
సాధారణంగా మేకప్ ప్రియులకు ప్రయాణాలనగానే దిగులు మొదలైపోతుంది. వెళ్లిన చోట మేకప్ వేసుకోవడానికి వీలుంటుందా? సరైన లైటింగ్ ఉంటుందా? కాస్మెటిక్స్ అన్నీ ఎందులో పెట్టుకోవాలి? ఎలా తీసుకెళ్లాలి? ఇలా చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. అలాంటి వారికి చక్కటి పరిష్కారం ఈ ట్రావెల్ మేకప్ బ్యాగ్.
చిత్రంలోని ఈ స్టైలిష్ బ్యాగ్‌లో ఒక ప్రత్యేకమైన ఎల్‌ఈడీ లైట్ మిర్రర్ ఉంటుంది. దీనిలో మూడు రకాల లైటింగ్ సెట్టింగ్స్ ఉండటంతో మీరు ఎక్కడ ఉన్నా, నచ్చిన వెలుతురులో మేకప్ వేసుకోవచ్చు. ఇకపై ఎక్కడికి వెళ్లినా మేకప్ వేసుకునేటప్పుడు సరిగా కనబడటం లేదని చింతించాల్సిన పని లేదు. అన్ని రకాల సౌందర్య సాధనాలను చక్కగా అమర్చుకోవడానికి ఈ బ్యాగ్‌లో తగినంత స్థలం ఉంటుంది. బ్రష్‌లు, లిప్‌స్టిక్‌లు, ఫౌండేషన్లు, క్రీములు ఇలా అన్నింటినీ వేర్వేరుగా పెట్టుకోవచ్చు.
ఇది రీచార్జబుల్ డివైస్ కాబట్టి, బ్యాటరీ అయిపోతుందనే భయం కూడా అవసరం లేదు. ఇది వెంట ఉంటే, ఎప్పుడంటే అప్పుడు మేకప్ వేసుకోవచ్చు. ఈ బ్యాగ్స్‌లో చాలా రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా రంగుల్లో దొరుకుతున్నాయి. నిత్యం టూర్స్‌కో, ఫంక్షన్స్‌కి వెళ్లే మహిళలకు, దీన్ని బహుమతిగా కూడా ఇవ్వచ్చు.
(చదవండి: నిన్న పిజ్జా మేకర్.. నేడు ఫ్యాషన్ మోడల్..! అంతర్జాతీయ ఫ్యాషన్ పత్రికలు..)