
నేడు (మార్చి 29).. ప్రపంచ పియానో దినోత్సవం(World Piano Day). పియానోను సంగీత కచేరీలలో ఉపయోగిస్తుంటారు. ఈ వాయిద్య పరికరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పియానోకు సంబంధించిన విషయాలు చాలామందికి తెలియవు. పియానో దినోత్సవం సందర్భంగా ఈ సంగీత పరికరానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
పియానోను తొలిసారిగా 1709లో ఇటలీకి చెందిన హార్ప్సికార్డ్ తయారీదారు బార్టోలోమియో డి ఫ్రాన్సిస్కో క్రిస్టోఫోరీ కనుగొన్నారు. ఆయన రూపొందించిన పియానోలలో ఒకటి న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్(Metropolitan Museum of Art)లో భద్రపరిచారు. పియానో అనేది పియానోఫోర్ట్ అనే పదానికి సంక్షిప్త రూపం. పియానో అంటే మృదువైన, ఫోర్డ్ అంటే బిగ్గరగా.. దీని అర్థం ఏమిటంటే ఈ రెండు రకాల శబ్ధాలను పియానోపై పలికించవచ్చు.
తొలినాళ్లలో పియానోలు చాలా ఖరీదైనవిగా ఉండేవి. వీటిని దాదాపు ఒక శతాబ్దం పాటు ఒక నిర్దిష్ట తరగతికి చెందినవారు మాత్రమే కొనుగోలు చేయగలిగేవారు. నూతన పియానోను దాని కొత్త వాతావరణానికి, మారుతున్న రుతువులకు అనుగుణంగా ట్యూన్ చేయాల్సి ఉంటుంది. దీనిని ఏడాదికి రెండుసార్లు ట్యూనింగ్(Tuning) చేస్తారు. పియానోలో మొత్తం 88 నలుపు రంగు, తెలుపు రంగు కీలు ఉంటాయి. పియానో క్లిష్టమైన వాయిద్య పరికరం. దీనిలో 12 వేలకు పైగా విడి భాగాలు ఉంటాయి.
ప్రపంచంలో అతిపెద్ద పియానో 1.4 టన్నుల బరువు, 5.7 మీటర్ల పొడవు కలిగివుంది. దీనిని న్యూజిలాండ్ పియానో ట్యూనర్ అడ్రియన్ మాన్ రూపొందించారు. పియానో రెండు విధాలుగా ధ్వనిని అందిస్తుంది. మొదటిది బిగ్గరగా, రెండవది మెల్లగా ఉంటుంది. ఈ రెండు శబ్దాలు సరైన క్రమంలో ఉత్పత్తి అయినప్పుడు, శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంది. పియోనాను కీబోర్డ్ ఆధారంగా రూపొందిస్తుంటారు. దీనిలో ఏదైనా కీని గట్టిగా నొక్కితే పెద్ద శబ్దం వస్తుంది, అదే కీని మెల్లగా నొక్కినప్పుడు మృదువైన శబ్దం వస్తుంది.
ఇది కూడా చదవండి: ‘ప్రధాని మోదీ తెలివైన వ్యక్తి’.. భారత్ సుంకాలపై స్పందించిన ట్రంప్