Rajiv Vidya Mission
-
బడా వస్త్రవ్యాపారులకే వత్తాసు
అధికారుల తీరు సరికాదు ► చున్నీ వస్త్రం కొనుగోళ్లలో పక్షపాతం ► మ్యాక్స్ సంఘాలకు చెప్పకుండానే నిర్ణయం ► ఒకే వస్త్రవ్యాపారిపై జౌళిశాఖ అమిత ప్రేమ ఏమిటి? ► జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగిన నేతకార్మికులు సిరిసిల్ల : చేనేత, జౌళిశాఖ అధికారులు వస్త్రం కొనుగోళ్లలో బడా వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారని నేతకార్మికులు ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం వ్యవసాయ మార్కెట్ యార్డులోని వస్త్రం కొనుగోళ్ల గోదాం వ ద్ద ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ విద్యార్థులకు యూ నిఫామ్స్ అందించేందుకు రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ద్వారా నేతకార్మికుల నుంచి 1.14 కోట్ల మీటర్ల వ స్రా్తన్ని చేనేత జౌళిశాఖ అధికారులు కొనుగోలు చేశారని తెలిపారు. ఇందులో బాలికలకు అవసరమైన ఓనీ(చు న్నీ) బట్ట సుమారు 51వేల మీటర్లు తక్కువ పడడంతో మళ్లీ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చిందన్నారు. కానీ, సంఘాలకు సమాచారం ఇవ్వకుండా ఓ ప్రముఖ వస్త్రవ్యాపారి ఒక్కరికే అవకాశం ఇవ్వడం ఏమిటని మ్యాక్స్ సొసైటీల ప్రతినిధులు ప్రశ్నించారు. ఒక్కో మీటర్ ఓనీ వస్రా్తనికి రూ.31 చెల్లిస్తున్నారని, ఈ లెక్కన 51 వేల మీటర్ల వస్రా్తన్ని రూ.15.81 లక్షలతో కొనుగోలు చేస్తున్నారని అన్నా రు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ అయిన ఆ వస్త్రవ్యాపారి వద్దనే ఓనీ బట్టను కొనుగోలు చేయడం సరికాదన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆసాములు కోరారు. ఈసందర్భంగా గోదాములో వస్త్రం కొనుగోళ్లను అడ్డుకున్నారు. మ్యాక్స్ సొసైటీల ప్రతినిధులు మంచికట్ల భాస్కర్, చిమ్మని ప్రకాశ్, పోలు శంకర్, మూషం రాజయ్య, వెల్దండి శంకర్, గౌడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ చెప్పాం.. ఎవరూ స్పందించలేదు – వి.అశోక్‌రావు, చేనేత, జౌళిశాఖ ఏడీ ఓనీ వస్త్రం ఉత్పత్తి చేయాలని మ్యాక్స్ సొసైటీల ప్రతినిధులదరికీ చెప్పాం. ఎవరూ స్పందించలేదు. కొన్ని సంఘాల ద్వారా కొనాలని భావించాం. కానీ 51 సంఘాలకు ఈఆర్డర్లు ఇస్తే ఒక్కో సంఘం వెయ్యి మీటర్లు ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. అవుతుంది. ఒక్క బీము రెండు వేల మీటర్లు ఉంటుంది. ఎవరికీ సరిగా పని సాధ్యం కాదు. ఇప్పటి వరకు 20వేల మీటర్ల ఓనీ బట్టను కొన్నాం. ఇంకా ఎవరైనా ఇస్తే కొనుగోలు చేస్తాం. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు. -
ఆర్వీఎం నిధులు వెనక్కి
నిలిచిన టాయ్లెట్ల నిర్మాణం మోర్తాడ్: రాజీవ్ విద్యా మిషన్ (సర్వ శిక్ష అభియాన్) కింద పాఠశాలలకు కేటాయించిన నిధులను రాష్ట్ర విద్యాశాఖ వెనక్కు తీసుకుంది. దీంతో పాఠశాలల్లో ప్రతిపాదించిన టాయ్లెట్ల నిర్మాణానికి బ్రేక్ పడింది. విద్యార్థులకు ఒంటికి, రెంటికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఆర్వీఎం ద్వారా కేటాయించిన నిధులను వినియోగించుకోవాలని కలెక్టర్ యోగితారాణా గతంలో ఆదేశించారు. దీంతో మూడు నెలల కింద టాయ్లెట్ల నిర్మాణాలకు అధికార యంత్రాంగం పాఠశాలలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయ్లెట్ల సంఖ్య పెంచాలని.. ఒక్కో పాఠశాలలో ఎనిమిది నుంచి 15 వరకు టాయ్లెట్లు నిర్మించాలని నిర్ణయించారు. జిల్లాలో 267 ఉన్నత, 144 ప్రాథమికోన్నత, 804 ప్రాథమిక పాఠశాలలున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో టాయ్లెట్ల నిర్మాణం అవసరం లేదు. అయితే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ముఖ్యంగా మారుమూల గ్రామాలలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటంతో టాయ్లెట్ల నిర్మాణం అత్యవసరమైంది. ఒక్కో పాఠశాలకు రూ.1.50 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు ఆర్వీఎం నిధులను కేటాయించారు. అయితే రాష్ట్ర విద్యాశాఖ గత నెలలో పాఠశాల ఖాతాల్లో నిలువ ఉన్న అన్ని రకాల నిధులను వాపసు తీసుకుంది. ఇందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. అయితే, టాయ్లెట్ల నిర్మాణం కోసం జిల్లా అధికార యంత్రాంగం అనుమతి ఇవ్వడం, రాష్ట్ర విద్యాశాఖ నిధులను వాపసు తీసుకోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. నిధులు వెనక్కు వెళ్లడంతో నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లు పనులను అర్ధాంతరంగా నిలిపి వేశారు. నిర్మాణాలు పూర్తయిన తరువాత బిల్లులు చెల్లించడానికి నిధులు రాకపోతే తమకు ఇబ్బందిగా ఉంటుందని కాంట్రాక్టర్లు భావిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో నిర్మాణాలు సగం దశలో ఉండగా పనులను నిలిపి వేయగా మరికొన్ని పాఠశాలల్లో ఇసుక, కంకర పోయించి గుంతలు తవ్విన తరువాత పనులు నిలిపి వేశారు. -
ఖర్చు చేశారు... లెక్కచెప్పరు
శ్రీకాకుళం: శ్రీకాకుళం రాజీవ్ విద్యా మిషన్(ప్రస్తుత సర్వశిక్షా అభియాన్)లో నిధుల ఖర్చుకు సంబంధించి ఆడిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా గత అధికారులు ఇప్పటికీ లెక్కలు చెప్పడం లేదు. గత పీవో రామచంద్రారెడ్డి, అప్పటి ఇన్చార్జి ఎఫ్ఏఓ, ప్రస్తుత అసిస్టెంట్ ఎఫ్ఏఓ అయిన సురేష్ రూ. 2.5 లక్షలను సొంతం పేరిట విత్‌డ్రా చేసి వాటికి తగిన బిల్లులు సమర్పించకపోవడంతో ఆడిట్ అధికారులు కొద్ది నెలల క్రితం అభ్యంతరం తెలిపారు. దీనిపై తక్షణం బిల్లులు సమర్పించాల్సి ఉండగా ఇప్పటివరకు అటువంటి దాఖలాలు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా శిక్షణకు గాని, మరేదైనా పనులకు గాని నిధులను సొంతం పేరిట విత్‌డ్రా చేసి, అటు తర్వాత బిల్లులను సమర్పించుకునే సౌలభ్యం ఆర్వీఎంలో ఉంది. దీనిని వినియోగించుకునే వీరిద్దరూ నిధులను విత్‌డ్రా చేశారు. అయితే ఇప్పటికీ లెక్కలు చెప్పకపోవడం పలువురి సందేహాలకు కారణమైంది. అప్పటి పీవో రామచంద్రారెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఓ సమావేశానికి ఇతడు పూర్తి సమాచారంతో రాలేదన్న కారణంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాతృ శాఖకు సరెండర్ చేసిన విషయం పాఠకులకు విదితమే. అయితే ఏ కారణంగానో తెలియకపోయినా మంత్రి ఆదేశాలు సుమారు రెండు నెలలు అమలుకు నోచుకోలేదు. ఈ రెండు నెలల్లో మరిన్ని ఆరోపణలు రావడంతో కలెక్టర్ రిలీవ్ చేసేశారు. అప్పట్లో ఎఫ్‌ఏఓగా పనిచేసిన రాజు మాతృ సంస్థకు వెళ్లిపోవడంతో సురేష్ ఇన్చార్జి ఎఫ్‌ఏఓగా వ్యవహరించారు. ఈ సమయంలోనే రూ. 2.5 లక్షలు విత్‌డ్రా చేశారు. ఈ మొత్తంతో కేజీబీవీ సిబ్బంది, ఎంఐఎస్ కోర్డినేటర్లకు శిక్షణ ఇచ్చినట్టు మౌఖికంగా చెబుతున్నా బిల్లులు మాత్రం దాఖలు చేయలేదు. ఆడిట్ అధికారుల అభ్యంతరం తర్వాత కూడా బిల్లులు దాఖలుకు ప్రయత్నాలే జరగలేదు. ఈ కారణంగానే పలువురు వ్యక్తం చేస్తున్న అనుమానాలను బలం చేకూరుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించాల్సిన ప్రస్తుత ఆర్వీఎం అధికారులు ఉదాసీనంగా ఉంటున్నారనే ఆక్షేపణలు వినిపిస్తున్నారుు. ఇదే శాఖలో అసిస్టెంట్ ఎఫ్‌ఏఓగా పనిచేస్తున్న సురేష్‌కు ఇప్పటికి రెండు మెమోలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాగా సురేష్‌ను ప్రస్తుత పీఓ కూడా సుమారు 6 నెలల పాటు రాష్ట్ర అధికారుల ఉత్తర్వులు కాదని ఇన్చార్జి ఎఫ్‌ఏఓగా కొనసాగించడం, ఎఫ్‌ఏఓగా రాష్ట్ర అధికారుల ద్వారా నియమించబడిన మోహనరావును విధుల్లో చేర్చుకోకుండా గాలిలో ఉంచడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తక్షణం యూసీలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్వీఎం పీఓ త్రినాథరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా రెండు రోజుల క్రితమే యూసీలు ఇచ్చారన్నారు. యూసీలు ఇవ్వకపోవడంతో గతంలో ఆడిట్ అభ్యంతరం చెప్పడం నిజమేనని తెలిపారు. -
బడి బాట.. కాలి బాటే..!
- అరకొరగా రవాణా భత్యం - గతేడాది విద్యార్థులకే అందలేదు - ఈ ఏడాది ఇంకా ఊసేలేదు - తెరపైకి వచ్చిన సైకిళ్ల పంపిణీ..! సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశిం చిన బడిబాట పథకం అమలులో రాష్ట్ర ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆర్థిక భారం కారణంగా దూరప్రాంతాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు మధ్యలో బడి మానకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి రవాణాభత్యం అందజేస్తోంది. అయితే, ఏటా అరకొర కేటాయింపులు, నామమాత్రపు పంపిణీతో విద్యాశాఖ నెట్టుకోస్తోంది. గతేడాది నిధులు విడుదలై విద్యాసంవత్సరం గడిచినా విద్యార్థులకు రవాణా భత్యం అందలేదు. అయితే, రవాణా భత్యం సొమ్ముతో సైకిళ్లు కొనుగోలు చేద్దామనే రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ అధికారుల ఆలోచనకు ఇంతవరకు క్షేత్ర స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. అంతేకాక రవాణాభత్యం పంపిణీ పారదర్శకంగా జరగడానికి విద్యార్థుల బ్యాంకు ఖాతాలలో నేరుగా భత్యం సొమ్ము వేద్దామనే ఆలోచనకు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల సొమ్ము రాజీవ్ విద్యామిషన్ ఖాతాలో మూలుగుతోంది. దీంతో క్షేత్రస్థాయిలో ని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా ల్లో వందలాది మంది విద్యార్థులకు భత్యం అంద క చదువులు భారంగా సాగుతున్నాయి. ఈ ఏడాదైనా మొత్తం ఇచ్చేరా.... తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రాష్ట్ర రాజీవ్ విద్యామిషన్ అధికారులు సెప్టెంబర్‌లోనే రూ. 2 కోట్ల వరకు సొమ్ము విడుదల చేశారు. కానీ విద్యాసంవత్సరం పూర్తయినా విద్యార్థులకు ఇప్పటి వరకు భత్యం మాత్రం అందలేదు. నిజామాబాద్ జిల్లాలో గతేడాది 480 విద్యార్థులకు రూ.10.01 లక్షల సొమ్ము రావాలి. అలాగే 2012-13 సంవత్సరంలో 143 మందికి, 2013-14 , 2014 సంవత్సరానికి 191 మందికి ఒక్కొక్కరికి రూ.300 చొప్పున 10 నెలల భత్యం అందింది. జిల్లాలో మారుమూల గ్రామాల్లో అర్హులైన విద్యార్థులకు అందలేదు. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది 213 పాఠశాలలకు చెందిన 2,672 మంది విద్యార్థులకు అందాల్సి ఉంది. జిల్లాకు రూ.80 లక్షలు విడుదలైనా రాజీవ్‌విద్యామిషన్ ఖాతాలో మూలుగుతున్నాయి. 2013-14కు సంబంధించి ఈ జిల్లాలో నిధులు విడుదల చేయలేదు. కరీంనగర్ జిల్లాలో 723 మంది విద్యార్థులకు గత విద్యాసంవత్సర భత్యం అందించాల్సి ఉంది. దీనికిగాను జిల్లాకు రూ. 21.69 లక్షలు విడుదలయ్యాయి. కానీ, ఇంత వరకు విద్యార్థుల ఖాతాలలోకి చేరలేదు. సైకిళ్ల పంపిణీ పేరుతో జరుగుతున్న జాప్యం ఉన్నత తరగతుల విద్యార్థులకు ప్రయాణ భత్యం కింద వచ్చే నిధులతో సైకిళ్లను అందించాలని ఐదు నెలల క్రితం రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ అధికారులు నిర్ణయించారు. కానీ వాటికి ఇంతవరకు అతీగతీలేదు. -
రా...రా...రాజీవ్ విద్యామిషన్
శ్రీకాకుళం టౌన్ : విద్యాబుద్ధులు నేర్పాల్సిన రాజీవ్ విద్యామిషన్‌లో లైంగిక వేధింపుల పర్వం వెలుగుచూసింది. అధికారుల ఆగడాలు శ్రుతి మించడంతో మహిళా ఉద్యోగులు ధైర్యం చేసి ముందుకు వచ్చారు. ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరవు పెట్టారు. తమను లైంగిక వేధింపుల నుంచి విముక్తుల్ని చేయాలంటూ వారు కలెక్టరు లక్ష్మీనృసింహాన్ని వేడుకున్నారు. వివరాలు పరిశీలిస్తే.. రాజీవ్ విద్యామిషన్, ప్రాజెక్టు పరిధిలో చాలాకాలంగా కొందరు ఉద్యోగులు పాతుకుపోయారు. వారు చెప్పిందే వేదమక్కడ. ఆఖరుకు పీవోను సైతం తమ చెప్పుచేతల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తురన్నారనే ఆరోణలున్నాయి. ఈ శాఖలో అవుట్సోర్సింగ్ విభాగంలో మహిళలు ఎక్కువ. వీరిని ఇక్కడి అధికారులు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. పెదవి విప్పితే ఏం జరుగుతుందోనని వీరంతా తమ ఆవేదనను భరిస్తూ వస్తున్నారు. కొన్నిసార్లు ఉన్నతస్ధాయిలో ఫిర్యాదులు చేసినా తమ ఉద్యోగానికి ముప్పు వస్తుందని మళ్లీ వెనుకడుగు వేస్తున్నారు. ఇటీవల పీవో బాధ్యతలు స్వీకరించిన త్రినాథరావు దృష్టికి ఈ విషయం వచ్చింది. ఆయన భరోసా ఇవ్వడంతో కొంతమంది మహిళా ఉద్యోగులు ధైర్యం చేశారు. వేధింపుల పర్వం చిట్టాను విప్పారు. అకాడమిక్ మోనటరింగ్ ఆఫీసర్ జగదీష్‌బాబుపై వీరంతా బుధవారం కలెక్టరును కలిసి లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేశారు. ఎనిమిది మంది కస్తూరిబా విద్యాలయాల ప్రత్యేకాధికారులు జిల్లా కలెక్టర్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. వెంటనే ఏసీబీ డీఎస్పీ రంగరాజుతో పాటు జాయింట్ కలెక్టర్-2 రజనీకాంతరావులు వీరిని విచారించారు. ఎఎంఓ జగదీష్‌బాబుపై లైంగిక వేదింపు ఆరోపణలు: జగదీష్‌బాబు బొంతలకోడూరు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తూ డిప్యుటేషన్‌పై ఆర్వీయం ఏఎంవోగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఐసీపీఎస్‌లో కూడా ఈయనపై కేసు నమోదైంది. ఈ కేసులో సీడబ్ల్యుసీ కోర్టుకు కూడా హాజరుకాలేదు. తాజాగా జగదీష్‌బాబు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ భామిని, రణస్థలం, ఎచ్చెర్ల, సింగుపురం, పలాసలకు చెందిన ఎనిమిది కేజీబీవీ సంస్థల ప్రత్యేకాధికారులు ఫిర్యాదు చేసారు. కలెక్టర్ తీవ్రంగా స్పందించి క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. ఓ మహిళ నుంచి భర్తకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ జగదీష్‌బాబు రూ.లక్ష వసూలు చేసినట్లు ఫిర్యాదు అందింది. దీనిపై దర్యాప్తు చేయాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని కలెక్టరు స్పష్టం చేశారు. -
అధికారాలు కత్తిరించినా ఆర్థిక లావాదేవీలు
శ్రీకాకుళం: రాజీవ్ విద్యా మిషన్‌లో రాష్ట్రస్థాయి అధికారులు ఓ ఉద్యోగికి ఎఫ్ఏసీ అధికారాలను కత్తిరించినా అదే వ్యక్తితో ఇప్పటికీ ఆర్థిక లావాదేవీలు జరిపిస్తుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. రాజీవ్ విద్యా మిషన్‌లో ఎఫ్‌ఏఓగా మోహనరావును నియమించినప్పటికీ బాధ్యతలు అప్పగించకుండా కింది ఉద్యోగి సురేష్ ఎఫ్ఏఓ పోస్టులో కొనసాగుతున్న విషయం విదితమే. డిసెంబర్ 15న మోహనరావుకు ఎఫ్‌ఏఓగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అదేరోజున ఆయన రాష్ట్ర ఆర్వీఎం కార్యాలయంలో బాధ్యతలు తీసుకొని 23న శ్రీకాకుళం వచ్చారు. ఇప్పటివరకు ఆయనకు బాధ్యతలు అప్పగించకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. రాష్ట్రస్థాయి అధికారులు ఆర్వీఎం అధికారులను ఎన్నిసార్లు ప్రశ్నించినా ఫైలు కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి ఈ వ్యవహారాన్ని కలెక్టర్‌కు నివేదించాల్సిన అవసరమే ఉండదు. డిసెంబర్ 27న జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఆర్వీఎం అధికారులకు ఓ లేఖ రాస్తూ సురేష్‌ను ఎఫ్‌ఏఓగా ఎఫ్ఏసీ బాధ్యతలతో కొనసాగించాలని కోరారు. దీనికి తిరస్కరిస్తూ జనవరి 19న ఆర్వీఎం రాష్ట్ర అధికారులు మరో ఉత్తర్వును వెలువరించారు. సురేష్‌కు ఎఫ్ఏఓ అధికారాలను తొలగిస్తున్నట్లు కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మోహనరావుకు తక్షణం బాధ్యతలు అప్పగించి ఆ వివరాలను రాష్ట్ర కార్యాలయానికి తెలియజెప్పాలని ఆదేశించారు. తరువాత జనవరి 20, 21 తేదీల్లో విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో కూడా ఇదే విషయమై రాష్ట్ర అధికారులు జిల్లా ఆర్వీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తక్షణం బాధ్యతలు అప్పగించాలని కూడా చెప్పినట్లు భోగట్టా. ఇంత జరిగినా ఇప్పటికీ మోహనరావుకు బాధ్యతలు అప్పగించకపోగా ఎఫ్ఏసీ అధికారాల్లో కోత విధించిన సురేష్‌తోనే ఆర్థిక లావాదేవీలు జరిపిస్తున్నారు. దీని ద్వారా నిత్యం లక్షలాది రూపాయిలు విలువైన చెక్కులు రాయిస్తున్నారు. ఇందులో కేజీబీవీ ల బిల్లులు, ఉద్యోగుల జీతాలతోపాటు స్కూలు భవనాల బిల్లులు కూడా ఉంటున్నాయి. ఇంతగా ఎందుకు రాష్ట్ర అధికారుల ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నారన్నది, ఆర్వీఎం అధికారులకు అంత అండగా ఉన్న నేతలెవరన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విషయాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం వద్ద సాక్షి ప్రస్తావించగా ఇటువంటి ఉత్తర్వులు వచ్చిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఈ విషయంపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్వీఎం అకౌంట్స్ కంట్రోలర్ వద్ద ప్రస్తావించగా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. విషయం కలెక్టర్ వద్దే పెండింగ్‌లో ఉన్నట్టు జిల్లా ఆర్వీఎం అధికారులు చెబుతున్నారని, అది వాస్తవం కాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఏసీబీకి చిక్కిన రాజీవ్ విద్యా మిషన్ డీఈ
నెల్లూరు : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో బిల్లుల మంజూరు కోసం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ కావలి రాజీవ్ విద్యా మిషన్ డీఈ సాంబశివారెడ్డి ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు... కావలి రాజీవ్ విద్యామిషన్‌కు చెందిన సర్వశిక్ష అభియాన్ డీఈగా పనిచేస్తున్న సాంబశివారెడ్డి బిల్లుల మంజూరు కోసం కాంట్రాక్టర్ నాగరాజు వద్ద నుంచి రూ.15వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. బిల్లుల మంజూరుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని నాగరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పట్టణంలోని కోర్టు సమీపంలో రూ. 15 వేల లంచం తీసుకుంటుండగా మాటువేసిన అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సాంబశివారెడ్డి నుంచి రూ.15 వేలు స్వాధీనం చేసుకుని కస్టడీలోకి తీసుకున్నారు. నెల్లూరు ఏసీబీ ఇన్చార్జ్ డీఎస్పీ మూర్తి ఆధ్వర్యంలో అధికారులు ఈ దాడిచేశారు. అలాగే సాంబశివారెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. -
బడుగుజీవుల కడుపుకొట్టి...
టీడీపీ నేతకు విద్యార్థుల యూనిఫాం కుట్టు కాంట్రాక్ట్ రాజీవ్ విద్యా మిషన్ ఎస్పీడీ లేఖతో చర్యలు చేపట్టిన అధికారులు స్థానిక టైలర్లను కాదని ఆ నేతకే ఇవ్వాలంటూ పరోక్ష ఆదేశం అదే పనిలో కిందిస్థాయి వర్గాలు..ఉపాధి కోల్పోతున్న జిల్లాలోని టైలర్లు రడీమేడ్ దుస్తులరంగప్రవేశంతో పనిలేక అల్లాడుతున్న టైలర్లకు స్కూల్ యూనిఫాంలు ఓ వరంగా మారాయి. జిల్లాలో నాలుగు లక్షల జతలు కుట్టేందుకు అవకాశం ఉండడంతో చాలా మంది టైలర్లకు నాలుగు నెలలపాటు పని లభిస్తోంది. అయితే ఇప్పుడు వారి ఉపాధిని ఓ పచ్చనేత తన్నుకుపోతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన నేతకు దుస్తులు కుట్టే పని అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. కొన్ని మండలాల కాంట్రాక్ట్‌ను ఇప్పటికే ఆయనకు అప్పగించినట్టు తెలిసింది. బడుగుజీవుల కడుపుకొట్టి... సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకిచ్చే యూనిఫాంల్ని కుట్టే బాధ్యతను జిల్లాలోని టైలర్లకు కాకుండా గుంపగుత్తగా చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గానికి చెందిన నరేంద్ర చౌదరి అనే టీడీపీ నేతకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కట్టబెడుతున్నారు. ఈమేరకు జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు. అధికారులు సైతం తూ.చా తప్పకుండా ఎంఈఓలను ఆదేశించారు. ఇంకేముంది సదరు నేతకు కాంట్రాక్ట్ ఇచ్చేందుకు చర్యలు చకచకా సాగిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ప్రతీ సంవత్సరం రెండేసి జతలు యూనిఫాంలు కుట్టించి ఇస్తుంది. ముందుగా యూనిఫామ్ వస్త్రాన్ని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)లకు పంపించాలి. అలా వచ్చిన వస్త్రాన్ని స్థానికంగా ఉన్న టైలర్ల ద్వారా కుట్టించి విద్యార్థులకు అందజేయాలి. ఒక్కొక్క జతకు రాజీవ్ విద్యా మిషన్ ద్వారా రూ.40 చొప్పున టైలర్లకు చెల్లిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల టైలర్లకు, వారి వద్ద పనిచేసే వారికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది. కానీ ఈసారి విద్యార్థుల యూనిఫాంలపై చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఆర్సీ పురం మండలం ఎస్ఆర్ కమ్మపల్లికి చెందిన నరేంద్ర చౌదరి కన్ను పడింది. ఆయన సీఎం చంద్రబాబు నాయుడిని కలియడంతో లైన్‌క్లియర్ అయింది. ముందుగా ఆ నేత రాజీవ్ విద్యామిషన్ స్టేట్ ప్రాజెక్టు డెరైక్టర్‌కి రిక్విజేషన్ పెట్టుకోగా, ఆ మేరకు జిల్లాలకు ఉత్తర్వులొచ్చాయి. నరేంద్రచౌదరి రిక్వెస్ట్‌ను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని సదరు లేఖలో పేర్కొన్నారు. దీంతో రాజీవ్ విద్యా మిషన్ అధికారులు కలెక్టర్‌కు ఫైలు పెట్టారు. ఆ ఫైలుపై కలెక్టర్ కూడా నరేంద్ర చౌదరి రిక్వెస్ట్‌ను పరిశీలించాలని నోట్ రాశారు. దీంతో ఇటీవల ఎంఈఓలతో జరిగిన సమావేశంలో రాజీవ్ విద్యా మిషన్ పీఓ...విషయం చెప్పడమే కాకుండా కుట్టు కాంట్రాక్ట్‌ను అప్పగించాలని పరోక్షంగా సూచించారు. దీంతో ఎంఈఓలు ఇరకాటంలో పడ్డారు, స్థానిక టైలర్లకు కాకుండా చిత్తూరు జిల్లాకు చెందిన వారికిస్తే ఎలా అని, స్థానికులేమైపోవాలని, వారికేం సమాధానం చెప్పాలని, కుట్టడంలో తేడా వస్తే ఎవరు బాధ్యులని ఆంతర్మథనంలో పడ్డారు. అయినప్పటికీ అధికారులు చెప్పినట్టు వినక తప్పదని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు అదే తరహాలో ఆదేశాలిస్తున్నారు. సీఎం కార్యాలయం నుంచే సూచన ప్రాయ డెరైక్షన్ రావడంతో ఏ స్థాయిలోనూ అధికారులు అడ్డు చెప్పడం లేదు. దీంతో చిత్తూరు టీడీపీ నేత నరేంద్ర చౌదరికి యూనిఫాంలు కుట్టే కాంట్రాక్ట్‌ను అప్పగించే పనిలో సంబంధిత వర్గాలు నిమగ్నమయ్యాయి. ఇప్పటికే కొన్ని మండలాల యూనిఫాంల కాంట్రాక్ట్‌ను ఇచ్చేసినట్టు తెలిసింది. మరికొన్ని ఒకటి రెండు రోజుల్లో అప్పగించనున్నాయి. మొత్తానికి ఉన్నత స్థాయి ఆదేశాలు కావడంతో స్థానిక టైలర్ల కడుపు కొడుతున్నారు. జిల్లాలో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రెండేసి జతలు చొప్పున నాలుగు లక్షల జతల యూనిఫాంలు కుట్టించి అందజేయాలి. ఇవన్నీ స్థానిక టైలర్లకు ఇచ్చినట్టయితే వారికి నాలుగైదు నెలల పాటు జీవనోపాధి లభిస్తుంది. యూనిఫాంల కుట్టే సీజనొచ్చినప్పుడు సంబంధిత కుటుంబాలన్నీ టైలరింగ్ పనిలో నిమిగ్నమవుతాయి. ఇప్పుడేకంగా బల్క్‌లో టీడీపీ నేతకు అప్పగించడంతో వీరంతా ఉపాధిని కోల్పోయే పరిస్థితి నెలకోనుంది. స్థానికంగా వదిలేసి ఎక్కడో ఉన్న నేతకు ఇవ్వడమేంటని సంబంధిత వర్గాలు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా కాంట్రాక్ట్ అడుగుతున్న నేతకు ఈ విషయంలో ఏమాత్రం అనుభవం లేదని, అలాంటి వ్యక్తికి ఎలా అప్పగిస్తారని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోమవారం జరిగిన గ్రీవెన్‌సెల్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై రాజీవ్ విద్యా మిషన్ పీఓ నాగమణిని ’సాక్షి’ వివరణ కోరగా ఎస్పీడీ నుంచి రిక్విజేషన్ వచ్చిందని, దాన్ని కలెక్టర్‌కు పంపించామని, ఆయన కూడా పరిశీలించమని సూచించారని, ఆ మేరకు ఎంఈఓలకు మౌఖికంగా చెప్పానని తెలిపారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను అడిగి తీసుకోవాలని రిక్వెస్ట్ పెట్టిన వారికి చెప్పడం జరిగిందన్నారు. ఇందులో తన ప్రమేయమేది లేదన్నారు. తనకొచ్చిన ఎస్పీడీ లేఖ ప్రకారమే నడుచుకున్నానని తెలిపారు. -
‘అదనపు’ అవినీతి..
* ఆర్వీఎంలో విద్యుద్దీకరణ పేరుతో అక్రమాలు * రూ.అరకోటికి పైగా నిధులు పక్కదారి * పనులు చేయకుండానే బిల్లులు డ్రా.. * సమగ్ర విచారణకు ఆదేశించిన కలెక్టర్ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వివాదాలకు నిలయంగా మారిన ఆర్వీఎం (రాజీవ్ విద్యామిషన్)లో మరో అక్రమం వెలుగు చూసింది. అదనపు గదుల విద్యుద్దీకరణ పనుల పేరుతో భారీగా నిధులు పక్కదారి పట్టాయి. పలు పాఠశాలల భవనాలకు నామమాత్రంగా పనులు చేసి రూ.లక్షల్లో బిల్లులు డ్రా చేశారు. కొన్ని చోట్ల అసలు పనులు చేయకుండానే డబ్బులు దిగమింగారు. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ అక్రమాలపై కలెక్టర్ ఎం.జగన్మోహన్ కొరడా ఝలిపిస్తున్నారు. ఈ పనుల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సుమారు రూ. అరకోటికి పైగా పక్కదారి పట్టిన ఈ వ్యవహారం నిగ్గు తేల్చాలని విద్యుత్ శాఖ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పనులు చేయకుండానే బిల్లులు.. నిరుపేద విద్యార్థులు విద్యనభ్యసించే ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రాజీవ్ విద్యా మిషన్‌కు ఏటా పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో నిర్మించిన సుమారు 420 అదనపు గదులకు విద్యుద్దీకరణ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేసింది. ఒక్కో గదికి వైరింగ్, స్విచ్‌బోర్డులు, సర్వీసు వైర్లు, మెయిన్లు, ఇతర ఎలక్ట్రిసిటీ సామాన్లు, ట్యూబులు, ఫ్యాన్లు అమర్చాలని నిర్ణయించారు. ఇది అక్రమార్కులకు కలిసొచ్చింది. ఇష్టారాజ్యంగా పనులు చేసి అందినకాడికి దండుకున్నారు. ఒక్కో గదికి సుమారు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు బిల్లులు డ్రా చేశారు. ఇలా సుమారు 420 గదులకు పైగా జరిగిన విద్యుద్దీకరణ పనులకు సుమారు రూ.1.26 కోట్ల మేరకు నిధులు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ పనుల్లో సుమారు రూ.అరకోటికి పైగా పక్కదారి పట్టినట్లు ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. చాలా చోట్ల అసలు పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. అలాగే అనేక చోట్ల నామమాత్రంగా పనులు చేశారు. బిల్లులు మాత్రం వేలల్లో కాజేశారు. మరికొన్ని చోట్ల నాసిరకం వైర్లు, ఇతర సామగ్రీని ఉపయోగించి అక్రమాలకు పాల్పడ్డారు. చిన్నారుల ప్రాణాలతో చెలగాటం.. నాసిరకంగా జరిగిన ఈ వైరింగ్ పనులు చాలా చోట్ల అస్తవ్యస్థంగా తయారయ్యా యి. అనేక చోట్ల స్విచ్‌బోర్డులు పగిలిపోయి వైర్లు తేలాయి. వీటిని ముట్టుకుంటే చిన్నారులు విద్యుత్ షాక్‌కు గురయ్యే ప్రమాదాలు అనేక పాఠశాలల్లో పొంచి ఉన్నాయి. అలాగే నాసిరకం ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు అసలు పనిచేయడం లేదు. ఎస్‌ఎంసీల ఇష్టారాజ్యం : విద్యుద్దీకరణ పనుల కోసం వచ్చిన నిధులను అధికారులు ఆయా పాఠశాలల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ)లకు అప్పగించారు. అ నేక చోట్ల ఈ క మిటీల్లో సభ్యులుగా ఉన్న చోటా మోటా నేతలు, కొందరు హెఎంలు కలిసి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. తూతూ మం త్రంగా పనులు చేసి, కొన్నిచోట్ల అసలు చేయకుండానే నిధులు పంచుకున్నారు. ఆర్వీఎం ఎస్పీడీ దృష్టికి.. : ప్రాథమికంగా దృష్టికి వచ్చిన ఈ అక్రమాల విషయాలను కలెక్టర్ రాజీవ్ విద్యా మిషన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్‌కు ప్రాథమిక నివేదిక అందజేసినట్లు తెలిసింది. మరోవైపు ఈ పనులపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ట్రాన్స్‌కో పర్యవేక్షక ఇంజినీర్‌ను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మ తయారు చేసినట్లు సమాచారం. -
పస్తులే నేస్తాలు!
శ్రీకాకుళం : జిల్లాలో విద్యా వలంటీర్లు పండుగ వేళ కూడా పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. వీరి నియామకం జరిగి నాలుగు నెలలు కావస్తున్నా ఒక్కనెల జీతాన్ని కూడా అందుకోలేదు. ఫలితంగా ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్నారు. సంక్రాంతి నాటికైనా తమకు జీతాలు అందుతాయని ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ వారి కోరిక నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వస్తున్నార. ఏటా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు రాజీవ్ విద్యామిషన్, తొమ్మిది, 10 తరగతులకు విద్యాశాఖ వలంటీర్లను నియమించేది. ఈ బాధ్యతలను ఈసారి అన్ని తరగతులకు విద్యాశాఖకే అప్పగించారు. జిల్లా విద్యాశాఖాధికారులు నియామకపు బాధ్యతలను మండల విద్యాశాఖాధికారుల చేతిలో పెట్టారు. ఈ నియామకపు ప్రక్రియను కూడా తీవ్ర జాప్యం చేసిన మండల విద్యాశాఖాధికారులు ఆ విషయాన్ని ఁసాక్షి*లో కథనంగా ప్రచురితం అయితేగానీ పూర్తిస్థాయిలో నియామకాలు చేపట్టలేదు. జిల్లాకు 900 మంది వలంటీర్లను నియమించాలని సంబంధిత శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అరుుతే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చాలా గ్రామాల్లోని పాఠశాలలకు వలంటీర్లను కూడా నియమించలేదు. మిగిలిన చోట నియామకపు ప్రక్రియ పూర్తయి నాలుగు నెలలు కావస్తున్నా ఎవరెవరిని ఏఏ పాఠశాలకు కేటారుుంచారన్న వివరాలను మండల విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ కార్యాలయానికి ఇప్పటికీ అందజేయలేదు. ఎంఈవోలు సరైన సమయంలో వివరాలు నివేదించి ఉంటే రాజీవ్ విద్యామిషన్ ద్వారా నిధులు మంజూరై వలంటీర్లకు జీతాలు ఇచ్చేందుకు వీలు కలిగేది. మండల విద్యాశాఖాధికారులు ఇంతటి నిర్లక్ష్యంగా ఉండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అరకొర జీతాలతో విద్యా వలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. వాటిని కూడా సకాలంలో ఇవ్వకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు అవ్వలేదంటే సమంజసంగా ఉండేది. నిధులుండీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జీతాలకు నోచుకోలేదని తెలుసుకొని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులైనా తక్షణం స్పందించి సంక్రాంతి పండుగలోగా జీతాలు అందేలా చూడాలని విద్యా వలంటీర్లు వేడుకుంటున్నారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి అరుణకుమారి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా మండల విద్యాశాఖాధికారుల నుంచి వివరాలు రాకపోవడం నిజమేనని అంగీకరించారు. ఇప్పటికే రెండు దఫాలు ఎంఈవో నుంచి వివరాలు అడిగామని, వారి నుంచి అందక పోవడంతో నివేదించలేక పోయినట్టు చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో వివరాలను తెప్పించుకుని జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆర్వీఎంలో అక్రమం
అటవీ శాఖలో బోగస్ కొలువుల బాగోతం ఇంకా సద్దుమణుగక ముందే రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) ఉద్యోగాల్లో ఇలాంటి అక్రమమే మరొకటి వెలుగు చూసింది. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అక్రమార్కులు అమాయక నిరుద్యోగులను బుట్టలో వేసుకున్నారు. కొలువుల ఆశ చూపి నిరుద్యోగుల వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లకు తెరలేపారు. రూ.లక్షల్లో దండుకున్నారు. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాజీవ్ విద్యామిషన్ పరిధిలో జిల్లాలో 52 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో ఖాళీగా ఉన్న 54 పోస్టులను ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరైంది. అకౌంటెంట్లు, ఏఎన్ఎంలు, అటెండర్లు(ఆఫీస్ సబ్ ఆర్డినేట్స్), వాచ్మెన్లు, స్వీపర్లు ఇలా వివిధ రకాల నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. అనుకున్నదే తడువుగా పెద్ద ఎత్తున వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఒక్కో పోస్టుకు సుమారు రూ.30 నుంచి రూ.50వేల వరకు వసూలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొలువులు.. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారంటూ అమాయక అభ్యర్థులను మభ్య పెట్టారు. సర్కారు కొలువు వస్తుందని.. ఎప్పటికైనా పర్మినెంట్ ఉద్యోగులమయ్యే అవకాశాలున్నాయని భావించిన అమాయక అభ్యర్థులు అక్రమార్కుల బుట్టలో పడ్డారు. ఇలా వసూలు చేసిన సొమ్ములో పైస్థాయి అధికారులకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి మరీ వసూళ్ల దందాకు తెరలేపారు. ఔట్సోర్సింగ్ ద్వారా నియామకాలు చేపట్టాల్సిన ఈ పోస్టులకు కొందరు అభ్యర్థుల వద్ద ఆర్వీఎం కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడం గమనార్హం. అడ్డదారిలో ఔట్ సోర్సింగ్ ఎంపిక.. ఈ పోస్టులను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఎంపిక ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఈ ఏజెన్సీ ఎంపిక కోసం టెండరు నోటిఫికేషన్ విడుదల చేయాలి. దాంతోపాటుగా బహిరంగ ప్రదేశాల్లో, పలు ప్రభుత్వ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులపై ఈ నోటిఫికేషన్‌ను ఉంచాలి. అలా చేస్తేనే వివిధ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు టెండర్లలో పాల్గొంటాయి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఎలాంటి టెండర్లు పిలవకుండానే గుట్టుచప్పుడు కాకుండా ఈ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీనీ ఎంపిక చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమకు అనుకూలమైన వారికి ఏజెన్సీని కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) ఆధ్వర్యంలో ఉండే జిల్లా మహిళా సమాఖ్యనే ఔట్సోర్సింగ్ ఏజెన్సీగా ఎంపిక చేశారు. ఇప్పుడు అలా కాకుండా కొన్ని ఏజెన్సీల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఎంపిక చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మాకు ఎలాంటి సంబంధం లేదు - పి.యాదయ్య, ఆర్వీఎం పీవో కేజీబీవీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించాం. ఉద్యోగాలిప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి రాలేదు. ఈ అక్రమాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. డబ్బులు ఇచ్చిన, ఉద్యోగాలిపిస్తామని చెప్పి డబ్బులు పుచ్చుకున్న వారే బాధ్యులవుతారు. ఔట్సోర్సింగ్ ఎంపిక ఇంకా పూర్తికాలేదు. -
నిధులిచ్చినా నీరసమే
ఏలూరు సిటీ :ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ విద్యామిషన్ పథకం పదేళ్లుగా అమలవుతున్నా.. అవసరమైన నిధులు అందజేస్తున్నా.. ఆశించిన ఫలితాలు ఇవవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్లలో గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.93 కోట్లు నిధులు మంజూరైనా ఇప్పటికీ 300కు పైగా అదనపు గదుల నిర్మాణాన్ని అసలు ప్రారంభించనే లేదు. అలాగే కిచెన్ షెడ్ల నిర్మాణం కోసం రూ.15.64 కోట్లను మంజూరు చేసినా ఎస్ఎస్ఏ చేపట్టిన వాటిలో 50 శాతం పూర్తి కాగా, హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో 470 కిచెన్ షెడ్లను నిర్మించాల్సి ఉండగా, ఒక్కటీ నిర్మాణానికి నోచుకోలేదు. అంతేకాక భారీగా నిధులు దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ శాఖ తీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవుతుందనే విమర్శలు సైతం ఉన్నాయి. మరోవైపు భారం తగ్గించుకునే సాకుతో ప్రస్తుత ప్రభుత్వం కొన్ని చోట్ల పిల్లలు లేరనే కారణంగా పాఠశాలలను మూసివేస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ముందుచూపు కరువు ప్రాథమిక విద్యను బలోపేతం చేయటం, ఈ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన బోధన కోసం ఉపాధ్యాయులకు శిక్షణ , విద్యార్థులున్నా పాఠశాలలు లేని ప్రాంతాల్లో స్కూళ్ల ఏర్పాటు తదితర బృహత్తర కార్యక్రమాలను రాజీవ్ విద్యామిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. జిల్లాలో గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో నాలుగేళ్లలో (2011-12 నుంచి 2014- 15) సుమారు 1,447 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.93 కోట్ల నిధులు మంజూరయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో 1,166, అర్బన్ ప్రాంతంలో 281 తరగతి గదులు నిర్మించాల్సి ఉంది. అయితే వీటిలో ఇప్పటివరకు 300పైగా అదనపు తరగతి గదుల నిర్మాణ మే ప్రారంభమే కాలేదు. ఇదిలా ఉండగా కొన్ని చోట్ల విచిత్ర పరిస్థితి నెలకొంది. అధికారులు ముందుచూపుతో వ్యవహరించకపోవడంతో వందల కోట్ల నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు నిరుపయోగంగా మారుతున్నాయి. పాఠశాలలో విద్యార్థులే లేనప్పుడు తరగతి గదుల నిర్మాణం ఎందుకు చేపట్టారన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ నేతల ఒత్తిడి, ప్రలోభాలతోనే అవసరంలేని చోట్ల కూడా అదనపు తరగతి గదులు నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. అవసరం ఉన్న చోట్ల పట్టించుకోని అధికారులు విద్యార్థులు లేని ప్రాంతాల్లో భవనాల నిర్మాణానికి అత్యుత్సాహం చూపారని విమర్శిస్తున్నారు. కిచెన్‌షెడ్ల నిర్మాణంలో అలసత్వం వీటితోపాటు బాలికలకు మరుగుదొడ్లు, ప్రహరీగోడల నిర్మాణం, ఫర్నిచర్, ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక గదుల నిర్మాణం, కిచెన్షెడ్లు వంటివాటికి రూ.150 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి 2014-15లో 1,043 కిచెన్షెడ్లు నిర్మించాలని నిర్ణయించారు. వీటి నిర్మాణం కోసం రూ.15.64 కోట్లు నిధులు ఖర్చు చేసేందుకు అనుమతులు వచ్చాయి. అయితే అక్టోబర్ మాసాంతానికి కిచెన్షెడ్లు పూర్తిచేసింది 218 మాత్రమే. నిర్మాణ దశలో మరో 44 ఉన్నాయి. 781 కిచెన్‌షెడ్ల నిర్మాణ పనులు నేటికీ ప్రారంభం కాలేదు. ఈ కిచెన్షెడ్లలో సర్వశిక్ష అభియాన్ నిర్మించాల్సినవి 488 కాగా వీటికి రూ.7.32 కోట్లు, గృహనిర్మాణ సంస్థ 470 కిచెన్షెడ్లకు రూ.7.05 కోట్లు నిధులు మంజూరు చేశారు. మునిసిపాలిటీల్లో కిచెన్‌షెడ్ల నిర్మాణాన్ని విస్మరించారు. వర్షాలు పడితే పిల్లలకు భోజనం వండేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, త్వరితగతిన కిచెన్షెడ్లు నిర్మించాలని అధికారులు ఆదేశించినా చర్యలు కరువయ్యాయి. -
వేటు పడినా..సీటులోనే
భానుగుడి (కాకినాడ) :సర్వశిక్షాభియాన్‌ను ‘సర్వభక్షాభియాన్’గా మార్చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) పీఓ వెన్నపు చక్రధరరావుపై వేటు వేస్తూ ఎట్టకేలకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్వీఎం ప్రవేశపెట్టిన పలు పథకాల అమలులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను విధుల నుంచి తొలగించి, విచారణ జరిపించాలని ఆ శాఖ డెరైక్టర్ ఉషారాణి ఆదేశించారు. వెన్నపు అవినీతి, అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల ఆధారాలు మాయం కావడంపై ‘సాక్షి’ ‘సర్వ‘భక్ష’ అభియాన్’, ‘వాటి మాయం వెనుక మర్మమేమిటో’ పేరిట ప్రచురించిన కథనాలతో ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది. అయితే ఈనెల 4న జారీ అయిన ఆదేశాలపై ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడంతో వెన్నపు తన స్థానంలో కొనసాగుతూనే ఉన్నారు. ఇవీ ఆరోపణలు బడుగు విద్యార్థులకు స్కూల్బ్యాగ్ల పంపిణీ, ఏకరూప దుస్తులు, కార్ల వినియోగంలో, అధికారులకు టీఏ, డీఏ కేటాయింపులో, కేజీబీవీ ఉద్యోగ నియామకాల్లో అవినీతికి పాల్పడ్డారని, 2013లో రిపబ్లిక్‌డే శకటాల తయారీలో కలెక్టర్ ఆదేశాల్ని బేఖాతరు చేశారని, 2010 ఆర్‌ఎస్‌టీసీ నిధుల బడ్జెట్ విషయంలో తప్పుడు గణాంకాలు చూపారని వెన్నపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 13-5-2013 మే 13న ఉద్యోగంలో చేరినా ఆలనెల నాలుగు నుంచి వేతనం తీసుకున్నారన్న ఆరోపణా ఉంది. జూలైలోనే మంత్రికి ఫిర్యాదు వెన్నపు అవినీతిపై స్వచ్ఛంద సంస్థలు మంత్రి గంటా శ్రీనివాసరావుకు జులై 7న ఫిర్యాదు చేయగా విచార ణ జరిపించాలని కలెక్టర్ ను ఆదేశించారు. కలెక్టర్ ఏజేసీ మార్కండేయులు ఆధ్వర్యంలో నియమించిన కమిటీ ఫిర్యాదులోని 9 అంశాల్లో ఏడింటికి ఆధారాలు ఉన్నాయని తేల్చింది. ఈ నివేదికను కలెక్టర్ ఆగస్టు 13న వి ద్యాశాఖ డెరైక్టర్‌కు అందించిన నేపథ్యంలో ఆర్వీఎం డెరైక్టర్ వెన్నపును తక్షణం విధుల నుంచి తొలగించి, విచారణ జరిపించాలని ఈనెల 4న ఆదేశించారు. రెండు వారాలు కావస్తున్నా.. ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం, ఆయన పీఓగా కొనసాగడం గమనా ర్హం. వెన్నపుపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన స్వచ్ఛంద సంస్థలే కాక ఆర్వీఎం ఉద్యోగులూ కోరడం విశేషం. -
విద్యాభివృద్ధికి కృషి చేస్తా
రేగొండ : విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి హామీ ఇచ్చారు. రేగొండ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ హైస్కూల్లో అదనపు గదుల నిర్మాణానికి రాజీవ్ విద్యామిషన్ నుంచి రూ.35 లక్షలు మంజూరయ్యూరుు. ఈ మేరకు గదుల నిర్మాణానికి మంగళవారం స్పీకర్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగాంగా నాగరికతకు దూరంగా ఉన్న చెంచుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్పారు. చెంచు విద్యార్థులు ఆంగ్ల భాష ఉచ్చరించేలా కమ్యూనికేట్ విద్యనందించేందుకు నిపుణులతో చర్చిస్తున్నామన్నారు. గవర్నర్, సీఎంతో చెంచు విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడే విధంగా ఆరు నెలల్లో వారిని తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ గేయూన్ని స్పీకర్ ఆలపించి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో స్ధానిక సర్పంచ్ మోడెం ఆదిలక్ష్మి, ఎంపీపీ ఈర్ల సదానందం, ఎంపీటీసీ సభ్యుడు పట్టెం శంకర్, ఎంఈఓ కె.రఘుపతి, పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం వి.హేమ, ఎస్ఎంఎస్ చైర్మన్ కిషన్, కుంచాల సదావిజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీల భర్తీ ఎన్నడో?
సాక్షి, మంచిర్యాల : రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ మూడున్నర నెలలుగా అభ్యర్థుల ఓపికను పరీక్షిస్తోంది. పాఠశాలల పనిగంటలు పెరిగిన నేపథ్యంలో ఆ బరువును తామెల భరించాలో అర్థం కావడం లేదని ఉపా ధ్యాయులు పేర్కొంటున్నారు. జిల్లాలోని హైస్కూళ్లలో ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయుల నియామకం కోసం ఈ ఏడాది జూలైలో ఆర్వీఎం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా ఉపాధ్యాయులను కాంట్రాక్టు పద్ధతిలో ఎంపిక చేస్తామని, సంబంధిత విభాగంలో అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఆర్ట్ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు చిత్రకళా నైపుణ్యం, క్రాఫ్ట్ ఉపాధ్యాయులు కుట్లు, అల్లికలు, వ్యాయామ ఉపాధ్యాయులు సంబంధిత అంశంలో పిల్లలకు శిక్షణ ఇవ్వాలి. ఆది నుంచి.. నోటిఫికేషన్ విడుదల నుంచి గందరగోళ పరిస్థితులు నెల కొన్నాయి. స్థానికతపై స్పష్టత ఇవ్వలేదు. మండలం యూ నిట్‌గా స్థానికతను ఆధారం చేసుకొని కొందరు, స్కూల్ కాంప్లెక్స్ యూనిట్‌గా స్థానికతను ఆధారం చేసుకొని కొన్నిచోట్ల ఎంపిక పూర్తిచేశారు. సదరు అభ్యర్థుల వివరాలు జిల్లా ఉన్నతాధికారులకు పంపించారు. అయితే ఈ ప్రక్రి య ముగిసి నెలలు గడుస్తున్నా నియామకం గురించి అభ్యర్థులకు సమాచారం ఇవ్వలేదు. పెరిగిన పనిగంటల బాధ్యతలను ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులతో సర్దుబా టు చేసుకోవాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొంది. అయితే ఉపాధ్యాయులే లేనప్పుడు విధులు ఎలా పంచుకుంటారనే ప్రశ్న వ్యక్తమవుతోంది. తమకు నియామకం విషయంలో అధికారిక ప్రకటన చేస్తే ఈ ఎంపిక కోసం ఆగి ఉండాలో లేక మరేదైనా మార్గం చూసుకోవాలో నిర్ణయిం చుకుంటామని అభ్యర్థులు వాపోతున్నారు. నియామకాలు చేపట్టి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఆదేశాలు వస్తే నియామకాలు.. ఈ విషయమై రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు ఆఫీసర్ యాదయ్యను సంప్రదించగా.. ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియను హోల్డ్‌లో ఉంచాలని రాష్ర్ట కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో ప్రక్రియను నిలిపి వేశాం. తదుపరి ఆదేశాల ప్రకారం ముందుకువెళ్తామని స్పష్టం చేశారు. -
ప్రభుత్వ పాఠశాలలు ప్రమాదకరం
- రక్షణ లేని ‘చదువు’ - పాఠశాల భవనాలలో సౌకర్యాలు కరువు - దుర్వినియోగమవుతున్న నిధులు - విద్యార్థులకు తప్పని తిప్పలు - నామమాత్రంగా మారిన నిర్వహణ కమిటీలు నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలలు ప్రమాదకరంగా మారాయి. అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. రాజీవ్ విద్యామిషన్ నుంచి ఏటా కోట్లాది రూపాయలు మంజూరవుతు న్నా, క్షేత్రస్థాయిలో మాత్రం మార్పులు రావడం లేదు. ఫలితంగా ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వర్ని మండలం రుద్రూర్ ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి విద్యార్థి చాకలి శ్రీను పాము కాటుతో మృతి చెందడం ఇందుకు నిదర్శనం. ఇదీ పరిస్థితి జిల్లాలో 1,576 ప్రాథమిక పాఠశాలలు, 265 ప్రాథమికోన్నత పాఠశాలలు, 465 ఉన్నత పాఠశాలలు, ఉన్నాయి. దాదాపు రెండున్నర లక్షల మంది విద్యార్థులు ఇందు లో చదువుకుంటున్నారు. వారితోపాటు అక్కడ సమస్యలూ సహవాసం చేస్తున్నాయి. 211 ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేవు. మరికొన్ని పాఠశాలలు ఊరికి చివర గా ఉండడంతో, సరైన దారులు లేక విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. వానాకాలంలో చెట్లు, ముళ్లపొదలు పెరగడంతో పరిసరాలు పమాదకరంగా మారుతు న్నాయి. కాలినడక దారులు కనడబడకుండా పోతున్నాయి. పాఠశాలలలో కనీస సౌకర్యాల కల్పన కోసం రాజీవ్ విద్యా మిషన్ నుంచి కోట్లాది రూపాయలు విడుదలవుతున్నాయి. కానీ, అది సక్రమంగా వినియోగం కావడం లేదు. ప్రజాప్రతినిధుల సహకారంతో, కొందరు కాంట్రాక్టర్లు అవసరం లేని చోట అదనపు గదులు, ప్రహరీలు నిర్మిస్తున్నారు. అవసరం ఉన్న ప్రాంతాలలో ఈ పనులు కొనసాగడం లేదు. జిల్లాలోని 484 పాఠశాలల భవనాలు అసౌకర్యాలకు నిలయంగా ఉన్నాయి. ఎప్పుడో నిర్మిం చినవి కావడంతో దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. పైకప్పులకు రంధ్రాలు, తరగతి గదుల గోడలకు పగుళ్లు ఏర్పడినా మరమ్మతులకు నోచుకోవడం లేదు. వర్షం పడితే పరిస్థితి ప్రమాదకరమే. కొన్ని చోట్ల సరిపడినన్ని తరగతి గదులు లేక ఆరుబయటనే విద్యాబోధనను కొనసాగిస్తున్నారు. మూత్రశాలలు నిర్మించి ఉన్న ప్రాంతం లో ముళ్ల పొదలు, చెట్లు ఏపుగా పెరుగుతున్నా పట్టించుకునేవారు లేరు. మరి నిధులు ఏమవుతున్నాయి పాఠశాల అభివృద్ధికి సంబంధించి (ఎస్ఎంసీ) పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల కమిటీలో 23 మంది, ఉన్నత పాఠశాలల కమిటీలో 17 మంది సభ్యులు ఉంటారు. వీటికి ఏటా పాఠశాల నిధులు రూ. ఏడు వేలు, నిర్వహణ కోసం రూ. ఐదు వేలు, అలాగే 6,7 తరగతులకు మూడు గదుల కం టే ఎక్కువ ఉంటే పది వేల రూపాయలు మంజూరు అవుతాయి. వీటిని పాఠశాల అభివృద్ధికి, వివిధ మరమ్మతులు, పరిశుభ్రతకు వినియోగించాలి, ఎక్కడ కూడా ఈ నిధులకు సక్రమంగా వినియోగించడం లేదు. ఫలితంగా పాఠశాలల పరిసరాలు దుర్గంధంగా మారుతున్నాయి. ముళ్లపొదల మధ్య, బురదనీటితో కునారిల్లుతున్నాయి. -
మదర్సాల నిధులు స్వాహా
సిబ్బంది విద్యార్హతలపై గందరగోళం మార్గదర్శకాల్లో అస్పష్టత ఆసరాగా నిధుల దుర్వినియోగం నిలిచిన జీతాలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నిబంధనల్లో ఉన్న అస్పష్టతను అడ్డం పెట్టుకుని రాజీవ్ విద్యామిషన్ కింద వచ్చిన నిధులను దిగమింగారు. మైనారిటీలకు ఉర్దూలో విద్యాబోధన కోసం ఏర్పాటు చేసిన మదర్సాల పేరుతో భారీగా డబ్బులు స్వాహా చేశారు. విద్యాశాఖకు, రాజీవ్ విద్యామిషన్‌లోని ఉద్యోగులకు మధ్య డబ్బు పంపిణీలో వచ్చిన విభేదాల కారణంగా నాలుగు నెలల క్రితం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డెరైక్టర్‌గా వచ్చిన వల్లభనేని శ్రీనివాస్ మార్చి నెల నుంచి మొత్తం అన్ని మదర్సాలకు చెల్లించే నిధులను నిలిపేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఒక అదనపు కార్యదర్శిని విచారణకు ఆదేశించారు. ఆయన త్వరలో జిల్లాకు వచ్చి విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే శుక్రవారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ వీ ఉషారాణి దీనిపై పీడీ శ్రీనివాస్‌ను విచారణ చేసి పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే... 2012-13కు జిల్లా వ్యాప్తంగా 86 మదర్సాలుండగా, 2013-14కి వచ్చేసరికి వాటి సంఖ్య 45కి పడిపోయింది. అందులో ఒకటి రద్దు చేయగా 44 నడుస్తున్నాయి. మదర్సాల పనితీరుకు, విద్యార్హతలకు సంబంధించిన నిబంధనల్లో స్పష్టత లేకపోవడం, ఒక్కోసారి ఒక్కో నిబంధన అమలు చేయడం వల్ల దీన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు. అసలు మదర్సా లేకుండానే అది నడుపుతున్నట్లు ఎంఈవోతో సర్టిఫికెట్ తెచ్చుకుని ప్రతినెలా డబ్బులు డ్రా చేసుకున్నారు. ఒక్కో మదర్సాకు ఒక నజీమ్, మరో విద్యావలంటీర్‌ను కేటాయించారు. విద్యార్హతలు బీఈడీ గానీ, డీఈడీగానీ ఉండాలి. అయితే నాలుగేళ్లుగా వాటికి మినహాయింపు ఇస్తున్నారు. దీంతో అసలు ఉర్దూ రానివారు కూడా మదర్సాల పేరుతో డబ్బులు దిగమింగేశారు. దీనిపై ఒంగోలు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్(ఉర్దూ రేంజ్) తనిఖీలు నిర్వహించి రాజీవ్ విద్యా మిషన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్‌కు ఒక నివేదిక పంపారు. అందులో కొన్ని చోట్ల కనీసం మదర్సా బోర్డులు కూడా లేవని, విద్యార్థులు లేరని పేర్కొన్నారు. కొత్తపట్నం, సంతమాగులూరు, కందుకూరు, వేటపాలెం, రాచర్ల, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, పొదిలితో సహా పలు మదర్సాలు కాగితాల మీదే పని చేస్తున్నాయని నివేదిక ఇచ్చారు. వారి విద్యార్హతలు కూడా బోగస్ అని, అర్హత లేనివారు పనిచేస్తున్నారని తేల్చారు. అసలు పనిచేయని మదర్సాల పేరుతో డబ్బులను కొందరు అధికారులే తినేస్తున్నారని నివేదిక ఇచ్చారు. ప్రత్యామ్నాయ స్కూల్స్ కో-ఆర్డినేటర్ (ఏఎల్ఎస్) 40 బోగస్ మదర్సాల్లో వందమందికి పైగా వలంటీర్లను నిబంధనలకు వ్యతిరేకంగా తీసుకున్నట్లు చూపించారని పేర్కొన్నారు. నిజంగా పనిచేస్తున్న మదర్సాల నుంచి ఐదు వేల రూపాయలు, బోగస్ మదర్సాల నుంచి 50 వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. బోగస్ మదర్సాల్లో ఇద్దరు వలంటీర్లు ఉన్నట్లు చూపించి ఒకరి వేతనం నజీమ్, మరో వేతనం ఏఎల్ఎస్ తీసుకున్నట్లు తేలిందని డీఐ తన నివేదికలో పేర్కొన్నారు. అయితే రాజీవ్ విద్యామిషన్ ప్రత్యామ్నాయ స్కూల్స్ కో-ఆర్డినేటర్ మాత్రం నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని, దానికి సంబంధించిన గైడ్‌లైన్స్‌పై అవగాహన లేక డీఐ తన నివేదిక ఇచ్చారని చెబుతున్నారు. దీనిపై ఆరోపణలు వచ్చిన వెంటనే మొత్తం మదర్సాల వేతనాలు నిలిపేసినట్లు ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీనివాస్ సాక్షికి తెలిపారు. రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ ఉషారాణి ఆదేశాల మేరకు పదిరోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తానని ఆయన పేర్కొన్నారు. -
‘జాబు రావాలంటే బాబు రావాలన్న’ నినాదం
- రాజీవ్ విద్యామిషన్‌లో కాంట్రాక్టు ఉద్యోగుల పునరుద్ధరణపై ప్రభుత్వం తాత్సారం - ఆందోళనలో 425 మంది ఉద్యోగులు ఏలూరు సిటీ : ‘జాబు రావాలంటే బాబు రావాలన్న’ నినాదంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాల సంగతి అటు ఉంచితే ఉన్న ఉద్యోగులను తొలగిస్తోంది. వివిధ శాఖల్లో ఏళ్ల తరబ డి పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ వారి కుటుంబాలను రోడ్డుపైకి నెడుతోంది. జిల్లాలో రాజీవ్ విద్యామిషన్‌లో భాగంగా 425 మంది ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్నారు. పాఠశాలల క్లస్టర్ల పరిధిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లుగా 243 మంది, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్లు 46, మానసిక, శారీరక వికలాంగుల శిక్షణకు సంబంధించి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్(ఐఈఆర్టీఎస్) 36 మంది, డివిజన్ లిమిట్ మానిటరింగ్ టీమ్స్(డీఎల్ఐఎంటీఎస్)లో 10 మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 44 మంది, మండల విద్యాధికారుల కార్యాలయాల్లో వికలాంగులకు ఉపాధి కల్పిస్తూ మెసెంజర్లుగా 46 మందిని గతంలో నియమించారు. వీరిని పరీక్షలు, ఇంటర్య్వూల ఆధారంగా గతంలో ఉన్నతాధికారులు నియమించారు. సర్వీస్ పునరుద్ధరణైపై తాత్సారం కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును ఏటా ప్రభుత్వం పునరుద్ధరిస్తూ వస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో సర్వీస్ పునరుద్ధరణకు ఉద్యోగుల పనితనాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు చెప్పారు. అయినా ఆర్వీఎంలో ఇంతవరకు ఏ ఉద్యోగి సర్వీస్‌ను పునరుద్ధరించలేదు. ప్రభుత్వం కావాలనే ఉద్యోగుల సర్వీస్‌ను పునరుద్ధరించకుండా తాత్సారం చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని శాఖలకు చెందిన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిం చడంతో తమను కూడా తొలగిస్తారనే ఆందోళన వారిలో నెలకొంది. మండల విద్యాధికారుల కార్యాలయాల్లో పనిచేస్తున్న వికలాంగులైన మెసెంజర్లను విధుల నుంచి తొలగించటంపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఉద్యోగాలు లేకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, అధికారులు సత్వరమే పునరుద్ధరించాలని కాంట్రాక్టు ఉద్యోగులు కోరుతున్నారు. -
కొను‘గోల్మాల్’
ఖమ్మం: అక్రమాల పుట్టగా పేరున్న రాజీవ్ విద్యామిషన్ అధికారులు మరోసారి తమ నిజ స్వరూపం బయటపెట్టారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు వంటపాత్రలు, ఇతర వస్తువుల సరఫరాలో చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వస్తున్నాయి. టెండర్లలో చూపించినట్టుగా కాకుండా నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి నాసికరం వస్తువులు సరఫరా చేసినట్లు తెలిసింది. ఇందులో షాపుల యజమానులతో ఆర్వీఎం అధికారులు కుమ్మక్కయ్యారనే విమర్శలు వస్తున్నాయి. కొత్తగా నియమితులైన పలువురు కేజీబీవీ ప్రత్యేకాధికారులు దీనిపై ప్రశ్నిస్తే.... ‘ఇది షరా మామూలే.. దీనిపై మీరు ఎక్కువగా మాట్లాడితే ఉన్నతాధికారుల దృష్టిలో పడుతారు’ అని ఆర్వీఎంలో పనిచేస్తున్న ఓ అధికారి బెదిరించడంతో వారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు. చేసేది లేక ఆ వస్తువులనే వినియోగిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం తెలిసిన జిల్లా ఉన్నతాధికారులు ఆర్వీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను నెలకొల్పింది. ఈ క్రమంలో జిల్లాలో మైదాన ప్రాంతంలో 21, ఐటీడీఏ పరిధిలో 12 కేజీబీవీలు మంజూరు చేశారు. మైదాన ప్రాంతంలో 15 కేజీబీవీలకు అన్ని వసతులతో కూడిన సొంత భవనాలు నిర్మించారు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వంట చేసి పెట్టేందుకు ప్రభుత్వం రూ. 35,09,854 మంజూరు చేసింది. ఈ డబ్బులతో ఐరన్ స్టవ్‌లు, అల్యూమిలియం వంటపాత్రలు, గ్రైండర్, ఇడ్లీపాత్రలు, చపాతీ, దోశ పాత్రలు, 10, 5 కేజీల బొగ్నాస్, స్టీల్ బకెట్లు, స్టీల్ బేసిన్లు, రైస్ స్పూన్లు, చెంచాలు, టీ మగ్గులు, ఐరన్ క్యాబ్గిర్, మంచినీటి డ్రమ్ములు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంక్ బాక్సులు, కార్పెట్లు, బెడ్షీట్లు మొదలైనవి కొనుగోలు చేయాలి. ఇందుకోసం ఆయా వస్తువులు సరఫరా చేసే షాపు యజమానుల నుంచి టెండర్లు పిలిచారు. ఏ వస్తువు ఎన్ని కేజీలు ఉండాలి, ఎన్ని లీటర్లు ఉండాలి, ఏ కంపెనీకి చెందినవి సరఫరా చేయాలి అనే వివరాలను టెండర్ నోటీసులో పేర్కొన్నారు. దీనికి సమ్మతించి టెండర్లు వేసిన షాపులను జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. అయితే వస్తువుల సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు తెలియజేసేందుకు షాంపిల్‌గా కొన్ని వస్తువులను తీసుకొచ్చి అధికారులకు చూపించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. తీరా వస్తువులు సరఫరా చేసేటప్పటికి జిల్లా అధికారులకు టోకరా ఇచ్చి పలు నాసిరకం వస్తువులు సరఫరా చేసినట్లు సమాచారం. వీటిలో గ్రైండర్, తాగునీటి డ్రమ్ములు టెండర్లలో పేర్కొన్నవి కాకుండా వేరే కంపెనీవి సరఫరా చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారంలో ఆర్వీఎంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అధికారులకు, షాపు యజమానులకు మధ్యవర్తిత్వం చేసి కమీషన్లు కాజేసినట్లు సమాచారం. కాగా, ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఉన్నతాధికారి ఆర్వీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడంతా షరా మామూలే... నిధుల దుర్వినియోగం, బిల్లులు పెట్టడం, ఉపాధ్యాయులకు, ఇతర ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం, వస్తువుల కొనుగోలులో అవకతవకలు షరా మామూలే అని ఆ శాఖలో పనిచేస్తున్న అధికారులు చెపుతుండడం విశేషం. ఏళ్ల తరబడి ఆర్వీఎంలో కీలక శాఖలో పనిచేసే ఉద్యోగులు, అక్కడ పనిచేసే ఔట్ సోర్సింగ్ అధికారులను అనుకూలంగా మల్చుకొని నిధులు కాజేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా కృత్రిమ అవయవాల కొనుగోలు, ఫిజియోథెరఫీ సెంటర్లలో ఏర్పాటు చేసిన బల్లలు, కంటిచూపు లోపం గల విద్యార్థులకు సరఫరా చేసిన కళ్లజోళ్లు మొదలైన వాటిల్లో అవకతవకలు జరిగాయని, వాటిని పట్టించుకున్న నాథుడే లేడని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆర్వీఎం ద్వారా కొనుగోలు చేసే వస్తువులు, నిధుల వ్యయంపై దృష్టి సారిస్తే అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. ఆ దిశగా అధికారులు దృష్టి సారించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఆర్వీఎంకు ఊరట
- రూ.192.69 కోట్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సుముఖత - పెండింగ్ పనుల పూర్తి, కొత్త కార్యక్రమాలు చేపట్టనున్న యంత్రాంగం సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిధుల కొరతతో సతమతమవుతున్న రాజీవ్ విద్యామిషన్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఊరట కలిగింది. ఆ శాఖ రూపొందించిన వార్షిక ప్రణాళికకు కొంత మెరుగులు దిద్దిన కేంద్రం ప్రభుత్వం.. నిధుల మంజూరుకు అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా జిల్లా రాజీవ్ విద్యామిషన్‌కు 2014-15 వార్షిక సంవత్సరంలో రూ.192.69 కోట్ల బడ్జెట్ విడుదల కానుంది. దీంతో గతంలో పెండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు కొత్తగా పలు కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక కొత్త కార్యక్రమాలు... రాజీవ్ విద్యామిషన్ నిధుల విడుదలలో గత ఏడాది కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన పాత నిధులను ఖర్చు చేస్తేనే కొత్తగా బడ్జెట్ ఇస్తామని స్పష్టం చేయడంతో 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆర్వీఎం నిధులకు భారీగా కోత పడింది. ఫలితంగా గతేడాది కేవలం రూ.124.54 కోట్లు విడుదల కాగా.. ఇందులో రూ.80కోట్లు ఉద్యోగుల వేతనాలకే ఖర్చు చేశారు. తాజాగా బడ్జెట్ పరిమితి పెరిగింది. ఈ ఏడాది రూ.192.69 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయడంతో.. అధికారులు కొత్త కార్యక్రమాల కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నారు. మరోవైపు నిర్మాణ పనులకు సైతం నిధులు సంతృప్తికరంగా రావడంతో పల్లె బడులకు అదనపు గదులు నిర్మించేందుకు ఆర్వీఎం అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పనితీరులో వెనకబడితే నిధుల్లో కోత.. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఆర్వీఎంకు నిధుల విడుదల మెరుగుపడినప్పటికీ.. పనితీరును బట్టి నిధులు విడుదల కానున్నాయి. ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఆర్వీఎం లక్ష్యాలు, సాధించిన పురోగతి ఆధారంగా తదుపరి త్రైమాసికానికి నిధులు విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పనితీరులో వెనకబడితే నిధుల విడుదలలో కోతపెట్టనుంది. దీంతో ఆర్వీఎం అధికారుల్లో గుబులు మొదలైంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు నెలలు ఎన్నికల హడావుడిలో కొన్ని కార్యక్రమాలు వెనకబడ్డాయి.అయితే తొలి త్రైమాసికానికి సంబంధించి నిధులు విడుదల చేయకుండా నిల్వ ఉన్న నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే జిల్లా ఆర్వీఎంలో అంతంతమాత్రంగా నిధులుండగా.. ప్రస్తుత నిధులు వినియోగించుకుని ఉద్యోగులకు వేతనాలు అందించారు. ఇందుకు సంబంధించి నివేదికను కేంద్రానికి పంపితే.. రెండో త్రైమాసికానికి సంబంధించిన నిధులు విడుదల కానున్నాయి. కొత్త ప్రణాళికలో ముఖ్యాంశాలివీ.. - 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా ఆర్వీఎంకు రూ.192.69కోట్ల బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. - ఈ ఏడాది విద్యార్థుల యూనిఫాం, పుస్తకాలకు రూ.11 కోట్లు ఖర్చు చేయనున్నారు. - ఉపాధ్యాయులు, కాంట్రాక్టు సిబ్బంది వేతనాల కోసం రూ.80.55 కోట్లు ఖర్చు చేయనున్నారు. - పాఠశాల గ్రాంట్లు, టీచర్ల గ్రాంట్లతో పాటు శిక్షణల కోసం రూ.10 కోట్లు వెచ్చించనున్నారు. - పాఠశాల్లో మౌలికవసతుల కల్పనకు రూ.55కోట్లు ఖర్చు పెట్టనున్నారు. -
260 యూపీ స్కూళ్లలో 8వ తరగతి
శ్రీకాకుళం: జిల్లాలోని 260 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతిని ప్రవేశ పెడుతున్నారు. ఈ మేరకు గురువారం రాజీవ్ విద్యామిషన్ అధికారులకు ఆదేశాలు అం దాయి. అయితే ఉపాధ్యాయ పోస్టులను మాత్రం మంజూరు చేయలేదు. రేషన్లైజేషన్ జరపాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో భవిష్యత్తులో అకడమిక్ ఇనస్ట్రక్టర్లను నియమిం చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో 579 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు 8వ తరగతి వరకు ప్రాథమిక విద్యగానూ, 9 నుంచి ఇంటర్మీడియె ట్ ద్వితీయ సంవత్సరం వరకు ప్రాథమికోన్నత విద్యగానూ నిర్ణయించారు. ఆర్వీఎంకు ప్రాథమిక, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌కు ప్రాథమికోన్నత విద్య బాధ్యతలను అప్పగిం చారు. దశలవారీగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతిని, కొత్తగా నెలకొల్పుతున్న ఉన్నత పాఠశాలల్లో ఇంటర్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది 260 యూపీ స్కూళ్లలో 8వ తరగతిని ప్రవేశపెట్టడం ఆనందదాయకమే అయినప్పటికీ ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయకపోవడం ఆందోళన కలి గిస్తోంది. దీనివల్ల తమపై పనిభారం పెరుగుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధికారులు మాత్రం తొలుత ఉపాధ్యాయ పోస్టులను రేషనలైజ్ చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మార్గదర్శకాలను జారీ చేయకపోవటంతో ఈ ప్రక్రియ మొదలు కాలే దు. దీనివల్ల ఏకోపాధ్యాయ, ఉపాధ్యాయులు లేని పాఠశాలలు తరచూ మూతపడే పరిస్థితి నెలకొంది. విద్యావలంటీర్ల స్థానంలో గత ఏడా ది నుంచి ప్రవేశపెట్టిన అకడమిక్ ఇనస్ట్రక్టర్ పోస్టులను ముందే మంజూరు చేసే అధికారం జిల్లా విద్యాశాఖాధికారులకు లేదు. రేషనలైజేషన్ జరిపితేగానీ ఏ మేరకు ఇనస్ట్రక్టర్ పోస్టులు అవసరమవుతాయో గుర్తించడం కష్టం. ఈ ప్రక్రియను చేపడదామన్నా ప్రభుత్వం నియమ నిబంధనలను వెల్లడించకపోవడంతో అధికారు లు చర్యలు చేపట్టలేకపోతున్నారు. ప్రజాప్రతిని దులు జోక్యం చేసుకొని రేషనలైజేషన్ జరి పించటంతోపాటు ఉపాధ్యాయ పోస్టులు మం జూరు చేయించకపోతే విద్యార్థులు నష్టపోక తప్పదు. -
జీతాలు రాక అల్లాడుతున్న ఆర్వీఎం సిబ్బంది
రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో జిల్లాలో పనిచేస్తున్న 294మంది సి.ఆర్.పిలకు (క్లస్టర్ రిసోర్స్ పర్సన్) గడచిన 2 నెలలుగా జీతాలు రాక అల్లాడుతున్నారు. ఏప్రిల్, మే నెల జీతాలు రాకపోగా, జూన్ నెలలో ఇప్పటికే సగం రోజులు గడచిపోయాయి. సి.ఆర్.పీలతో పాటు జిల్లా వ్యాప్తంగా 50మంది ఎం.ఐ.ఎస్ కో-ఆర్డినేటర్లు, 50మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 50మంది మెసెంజర్లు మొత్తం 444మంది పనిచేస్తున్నారు. వీరందరూ జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి రీజాయినింగ్ ఆర్డరు ఇవ్వకపోవటంతో జీతాలు రావడటం లేదని ఆర్.వి.ఎం ప్రాజెక్టు అధికారిణికి మొరపెట్టుకుంటున్నారు. రాజీవ్ విద్యామిషన్‌లో ఇటీవల పరిపాలనలో నెలకొన్న కొన్ని సంఘటనలు కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు రాకుండా చేశాయని వాపోతున్నారు. ఐ.ఆర్.టి టీచర్లకూ తప్పని కష్టాలు... రాజీవ్ విద్యామిషన్‌లో ప్రత్యేక అవసరాలు కలిగిన బాలలకు (వికలాంగులు) విద్య నేర్పేందుకు శిక్షణ కలిగిన 72మంది ఐ.ఆర్.టి టీచర్లు జిల్లాలోని భవిత కేంద్రాలలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నారు. వీరికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి నాటికి రీజాయినింగ్ ఆర్డర్లు ఇచ్చే వారు. ఈ సంవత్సరం ఇంతవరకూ ఆర్డరు ఇవ్వని కారణంగా వీరికి మే నెల జీతం చేతికందలేదు. అంతేగాక భవిత కేంద్రాల్లో బాలలకు అందించాల్సిన ఉపకరణాలు (చంక కర్రలు, కాలిపర్స్, వినికిడి యంత్రాలు తదితరాలు) ఇంతవరకూ ఆ కేంద్రాలకు చేరలేదు. దీంతో ప్రత్యేకావసరాలు కావలసిన బాలలు ఉసూరుమంటున్నారు. రాజీవ్ విద్యామిషన్‌లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న సి.ఆర్.పీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎం.ఐ.ఎస్ కో-ఆర్డినేటర్లు, మెసెంజర్లు, ఐ.ఆర్.టి టీచర్లుకు వెంటనే రీజాయినింగ్ ఆర్డర్లు అందించి, వారికి వెంటనే జీతాలు చెల్లింపులు చేయాలని సి.ఆర్.పీల సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఎస్.వెంకట్ డిమాండ్ చేశారు. జీతాల్లేక ఉద్యోగులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ పరిస్థితుల పై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. -
సర్కార్ స్కూళ్లలో మెరుగైన విద్య
ఒంగోలు వన్‌టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య బోధించేందుకు రాజీవ్ విద్యా మిషన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ నెల 16 నుంచి జూలై 31వ తేది వరకు సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్వీఎం రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ వీ ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా విద్యార్థుల్లో మాతృభాష(తెలుగు), గణితంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. బడి ఈడు బాలబాలికలందరినీ పాఠశాలలకు ఆకర్షించేలా స్కూళ్లను సిద్ధం చేయాలని చెప్పారు. పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులు చివరి తరగతి వరకు కొనసాగేలా కృషి చేయాలన్నారు. నాలుగు భాషా నైపుణ్యాలు(వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం), గణితంలో చతుర్విద ప్రక్రియల(కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం)పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాలల్లో ఉదయం పూట సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహించి, మధ్యాహ్నం పాఠ్యాంశాలు బోధించాలని సూచించారు. ప్రతి విద్యార్థి తెలుగు, గణితంలో కనీసం ఏ లేదా బీ గ్రేడు సాధించేలా తీర్చిదిద్దాలని చెప్పారు. విద్యార్థులతో రోజూ హోమ్ వర్క్ చేయించడంతో పాటు క్రమశిక్షణను పెంపొందించాలన్నారు. పాఠశాల, తరగతి సంసిద్ధత కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు జిల్లా, మండలస్థాయిల్లో మానిటరింగ్ బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా ప్రాజెక్టు అధికారులను ఉషారాణి ఆదేశించారు. జిల్లా స్థాయిలో డైట్ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉప విద్యాధికారులు, రాజీవ్ విద్యామిషన్ ఏఎంఓలు, ఏఏఎంఓలు, డీఆర్పీలు, జిల్లా స్థాయి మానిటరింగ్ టీం సభ్యులతో బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండల స్థాయిలో ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎమ్మార్పీలు, సీఆర్పీలతో కమిటీలు వేయాలని చెప్పారు. రాష్ట్రస్థాయి బృందాలు పాఠశాల సంసిద్ధత కార్యక్రమాలను పర్యవేక్షిస్తాయని తెలిపారు. సంసిద్ధత కార్యక్రమాలను పక్కాగా నిర్వహించండి జిల్లాలో పాఠశాలల సంసిద్ధత కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని ఎంఈఓలు, హెచ్ఎంలను రాజీవ్ విద్యామిషన్ పీడీ వీ శ్రీనివాసరావు ఆదేశించారు. పాఠశాల సంసిద్ధత కార్యక్రమాల అమలుకు సంబంధించి గత ఏడాది సరఫరా చేసిన మాడ్యూల్స్‌నే ఉపయోగించాలని చెప్పారు. విద్యాపరంగా వెనుకబడిన విద్యార్ధుల కోసం వేసవి సెలవుల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల కోసం పంపిణీ చేసిన వర్క్‌బుక్‌లను ప్రతి పాఠశాలకు ఒకటి చొప్పున సరఫరా చేసి అందులోని అంశాలను విద్యార్థులకు వివరించాలని పీడీ శ్రీనివాసరావు సూచించారు. -
టీచర్ల తాత్కాలిక సర్దుబాటుకు గ్రీన్‌సిగ్నల్
చిత్తూరు(టౌన్): పాఠశాలల్లో టీచర్ల కొరతను తీర్చేందుకు రాజీవ్ విద్యామిషన్ చర్యలు చేపట్టింది. టీచర్లను తాత్కాలికంగా సర్దుబాటు (రేషనలైజేషన్) చేసేందుకు నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాష్ట్ర ఆర్వీఎం అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో దీని వివరాలను జిల్లా విద్యాశాఖ, ఆర్వీఎం అధికారులకు వివరించారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని సర్దుబాటు చేయాలని అధికారులు ఆదేశాల్లో పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో టీచర్లు సరిగ్గా లేనందున విద్యార్థులకు చదువు చెప్పలేకపోతున్నారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తే గానీ జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీరదు. ప్రస్తుతం డీఎస్సీ నిర్వహించే పరిస్థితి లేనందున తాత్కాలిక సర్దుబాటు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల్లోగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటుచేసి వివరాలను రాష్ట్ర కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. రెండు రోజులు సరిపోతుందా? సర్దుబాటు పూర్తి చేయడానికి రెండు రోజులు సరిపోదని, వారం రోజులైనా గడువిస్తే పూర్తి చేయవచ్చని అధికారులు అంటున్నారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ఎక్కువగా సబ్జెక్టు టీచర్లు ఉం డే పాఠశాల నుంచి వీరిని సర్దుబాటు ప్రాతిపదికన వేరే పాఠశాలకు పంపాల్సి ఉంటుంది. సెలవుల్లో అధికారులే సర్దుబాటు చేసేందుకు పూనుకొని వివరాలు తెప్పించేందుకు ప్రయత్నించారు. అయితే క్షేత్ర స్థాయి నుంచి దీనికి పెద్దగా స్పందన రాలేదు. అధికారుల వద్ద జిల్లాలో ఎన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి? టీచర్లు లేని పాఠశాలలు ఎన్ని? ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఎంత ఉంది? అనే వివరాలు పూర్తి స్థాయిలో లేవు. పాఠశాలలు పునఃప్రారంభమైనందున పిల్లల ఎన్రోల్మెంట్పై దృష్టి పెట్టాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎంఈవోల నుంచి వివరాలు తెప్పించుకొని సర్దుబాటు చేయడమనేది కత్తిమీద సామేనని చెప్పొచ్చు. అధికారులకు తలనొప్పులు తప్పవా? తాత్కాలిక సర్దుబాటు చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు జిల్లా విద్యాశాఖ అధికారులకు తలనొప్పులు తీసుకొచ్చేలా ఉంది. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో కొంత మంది ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న చోటు నుంచి వేరే చోటుకు వెళ్లేందుకు జీవోలు తెచ్చుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక సర్దుబాటు కార్యక్రమం వీరికి వరంలా దొరికింది. కొత్తగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీరిని పట్టుకొని తాము కోరుకున్న చోటుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒత్తిళ్లు ఎక్కువైతే నిబంధనలకు అధికారులు తిలోదకాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇటీవల నిర్వహించిన ఎంఈవోల సమావేశంలో తాత్కాలిక సర్దుబాబు చేయాలని డీఈవో ఆదేశాలు ఇవ్వడంతో చాలా మంది తాము కోరుకున్న చోటుకి వెళ్లేందుకు ఒత్తిళ్లు తెచ్చారు. ఇప్పుడు ఉన్నతాధికారులు అధికారికంగా అనుమతి ఇవ్వడంతో అధికార పార్టీ ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. -
రోడ్డున పడేశారు
కంబాలచెరువు (రాజమండ్రి): రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం)లో పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లుగా పనిచేస్తున్న వారు రోడ్డున పడ్డారు. ఆర్ట్, క్రాప్ట్, పీఈటీలుగా జిల్లాలో సుమారు 300 మంది వరకు, రాజమండ్రి అర్బన్‌లో 15 మంది రెండేళ్లుగా పనిచేస్తున్నారు. వీరికి రూ. 4,500 జీతం ఇస్తున్నారు. పేరుకు పార్ట్ టైం అయినా తాము ఫుల్‌టైం సేవలు అందిస్తున్నామని వారు పేర్కొన్నారు. జీతం పెంపుదలకోసం పోరాటం చేయగా రూ. 6 వేలు చేశారు. జీతం పెంచినట్టే పెంచి మా అందర్నీ ఇప్పుడు రోడ్డున పడేశారని వారు వాపోతున్నారు. ఈ విద్యాసంవత్సరంనుంచి తిరిగి ఆ ఉద్యోగాలకు వారిని దరఖాస్తు చేసుకోమంటున్నారు. కొత్తవారితో కలసి వారు ఆ పోస్టుకోసం పోటీపడాలి. అతి తక్కువ జీతంతో పనిచేసిన తమను ఇలా వీధిపాలు చేయడం సబబు కాదని వారందరూ ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. తెలంగాణాలో గతంలో పనిచేసిన ఇన్స్ట్రక్టర్లను యథావిధిగా విధుల్లో కొనసాగుతున్నారని, ఆంధ్రాలో దీనికి వ్యతిరేకంగా ఉందన్నారు. తాము చేసిన ఉద్యోగాలను ఇప్పించి ఆ తర్వాతే కొత్తవారిని విధుల్లోకి తీసుకోవాలని వారు అభ్యర్థిస్తున్నారు. ఇంత అన్యాయమా.. రెండేళ్లుగా తక్కువ జీతంతో పనిచేయించుకుని జీతాలు పెరి గిన తర్వాత మమ ల్ని పక్కకు నెట్టేయడం చాలా అన్యా యం. మాకు పని అనుభవం ఎంతో ఉంది. తిరిగి కొత్తవారితో దరఖాస్తు చేసుకోమంటున్నారు. అది దారుణం. - పి.దుర్గాప్రసాద్ మమ్మల్ని ఆదుకోవాలి మాతో ఇప్పటివరకు వెట్టిచాకిరీ చేయించుకుని కూరలో కరివేపాకులా ఇప్పుడు తొలగించారు. ఇన్నాళ్లూ మేం చేసిన సేవను గుర్తించరా? ఇదెక్కడిన్యాయం. మేం ఎక్కడికి వెళ్లాలి. ఈ ఉద్యోగంపైనే నమ్మకం పెట్టుకుని బతుకుతున్నాం. - డి. సలోమి