ఈ వారం కథ: చిద్విలాసుడు | story of the week Funday | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: చిద్విలాసుడు

Published Sun, Apr 20 2025 9:38 AM | Last Updated on Sun, Apr 20 2025 9:38 AM

story of the week Funday

అతను చాలాకాలం తర్వాత బస్‌స్టాండ్‌ లో కనిపించాడు. నేను చూడనట్టు నటించాను. ఎక్కడ నుంచి చూశాడో నన్ను, పరుగెత్తుకుంటూ వచ్చి పట్టేసుకున్నాడు. ‘‘ఎంతకాలం అయ్యిందో శ్రీను! నిన్ను చూసి’’ అంటుంటే మొహంలో ఆనందం. ‘‘సంయుక్త బాగుందా? పిల్లాడు ఎలా ఉన్నాడు?’’ అంటూ నా గురించి అడుగుతున్నాడు. అదే హుషారు, అదే నవ్వు. జీవితాన్ని ఈజీగా తీసుకునే అతన్ని చూస్తే ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. మామూలుగా అయితే అది అసూయ! తప్పదురా దేవుడా! అనుకుంటూ ముఖం మీద నవ్వు పులుముకుని, ‘‘మీరు ఎలా వున్నారు?’’.. అడిగాను.ఎప్పటిలాగానే జేబులోంచి సిగరెట్టు తీసి వెలిగించి గుండెల్లోకి గట్టిగా పీల్చి గాలిలోకి పొగ వదులుతూ, ‘‘నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను’’ అన్నాడు. 

పదిహేను ఏళ్ల క్రితం ఎలా అనేవాడో అదే మాడ్యులేష తో అన్నాడు. అప్పటికీ ఇప్పటికీ అతని వ్యవహారంలో మార్పు ఏమీ లేదు. మనిషిలో కూడా పెద్దగా వచ్చిన మార్పులేదు. శరీరం మీద కాలం మిగిల్చిన ఆనవాళ్ళు తప్ప. ‘‘మీ పిల్లలు ఎలా ఉన్నారు’’.. అని అడిగే లోపున, ‘‘నీ ఫోన్‌ నెంబర్‌ ఇయ్యి శ్రీను’’ అంటూ మొబైల్‌లో టిక్‌ టిక్‌మని అనిపించి దాన్ని జేబులో పడేసుకుని, ‘‘నేను ఎక్కవలసిన బస్‌ వచ్చేసింది, ఫోన్‌ చేస్తాను’’ అంటూ హడావుడిగా, కదులుతున్న బస్‌ ఎక్కి, వెళ్ళిపోయాడు. భలే మనిషి సన్యాసి! పేరుకు తగ్గ మనిషి. బాదరబందీలు ఉన్నా పట్టనట్టు తిరిగే సర్వసంగ పరిత్యాగి. సన్యాసి అనే పేరే విచిత్రంగా అనిపించి ఒకసారి అడిగితే, ‘‘మా అమ్మకి చాలాకాలంగా పిల్లలు పుట్టలేదుట. 

ఒక రోజు ఒక సన్యాసి మా అరుగు మీద కూర్చున్నాడుట. అతణ్ణి చూసి జాలిపడి మా అమ్మ అన్నం పెట్టిందిట. తృప్తిగా తిని, త్వరలో నీ కడుపు పండుతుంది. ఒక పిల్లాడు పుడతాడు అని చెప్పి వెళ్లిపోయాడట. తర్వాత నేను పుట్టాను. అందుకే నాకు సన్యాసి అని పెట్టుకుంది’’ అని చెప్తూ చిద్విలాసంగా నవ్వాడు. ప్రపంచంలో నా అంత ఆనందంగా ఉండేవాడు మరొకడు లేడు అనేలా నవ్విన ఆ నవ్వు నా మస్తిష్కంలోంచి చెరిగిపోలేదు. అంతలా నా మనస్సులో ముద్ర వేశాడు. పదిహేనేళ్ల క్రితం మొదలైన మా పరిచయం, ట్రాన్స్‌ఫర్‌ మీద ఈ వూరు వచ్చే వరకు సాగింది. బలవంతాన నా ఆలోచనల్లో చొరబడ్డ ఆ పెద్దమనిషి నన్ను గతంలోకి లాక్కెళ్లాడు.

ఆ రోజు శనివారం ఆఫీసు హాఫ్‌ డే సెలవు. నేను వచ్చేసరికి, సంయుక్త గోడ అవతల ఉన్న ఒక కొత్త ఆమెతో మాట్లాడుతోంది. నేరుగా బాత్‌ రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి, కారుణ్యను ఎదురుగాకూర్చోబెట్టుకుని లెక్కలు చెప్పడం మొదలుపెట్టాను. సంయుక్త లోపలికి వస్తూ, ‘‘కాఫీ తాగారా’’ అని అడిగింది. తల ఊపాను.‘‘పక్క ఇంటికి కొత్తగా వచ్చారండి. ఆయన జిల్లా కోర్టులో పనిచేస్తారుట. ఆవిడే వచ్చి పరిచయం చేసుకుంది, ఆయన పేరు సన్యాసి, ఆమె పేరు పార్వతి. చాలా మంచామెలా ఉంది, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు అట. ఈ రోజుల్లో నలుగురంటే కష్టమే పాపం. పెద్ద అమ్మాయి వాళ్ళ పిన్ని దగ్గర ఉండి, చదువుకుంటోందట.

 పార్వతిగారికి పిండి వంటలు బాగా వచ్చట. మనకి ఏ సాయం కావాలన్నా చేస్తానన్నారు’’.. సంయుక్త కళ్ళల్లో ఆనందం. ఇంతలో గట్టిగా పెద్దపెద్ద అరుపులు, తిట్లు వినబడ్డాయి.ఇద్దరం బయటకు పరుగెత్తి శబ్దాలు వచ్చిన వైపు చూశాము. పక్క ఇంటి ఆవరణలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి జుట్టు జుట్టు పట్టుకుని రక్తాలు వచ్చేలా కొట్టుకుంటున్నారు. ఆడపిల్ల కూడా ఎక్కడా తగ్గడం లేదు.ఆ పిల్లాడితో సమానంగా పోరాడుతోంది. ఇద్దరికీ పది పన్నెండేళ్లు ఉండొచ్చు. పక్కింటావిడ వాళ్ళను విడదీయలేక, ‘‘ఒసేయ్‌ కమలా! ఒరేయ్‌ రాము ఆగండ్రా! కొట్టుకోకండి! ఏవయ్యో! వీళ్ళను ఆపలేకపోతున్నాను, వచ్చి ఆపవయ్యా’’ అంటూ అరుస్తోంది. మేము చూస్తున్నామని ఆమె గమనించినట్టుంది. సిగ్గుపడుతూ మొహం కిందకు దింపేసుకుని మొగుడు కోసం లోపలికి వెళ్ళింది. 

ఆ పిల్లలిద్దరూ మట్టిలో దొర్లుతున్నారు. కాసేపు అయ్యాక, అలిసిపోయి, ఆయాసపడుతూ అక్కడే మట్టిలో వెల్లకిలా పడుకుని ఆకాశం కేసి చూస్తున్నారు. ఇంతలో నడుము మీద వేలాడుతున్న లుంగీతో, పై భాగంలో ఏ ఆచ్ఛాదనా లేకుండా, నోటిలో కాలుతున్న సిగరెట్టుతో, నలభైఐదు, ఏభై ఏళ్ల మధ్యవయస్కుడు తాయితీయిగా నడుచుకుంటూ వచ్చి, ‘‘ఏరానాన్నా! ఏమ్మా అమ్ములూ! దెబ్బలు తగిలాయా! ఎందుకు నాన్నా అల్లరి’’ అంటూ వాళ్లను ప్రేమగా మందలించి లేవదీసుకుని లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు.‘‘ఛీ ఛీ ఎలా కొట్టుకున్నారో అనాగరికంగా? ఇలాంటి సంత తెచ్చి పెట్టాడు మన పక్క ఓనర్‌’’ అన్నాను సంయుక్తతో.నా మాట పట్టించుకోకుండా, ‘‘ఆ కూలిపోయేలా ఉన్న ఇంట్లో ఎలా ఉంటారో పాపం. 

పెంకులు మార్చి పదేళ్లు అవుతోంది. వానాకాలంలో ఎలాగో వీళ్ళకు?’’ అంటూ జాలి పడింది. నేను తన మాటలు పట్టించుకోకుండా.. నా కొడుకు చేసిన లెక్కలు చూస్తూ, వాడు తప్పు చేసినప్పుడల్లా, వాడిని మందలిస్తూ, శ్రద్ధగా చదవక పోతే ముందు ముందు ఎంత కష్టపడివలసి వస్తోందో మధ్య మధ్యలో వాడికి ఉపదేశిస్తున్నాను.‘‘ఎందుకండీ వాడిని మాటి మాటికి అలా భయపెడతారు?’’ అంటూ నా మాటలకు అడ్డు తగులుతోంది.‘‘నువ్వు మాటాడకు. నీకు తెలియదు. శ్రద్ధగా చదువుకోకపోతే చాలా కష్టం, చూస్తున్నావుగా బయట ఎంత కాంపిటీషనో?’’ అంటూ తనను మాట్లాడనివ్వలేదు. బాగా చదువుకుని, సరిగ్గా సెటిల్‌ అవ్వకపోతే, పిల్లాడి జీవితం ఏమైపోతుందోననే భయం నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఎన్నో కుటుంబాలలో పిల్లలు సరిగా స్థిరపడక పోవడం వలన, పెద్దలు మనఃశాంతి కోల్పోవడం చూశాను. 

అందుకే తెలియని భయం, బెంగ, టెన్షన్‌. ఎంత ప్రయత్నం చేసినా ఆ భయాన్ని వీడలేకపోతుంటాను. అందుకే, జీవితంలో చాలా క్రమబద్ధంగా, జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు కూడా క్రమశిక్షణలో ఉండాలనే నా తాపత్రయం. ఎవరైనా అందుకు విరుద్ధంగా ఉంటే నాకు నచ్చరు. అందుకనే మా పక్క ఇంటి పిల్లలు హోరాహోరీ కొట్టుకోవడం చూసి నాకు వెగటు వచ్చింది. వాళ్ళను కనీసం తిట్టకుండా, గారంగా మాట్లాడి, ఆ ఇంటిపెద్ద తీసుకువెళ్ళడం నాకు అస్సలు నచ్చలేదు. కారుణ్యను వాళ్ళ ఇంటి వైపుకు వెళ్ళకుండా ఆపమని సంయుక్తకు చెప్పాలి. లేకపోతే క్రమశిక్షణ లేకుండా వీడు కూడా వాళ్ళలా తయారవుతాడు అనే మరో అదనపు భయం నాకొచ్చి చేరింది.

మర్నాడు స్కూటర్‌ మీద ఆఫీసుకు బయలుదేరే సమయంలో, ‘‘శ్రీనివాస్‌ గారూ! ఆగండడాగండి! అంటూ చేతికి గుడ్డసంచి తగిలించుకుని, జేబులో చిల్లర ఎక్కడ పడిపోతుందోనని, దాని మీద చెయ్యి నొక్కిపెట్టుకుని పరుగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడు సన్యాసి. వంటిమీద మాసిపోయిన చొక్కా, మడమలపైకి పోయిన ప్యాంటు చూసిన నాకు చిరాకు వేసింది. ‘‘శ్రీనివాస్‌ గారు! మేము మీ పక్క ఇంట్లో కొత్తగా దిగాం. మా ఆవిడా, మీ మిస్సెస్‌గారు అప్పుడే ఫ్రెండ్స్‌ అయిపోయారు. అన్ని విషయాలు మాట్లాడేసుకున్నారు’’ అంటూ అవసరం లేకపోయినా గట్టిగా నవ్వుతూ, చేతులు పైకీ క్రిందకూ ఊపుతూ, వీధిలో అందరికీ వినబడేలా గట్టిగా మాట్లాడుతూ.. తన పేరు, ఉద్యోగం, కుటుంబ విషయాలు ఏకరువు పెడుతున్నాడు. ఆఫీసుకు టైము అవుతోందని రెండుసార్లు వాచీ చూసుకున్నాను. అయినా ఆ జీవి, గమనించలేదు. తన ధోరణి తనదే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నా ఇబ్బందిని అరుగుమీద నిలబడ్డ పార్వతి గమనించినట్టుంది.

‘‘అయ్యో! ఆయనకి ఆఫీసుకు టైము అవుతున్నట్టుందండీ’’ అని మొగుడుకి హింట్‌ ఇచ్చింది. అప్పుడు ఆయనగారు బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. ‘‘అయ్యో మీకు టైము అవుతుందనుకుంటా, మీ ఆఫీసు కూడా మా ఆఫీసు దగ్గరే! వెడుతూ మాట్లాడుకుందాం’’ అంటూ మొహమాటం లేకుండా, నా స్కూటర్‌ వెనకాల ఎక్కేశాడు. ఇదేం మనిషో? అనుమతి తీసుకుని ఎక్కాలన్న కనీస కర్టసీ లేదు అని మనసులో విసుక్కుంటూ వాహనం ముందుకు పోనిచ్చాను. వెనకాల కూర్చుని, ఆఫీసు వచ్చే వరకు మాట్లాడుతునే వున్నాడు. నేను వూ కొడుతూనే ఉన్నాను. అలా మొదలయింది నా మొదటి పరిచయం సన్యాసితో... తర్వాత.. మా మధ్యలో మాటలు కాస్త పెరిగాయి అనడం కన్నా, నేను అతణ్ణి వదిలించుకోలేక పోయాను అనే చెప్పాలి.

 ఆసక్తి లేకపోయినా, అతని వ్యవహారశైలి గమనించడం మొదలుపెట్టాను. దరిమిలా సన్యాసికి జీవితం పట్ల ఏ మాత్రం పట్టింపు లేదని అర్థం అయ్యింది. ఖాళీగా తన ఇంటి అరుగు మీద కూర్చుని, సిగరెట్టు కాలుస్తూ, నాలుగైదు సార్లు కాఫీలు తాగుతూ వీధిలో వెడుతున్నవాళ్లను పలకరిస్తూ ఉండడం చాలాసార్లు చూశాను. ఆదివారం వస్తే చాలు. ఇంటిల్లిపాదిని తీసుకుని సినిమాకి పోయేవాడు.సమాజంలో పెరుగుతున్న జీవన ప్రమాణాలు, తగ్గిపోతున్న డబ్బు విలువ, అతనికి పట్టవా అనిపించేది.ఆర్థిక ఇబ్బందులు నాకు పెద్దగా లేనప్పటికీ,. ఎప్పుడు డబ్బు అవసరం వస్తుందో అని టెన్షన్‌ పడుతూనే ఉంటాను. ఆచితూచి అడుగులు వేస్తూ పొదుపుగాను, క్రమశిక్షణతో ఉండడం నా నైజం. జీవితం పట్ల బాధ్యత, భవిష్యత్తు పట్ల భయం నన్ను అలా చేసినట్టుంది. అలాంటి నాకు సన్యాసి ఒక ప్రశ్నార్థకం.

పార్వతి మాటలని బట్టి, అతనికి జీతం డబ్బులు తప్ప, వేరే ఏం ఆదాయం లేదని తెలిసింది. అయినా ఈ జీవి డబ్బులు కోసం ఏనాడూ ఇబ్బంది పడుతున్నట్టు కనబడేవాడు కాదు. నన్ను ఎక్కడ అప్పు అడుగుతాడో అని భయపడుతూ ఉండేవాడిని. అందుకే అతని ఆర్థిక పరిస్థితుల గురించి అస్సలు అడిగేవాడిని కాదు.ఎప్పుడూ సంతోషంగా ఉండే అతణ్ణి చూస్తూ ఉంటే, నాలో ఎన్నో సందేహాలు రేగేవి. ఒకసారి పిచ్చి ప్రశ్న వేశానని, నాలో నేను అనుకుంటూనే, ‘‘మీ పిల్లలు ఎలా చదువుతారు సన్యాసిగారు’’ అని అడిగాను.అంతలా అల్లరి చేస్తూ, క్రమశిక్షణ లేని పిల్లలకు చదువు రాదనే నా నిశ్చితాభిప్రాయం. అతను చెప్పే లోపునే, మరో ప్రశ్న సంధించాను. ‘‘ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి! ఈ రోజుల్లో నలుగురు పిల్లలంటే మాటలా? ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? చిన్న చిన్న కుటుంబాలమైన మేమే సంసారాన్ని కష్టంగా లాగుతున్నాం. 

మీరు నలుగురిని ఎలా పోషిస్తున్నారా అని?’’ సందేహంగా అడిగాను. వెంటనే గట్టిగా ఒక నవ్వు నవ్వి, జేబులోంచి చార్మినార్‌ సిగరెట్టు తీసి నోట్లో పెట్టుకుని, అగ్గిపుల్లను పెట్టి మీద పెట్టి సర్‌ మని గీత గీసి చాలా స్టైల్‌గా సిగరెట్టు ముట్టించి, గుప్పున ఒక దమ్ము లాగి, ‘‘చూడు శ్రీను!’’ అంటూ, ఏకవచన సంబోధనలోకి దిగాడు అని నేను గమనించే లోపులోనే, ‘‘నువ్వు నా కన్నా చిన్నవాడివని చనువుగా అనేశానులే ఏమీ అనుకోకు’’ అని చెప్పడం మొదలుపెట్టాడు.‘‘మొదటి సంతానం ఆడపిల్ల పుట్టగానే, మా అమ్మ మగపిల్లాడు కావాలని గోల పెట్టింది. రెండవ వాడు సూరిగాడు పుట్టాడు..’’‘‘మరింకేం!’’ అన్నాను. ఎందుకు ఆపలేదు అనే ఉద్దేశంతో.‘‘ఆపరేషన్‌ నువ్వు చేయించుకో అంటే నువ్వు చేయించుకో అని పార్వతీ నేనూ దెబ్బలాడుకున్నాం.ఈలోగా ఒక శుభ ముహూర్తాన కవలలు పుట్టేశారు. ఏం చేస్తాం అంతా ఆ పరమాత్ముడి లీల’’ అని భళ్ళున నవ్వి గాలిలోకి చూశాడు. ఒళ్ళు మండిపోయింది అతని ధైర్యానికి.

నాకు ఆ కుటుంబం అంటే పెద్ద ఇష్టం లేకపోయినా, సంయుక్తకు పార్వతి ఎంతో ఆసరాగా ఉండేది. నేను ఆ వూళ్ళో ఉండగానే, పెద్ద కూతురుకు సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు సన్యాసి. వీళ్ళ ఆర్థిక స్తోమతకు, పిల్ల పెళ్లి ఎలా చేస్తారో అనుకుంటూ ఉండేవాడిని. మిస్టరీగా ఆ ఆమ్మాయి పెళ్లి జరిగితే అది హిస్టరీగా మిగిలిపోతుంది.. నవ్వుకునే వాడిని. ‘‘కనీసం ఒక పూట భోజనం కూడా సరిగా పెట్టలేని వాళ్ళు, అల్లుడు వస్తే ఎలా చూస్తారో కదా’’ అని సంయుక్తతో అంటే. ‘‘వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడుతున్నారు. ఏ సాయం చేయకపోగా, అలా వెటకారంగా మాట్లాడడం తప్పండీ పాపం’’ అని నన్ను మందలించేది. కారుణ్యని ఐఐటీ ఫౌండేష¯Œ కి కోచింగ్‌ ఇప్పించాలని, ఈ వూరికి ట్రాన్స్‌ఫర్‌ అప్లై చేశాను.

వెంటనే వచ్చింది. మేము వూరు విడిచి వెళ్లిపోతున్న రోజున చాలా బాధ పడిపోయారు సన్యాసి దంపతులు. సన్యాసి అయితే, ‘‘శ్రీను! నువ్వు వెళ్లిపోతుంటే నా బలం తగ్గిపోతున్నట్టుగా అనిపిస్తోందయ్యా’’ అంటూ బేలగా మాట్లాడాడు. నేను పెద్దగా స్పందించలేదు. సిటీ స్కూళ్లలో పిల్లల చదువులకు ఢోకా ఉండదని, భవిష్యత్తు బావుంటుందనే ఆనందంలో నేనున్నాను. సంయుక్త మటుకు చాలా బాధగానే, ఊరు వదిలి వచ్చింది. ఇక్కడకు వచ్చాక, నేను సన్యాసిని దాదాపు మర్చిపోయాను. సంయుక్త మటుకు చాలా కాలం పార్వతితో గడిపిన రోజులు గుర్తుకు తెచ్చుకునేది. కాలక్రమేణా కారుణ్య చదువులు పూర్తి అయ్యాయి, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదికి, రెండేళ్లకి వస్తూ ఉంటాడు.

సన్యాసి కనిపించాడు అని సంయుక్తకు చెప్పలేదు. ‘‘నాకేమయ్యా బ్రహ్మాండంగా ఉన్నాను’’ అనే సన్యాసి మాటలు నా గుండెలను కోసేస్తున్నాయి. చెవులలో ఆ మాటలే రింగుమంటున్నాయి. నలుగురు పిల్లలను కనడం అనే ఊహకే భయపడే ఈ రోజుల్లో, వాళ్ళను కని, చాలీ చాలని జీతం డబ్బులతో, అంతంత మాత్రంగా చదువుతున్న పిల్లలతో, గడుపుకు వస్తున్న సన్యాసి ఈ రోజుకీ ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నాడు? ‘మర్చిపోయాను’ అనుకున్న సన్యాసి, హఠాత్తుగా కనబడి, నేను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది. నాకు సమాధానం దొరక్క చివరికి సంయుక్తను ఆశ్రయించాను.

‘‘బాబయ్యగారు కనిపించారా? నాకు చెప్పనేలేదు. మీకు వాళ్ళంటే చిన్నచూపు ఇంకా పోలేదన్నమాట?’’ రుసరుసలాడింది.‘‘నాకు తెలియక అడుగుతాను. నెత్తి మీద అన్ని బాధ్యతలు పెట్టుకున్న మీ బాబాయి గారు, పిల్లలు పెద్ద అయినా ఇప్పటికీ ‘నాకేమయ్యా బ్రహ్మాండంగా ఉన్నాను’ అని మాట్లాడుతున్నాడు. ఆదేమైనా గొప్పకు మాట్లాడతాడా? లేదా పిచ్చా ?’’ అన్నాను తనతో. నాకేసి చూసి ఒక నవ్వు నవ్వి, ‘‘వాళ్ళకేం బ్రహ్మాండంగానే ఉన్నారండీ’’ అంది. నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. ‘‘ఆ రోజుల్లో వాళ్ళ బతుకేదో వాళ్ళు బతికారు పాపం. నేను కూడా పెద్ద సాయం చేసేదాన్ని కాదు. పిల్లలు అల్లరి చేస్తూ కొట్టుకుంటున్నా, వాళ్ళను ఏమీ అనకుండా, దగ్గరకు తీసుకుని, మంచి మాటలు చెప్పేవారుట బాబయ్యగారు. వాళ్ళు ఏమి అడిగినా, అప్పోసొప్పో చేసి, కొనిపెట్టేవారుట. వాళ్ళు కూడా కొంతకాలానికి బాధ్యత తెలుసుకుని, ప్రవర్తించడం మొదలు పెట్టారుట.

పార్వతి పిన్నిగారు మన వీధిలో అందరికీ సాయంగా ఉండేదిగా. ఆ మంచితనం వలనే, పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకుని, ముందుకు వచ్చి, పెద్ద కూతుర్ని కోడలుగా చేసుకున్నారుట’’ చెప్పింది. నేను ఆ రోజున వాళ్ళను చిన్నచూపు చూస్తూ సంధించిన మాటల శరాలు నాకే తిరిగి గుచ్చుకున్నట్టుగా అనిపించి గిల గిలలాడాను. ‘‘పెద్ద కొడుకు సూరి , కిరాణా హోల్‌సేల్‌ బిజెనెస్‌ పెట్టి, బాగా సంపాదిస్తున్నాడుట. వాడే కమల పెళ్లి చేశాడుట. మీరు ఎప్పుడూ ఎందుకు పనికిరాడు అని తిట్టి, ఇంట్లోకి కూడా రానిచ్చేవారు కదా! ఆ చిన్న కొడుకు రాముని,.. మనిషిగా పుట్టినా ఈ జన్మభూమికి నేను చేసింది ఏమీ లేదు! నువ్వైనా డిఫెన్సులో చేరి, దేశానికి సేవ చేయమని ప్రోత్సహించారుట బాబాయిగారు. 

మనం ఏం తిన్నామో, ఎలా బతికామో ఎవ్వరికీ తెలియకూడదు. మనల్ని చూసి ఎవరూ జాలి పడకూడదు. అవతలివాళ్ళ దగ్గర నుండి జాలి ఆశించకూడదు. అలా ఉంటే, దేహీ అని అందర్నీ ఆడగాలనిపించి, దానికి అలవాటు పడిపోతాం. అందుకే మనం ఎన్ని కష్టాలు వచ్చి మీద పడ్డా ఎప్పుడూ సంతోషంగా కనిపించాలి’’ అని మా అమ్మ చెప్పేది అని అంటూ ఉండేవారుట. ఆయన అలా నవ్వుతూ కనబడే మనిషే కానీ, లోతైన మనిషి అండీ’’ అంది తాపీగా.‘‘నీకు వాళ్ళ విషయాలన్నీ ఎలా తెలిశాయి?’’ సందేహం ఆపుకోలేకపోయాను. ‘‘మొన్నామధ్య సోషల్‌ మీడియాలో రాముని చూశాను. పార్వతి పిన్నిగారి నంబర్‌ తీసుకున్నాను, మీకు వాళ్ళంటే ఇష్టం ఉండదు కదా! అందుకే చెప్పలేదు’’ అని అక్కడ నుండి వెళ్ళిపోయింది.‘నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను’’ గొణుక్కున్నాను. అనుకరించడానికి ప్రయత్నించే అబద్ధంతో నన్ను నేనే ఆత్మవంచన చేసుకుంటున్నట్టుగా అనిపించింది నాకు. సన్యాసి నాకు రాజర్షిలా అంతర్దర్శనం ఇచ్చాడు.  

∙చాగంటి ప్రసాద్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement