో ఒక ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్లో ఓటర్ల జాబితా రివిజన్ తర్వాత కొత్తగా 25 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యే అవకాశం ఉందని సీఈఓ ఆగస్టు 17న విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీనిపై రాజకీయంగా అలజడి రేగింది. బయటి వ్యక్తులను తీసుకొచ్చి, ఓటు హక్కు కల్పించేందుకు కుట్ర పన్నారని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఈ అంశంపై చర్చించేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా సోమవారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు వివరణ ఇచ్చారు. -
పంచాయతీకొక సొసైటీ
న్యూఢిల్లీ: సహకార సంఘాల ద్వారా రైతులకు రూ.10 లక్షల కోట్ల మేర చేయూత నివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా కొత్తగా 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(ప్యాక్స్)ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రామీణ సహకార బ్యాంకింగ్ విధానంపై కేంద్ర సహకార శాఖ, రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య(ఎన్ఏఎఫ్ఎస్సీవోబీ) నిర్వహించిన జాతీయ సదస్సులో శుక్రవారం అమిత్ షా మాట్లాడారు. ‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 95 వేల ప్యాక్స్‌లో కేవలం 63 వేలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇవి రూ.2 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను అందజేస్తున్నాయి. వ్యవసాయ రుణ విధానానికి గుండెకాయలాంటి ప్యాక్స్‌ను విస్తరించి, పటిష్టం చేయాలి. ఇందుకోసం పంచాయతీ కొకటి చొప్పున దేశంలోని 3 లక్షల పంచాయతీలకు మరో 2 లక్షల ప్యాక్స్ నెలకొల్పాల్సిన అవసరం ఉంది’అని ఆయన చెప్పారు. ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించగలిగితే రూ.10 లక్షల కోట్ల రుణ సాయం అందించేందుకు వీలవుతుందని అన్నారు. మోడల్ బై–లాస్‌తోపాటు నూతన సహకార విధానం, సహకార వర్సిటీ, ఎక్స్పోర్ట్ హౌస్, సహకార బ్యాంకులకు డేటాబేస్ అభివృద్ధి వంటివి కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి అమిత్ షా వెల్లడించారు. -
ఏపీని ఆదర్శంగా తీసుకోవాలి: కేంద్రమంత్రి
సాక్షి, అమరావతి: వ్యవసాయరంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పిలుపునిచ్చారు. ఏపీలో గ్రామస్థాయిలో రైతులకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) అద్భుత ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ఆర్బీకేలతో పాటు ఏపీలో అమలు చేస్తున్న ఈ–క్రాపింగ్, ప్రకృతిసేద్యాన్ని ఆదర్శంగా తీసుకుని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు. బెంగళూరులో వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రుల రెండురోజుల జాతీయసదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి సాగు ఉత్పాదకాలను నేరుగా రైతుల ముంగిటకు తీసుకువెళుతున్నారని చెప్పారు. ఇందుకోసం గ్రామస్థాయిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. రైతులకు సాగులో సలహాలు, సూచనలతోపాటు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను కూడా ఆర్బీకేల ద్వారా అందిస్తున్నారని చెప్పారు. సాగవుతున్న ప్రతి పంటను గుర్తించేందుకు ఈ–క్రాప్ వినూత్నమైన ఆలోచనన్నారు. ఈ–క్రాప్‌ను ప్రామాణికంగా తీసుకుని వాస్తవ సాగుదారులకు ఏపీలో సంక్షేమ ఫలాలు అందిస్తున్న విధానం ఆదర్శనీయంగా ఉందని చెప్పారు. రసాయన అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు ప్రకృతిసేద్యంపై కేంద్రం ప్రత్యేకదృష్టి పెట్టిందన్నారు. ఇప్పటికే ఏపీలో ఈ తరహా ప్రకృతిసేద్యాన్ని పెద్దఎత్తున అక్కడి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. లక్షలాదిమంది రైతులు ఇప్పటికే ప్రకృతిసేద్యం వైపు వెళ్లారని తెలిపారు. ఇదేరీతిలో ఏపీని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన రాష్ట్రాలు కూడా తమ వ్యవసాయ విధానాల్లో మార్పులు, సంస్కరణలు తీసుకువచ్చేందుకు కృషిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనను ఈ–క్రాప్‌తో అనుసంధానం చేస్తాం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ రైతుభరోసా, పీఎం కిసాన్ కింద రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా రైతు ఖాతాల్లో ఏటా మూడు విడతల్లో రూ.13,500 జమచేస్తోందని చెప్పారు. ఈ మొత్తంలో రూ.7,500 రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుండగా రూ.6 వేలను కేంద్రం పీఎం కిసాన్ పథకం ద్వారా సర్దుబాటు చేస్తోందని తెలిపారు. రైతుభరోసా సొమ్మును ఖరీఫ్ సీజన్‌కు ముందు మే నెలలోను, రబీ సీజన్‌కు ముందు అక్టోబర్‌లోను తాము రైతుల ఖాతాల్లో జమచేస్తున్నామని చెప్పారు. పీఎం కిసాన్ నిధులు మాత్రం సీజన్‌కు మధ్య రెండేసి వేల చొప్పున జమ చేస్తున్నారని తెలిపారు. రైతుభరోసా మాదిరిగానే మే నెలలో రూ.3 వేలు, అక్టోబర్‌లో రూ.3 వేలు సర్దుబాటు చేస్తే రైతులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. ఈ దిశగా ఆలోచించాలని కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి ఏపీ వరకు తప్పనిసరిగా ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ–క్రాప్‌తో అనుసంధానం చేస్తూ ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనను రైతులందరికీ వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఈ సదస్సులో కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై, ఏపీ వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఇన్చార్జ్ కమిషనర్ డాక్టర్ గడ్డం శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ సదస్సులో ఆకట్టుకున్న సర్పంచ్ ప్రసంగం
రామవరప్పాడు: ‘సుపరిపాలన’ అంశంపై మంగళవారం ఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు సర్పంచ్ శీలం రంగారావు ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఈనెల 11వ తేదీ నుంచి 17 వరకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ‘సుపరిపాలన’ అంశంపై జాతీయ సదస్సు జరుగుతున్న విషయం విదితమే. ఈ జాతీయ సదస్సులో రంగారావు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవంతంగా అమలు చేస్తున్న నవరత్న పథకాలు, రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తున్న తీరు, సంక్షేమ పథకాలు, పరిపాలన విధానం, సచివాలయ వ్యవస్థపై విపులంగా వివరించారు. ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రజలకు దాదాపు 640కిపైగా పౌరసేవలను సీఎం జగన్ అందిస్తున్నారని చెప్పారు. నాడు–నేడు పథకం ద్వారా శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు, వైద్యశాలలకు కొత్తరూపు తీసుకొచ్చారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్, పేదలందరికీ ఇళ్లు, వైఎస్సార్ ఆసరా, చేయూత, పింఛన్ల పెంపు, అమ్మ ఒడి, రైతు భరోసా, జలయజ్ఞం తదితర పథకాల అమలు తీరును స్పష్టంగా వివరించారు. సదస్సులో మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమా మహదేవన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
Telangana: ఎగసిన జల.. లక్ష్మీ కళ
సాక్షి, హైదరాబాద్: ‘నీళ్లు, వ్యవసాయంపై గత ఏడేళ్లలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు రాష్ట్రానికి లక్ష్మిని తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) తాజా వార్షిక నివేదిక ప్రకారం 2014–15లో రూ. 5.50 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ 2021–22లో రెట్టింపై రూ. 11.54 లక్షల కోట్లకు పెరిగింది. వ్యవసాయం, అను బంధ రంగాల్లో సాధించిన వృద్ధి జీఎస్డీపీ పెరుగుదలకు దోహదపడింది. ఈ రంగాల ఉత్పత్తి విలువ రూ. 90,828 కోట్ల నుంచి రూ. 2,16,285 కోట్లకు పెరగడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం సైతంరూ. 2,78,933కు పెరిగింది. జీఎస్డీపీ వృద్ధిలో ఏటా ఒక రాష్ట్రాన్ని అధిగమిస్తూ రాష్ట్రం పురోగమిస్తోంది. తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది’అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో నదులపై జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన వెంటనే నదుల పునరుజ్జీవం, చెరువుల పునరుద్ధరణను సీఎం కేసీఆర్ ప్రాధాన్య అంశంగా చేపట్టారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన 46 వేల చెరువులను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించడంతో 25 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 25 లక్షల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు లభిస్తోందని హరీశ్‌రావు చెప్పారు. గతంలో భారీ వర్షాలకు చెరువులు తెగిప్రాణ, ఆస్తి నష్టం జరిగేదని, మిషన్ కాకతీయ కింద చెరువు కట్టలు, తూ ములు, అలుగులను పటిష్టం చేయడంతో అలాంటి ఘటనలు జరగడం లేదన్నారు. వా గులు, వంకల్లోని నీళ్లు వృథా కాకుండా రూ. 6 వేల కోట్లతో రాష్ట్రంలో 4 వేల చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నామన్నారు. ప్రతి వర్షపు చుక్కను చెరువులు ఒడిసి పట్టుకుంటున్నాయని, చెక్డ్యాముల్లో ఏడాదంతా నీళ్లు నిల్వ ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. గోదావరిపై 141 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 5 రిజర్వాయర్లను నిర్మించడంతో 300 కి.మీల జీవనదిగా మారిందని వివరించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లను వెనక్కి తీసుకొచ్చి నదికి కొత్త నడకను సీఎం కేసీఆర్ నేర్పారని ప్రశంసించారు. వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేం ద్రసింగ్ ఆలోచనల్నే సీఎం కేసీఆర్ అమలు చేశారని వివరించారు. ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతులకు ఏళ్లు పడుతున్నాయని, ఈ విధానంలో మార్పులు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రెండేళ్లలో రైతు ఆత్మహత్యలు కనుమరుగు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతుబంధు, సాగునీరు, కరెంట్ సదుపాయంతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని, రెండేళ్లలో పూర్తిగా నిర్మూలిస్తామని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జల సంరక్షణకు కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు సదస్సు చివరలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురస్కారాలు అందజేశారు. మూడేళ్లలో మూసీలో తాగునీళ్లు... మూసీ నది ప్రక్షాళన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ఎస్టీపీల నిర్మాణం, మురుగు కాల్వ మళ్లింపు పనులు జరుగుతున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గోదావరి నీళ్లను సైతం మూసీకి తరలిస్తున్నామన్నారు. రెండు, మూడేళ్లలో మూసీలో స్వచ్ఛమైన తాగునీళ్లను చూస్తామన్నారు. మూసీని ప్రక్షాళన చేయాలని రాజేంద్రసింగ్ విజ్ఞప్తి చేయగా హరీశ్‌రావు ఈ మేరకు హామీ ఇచ్చారు. స్వచ్ఛమైన మూసీ నది ఒడ్డున మూడేళ్ల తర్వాత రాజేంద్రసింగ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో జలవిశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని రాజేంద్రసింగ్ ఈ అంళాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. దేశంలోని నదులన్నీ ఐసీయూలో..: రాజేంద్రసింగ్ గంగ, యమున, మూసీ సహా దేశంలోని నదులన్నీ ఐసీయూలో ఉన్నాయని, వాటి పరిరక్షణకు అధిక చొరవ తీసుకోవాల్సిన అవసరముందని రాజేంద్రసింగ్ స్పష్టం చేశారు. దేశంలో ఒక్క నది కూడా ఆరోగ్యంగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కళ్లలో నీళ్లున్నాయని, నీళ్లపై లక్ష్మిని ఖర్చు పెడుతున్నారని అభినందించారు. -
జమ్మూలో 6..కశ్మీర్లో 1
న్యూఢిల్లీ: జమ్మూ ప్రాంతంలో అదనంగా ఆరు నియోజకవర్గాలు, కశ్మీర్ ప్రాంతంలో ఒక అసెంబ్లీ స్థానాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ప్రతిపాదించింది. ఎస్సీలు, ఎస్టీలకు 16 నియోజకవర్గాలను రిజర్వు చేసింది. ప్రస్తుతం కశ్మీర్ డివిజన్లో 46, జమ్మూ డివిజన్లో 37 అసెంబ్లీ సీట్లున్నాయి. అయితే, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతానికి చెందిన 24 అసెంబ్లీ స్థానాలు కశ్మీర్ అసెంబ్లీలో ఖాళీగానే కొనసాగుతాయి. జమ్మూకశ్మీర్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనలపై నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీడీపీ తదితర పార్టీలతోపాటు బీజేపీ మిత్రపక్షం పీపుల్స్ కాన్ఫరెన్స్ కూడా తీవ్ర నిరసన తెలిపాయి. ఈ సిఫారసులను బీజేపీ రాజకీయ ఎజెండాగా నేషనల్ కాన్ఫరెన్స్ అభివర్ణించింది. 2019 ఆగస్ట్‌లో జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత, 2020 ఫిబ్రవరిలో పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలోని ఈ కమిషన్‌లో జమ్మూకశ్మీర్‌కు చెందిన ఐదుగురు లోక్‌సభ ఎంపీలు అసోసియేట్ సభ్యులుగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్‌చంద్ర ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. సోమవారం జరిగిన కమిషన్ మొట్టమొదటి సమావేశానికి ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సహా బీజేపీ ఎంపీలు ఇద్దరు హాజరయ్యారు. ఈ ప్రతిపాదనలపై ఆయా పార్టీలు డిసెంబర్ 31వ తేదీలోగా తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. సమావేశం అనంతరం ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ.. గుప్కార్ డిక్లరేషన్‌లో భాగమైన ఐదు పార్టీల నేతలతో చర్చించాకే ఈ ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. ప్రతిపాదనలను అంగీకరించం ఈ ప్రతిపాదనలు నిరుత్సాహాన్ని కలిగిం చాయని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. ‘ప్రతిపాదనల కోసం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన కమిషన్.. బీజేపీ రాజకీయ అజెండాను ముందుకు తీసుకురావడానికే మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. శాస్త్రీయ విధానాలకు బదులు రాజకీయ ఉద్దేశాలతోనే ప్రతిపాదనలకు రూపకల్పన చేశారు. 2011 జనగణన వివరాలను ఆధారంగా తీసుకోలేదు. వీటిని మేం అంగీకరించం’అని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనలపై సంతకం పెట్టేది లేదని ఎన్సీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ప్రజలను మత, ప్రాంతాల వారీగా విభజించేందుకు, బీజేపీ రాజకీయ ప్రయోజనాలను కాపాడేందుకే ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ దుయ్యబట్టారు. -
ఎదురులేని నేతగా జిన్‌పింగ్
బీజింగ్: డ్రాగన్ దేశంపై అధ్యక్షుడు జీ జిన్‌పింగ్(68) మరింత పట్టు బిగించారు. చైనా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆయన వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగమమైనట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. వందేళ్లలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) సాధించిన విజయాలను, జిన్‌పింగ్ నాయకత్వంలో చైనా సాధించిన ఘనతలను, అభివృద్ధిని ప్రస్తుతిస్తూ అధికార సీపీసీ 19వ కేంద్ర కమిటీ ఆరో ప్లీనరీలో చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించారు. పార్టీ చరిత్రలో ఇలాంటి తీర్మానం చేయడం ఇది మూడోసారి మాత్రమే కావడం గమనార్హం. రాజధాని బీజింగ్‌లో ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన సీపీసీ ప్లీనరీ గురువారం ముగిసింది. నాలుగు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో కీలకమైన అంశాలపై చర్చించారు. కమ్యూనిస్టు పార్టీ శుక్రవారం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనుంది. ప్లీనరీలో జిన్‌పింగ్ సీపీసీ కేంద్ర కమిటీ పొలిటికల్ బ్యూరో తరపున వర్క్ రిపోర్టు సమర్పించారు. తీర్మానం ముసాయిదాపై మాట్లాడారు. సీపీసీ 20వ జాతీయ సదస్సును(ఐదేళ్లకోసారి జరుగుతుంది) 2022లో జూలై తర్వాత నిర్వహించనున్నారు. మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ ఎంపికను ఆ సదస్సులో అధికారికంగా ఆమోదించనున్నారు. ఆయన ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శిగా, చైనా త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌గా(సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్), దేశాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మూడు అత్యంత శక్తివంతమైన పదవుల్లో ఏకకాలంలో కొనసాగుతున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఆ వెంటనే మరోసారి అదే పదవిని చేపట్టేందుకు రంగం సిద్ధమైనట్లే. చైనాలో మూడుసార్లు అధ్యక్ష పదవిని అధిష్టించే అవకాశం ఇప్పటిదాకా ఎవరికీ దక్కలేదు. 2018లో చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం జిన్‌పింగ్ జీవితకాలం అధ్యక్ష పదవిలో కొనసాగే వెసులుబాటు కూడా ఉంది. -
మహాత్ముని తర్వాత మోదీయే: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ తర్వాత భారత సమాజం, ప్రజల అంతరంగం లోతుగా తెలిసిన ఏకైక నేత ప్రధాని మోదీయేనని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పొగడ్తల వర్షం కురిపించారు. సవాళ్లను ఆయన ఎలా అధిగమించారో చూస్తే సమాజంపై ఆయనకు ఎంతటి అవగాహన ఉందో తెలుస్తుందని చెప్పారు. ప్రభుత్వాధినేతగా నరేంద్రమోదీ రెండు దశాబ్దాల పాలన అంశంపై జరిగిన జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన శుక్రవారం మాట్లాడారు. మేనేజ్మెంట్ కాలేజీల్లో విద్యార్థులకు ‘సమర్థ నాయకత్వం, సమర్థవ పాలన‘ అంశంపై రెండు దశాబ్దాల మోదీ రాజకీయ ప్రస్థానాన్ని పాఠ్యాంశంగా చేయాలన్నారు. 20 ఏళ్ల పాలనాకాలంలో ఆయనపై ఎటువంటి అవినీతి మరక పడలేదన్నారు. ప్రధాని మోదీని 24 క్యారెట్ల బంగారం అంటూ ఆకాశానికి ఎత్తేశారు. 100 ఏళ్ల క్రితం గాంధీజీ స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించగా, ప్రస్తుతం ప్రధాని మోదీ స్వదేశీ 4.0కు కొత్త నిర్వచనం చెప్పారన్నారు. 2001–2014 సంవత్సరాల్లో మోదీ గుజరాత్ సీఎంగా, 2014 నుంచి దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు. -
ఓబీసీల హక్కులకు బాసటగా నిలవాలి
సాక్షి, హైదరాబాద్: వెనకబడిన తరగతుల హక్కుల రక్షణ బాధ్యత జాతీయ బీసీ కమిషన్(ఎన్సీబీసీ)పై ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. బీసీల అభ్యున్నతికి ఈ కమిషన్ మరింత పాటుపడాలని సూచించారు. ఎన్సీబీసీ రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆదివారం ఇక్కడి ఖైరతబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఆ కమిషన్ చైర్మన్ భగవాన్లాల్ సహానీ అధ్యక్షతన జరిగిన జాతీయ సదస్సులో తమిళిసై మాట్లాడారు. ఎన్సీబీసీ పనితీరు మెరుగ్గా ఉందని, దీంతో క్షేత్రస్థాయిలో ఓబీసీల్లో ధైర్యాన్ని నింపిందని కొనియాడారు. ప్రధాని మోదీ వల్లే ఎన్సీబీసీకి చట్టబద్ధత, రాజ్యాంగ హోదా దక్కాయని అన్నారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ కేబినెట్లో 27 మం ది బీసీలకు ప్రాతినిధ్యం కల్పించి బీసీల పట్ల బీజేపీ తన ప్రేమను చాటుకుందన్నారు. రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో కాకుండా రాష్ట్రాలకే ఇచ్చిందని, నాగాలాండ్‌లో గిరిజనులకు అక్కడ 85 %ఎస్టీ రిజర్వేషన్లు అమలవుతున్నాయని గుర్తుచేశారు. విద్యతోనే భవిష్యత్తు: దత్తాత్రేయ హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ గొర్లు, బర్లు పంపిణీ చేస్తే లాభం ఉండదని, విద్యతోనే ఉత్తమ భవిష్యత్తుకు బాట వేసిన వాళ్లమవుతామని అభిప్రాయపడ్డారు. బీసీలకు కేటాయించిన 27 % రిజర్వేషన్లు పక్కాగా అమలయ్యేలా ఎన్సీబీసీ కఠినంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ రంగంతో సమానంగా ప్రైవేటు రంగంలో కూడా దళిత, బహుజనులు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రతి రంగంలో మహిళలకు సముచితస్థానం క ల్పించాల్సిన అవసరముందన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా ఎన్సీబీసీ రెండేళ్ల పురోగతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ఎన్సీబీసీ రెండేళ్ల విజయాలను సభలో వివరించారు. బీసీ గణనపై రగడ జనగణనలో బీసీ కులాలవారీగా గణాంకాలు సేకరించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు సభలో నినాదాలు చేశారు. దీంతో సభ కొంతసేపు గందరగోళంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనాకారులను అదుపులోకి తీసుకోవడంతో సభ సాఫీగా సాగింది. -
26న రైతుల జాతీయ సదస్సు
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమై 9 నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 26న జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా సోమవారం ప్రకటించింది. ఇందులో స్థానిక, ప్రాంతీయ, జాతీయ స్థాయిల నుంచి వందలాది రైతు సంస్థలు పాల్గొంటాయని పేర్కొంది. ఈ సదస్సుకు సంబంధించిన వేదిక వివరాలను త్వరలో చెబుతామని రైతు సంఘాల నేత ఒకరు చెప్పారు. సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ రైతులు చేస్తున్న నిరసనలు కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. పరిష్కారం కోసం ప్రభుత్వం, రైతు నాయకుల మధ్య 10 రౌండ్ల చర్చలు జరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. నర్మదా బచావో ఆందోళన్ జరిగి 36 ఏళ్లు పూర్తవుతున్నసందర్భంగా ఆగస్టు 17న నర్మదా కిసాన్ మజ్దూర్ జన్ సంసద్ జరగనుంది. ఈ సమావేశానికి మధ్యప్రదేశ్, గుజరాత్ రైతులు హాజరయ్యే అవకాశం ఉంది. -
Jammu Kashmir: శుభ పరిణామం
రెండేళ్లనాడు ఉన్నట్టుండి జమ్మూ–కశ్మీర్ రాజకీయ చిత్రపటాన్ని సమూలంగా మార్చేసే నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం... గురువారం కశ్మీర్‌కు చెందిన ప్రధాన రాజకీయ పక్షాలతో మూడు గంటలపాటు చర్చలు జరిపింది. ఈ సమావేశానికి నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలనుంచి 14 మంది నేతలు హాజరయ్యారు. గత రెండేళ్లుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నవారికి ఇలాంటి చర్చలు సాధ్యమవుతాయన్న ఊహ కూడా వచ్చి వుండదు. అక్కడ విపక్ష నాయకులందరినీ గృహ నిర్బంధంలో వుంచారు. సమస్యలు సృష్టించగలరని భావించిన వేలాదిమందిని ఖైదు చేశారు. సుదీర్ఘకాలంపాటు మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ప్రధాన పార్టీల నేతలు ఇన్నాళ్లుగా కశ్మీర్‌ను దోచుకున్నారని, వారు పాకిస్తాన్ తొత్తులని, ‘నయా కశ్మీర్’లో అలాంటి శక్తులకు స్థానం లేదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం చర్చలకు పిలుస్తుందని, విపక్షాలు హాజరవుతాయని... ఇరు పక్షాలూ ఒకే ఫొటోలో ఇమిడిపోతారని ఎవరూ అనుకుని వుండరు. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. చర్చలకు వెళ్లాలా వద్దా అని విపక్షాల కూటమి తర్జనభర్జన పడినా, చివరకు చర్చలకే మొగ్గుచూపింది. జమ్మూ–కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తినిచ్చే 370తోపాటు ఆ రాష్ట్రంలో స్థిరాస్తుల కొనుగోలు అధి కారం స్థానికులకు మాత్రమే పరిమితం చేసే 35 ఏ అధికరణను కూడా 2019 ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసింది. జమ్మూ–కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ను చట్టసభ రహిత కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించటం అందరినీ దిగ్భ్రాంతిలో ముంచింది. తీసుకునే నిర్ణయాలు ఎలాంటివైనా ముందుగా అందరితో చర్చించటం ప్రజాస్వామిక సంప్రదాయం. ఆ పని ఇప్పటికైనా జరగటం హర్షించదగ్గ పరిణామం. తాము ఇన్నాళ్లుగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలనే ఈ తాజా చర్చల్లో జమ్మూ–కశ్మీర్ రాజకీయ పక్షాలు మరోసారి వినిపించాయి. రాష్ట్ర హోదా పునరుద్ధరించాల్సిందేనని డిమాండ్ చేశాయి. ఇతర నిర్ణయాలు సైతం వెనక్కు తీసుకోవాలని కోరాయి. ఇవన్నీ జరిగితేనే కేంద్రం–కశ్మీర్‌ల మధ్య నెల కొన్న విశ్వాసరాహిత్యం సడలుతుందన్నాయి. పీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అదనంగా పాకిస్తాన్ ప్రస్తావన కూడా తీసుకొచ్చి, కశ్మీర్ విషయంలో దానితో కూడా చర్చించటం అవసరమని సూచించారు. అయితే అఖిలపక్ష సమావేశంలో ఆమె ఈ ప్రతిపాదన చేశారో లేదో స్పష్టత లేదు. ప్రభుత్వ వర్గాలైతే ఎవరూ పాకిస్తాన్ ప్రస్తావన చేయలేదని చెబు తున్నాయి. అయితే అలా ప్రస్తావించటాన్ని తప్పుబట్టనవసరం లేదు. కశ్మీర్ మన అంతర్గత సమస్యగానే పరిగణిస్తున్నా, అక్కడ ప్రశాంతత ఏర్పడటానికి పాకిస్తాన్‌తో మన దేశం చర్చించిన సందర్భాలు అనేకం వున్నాయి. ఇప్పుడు నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సైతం కేవలం కశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల ప్రాతిపదికగా మాత్రమే కాదు... అంతర్జాతీయంగా ఈ విషయంలో వస్తున్న అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాకే నిర్వహించారని గుర్తుంచుకోవాలి. జమ్మూ– కశ్మీర్ సున్నితమైన ప్రాంతం. ఒకపక్క అమెరికా తొందరపాటు పర్యవసానంగా అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు ఏలికలు కాబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వారు పాకిస్తాన్ చెప్పినట్టల్లా ఆడి మూడు దశాబ్దాలక్రితం కశ్మీర్లో నెత్తుటేర్లు పారించిన సంగతి ఎవరూ మరిచిపోరు. అయితే అఫ్గాన్ పరిణామాల ప్రభావం భారత్‌పై వుండబోదని అమెరికా హామీ ఇవ్వడంతోపాటు భారత్, పాక్‌ల మధ్య లోపాయికారీ చర్చలు జరగడానికి అది చొరవ తీసుకుందని చెబుతున్నారు. ఇప్పుడు జరిగిన అఖిలపక్ష సమావేశం ఆ చర్చల పర్యవసానమేనంటున్నారు. గత కొన్ని నెలలుగా సరి హద్దుల్లో పాక్ తుపాకులు పేలకపోవటం, కశ్మీర్లో చొరబాటుదార్లను ప్రవేశపెట్టే ప్రయత్నం చేయకపోవటం, గత రెండేళ్లుగా కశ్మీర్లో ఉగ్రవాద సంఘటనలు పెద్దగా లేకపోవటం గమనిస్తే పాక్ వైఖరి మారిందని స్పష్టమవుతోంది. అంతేకాదు... కశ్మీర్ భవిష్యత్తుపై ప్లెబిసైట్ నిర్వహించాలన్న తన పాత డిమాండ్‌ను వదులుకున్న జాడలు కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తే చాలని ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చెప్పడం గమనించదగ్గది. జమ్మూ–కశ్మీర్లో 2018లో పీడీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం కుప్పకూలిననాటినుంచీ అక్కడ అసెంబ్లీ ఎన్నికలు పెండింగ్‌లో వున్నాయి. అలాగే నియోజకవర్గాల పునర్విభజన సమస్య కూడా కీలకమైనది. 1995లో జరిగిన పునర్విభజనలో జమ్మూకు అన్యాయం జరిగిందని మొదటినుంచీ బీజేపీ వాదన. 87 స్థానాలున్న అసెంబ్లీలో ముస్లింల ప్రాబల్యం వున్న కశ్మీర్ ప్రాంతానికి 46 స్థానాలు కేటాయించగా, జమ్మూకు 37 ఇచ్చారు. లద్దాఖ్‌కు 4 కేటాయించగా, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌కు 24 రిజర్వ్ చేశారు. ఈ అమరికను మారిస్తే కశ్మీర్ ఆధిక్యత పడిపోతుందన్న ఆందోళన అక్కడి నాయకులకు వుంది. దీన్ని ఉద్రిక్తతలకు తావులేకుండా పరిష్కరించి అసెంబ్లీ ఎన్నికలు జరపాలని, ఆ తర్వాత రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరించాలని కేంద్రం భావిస్తోంది. పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ తది తర పక్షాలు కోరుతున్నట్టు రద్దు చేసినవన్నీ పునరుద్ధరించటం సాధ్యమేనా అన్నది తక్షణం తేలేది కాదు. ఇలాంటి చర్చలు మరిన్ని చోటు చేసుకుంటే అలా జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదేమైనా ఉద్రిక్తతలు సడలి, కశ్మీర్ మళ్లీ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలిగితే, అక్కడ ప్రశాంతత నెలకొంటే అంత కన్నా ఆహ్వానించదగ్గ పరిణామం మరేదీ వుండదు. -
మాజీ ముఖ్యమంత్రికి షాక్ ఇచ్చిన ఈడీ
శ్రీనగర్ : నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి జమ్మూ, శ్రీనగర్‌లలోని 11.86 కోట్ల రూపాయల ఆయన ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఈ మేరకు శనివారం తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. అటాచ్ చేసిన వాటిలో రెండు ఇళ్లు, ఓ వ్యాపార భవనం, మూడు స్థలాలు ఉన్నాయి. ఈడీ వాటి విలువను 11.86 కోట్ల రూపాయలకు లెక్కగట్టినప్పటికి, మార్కెట్ విలువ 60-70 కోట్ల రూపాయలుగా ఉంటుందని సమాచారం. ( పరువు నష్టం: సారీ చెప్పిన సీనియర్ నేత ) కాగా, ఇదే కేసుకు సంబంధించి ఫరూఖ్ అబ్దుల్లా పలుమార్లు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఫరూక్ అబ్దుల్లా సహా పదిమంది జేకేసీఏ కార్యవర్గ సభ్యులు సంస్థను రుణాల జారీ సంస్థగా మార్చేశారని, ఈ కుంభకోణం వెలుగుచూసిన 2005-12లో పలు బోగస్ ఖాతాలను నిర్వహించారని ఈడీ ఆరోపించింది. -
జేకేసీఏ స్కామ్ : ఫరూక్ అబ్దుల్లాను ప్రశ్నించిన ఈడీ
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) స్కామ్‌కు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాను ఈడీ అధికారులు శ్రీనగర్ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫరూక్ అబ్దుల్లా సహా పదిమంది జేకేసీఏ కార్యవర్గ సభ్యులు సంస్థను రుణాల జారీ సంస్థగా మార్చేశారని, ఈ కుంభకోణం వెలుగుచూసిన 2005-12లో పలు బోగస్ ఖాతాలను నిర్వహించారని ఈడీ ఆరోపిస్తోంది. కాగా, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఫరూక్ అబ్దుల్లాను ప్రశ్నిస్తున్నారని ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం ఆరు పార్టీలు కూటమిగా ఏర్పడటంతోనే కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఈడీ సమన్లపై తమ పార్టీ త్వరలో స్పందిస్తుందని చెప్పారు. అయితే ఫరూక్ నివాసంపై ఎలాంటి దాడులు జరగలేదని వివరించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలని కోరుతూ ఫరూక్ అబ్ధుల్లా నివాసంలో జరిగిన ఆరు పార్టీల నేతల సమావేశం డిక్లరేషన్ జారీ చేసిందని చెప్పారు. చదవండి : కశ్మీర్లో ప్రధాన పార్టీల కూటమి ఈ భేటీలో పీడీపీ చీఫ్ మెహబూబూ ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజద్ లోన్, పీపుల్స్ మూవ్మెంట్ నేత జావేద్ మిర్, సీపీఎం నేత మహ్మద్ యూసుఫ్ తరిగామి, ఆవామి నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ముజఫర్ షా పాల్గొన్నారు. మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం నుంచి విడుదలైన రెండు రోజుల అనంతరం నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఈ సమావేశానికి పిలుపు ఇచ్చారు. -
370 రద్దు వల్లే చైనా దురాక్రమణ
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసినందుకే లద్దాఖ్‌లో చైనా దురాక్రమణకు పాల్పడిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రాన్ని తరచూ విమర్శించే ఫరూక్ అబ్దుల్లా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడంపై మాట్లాడారు. ‘ఆర్టికల్ 370 రద్దును చైనా ఎన్నటికీ ఆమోదించదు. చైనా తోడ్పాటుతో స్వతంత్ర ప్రతిపత్తిని పొందుతామనుకుంటున్నాం. సరిహద్దుల్లో చైనా పాల్పడే చర్యలన్నిటికీ ఆర్టికల్ 370 రద్దుతో వచ్చిన ఆగ్రహమే కారణం’అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఎంపీ ఫరూక్ జాతి వ్యతిరేక, దేశద్రోహ వ్యాఖ్యలు చేశారని విమర్శించింది. ఫరూక్ చైనా దురాక్రమణను సమర్థిస్తున్నారని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలతో ఆయన చైనాలో హీరో అయిపోయారని పేర్కొంది. ఆ పార్టీ ప్రతినిధి సంబిత్ మహాపాత్ర మాట్లాడుతూ.. రాజ్యాంగ పద్ధతిలో పార్లమెంట్ ఆమోదంతోనే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ప్రధాని మోదీపై వ్యతిరేకతతోనే ఆయన దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా తరచూ ఇలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలే చేస్తుంటారని తెలిపారు. -
మేం కీలుబొమ్మలం కాదు: ఫరూక్
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా కశ్మీర్‌లోని ఆరు రాజకీయపార్టీలు ఉమ్మడిగా చేసిన ‘గుప్కార్ డిక్లరేషన్’ను పాకిస్తాన్ స్వాగతించడంపై నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా గట్టిగా స్పందించారు. ‘మేం ఎవరి చేతుల్లోనూ కీలుబొమ్మలం కాము’ అంటూ వ్యాఖ్యానించారు. ‘జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలను ఇప్పటిదాకా నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన పాకిస్తాన్‌కు అకస్మాత్తుగా ఇప్పుడు ఇష్టం పుట్టుకొచ్చింది. ఢిల్లీకి గానీ, సరిహద్దుల్లో ఉన్న వారికి గానీ.. మేం ఎవరి తొత్తులం కాదని స్పష్టం చేస్తున్నా’ అని తెలిపారు. ఎన్సీ, పీడీపీ, కాంగ్రెస్, మరో మూడు పార్టీలు కలిసి ప్రకటించిన గుప్కార్ డిక్లరేషన్ సాధారణ ఘటన కాదు, కీలక రాజకీయ పరిణామం అంటూ పాక్ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలపై ఆయన పైవిధంగా స్పందించారు. ‘సాయుధులను కశ్మీర్లోకి పంపడం పాక్ మానాలనీ, భారత్, పాక్‌లు చర్చలు ప్రారంభించాలని ఆయన కోరారు. కశ్మీర్‌లోని ఆరు రాజకీయ పార్టీలు ఆగస్టు 22న శ్రీనగర్‌లోని గుప్కార్ రోడ్డులో ఉన్న ఫరూక్ అబ్దుల్లా నివాసంలో సమావేశమై చేసిన ఉమ్మడి ప్రకటనను గుప్కార్ డిక్లరేషన్ అని అంటున్నారు. -
బైడెన్ అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్‌ను అధికారికంగా ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్లో జరుగుతున్న డెమొక్రటిక్ జాతీయ సదస్సులో పార్టీ ప్రతినిధులందరూ ఏకగ్రీవంగా అధ్యక్ష అభ్యర్థిగా 77 ఏళ్ల వయసున్న జో బైడెన్‌ను నామినేట్ చేశారు. కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సాహసం కలిగిన నాయకుడు బైడెన్ అని నేతలందరూ కొనియాడారు. నామినేట్ అయ్యాక జో బైడెన్‌తన జీవితంలో దక్కిన అతి గొప్ప గౌరవం ఇదేనని ట్వీట్ చేశారు. అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్‌ను అధికారికంగా ప్రకటించి అమెరికా ప్రజల గుండె చప్పుడు ఏంటో పార్టీ చెప్పిందని బైడెన్ సతీమణి జిల్ బైడెన్ భావోద్వేగానికి లోనయ్యారు. అధ్యక్ష ఎన్నికల సర్వేల్లో ట్రంప్ కంటే బైడెన్ 7.7 పాయింట్లు అధికంగా సంపాదించి ముందంజలో ఉన్నారు. టీవీ చూడడమే ట్రంప్ చేసే పని :క్లింటన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశానికి అధ్యక్షుడిగా ఉంటూ టీవీ చూస్తూ కాలం గడపడం, సోషల్ మీడియాలో ప్రజల్ని గందరగోళానికి గురి చేయడమే ఆయన చేస్తున్న పని అని ఆరోపించారు. అధ్యక్ష కార్యాలయాన్ని కమాండ్ సెంటర్ బదులుగా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. అమెరికాకి పూర్వ వైభవం తీసుకువచ్చే సత్తా బైడెన్‌కే ఉందని క్లింటన్ వ్యాఖ్యానించారు. -
సాయుధ బలగాల సంక్షేమానికి తోడ్పడండి
పుణె: సాయుధ బలగాల సంక్షేమానికి ప్రజలు తోడ్పడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. శనివారం పుణేలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అక్కడే ఆయన 2016లో నగ్రోటా ఉగ్రదాడిలో నేలకొరిగిన మేజర్ కునాల్ గోసావి భార్య, కుమార్తెలతో మాట్లాడారు. అనంతరం ఫ్లాగ్ డే కార్యక్రమానికి సంబంధించిన 57 నిమిషాల వీడియోను ప్రధాని ట్విట్టర్లో విడుదల చేశారు. ‘ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా అత్యుత్తమ ధైర్య సాహసాలు చూపుతున్న సాయుధ బలగాలకు, వారి కుటుంబాలకు నా సెల్యూట్. మన బలగాల సంక్షేమానికి మీరు కూడా సాయం అందించాల్సిందిగా కోరుతున్నా’ అని పేర్కొన్నారు. అనంతరం పోలీస్ డైరెక్టర్ జనరళ్లు, ఇన్స్పెక్టర్ జనరళ్ల జాతీయ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చిలో జరిగిన ఈ సదస్సుకు హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. శుక్రవారం ప్రారంభమైన ఈ సదస్సు ఆదివారంతో ముగియనుంది. -
ఫరూక్‌తో ఎన్సీ బృందం భేటీ
శ్రీనగర్/ ఇస్లామాబాద్: కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు తర్వాత తొలి కీలక రాజకీయ పరిణామం సంభవించింది. గవర్నర్ సత్యపాల్ మాలిక్ అనుమతి మేరకు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేతలు గృహ నిర్బంధంలో ఉన్న పార్టీ అగ్ర నేతలు ఫరూక్, ఒమర్ అబ్దుల్లాలతో ఆదివారం ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారు. జమ్మూ ప్రొవెన్షియల్ ఎన్సీ చీఫ్ దేవీందర్ సింగ్ రాణా నేతృత్వంలోని 15 మంది నేతల బృందం వారితో రాష్ట్రంలో పరిణామాలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించింది. కేంద్రం ఆర్టికల్ 370 రద్దు ప్రకటన విడుదల చేసిన తర్వాతి రోజు ఆగస్టు 5 నుంచి మాజీ సీఎంలు, ఎన్సీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా తదితర ప్రధాన పార్టీల నేతలను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ఎన్సీ నేతలు మొదటగా ఒమర్ అబ్దుల్లాతో అరగంటపాటు సమావేశమయ్యారు. గడ్డంతో కొత్తగా కనిపించిన తమ నేతతో వారంతా సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తర్వాత ఫరూక్ అబ్దుల్లాను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం రాణా మీడియాతో మాట్లాడుతూ.. తమ నేతలు ప్రజలపై ఆంక్షల విషయంలో కలత చెందుతున్నారని తెలిపారు. ‘రాష్ట్రం మొత్తం దిగ్బంధంలో ఉంది. మా పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాను ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) చట్టం కింద నిర్బంధించారు. ఆయన లేకుండా ఎన్నికల మేనిఫెస్టో ఎలా సాధ్యం? నేతలను వెంటనే విడుదల చేయాలి’అని పేర్కొన్నారు. నేడు మెహబూబాతో సమావేశం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీతో సోమవారం భేటీ అయ్యేందుకు ఆ పార్టీకి చెందిన 10 మంది నేతల బృందానికి నిర్బంధంలో ఉన్న పార్టీ గవర్నర్ అనుమతించారు. -
ఆర్టికల్ 370: రెండు నెలల తర్వాత తొలిసారి
శ్రీనగర్: రెండు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధినేత ఫరూక్ అబ్దుల్లా ఆదివారం తన పార్టీ నేతలను కలుసుకున్నారు. ఎన్సీ జమ్మూ అధ్యక్షుడు దేవేందర్ సింగ్ రానా నేతృత్వంలో 15మంది సీనియర్ నాయకులు ఫరూక్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ ఆయ్యారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకుని.. జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితులపై చర్చించారు. అంతకుముందు ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాతోనూ పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆగస్ట్ 4వ తేదీ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతోపాటు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీలను ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. గవర్నర్ సత్యపాల్ మాలిక్ వద్ద ప్రత్యేక అనుమతి తీసుకుని ఎన్సీ నేతలు ఫరూక్, ఒమర్ అబ్దుల్లాలను కలిశారు. -
370 రద్దుపై ఎన్సీ సవాల్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ఉన్న రాజ్యాంగబద్ధ హోదాను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయా న్ని సవాల్ చేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర పౌరుల సమ్మతి లేకుండానే వారి హక్కులను కేంద్రం లాగేసుకుందని పేర్కొంది. జమ్మూకశ్మీర్ పునర్వ్య వస్థీకరణకు సంబంధించిన చట్టం అమలు కాకుండా చూడాలని ఎన్సీకి చెందిన ఎంపీలు మహమ్మద్ అక్బర్ లోనె, హస్నైన్ మసూదీ తమ పిటిషన్లో పేర్కొన్నారు. ‘కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ శాశ్వతమైంది. కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2019, రాష్ట్రపతి ఉత్తర్వుల ఫలితంగా ఆర్టికల్ 370, 35ఏ రద్దయ్యాయి. రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభ జించి ప్రజల హక్కులను కాలరాశారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు రాజ్యాంగవిరుద్ధం. భారత సమాఖ్య వ్య వస్థ, ప్రజాస్వామ్యం, చట్ట పాలనకు సంరక్షకుడిగా ఉన్న సుప్రీంకోర్టు ఈ విషయమై స్పందించాలి. ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాలను అమలు కాకుండా రద్దు చేయాలి’ అని కోరారు. మీడియాపై ఆంక్షలను ఎత్తివేయాలి జమ్మూకశ్మీర్‌లో మీడియాపై కొనసాగుతున్న ఆం క్షలను ఎత్తివేయాలంటూ కశ్మీర్ టైమ్స్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధా భాసిన్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆగస్టు 4వ తేదీ నుంచి కొనసాగుతున్న నియంత్రణల కారణంగా కశ్మీర్‌తో పాటు జమ్మూలోని కొన్ని జిల్లాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయన్నారు. -
తలాక్ చట్టం తెచ్చి తీరుతాం
గాంధీనగర్: సంప్రదాయవాదులు, ప్రతిపక్షాల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనా ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తమ ప్రభుత్వం తెచ్చి తీరుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉద్ఘాటించారు. దేశంలో గత ప్రభుత్వాలు స్త్రీల సంక్షేమాన్ని అస్సలు పట్టించుకోలేదనీ, తమ ప్రభుత్వం వచ్చాకనే మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని మోదీ తెలిపారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో జరిగిన బీజేపీ మహిళా విభాగం ఐదవ జాతీయ సదస్సులో మోదీ ప్రసంగించారు. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించే బిల్లును గతంలోనే లోక్‌సభ ఆమోదించినప్పటికీ రాజ్యసభ మోకాలడ్డడంతో కేంద్ర బిల్లుకు పలు సవరణలు చేసింది. ఈ కొత్త బిల్లుపై లోక్‌సభలో ఈ నెల 27న చర్చ జరిగే అవకాశం ఉంది. ముమ్మారు తలాక్ చెప్పి విడాకులిచ్చే భర్తలు బెయిలు పొందే అవకాశం కూడా తాజాగా ప్రభుత్వం కల్పించింది. అలాగే స్త్రీలు హజ్ యాత్రకు వెళ్లాలంటే పురుషులు తోడు ఉండాల్సిందేనన్న నిబంధనను కూడా తమ ప్రభుత్వం తొలగించిందని మోదీ చెప్పారు. 60–70 ఏళ్లుగా గత ప్రభుత్వాల చేతుల్లో మోసపోయిన మహిళలు ఇప్పుడు బీజేపీపై నమ్మకం పెట్టుకున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల (గ్యాస్ సిలిండర్ల పంపిణీ), ‘బాలికలను రక్షించండి, చదివించండి’ తదితర పథకాలను మోదీ ప్రస్తావించారు. వైమానిక, నౌకా దళాల్లోకి కూడా తమ ప్రభుత్వం మహిళలను అనుమతించిందన్నారు. విభజన శక్తులతో జాగ్రత్త సమాజంలో విభజన శక్తులు స్వల్పకాలిక ప్రయోజనాల కోసం కులం పేరిట దోపిడీలకు దిగుతున్నాయనీ, వారితో జాగ్రత్తగా ఉండాలని మోదీ పోలీసులకు సూచించారు. గుజరాత్‌లోని కేవడియాలో జరిగిన డీజీపీ, ఐజీపీల వార్షిక సమావేశంలో మోదీ ప్రసంగించారు. కులం పేరిట జనాలను విడగొట్టే విభజన శక్తులను క్షేత్రస్థాయిలో ఏకాకులను చేయాలని ఆయన పోలీసులను కోరారు. దేశ సమగ్రత, ఐక్యతల కోసం పోలీసులు పనిచేయడాన్ని కొనసాగించాలన్నారు. ఉగ్రవాదంపై పోరాడుతున్నందుకు పోలీసులను మోదీ ప్రశంసించారు. ప్రత్యేకించి ఈ విషయంలో జమ్మూ కశ్మీర్ పోలీసులను చూసి దేశ ప్రజలు గర్విస్తున్నారన్నారు. కింది స్థాయిలో ప్రజల కోసం కష్టించే పోలీసులకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులను కోరారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలను సమర్థంగా ఉపయోగించుకోవచ్చని సలహా ఇచ్చారు. పలువురు నిఘా విభాగం (ఐబీ) అధికారులకు రాష్ట్రపతి పతకాలను మోదీ బహూకరించారు. జాతీయ పోలీస్ స్మారకంతో కూడిన పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేశారు. సైబర్ సమన్వయ కేంద్రాన్ని ప్రారంభించారు. -
బీజేవైఎం జాతీయ సమ్మేళనం
-
ప్రధానిపై ఆ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
శ్రీనగర్ : ప్రధాని నరేంద్ర మోదీపై నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని ఉగ్రవాదిగా నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఎమ్మెల్యే జావేద్ రాణా అభివర్ణించారు. ‘వారు మమ్మల్ని ఉగ్రవాదులుగా పిలుస్తారు..అయితే దేశ ప్రధానే అతిపెద్ద టెర్రరిస్ట్..మానవత్వాన్ని హతమార్చే హంతకుడ’ని జావేద్ రాణా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూంచ్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన 2002 గుజరాత్ అల్లర్లను ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎన్సీ ఎమ్మెల్యే రాణా గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 35-ఏ, 370లకు మార్పులు చేపడితే కాశ్మీర్లో భారత జెండా ఎగరదని ఇటీవల రాణా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆర్టికల్ 370ను రద్దు చేయవద్దని తాను ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని తొలగించడమే బీజేపీ, ఆరెస్సెస్‌ల అజెండా అని రాణా ఆరోపించారు. ఆర్టికల్ 370పై సుప్రీం కోర్టు విచారణలో వాస్తవాలను వక్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. -
సీపీఎం మహాసభల్లో మోదీ జపం
సాక్షి, న్యూఢిల్లీ : సీపీఎం మహాసభల్లో పాల్గొన్న నేతలంతా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుండా ప్రధాని నరేంద్ర మోదీ జపం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కలసి సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడు తూ దేశవ్యాప్తంగా రోజురోజుకూ తుడిచిపెట్టుకుపోతున్న సీపీ ఎం తన మూలాలను బలోపేతం చేసుకోవడంపై మహాసభల్లో దృష్టిసారించి ఉంటే బాగుండేదన్నారు. మోదీకి పెరుగుతున్న ఆదరణ, అన్ని రాష్ట్రాల్లో బీజేపీ దూసుకుపోతుండడం చూసి ఓర్వలేకనే ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాల్లో సీపీఎంకు బాధ్యత ఉందని, దీనిపై ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే త్రిపుర, పశ్చిమ బెంగాల్లో ఓటమి పాలైన సీపీఎంను త్వరలో కేరళ ప్రజలు కూడా తిరస్కరిస్తారన్నారు. కాంగ్రెస్‌ది ఎమర్జెన్సీ మైండ్‌సెట్...: జీవీఎల్ కాంగ్రెస్‌ది ఎమర్జెన్సీ మైండ్ సెట్ అని, ప్రజాస్వామ్య విలువలపై ఆ పార్టీకి గౌరవం లేదని జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా భారత దేశ ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, పార్లమెంటరీ విధానాలు, సైన్యం, ఎన్నికల కమిషన్‌కు మంచి గుర్తింపు ఉందని, కాంగ్రెస్ ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడుతోందన్నారు. -
దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగాయి
-
నేటి నుంచే ‘ఎర్ర పండుగ’
సాక్షి, హైదరాబాద్ : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ కల్యాణ మండలం వేదికగా జరిగే ఈ ఐదు రోజుల సభల్లో పార్టీ పటిష్టత, రాజకీయ విధానాలపై చర్చించి భావి కార్యాచరణ రూపొందించనున్నారు. సీపీఎం రాజకీయ పంథాపైనా నిర్ణయం తీసుకుంటారు. పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో తాము అధికారం కోల్పోవడం, ప్రాంతీయ పార్టీలతో సంబంధాలు, ఫెడరల్ ఫ్రంట్ తదితరాలపైనా చర్చ జరగనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అగ్రనేతలు ప్రకాశ్‌కారత్, మాణిక్ సర్కార్, కేరళ సీఎం పినరయి విజయన్, రాష్ట్రం నుంచి 35 మందితో సహా 846 మంది ప్రతినిధులు సభల్లో పాల్గొంటారు. షెడ్యూల్ ఇదే.... వరుసగా రెండోసారి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం ఉదయం పదింటికి ఆర్టీసీ కల్యాణమండపంలో ‘మహ్మద్ అమీన్ నగర్’ప్రాంగణంలో పార్టీ పతాకావిష్కరణతో సభలు ప్రారంభమవుతాయి. తర్వాత ఏచూరి సందేశం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్,) ఫార్వర్డ్‌బ్లాక్, ఆర్ఎస్పీ, ఎస్‌యూసీఐ (సీ) నేతల సౌహార్ద సందేశాలు, కార్యదర్శి నివేదిక ఉంటాయి. 19, 20, 21 తేదీల్లో ప్రతినిధుల సభలో పార్టీ రాజకీయ విధానంతో పాటు తీర్మానాలపై చర్చిస్తారు. 22న కొత్త కమిటీని ఎన్నుకుంటారు. అదే రోజు మలక్‌పేట టీవీ టవర్ నుంచి సభ జరిగే సరూర్‌నగర్ స్టేడియం దాకా 20 వేల మంది రెడ్‌షర్ట్ వలంటీర్లతో కవాతు జరుగుతుంది. సభకు జాతీయ నేతలు హాజరవుతారు. సభలు జరిగే ఆర్టీసీ కల్యాణమండపం పరిసరాలు ఎర్రజెండాలు, తోరణాలు, పోస్టర్లతో ఇప్పటికే ఎరుపెక్కాయి. తెలంగాణ సంస్కృతి, సాయుధ పోరాటం తదితరాలు ప్రతిబింబించే కళారూపాలనూ ఏర్పాటు చేశారు. మహాసభల్లో 25 అంశాలపై తీర్మానాలుంటాయని పార్టీ వర్గాలంటున్నాయి. మంగళవారం పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశమై మహాసభల ఎజెండాను ఆమోదించాయి. రాజకీయ, నిర్మాణ నివేదికలపై చర్చిస్తాం ‘‘పార్టీ జాతీయ మహాసభల్లో రాజకీయ తీర్మానం, రాజకీయ, నిర్మాణ నివేదికలపై చర్చ జరుగుతాయి. బీజేపీని ఓడించడమే మా ప్రధాన లక్ష్యం. కాంగ్రెస్‌తో పొత్తు, అవగాహన ఉండవు. తెలంగాణలో బీఎల్ఎఫ్ బలోపేతంపై చర్చిస్తాం. మహాసభలకు సర్వం సిద్ధం చేశాం.’ – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం -
రేపటి నుంచి చరిత్ర, సాహిత్యాలపై సదస్సు
సాక్షి, హైదరాబాద్: చరిత్ర, సాహిత్యాలపై ఈ నెల 23 నుంచి రెండ్రోజుల పాటు రవీంద్రభారతిలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. చర్రితలో చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చేందుకు రాష్ట్ర సాహిత్య అకాడమీ, వారధి సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కాకతీయుల నుంచి అసఫ్‌జాహిల వరకు రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం అనే అంశాలపై సదస్సు జరుగుతుందన్నారు. నాణేల ఆధారంగా తెలంగాణ చరిత్రను పరిశోధకులు రాజారెడ్డి, మనం మరిచిన తెలంగాణ చరిత్రపై జితేంద్రబాబు, కాకతీయుల నాటి లిపి విశేషాలు, లేఖన సంప్రదాయాలపై ఉమామహేశ్వర శాస్త్రి పత్ర సమర్పణ చేస్తారన్నారు. ప్రముఖ చరిత్రకారులు సూర్యకుమార్ కాకతీయుల కొత్త శాసనాలపై, ఆచార్య ఎం. సుజాతరెడ్డి కుతుబ్షాహి కాలం నాటి తెలుగు భాషా వికాసంపై, స్వతంత్ర కాకతీయ పాలకుల వివరాలపై శ్రీనివాసులు పత్ర సమర్పణ చేస్తారన్నారు. సదస్సు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుందన్నారు. సమావేశంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
పాక్‌తో యుద్ధం తప్ప.. మరో ఆప్షన్ లేదు!
సాక్షి, శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో నిత్యం పాకిస్తాన్ ఉగ్రమూకలు దాడులకు తెగబడటంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదానికి ముగింపు పలకపోతే పాక్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాద శక్తులను ప్రోత్సహించడం, వారికి ఆశ్రయమిస్తూ భారత్‌పై దాడులు ఇలాగే కొనసాగిస్తే పాక్‌పై యుద్ధం తప్ప మనకు మరో ఆప్షన్ లేదన్నారు. శనివారం తెల్లవారుజామున సంజ్వాన్‌లోని ఆర్మీ శిబిరంపైనే పాక్ ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలైన విషయం తెలిసిందే. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా ఈ ఘటనపై ఫరూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. పాక్ ప్రతిరోజు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులకు పాల్పడుతోందని, అసలు దాయాది ఉగ్రవాదులు దాడులు భారత్‌పై దాడులు చేయని రోజే లేదని ఫరూఖ్ అబ్దుల్లా మండిపడ్డారు. భారత్ నుంచి కేవలం శాంతిని మాత్రమే కోరుకున్నట్లయితే పాక్ ఉగ్రవాదానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. లేనిపక్షంలో భారత్ నుంచి యుద్ధమే సమాధానం అవుతుందని పేర్కొన్నారు. భారత్‌తో సంబంధాలు మెరుగు చేసుకోవాలంటే పాక్ తన వైఖరిని మార్చుకుని, ఉగ్రవాదానికి దూరంగా ఉండటమే ఉత్తమమని చెప్పారు.. యుద్ధం వల్ల రెండు దేశాలకూ తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కానీ పాక్ చర్యల వల్ల యుద్ధ వాతావరణం నెలకొంటుందన్నారు. -
అసెంబ్లీ సాక్షిగా మంత్రి సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రి ఇమ్రాన్ అన్సారీ ప్రతిపక్ష పార్టీ నేత దేవేందర్ రాణాను సభలోనే చంపి పాతరేస్తానంటూ బెదిరించారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విషయంపై అసెంబ్లీలో మంగళవారం చర్చ జరగగా.. చివరికి అది వ్యక్తిగత బెదిరింపులకు దారితీసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశంలో అంతటా జీఎస్టీ అమలు అయినా, జమ్మూకశ్మీర్ లో మాత్రం జీఎస్టీ అమలు చేయడం లేదు. ఇంత వరకూ జీఎస్టీని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించకపోవడంతో దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం అమలు వాయిదా పడింది. దీనిపై జుమ్మూకశ్మీర్ అసెంబ్లీలో నిన్న ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ నేత దేవేందర్ రాణా ఆసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఏకపన్ను విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే యత్నం చేశారు. తాను పన్నులు ఎగ్గొట్టలేదని, చీకటి వ్యాపారాలు చేయాల్సిన ఖర్మ తనకు పట్టలేదని అధికార పక్ష నేతలకు బదులిచ్చారు. ఓ వైపు ఎమ్మెల్యే రాణా మాట్లాడుతుండగా.. రాష్ట్ర ఐటీ, సాంకేతిక విద్య శాఖలమంత్రి ఇమ్రాన్ అన్సారీ కలుగజేసుకుని 'నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే చంపేయగలను. నీ దొంగ వ్యాపారాలు నాకు తెలుసు. రాష్ట్రంలో నీ కంటే పెద్ద దొంగ ఎవరూ లేరు. మోబిల్ ఆయిల్ అమ్ముతూ వ్యాపారాలు మొదలుపెట్టావ్. నీకు అన్ని ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయో మాకు తెలియదనుకున్నావా' అంటూ బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. మంత్రి అన్సారీ వ్యాఖ్యలతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఏకంగా అసెంబ్లీలోనే మంత్రి చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. -
శ్రీనగర్‌లో ఫరూక్ అబ్దుల్లా విజయం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా విజయం సాధించారు. అబ్దుల్లా తన సమీప ప్రత్యర్థి, అధికార పీడీపీ అభ్యర్థి నాజిర్ అహ్మద్‌ఖాన్‌ను 10 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించారు. కౌటింగ్ ప్రారంభం నుంచి ముందంజలో ఉన్న అబ్దుల్లా అదే జోరు కొనసాగించి విజయకేతనం ఎగురవేశారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా పీడీపీ నేత తారిఖ్ హమీద్ శ్రీనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల తొమ్మిదో తేదీన జరిగిన ఈ ఉపఎన్నికలో మొత్తం తొమ్మిదిమంది అభర్థులు పోటీపడ్డారు. వేర్పాటువాదులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడంతో కేవలం 7శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎన్నికల సందర్భంగా భారీగా హింస చెలరేగడంతో అధికారులు ఏప్రిల్ 13న 38 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. -
2019లో మోదీ విజయాన్ని ఎవరూ ఆపలేరు
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీ విజయాన్ని ఏ నాయకుడు కూడా అడ్డుకోలేడని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తున్న నేపథ్యంలో ఒమర్ స్పందిస్తూ.. ఈ లెక్కన చూస్తే 2019 లోక్‌సభ ఎన్నికల గురించి మరచిపోయి, 2024 ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రణాళిక తయారు చేసుకోవాలని చెప్పారు. ఎన్డీయేలో భాగస్వామ్యం కాని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ బీజేపీపై ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ మంచి విజయం సాధించిందని, గోవా, మణిపూర్‌లోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తోందని ఒమర్ పేర్కొన్నారు. తాజా ఫలితాలను బట్టి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కష్టమని అభిప్రాయపడ్డారు. -
విజయవాడలో భద్రతపై జాతీయ సదస్సు
విజయవాడ: జాతీయ భద్రత - సవాళ్లు అంశంపై విజయవాడలో జాతీయ సదస్సు ప్రారంభమైంది. దేశం ఎదుర్కొంటున్న పలు భద్రత సంబంధ సవాళ్లపై ఇందులో నిపుణులు చర్చిస్తారు. ఏపీ డీజీపీ సాంబశివరావుతోపాటు కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, పలువురు సీఐడీ అధికారులు పాల్గొంటున్నారు. స్థానిక ఫార్చ్యూన్ మురళి పార్కు హోటల్లో నేటి నుంచి మూడు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. -
28 నుంచి శ్రామిక మహిళా జాతీయ మహాసభలు
గుంటూరు వెస్ట్: శ్రామిక మహిళా 11వ అఖిల భారత మహాసభలు ఈనెల 28 నుంచి 30 వరకు గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో జరుగుతాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.బాలకాశి తెలిపారు. బ్రాడీపేటలోని యూనియన్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 28న మధ్నాహ్నం 2 గంటలకు ‘శ్రామిక మహిళలు, జీవన భద్రత’ అనే అంశంపై సదస్సు జరుగుతుందని చెప్పారు. సదస్సుకు శ్రామిక మహిళా జాతీయ కన్వీనర్ డాక్టర్ కే.హేమలత, శ్రామిక మహిళా అఖిల భారత నాయకురాలు ఎస్.వరలక్ష్మి ముఖ్యఅతిధులుగా హాజరై ప్రసంగించనున్నారని తెలిపారు. 29, 30 తేదీలలో ప్రతినిధుల సభ జరుగుతాయని చెప్పారు. 29న సాయంత్రం 5 గంటలకు బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాలులో ‘ప్రస్తుత పరిస్థితులు, ఉద్యోగ కార్మికవర్గం ముందున్న సవాళ్లు’ అనే అంశంపై సదస్సు జరుగుతుందని చెప్పారు. సీఐటీయు జాతీయ అధ్యక్షుడు ఏ.కె.పద్మనాభన్ సదస్సుకు హాజరై ప్రసంగించారని తెలిపారు. ఈసందర్భంగా మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్‌ను ఆవిష్కరించారు. -
నేటి నుంచి జాతీయ సదస్సు
పెనుగొండ : తెలుగులో మహిళా రచయితల అనుభవాలు–ప్రభావాలు అంశంపై మహిళా రచయితల జాతీయ సదస్సు పెనుగొండ ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్,సైన్స్ కళాశాలలో శనివారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నడింపల్లి సూర్యనారాయణ రాజు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మహిళా రచయితల మధ్య పరస్పర సంభాషణకు, భావ వినిమయానికి అవకాశం కల్పించడం, సమకాలీన రాజకీయ ఆర్థిక పరిణామాలకు, సాహిత్యానికి పరస్పర సంబంధాన్ని చర్చించడం, మహిళా రచయితల సాహిత్య వస్తు శిల్పాల తీరుతెన్నులను విశ్లేషించడమే సదస్సు లక్ష్యమన్నారు. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కలిదిండి అన్నపూర్ణ సదస్సును ప్రారంభిస్తారని, కాకినాడ ఐడియల్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ పి.చిరంజీవినీ కుమారి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అధ్యక్షురాలు డాక్టర్ పుట్ల హేమలత, కార్యదర్శి కాత్యాయినీ విద్మహేల, వివిధ జిల్లాలకు చెందిన రచయిత్రులు, కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు పితాని సూర్యనారాయణ, సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ కలిదిండి రామచంద్రరాజు, కోశాధికారి ఉద్దగిరి లవకుమార్ పాల్గొంటారన్నారు -
నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సీబీసీఎస్
ఏలూరు (ఆర్ఆర్ పేట): ప్రస్తుత కాలంలో విద్యార్థులు మూస విధానంలో సిలబస్‌ను బట్టీపట్టి మార్కులు సాధిస్తున్నారని, ఈ విధానానికి స్వస్తి చెప్పి క్రియాశీల విలువలను వెలికితీసి నైపుణ్యాలు పెంచుకునే దిశలో పయనించాలని మద్రాస్ విశ్వవిద్యాలయం ఆంత్రోపాలజీ విభాగాధిపతి సుమతి సూచించారు. స్థానిక సెయింట్ థెరిస్సా మహిళా కళాశాలలో గురువారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. విద్యార్థుల్లో స్వయం నిర్ణయక శక్తిని పెంపొందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యస్థాయిలో ఎంపికకు ఆధారమైన జమ వ్యవస్థ (చాయిస్ బేసిడ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్)ను ప్రవేశపెట్టమని సూచించిందన్నారు. దీని వల్ల విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, సాంఘిక కార్యక్రమాలపై దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి వినూత్న పద్ధతిని ఆవిష్కరిస్తారన్నారు. సీబీసీఎస్‌ను విద్యాసంస్థల్లో అమలు చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ముఖ్యంగా బహుముఖ ప్రజ్ఞాశీలులైన ఉపాధ్యాయులు, అత్యాధునిక ప్రయోగశాలలు, కళాశాలల ప్రాంగణాలు సమకూర్చుకోవాల్సి ఉంటుందన్నారు. నాగార్జున వర్సిటీ ప్రొఫెసర్ జీవీ చలం, ప్రిన్సిపల్ డాక్టర్ పి.మెర్సి, సిస్టర్ మరియట్ట పూదోట, మరియట్ట డిమెల్లో, డాక్టర్ మాథ్యూ శ్రీరంగం,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యుత్ విధానాల్లో సరళీకరణ అవసరం
పుత్తూరు : విద్యుత్ ఉత్పత్తి, వినిమయం వంటి విషయాల్లో గుణాత్మకమైన మార్పులు వచ్చే విధంగా ప్రభుత్వ విధానాల్లో సరళీకరణ జరగాలని శ్రీవెంకటేశ పెరుమాల్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.మునస్వామి అన్నా రు. శుక్రవారం కళాశాలలో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రయోజిత పునరుత్పాదక ఎలక్ట్రికల్ ఎనర్జీ టెక్నాలజీ అండ్ ఆటోమిషన్ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన 145 మంది విద్యార్థులు సమర్పించిన పరిశోధనాత్మక పత్రాల్లో 74 మందివి మాత్రమే అనుమతించినట్లు తెలిపారు. అమర్‌రాజా ఇండస్ట్రియల్ ప్రైవేట్ సర్వీస్ లిమిటెడ్ తిరుపతి హెడ్ దామోదర్‌రావు మాట్లాడుతూ నాణ్యత, స్వచ్ఛత, పర్యావరణ అనుకూల విద్యుత్ ఉత్పాదనే దేశ ప్రగతికి మూలమని అన్నారు. ఎస్వీయూ ఇంజినీరింగ్ కాలేజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ హెచ్‌వోడీ డాక్టర్ ఆర్వీఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి రంగాలలో గణనీయమైన ప్రగతి సాధించాలని అభిప్రాయపడ్డారు. అంతకుముందు సదస్సుకు సంబంధించిన బ్రోచర్స్‌ను విడుదల చేశారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ దామోదరం, ఆర్ అండ్ డీ డెరైక్టర్ డాక్టర్ జి.నరేష్కుమార్, ఈఈఈ హెచ్‌వోడీ ప్రొఫెసర్ ఎ.హేమశేఖర్, కో-కన్వీనర్ కె.విజయభాస్కర్ పాల్గొన్నారు. -
నల్సార్ లో నేటినుంచి జాతీయ సదస్సు
హాజరుకానున్న సీఎం కేసీఆర్ శామీర్‌పేట్: శామీర్‌పేట్ నల్సార్ లా యూనివర్సిటీలో ఈనెల 19, 20 వ తేదీల్లో రెండు రోజులపాటు ‘పేదల భూసంబంధ న్యాయపరమైన అవసరాలు, సేవలు, అనుభవాలు, ఆశలు’ అనే అంశాలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిష్ట్రార్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నల్సార్‌లో నిర్వహించనున్న ఈ సదస్సును ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రితోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు రానున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు భూసంబంధమైన అంశాలపై న్యాయ సహాయం సేవలను అందించడంపై నిర్వహించనున్న సదస్సును నల్సార్ లా యూనివర్సిటీ, లాండెస్సా సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. 2013 నుంచి రెండు సంస్థలు పేదప్రజలకు భూసంబంధమైన అంశాలపై న్యాయ సహాయం చేసేందుకు సెంటర్లు ఏర్పాటు చేసి, ఉచితంగా న్యాయ సలహాలు సూచనలు అందించే శిక్షణా కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. వరంగల్ జిల్లాలో ప్రారంభమైన తమ సేవలు నర్సంపేట్, జనగామల్లో సెంటర్లు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు సుమారు మూడు వేల మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. నల్సార్ లా యూనివర్సిటీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీ నూతన సభాప్రాంగణాన్ని శనివారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం నల్సార్‌లో నిర్వహించనున్న రెండు రోజుల సదస్సులో ఆయన మాట్లాడుతారని చెప్పారు. సీఎంతోపాటు సుప్రీం కోర్డు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ ఆర్.దేవ్, దీపక్ మిశ్రా, ఎన్వీ.రమణ, దిలీప్ బి.బోస్లేలతోపాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు వివరించారు. -
అన్ని స్థాయిల్లోనూ మహిళలపై వివక్ష
జాతీయ సదస్సులో ప్రొఫెసర్ చంద్ర హన్మకొండ అర్బన్: దేశంలో అన్ని స్థాయిల్లోనూ మహిళలపై వివక్ష కొనసాగుతోందని, దాని నుంచి బయటపడాలంటే మహిళలు చైతన్యవంతులై పోరాడాలని చెన్నైకు చెందిన ప్రొఫెసర్ ఆర్.చంద్ర పిలుపునిచ్చారు. వరంగల్ నిట్‌లో జరిగిన 5వ జాతీయ మహిళా ఉద్యోగుల సదస్సు రెండోరోజు కార్యక్రమంలో ప్రొఫెసర్ చంద్ర మాట్లాడారు. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి చట్టాలు చేయించుకోవాల్సిన అవసరం ఉం దని అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్రమమార్గంలో వినియోగించుకుంటూ మగ సంతానాన్నే కనేందుకు ఇష్టపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో దళిత మహిళలు అవమానకరస్థితిలో జీవితం గడుపుతున్నారన్నారు. ముగిసిన సదస్సు: రెండురోజుపాటు జరిగిన జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. మొత్తం 23 రాష్ట్రాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఏఐఎస్‌జీఈఎఫ్‌జాతీయ చైర్మన్ ముత్తసుందరం ప్రవేశపెట్టిన వరంగల్ డిక్లరేషన్ తీర్మానాలను ప్రతినిధులు ఆమోదించారు. -
అవే వజ్రాయుధాలు!
వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయం అతలాకుతలమవుతోంది. కరువు, కుంభవృష్ఠి, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు పంటలన్నిటినీ అస్తవ్యస్థం చేస్తున్నాయి. రానున్న కాలంలో ఉష్ణోగ్రత 2-5 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. భూసారం అడుగంటింది. పోషకాహార భద్రత లేదు. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో వర్షాధారంగా సేద్యం చేస్తున్న మెట్ట రైతు తన బతుకు బండిని కనీస భరోసాతో నడిపించుకోవడం ఎలా? బడుగు రైతు తనను తాను నిలబెట్టుకుంటూ.. భూసారాన్ని రక్షించుకుంటూ.. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు ఉన్నంతలో దోహదపడే సంప్రదాయ పంటలు, పేద రైతులకు అనువైన సేద్య పద్ధతులు ఏవి? ఇటువంటి మౌలిక ప్రశ్నలన్నిటికీ దీటైన సమాధానం... మిశ్రమ (చిరుధాన్యాలు + పప్పుధాన్యాలు + నూనెగింజల) పంటల సేంద్రియ సేద్య పద్ధతేనని అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమైన రైతులు ముక్తకంఠంతో చాటి చెప్పారు. సంక్షోభం నుంచి రైతాంగ సమాజం బయటపడడానికి ఇటువంటి చైతన్యంతో కూడిన సేద్యమే సర్వోన్నత మార్గమని ఎలుగెత్తి చాటారు. జాతిని పీడిస్తున్న సూక్ష్మపోషకార లోపాన్ని పారదోలడం చిరుధాన్యాలతోనే సాధ్యమన్నారు. మిల్లెట్స్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా (మిని) సంస్థ నిర్వహించిన ‘చిరుధాన్యాలపై జాతీయ సమాలోచన’లో పాల్గొన్న పలువురి అభిప్రాయాలను ‘సాగుబడి’ పాఠకుల కోసం ఇక్కడ పొందుపరుస్తున్నాం.. కరువులోనూ... చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాను. మాకు ఐదెకరాల భూమి ఉంది. ఎకరంలో వరి, అరెకరంలో కంది, మినుము వంటి పప్పు పంటలు వేస్తున్నాను. మూడున్న ఎకరాల్లో జొన్న, సజ్జ, కొర్ర తదితర చిరు ధాన్యాలు పండిస్తున్నాం. కరువు కాలంలోనూ చిరుధాన్యాల దిగుబడి పర్వాలేదు. పశువుల ఎరువు తప్ప ఇంకా ఎటువంటి ఎరువూ వేయం. మేం తినడానికి అట్టిపెట్టుకొని, మిగతా గింజలను లోకల్ మార్కెట్లో అమ్ముకుంటాము. - సుబేరి మల్లిక్, భలేపాని గ్రామం, ఖందమాల్, ఒడిశా సమస్య ఏకపంటలతోనే... మాది కరువు ప్రాంతం. భూగర్భంలో అంతా ఉప్పు నీరు. సాగంతా వర్షాధారమే. నా 8 ఎకరాల పొలంలో 28 ఏళ్లుగా సేంద్రియ సేద్యం చేస్తున్నా. జొన్న, సజ్జ, కొర్ర, రాగులు, దేశీ (జయధర్) పత్తి, మిరప, వేరుశనగ, ఉలవ, ఉల్లి, కూరగాయలు.. వంటి పంటలు మిశ్రమ సాగు చేస్తున్నా. మా జిల్లాలో 110 మంది సేంద్రియ రైతులు సంఘంగా ఏర్పడ్డాం. వివిధ ఆహారోత్పత్తులను తయారు చేసి ముంబై, బెంగళూరులో దుకాణ దారులకు అమ్ముతున్నాం. సగటున ఎకరానికి రూ. 30 వేల వరకు ఆదాయం పొందుతున్నాం. కర్ణాటకలో సేంద్రియ రెతైవరూ ఆత్మహత్య చేసుకోలేదు. చెరకు, పత్తి, మొక్కజొన్న, వరి పంటలను ఏక పంటలుగా (మోనోకల్చర్) రసాయనాలతో సాగు చేసే రైతులే ఆత్మహత్యల పాలవుతున్నారు. - భర్మ గౌడ, యలవర్తి, గదక్ జిల్లా, కర్ణాటక రెండే వానలైనా... ఎకరం పావు సొంత పొలంలో సేంద్రియ పత్తి, కౌలుకు తీసుకున్న 4 ఎకరాల్లో సజ్జ, జొన్న, నువ్వులు సాగు చేస్తున్నాం. రెండేళ్లుగా పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం. పశువుల ఎరువు వేస్తాం. చీడపీడలు తక్కువే. అప్పుడప్పుడూ వెల్లుల్లి - మిరప కషాయం పిచికారీతో పురుగుల నుంచి పంటను కాపాడుతున్నాం. మరీ అవసరమైతే పంచగవ్య చల్లుతాం. ఈ సంవత్సరం రెండంటే రెండే వానలు పడ్డాయి. రసాయనిక ఎరువులు వేసిన ఇతర రైతుల పొలాలు ఎండిపోయాయి. మా పొలంలో పంటలు ఎండలేదు. ఎరువులు, పురుగు మందులకు ఇతర రైతులు పెట్టే ఖర్చులో మాకు 10 శాతమే ఖర్చు అవుతుంది. జనం మా ఇంటికి వచ్చి మార్కెట్ ధరకన్నా 20-30 శాతం ఎక్కువ డబ్బిచ్చి సజ్జలు, జొన్నలను కొనుక్కెళ్తున్నారు. మా పొలాలు చూసి.. మరో ఇద్దరు మహిళా రైతులు కూడా చిరుధాన్యాలను పండిస్తున్నారు. - ఖతిజ, ఖిరాయ్ గ్రామం, మోర్బి జిల్లా, గుజరాత్ ప్రభుత్వం ప్రోత్సహించాలి మాకు మూడున్నరెకరాల పొలం ఉంది. 20 ఏళ్లుగా సేంద్రియ చెరకు పండించే వాడ్ని. 2009 తర్వాత నుంచి కరువు కాలం వచ్చింది. పత్తి, వేరుశనగ వేస్తే.. అడవి పందులు, నెమళ్లు, కోతులు పంట చేతికి రానివ్వటం లేదు. నాలుగేళ్ల క్రితం తొలిసారి అరెకరంలో కొర్ర సాగు చేశా. 4.5 క్వింటాళ్లు పండింది. గింజ సన్నగా ఉంటుంది కాబట్టి కోతులు కొర్ర జోలికి అంతగా రావటం లేదు. ఈ ఏడాది మూడెకరాల్లో కొర్ర, సోయా, కంది వేశా. 18.5 క్వింటాళ్ల కొర్రలు, అర క్వింటా సోయా చిక్కుళ్లు పండాయి. కొర్ర ధాన్యాన్ని క్వింటా రూ. 3 వేలు చొప్పున డీడీఎస్‌కు అమ్మా. వచ్చే ఏడాది 20 ఎకరాల్లో ఈ పంటలు వేయాలనుకుంటున్నా. చిరు ధాన్యాల ప్రాసెసింగ్ యంత్రాలను ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వం నెలకొల్పాలి. మధ్యాహ్న భోజనంలో చిరు ధాన్యాలు వాడాలి. అలాగైతేనే కరువు కాలంలోనూ రైతు బతకగలుగుతాడు. ఆత్మహత్యలు ఆగుతాయి. జాతి ఆరోగ్యమూ బాగుపడుతుంది. - ఎడ్ల నారాయణరెడ్డి (94901 28782), ఇబ్రహీంపురం, మన్నెవారి దుర్గపల్లి, నల్గొండ జిల్లా బలమైనతిండి మా ఎవుసం భూతల్లికి, మనుషులకి, పశువులకు, పక్షులకు, గాలికి.. మంచిది. మా ఇత్తనంతోనే జొన్నలు, సజ్జలు, కొర్రలు, పెసలు, మినుములు, ఉలవలు, తొగళ్లు.. కలిపి పండిస్తున్నం. పొలంలో అన్ని రకాల ఆకులు రాలతై. భూతల్లిని కూడా కాపాడినట్టయితుంది. పశువులకు గడ్డి వస్తుంది. పిట్టలు బతుకుతై. పొలంలో పెరిగే ఆకులు తెంపుకొచ్చి తింటం. ఇది చాలా బలమైన తిండి. మందులేసుడు, భూమిని గట్టిగ చేసుడు, గాలిని ఆగం చేసుడు అసలు లేదు. పెంట ఎరువేస్తం. 30 ఏళ్లలో రేగడి భూములకన్నా మా భూములు బాగా తయారైనై. నాలుగైదు వానలే పడినా సగం దిగుబడికి భరోసా ఉంది. - సమ్మమ్మ, డీడీఎస్ మహిళా రైతు సంఘం, జహీరాబాద్, మెదక్ జిల్లా -
గీతాపఠనం విజయానికి సోపానం
చంద్రగిరి : భగవద్గీతలోని 18 అధ్యాయాలు 18 సూత్రాలుగా మానవాళి విజయాలకు తోడ్పడుతున్నాయని కేఎస్‌ఎస్‌ఆర్‌మాజీ సంచాలకులు పంచముఖి అన్నారు. టీటీడీ వారి సౌజన్యంతో మండలంలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో గత రెండు రోజులుగా మేనేజ్ మెంట్ డాట్ ఫ్రం భగవద్గీత అనే అంశంపై జాతీయ సదస్సు జరుగుతోంది. ఇందులో భాగంగా రెండవ రోజైన శుక్రవారం భగద్గీతపై వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యానికేతన్ విద్యాసంస్థల సీఈవో, సినీనటుడు మంచు విష్ణు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇస్కాన్ డెరైక్టర్ రేవతిరమణదాస్ మాట్లాడుతూ మానవజీవనప్రమాణాలకు సంబంధించిన అనేక అంశాలు భగవద్గీతలో వున్నాయన్నారు. మరో విశిష్ట అతిథిగా విచ్చేసిన హిందూ దినపత్రిక రిటైర్డ్ ఎడిటర్ రామస్వామిసంపత్ మాట్లాడుతూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక శాస్త్రీయమైన మనస్తత్వం గల వ్యక్తిగా ఆయన అభివర్ణించారు. అనంతరం విద్యాసంస్థల సీఈవో మంచు విష్ణు మాట్లాడుతూ ఇంతమంది వ్యక్తులు ఈ కార్యక్రమానికి రావడం భగవద్గీతపై ప్రసంగించడం ఆనందంగా వుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి డి.గోపాలరావు, సంస్థ డెరైక్టర్ మోహన్, గురునాధనాయుడు, శ్రీనివాసరావు, విద్యావేత్తలు, అధ్యాపకులు, పరిశోధనా విద్యార్థులు ,కార్పొరేట్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
సీపీఎం 21వ జాతీయ మహాసభలు
-
సీపీఎం 21వ జాతీయ మహాసభలు
-
రేపటి నుంచి సీపీఎం జాతీయ మహాసభలు
విశాఖలో ఏపీ, తెలంగాణ కమిటీల సంయుక్త నిర్వహణ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వెల్లడి సాక్షి, విశాఖపట్నం: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) (సీసీఐ(ఎం)) 21వ జాతీయ మహాసభలు మంగళవారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్నాయని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు. విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1982లో విజయవాడలోను, 2002లో హైదరాబాద్‌లోను ఈ మహాసభలు జరిగాయని తెలిపారు. ఈ సభల్ని పార్టీ ఏపీ, తెలంగాణ కమిటీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. స్థానిక పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఐదురోజులు జరగనున్న ప్రతినిధుల సభలకు 900 మంది ప్రతినిధులు హాజర వుతారని తెలి పారు. ప్రతినిధుల సభలో రాజకీయ సమీక్షా నివేదిక, రాజ కీయ తీర్మానం, రాజ కీయ నిర్మాణ నివేదికలతో పాటు దేశంలో ప్రజలెదుర్కొంటున్న వివిధ సమస్యలు, ఎన్డీఏ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణల గురించి చర్చించి తీర్మానాలు చేస్తామని వివరించారు. 19వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు ఆర్కే బీచ్‌లో నిర్వహించే బహిరంగ సభతో ఈ మహాసభలు ముగుస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ర్ట కార్యదర్శి పి.మధు, రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్.నరసింగరావు, మహాసభల మీడియా కమిటీ ఇన్చార్జి ప్రొఫెసర్ బాబీవర్ధన్, కన్వీనర్ బి.ఎస్.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ‘పట్టిసీమ’కు నిధుల వెనుక కుట్ర విజయనగరం: ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు కాకుండా పట్టిసీమ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించడం వెనుక భారీ కుట్రే ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. ఆయన ఆదివారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగునీటిని అందించడం కోసం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పలు ప్రాజెక్టులు నిధులు లేక నిర్మాణ దశలోనే ఆగిపోయాయని, వాటికి కనీసం రూ.100 కోట్లు కేటాయిస్తే సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయిం చకుండా, నీటిపారుదల శాఖలోని సీనియర్ ఇంజనీర్లు సైతం వృథా అని చెబుతున్న పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.1,300 కోట్లు కేటాయించడం దారుణమని విమర్శించారు. -
స్వీయ మదింపు వ్యవస్థ కావాలి
న్యాయవ్యవస్థకు ప్రధాని మోదీ సూచన మేం తప్పు చేస్తే మీరు సరిదిద్దుతారు..మీరే పొరపాటు చేస్తే అంతా నాశనం న్యాయమూర్తుల జాతీయ సదస్సులో మోదీ హెచ్చరిక న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థను ప్రజలు అత్యంత పవిత్రమైనదిగా, భగవంతుడి తరువాత అంతటి దివ్యమైనదిగా భావిస్తారని.. అందువల్ల కష్టమైనా సరే, అంతర్గత స్వీయ మదింపు వ్యవస్థను న్యాయవ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆదివారం సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ఉన్నత స్థాయి జడ్జీలు, రాష్ట్రాల సీఎంలు పాల్గొన్న జాతీయ సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘మేం(రాజకీయవాదులం) అదృష్టవంతులం. ప్రజలే మమ్మల్ని అంచనా వేస్తుంటారు. అవసరమనుకుంటే పక్కన పెట్టేస్తుంటారు. మీరు మా అంత అదృష్టవంతులు కారు. ఒక వ్యక్తికి మీరు మరణశిక్ష విధించినా సరే.. ఆ వ్యక్తి తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందనే అంటాడు. అలా.. న్యాయవ్యవస్థపై విమర్శలకు అతి తక్కువ అవకాశం ఉన్నందువల్ల అంతర్గత స్వీయ మదింపు వ్యవస్థను న్యాయవ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం తక్షణావసరం. అది ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఎటువంటి సంబంధం లేని వ్యవస్థ అయి ఉండాలి’ అన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థపై తనిఖీలకు ఎన్నికల సంఘం, ఆర్టీఐ, లోక్‌పాల్ మొదలైనవి ఉన్నాయని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసం ఏమాత్రం సన్నగిల్లినా.. అది దేశానికే ప్రమాదకరమవుతుందని హెచ్చరించారు. న్యాయవ్యవస్థ దృఢతరమవుతున్న ప్రస్తుత తరుణంలో.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం న్యాయమూర్తులపై ఉందన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి అభిశంసన తీర్మానం పార్లమెంటుకు వచ్చిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, చట్టాల రూపకల్పనలో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు ఆధునిక మౌలిక వసతుల కల్పన కోసం 14వ ఫైనాన్స్ కమిషన్ కింద జ్యూడీషియరీ బలోపేతానికి రూ. 9,749 కోట్లు కేటాయించామని తెలిపారు. మరింతమంది న్యాయనిపుణుల అవసరముందని, దీని కోసం మరిన్ని న్యాయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, మోదీ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్ దత్తు స్పందిస్తూ.. న్యాయవ్యవస్థలో ఇప్పటికే అంతర్గతంగా స్వీయ మదింపు వ్యవస్థ ఉందని, అది అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. ట్రిబ్యునళ్లపై సమీక్ష: ట్రిబ్యునళ్ల పనితీరుపై ప్రధాని నిశిత వ్యాఖ్యలు చేశారు. అవి అతి తక్కువ కేసులను పరిష్కరించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. అవి న్యాయాన్ని అందిస్తున్నాయా? న్యాయానికి అడ్డుగా నిలుస్తున్నాయా? అన్న విషయంపై సుప్రీంకోర్టు సీనియర్ జడ్జీలు సమీక్షించాల్సి ఉందన్నారు. ట్రిబ్యునళ్ల పనితీరు బాగాలేకుంటే.. వాటికి కేటాయిస్తున్న నిధులను కోర్టులకు మళ్లించే అవకాశాలపై దృష్టి పెట్టాలన్నారు. మాపై మీడియా దృష్టి ఎక్కువ ఒకప్పుడు వార్తాపత్రికల్లోని గాసిప్ కాలమ్స్‌లో కూడా చోటు సంపాదించుకోనటువంటి వార్తాంశాలు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్‌గా వస్తున్నాయంటూ ప్రధాని చురకలేశారు. ‘రాజకీయ నేతలపై మీడియా దృష్టి పెరిగింది. 24 గంటలూ మీడియా పరిశీలన ఉండే రాజకీయ తరగతికి చెందినవాడిని నేను. మా తరగతి చాలా చెడ్డ పేరు సంపాదించింది. మేం ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ప్రజలకు సమాధానమివ్వాల్సి ఉంటుంది. మాపై ఆర్టీఐ, ఎన్నికల సంఘం, లోక్‌పాల్ లాంటి తనిఖీ వ్యవస్థలనూ ఏర్పాటు చేసుకున్నాం’ అన్నారు. జ్యుడీషియరీ కూడా ఒక అంతర్గత మదింపు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ మోదీ పై వ్యాఖ్యలు చేశారు. ‘ఇళ్లలో పెద్దలు డబ్బులు, ఇతర విలువైన వస్తువులను బాక్స్‌ల్లో పెట్టి తాళాలేస్తుంటారు. అది దొంగలెత్తుకుపోతారని కాదు. దొంగలు మొత్తం బాక్స్‌నే ఎత్తుకుపోగలరు. పిల్లలు చెడు అలవాట్లు అలవడకుండా ఉండటం కోసం పెద్దలు అలా చేస్తుంటారు’ అని వివరించారు. -
పునరేకీకరణపై మనకెందుకు తొందర?
పుదుచ్చేరి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పార్టీ పునాదుల్ని పటిష్ట పరుచుకోవడానికి బదులు విలీనం, పునరేకీకరణపై వెంపర్లాడాల్సిన అవసరమేముందని సీపీఐ ప్రతినిధులు పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న పార్టీ 22వ జాతీయ మహాసభల్లో గురువారం రాజకీయ తీర్మానం, సంస్థాగతకార్యకలాపాల నివేదిక, పార్టీ ముసాయిదా కార్యక్రమంపై చర్చ జరిగింది. ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు డి.రాజా ప్రతిపాదించిన ఈ నివేదికలపై 16 మంది సభ్యులు మాట్లాడారు. కమ్యూనిస్టుల పునరేకీకరణ, విలీనం ప్రతిపాదనపై సీపీఐ అగ్ర నాయకత్వం చూపుతున్న అతి చొరవను ఆక్షేపిస్తూనే సీపీఎం నాయకత్వ ధోరణిపై కేరళ, గుజరాత్, పంజాబ్ ప్రతినిధులు విరుచుకుపడ్డారు. కేరళ మహిళా ప్రతినిధులు పార్టీ జాతీయ నాయకత్వాన్ని దునుమాడారు. ప్రస్తుత నాయకత్వానికి పదవుల్లో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. ప్రధాన కార్యదర్శి సురవరం ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణలో సీపీఐ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే దానిపై పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయని వ్యక్తి దేశానికి ఏమి బోధిస్తారన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో పార్టీ అతలాకుతమైతే ఒక్కసారన్నా పర్యటించారా? అని నిలదీశారు. భూసేకరణ బిల్లుకు నిరసనగా మే 14న ఉద్యమానికి పార్టీ మహాసభ పిలుపిచ్చింది. -
వైరాలజీ ల్యాబ్ ఏర్పాటుకు కృషి
⇒ భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ⇒ ఐఐసీటీలో జాతీయ సదస్సు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: స్వైన్ ఫ్లూ, చికున్‌గున్యా, డెంగీ తదితర వ్యాధులు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో వ్యాధికారక వైరస్‌లపై పరిశోధనలను నిర్వహించేందుకు హైదరాబాద్‌లో పరిశోధనశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరమెంతైనా ఉందని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు, ప్రముఖ లాప్రోస్కోపిక్ సర్జన్ బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చైనా హైదరాబాద్ కేంద్రంగా ఒక వైరల్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో మంగళవారం ‘ఎమర్జింగ్ అండ్ రీ ఎమర్జింగ్ వైరల్ ఔట్‌బ్రేక్స్ ఇన్ ఇండియా - క్లినికల్ చాలెంజస్ అండ్ మేనేజ్మెంట్’ అన్న అంశంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఉస్మానియా యూనివర్సిటీ, సైఫాబాద్‌లోని యూనివర్సిటీ సైన్స్ కాలేజీలు, నిజాం కళాశాల, కోఠీ మహిళా కళాశాల సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ మూడు రోజుల సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ పూణేలోని వైరస్ పరిశోధన కేంద్రంపై ఉన్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో మరో ల్యాబ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దేశ జనాభా ఇప్పటికే రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతోందని, ఆర్థికంగానూ వీటి ప్రభావం ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రజా చైతన్యం, వ్యక్తిగత, సామాజిక పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మాత్రమే వైరల్ వ్యాధులను నియంత్రించ వచ్చునని స్పష్టం చేశారు. సాంక్రమిక వ్యాధులపై మార్చిలో సదస్సు వైరస్‌లతో సోకే వ్యాధులు ఇటీవలి కాలంలో కొత్తకొత్త రీతుల్లో దాడి చేస్తున్నాయని, ఫలితంగా వాటి నియంత్రణ కష్టసాధ్యంగా మారిందని అపోలో హాస్పిటల్స్ ఇన్ఫెక్షిస్ డిసీజ్ కన్సల్టెంట్ డాక్టర్ సునీతా నర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధి కారక సూక్ష్మజీవులు కొత్తకొత్త రూపాల్లో రావడం... అప్పటివరకూ వ్యాధి సోకని ప్రాంతాల్లోనూ వేగంగా విస్తరిస్తూ ఉండటం, మందులకు నిరోధకత పెంచుకోవడం వల్ల దేశంలో పాత వ్యాధులు మళ్లీమళ్లీ తిరగబెడుతున్నాయని, అదే సమయంలో కొత్త వ్యాధులు కూడా సోకుతున్నాయని ఆమె తెలి పారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రజారోగ్య వ్యవస్థ మౌలిక సదుపాయాలను పటిష్ట పరచాల్సి ఉందని, భిన్న వర్గాల విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు సంప్రదింపుల ద్వారా తమ అనుభవాలను పంచుకోవాల్సిన అవసరముందని అన్నారు. అన్ని రకాల సాంక్రమిక వ్యాధులపై జిల్లాస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో రాష్ట్రాల ప్రజారోగ్య సంస్థలు వ్యాధులపై పరిశోధనలు, నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ సదస్సు జరగనుందని తెలిపారు. సదస్సులో ఇండియన్ వైరలాజికల్ సొసైటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ.కె.ప్రసాద్ ముఖ్యోపన్యాసం చేయగా, సదస్సు కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం.రాధాకృష్ణ, ఫీవర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ శంకర్, గాంధీ ఆసుపత్రి ఎండీ డాక్టర్ నాగేందర్, సీసీఎంబీ శాస్త్రవేత్త శైలేంద్ర సక్సేనా, రాజీవ్‌గాంధీ, తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సత్యనారాయణ, సి.పార్థసారథిలు పాల్గొన్నారు. -
ఎన్సీ మద్దతు తీసుకోం: పీడీపీ
శ్రీనగర్: కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుకోసం నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) మద్దతు తీసుకోవాలనుకోవడం లేదని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) పేర్కొంది. జమ్మూ, కశ్మీర్ ప్రజలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారని పీడీపీ ప్రతినిధి నయీమ్ అక్తర్ బుధవారం మీడియాతో అన్నారు. కేవలం 15 సీట్లుమాత్రమే ఉన్న ఆ పార్టీకి, ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలో నిర్ణయించే అధికారం లేదని ఆయన పేర్కొన్నారు. పీడీపీకి మద్దతు ఇస్తామని, అంతేకాక తమ పార్టీని సంప్రదించకుండా ప్రభుత్వం ఏర్పాటుకోసం ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కోరుతూ నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా రాష్ట్ర గవర్నర్‌కు లేఖరాయడాన్ని అక్తర్ తప్పుబట్టారు. కేవలం అధికారంకోసమే ప్రభుత్వం ఏర్పాటు చేయడం తమ పార్టీ లక్ష్యం కాదని, రాష్ట్రంలో శాంతి, సుస్థిరతల స్థాపనే తమ ఎజెండా అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకోసం బీజేపీతో జరుగుతున్న చర్చల గురించి ప్రస్తావించగా, అనధికార చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు వారాలు అయినా ఈ రెండు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటుపై ఒక అవగాహనకు రాలేకపోయాయి. దాంతో పాలన బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించారు. బయట నుంచి మాత్రమే మద్దతు ఇస్తామన్నాం: ఎన్సీ ప్రభుత్వం ఏర్పాటులో పీడీపీకి తాము కేవలం బయటినుంచి మాత్రమే మద్దతు ఇస్తామన్నామని నేషనల్ కాన్ఫరెన్స్ పేర్కొంది. పీడీపీలా తమకు అధికార దాహం లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధాన కార్యదర్శి అలీ మహమ్మద్ ఓ ప్రకటన చేశారు. తమ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు, ఆదర్శాలు ఉన్నాయని పేర్కొన్నారు. -
పీడీపీకి మద్దతుపై గవర్నర్‌కు ఎన్సీ లేఖ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎవరూ ముందుకు రాకపోవడంతో రాష్ట్ర అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి కేంద్రం రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)కి లాంఛనంగా మద్దతు ప్రకటిస్తూ గవర్నర్ ఎన్.ఎన్. వోహ్రాకు మంగళవారం లేఖ రాసింది. పార్టీ జమ్మూ ప్రొవిన్షియల్ ప్రెసిడెంట్ దేవేందర్‌సింగ్ రాణా ఈ లేఖను గవర్నర్‌కు జమ్మూలో అందజేశారు. ఈ మేరకు ఎన్సీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ‘ట్వీట్’ చేశారు. కాగా, తాజా పరిణామంపై పార్టీలో చర్చించాక స్పందిస్తామని పీడీపీ ప్రతినిధి నయీమ్ అఖ్తర్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ప్రస్తుతం బీజేపీతో అనధికార స్థాయిలో చర్చలు జరుగుతున్నాయన్నారు.