తప్పక నేర్చుకోవాల్సిన 7 నైపుణ్యాలు | 7 Key Skills That Will Help You Succeed In The Future | Sakshi
Sakshi News home page

తప్పక నేర్చుకోవాల్సిన 7 నైపుణ్యాలు

Published Sun, Dec 1 2024 9:16 AM | Last Updated on Sun, Dec 1 2024 9:16 AM

7 Key Skills That Will Help You Succeed In The Future

వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో టీనేజర్లు సంతోషంగా ఉండాలంటే, సక్సెస్‌ సాధించాలంటే కేవలం మార్కులు, ర్యాంకులు, సోషల్‌ మీడియా లైకులు, ఫాలోయింగ్‌లు మాత్రమే సరిపోవు. వాటికి మించి ఏడు నైపుణ్యాలు అవసరం. అవేమిటో ఈ రోజు తెలుసుకుందాం.

ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ 
ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ అంటే తన భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, నియంత్రించడం, అలాగే ఇతరుల భావాలను అంగీకరించడం. కౌమారంలో భావోద్వేగాలు చాలా వేగంగా మారుతుంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే ఈక్యూ అవసరం. తమ బంధాలను నిలబెట్టుకోవడంలో, ఒత్తిడిని నిర్వహించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఈక్యూను అభివృద్ధి చేసుకున్న టీనేజర్లు ఆరోగ్యకరమైన బంధాలు ఏర్పరచుకుంటారు. వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు.

టైమ్‌ మేనేజ్‌మెంట్‌
స్మార్ట్‌ ఫోన్‌ నుంచి సోషల్‌ మీడియా వరకు టీనేజర్లను పక్కదారి పట్టించే అంశాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ డిస్ట్రాక్ష¯Œ ్స నుంచి తప్పించుకుని చదువుపై, కెరీర్‌ పై ధ్యాస నిలపాలంటే టైమ్‌ మేనేజ్‌మెంట్‌ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే. తమ పనులను ప్రాధాన్యక్రమంలో అమర్చుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది. ప్రణాళికలను రూపొందించుకుని, లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. టైమ్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ నేర్చుకున్న టీనేజర్లు తమ బాధ్యతలను బ్యాలె¯Œ ్స చేసుకుంటారు. ఒత్తిడి లేకుండా ఉత్సాహంగా తమ లక్ష్యాలను సాధిస్తారు.

క్రిటికల్‌ థింకింగ్‌
ఈ రోజుల్లో సమాచారం సులువుగా లభిస్తోంది. అందులో ఏది నమ్మదగినదో, ఏది కాదో చెప్పలేం! అందుకే క్రిటికల్‌ థింకింగ్‌ అవసరం. ఇది టీనేజర్లలో స్వతంత్రతను పెంచుతుంది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, అనుసరించకుండా, విశ్లేషించి, వివిధ కోణాలను అంచనా వేసి, సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే టీనేజర్లు ఈ స్కిల్‌ను అలవరచుకోవడం చాలా ముఖ్యం, అవసరం. దీనివల్ల వారు చదువులో, జీవితంలో మెరుగైన అవకాశాలను ఎంచుకుంటారు.

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ 
మానవ సంబంధాలు ఏర్పరచుకోవడంలో, సక్సెస్‌ సాధించడంలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇతరులు చెప్పేది సరిగా వినడం, తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయడం, ఉపయుక్తమైన సంభాషణలు నెరపడం వంటివి నేర్చుకోవడం టీనేజర్లకు అత్యవసరం. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉన్న టీనేజర్లు మంచి సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. గ్రూప్‌ డిస్కషన్స్‌లో బెరుకులేకుండా పాల్గొనగలుగుతారు. ఇది బడి, పని లేదా సామాజిక వాతావరణాల్లో ఎంతో ఉపయోగపడుతుంది.

ఫైనాన్షియల్‌ లిటరసీ
ఆర్థిక సాక్షరతను టీనేజర్లే కాదు పెద్దలు కూడా నిర్లక్ష్యం చేస్తుంటారు. దాంతో ఆర్థిక చిక్కుల్లో పడతారు. బడ్జెట్‌ ప్లాన్‌ చేసుకోవడం, ఆదా చేయడం, పెట్టుబడులు పెట్టడం, అప్పులను మేనేజ్‌చేయడం వంటివి టీనేజ్‌లోనే నేర్చుకుంటే ఆ తర్వాత మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. డబ్బును తెలివిగా ఉపయోగించుకునేవారు త్వరగా ఆర్థిక స్వాతంత్య్రం సాధించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు.

రెజిలియెన్స్‌ అండ్‌ అడాప్టబులిటీ 
జీవితం ఎప్పుడూ ఊహించినట్లుగా జరగదు, ఎత్తుపల్లాలు ఉంటాయి. టీనేజ్‌లో ఇవి మరీ ఎక్కువ. చదువుల ఒత్తిడి, రిలేషన్‌షిప్‌ సవాళ్లు, వ్యక్తిగత పరాభవాలను ఎదుర్కొంటారు. వీటన్నింటినీ తట్టుకుని నిలబడగలగడం అవసరం. ఫెయిల్యూర్‌ ముగింపు కాదని, విజయానికి మొదటి అడుగని అర్థం చేసుకోవడం ద్వారా సవాళ్లను సానుకూలంగా ఎదుర్కొంటారు. మార్పుకు అనుకూలంగా ఉండటం, అడ్డంకులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని నేర్చుకోవడం మానసిక శక్తిని పెంచుతుంది.

సెల్ఫ్‌ డిసిప్లిన్‌ 
సెల్ఫ్‌ డిసిప్లిన్‌ అంటే, తాత్కాలిక టెంప్టేషన్స్‌ను అర్థం చేసుకుని నియంత్రించడం, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించడం, వ్యక్తిగత విలువలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం. ఇది అకడమిక్‌ సక్సెస్‌కు మాత్రమే కాదు, వ్యక్తిగత వికాసానికీ అనివార్యమైన నైపుణ్యం. స్వీయ నియంత్రణ ఉన్న టీనేజర్లు అవరోధాలను సులువుగా అధిగమిస్తారు. పరీక్షల కోసం చదవడం, లేదా స్నేహితుల ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి పనులు సులవుగా నిర్వహించగలుగుతారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement