పిల్లల ఇష్టాలను గుర్తించకపోతే నష్టమే..! | Why Parents Should Never Imposing Your Dreams Experts Said | Sakshi
Sakshi News home page

పిల్లల ఇష్టాలను గుర్తించకపోతే నష్టమే..! హెచ్చరిస్తున్న నిపుణులు

Published Tue, Apr 15 2025 10:23 AM | Last Updated on Tue, Apr 15 2025 11:29 AM

Why Parents Should Never Imposing Your Dreams Experts Said

గూడూరుకు చెందిన రాజేష్‌కు ఆర్ట్స్‌ గ్రూపు అంటే ఇష్టం. చిన్నతనం నుంచే సోషియల్‌పై మంచి పట్టుసాధించాడు. గ్రూప్సు రాయాలనేది అతని కోరిక. పది పూర్తయ్యాక ఆర్ట్స్‌ గ్రూపులో చేరాలనుకున్నాడు. అయితే ఇంట్లో పెద్దల బలవంతంతో ఎంపీసీలో చేరాడు. ఇష్టం లేని గ్రూపును సరిగా చదవలేక ఫెయిలయ్యాడు.  

తిరుపతికి చెందిన విద్యాసాగర్‌కు చిన్నతనం నుంచే చార్టెడ్‌ అకౌంటెంట్‌ చేయాలన్నది కోరిక. పది పూర్తయ్యాక ఎంఈసీలో చేరాలనుకున్నాడు. తల్లిదండ్రులేమో తమ కొడుకును ఇంజినీరుగా చూడాలనుకున్నారు. తమ అభిప్రాయాన్ని పిల్లాడిపై రుద్ది బలవంతంగా ఎంపీసీలో చేరి్పంచారు. అయిష్టంతోనే ఎంపీసీ పాస్‌ మార్కులతో గట్టెక్కాడు. ఇంజినీరింగ్‌లో సీటు రాకపోవడంతో డిగ్రీలో ఆర్ట్స్‌ గ్రూపును తీసుకున్నాడు. 

పుత్తూరుకు చెందిన దీపికకు చిన్నప్పటి నుంచే మ్యాథ్స్‌ అంటే ఇష్టం. ఇంజినీరింగ్‌ చేయాలన్నది ఆమె కోరిక. తల్లిదండ్రులకేమో తన కుమార్తెను డాక్టరుగా చూడాలనుకున్నారు. డాక్టరును చేయాలనే తపనతో బైపీసీలో బలవంతంగా చేరి్పంచారు. పాస్‌మార్కులతో గట్టెక్కెడంతో మెడిసిన్‌లో సీటు రాలేదు. అప్పటికిగాని తల్లిదండ్రులు తమ తప్పును తెలుసుకోలేకపోయారు.

సూళ్లూరుపేటకు చెందిన మనోజ్‌కుమార్‌ సాధారణ విద్యార్థి. పదోతరగతి పాస్‌ మార్కులతో గట్టెక్కాడు. గణితం, సైన్సు సబ్జెక్టులపై పట్టు లేదు. అయితే స్నేహితులు ఎంపీసీ, బైపీసీ తీసుకోవడంతో తాను గొప్పగా చెప్పుకోవడానికి ఎంపీసీని ఎంచుకున్నాడు. సబ్జెక్టులు కష్టం కావడంతో ఇంటర్‌ తప్పాడు. ఏం చేయాలో తెలియక చదువును పక్కనబెట్టాడు. 

వీరే కాదు.. ఇలా తిరుపతి జిల్లాలో చాలా మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఆ ఒక్క జిల్లాలోనే కాదు చాలాచోట్ల ఇదే పెను సమస్య. ఇష్టమైన సబ్జెక్టుపై మక్కువ పెంచుకుని అందులో రాణించాలనుకున్న చాలా మంది విద్యార్థులకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆలోచనలు, అభిప్రాయాలతో రాణించలేకపోతున్నారు. ఇంటర్‌ ప్రవేశం సమయంలో తల్లిదండ్రుల బలవంతంతో కొందరు, గొప్పగా చెప్పుకోవాలనే ఆలోచనతో మరికొందరు ఇష్టం లేని గ్రూపుల వైపు అడుగులేసి చతికిలపడుతున్నారు. తిరిగి సాధారణ చదువులను కొనసాగిస్తున్నారు.  

విద్యార్థి దశలో ఇంటర్‌ కీలకం. ఈ దశలో పడిన అడుగు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పది పరీక్షలు రాసి ఇంటర్‌ ప్రవేశాల కోసం వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. పిల్లల ఆసక్తిని తెలుసుకుని ప్రోత్సహించాలి. అప్పుడే పిల్లలు వారు కలలుగన్న రంగంలో రాణించగలుగుతారు.   

ఇష్టాన్ని గుర్తించాలి 
పిల్లల ఇష్టాలను పక్కనబెట్టి డాక్టర్, ఇంజినీర్‌ చేయాలని తల్లిదండ్రులు కలలుకంటున్నారు. తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దుతున్నారు. మేము చెప్పే కోర్సులను తీసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తమ కోర్కెలను పక్కనబెట్టి తల్లిదండ్రులు చెప్పిన కోర్సులో చేరి రాణించలేకపోతున్నారు. పిల్లల ఇష్టాన్ని గుర్తించినప్పుడే రాణిస్తారన్న సత్యాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలని మానసిక శాస్త్రవేత్తలు హితవు పలుకుతున్నారు.   

స్వేచ్ఛనివ్వాలి 
జిల్లాలో పదోతరగతి పరీక్షలను ఈ ఏడాది 52,065మంది విద్యార్థులు రాశారు. వీరిలో కొందరు ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల్లో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇంకొందరు ప్రభుత్వ కళాశాలల్లో చేరనున్నారు. మరికొందరు పాలిటెక్నిక్, ఏపీఆర్‌జేసి వంటి పోటీ పరీక్షల ద్వారా ఆయా కోర్సుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పాస్‌ మార్కులతో గట్టెక్కిన విద్యార్థులు తక్కువ సమయంలో ఉపాధి లభించే ఐటీఐ, ఒకేషనల్‌ కోర్సులను ఎంచుకుంటున్నారు. 

సామర్థ్యాన్ని అంచనా వేసుకుని ఇప్పటికే విద్యార్థులు ప్రణాళిక రచించుకున్నారు. ఇలాంటి సమయంలో ఏది ఉత్తమం, ఏ కోర్సులు తీసుకోవాలి వంటి సలహాలు ఇవ్వడం వరకే తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావించాలి. అంతేతప్ప ఇష్టాలను రుద్దడం చేయకూడదని, గ్రూపుల ఎంపికలో పిల్లలకే స్వేచ్ఛనివ్వాలని నిపుణులు చెబుతున్నారు.  

నచ్చిన గ్రూపులోనే చేర్పించాలి 
పది తరువాత ఇంటర్‌ ప్రవేశంలో పిల్లలకే స్వేచ్ఛనివ్వాలి. వారికి నచ్చిన గ్రూపులో చేరేందుకు సహకరించాలి. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను చెప్పడం వరకే సరిపెట్టుకోవాలి. అంతేతప్ప ఇరుగుపొరుగు పిల్లలతో పోల్చుతూ బలవంతం చేయకూడదు.            
–డాక్టర్‌ ఎన్‌.విశ్వనాథరెడ్డి, విద్యావేత్త, తిరుపతి 

బలవంతం వద్దు 
పిల్లల చదువు విషయంలో పెద్దలు బలవంతం చేయకూడదు. మన ఆలోచనలను వాళ్లపై రుద్దకూడదు. సమాజంలో ఇంజినీరింగ్, మెడిసిన్‌ రంగాలే కాదు... ఇంకా న్యాయ, విద్య, మేనేజ్‌మెంట్‌ వంటి చాలా రంగాలున్నాయి. తగిన కోర్సులకు ప్రాధాన్యత ఇస్తేనే వారు రాణించగలుగుతారు. 
– శ్రీధర్, కెరీర్‌ గైడెన్స్‌ నిపుణులు, తిరుపతి  

(చదవండి: ఖండాంతరాలు దాటిన నృత్యం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement