Visesh
-
తప్పక నేర్చుకోవాల్సిన 7 నైపుణ్యాలు
వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో టీనేజర్లు సంతోషంగా ఉండాలంటే, సక్సెస్ సాధించాలంటే కేవలం మార్కులు, ర్యాంకులు, సోషల్ మీడియా లైకులు, ఫాలోయింగ్లు మాత్రమే సరిపోవు. వాటికి మించి ఏడు నైపుణ్యాలు అవసరం. అవేమిటో ఈ రోజు తెలుసుకుందాం.ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే తన భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, నియంత్రించడం, అలాగే ఇతరుల భావాలను అంగీకరించడం. కౌమారంలో భావోద్వేగాలు చాలా వేగంగా మారుతుంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే ఈక్యూ అవసరం. తమ బంధాలను నిలబెట్టుకోవడంలో, ఒత్తిడిని నిర్వహించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఈక్యూను అభివృద్ధి చేసుకున్న టీనేజర్లు ఆరోగ్యకరమైన బంధాలు ఏర్పరచుకుంటారు. వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు.టైమ్ మేనేజ్మెంట్స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా వరకు టీనేజర్లను పక్కదారి పట్టించే అంశాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ డిస్ట్రాక్ష¯Œ ్స నుంచి తప్పించుకుని చదువుపై, కెరీర్ పై ధ్యాస నిలపాలంటే టైమ్ మేనేజ్మెంట్ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే. తమ పనులను ప్రాధాన్యక్రమంలో అమర్చుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది. ప్రణాళికలను రూపొందించుకుని, లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకున్న టీనేజర్లు తమ బాధ్యతలను బ్యాలె¯Œ ్స చేసుకుంటారు. ఒత్తిడి లేకుండా ఉత్సాహంగా తమ లక్ష్యాలను సాధిస్తారు.క్రిటికల్ థింకింగ్ఈ రోజుల్లో సమాచారం సులువుగా లభిస్తోంది. అందులో ఏది నమ్మదగినదో, ఏది కాదో చెప్పలేం! అందుకే క్రిటికల్ థింకింగ్ అవసరం. ఇది టీనేజర్లలో స్వతంత్రతను పెంచుతుంది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, అనుసరించకుండా, విశ్లేషించి, వివిధ కోణాలను అంచనా వేసి, సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే టీనేజర్లు ఈ స్కిల్‌ను అలవరచుకోవడం చాలా ముఖ్యం, అవసరం. దీనివల్ల వారు చదువులో, జీవితంలో మెరుగైన అవకాశాలను ఎంచుకుంటారు.కమ్యూనికేషన్ స్కిల్స్ మానవ సంబంధాలు ఏర్పరచుకోవడంలో, సక్సెస్ సాధించడంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇతరులు చెప్పేది సరిగా వినడం, తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయడం, ఉపయుక్తమైన సంభాషణలు నెరపడం వంటివి నేర్చుకోవడం టీనేజర్లకు అత్యవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న టీనేజర్లు మంచి సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. గ్రూప్ డిస్కషన్స్‌లో బెరుకులేకుండా పాల్గొనగలుగుతారు. ఇది బడి, పని లేదా సామాజిక వాతావరణాల్లో ఎంతో ఉపయోగపడుతుంది.ఫైనాన్షియల్ లిటరసీఆర్థిక సాక్షరతను టీనేజర్లే కాదు పెద్దలు కూడా నిర్లక్ష్యం చేస్తుంటారు. దాంతో ఆర్థిక చిక్కుల్లో పడతారు. బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం, ఆదా చేయడం, పెట్టుబడులు పెట్టడం, అప్పులను మేనేజ్‌చేయడం వంటివి టీనేజ్లోనే నేర్చుకుంటే ఆ తర్వాత మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. డబ్బును తెలివిగా ఉపయోగించుకునేవారు త్వరగా ఆర్థిక స్వాతంత్య్రం సాధించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు.రెజిలియెన్స్ అండ్ అడాప్టబులిటీ జీవితం ఎప్పుడూ ఊహించినట్లుగా జరగదు, ఎత్తుపల్లాలు ఉంటాయి. టీనేజ్‌లో ఇవి మరీ ఎక్కువ. చదువుల ఒత్తిడి, రిలేషన్షిప్ సవాళ్లు, వ్యక్తిగత పరాభవాలను ఎదుర్కొంటారు. వీటన్నింటినీ తట్టుకుని నిలబడగలగడం అవసరం. ఫెయిల్యూర్ ముగింపు కాదని, విజయానికి మొదటి అడుగని అర్థం చేసుకోవడం ద్వారా సవాళ్లను సానుకూలంగా ఎదుర్కొంటారు. మార్పుకు అనుకూలంగా ఉండటం, అడ్డంకులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని నేర్చుకోవడం మానసిక శక్తిని పెంచుతుంది.సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే, తాత్కాలిక టెంప్టేషన్స్‌ను అర్థం చేసుకుని నియంత్రించడం, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించడం, వ్యక్తిగత విలువలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం. ఇది అకడమిక్ సక్సెస్‌కు మాత్రమే కాదు, వ్యక్తిగత వికాసానికీ అనివార్యమైన నైపుణ్యం. స్వీయ నియంత్రణ ఉన్న టీనేజర్లు అవరోధాలను సులువుగా అధిగమిస్తారు. పరీక్షల కోసం చదవడం, లేదా స్నేహితుల ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి పనులు సులవుగా నిర్వహించగలుగుతారు. -
పేరెంట్స్ కన్నా, ఫ్రెండ్స్ మాటలే ముఖ్యం
‘మావాడు మేం చెప్పేది అస్సలు వినడండీ. ఎప్పుడూ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అంటుంటాడు. వాళ్లందరూ ఒక గ్యాంగయ్యారు. బైక్‌తో రిస్కీ ఫీట్స్ చేస్తుంటారు. ఎప్పుడేం తెచ్చుకుంటారోనని గుండె అదురుతుంటుంది..’‘మా పాప మేమేం చెప్పినా పట్టించుకోదండీ. ఫ్రెండ్స్ చెప్తే మాత్రం వెంటనే చేసేస్తుంది. తనకు నచ్చేలా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు.’‘మా అబ్బాయి ఒకరోజు చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాడు, మరుసటి రోజే డల్‌గా కనిపిస్తాడు. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాడు.’కౌన్సెలింగ్‌కు వచ్చే చాలామంది పేరెంట్స్ తమ టీనేజ్ పిల్లల గురించి చెప్పే మాటలవి. చిన్నప్పటి నుంచీ అమ్మ కూచిలా లేదా నాన్న బిడ్డలా ఉన్న పిల్లలు, అప్పటివరకు తమ అభిప్రాయలను గౌరవించి, తాము చెప్పే సూచనలు పాటించే పిల్లలు ఒక్కసారిగా మారేసరికి పేరెంట్స్ తట్టుకోలేరు. వారెక్కడ చేజారిపోతారోనని బాధపడుతుంటారు, ఆందోళన చెందుతుంటారు. కానీ, ఆ వయసుకు అది సహజం. టీనేజ్‌కు వచ్చేసరికి వారి ప్రపంచం కుటుంబాన్ని దాటి విస్తృతమవుతుంది. ఈ దశలో స్నేహితులు, ఆన్లైన్ కమ్యూనిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్ మాటలకే ఎక్కువ విలువిస్తారు. స్నేహితుల ఆమోదం, గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తారు. ఈ మార్పును అర్థం చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులు.. సున్నితమైన ఈ దశలో పిల్లలకు సరైన మద్దతు అందించగలుగుతారు. పీర్ ప్రెజర్.. స్నేహితుల ఆమోదం పొందాలనే ఒత్తిడి అందరిపైనా ఉంటుంది. కానీ టీనేజ్‌లో ఎక్కువగా ఉంటుంది. టీనేజర్లు ఒక గ్యాంగ్‌లో చేరేందుకు ప్రయత్నిస్తారు. ఆ వయసులో అది అత్యవసరమనిపిస్తుంది. ఆ స్నేహితుల ఒత్తిడికి లోనైనప్పుడు తప్పులు చేసే అవకాశాలు పెరుగుతాయి. కొందరు టీనేజర్లు మితిమీరి ప్రవర్తించవచ్చు. మద్యం సేవించడం, ప్రమాదకరమైన ఫీట్స్ చేయడం, విచిత్రమైన వేషధారణలోనూ కనిపించవచ్చు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి, తల్లిదండ్రులు సంయమనంతో ఉండటం ముఖ్యం. పీర్ ప్రెజర్ గురించి పెద్దలతో స్వేచ్ఛగా మాట్లాడగలిగే వాతావరణాన్ని కల్పించాలి. పిల్లలతో చర్చించి, వారి నిర్ణయాలపై గల ప్రభావాన్ని అర్థంచేయించేందుకు ప్రయత్నించాలి. స్నేహితులకు ‘నో’ చెప్పగలిగే ధైర్యాన్ని నేర్పాలి. సోషల్ మీడియా ప్రభావం.. స్నేహితుల ఒత్తిడి కేవలం పాఠశాల సమయంతో ఆగిపోదు. ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా ద్వారా 24/7 కొనసాగుతుంది. ఇవి తమ వ్యక్తీకరణకు ఎంత ఉపయోగపడతాయో, అంతే నెగటివ్ ప్రభావాన్నీ చూపించే సామర్థ్యం గలవి. సోషల్ మీడియాలో ఇతరులను చూస్తూ, పోల్చుకోవడం వల్ల కొందరు టీనేజర్లు ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. పోస్టులకు లైకులు, కామెంట్ల ద్వారా వెంటనే గౌరవాన్ని పొందాలనుకునే తీరు కూడా వారిని కుంగిపోయేలా చేయవచ్చు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఈ ఒత్తిడిని తల్లిదండ్రులు గ్రహించి, వారితో మాట్లాడాలి. వారు చూస్తున్న కంటెంట్ గురించి చర్చించాలి. అది నిజ జీవితాన్ని ప్రతిబింబించదని వారికి అర్థమయ్యేలా వివరించాలి. నిర్ణయాలు, ఆత్మగౌరవంస్నేహితులు, సోషల్ మీడియా ఒత్తిడికి లోనైనప్పుడు టీనేజర్లు ఏ మాత్రం ఆలోచించకుండా ఎమోషన్‌తో నిర్ణయాలు తీసుకుంటారు. లో సెల్ఫ్ ఎస్టీమ్‌తో ఉంటే వారు మరింతగా స్నేహితుల ఒత్తిడికి లోనవుతారు. పిల్లల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించడం అత్యంత కీలకం. తల్లిదండ్రులు ఆ బాధ్యతను తీసుకోవాలి. పిల్లలు తమ ప్రతిభను గుర్తించేలా చేయాలి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. ప్రతిరోజూ వారి అభిరుచులు, కష్టాలను గుర్తిస్తూ విజయం దిశగా వారిని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు చేయాల్సింది..యవ్వనంలో, స్నేహితుల ఒత్తిడి సహజమే. కానీ, మీరు సున్నితంగా, ప్రేమతో పిల్లలకు మార్గనిర్దేశం చేస్తే, వారు సంయమనం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అందుకు మీరు చేయాల్సింది.. పిల్లలకు మీరెప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పాలి. వారు తమ సమస్యలు మీతో పంచుకునేలా నమ్మకాన్ని కలిగించాలి.ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించడం, స్నేహితుల ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలను నేర్పాలి.సోషల్ మీడియా కంటెంట్ గురించి ఓపికగా చర్చించాలి.వారి కృషి, కష్టాలు, ప్రత్యేకతలను గుర్తించి ప్రశంసించాలి.వారు తీసుకునే నిర్ణయాల ఫలితాలను అర్థంచేసుకోవడంలో వారికి సహాయం చేయాలి. -
Bigg Boss 8: మేనిప్యులేషన్తోనే సక్సెస్ కాలేరు
హాయ్, హలో.. అందరూ బాగున్నారా? బిగ్ బాస్ చూస్తున్నారా? చూడకపోతే మీ ఆర్టికల్ ఎందుకు చదువుతాం? అంటారా. చూడకపోయినా చదవండి. ఎందుకంటే, ఇక్కడ మనం బిగ్ బాస్ గురించి మాత్రమే మాట్లాడుకోవడం లేదు. బిగ్ బాస్ ను నేపథ్యంగా తీసుకుని సైకాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం.గతవారం మనం ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ గురించి మాట్లాడుకున్నాం. ఈ వారం దానికి రిలేటెడ్ గా ‘ఎమోషనల్ మేనిప్యులేషన్’ గురించి మాట్లాడుకుందాం. అందుకోసం ముందుగా కొన్ని పదాలు, వాటి నిర్వచనాల గురించి తెలుసుకుందాం.Emotional Manipulation: తన ప్రయోజనాలకోసం ఇతరుల భావోద్వాగాలను ప్రభావితం చేయడం లేదా నియంత్రించడం.Guilt-Tripping: ఒక విషయంలో ఒక వ్యక్తి తప్పు లేకపోయినా, అతని నిర్ణయాలను నియంత్రించేందుకు నేరుగా లేదా పరోక్షంగా అతనినే దోషిగా అనిపించేటట్లు చేయడం.Gaslighting: ఒక వ్యక్తి మరొకరిని వారి జ్ఞాపకాలు లేదా ప్రవర్తనను సందేహించేటట్లు చేయడం. దీనివల్ల బాధితులు అయోమయంగా, ఆందోళనగా, తాము చూసిన నిజాన్ని నమ్ముకోలేని స్థితిలో పడిపోతారు.Triangulation: ఒక వ్యక్తి ఇతరుల బంధాల మధ్య విభేదాలు సృష్టించడం, బాధ్యత వదిలించుకునేలా చేయడం. ఇలాంటి వ్యక్తి మూడవ వ్యక్తిని ఒక సాధనంగా వాడి, ఇతరుల మీద నియంత్రణ కలిగిస్తారు.Public Shaming: ఎవరినైనా ప్రజల ముందు అవమానపరచడం, సిగ్గుపడేటట్లు చేయడం. ఇది సోషల్ మీడియా లేదా వ్యక్తిగతంగా, ప్రజల ముందు ఎక్కడైనా జరుగవచ్చు.ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో జరిగిన సంఘటనలను emotional manipulation కాంటెక్స్ట్లో చూడడం వల్ల, వాటిని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో అర్థం చేసుకోవడం వల్ల చాలా విషయాల్లో స్పష్టత వస్తుంది.ఎమోషనల్ మేనిప్యులేషన్ ఈ వారం హౌస్ లో తన ప్రవర్తన ద్వారా సోనియా ఎమోషనల్ మేనిప్యులేషన్ ను స్పష్టంగా ప్రదర్శించింది. పదే పదే నబీల్ ను ఫెయిల్డ్ సంచాలక్ అని పిలవడం ద్వారా అతని ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం చేసింది. ఇది అతన్ని రక్షణాత్మక స్థితిలోకి నెట్టి, ఎమోషనల్ గా వీక్ చేసే ప్రయత్నంగా చెప్పవచ్చు.నిఖిల్, పృధ్విని వాడుకుని సోనియా ఆడుతోందే తప్ప, తన ఆట తాను ఆడటం లేదని యష్మి ఆరోపించింది. నిఖిల్, పృధ్విలను ఉపయోగించి గేమ్ నెరేటివ్ ను నియంత్రించేందుకు సోనియా ప్రయత్నిస్తోంది. Triangulation అంటే ఇదే. హౌస్ మొత్తం కూడా అదే అభిప్రాయంలో ఉంది. అందుకే శక్తి క్లాన్ నుంచి సభ్యులు కాంతార క్లాన్ లోకి వచ్చారు. కాంతార సభ్యులెవ్వరూ శక్తి క్లాన్ లోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు.మరోవైపు సోనియా ‘నా హార్ట్ బ్రేక్’ చేశావంటూ నిఖిల్ ను నిందించింది. నీ వల్లనే నేను బాధపడుతున్నానన్నట్లుగా మాట్లాడి అతనపై ఎమోషనల్ ప్రెజర్ పెంచింది. Guilt-trippingకు ఇది ఒక ఉదాహరణ.అగ్రెషన్ అండ్ మేనిప్యులేషన్మణికంఠను మానసికంగా, శారీరకంగా బలహీనంగా చూపించడం ద్వారా పృధ్వి తన ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేసాడు. నబీల్ ను తిట్టడం, భయాందోళనను సృష్టించి అతన్ని మౌనంగా ఉంచడానికి, వెనక్కు తగ్గేలా చేయడానికి ప్రయత్నించాడు.సోనియా, పృధ్వి ఇద్దరూ కలిసి నబీల్ ను అడ్డుకునేందుకు, ఎమోషనల్ గా వీక్ చేసేందుకు ప్రయత్నించారు. ఇతరులపై పైచేయి సాధించడానికి అగ్రెషన్ ను ఉపయోగించడం కూడా ఒక టెక్నిక్. Public shaming కు ఇదో ఉదాహరణ.కానీ నబీల్ ఈ మేనిప్యులేషన్ కు, షేమింగ్ కు తలొగ్గకుండా, సోనియాలోని ఎమోషన్ మేనిప్యులేషన్ ను ఎత్తి చూపేందుకు ప్రయత్నించాడు.మరోవైపు నిఖిల్, పృధ్విలను వేరే కోణంలో చూస్తోందని సోనియా మాట్లాడింది. తనకు లేని ఆలోచనలకు యష్మిని బాధ్యురాలిగా చేసి బాధపడేలా చేయడం Gaslighting కు ఇదో ఉదాహరణ. ఇలాంటి మాటల వల్ల యష్మి కుంగిపోయి ఏడ్చేసింది. సోనియా లక్ష్యం నెరవేరింది.ముగ్గురు వర్సెస్ హౌస్... కాంతార క్లాన్ కు ఎవరు చీఫ్ కావాలనే విషయంలో బిగ్ బాస్ ఒక పోటీ నిర్వహించాడు. అందులో భాగంగా సుత్తి ఎవరికి ఇవ్వాలనే విషయంలో సోనియా, నిఖిల్, పృథ్వి మాట్లాడుకుంటే, సోనియాను ఒంటరి చేయడానికి విష్ణుప్రియ, సీత, నయనిక ప్లాన్ చేశారు. చివరకు శక్తి క్లాన్ కు చెందిన సీత కాంతార గ్రూప్ చీఫ్ గా ఎంపికైంది.ఆ తర్వాత ఏ క్లాన్ లో ఎవరు ఉండాలో నిర్ణయించుకోమన్నారు. సోనియా మేనిప్యులేషన్, నిఖిల్ ఆమెను సమర్థించడం నచ్చని శక్తి క్లాన్ లోని విష్ణుప్రియ, నయనిక కాంతార క్లాన్ లోని వెళ్లారు. కానీ కాంతార క్లాన్ సభ్యులెవ్వరూ శక్తి క్లాన్ లోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మణికంఠ, యష్మి వెళ్లాల్సి వచ్చింది. కానీ, గోల్డెన్ బ్రాస్లెట్ తీసుకుని మణికంఠ తిరిగి కాంతార క్లాన్ కు వచ్చేశాడు. ఆ ముగ్గురూ, మిగతా సభ్యులుగా హౌస్ విడిపోయింది.ఎమోషనల్ మేనిప్యులేషన్ వల్ల ఒకరిద్దరిని కంట్రోల్ చేయగలరేమో కాని, అందరినీ కంట్రోల్ చేయలేరని ఈ వారం హౌస్ సభ్యుల ప్రవర్తనను పరిశీలించడం ద్వారా అర్థం చేసుకోవచ్చు.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com -
Bigg Boss 8: చూసేదంతా నిజంకాదు.... అది మీ పర్సెప్షన్ మాత్రమే!
బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో అయినా, నిజ జీవితంలో అయినా మీరు చూసేదంతా నిజంకాదు. అది మీ పర్సెప్షన్ మాత్రమే. అదెలాగంటారా? బిగ్ బాస్ లో24 గంటల సంఘటనలను ఎడిట్ చేసి ఒక గంటలో చూపిస్తారు. మనం చూసినదాన్ని బట్టి అందులోని కంటెస్టెంట్లపై మనకు ఒక అభిప్రాయం, అవగాహన ఏర్పడుతుంది. ఆ అవగాహన ఆధారంగానే ఇష్టపడటం, వ్యతిరేకించడం, ఓట్లు వేయడం జరుగుతుంది. జీవితంలోనైనా అంతే.ఏ వ్యక్తీ మరో వ్యక్తి జీవితాన్ని 24/7 చూడలేడు. అతనితో పాటు జీవించే కుటుంబ సభ్యులైనా సరే అతని మనసులోని మధనాన్ని అర్థం చేసుకోలేడు. మనకు కనిపించిన ప్రవర్తనను బట్టి ఆ వ్యక్తి గురించి ఒక అంచనాకు వస్తాం. అలా అంచనాకు రావడానికి మన అనుభవాలు, నమ్మకాలు, విలువలు, విశ్వాసాలు అన్నీ బ్యాక్ గ్రౌండ్ లో పనిచేస్తాయి. అలా మన పంచేద్రియాల ద్వారా వచ్చిన సమాచారాన్ని మన అనుభవాలు, నమ్మకాలు, విలువలు, విశ్వాసాలు ఆధారంగా మనం ఎలా అర్థం చేసుకుంటామనేదే పర్సెప్షన్. మనకు అర్థమైనదే నిజం కాదు, అది ఒక పర్సెప్షన్ మాత్రమే, ఎవరి పర్సెప్షన్ వారికి ఉంటుందనే సూత్రాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే విభేదాలే ఉండవు.ఇక బిగ్ బాస్ షో విషయానికి వస్తే.. కంటెస్టంట్లు తాము ఉన్నది ఉన్నట్లు కాక, తామెలా కనిపించాలనుకుంటున్నారో అలాగే ప్రవర్తిస్తారు. దాని ఆధారంగానే మనం ఒక అవగాహనకు వస్తాం. ఉదాహరణకు అభయ్ నవీన్ తన తండ్రి మరణం, నటన, దర్శకత్వం అవకాశం గురించి మాట్లాడాడు. తాను దర్శకుడు అవ్వడం వల్ల నటించననే అపోహతో అవకాశాలు తగ్గాయని చెప్పాడు. తనను తాను ఎక్స్ ప్లోర్ చేసుకోవడం కోసం హౌస్ లోకి వెళ్తున్నానన్నాడు. అయితే ఈ మాటలన్నీ అతను తనను తాను ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకోవాలనుకుంటున్నాడో అందులో భాగమే తప్ప, అతని పూర్తి పర్సనాలిటీ కాదు.ప్రతీ మనిషిలోనూ నాలుగు రకాల సెల్ప్ లు ఉంటాయి. రియల్ సెల్ఫ్, ఐడియల్ సెల్ఫ్, పబ్లిక్ సెల్ఫ్, బిహేవియరల్ సెల్ఫ్. మనకు కనిపించేది బిహేవియరల్ సెల్ఫ్ మాత్రమే. రియల్ సెల్ఫ్ అంటే మన నిజస్వరూపం, ఇతరులకు తెలియనిది, చూపించనిది. ఐడియల్ సెల్ఫ్ అంటే మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అది. పబ్లిక్ సెల్ఫ్ అంటే మనం పబ్లిక్ లో ఎలా కనిపించాలనుకుంటున్నామో, కనిపిస్తామో అది. బిహేవియల్ సెల్ఫ్ అంటే మనం ఎలా ప్రవర్తిస్తామో అది. ఉదాహరణకు ఆదిత్య ఓం తాను డిప్రెషన్‌ని అధిగమించి "పునర్జన్మ" కోసం బిగ్ బాస్ లోకి ప్రవేశించానని చెప్పాడు. ఇది అతని పబ్లిక్ సెల్ఫ్ ను సూచిస్తుంది.విష్ణుప్రియ తన IQ తక్కువని, ఎంటర్టయిన్మెంట్ కోసం ప్రయత్నిస్తానని చెప్పింది. తాను సరదాగా ఉన్నట్లు ప్రవర్తిస్తున్నా ఆమె రియల్ సెల్ప్ లోతులు ఎవ్వరికీ తెలీదు.యష్మి తన బ్రేకప్ గురించి, మూడ్ స్వింగ్స్ గురించి మాట్లాడుతూ తనను తాను బలమైన వ్యక్తిగా చెప్పుకుంది. అది ఆమె ప్రొజెక్టెడ్ లేదా పబ్లిక్ సెల్ఫ్ మాత్రమే. ఆమె రియల్ సెల్ప్ ఏమిటో ఎవరికీ తెలియదు.నిఖిల్ శాంతిని కోరుకుంటున్నానంటూ నిత్యం గొడవలుండే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాడు. దాన్ని బట్టి అది అతని రియల్ సెల్ఫా లేక ఆటకోసం ప్రదర్శించిన ప్రొజెక్టెడ్ సెల్ఫా అని ప్రశ్నించవచ్చు.మన సోషల్ సెల్ఫ్ చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి మారుతుంది. ఉదాహరణకు మణికంఠ ప్రాంక్ ఎలిమినేషన్ సమయంలో ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యి తన సున్నితత్వాన్ని చూపించాడు. అలాగే తాను ఒత్తిడి, రిజెక్షన్ తో బాధపడుతున్నట్లు చెప్పాడు. అలాగే ఒకానొక సందర్భంలో ఇకపై నటించలేనంటూ విగ్ తీసేశాడు. అంటే పబ్లిక్ సెల్ఫ్ ను పక్కనపెట్టేశాడు.మనం మన నమ్మకాలను ధృవీకరించే విషయాలను మాత్రమే గమనిస్తాం, మన నమ్మకాలకు విరుద్ధంగా ఉన్న సమాచారాన్ని నిర్లక్ష్యం చేస్తాం. దీన్నే పర్సెప్షన్ బయాస్ అంటారు. ఉదాహరణకు, బేబక్క వంటలో నిర్లక్ష్యం చేస్తోందని సోనియా ఆరోపించింది. కానీ అది ఆమె పర్సెప్షన్ బయాస్ కావచ్చు. కానీ బిగ్ బాస్ టీమ్ దాన్ని ఎడిట్ చేసి చూపించిన దాన్ని బట్టి ప్రేక్షకులు ఎవరో ఒకరివైపు నిలబడతారు. నిజజీవితంలోనూ ఇలాగే జరుగుతుంది. మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి ఒకవైపు నిలబడతాం.బిగ్ బాస్ కు నిజజీవితానికి లింక్ ఏంటంటే... మనం మనకు చూపించే, కనిపించే దాన్ని బట్టి బిగ్ బాస్ కంటెస్టెంట్లపై ఎలా అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటామో, తీర్పులిస్తామో నిజజీవితంలోనూ అదే చేస్తాం. సోషల్ మీడియా కూడా అంతే.జీవితంలో జరిగే ముఖ్య సంఘటనలను సోషల్ మీడియాలో చూపుతాం. దాన్ని బట్టి ఆనందంగా ఉన్నారని అనుకోవచ్చు. కానీ నిజానికి చాలా కష్టాల్లో, బాధల్లో ఉండవచ్చు. కానీ మనం మనకు కనిపించిన దాన్ని బట్టే అవగాహనకు వస్తాం. మనం చూసేది, చూపించేది జీవితంలో ఒక భాగం మాత్రమే. అందుకే కనిపించేదంతా నిజంకాదు, అదొక పర్సెప్షన్ మాత్రమే.-సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
‘బిగ్ బాస్' కథ పెద్దదే... పురాతనమైంది కూడా!
హలో.. మీరు బిగ్ బాస్ చూస్తారా? ఎందుకు చూస్తారు? ‘‘ఎందుకేంటి? అదో ఎంటర్టైన్మెంట్’’ అని అంటారా. అఫ్కోర్స్... చాలామంది ఇదే సమాధానం చెప్తారు. మరికొంతమంది ‘‘అదో చెత్త షో’’ అని కొట్టిపడేస్తారు. కానీ నిజానికి బిగ్ బాస్ ఒక గొప్ప సైకాలజీ షో.‘‘హలో... హలో... హలో.. బిగ్ బాస్ కూ సైకాలజీకి ఏంటి లింక్?’’ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చివరివరకు చదివి మీరే చెప్పండి.తెలుగు బిగ్ బాస్ 2017లో మొదలై ఏడు సీజన్లు పూర్తి చేసుకుని ఎనిమిదో సీజన్ సెప్టెంబర్ ఒకటో తేదీన మొదలవ్వబోతోంది. మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తే, రెండో సీజన్ నాని హోస్ట్ చేశాడు. మూడో సీజన్ నుంచీ కింగ్ నాగార్జునే హోస్ట్ చేస్తున్నాడు. ఈసారి కూడా ఆయనే. ‘‘సర్లేవయ్యా, ఈ విషయాలు మాకూ తెలుసు. ముందు బిగ్ బాస్ కూ సైకాలజీకి ఉన్న లింకేంటో చెప్పు’’ అంటారా. వస్తున్నా, వస్తున్నా.. అక్కడికే వస్తున్నా. బిగ్ బాస్ మూలాలు రెండో ప్రపంచ యుద్ధంలో ఉన్నాయంటే ఆశ్చర్యపోకండి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అడాల్ఫ్ ఎచ్మన్ అనే మిలిటరీ అధికారి హిట్లర్ ఆదేశాల మేరకు కొన్ని లక్షల మంది యూదులను కాన్సట్రేషన్ క్యాంపులలో పెట్టి చంపేశాడు. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక అతనిపై కోర్టు విచారణ జరిగింది. ఉన్నతాధికారుల ఆగ్నలు పాటించానే తప్ప తానెలాంటి తప్పూ చేయలేదని ఎచ్మన్ గాఠ్ఠిగా వాదించాడు. ఆ వాదనలు తోసేసి కోర్టు అతనికి శిక్ష విధించింది.సైకాలజీ అధ్యయనాలు... యేల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న మిల్ గ్రామ్ అనే సైకాలజీ ప్రొఫెసర్ కు ఎచ్మన్ వాదన ఆసక్తికరంగా అనిపించింది. ఉన్నతాధికారులు ఆదేశిస్తే ఎంత పనైనా చేస్తారా? విధేయతకు అంత శక్తి ఉందా? అనే ప్రశ్నలు అతని మనసులో తలెత్తాయి. దాన్ని అధ్యయనం చేయడం కోసం 1961లో ఒబీడియన్స్ పై ఒక స్టడీ చేశాడు. అందుకోసం కరెంట్ షాక్స్ తో ఒక ప్రయోగం చేశాడు. ఒక అథారిటీ ఫిగర్ చెప్తే ప్రమాదకరమైన కరెంట్ షాక్ ఇస్తారని ఆ అధ్యయనంలో తేలింది. అంటే ప్రజలు అధికారం ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతారని, అధికారంలో ఉన్నవారికి అత్యంత విధేయంగా ఉంటారని వెల్లడైంది.ఆ తర్వాత పదేళ్లకు 1971లో స్టాన్పర్డ్ యూనివర్సిటీకి చెందిన ఫిలిప్ జింబార్డో అనె సైకాలజీ ప్రొఫెసర్ మరో ప్రయోగం చేశాడు. ఒక జైలులాంటి సెట్టింగ్ వేసి, అందులో కొందరు వాలంటీర్లను గార్డులుగా, మరికొందరిని ఖైదీలుగా ఉంచి, వారెలా ప్రవర్తిస్తారనే విషయాన్ని అధ్యయనం చేశాడు. ఇందులో గార్డులు అగ్రెసివ్ గా, దురుసుగా ప్రవర్తించగా, ఖైదీలు పాసివ్ గా, డిప్రెసివ్ గా మారారు. స్టాన్‌ఫర్డ్ ప్రిజన్ ఎక్స్ పెరిమెంట్ గా ఇది బాగా ఫేమస్.ఆ తర్వాత జార్జ్ ఆర్వెల్ ‘1984’ అనే నవల రాశాడు. నిరంతర నిఘా, ప్రభుత్వ నియంత్రణ వల్ల వ్యక్తుల ప్రవర్తన ఎలా మారుతుంది? అనే విషయాన్ని చర్చిస్తుంది. ఇందులో హీరో మొదట తిరుగుబాటు ఆలోచనలతో ఉన్నా చివరకు బిగ్ బ్రదర్ ను ప్రేమించడం మొదలుపెడతాడు. ఈ నవల స్ఫూర్తితోనే 1999లో ‘బిగ్ బ్రదర్’ అనే రియాలిటీ షో మొదలైంది.నవలలో లాగే ఇందులో కూడా నిరంతర పర్యవేక్షణ, వాస్తవాలను సెన్సార్ చేసి చూపించడం, పార్టిసిపెంట్స్ ఆకలిదప్పులు, నిద్రతో ఆడుకోవడం, పోటీ వాతావరణం, తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితులు, అందుకోసం చేసే ట్రిక్స్, చెప్పే అబద్ధాలు.. ఇలాంటివన్నీ చూడవచ్చు.బిగ్ బాస్ చూస్తే ఏమొస్తుంది? సాధారణ ప్రజలకు సైకాలజీ బోధించడానికి రియాలిటీ టీవీ చక్కని, లాజికల్ అవకాశం అంటాడు ప్రొఫెసర్ జింబార్డో. ఇతరుల ప్రవర్తనను గమనించడంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. అందులోంచి విలువైన, నిజమైన సైకాలజీని ప్రజలకు అందించవచ్చంటాడు. అంతేకాదు... తానైతే జీవితాంతం చూడమన్నా చూస్తానని చెప్పాడు. అయితే మానవ ప్రవర్తనలోని చెత్త అంశాలను, తప్పుడు విలువలను ప్రోత్సహించే అంశాలు ప్రజలను తప్పుదారి పట్టించేవిలా ఉన్నాయని విమర్శించాడు. అంటే బిగ్ బాస్ షోలో మంచీ ఉంది, చెడూ ఉంది.. ఎవరేం తీసుకుంటారనేది వారివారి మనస్తత్వాలపై ఆధారపడి ఉంటుంది.డిస్కవరీ ఛానెల్లో "ది హ్యూమన్ జూ" అనే కొత్త రియాలిటీ షోకు ప్రొఫెసర్ జింబార్డో ముఖ్య శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. ఇది కూడా బిగ్ బాస్ లాంటిదే. అయతే ఇందులో ఆ షో చూసేటప్పుడు ప్రేక్షకుల్లో జరిగే మార్పులను, తర్వాత ఏం జరుగుతుందనే విషయాన్ని అంచనా వేస్తారు. ఫస్ట్ ఇంప్రెషన్, బాడీ లాంగ్వేజ్, సోషల్ అట్రాక్షన్, గ్రూప్ డామినెన్స్, లై డిటెక్షన్, అందం ప్రభావం, సైజ్ ప్రభావం, సోషల్ ఇన్ఫ్లూయెన్స్ లాంటి అంశాలను అధ్యయనం చేశాడు. అందుకే బిగ్ బాస్ జస్ట్ ట్రాష్ కాదు. అందులో చాలా సైకాలజీ ఉంది.ఎందుకు చూస్తారు? చాలామంది ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తారు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. అందులోకి వచ్చే హౌస్మేట్లు కూడా డబ్బు, పేరు ప్రఖ్యాతుల కోసమే వస్తారు. అందులోనూ ఎలాంటి డౌట్ లేదు. అయితే హౌస్మేట్లలో తల్లి, తండ్రి, అక్క, చెల్లి, విలన్ లా ప్రవర్తించే వారిని చూడవచ్చు. వాళ్లతో ప్రేక్షకులు మమేకమవుతారు. వారిలో తమను లేదా తనకు తెలిసినవాళ్లను చూసుకుంటారు. అందుకే అభిమానులు, అభిమాన సంఘాలు, ఆర్మీలు ఏర్పడతాయి.అయితే హౌస్మేట్లు ఆ పాత్రలను ఎందుకు ఎంచుకుంటారో, ఎందుకలా ప్రవర్తిస్తారో, వాళ్లకు ఏం అవసరమో గమనించడానికి బిగ్ బాస్ ఉపయోగపడుతుంది. గెలుపు, ఓటమి, ఆకలి, నిద్రలేమి, ఒత్తిళ్లు, ఒంటరితనం, అనుమానం... ఇవన్నీ మన ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో, ఎలా మార్చేస్తాయో తెలుసుకోవచ్చు.అన్ని రివ్యూలూ ఒకే రకం కాదు...’బిగ్ బాస్ తెలుగు రివ్యూస్’ అని సెర్చ్ చేస్తే యూట్యూబ్ లో వందల, వేల వీడియోలు కనిపిస్తాయి. ఆదిరెడ్డి అనే ఒక యూట్యూబర్ రివ్యూల వల్లనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లగలిగాడు. అయితే అవేవీ సైంటిఫిక్ సైకలాజికల్ అనాలసిస్ లు కావు. వాళ్లకు తెలిసింది, తోచింది చెప్పేస్తున్నారు. విదేశాల్లో ఇలా లేదు.బ్రిటన్ లో బిగ్ బ్రదర్ షో కు జూడీ జేమ్స్ అని ఒక రెసిడెంట్ సైకాలజిస్ట్ ఉంది. ఆమె హౌస్‌మేట్ పర్సనాలిటీ, సోషల్ డైనమిక్స్, ఇతర అంశాల గురించి వారానికొకసారి విశ్లేషణ అందిస్తుంది. జెఫ్రీ బీటీ అనే సైకాలజిస్ట్ బిగ్ బ్రదర్ హౌస్మేట్ల బాడీ లాంగ్వేజ్ పై అధ్యయనం చేస్తున్నాడు. బిగ్ బ్రదర్ నుండి ఉదాహరణలను ఉపయోగించి ఒక అకడమిక్ పుస్తకం కూడా రాశాడు.స్టీవెన్ స్టెయిన్ అనే సైకాలజిస్ట్ కెనడా బిగ్ బ్రదర్ కు పోటీదారుల ఎంపిక, సీజన్ ముగిశాక పోటీదారులు రియాలిటీకి ప్రవేశించడంలో సహాయపడటానికి డిబ్రీఫింగ్ థెరపీ సెషన్లను అందిస్తున్నాడు.అలాగే చాలాదేశాల్లో సైకాలజిస్టులు పోటీదారుల మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో, షో సమయంలో, ఆ తర్వాత మద్దతును అందిస్తున్నారు. కానీ మనదేశంలో అలాంటి ప్రయత్నమేదీ కనిపించలేదు. ఆ లోటును భర్తీ చేసేందుకే ఈ ప్రయత్నం. బిగ్ బాస్ తెలుగు షో ద్వారా సైకాలజీ తెలుసుకునేందుకు, రియల్ లైప్ సైకాలజీ పాఠాలు నేర్చుకునేందుకు ఈ కాలమ్ తప్పకుండా ఫాలో అవ్వండి.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com -
అతిగా తినడం.. వాంతి చేసుకోవడమా? అయితే ఇలా చేయండి!
రాధ డిగ్రీ చదువుతోంది. చూడ్డానికి చక్కగా ఉంటుంది. బాగా చదువుతుంది. అందరితో కలివిడిగా మాట్లాడుతుంది. కానీ కొన్ని నెలలుగా ఆమె అతిగా తింటోంది. అక్కడితో ఆగడంలేదు. అతిగా తినడంవల్ల లావయిపోతాననే భయంతో భోజనం కాగానే వాష్ రూమ్‌లోకి వెళ్లి బలవంతంగా వాంతి చేసుకుంటోంది. అలా చేయడం నేరంగా, అవమానకరంగా భావిస్తోంది. క్లాసులో కూర్చున్నా ఆలోచన మాత్రం బరువుపైనే ఉంటోంది. తన శరీరాకృతి సరిగా ఉందో లేదోనని తరచూ అద్దంలో చూసుకుంటోంది. బరువు తగ్గించుకునేందుకు విపరీతంగా వ్యాయామం చేస్తోంది.రాధ ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి గీతాదేవి ఏం జరుగుతోందని ఆరా తీసింది. అలా తిని, బలవంతంగా వాంతి చేసుకోవడం లేదా అతిగా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి చూసింది. రాధ వయసుకు తగ్గ బరువే ఉందని వెయింగ్ మెషిన్లో చూపించింది. కానీ రాధ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. దాంతో ఏం చేయాలో అర్థంకాక తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ఆయన సలహా మేరకు రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ చేయించారు. న్యూట్రిషనిస్ట్‌ను కలసి ఆహారపు అలవాట్లు, బరువు తగ్గే మార్గాలపై కౌన్సెలింగ్ తీసుకున్నారు.ఫ్యామిలీ డాక్డర్ సలహా మేరకు సైకోడయాగ్నసిస్కి తీసుకొచ్చారు. రాధతో మాట్లాడాక ఆమె బులీమియా నెర్వోసా అనే మానసిక రుగ్మతతో బాఢపడుతోందని అర్థమైంది. అతిగా తినడం, వెంటనే బలవంతంగా వాంతి చేసుకోవడం దీని ప్రధాన లక్షణం. వారానికి ఒకసారి అతిగా తిని, వాంతి చేసుకుంటే బులీమియా ఉందని నిర్ధారణ చేసుకోవచ్చు.పలురకాల చికిత్సలు అవసరం..బులీమియాకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల చికిత్సలు అవసరం కావచ్చు. అంటే సైకాలజిస్ట్, ఫ్యామిలీ డాక్టర్, డైటీషియన్లతో కూడిన బృందం అవసరం ఉండవచ్చు. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడంతోపాటు లైఫ్ స్టయిల్లోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.– బులీమియా గురించి తెలుసుకోవాలి. థెరపీ సెషన్లను దాటవేయవద్దు.– ఆహారం, వ్యాయామం ప్రొఫెషనల్స్ సలహాతోనే తీసుకోవాలి.. చేయాలి.– అదే పనిగా బరువు చెక్ చేసుకోవద్దు, అద్దంలో చూసుకోవద్దు. ఈ తరహా ధోరణి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రేరేపించే ప్రమాదం ఉంది.– ఆకలిని తగ్గించే లేదా బరువును తగ్గించే సప్లిమెంట్లు లేదా మూలికల వల్ల దుష్ప్రభావాలు ఉండవచ్చు. అందువల్ల వాటికి దూరంగా ఉండాలి.– Enhanced cognitive behavior therapy ద్వారా తిండి గురించిన అనారోగ్యకరమైన నమ్మకాలు, ప్రవర్తన స్థానంలో ఆరోగ్యకరమైన నమ్మకాలు, ప్రవర్తనను పెంపొందించవచ్చు.– బులీమియాతో బాధపడుతున్న పిల్లలు, టీనేజర్ల పేరెంట్స్ ఏం చేయాలో తెలుసుకోవడానికి, పిల్లలు తినే వాటిపై నియంత్రణ తీసుకురావడానికి Family based therapy సహాయపడుతుంది.– ఒత్తిడిని తట్టుకోవడానికి, ఎమోషనల్ బ్యాలెన్స్సకి, ఇతరులతో సర్దుకుపోవడానికి డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ ఉపయోగపడుతుంది.– యాంటీడిప్రెసెంట్స్తో బులీమియా లక్షణాలను తగ్గించవచ్చు. టాక్ థెరపీతో పాటు దీన్ని ఉపయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు ఉంటాయి.– బులీమియాకు చికిత్స చేయడంలో ప్రత్యేక శిక్షణ పొందిన డైటీషియన్లు సహాయపడతారు.– బులీమియా తీవ్రంగా ఉండి.. ఇతరత్రా తీవ్రమైన ఆరోగ్య సమస్యలూ ఉంటే ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు.బులీమియా లక్షణాలు...– ఒకే సిట్టింగ్‌లో అసాధారణ రీతిలో ఆహారాన్ని అతిగా తినడం– అతిగా తినడాన్ని నియంత్రించలేకపోతున్నామని అనిపించడం– బరువు పెరగకుండా ఉండటానికి ఉద్దేశపూర్వకంగా వాంతులు చేసుకోవడం లేదా అతిగా తిన్న తర్వాత విపరీతంగా వ్యాయామం చేయడం– బరువు పెరుగుతుందనే భయంతో, అనారోగ్యకరమైన మార్గాల్లో బరువు తగ్గడానికి ప్రయత్నించడం– విరేచనాల కోసం మందులు ఉపయోగించడం– శరీర ఆకృతి, బరువు విషయంలో చాలా అసంతృప్తిగా ఉండటం– విపరీతమైన మూడ్ స్వింగ్స్‌ని కలిగి ఉండటం.బులీమియా నెర్వోసాకు బింజ్ ఈటింగ్ డిజార్డర్‌కు మధ్య తేడా.. బులీమియా నెర్వోసా ఉన్న వ్యక్తులు అతిగా తిని, ఆ తర్వాత బలవంతంగా వాంతి చేసుకుని ఆహారాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తారు. బింజ్ ఈటింగ్ రుగ్మత ఉన్న వ్యక్తులు కూడా అతిగా తింటారు, కానీ వాంతి చేసుకోరు. అలాగే, బులీమియాతో బాధపడుతున్న వ్యక్తులు సాధారణంగా ఆరోగ్యకరమైన బరువుతో ఉంటారు. బింజ్ ఈటింగ్ రుగ్మత ఉన్న వ్యక్తులు సాధారణంగా అధిక బరువు/ఊబకాయం కలిగి ఉంటారు.– సైకాలజిస్ట్ విశేష్ -
ఓవర్ థింకింగ్ నుంచి తప్పించే ఏడు జపనీస్ టెక్నిక్స్...
మనసు కోతిలాంటిది. ఎప్పుడూ ఒకచోట కుదురుగా ఉండదు. ఈ క్షణం ఒక అంశం గురించి ఆలోచిస్తుంటే, మరుక్షణం మరో అంశంపైకి గెంతుతుంది. కొందరు ఒకే విషయం గురించి అతిగా ఆలోచిస్తూ బాధపడుతుంటారు. సకల మానవ దు:ఖానికి కారణమైన మనసును నియంత్రించడం కోసం అనాదిగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. యోగ: చిత్తవృత్తి నిరోధక: అనే సూత్రంతోనే పతంజలి యోగసూత్రాలు మొదలవుతాయి. అష్టాంగమార్గం ద్వారానే దు:ఖాన్ని తప్పించుకోగలమని బౌద్ధం బోధిస్తుంది. జపాన్ లోని బౌద్ధులు కూడా మనసును నియంత్రించుకోవడం గురించి అన్వేషించి ఏడు టెక్నిక్స్ అందించారు. సైకాలజీ అనేది పుట్టకముందే, వేల సంవత్సరాల కిందటే మొదలైన ఈ టెక్నిక్స్ ను ఇప్పటికీ అక్కడ చాలామంది ఉపయోగిస్తున్నారు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. 1. షోగనై: మీ కంట్రోల్ లో ఉన్న విషయాల గురించి, మీ కంట్రోల్ లేని విషయాల గురించి బాధపడకూడదు. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కదా. సింపుల్. మీ కంట్రోల్ లో ఉన్న విషయాల గురించి బాధపడటం ఎందుకు? వాటిని ప్రయత్నించి సాధించాలి. మీ కంట్రోల్ లేని విషయాల గురించి ఎంత ఆలోచించినా, ఎంత ప్రయత్నించినా అర్థం లేదు కదా. ఈ వైఖరిని అనుసరిస్తే అనవసర ఆలోచనలు మీ మనసులోకి రానే రావు. మీజీవితంలో కష్టాలూ రావు. వచ్చినా... మీ కంట్రోల్ లో ఉన్నదైతే పరిష్కరించుకుంటారు, లేనిదైతే వదిలేసి ముందుకు సాగవచ్చు. 2. షిరిన్-యోకు: బిజీ బిజీ జీవితంతో విసిగిపోయినప్పుడు.. ‘‘అబ్బ, ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్తే ప్రాణానికి హాయిగా ఉంటుందబ్బా’’ అని అనుకుని ఉంటారుగా. అంతదూరం వెళ్లాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఉన్న ప్రకృతితో మమేకం అవ్వండి. పచ్చదనంలో సమయం గడపండి. అతిగా ఆలోచించకుండా ఉండటానికి ఇది ఉత్తమమైన మార్గం. మీ మనసును శాంతపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. 3. నేన్ బుత్సు: అతిగా ఆలోచించడం నుంచి మనసును మళ్లించడానికి సులువైన మార్గం జపం. అంటే మీరు విశ్వసించే, మీకు నచ్చిన పదాన్ని జపించండి. ఏ పని చేస్తున్నా దానిపైనే ధ్యాస నిలపండి. దానివల్ల ఇతర అంశాల గురించే ఆలోచించే అవకాశం తగ్గుతుంది, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. 4. జాజెన్: ఇది జెన్ బౌద్ధమతంలో విస్తృతంగా అభ్యసించే ధ్యానం యొక్క రూపం. చాలా సులువైన విధానం. మీ ఆలోచనలను మీరు ఎలాంటి జడ్జ్ మెంట్ లేకుండా పరిశీలించడం. అంటే ఒక సాక్షిలా ఆలోచనలను పరిశీలించడం. ఎప్పుడైతే మీరు ఆలోచనలకు స్పందించకుండా, విశ్లేషించకుండా ఉంటారో అప్పుడవి ఆటోమేటిక్ గా తగ్గుతాయి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. 5. గమాన్: జీవితం సుఖదుఖాల, విజయాపజయాల మిశ్రమం. ఒక్కోసారి అనుకోని తీరులో కష్టం ఎదురవ్వవచ్చు. అప్పుడు కుంగిపోకూడదు. నాకే ఎందుకిలా జరిగిందంటూ ఆలోచిస్తూ ఉండిపోకూడదు. ఆలోచనల వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని, అడుగు వేసినప్పుడే ఫలితాలు వస్తాయని గుర్తించి.. ముందడుగు వేయాలి. 6. వాబీ-సాబీ: జీవితంలో అన్నీ తాత్కాలికమేననీ, ఏదీ శాశ్వతం పరిపూర్ణం కావని గుర్తించమని చెప్పే జపనీస్ టెక్నిక్ ఇది. ఎప్పడైతే ఈ విషయాన్ని అంగీకరిస్తారో, అప్పడు పర్ ఫెక్ట్ గా ఉండాలనే ఒత్తిడి నుంచి మీరు తప్పించుకోగలరు. అప్పుడు అతిగా ఆలోచించడం నుంచి మీరు తప్పించుకోగలరు, ప్రశాంతంగా ఉండగలరు. 7. ఇకబెనా: ఇది పువ్వులను అందంగా అమర్చే ఆసక్తికరమైన టెక్నిక్. మీరు పువ్వులను అమర్చేటప్పుడు మీ ధ్యాస మొత్తం వాటిపైనే ఉండాలి. వాటిపై శ్రద్ధ నిలపడం ద్వారా మీ మనసు అందాన్ని సృష్టించడంలో మునిగిపోతుంది. అతిగా ఆలోచించడం నుంచి తప్పించుకుని ప్రశాంతంగా ఉండగలరు. దీన్నే ఫ్లో స్టేట్ అంటారు. మరెందుకు ఆలస్యం వీటిలో మీకు నచ్చిన టెక్నిక్ ఉపయోగించి ఓవర్ థింకింగ్ నుంచి తప్పించుకోండి. అయితే ఇవి మానసిక సమస్యలున్నవారికి కాదని, సైకోథెరపీకి ప్రత్యామ్నాయం కాదనే ఎరుకతో ఉండండి. ఈ ప్రయత్నాలేవీ మీ ఓవర్ థింకింగ్ ను ఆపలేకపోతే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లోని కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ ద్వారా మీ ఓవర్ థింకింగ్ ను తప్పించుకునేందుకు సహాయపడగలరు. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
విశ్లేషణం: ఆ తిక్కకున్న లెక్కేంటట?
ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని కచ్చితంగా అంచనా వేయాలంటే పరీక్షలు నిర్వహించాలి. అయితే అన్ని సందర్భాల్లోనూ, అందరి విషయంలోనూ అది సాధ్యంకాదు... ప్రముఖుల విషయంలో అసలే సాధ్యంకాదు. అయితే వారు మాట్లాడే తీరు, వాడే పదాలు, బాడీ లాంగ్వేజ్, జీవన విధానం, వివిధ సందర్భాల్లో వారి ప్రవర్తన, స్పందనను గమనించడం ద్వారా కూడా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. అలాంటి ప్రయత్నమే ఈ ‘విశ్లేషణం’. కొంచెం తిక్కుంది.. దానికి లెక్కుంది... పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే చాలు అభిమానుల్లో పవర్ ప్రవహిస్తుంది. ఆయన మనుషుల్లో/ మనుషులతో కలవడు... కలిసినా పెద్దగా మాట్లాడడు... కానీ అభిమానులకు ఆయనో వ్యసనం. ఎందుకంటే ఆయన మాటల్లో మనిషి కనిపిస్తాడు... ఆ మనిషిలో నిజాయితీ కనిపిస్తుంది. పవన్‌కళ్యాణ్ అనగానే మెడమీద చెయ్యి రుద్దుకుంటూ కోపంగా చూసే యాంగ్రీ యంగ్‌మ్యాన్ ‘బద్రి’ గుర్తొస్తాడు. అయితే అది సినిమాలకు సంబంధించిన మేనరిజమ్ మాత్రమే. బాహ్యప్రపంచంలో ఆ మేనరిజమ్ కనిపించదు... కళ్లలో అంత కోపమూ కనిపించదు. అసలాయన కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తే కదా. పక్కకు లేదా కిందకు చూస్తుంటారు. మాట్లాడేతీరు కూడా తనతో తాను మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటుంది. స్వరం కూడా మంద్రస్థాయిలో ఉంటుంది. వాడే పదాల్లో భావోద్వేగాలకు, మనసుకు సంబంధించిన పదాలు ఎక్కువగా ఉంటాయి. వీటినిబట్టి ఆయనో అంతర్ముఖుడని, కెనైస్థటిక్ పర్సన్ (ఫీలింగ్స్‌కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి) అని చెప్పవచ్చు. వీరికి భావోద్వేగాలు, స్పందనలు ఎక్కువగా ఉంటాయి. పలు సందర్భాల్లో పవన్ అలా స్పందించడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఆయన మనుషులతో అంతగా కలవక పోయినా వాళ్లు ఆయనతో అంతగా కనెక్ట్ అవుతుంటారు. మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఎవరైనాసరే కాస్త మంచి డ్రస్ వేసుకుంటారు.. కాస్త జాగ్రత్తగా ఉంటారు. పద్ధతిగా కూర్చుంటారు. కానీ పవర్‌స్టార్‌ను గమనించండి. చాలా క్యాజువల్ డ్రెస్‌లో వస్తారు.. మరింత క్యాజువల్‌గా ఒక కాలు మడిచి దానిమీద మరో కాలు వేసుకుని కూర్చుంటారు. ఇలా కూర్చోవడం అతని బిడియపు స్వభావాన్ని వ్యక్తం చేస్తుంది. అతని శరీరం పైభాగం ఎంత రిలాక్స్డ్గా కనిపిస్తున్నా, అతనెంతగా నవ్వుతున్నా... అతనింకా తన కవచంతో తను ఉన్నాడనే విషయం తెలుస్తుంది. ఆయనెంత హీరో అయినా పదిమందిలో మాట్లాడాలంటే, ముఖ్యంగా మీడియాతో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. చేతిలో ఓ పెన్ పెట్టుకుని కదుపుతూ తన నెర్వస్‌నెస్‌ను, యాంగ్జయిటీని రిలీజ్ చేసుకుంటారు. ఇక ఎవరైనా పొగుడుతుంటే ఫక్కున నవ్వేసి తనలోని ఇబ్బందిని, ఒత్తిడిని వదిలించుకుంటారు. సినిమా పరిశ్రమ అంటేనే వెలుగు జిలుగులు. కానీ పవన్ జీవనశైలి వాటిని దూరంగా ఉంటుంది. షూటింగ్ అయిపోగానే తన ఫాంహౌస్‌కు వెళ్లిపోవడం, మొక్కలతో తన ప్రేమను పంచుకోవడం, పుస్తకాల్లో మునిగిపోవడం, మౌనాన్ని ఆస్వాదించడం... ఇవన్నీ చూస్తే పవన్‌లో మనకో తాత్వికుడు కనిపిస్తాడు. పలు సందర్భాల్లో ఆయన మాట్లాడిన మాటల్లో అలాగే వినిపిస్తాడు. ‘‘నేను మాస్టర్ అనుకుంటే గ్రోత్ ఆగిపోతుంది. విద్యార్థిగా ఉంటే నిరంతరం నేర్చుకోవచ్చు’’, ‘‘ఏమీ తెలియనప్పుడు మనకంతా తెలుసనుకుంటాం. నేర్చుకోవడం మొదలుపెట్టాక మనకు ఏమీ తెలియదని తెలుసు కుంటాం’’, ‘‘రియల్ యు అనేది ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. అయినా ఎప్పటికీ తెలియదు. చనిపోయాక తెలుస్తుందేమో’’, ‘‘సినిమాకన్నా జీవితం ఎక్కువ డ్రమటిక్‌గా ఉంటుంది’’... ఇవన్నీ ఆయన మాటలే. సమాజం పట్ల తనకున్న అభిప్రాయాలను పవన్ ప్రతి సినిమాలో ఒక పాట ద్వారా వ్యక్తం చేయడం మనకు తెలుసు. అయితే అది సినిమాలకు మాత్రమే పరిమితం కాదు... అది ఆయన మనసు భాష. పవన్ మిగతా విషయాలు మాట్లాడేటప్పటికీ, సమాజం గురించి మాట్లాడేటప్పటికీ స్వరంలో తేడా స్పష్టంగా తెలిసిపోతుంది. సమాజం గురించి మాట్లాడాలంటే ఆయన గొంతు గంభీరంగా మారిపోతుంది. మాటల్లో ఏదో తెలియని ఆవేదన ధ్వనిస్తుంది. అన్యాయాలపై కోపం కనిపిస్తుంది. ఏదో చేయాలనే భావం వినిపిస్తుంది. అందుకేనేమో ‘పవనిజం’ అభిమానుల మతమైంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే తన ప్రపంచంనుంచి బయటకువచ్చి పదిమందిలో కలవడం మొదలుపెట్టారు. ఆయన దీన్నే కొనసాగిస్తే, కాస్తంత కుదురుగా కూర్చుని మాట్లాడితే, మాట్లాడేటప్పుడు కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే... ఆయన మరిన్ని మనసుల్ని దోచుకోగలడు.. మరింతమంది మనుషులకు ఆత్మీయుడు కాగలడు. - విశేష్, సైకాలజిస్ట్