
పాశ్చాత్య పరికరాలదే పైచేయి ఉన్నా.. సంప్రదాయానికీ పెద్దపీట
వాయిద్యాలను పలికించడం ఆరోగ్యకరం అంటున్న అధ్యయనాలు
హాలిడేస్‌లో అత్యంత ఆదరణ పొందుతున్న మ్యూజిక్ క్లాసెస్..
వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై ఆసక్తి
నగరంలో సంగీత వాయిద్యాలలో ప్రావీణ్యం సంపాదించడం పట్ల ఆసక్తి బాగా పెరుగుతోంది. సెలవుల్లో అందివచ్చిన సమయాన్ని సది్వనియోగం చేసుకునే క్రమంలో మ్యూజిక్‌కి జై కొడుతున్నారు స్టూడెంట్స్.. ముఖ్యంగా కోవిడ్ సమయంలో లాక్‌డౌన్ సమయం సంగీత వాయిద్యాల సాధనను ఎంచుకోవడానికి లేదా తిరిగి తమ అభిరుచులను సానబట్టడానికి దారితీసింది. అదే సమయంలో ఆన్‌లైన్ అభ్యాస వేదికలు విరివిగా అందుబాటులోకి రావడం ఈ అభిరుచికి ఆజ్యం పోసింది. దీని వలన విద్యార్థులు ఇంట్లో నుంచి కదలకుండానే వాయిద్యాలను నేర్చుకోవడం సులభమైంది. -సాక్షి,సిటీబ్యూరో
ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో సంగీత శైలులపై అవగాహన పెరిగింది. వాయిద్యాల సాధనపై ఆసక్తికి పాశ్చాత్య సంగీతానికి పెరుగుతున్న ఆదరణ కూడా కారణమే. రాక్, పాప్, జాజ్ వంటి పాశ్చాత్య శైలులకు పెరుగుతున్న ప్రజాదరణ గిటార్లు, కీబోర్డులు, డ్రమ్స్ వంటి వాయిద్యాలకు డిమాండ్ పెంచింది. అదేవిధంగా కొరియన్ పాప్ కల్చర్ పట్ల పెరుగుతున్న మోజు కూడా మరో కారణం. పాశ్చాత్య వాయిద్యాలు ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, ముఖ్యంగా ఫ్యూజన్ సంగీతాన్ని అన్వేషించే యువతలో భారతీయ శాస్త్రీయ వాయిద్యాలపైనా బలమైన ఆసక్తి ఉంది.
సాధనకు సరైన సమయం..
తల్లిదండ్రులు సంగీత విద్య ప్రయోజనాలను గతంలో కన్నా ఎక్కువగా తెలుసుకున్నారు. వేసవి సెలవుల్లో తమ పిల్లలను అర్థవంతమైన కార్యకలాపాల్లో నిమగ్నం చేయడంలో సంగీతాన్ని మించింది లేదని భావిస్తున్నారు. విద్యార్థులకు అత్యంత ఆసక్తి ఉన్న వాయిద్యం కీబోర్డ్ కాగా ఆ తర్వాత స్థానాల్లో గిటార్, డ్రమ్స్, వయోలిన్, పియానోలు ఉన్నాయి. ఇక గాత్ర శిక్షణ పట్ల కూడా ఆసక్తి పెరుగుతోంది.
పరికరం.. ఆరోగ్యకరం..
సంగీత వాయిద్యం పలికించడం ద్వారా మెదడు ఆరోగ్యం బలోపేతమై ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగి పనితీరుపై సానుకూల ప్రభావాలను చూపుతుందని, అభ్యాస ఆసక్తిని మరింత ప్రోత్సహిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎక్సెటర్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనంలో సంగీత వాయిద్యం వాయించడం తదుపరి జీవితంలో మెరుగైన మెదడు ఆరోగ్యం ఏర్పడటం మధ్య సంబంధం ఉందని కనుగొంది. సంగీతానికి విశ్రాంతి కలిగించే శక్తి ఉంది.

అందుకే చాలా మంది ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆందోళన చెందుతున్నప్పుడు వాయిద్యం వాయించడం వైపు మొగ్గు చూపుతారు. ఫ్లూట్ నేర్చుకుంటున్న నగరానికి చెందిన ఎంఎస్సీ కెమిస్ట్రీ విద్యారి్థని లక్ష్మీ ‘వేణువు ఒక మధురమైన విశ్రాంతినిచ్చే వాయిద్యం’ అంటోంది. వేణువు వాయించడం మానసిక ఉద్రిక్తతను తగ్గిస్తుందని ఆమె చెప్పింది. ప్రతిరోజూ అరగంట సాధన చేస్తానని.. అది తన చదువుపై మరింత దృష్టి పెట్టడానికి సహాయ పడిందని చెప్పింది. వాయిద్యం వాయించడం భావోద్వేగ వ్యక్తీకరణకు సహాయపడుతోంది. భావోద్వేగాలకు ఒక మార్గాన్ని అందించడం ద్వారా ఆందోళనను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది అని మానసిక వైద్యులు డా.పరమేష్ వివరించారు.
ఇదీ చదవండి: Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?
వేసవిలో సంగీత ప్రయాణం
చదువుకునే ఒత్తిడి లేని వేసవిలో విద్యార్థులు సంగీత ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా మంది. ఇది సరైన ప్రారంభంగా ఉపకరిస్తుంది. అంతేకాకుండా, ప్రస్తుత సంగీత వేసవి కోర్సులు సాధారణ పాఠ్యాంశాల్లో అనుసంధానించడానికి అనుకూలంగా రూపొందిస్తున్నారు. ఇది స్కూల్స్/కాలేజీలు ప్రారంభింన తర్వాత కూడా విద్యార్థులు ఎటువంటి అంతరాయం లేకుండా సాధన
కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. – లక్ష్మీనారాయణ యేలూరి, వ్యవస్థాపకులు ముజిగల్ అకాడమీ
గిటార్ సాధన చేస్తున్నా..
పాశ్చాత్య సంగీతం అంటే ఇష్టం. రాక్ బ్యాండ్స్ ప్రదర్శనలకు హాజరవుతుంటాను. మంచి రాక్ బ్యాండ్ లో చేరాలని ఆలోచన ఉంది. అయితే కాలేజీలో క్లాసెస్ ఉన్నప్పుడు కుదరదు కాబట్టి.. ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాసెస్‌లో గిటార్ నేర్చుకుంటున్నా. – విప్లవ్, విద్యార్థి మణికొండ
