‘మావాడు మేం చెప్పేది అస్సలు వినడండీ. ఎప్పుడూ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అంటుంటాడు. వాళ్లందరూ ఒక గ్యాంగయ్యారు. బైక్‌తో రిస్కీ ఫీట్స్ చేస్తుంటారు. ఎప్పుడేం తెచ్చుకుంటారోనని గుండె అదురుతుంటుంది..’
‘మా పాప మేమేం చెప్పినా పట్టించుకోదండీ. ఫ్రెండ్స్ చెప్తే మాత్రం వెంటనే చేసేస్తుంది. తనకు నచ్చేలా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు.’
‘మా అబ్బాయి ఒకరోజు చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాడు, మరుసటి రోజే డల్‌గా కనిపిస్తాడు. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాడు.’
కౌన్సెలింగ్‌కు వచ్చే చాలామంది పేరెంట్స్ తమ టీనేజ్ పిల్లల గురించి చెప్పే మాటలవి.
చిన్నప్పటి నుంచీ అమ్మ కూచిలా లేదా నాన్న బిడ్డలా ఉన్న పిల్లలు, అప్పటివరకు తమ అభిప్రాయలను గౌరవించి, తాము చెప్పే సూచనలు పాటించే పిల్లలు ఒక్కసారిగా మారేసరికి పేరెంట్స్ తట్టుకోలేరు. వారెక్కడ చేజారిపోతారోనని బాధపడుతుంటారు, ఆందోళన చెందుతుంటారు.
కానీ, ఆ వయసుకు అది సహజం. టీనేజ్‌కు వచ్చేసరికి వారి ప్రపంచం కుటుంబాన్ని దాటి విస్తృతమవుతుంది. ఈ దశలో స్నేహితులు, ఆన్‌లైన్ కమ్యూనిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్ మాటలకే ఎక్కువ విలువిస్తారు. స్నేహితుల ఆమోదం, గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తారు.
ఈ మార్పును అర్థం చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులు.. సున్నితమైన ఈ దశలో పిల్లలకు సరైన మద్దతు అందించగలుగుతారు.
పీర్ ప్రెజర్..
స్నేహితుల ఆమోదం పొందాలనే ఒత్తిడి అందరిపైనా ఉంటుంది. కానీ టీనేజ్‌లో ఎక్కువగా ఉంటుంది. టీనేజర్లు ఒక గ్యాంగ్‌లో చేరేందుకు ప్రయత్నిస్తారు. ఆ వయసులో అది అత్యవసరమనిపిస్తుంది. ఆ స్నేహితుల ఒత్తిడికి లోనైనప్పుడు తప్పులు చేసే అవకాశాలు పెరుగుతాయి. కొందరు టీనేజర్లు మితిమీరి ప్రవర్తించవచ్చు. మద్యం సేవించడం, ప్రమాదకరమైన ఫీట్స్ చేయడం, విచిత్రమైన వేషధారణలోనూ కనిపించవచ్చు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి, తల్లిదండ్రులు సంయమనంతో ఉండటం ముఖ్యం. పీర్ ప్రెజర్ గురించి పెద్దలతో స్వేచ్ఛగా మాట్లాడగలిగే వాతావరణాన్ని కల్పించాలి. పిల్లలతో చర్చించి, వారి నిర్ణయాలపై గల ప్రభావాన్ని అర్థంచేయించేందుకు ప్రయత్నించాలి. స్నేహితులకు ‘నో’ చెప్పగలిగే ధైర్యాన్ని నేర్పాలి.
సోషల్ మీడియా ప్రభావం..
స్నేహితుల ఒత్తిడి కేవలం పాఠశాల సమయంతో ఆగిపోదు. ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా ద్వారా 24/7 కొనసాగుతుంది. ఇవి తమ వ్యక్తీకరణకు ఎంత ఉపయోగపడతాయో, అంతే నెగటివ్ ప్రభావాన్నీ చూపించే సామర్థ్యం గలవి. సోషల్ మీడియాలో ఇతరులను చూస్తూ, పోల్చుకోవడం వల్ల కొందరు టీనేజర్లు ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. పోస్టులకు లైకులు, కామెంట్ల ద్వారా వెంటనే గౌరవాన్ని పొందాలనుకునే తీరు కూడా వారిని కుంగిపోయేలా చేయవచ్చు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఈ ఒత్తిడిని తల్లిదండ్రులు గ్రహించి, వారితో మాట్లాడాలి. వారు చూస్తున్న కంటెంట్ గురించి చర్చించాలి. అది నిజ జీవితాన్ని ప్రతిబింబించదని వారికి అర్థమయ్యేలా వివరించాలి.
నిర్ణయాలు, ఆత్మగౌరవం
స్నేహితులు, సోషల్ మీడియా ఒత్తిడికి లోనైనప్పుడు టీనేజర్లు ఏ మాత్రం ఆలోచించకుండా ఎమోషన్‌తో నిర్ణయాలు తీసుకుంటారు. లో సెల్ఫ్ ఎస్టీమ్‌తో ఉంటే వారు మరింతగా స్నేహితుల ఒత్తిడికి లోనవుతారు. పిల్లల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించడం అత్యంత కీలకం. తల్లిదండ్రులు ఆ బాధ్యతను తీసుకోవాలి. పిల్లలు తమ ప్రతిభను గుర్తించేలా చేయాలి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. ప్రతిరోజూ వారి అభిరుచులు, కష్టాలను గుర్తిస్తూ విజయం దిశగా వారిని ప్రోత్సహించాలి.
తల్లిదండ్రులు చేయాల్సింది..
యవ్వనంలో, స్నేహితుల ఒత్తిడి సహజమే. కానీ, మీరు సున్నితంగా, ప్రేమతో పిల్లలకు మార్గనిర్దేశం చేస్తే, వారు సంయమనం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అందుకు మీరు చేయాల్సింది..
పిల్లలకు మీరెప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పాలి. వారు తమ సమస్యలు మీతో పంచుకునేలా నమ్మకాన్ని కలిగించాలి.
ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించడం, స్నేహితుల ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలను నేర్పాలి.
సోషల్ మీడియా కంటెంట్ గురించి ఓపికగా చర్చించాలి.
వారి కృషి, కష్టాలు, ప్రత్యేకతలను గుర్తించి ప్రశంసించాలి.
వారు తీసుకునే నిర్ణయాల ఫలితాలను అర్థంచేసుకోవడంలో వారికి సహాయం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment