సాక్షి, సంగారెడ్డి: బడి బయటి బాలలు బడి బాట పట్టడం లేదు. విద్యా సంవత్సరం ముగింపునకు వచ్చినా ఇంత వరకు బడిలో చేరలేదు. ఏటా రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) బడీడు బాలబాలికలను గుర్తించడానికి సర్వే జరుపుతోంది. గత విద్యా సంవత్సరం సర్వే ప్రకారం జిల్లాలో 2,409 మంది బాలబాలికలు బడి బయట ఉండగా.. అందులో 613 మంది బాలలనే తిరిగి పాఠశాలల్లో చేర్పించారు. ప్రత్యేక శిక్షణ లేకుండా నేరుగా బడిలో చేర్పించడంతో ఆ విద్యార్థుల్లో కొంతమంది పారిపోయారు. ఇక అడ్డగోలు కారణాలు చూపి మిగిలిన ఏకంగా 1,796 మంది బాలలను ఆర్వీఎం యంత్రాంగం వదిలించుకుంది. ఆర్వీఎం ప్రణాళిక ప్రకారం బడి బయటి బాలలను గుర్తించిన తర్వాత వారిని రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు(ఆర్‌ఎస్‌టీఎస్), నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు(ఎన్‌ఆర్‌ఎస్‌టీఎస్)లో చేర్పించి కొన్ని నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.
శిక్షణ అనంతరం ప్రధాన స్రవంతిలోని పాఠశాలల్లో చేర్పిస్తేనే ఫలితాలొస్తాయి. అయితే, ఈ విద్యా సంవత్సరంలో ఆర్‌ఎస్‌టీఎస్, ఎన్‌ఆర్‌ఎస్‌టీఎస్ సెంటర్లతో పాటు వర్క్ సైట్ స్కూళ్లను ఏర్పాటు చేయలేదు. ఆర్‌ఎస్‌టీఎస్, ఎన్‌ఆర్‌ఎస్‌టీఎస్‌ల ఏర్పాటుకు కేటాయించిన నిధులను దారిమళ్లించి ఇతర అవసరాల కోసం వినియోగించుకోవడంతో బడీడు బాలల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. వయస్సు మీరిపోయారని, వయస్సు తక్కువగా ఉందని, అనారోగ్యంతో ఉన్నారనే కారణాలు చూపి బడి బయట ఉండిపోయిన 1,796 మంది బాలలను గాలికి వదిలేయడంతో అసలు సర్వే ఉద్దేశం నెరవేరలేదు. ఇదిలా ఉండగా.. ఈ విద్యా సంవత్సరంలో బడి బయటి బాలలపై ఆర్వీఎం చేపట్టిన సర్వే ఇంకా పూర్తి కాలేదు.
‘విద్యా హక్కు’కు తూట్లు
బడి బయటి బాలల సంక్షేమం కోసం మంజూరైన నిధులను దారిమళ్లించి ఉపాధ్యాయుల్లేని పాఠశాలల్లో నియమించిన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు వేతనాలను చెల్లిస్తున్నారు. ఆర్‌ఎస్‌టీఎస్‌ల ఏర్పాటుకు మంజూరైన రూ.58 లక్షల బడ్జెట్‌తో 234 మంది అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు వేతనాలిస్తున్నారు. ఈ నిధులతో 201 మంది అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను ఉర్దూ మీడియం, 33 మందిని తెలుగు మీడియం బడుల్లో నియమించారు. ఇక ఎన్‌ఆర్‌ఎస్‌టీఎస్ కింది విడుదలైన రూ. 24 లక్షల బడ్జెట్‌తో తెలుగు మీడియం పాఠశాలల్లో మరో 16 మంది అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించి వేతనాలిస్తున్నారు. ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడంలో తీవ్ర జాప్యం చేసిన సర్కారు.. ఆ లోటు తీర్చుకోడానికి బడి బయటి బాలల భవితవ్యంపై వేటేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ అంశంపై వివరణ కోసం జిల్లా విద్యాశాఖాధికారి గాజర్ల రమేశ్‌ను ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.
బడి బాట ‘మళ్లింపు’!
Published Thu, Jan 2 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement