ట్రంప్‌పై మనవరాలి ప్రశంసల జల్లు
మిల్వాకీ: అది రిపబ్లికన్ల నేషనల్ కాన్ఫరెన్స్. బుధవారం రాత్రి ఓ 17 ఏళ్ల అమ్మాయి వేదికనెక్కింది. తొలి ప్రసంగమే అయినా ఎక్కడా ఆ ఛాయలే లేవు. అనేకానేక అంశాలపై తడుముకోకుండా మాట్లాడి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. దాంతో హాలంతా పదేపదే చప్పట్లతో మార్మోగింది.
ార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనను అబ్బురంగా, ఒకింత గర్వంగా చూసుకుంటూ మురిసిపోయారు. ఆ టీనేజర్ కాయ్ మాడిసన్. ట్రంప్ మనవరాలు. ‘‘తాతా! మీరే నాకు స్ఫూర్తి’’ అని కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారామె. 10 మంది మనవలూ, మనవరాళ్లలో కాయ్ అందరికంటే పెద్ద. ట్రంప్ పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్, ఆయన మాజీ భార్య వనెసా కూతురు.
నేనూ ట్రంప్‌నే...
తాతయ్య ఎప్పుడూ దేశం మంచినే కోరతారని కాయ్ చెప్పుకొచ్చారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చేందుకు పోరాడుతున్నారన్నారు. ఎందరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొని నిలిచారంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ‘‘ఆయనలో బయటికి ప్రపంచానికి పెద్దగా తెలియని కోణాన్ని మీతో పంచుకోదలిచా. తాతగా ఆయనెంతో ప్రేమాస్పదుడు. మేం చిన్నపిల్లలుగా ఉండగా అందరు తాతల్లాగే మమ్మల్నెంతో గారాబం చేసేవారు.
మా పేరెంట్స్ చూడకుండా చాక్లెట్లు, కూల్‌డ్రింకులు ఇప్పించేవారు. మేం ఆనందపడితే చూసి మురిసిపోయేవారు. స్కూల్లో ఎలా చదవుతున్నామో ఎప్పటికప్పుడూ తెలుసుకునేవారు. ఓసారి నాకు బాగా మార్కులొస్తే ఆ ప్రోగ్రెస్ కార్డును ప్రింట్ తీయించి మరీ మిత్రులందరికీ చూపించుకుని సంబరపడ్డారు. నాకు తరచూ కాల్ చేసి గోల్ఫ్ ఎలా ఆడుతున్నానో ఆరా తీసేవారు. తన గోల్ఫ్ కథలన్నీ పంచుకునేవారు. ‘స్కూల్లో ఉన్నా తాతయ్యా, మాట్లాడలేను’ అని చెప్పాల్సి వచ్చేది.
ఇద్దరం కలిసి గోల్ఫ్ ఆడేప్పుడు నన్ను ఓడించడానికి ప్రయతి్నంచేవారు. కానీ పడనిచ్చేదాన్ని కాదు. నేను కూడా ట్రంప్‌నే తాతయ్యా అనేదాన్ని!’’ అంటూ గుర్తు చేసుకున్నారు. 2015లో ట్రంప్ తొలిసారి అధ్యక్ష అభ్యర్థి అయినప్పటి నుంచీ కాయ్ ఆయనతో కలిసి పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రధాన ప్రచార వేదికపై కనిపించడం, మాట్లాడటం ఇదే తొలిసారి. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారామె. ట్రంప్‌పై కాల్పులు జరిగిన వెంటనే ఆయన పిడికిలెత్తి నినదిస్తున్న ఫొటోను పోస్ట్ చేసి, ‘‘తాతా, ఐ లవ్యూ. పోరాడుతూనే ఉండు!’’ అని రాశారు. ఆమెకు సొంత యూట్యూబ్ చానల్ ఉంది.
మా నాన్నసింహసదృశుడు
హత్యా యత్నాన్ని ట్రంప్ గొప్పగా ఎదుర్కొన్నారని ఆయన పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్ (46) అన్నారు. ‘‘రక్తం ధారగా కారుతున్నా రొమ్ము విరిచి నిలబడ్డారు. నేపథ్యంలో జాతీయ పతాకం రెపరెపలాడుతుండగా చెయ్యెత్తి పిడికిలి బిగించి పోరాట నినాదాలు చేశారు. అమెరికా పోరాట స్ఫూర్తికే ప్రతీకగా నిలిచారు. కాబోయే దేశాధ్యక్షుడు సింహసదృశుడని నిరూపించారు’’ అంటూ కొనియాడారు. ట్రంప్ భార్య మెలానియా, కూతురు ఇవాంకా, అల్లుడు జరేద్ కుష్నర్ తదితర కుటుంబ సభ్యులు గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) సదస్సులో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment