కవిత, కుమార్‌లకు మూడేళ్ల కిందట వివాహమైంది. మొదట్లో చిలకాగోరింకల్లా ఉండేవారు. కాలం గడిచేకొద్దీ వారి వైవాహిక బంధంలో ఉక్కపోత మొదలైంది. కవిత వస్త్రధారణ నుంచి ఆమె స్నేహితుల వరకు అంతా తనకు నచ్చినట్లే ఉండాలంటాడు కుమార్. అలా లేకుంటే ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఇది కవితకు నచ్చడంలేదు. క్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దాన్ని సరిచేసుకునేందుకు కుమార్ ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. ఏం చేయాలో అర్థంకాక కవిత కౌన్సెలింగ్‌కు వెళ్లింది.
కాలంతో పాటు మారని మనుషులు..
మన దేశంలో భర్తంటే భరించేవాడు. కుటుంబంలో భర్తదే ప్రధానపాత్ర. అతని మార్గాన్నే భార్య అనుసరించాలి. కాలం మారినా, పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా చాలామంది పురుషులు తమ ఆధిపత్యమే సాగాలనే భావజాలంలోనే ఉంటున్నారు. కుమార్‌దీ అదే బాట. అందుకే తన భార్య తనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు, అలా కోరుకోవడంలో తప్పు లేదనుకుంటున్నాడు. ఆ క్రమంలో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కవిత తన మనసులోని మాట చెప్పలేకపోతోంది. దాంతో మనసులో అసహనం, కోపం పెరిగిపోతున్నాయి. ఆ నేపథ్యంలోనే కౌన్సెలింగ్‌కు వెళ్లింది. ఆమె చెప్పినదాన్ని బట్టి వారికి ‘హెల్దీ బౌండరీస్’ గురించి అవగాహన లేదని తెలిసింది.
సరిహద్దులు అవసరం..
భార్య అయినంత మాత్రాన తన మాట తప్పక వినాలని, భర్త అయినంత మాత్రాన తాను చెప్పినట్లే నడుచుకోవాలని అనుకోవడమే జంటల మధ్య చాలా సమస్యలకు కారణం. ఏ బంధంలోనైనా బౌండరీస్ అవసరం. సరిహద్దులు అనేవి మన శారీరక, మానసిక వెల్ బీయింగ్‌ను కాపాడుకోవడానికి మన చుట్టూ గీసుకునే అదృశ్య రేఖలు. అవసరాలు, అంచనాలు, ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఏమిటో తెలియజేసే చర్యలు. ప్రతి జంటకూ హెల్దీ బౌండరీస్ గురించిన అవగాహన అవసరం.
⇒ ప్రతి వ్యక్తికీ తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు ఉంటాయి. వాటిని గుర్తించి, గౌరవించినప్పుడే బంధం బలపడుతుంది. అది సంప్రదాయాన్ని తిరస్కరించడం కాదు. బంధం మరింత బలపడటానికి మార్గం.
⇒ ‘నువ్వలా చేస్తున్నావు’, ‘నువ్విలా అంటున్నావు’ అని కాకుండా.. ‘నేనిలా అనుకుంటున్నాను’, ‘నేనిలా ఫీలవుతున్నాను’ అని మాట్లాడటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.
⇒ ఒక వ్యక్తిని గౌరవించడమంటే వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం. భార్యకు లేదా భర్తకు కూడా పర్సనల్ స్పేస్ ఉంటుందని గుర్తించడం.
⇒ సంప్రదాయానికి, స్వేచ్ఛకు మధ్య సమతౌల్యం సాధించాలి. అది ఒకరి పట్ల మరొకరికి అవగాహనను, నమ్మకాన్ని పెంచుతుంది.
⇒సరిహద్దులను సెట్ చేయడం సవాలే. భాగస్వామి ఒప్పుకోకపోవచ్చు. అది మీ బాధ్యత కాదు. మీ అంచనాలకు అనుగుణంగా స్థిరంగా ఉండండి.
⇒హద్దులు దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో నిర్ణయించుకోండి. పరస్పర చర్చల ద్వారా హద్దులను సర్దుబాటు చేసుకోండి.
వీటిని కవిత, కుమార్‌లకు మూడు సెషన్లలో వివరించి, వారి మధ్య ఉన్న అపోహలను తొలగించి, ఓపెన్ కమ్యూనికేషన్ డెవలప్ అయ్యేలా కొన్ని ఎక్సర్‌సైజ్‌లు చేయించారు. ఇప్పుడిద్దరూ చిలకాగోరింకల్లా ఉంటున్నారు.
రకరకాల హద్దులు..
- శరీరానికి, గోప్యతకు సంబంధించినవి ఫిజికల్ బౌండరీస్. బహిరంగ స్థలాల్లో ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం ఇష్టం లేకపోతే ఆ నిర్ణయాన్ని భాగస్వామి గౌరవించాలి.
- మీ సమయాన్ని ఎలా నిర్వహించుకుంటారనేది మీ టైమ్ బౌండరీస్‌పై ఆధారపడి ఉంటుంది. గడపాల్సిన సమయానికి పరిమితులు పెట్టడం, మీకోసం సమయం కేటాయించుకోవడం అందులో భాగం.
- భావాలు, భావోద్వేగాలకు సంబంధించినవి ఎమోషనల్ బౌండరీస్. ఇతరుల భావోద్వేగాలకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవడం ఇందులో భాగం.
- ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినవి ఫైనాన్షియల్ బౌండరీస్. మీ ఆర్థిక స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం ఇందులో భాగం.
శృంగారంలోనూ సరిహద్దులుండాలి. అసౌకర్యంగా అనిపించే వాటికి నో చెప్పాలి.
- మానసిక శక్తి తగ్గించే చర్చలు నిరాకరించే హక్కును, నెగటివిటీ లేదా గ్యాస్‌లైటింగ్ నుంచి మీ మనస్సును కాపాడుకోవడమే మానసిక సరిహద్దు.
మీ ఆన్‌లైన్ వ్యవహారాలు ఎలా ఉండాలో నిర్ణయించేది డిజిటల్ బౌండరీసే!
Comments
Please login to add a commentAdd a comment