రాజీవ్ ‘వృథా’మిషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరుగుదొడ్లు లేని పాఠశాలలు 50 వేలు... ఉన్నా వాడటానికి అనువైన స్థితిలో ఉన్న స్కూళ్లు 30 వేలు మాత్రమే.. బాలికలు అధికంగా ఉన్న స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించడానికి వుహాఅరుుతే రూ. 100 కోట్లు అవసరం అవుతాయి. అయితే నిధుల కొరతవల్ల ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నారంటే పొరబడ్డట్లే! రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) కింద రూ.2,500 కోట్లున్నారుు. కానీ ఈ నిధులను అవసరమైనవాటికోసం కాకుండా ముఖ్యమంత్రి పర్యటనలకు, కలెక్టర్ల క్యాంపు ఆఫీసుల్లో టీవీలకు, సెల్‌ఫోన్ల కొనుగోలుకు, వాహనాల అద్దెలకు, విలాసాలకు వృథాగా ఖర్చు చేస్తున్నారు.
చివరకు మినరల్ వాటర్ కొనుగోలుకూ పిల్లల విద్యానిధుల్నే తాగేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్వీఎం నిధులు ఏతీరుగా దుర్వినియోగం అయ్యాయో తెలిపే నివేదికను ‘సాక్షి’ సంపాదించింది. ఆర్వీఎంకు సంబంధంలేని కార్యకలాపాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని ఆ నివేదిక లో వెల్లడైంది. శాఖాపరమైన సమీక్షలోనే కళ్లుతిరిగే ‘ఖర్చు లు’ బయటపడితే ఇక ... స్వతంత్ర విచారణ జరిగితే భారీ కుంభకోణాలు బయటకువస్తాయని అధికారులంటున్నారు.
నిధుల దుర్వినియోగంలో మచ్చుకు కొన్ని..
ప్రకాశం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం మరమ్మతులు, టీవీలు, కంప్యూటర్ల కొనుగోలుకు ఆ జిల్లా ఆర్వీఎం ప్రాజెక్టు ఆఫీసర్ (పీవో) రూ. 70 లక్షలు విడుదల చేశారు.
కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ కారు ఇంధనానికి రూ. 2 లక్షల ఆర్వీఎం నిధులను వాడారు. ఇదే జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన కోసం డీఆర్డీఏ పీడీ ఖాతాకు రూ. 5 లక్షలు జమ చేశారు. కిందిస్థాయి అధికారుల వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులు మళ్లించకూడదని నిబంధన ఉన్నా.. ఇదే జిల్లాలో ఒక అధికారి ఖాతాకు రూ. 7 లక్షలు బదిలీ చేశారు.
విశాఖ జిల్లాలో పలువురు సెక్టోరియల్ అధికారులకు రూ. 40 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారు.
అనంతపురం జిల్లాలో సంబంధిత శాఖ మంత్రి ప్రొటోకాల్ చార్జీల కోసం రూ. 5.50 లక్షలు ఖర్చు చేసినట్లు చూపించారు.
విజయనగరం జిల్లా పీవో ఆర్వీఎం నిధులతో ఖరీదైన సెల్‌ఫోన్ కొన్నారు. ఉన్నతాధికారులు గుర్తించి అడిగినా లక్ష్యపెట్టలేదు. బదిలీ అయినప్పుడు ఆ ఫోన్‌ను అప్పగించనూలేదు.
వైఎస్సార్ జిల్లాలో ఓ మంత్రి (ఇప్పుడు మాజీ) ఆఫీస్‌లో ఉద్యోగులకు ఆర్వీఎం నిధుల నుంచి జీతాలు చెల్లించారు. ఇదే జిల్లా పీవో తన పేరిట రూ. 4 లక్షలు తీసుకొని తిరిగి చెల్లించలేదు.
వరంగల్ జిల్లాలో వివిధ బిల్లులను కలెక్టర్ అనుమతి లేకుండా పీవో సొమ్ము చేసుకున్నారు. రూ. లక్ష దాటిన బిల్లులనే కలెక్టర్‌కు పంపించాలనే నిబంధన ఉండటంతో, బిల్లులను విభజించి గరిష్ట పరిమితి దాటకుండా జాగ్రత్తపడ్డారు. నల్లగొండ పీవో కూడా ఇదే విధంగా సొమ్ము చేసుకున్నారు.
ఖమ్మం జిల్లా పీవో అనుమతి లేని పనులకు రూ. 18 లక్షలు ఖర్చు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రికా ర్డు రూమ్ మరమ్మతుల కోసం 3 లక్షలు కేటాయించారు.
జనాల సమీకరణ కోసం చిత్తూరు పీవో రూ. 4 లక్షలు ఖర్చు పెట్టారు. ఆర్వీఎంలో ఇలా నిధులు ఖర్చు చేయడానికి అవకాశం లేదు. అన్ని జిల్లాల్లో కలిపి జన సమీకరణ కోసం రూ. 2 కోట్లకుపైగా ఖర్చు చేశారు.
గుంటూరు జిల్లాలో బోయపాలెం డైట్ ప్రిన్సిపాల్ వాహన అద్దె కోసం ఏకంగా రూ. 4 లక్షలు ఆర్వీఎం నిధులను చెల్లించారు.
పలు జిల్లాల్లో కలెక్టర్, పీవో కార్యాలయాల్లో మినరల్ వాటర్ కొనుగోలుకు ఆర్వీఎం నిధుల నుంచి లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు.