
యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్.. క్లింట్ హిల్ ఇటీవలే ఫిబ్రవరి 21న తన 93వ యేట కన్నుమూశారు. తుదిశ్వాస వరకు కూడా జీవితమంతా ఆయన ఒకటే ఆశించారు. తను 1963 నవంబర్ 22నే.. ‘ఆన్ ది స్పాట్’ చనిపోయి ఉంటే బాగుండేదని, ప్రజల మనసుల్లో తనకు చిరస్మరణీయ స్థానం దక్కి ఉండేదని! ఏమిటి ఆ రోజుకు అంత ప్రత్యేకత? అదేమిటో తెలుసుకోవాలంటే, ముందు ఆయన ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలి!
ఐదుగురు ప్రెసిడెంట్‌ల దగ్గర..!
ఐసనోవర్ మొదలు, వరుసగా జాన్ ఎఫ్. కెన్నెడీ, లిండన్ బి.జాన్సన్, రిచర్డ్ నిక్సన్, గెరాల్డ్ ఫోర్డ్.. మొత్తం ఐదుగురు అమెరికా ప్రెసిడెంట్‌ల దగ్గర సీక్రెట్ సర్వీస్ ఏజెంటుగా పని చేశారు క్లింట్ హిల్! గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, మిలటరీ సర్వీస్‌ను ముగించుకుని వచ్చాక 1958లో ప్రెసిడెంట్ ఐసనోవర్ సీక్రెట్ సర్వీస్‌లో ఏజెంట్‌గా తొలి ‘టఫెస్ట్’ జాబ్! అప్పటికి అతడి వయసు 26 ఏళ్లు.
ఐసనోవర్ 1953 నుంచి 1961 వరకు ఎనిమిదేళ్ల పాటు రెండు టెర్మ్‌లు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తర్వాత జాన్ ఎఫ్.కెన్నెడీ అధ్యక్షుడిగా వచ్చేవరకు ఐసనోవర్ దగ్గర మూడేళ్లు పని చేశారు హిల్. తర్వాత కెన్నెడీకి, ఆయన సతీమణి జాక్వెలీన్‌కు సీక్రెట్ సర్వీస్ ఏజెంటుగా ఉన్నారు. ‘‘ఆ రోజే, ఆన్ ది స్పాట్, నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేది’’ అని క్లింట్ ఏ రోజు గురించైతే అంటూండేవారో ఆ.. 1963 నవంబర్ 22.. కెన్నడీ హయాం లోనిదే!
అసలు ఆ రోజు ఏమైంది?!
ఏమీ కాలేదు! 62 ఏళ్ల క్రితం నాటి ఆ మధ్యాహ్నం 12.29 నిముషాల వరకు కూడా– అసలు ఏమీ కాలేదు. ఆ తర్వాతి 30వ నిముషంతోనే ఆ రోజుకు ఎక్కడలేని ప్రాముఖ్యం వచ్చి పడింది. ఓపెన్ టాప్ కారులో వెళుతున్న జాన్ ఎఫ్. కెన్నెడీ తలలోకి దూరాన్నుంచి తుపాకీ బులెట్ వచ్చి దిగబడింది! కెన్నెడీ అక్కడిక్కడ తల వాల్చేశారు. కారులో ఆయన పక్కన ఆయన సతీమణి కూర్చొని ఉన్నారు. వారి కారు వెనకే సీక్రెట్ ఏజెంట్ క్లింట్ హిల్ కూర్చొని ఉన్న కారు వెళ్తోంది. కెన్నెడీపై కాల్పులు మొదలవ్వగానే క్లింట్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక ఉదుటున గాల్లోంచి పైకి లేచి, కెన్నెడీ ఉన్న కారు మీదకు దూకారు.
అతడి మొదటి లక్ష్యం ప్రెసిడెంట్ కెన్నెడీని కాపాడటం, కొన్ని లిప్తల ఆలస్యంతో ఆ లక్ష్యం చేజారింది. రెండో లక్ష్యం జాక్వెలీన్‌ని కాపాడటం. అప్పటికే ఆమె దిక్కు తోచనట్లు సీట్లోంచి పైకి లేచి కంగారుగా కారు పై భాగంలోకి వచ్చేశారు. హిల్ తక్షణం ఆమెను తిరిగి ఆమె సీట్లోనే కూర్చోబెట్టి ఆమెకు వలయంగా ఏర్పడ్డాడు. ఇదంతా కూడా కారు రన్నింగ్‌లో ఉన్నప్పుడే.
క్షణమైనా ఆలస్యం చేయలేదు..!
కెన్నెడీపై కాల్పులు జరుగుతున్నట్లు గ్రహించగానే హిల్ వెంటనే తన కారులోంచి నేరుగా కెన్నెడీ ఉన్న కారు పైకి జంప్ చేశారు! ‘‘ఆ ఘటనలో నేను సెకనులో ఐదో వంతు వేగాన్ని, కనీసం ఒక సెకను వేగంగానైనా సాధించగలిగి ఉంటే... దురదృష్టవశాత్తూ ఇప్పుడు మీ ఎదురుగా కూర్చొని ఉండి ఉండేవాడిని కాదు..’’ అని అమెరికన్ టెలివిజన్ ప్రోగ్రాం ‘సీబీఎస్ 60 మినిట్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు హిల్.
‘‘ఆ వేగం నాకు సాధ్యపడి ఉంటే ప్రెసిడెంట్ కెన్నెడీని కాపాడే ప్రయత్నంలో నాకూ బులెట్‌లు తగిలి ఉండేవి. నేనూ ఆన్ ది స్పాట్ చనిపోయి ఉండేవాడిని. అప్పుడు నా మరణానికి ఒక సార్థకత ఉండేది’’ అని కుమిలిపోయారు హిల్. ఆ అపరాధ భావనతోనే 1975లో గెరాల్డ్ ఫోర్ట్ అధ్యక్షుడు అయిన రెండో ఏడాదే, తన 43 ఏళ్ల వయసులో సీక్రెట్ సర్వీస్ నుంచి ముందుగానే పదవీ విరమణ చేశారు.
‘‘హీరోని కాదు, నేనొక జీరో!’’
ఆ రోజు– కెన్నెడీ కారు, ఆ వెనుక మరికొన్ని కార్లు, నెమ్మదిగా కదులుతూ ముందుకు వెళుతున్న సమయంలో, రోడ్డుకు రెండు పక్కల నిలబడి చేతులు ఊపుతున్న జనం మధ్యలో అబ్రహాం జఫ్రూడర్ కూడా ఉన్నాడు. అతడొక వస్త్రాల వ్యాపారి. ప్రెసిడెంట్ కెన్నెడీ కాన్వాయ్‌ని ఉత్సాహం కొద్దీ వీడియో తీస్తూ ఉన్న అబ్రహాం చేతిలోని కెమెరాలో... కెన్నెడీపై కాల్పులు జరగడం, ఆయన తలవాల్చటం, వెనుక కార్లోంచి క్లింట్ హిల్ అమాంతం ఈ కారులోకి దూకటం– అన్నీ స్పష్టంగా రికార్డు అయ్యాయి.
ఆ వీడియో బయటికి వచ్చాక.. హిల్ అమెరికా ప్రజల హీరో అయ్యారు. కానీ హిల్ హీరోలా ఫీల్ అవలేదు. తానెందుకు బతికిపోయానా అని జీవితాంతం జీరోలా బాధపడుతూనే ఉండిపోయారు. అయినప్పటికీ అమెరికా చరిత్రలో చిరస్మరణీయుడిగా మిగిలారు. జేమ్స్ బాండ్ హీరో హీరో సెవన్‌గా అమెరికన్ ప్రజలు అతడిని కొనియాడారు.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment