అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : అందరూ చదవాలి-అందరూ ఎదగాలి.. అనే లక్ష్యసాధనలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 1-5 తరగతుల్లో ‘సీ’ గ్రేడు విద్యార్థులను గుర్తించి, వారిలో విద్యా ప్రమాణాలు పెంపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఏ, బీ గ్రేడు విద్యార్థులతో సమానంగా ‘సీ’ గ్రేడు పిల్లలు కూడా చదువుకునేలా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు
తీసుకుంది.
ఇందులో భాగంగానే రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) ఆధ్వర్యంలో మే 11 నుంచి సమ్మర్ క్యాంపులు (వేసవి బడులు) ప్రారంభమయ్యాయి. తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టుల్లో విద్యార్థులు పట్టు సాధించాలనే ఉద్దేశంతో 1, 2 తరగతులకు ఒక అభ్యాసదీపిక, 3, 4, 5 తరగతులకు మరొక అభ్యాసక దీపికను నిపుణులైన ఉపాధ్యాయులతో తయారు చేయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా...సమ్మర్ క్యాంపుల నిర్వహణ మాత్రం జిల్లా వ్యాప్తంగా అస్తవ్యస్తంగా మారింది. చాలా ప్రాంతాల్లో మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు.
జిల్లాలో 343 క్యాంపులు
జిల్లాలో 356 క్లస్టర్లకు గాను 343 క్లస్టర్లలో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ‘సీ’ గ్రేడు విద్యార్థులను క్లస్టర్ల వారీగా గుర్తించారు. ఒక్కో పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉండేలా చూడాలని అధికారులు సూచించారు. వారికి అభ్యాసదీపికలు పంపిణీ చేశారు. ప్రారంభంలో విద్యార్థులు కాస్త ఆసక్తి చూపినా తర్వాత రావడమే మానేశారు. వారిని రప్పించడంలో ఆయా క్లస్టర్ సీఆర్పీలు విఫలమయ్యారు. కనీసం 10 మంది కూడా హాజరుకాని పాఠశాలలే అధికంగా ఉన్నాయి. క్యాంపులకు హాజరయ్యే విద్యార్థుల నమోదు కూడా మొక్కుబడిగా ఉంటోంది. ‘సీ’ గ్రేడ్ విద్యార్థులను మాత్రమే క్యాంపులకు రప్పించాల్సి ఉండగా.. గ్రేడ్‌లతో సంబంధం లేకుండా కొందరు పిల్లలను పోగేసి తూతూమంత్రంగా కానిచ్చేస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ కరువు
సమ్మర్ క్యాంపుల నిర్వహణపై ఆర్వీఎం అధికారుల పర్యవేక్షణ కరువైంది. ఫలితంగా సీఆర్పీలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు.
ఈ క్యాంపులు జూన్ 11 వరకు నెల రోజుల పాటు కొనసాగుతాయని అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. జిల్లా అధికారులు ఉండే అనంతపురం నగరంలోని కేంద్రాల్లోనే అనధికారిక సెలవులు ప్రకటించారంటే ఈ కార్యక్రమ నిర్వహణపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
రాజీవ్ మిథ్యా మిషన్ మొక్కుబడులు
Published Tue, Jun 3 2014 3:03 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement