summer camps
-
గురుకులాల్లో సమ్మర్ క్యాంపుల హడావుడి!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో సమ్మర్ క్యాంపులకు తెరలేచింది. నేటి(శనివారం) నుంచి మే 6వ తేదీ వరకు క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(ఈఎంఆర్ఎస్), మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)ల పరిధిలోని 86 గురుకుల పాఠశాలల్లో ఈ క్యాంపులు నిర్వహించనున్నారు. క్యాంపుల్లో దాదాపు 25 వేల మంది విద్యార్థుల కోసం వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహి స్తారు. సమ్మర్ క్యాంపుల్లో విద్యార్థుల ఎంపికకు ప్రతిభను ప్రామాణికంగా తీసుకున్నారు. తరగతికి ఎనిమిది మంది చొప్పున ఒక్కో పాఠశాల నుంచి 40 మంది విద్యార్థులు క్యాంపులో పాల్గొంటారు. ఈ విద్యార్థులకు తోడుగా ఒక్కో టీచర్‌ను ఎంపిక చేస్తారు. నాలుగు సొసైటీల నుంచి 650 మంది ఉపాధ్యాయులు క్యాంపుల్లో పాల్గొననున్నారు. అయితే ఈ ఉపాధ్యాయులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వడం లేదు. కనీసం ఈఎల్(సంపాదిత సెలవులు) కూడా ఇవ్వకపోవడంపట్ల టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమ్మర్ క్యాంపులకు హాజరయ్యేందుకు పలువురు నిరాసక్తత వ్యక్తం చేస్తూ వినతులు సమర్పిస్తున్నారు. విద్యార్థుల్లోనూ అయిష్టతే... గురుకుల సొసైటీలు నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులపట్ల విద్యార్థులు సైతం అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్యాంపుల్లో ఐదు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. కుటుంబసభ్యులతో గడిపే కాలం తగ్గిపోతుందనే భావన ఎక్కువ మందిలో కనిపిస్తోంది. మరోవైపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, కొన్నిచోట్ల కోవిడ్–19 కేసులు పెరుగుతుండటంతో తల్లిదండ్రులు సైతం సమ్మర్ క్యాంపులకు పంపేందుకు సాహసించడంలేదు. వేసవి సెలవుల్లో పిల్లలతో ఇలా ప్రత్యేక క్యాంపులు నిర్వహించడం విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధమంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. సమ్మర్ క్యాంపులకు అవసరమైన మెటీరియల్ సరఫరా, ఏర్పాటు, ఇతరాత్ర సౌకర్యాల కల్పన బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు ఇవ్వడాన్ని గురుకుల ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటు సంస్థల కోసమే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఎప్పటి నుంచి అంటే..
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల విరామానంతరం తిరిగి ఈ ఏడాది జీహెచ్ఎంసీ వేసవి శిక్షణ (సమ్మర్ కోచింగ్ క్యాంపులు) శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం సమాయత్తమవుతోంది. రెండు సంవత్సరాలుగా కోవిడ్ తీవ్రత.. నిరోధక చర్యల కట్టడి నిబంధనల్లో భాగంగా కోచింగ్ క్యాంపులు నిర్వహించలేదు. ప్రస్తుతానికి పరిస్థితి సజావుగా ఉండటంతో వీటి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత రెండేళ్లుగా సమ్మర్ కోచింగ్ క్యాంపులు లేనందున వాటిని నిర్వహించే ఇండోర్ స్టేడియంలలో పరిస్థితులు చక్కదిద్దే పనిలో పడ్డారు. దాంతోపాటు అవసరమైన క్రీడా పరికరాలు, సామగ్రి కోసం టెండర్లు పిలుస్తున్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంపులను విద్యార్థులకు ప్రతియేటా నిర్వహించేవారు. యాభైఏళ్లకు పైగా చరిత్ర ఉన్న సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ను వేదికగా చేసుకొని జాతీయస్థాయికి ఎదిగిన క్రీడాకారులెందరో ఉన్నారు. (క్లిక్: దిగ్గజ కంపెనీలు భాగ్యనగర్ దిశగా!) ఈ శిక్షణ శిబిరాల ద్వారా నైపుణ్యాన్ని మెరుగుపరచుకున్నవారూ ఉన్నారు. యాభైఏళ్ల క్రితం కేవలం పది ప్లేగ్రౌండ్లలో ఆరు క్రీడాంశాల్లో, 15 మంది కోచ్‌లతో తొలి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభమైంది. అప్పట్లో దాదాపు 1600 మంది విద్యార్థులు శిబిరాల్ని వినియోగించుకోగా, గడిచిన రెండు దశాబ్దాలుగా ప్రతియేటా వేలాదిమంది వినియోగించుకుంటున్నారు. యాభైకి పైగా క్రీడాంశాల్లో వందలమంది కోచ్‌లు శిక్షణనిస్తున్నారు. గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గ్రేటర్‌లోని అన్ని జోన్లలో సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. (క్లిక్: సజ్జనార్ స్పెషల్.. ఒక్కరు మినహా అందరు ఈడీల బదిలీ) -
సమ్మర్ @ఆన్లైన్
సాక్షి, సిటీబ్యూరో: వేసవి అంటేనే వినోదం. విహారం. స్కూళ్లు, కాలేజీలు ముగిసి వేసవి సెలవులొచ్చాయంటే చాలు పిల్లలు ఎగిరి గంతేస్తారు. ఆట, పాటలతో సరదాగా గడిపేస్తారు. ఇంటిల్లిపాది కలిసి టూర్లకు వెళ్తారు. మరోవైపు చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు అనేక సాంస్కతిక సంస్థలు కార్యక్రమాలను రూపొందిస్తాయి. కానీ ఈ ఏడాది కరోనా మహమ్మారి అన్ని రకాల ఆట,పాటలను, ఆనందోత్సాహలను ఇంటికే పరిమితం చేసింది. క్రీడా ప్రాంగణాల్లో, సాంస్కృతిక కేంద్రాల్లో గడపాల్సిన పిల్లలు లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో పలు సంస్థలు, వ్యక్తులు ఆన్లైన్ వేసవి శిబిరాలను నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు వివిధ వయసులకు చెందిన పిల్లల అభిరుచికి అనుగుణమైన కార్యక్రమాలను రూపొందించి అందుబాటులోకి తెచ్చాయి. మరికొన్ని సంస్థలు ఆ దిశగా కార్యాచరణ చేపట్టాయి. ఇంటికే పరిమితమైన పిల్లలకు కనీసం ఆన్లైన్ శిక్షణనిప్పించడం ద్వారా రొటీన్‌కు భిన్నమైన వాతావరణాన్ని కల్పించినట్లవుతుందని తల్లిదండ్రులు సైతం ఆన్లైన్ సమ్మర్ క్యాంపుల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. స్టోరీ ఆర్ట్స్ ఇండియా ‘మిన్మిని’... ప్రముఖ ఇంటర్నేషనల్ స్టోరీ టెల్లర్, స్టోరీ ఆర్ట్స్ ఇండియా వ్యవస్థాపకులు దీపాకిరణ్ ‘మిన్మిని’ పేరుతో ఆన్లైన్ తరగతులను అందుబాటులోకి తెచ్చారు. 5 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులకు ఈ శిక్షణ లభిస్తుంది. ప్రతి గ్రూపులో 12 మందిని ఎంపిక చేస్తారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ ఉంటుంది. కథారచన, కథలు చెప్పడం, కవిత్వం రాయడం, చిత్రలేఖనం, క్రాఫ్ట్సŠ, యోగా, సంగీతం, భావవ్యక్తీకరణ, వంటి అంశాల్లో ఆమె స్వయంగా శిక్షణనిస్తారు. గంటకు పైగా నిర్వహించే ఒక్కో క్లాసులో పిల్లలు తమ సజనాత్మకతకు పదును పెట్టుకునే అవకాశం లభిస్తుంది.‘ప్రతి గ్రూపులో వివిధ అంశాలపైన చర్చలు ఉంటాయని, తద్వారా ఒకరినొకరు పరిచయం చేసుకొనేందుకు అవకాశం లభిస్తుందని’ దీపాకిరణ్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ శిక్షణ కోసం ఆసక్తి ఉన్నవారు వాట్సప్ నెంబర్ ః 9052910239 నెంబర్లో సంప్రదించవచ్చు. అవర్ సేక్రెడ్ స్పేస్... కళల లోగిలి అవర్ సేక్రెడ్ స్పేస్. ఏడాది పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, శిక్షణలతో పాటు సహజమైన, పర్యావరణహితమైన జీవనశైలికి అనుగుణమైన కార్యక్రమాల ద్వారా పిల్లలను, పెద్దలను విశేషంగా ఆకట్టుకుంటున్న సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ సంస్థ ఈసారి లాక్డౌన్ కారణంగా ఆన్లైన్లో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తోంది. జూమ్ యాప్ ద్వారా ఈ శిక్షణను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా యోగా, హస్తకళలు, ఆర్ట్, కొత్తస్నేహితుల పరిచయం, సరికొత్త సృజనాత్మక కళల ఆవిష్కరణలతో పాటు, జర్మనీ, ఉర్దూలలో శిక్షణనివ్వనున్నారు. యోగాలో హఠ యోగా, పవర్ యోగా, విన్యాసయోగా తదితర కార్యమ్రాలను పిల్లలకు నేర్పిస్తారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఈ ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. ఆసక్తి ఉన్న వారు ఫోన్ : 9030613344 నెంబర్లో సంప్రదించవచ్చు. లెర్న్ ఏ ఫారిన్ ల్యాంగ్వేజ్... గోథె జింత్రోమ్ సంస్థ ఈ వేసవి శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా లాక్డౌన్ దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ ‘ లెర్న్ ఏ ఫారిన్ లాంగ్వేజ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జర్మనీ భాష పైన 11 వారాల పాటు ప్రాథమిక అవగాహన కల్పించే శిక్షణ ఉంటుంది. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు దీనిని నిర్వహిస్తారు. పిల్లలే కాదు. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు జర్మనీ నేర్చుకోవచ్చు. పూర్తి వివరాల కోసం, పేర్ల నమోదుకు ‘ఇన్ఫో (ఎట్ ది రేట్ ఆఫ్) గోథె–హైదరాబాద్ డాట్ ఓఆర్జీ’ కి మెయిల్ చేయవచ్చు. -
ఆటలెలా?
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంప్‌లు ఈ నెల 6 నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే ఈసారి వేసవి శిక్షణ శిబిరాల్లో క్రీడా పరికరాలుకరువయ్యాయి. ప్రారంభానికి ఇంకా రెండు రోజులే ఉండగా... ఇప్పటికీ టెండర్ల ప్రక్రియనే పూర్తి కాలేదు. శుక్రవారమే టెండర్లు ఆహ్వానించగా, ఈ నెల 17 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. టెండర్లలో అర్హత పొందిన సరఫరాదారులతో అగ్రిమెంట్ పూర్తయి, వారుక్రీడా సామగ్రిని సరఫరాచేసేందుకు దాదాపు రెండు వారాల సమయం పడుతుంది. అంటే శిక్షణ శిబిరాలు ముగిశాకక్రీడా పరికరాలు శిబిరాలకు చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోజీహెచ్‌ఎంసీ వద్దప్రస్తుతమున్న క్రీడా పరికరాలనే అందరికీ సర్దాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి శిక్షణ శిబిరాలకు దాదాపు లక్ష మంది హాజరవుతారని అధికారుల అంచనా వేస్తుండగా... అరకొర సామగ్రితోనే శిబిరాలు ముగించాల్సిన దుస్థితి నెలకొంది. ఈసారి మొత్తం 730 కేంద్రాల్లో 45 క్రీడాంశాల్లో శిక్షణనివ్వనున్నారు. వాస్తవానికి ఇందుకు అవసరమైన క్రీడా పరికరాలు, సామగ్రి ముందే సమకూర్చుకోవాల్సి ఉంది. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పటిలాగే శిబిరాల ప్రారంభానికి ముందే క్రీడా పరికరాలు సమకూర్చుకునేందుకు సిద్ధమయ్యామని, ఎన్నికల కోడ్ నేపథ్యంలో టెండర్లు ఆహ్వానించేందుకు ఎన్నికల సంఘం అనుమతి కోరామని... ఆలస్యంగా అనుమతి ఇవ్వడంతో టెండర్లలో జాప్యం జరిగిందని స్పోర్ట్స్ డైరెక్టర్ శశికిరణాచారి తెలిపారు. సాధారణంగా ప్రతిఏటా జూన్ 1న శిక్షణ శిబిరాలు ముగుస్తాయని, ఈసారి క్రీడా పరికరాలు రావడం ఆలస్యం కానుండడంతో శిబిరాలను మరో 15 రోజుల వరకు పొడిగిస్తామని చెప్పారు. పెరుగుతున్న డిమాండ్... జీహెచ్ఎంసీ ప్రతిఏటా నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన క్రీడాకారులు విద్యార్థులకు శిక్షణనిస్తారు. ఈ శిబిరాల్లో వివిధ క్రీడాంశాల్లో ఓనమాలు దిద్దుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారెందరో ఉన్నారు. క్రికెటర్ అజారుద్దీన్ నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ వరకు ఎందరో జీహెచ్ఎంసీ క్రీడా మైదానాల్లో శిక్షణ పొందారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంప్‌లకు ఏటికేడు డిమాండ్ పెరుగుతోంది. విద్యార్థులు, యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించాలనే ఉద్దేశంతో తొలుత కేవలం 6 క్రీడాంశాలు, 10 మైదానాల్లో 15 మంది కోచ్‌లతో తొలి వేసవి శిబిరం ప్రారంభమైంది. అప్పుడు 1,400 మంది బాలురు, 200 మంది బాలికలు శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఈసారి దాదాపు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉండగా... 826 మంది జాతీయ, అంతర్జాతీయ, సీనియర్ కోచ్‌లతో శిక్షణనివ్వనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 521 క్రీడా మైదానాలు, 7 స్విమ్మింగ్‌పూల్స్, 17 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, 11 రోలర్ స్కేటింగ్ రింగ్‌లు, 5 టెన్నిస్ కోర్టులు ఉన్నాయి. వేసవి శిక్షణ శిబిరాల్లో ఉత్తమ ప్రతిభ చూపే క్రీడాకారులను ఎంపిక చేసి, వారిని ప్రత్యేక టీమ్‌గా ఏర్పాటు చేసి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు కూడా పంపిస్తారు. శిక్షణ క్రీడాంశాలివీ... సాహస క్రీడలు, అథ్లెటిక్స్, ఆర్చరీ, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బేస్ బాల్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, షటిల్ బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, క్రికెట్, సైక్లింగ్, ఫుట్‌బాల్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, జుడో, కరాటే, కబడ్డీ, ఖోఖో, కిక్ బాక్సింగ్, మల్కంబ, నెట్‌బాల్, రోలర్ స్కేటింగ్, రైఫిల్ షూటింగ్, సెపక్ తక్ర, సాఫ్ట్‌బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, త్వైక్వాండో, టెన్నీకాయిట్, టగ్ ఆఫ్ వార్, త్రోబాల్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ ఇండియా, వెస్లింగ్ రోమన్, వుషు, యోగా, క్రాఫ్ బాల్, పవర్ లిఫ్టింగ్, బీచ్ వాలీబాల్, స్కై మార్షల్ ఆర్ట్స్. -
ఈత.. జాగ్రత్త సుమా
సాక్షి,తలమడుగు(బోథ్): వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఒంటి పూట బడులు సైతం ప్రారంభమయ్యాయి. వేడిమి నుంచి ఉపశమనం కోసం పిల్లలు ఈత కొట్టేందుకు మొగ్గుచూపుతుంటారు. ఈ సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఏటా వేసవిలో ఈత కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నాయి. ప్రాణం తీసే సరదా.. సెలవు రోజులతో పాటు మధ్యాహ్న సమయంలో పిల్లలు సమీపంలోని వ్యవసాయ బావులు, చెరువులు, కాలువల్లో సరదాగా ఈతకు వెళుతుంటా రు. నీళ్లను చూడగానే ఉత్సాహంతో అందులోకి దిగుతుంటారు. తీరా దిగాక లోతు ఎక్కువగా ఉండి ఊపిరాడక మృతి చెందుతున్నారు. గతేడాది తలమడుగు మండలం దేవపూర్‌లో ముగ్గురు వి ద్యార్థులు సమీపంలోని క్వారీలో ఈత కోసం వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు అప్ర మత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీటిలో మునుగుతున్నప్పుడు.. ఈత తెలిసిన వ్యక్తి మాత్రమే నీట మునిగిన వ్యక్తిని రక్షించి బయటకు తీసుకురావాలి. ఈత రానివారు బయటకి తెచ్చే ప్రయత్నం చేయవద్దు. ఇద్దరి ప్రాణాలకు ముప్పే. నీట మునుగుతున్న వ్యక్తికి తాను రక్షిస్తానని చెబుతూ, దగ్గరికి వచ్చినపుడు తనను మాత్రం పట్టుకోవద్దని చెప్పాలి. లేదంటే రక్షించబోయిన వ్యక్తి ప్రమాదంలో చిక్కుకుంటాడు. నీటి మునుగుతున్న వ్యక్తి వద్దకు వెనక నుంచి వెళ్లాలి. బాధితుడు సహకరించకపోతే అతడి వెంట్రుకలు పట్టుకొని ఒడ్డుకు చేర్చాలి. నీటిలో మునుగుతున్న వ్యక్తి ఒడ్డుకు దగ్గరలో ఉంటే టవల్, చీర, ప్యాంట్ వంటివి అందించి పైకి లాగాలి. నీట మునిగితే చేయాల్సిన ప్రథమ చికిత్స నీట మునిగిన వ్యక్తి నీటిని మిండం వలన శ్వాస తీసుకోలేడు. కొన్ని సార్లు బురద శ్వాసావయవాలకు అడ్డుపడవచ్చు. అలాంటప్పుడు ఆ వ్యక్తి నోరును బలవంతంగా తెరిచి వేలితో నోటిలో చేరిన మట్టిని తీసివేయాలి. అనంతరం బాధితుడిని బోర్లా పడుకోబెట్టి తలను ఒక వైపు తిప్పి ఉంచి వీపు బాగాన్ని చేతులతో నొక్కి నీటిని బయటకు పంపాలి. ఇలా తనంతట తాను శ్వాస తీసుకునేంత వరకు నిమిషానికి 16 నుంచి 18 సార్లు నొక్కాలి. తడిసిన బట్టలు మార్చి స్పృహలోకి రాగానే కాఫీ, టీ వంటి వేడి పదార్థాలు ఇవ్వాలి. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. నిపుణుల సూచనలు, జాగ్రత్తలు.. పిల్లలు ఈతకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పెద్దలు(ఈత వచ్చిన వారు) వెంట ఉండాలి. కోచ్‌ల సమక్షంలోనే నేర్చుకోవడం శ్రేయస్కరం. లేదంటే ఈతలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి పర్యవేక్షణలో గాలి నింపిన ట్యూబ్ సాయంతో నేర్చుకోవచ్చు. తోటి పిల్లలు తుంటరి చేష్టలతో ఈతరాని వారిని బావులు, చెరువులు, కాలువల్లోని నీళ్లలోకి తోస్తుంటారు. అలాగే ఒడ్డు, అడుగుబాగం పాకురు (పాచి) పట్టి ఉండటం వల్ల ప్రమాదవశాత్తు జారే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు పిల్లలను ఇలాంటి చోటుకు ఒంటరిగా పంపకపోవడం మంచిది. ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులతో పాటు రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలి. -
మాకు 100 మంది పిల్లలు కావాలి : గూగుల్
హైదరాబాద్ : పిల్లలకు వేసవి సెలవులు వచ్చేశాయంటే.. తల్లిదండ్రులు తలలు పట్టుకోవాల్సిందే. తెగ అల్లరి చేసేస్తూ ఇల్లుపీకి పందిరేస్తారు. ఈ అల్లరి నుంచి తప్పించుకోవడానికి చాలా మంది పెద్దలు పిల్లల్ని ఈ సెలవుల్లో అమ్మమ్మ లేదా నాన్నమ్మ ఇళ్లకు పంపించడ... లేదా సమ్మర్ క్యాంప్స్కు పంపించడం చేస్తుంటారు. ఇటీవల అయితే తల్లిదండ్రులు ఎక్కువగా వేసవి శిబిరాలకే మొగ్గుచూపుతున్నారు. ఒకే సమయంలో అటు ఆటలు, ఇటు విజ్ఞానాన్ని అందించే ఈ వేసవి శిబిరాలు ప్రస్తుతం పిల్లలను కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రపంచంలో అతిపెద్ద టెక్ దిగ్గజమైన గూగుల్ సైతం పిల్లల్ని ఆహ్వానిస్తోంది. తమ హైదరాబాద్, గుర్గావ్ ఆఫీసులకు 100 స్కూల్ పిల్లలకు కావాలంటూ గూగుల్ ప్రకటించేసింది. పిల్లల తల్లిదండ్రులకు ఒక ఓపెన్ లెటర్ రాసింది. ఈ లేఖలో‘ మిమ్మల్ని మా కంపెనీకి తీసుకురావడానికి మా ప్రొడక్ట్ లీడర్లతో మేము భాగస్వామ్యం ఏర్పరచుకున్నాం. పిల్లలతో పాటు కలిసి పలు యాక్టివిటీస్ మీరు పాల్గొనవచ్చు. నాలుగు వారాలు ముగిసే వరకు #సమ్మర్విత్గూగుల్ మీకు ఒక మంచి జ్ఞాపకంగా మరలుస్తాం. గూగుల్ గుర్గావ్, హైదరాబాద్ క్యాంప్స్లో విద్యార్థులను ఉల్లాసభరించేలా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తాం. 100 మంది పిల్లలతో పాటు వారి గార్డియన్లు దేశమంతటా విమానంలో చుట్టి వచ్చేయొచ్చు. ఈ సమ్మర్ క్యాంప్‌ను అసలు చేజార్చుకోకూడదు అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం కింద ఇచ్చిన నాలుగు సులభమైన పద్ధతుల్లో మీరు, మీ పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్‌లో భాగస్వామ్యం అవండి’ అని గూగుల్ పేర్కొంది. గూగుల్ సమ్మర్ క్యాంప్స్ కోసం నిర్వహించాల్సి పద్ధతులు... గూగుల్ వెబ్సైట్లో ప్రతీవారం సమ్మర్ క్యాంప్‌కు అనే దానిలోకి వెళ్లాలి తాజా సవాల్‌ను స్వీకరించి, పూర్తి చేయాలి దానిలో మొదటి సవాల్, గూగుల్ ఎర్త్ వాడకానికి సంబంధించి ఉంటుంది. ఇది ఇప్పటికే అందుబాటులో ఉంది. తర్వాతది గూగుల్ ట్రాన్స్‌లేట్, వేరొక భాషలో ఓ కొత్త పదాన్ని నేర్చుకోవాలి గూగుల్ ఆర్ట్స్, కల్చర్ కార్యక్రమానికి సంబంధించి మరో సవాల్ ఉంటుంది. గూగుల్ అందించే టూల్స్ వాడుతూ యాప్‌ను సృష్టించాలి. ఇదే చివరి ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌లన్నీ అయిపోయాక, గూగుల్ దేశవ్యాప్తంగా 100 మంది విద్యార్థులను ఎంపిక చేస్తుంది. అనంతరం వారిని ఆఫీసులకు పిలుస్తుంది. ఇలా వచ్చిన విద్యార్థులకు గూగుల్ ఎలా పనిచేస్తుంది. ఎలా ప్రొడక్ట్ మేనేజర్ ఆలోచిస్తాడు వంటి విషయాలపై అవగాహన పొందుతారు. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలు ఎక్కువ గంటలు ఇంటర్నెట్పై గడుపుతున్నారని బాధపడే తల్లిదండ్రులకు ఇది నిజంగా శుభవార్తేనని తెలుస్తోంది. పిల్లలతో మంచి సంబంధాలు ఏర్పరుచుకుని, అన్నీ నేర్పిస్తూ కొత్త కొత్త విషయాలు కొనుగొనేందుకు ప్రోత్సహిస్తామని గూగుల్ సైతం చెప్పింది.. -
సమ్మర్ క్యాంపులకు బియ్యం ఇయ్యం!
సాక్షి, హైదరాబాద్ : గురుకుల సొసైటీలు సంకటంలో పడ్డాయి. సమ్మర్ క్యాంపు(వేసవి శిబి రం)లకు బియ్యం కోటా ఇవ్వలేమని పౌర సరఫరాలశాఖ తేల్చి చెప్పడంతో ఆందోళన చెందుతున్నాయి. గురుకుల విద్యాలయాల సొసైటీలు ఏటా సమ్మర్ క్యాంపుల్లో భాగంగా గురు కుల పాఠశాలల్లోని చురుకైన విద్యార్థులకు పలు కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వ హిస్తాయి. క్రీడలు, నృత్యాలతోపాటు సబ్జెక్ట్‌కు సంబంధించి అవగాహన, భావ వ్యక్తీకరణ నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటికి రోజంతా సమ యం పడుతుండడంతో విద్యార్థులకు వసతితోపాటు భోజన సదుపాయాన్ని కూడా గురుకుల సొసైటీలే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా బియ్యం కోటా ఇవ్వాలని గురుకుల సొసైటీలు కోరగా ఇవ్వలేమని పౌర సరఫరాల శాఖ తేల్చి చెప్పింది. -
మంచిర్యాలలో డ్యాన్స్ అకాడమీలు
మంచిర్యాల : క్రియేటివ్ కిడ్స్ సమ్మర్ క్యాంప్ : 15 రోజులు, నెల రోజుల డ్యాన్స్ క్లాసులను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు. మైత్రి యోగా, నేచర్ క్యూర్ సెంటర్, హైటెక్ కాలనీ, మంచిర్యాల ఫోన్ నంబర్ 9652227079, 08736251155లో సంప్రదించాలి. మోహన మ్యూజిక్ అకాడమీ : శాస్త్రీయ సంగీతంలో శిక్షణ. శ్రీసాయి రెసిడెన్సీ హైటెక్ కాలనీ, మంచిర్యాల 9032232929లో సంప్రదించాలి. ఎస్‌ఎన్‌కే డ్యాన్స్ అకాడమీ : జుంబా ఫిట్నెస్ డ్యాన్స్‌లో ఈ నెల 20 నుంచి మే 28 వరకు శిక్షణ ఇస్తున్నారు. మైత్రి యోగా, నేచర్ క్యూర్ సెంటర్, హైటెక్ కాలనీ, మంచిర్యాలలో సాయంత్రం 4 గంటల నుంచి 5.30 వరకు. సంప్రదించాల్సిన నంబర్ 9652227079. అలాగే శ్రీసాయి మాతృమందిర్ ప్లేస్కూల్, హైటెక్‌సిటీ కాలనీ, నియర్ ఏషియన్ టవర్స్ మంచిర్యాలలో సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు. 9848124094, 9866442885 నంబర్లలో సంప్రదించాలి. జుంబా ఫిట్నెస్ డ్యాన్సింగ్ క్లాసెస్ ఫర్ గర్ల్స్/వుమెన్ : మైత్రి యోగా, నేచర్ క్యూర్ సెంటర్, నియర్ ఆసియన్ టవర్స్, హైటెక్‌సిటీ కాలనీ, మంచిర్యాల 9848124094లో సంప్రదించాలి. -
గుర్రపుస్వారీ కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు
రంగారెడ్డి (మొయినాబాద్) : మానవుని ఆరోగ్యానికి గురపుస్వారి ఎంతో తోడ్పడుతుందని గురపుస్వారీ శిక్షణ మేనేజర్ రియాజ్ మహమ్మద్ అన్నారు. మొయినాబాద్ మండలంలోని అజీజ్‌నగర్ సమీపాన గల హైదరాబాద్ పోలోరైడ్క్లబ్లో ఏప్రిల్ 27నుంచి సమ్మర్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గురపుస్వారీ చేయటంతో పొట్ట, బరువు, కొవ్వు తగ్గటం లాంటివి జరుగుతాయని పేర్కొన్నారు. విద్యాసంస్థలకు సెలవులు రావటంతో సమ్మర్క్లాస్ను నెల రోజుల పాటు నిర్వహిస్తున్నామని చెప్పారు. నాయకత్వ లక్షణాలపై సమ్మర్ క్యాంప్ హైదరాబాద్ (మలక్‌పేట) : నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఆకెళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాయకత్వ లక్షణాలపై ఏప్రిల్ 27న ప్రారంభం కానున్న సమ్మర్‌క్యాంపు పోస్టర్‌ను ఫౌండేషన్ వ్యవస్థాపకులు శనివారం అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విత్తనంలా ఒదిగి, మహావృక్షంలా ఎదిగి సమాజానికి నీడను ఇవ్వడమే మానవ జన్మకు పరమార్థమన్నారు. ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి నాయకత్వ లక్షణాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. యువతీయువకులు ముందుకు వచ్చి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8985894254 నెంబరును సంప్రదించాలని కోరారు. -
రాజీవ్ మిథ్యా మిషన్ మొక్కుబడులు
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : అందరూ చదవాలి-అందరూ ఎదగాలి.. అనే లక్ష్యసాధనలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 1-5 తరగతుల్లో ‘సీ’ గ్రేడు విద్యార్థులను గుర్తించి, వారిలో విద్యా ప్రమాణాలు పెంపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఏ, బీ గ్రేడు విద్యార్థులతో సమానంగా ‘సీ’ గ్రేడు పిల్లలు కూడా చదువుకునేలా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) ఆధ్వర్యంలో మే 11 నుంచి సమ్మర్ క్యాంపులు (వేసవి బడులు) ప్రారంభమయ్యాయి. తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టుల్లో విద్యార్థులు పట్టు సాధించాలనే ఉద్దేశంతో 1, 2 తరగతులకు ఒక అభ్యాసదీపిక, 3, 4, 5 తరగతులకు మరొక అభ్యాసక దీపికను నిపుణులైన ఉపాధ్యాయులతో తయారు చేయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా...సమ్మర్ క్యాంపుల నిర్వహణ మాత్రం జిల్లా వ్యాప్తంగా అస్తవ్యస్తంగా మారింది. చాలా ప్రాంతాల్లో మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో 343 క్యాంపులు జిల్లాలో 356 క్లస్టర్లకు గాను 343 క్లస్టర్లలో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ‘సీ’ గ్రేడు విద్యార్థులను క్లస్టర్ల వారీగా గుర్తించారు. ఒక్కో పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉండేలా చూడాలని అధికారులు సూచించారు. వారికి అభ్యాసదీపికలు పంపిణీ చేశారు. ప్రారంభంలో విద్యార్థులు కాస్త ఆసక్తి చూపినా తర్వాత రావడమే మానేశారు. వారిని రప్పించడంలో ఆయా క్లస్టర్ సీఆర్పీలు విఫలమయ్యారు. కనీసం 10 మంది కూడా హాజరుకాని పాఠశాలలే అధికంగా ఉన్నాయి. క్యాంపులకు హాజరయ్యే విద్యార్థుల నమోదు కూడా మొక్కుబడిగా ఉంటోంది. ‘సీ’ గ్రేడ్ విద్యార్థులను మాత్రమే క్యాంపులకు రప్పించాల్సి ఉండగా.. గ్రేడ్లతో సంబంధం లేకుండా కొందరు పిల్లలను పోగేసి తూతూమంత్రంగా కానిచ్చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువు సమ్మర్ క్యాంపుల నిర్వహణపై ఆర్వీఎం అధికారుల పర్యవేక్షణ కరువైంది. ఫలితంగా సీఆర్పీలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులు జూన్ 11 వరకు నెల రోజుల పాటు కొనసాగుతాయని అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. జిల్లా అధికారులు ఉండే అనంతపురం నగరంలోని కేంద్రాల్లోనే అనధికారిక సెలవులు ప్రకటించారంటే ఈ కార్యక్రమ నిర్వహణపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. -
వేసవి శిబిరాలు అస్తవ్యస్తం
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : చదువులో వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రాథమిక స్థాయి విద్యార్థుల స్థాయిని పెంచేందుకు రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) రాష్ట్ర అధికారులు వేసవి సెలవుల్లో శిబిరాలు ప్రారంభించారు. లక్ష్యం మంచిదే అయినా జిల్లాలో తరగతులు నామమాత్రంగా సాగుతున్నాయి. ఆచరణలో అమ లు కాకపోవడంతో లక్ష్యం సాధించడం అనుమానంగానే ఉంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అభ్యసన స్థాయిలో వెనుకబడిన విద్యార్థుల కోసం ఈ నెల 10 నుంచి జూన్ 10 వరకు ఈ వేసవిలో తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 275 క్లస్టర్ పాఠశాలల్లో వేసవి శిబిరాలు జరగాలి. సీఆర్పీలు విద్యాబోధన చేయాలి. ప్రస్తుతం జిల్లాలో 252 మంది సీఆర్పీలు పనిచేస్తున్నారు. మిగిలిన 23 క్లస్టర్ పాఠశాలల్లో ఐఈడీ రిసోర్స్ పర్సన్స్‌తో విద్యాబోధన చేయించాలని అధికారులు నిర్ణయించారు. వీరు వారం రోజులు తరగతులు బోధించారు. వీరికి ప్రత్యేక అవసరాలు గల పిల్లల సర్వే చేయించాలని ఎస్పీడీ నుంచి ఆదేశాలు రావడంతో ఐఈడీ రిసోర్స్ పర్సన్స్ వెళ్లారు. కానీ, వీరు శిబిరాలకు వెళ్లకపోవడంతో తెరుచుకోవడం లేదు. ఆర్వీఎం అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సి ఉండగా ఆ దిశగా ఆలోచించడం లేదు. నామాత్రంగానే తరగతులు జిల్లాలో వేసవి శిబిరాలకు 11,158 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో 1,2 తరగతుల విద్యార్థులు 4,852 మంది, 3,4,5 తరగతుల విద్యార్థులు 6,306 మంది వేసవి శిబిరాలకు హాజరుకావాలి. కానీ, కనీసం సగం మంది విద్యార్థులు కూడా తరగతులకు హాజరుకావడం లేదు. విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితంతోపాటు ఆటాపాటాలు నేర్పాలి. వర్క్పుస్తకాల ఆధారంగా వారికి కృత్యాలు నేర్పాలి. ‘సీ’ గ్రేడ్ విద్యార్థులను ‘ బీ’గాని ‘ఏ’ గ్రేడ్ విద్యార్థులుగా తయారు చేయాలి. కానీ, తరగతులు అంతంతా మాత్రంగానే జరగడంతో విద్యార్థులకు ప్రయోజనం శూన్యం. కాగా, శిబిరాలు ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు తరగతులు జరగాలి. సీఆర్పీలు సమయపాలన పాటించకపోవడం, కొన్ని చోట్ల కేంద్రాలు తెరుచుకోవడంలేదు. ఈ శిబిరాలకు విద్యార్థులు రాకపోవడంతోనే పాఠశాలలను తెరవడం లేదని కొంత మంది సీఆర్పీలు పేర్కొంటున్నారు. సీఆర్పీలు వచ్చిన చోట విద్యార్థులు రావడం లేదు. విద్యార్థులు వచ్చిన చోట సీఆర్పీలు కానరావడం లేదు. దీంతో పరిస్థితి భిన్నంగా మారింది. అధికారుల పర్యవేక్షణ కరువు వేసవి శిబిరాలను రాజీవ్ విద్యామిషన్ అధికారులతోపాటు మండల విద్యాధికారులు పర్యవేక్షించాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో తరగతులు సక్రమంగా జరగడం లేదు. కొంత మంది సీఆర్పీలు వేసవి శిబిరాలకు రావడం లేదు. ఈ విషయమై ఆర్వీఎం ఏఎంవో గంగయ్యను అడుగగా.. శిబిరాలు సక్రమంగానే నిర్వహిస్తున్నామని, సీఆర్పీలు లేని చోట విద్యావలంటీర్లను నియమించాలని మండల విద్యాధికారులకు తెలియజేశామని పేర్కొన్నారు.