
సమస్యల వలయం
భానుగుడి (కాకినాడ) :బోధించడానికి అయ్యవార్లు లేరు.. శ్రద్ధగా చదువుదామనుకుంటే తరగతి గదులు లేవు.. ఉన్నచోట కూడా శిథిల భవనాలే దిక్కు.. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు అసలే లేవు.. జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇదే దుస్థితి. ఇటువంటి అసౌకర్యాల నడుమ గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
ఇవీ సమస్యలు..
జిల్లాలో వెయ్యికి పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనిపై డీఈవో ఉన్నతాధికారులకు నివేదించారు.జిల్లాలో ఉపాధ్యాయులు లేని పాఠశాలలు 105 ఉండగా, 670 పాఠశాలలు ఒకే ఒక్క ఉపాధ్యాయునితో నడుస్తున్నాయి.తరగతి గదుల నిర్మాణానికి రాజీవ్ విద్యామిషన్ దండిగా నిధులు మంజూరు చేసినా, ఇప్పటికీ 300 పాఠశాలలకు తరగతి గదులే లేవు.
ప్పటికీ 202 పాఠశాలలకు తాగునీరు, 332 పాఠశాలలకు విద్యుత సౌకర్యాలు లేవు.
3,377 పాఠశాలల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండగా, 822 పాఠశాలల్లో లేవు. ఉన్నవాటిలో కూడా 2,865 పాఠశాలలకు నీటి సౌకర్యం లేదు.3,111 పాఠశాలల్లో బాలికలకు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండగా, వీటిల్లో 2,418 చోట్ల నీటి సౌకర్యం లేదు.ఇప్పటికీ 3,506 పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ లేదు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా ఇప్పటి వరకూ 127 పాఠశాలల్లోను, దాతల సహకారంతో మరో 500 పాఠశాలల్లోను కంప్యూటర్లు ఏర్పాటు చేశారు.ఇప్పటికీ 1976 పాఠశాలల్లో వికలాంగ విద్యార్థుల కోసం ర్యాంపులు నిర్మించలేదు.
మారిన సిలబస్‌పై శిక్షణేది?
ఈ ఏడాది 8, 9, 10 తరగతుల సిలబస్ పూర్తిగా మారిపోయింది. దీనిపై ఈ నెల 16 నుంచి 26 వరకూ బ్యాచ్‌లవారీగా ఒక్కో రోజు శిక్షణ ఇవ్వనున్నారు. పాఠశాలలు ప్రారంభం కాకముందు ఇవ్వాల్సిన శిక్షణ ఇప్పుడు ఇవ్వడమేమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క కొత్త సిలబస్‌పై ఒక రోజు శిక్షణ సరిపోదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. కాగా, ఇప్పటివరకూ జిల్లాకు 29.80 లక్షల పుస్తకాలు రాగా, వీటిల్లో 15.80 లక్షల పుస్తకాలు విద్యార్థులకు అందించారు.
అన్ని ఏర్పాట్లూ చేశాం
పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. సమస్యలున్న పాఠశాలలను గుర్తించి తగిన సౌకర్యాలు కల్పించాం. 96 శాతం పాఠశాలలకు ఎటువంటి సమస్యలూ లేకుండా చేశాం. ఎంఈవోల నుంచి నివేదికలు రప్పించుకుని సమీక్షించి, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశాం. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు తదితర ఇబ్బందులు ఉంటే రాజీవ్ విద్యామిషన్ ద్వారా మంజూరైన రూ.15 వేలు వినియోగించాలని ఆదేశించాం.
- కేవీ శ్రీనివాసులురెడ్డి,
జిల్లా విద్యాశాఖాధికారి