రాధ డిగ్రీ చదువుతోంది. చూడ్డానికి చక్కగా ఉంటుంది. బాగా చదువుతుంది. అందరితో కలివిడిగా మాట్లాడుతుంది. కానీ కొన్ని నెలలుగా ఆమె అతిగా తింటోంది. అక్కడితో ఆగడంలేదు. అతిగా తినడంవల్ల లావయిపోతాననే భయంతో భోజనం కాగానే వాష్ రూమ్‌లోకి వెళ్లి బలవంతంగా వాంతి చేసుకుంటోంది. అలా చేయడం నేరంగా, అవమానకరంగా భావిస్తోంది. క్లాసులో కూర్చున్నా ఆలోచన మాత్రం బరువుపైనే ఉంటోంది. తన శరీరాకృతి సరిగా ఉందో లేదోనని తరచూ అద్దంలో చూసుకుంటోంది. బరువు తగ్గించుకునేందుకు విపరీతంగా వ్యాయామం చేస్తోంది.
రాధ ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి గీతాదేవి ఏం జరుగుతోందని ఆరా తీసింది. అలా తిని, బలవంతంగా వాంతి చేసుకోవడం లేదా అతిగా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి చూసింది. రాధ వయసుకు తగ్గ బరువే ఉందని వెయింగ్ మెషిన్‌లో చూపించింది. కానీ రాధ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. దాంతో ఏం చేయాలో అర్థంకాక తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ఆయన సలహా మేరకు రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ చేయించారు. న్యూట్రిషనిస్ట్‌ను కలసి ఆహారపు అలవాట్లు, బరువు తగ్గే మార్గాలపై కౌన్సెలింగ్ తీసుకున్నారు.
ఫ్యామిలీ డాక్డర్ సలహా మేరకు సైకోడయాగ్నసిస్‌కి తీసుకొచ్చారు. రాధతో మాట్లాడాక ఆమె బులీమియా నెర్వోసా అనే మానసిక రుగ్మతతో బాఢపడుతోందని అర్థమైంది. అతిగా తినడం, వెంటనే బలవంతంగా వాంతి చేసుకోవడం దీని ప్రధాన లక్షణం. వారానికి ఒకసారి అతిగా తిని, వాంతి చేసుకుంటే బులీమియా ఉందని నిర్ధారణ చేసుకోవచ్చు.
పలురకాల చికిత్సలు అవసరం..
బులీమియాకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల చికిత్సలు అవసరం కావచ్చు. అంటే సైకాలజిస్ట్, ఫ్యామిలీ డాక్టర్, డైటీషియన్‌లతో కూడిన బృందం అవసరం ఉండవచ్చు. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడంతోపాటు లైఫ్ స్టయిల్‌లోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
– బులీమియా గురించి తెలుసుకోవాలి. థెరపీ సెషన్లను దాటవేయవద్దు.
– ఆహారం, వ్యాయామం ప్రొఫెషనల్స్ సలహాతోనే తీసుకోవాలి.. చేయాలి.
– అదే పనిగా బరువు చెక్ చేసుకోవద్దు, అద్దంలో చూసుకోవద్దు. ఈ తరహా ధోరణి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రేరేపించే ప్రమాదం ఉంది.
– ఆకలిని తగ్గించే లేదా బరువును తగ్గించే సప్లిమెంట్లు లేదా మూలికల వల్ల దుష్ప్రభావాలు ఉండవచ్చు. అందువల్ల వాటికి దూరంగా ఉండాలి.
– Enhanced cognitive behavior therapy ద్వారా తిండి గురించిన అనారోగ్యకరమైన నమ్మకాలు, ప్రవర్తన స్థానంలో ఆరోగ్యకరమైన నమ్మకాలు, ప్రవర్తనను పెంపొందించవచ్చు.
– బులీమియాతో బాధపడుతున్న పిల్లలు, టీనేజర్ల పేరెంట్స్ ఏం చేయాలో తెలుసుకోవడానికి, పిల్లలు తినే వాటిపై నియంత్రణ తీసుకురావడానికి Family based therapy సహాయపడుతుంది.
– ఒత్తిడిని తట్టుకోవడానికి, ఎమోషనల్ బ్యాలెన్స్సకి, ఇతరులతో సర్దుకుపోవడానికి డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ ఉపయోగపడుతుంది.
– యాంటీడిప్రెసెంట్స్‌తో బులీమియా లక్షణాలను తగ్గించవచ్చు. టాక్ థెరపీతో పాటు దీన్ని ఉపయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు ఉంటాయి.
– బులీమియాకు చికిత్స చేయడంలో ప్రత్యేక శిక్షణ పొందిన డైటీషియన్లు సహాయపడతారు.
– బులీమియా తీవ్రంగా ఉండి.. ఇతరత్రా తీవ్రమైన ఆరోగ్య సమస్యలూ ఉంటే ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు.
బులీమియా లక్షణాలు...
– ఒకే సిట్టింగ్‌లో అసాధారణ రీతిలో ఆహారాన్ని అతిగా తినడం
– అతిగా తినడాన్ని నియంత్రించలేకపోతున్నామని అనిపించడం
– బరువు పెరగకుండా ఉండటానికి ఉద్దేశపూర్వకంగా వాంతులు చేసుకోవడం లేదా అతిగా తిన్న తర్వాత విపరీతంగా వ్యాయామం చేయడం
– బరువు పెరుగుతుందనే భయంతో, అనారోగ్యకరమైన మార్గాల్లో బరువు తగ్గడానికి ప్రయత్నించడం
– విరేచనాల కోసం మందులు ఉపయోగించడం
– శరీర ఆకృతి, బరువు విషయంలో చాలా అసంతృప్తిగా ఉండటం
– విపరీతమైన మూడ్ స్వింగ్స్‌ని కలిగి ఉండటం.
బులీమియా నెర్వోసాకు బింజ్ ఈటింగ్ డిజార్డర్‌కు మధ్య తేడా..
బులీమియా నెర్వోసా ఉన్న వ్యక్తులు అతిగా తిని, ఆ తర్వాత బలవంతంగా వాంతి చేసుకుని ఆహారాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తారు. బింజ్ ఈటింగ్ రుగ్మత ఉన్న వ్యక్తులు కూడా అతిగా తింటారు, కానీ వాంతి చేసుకోరు. అలాగే, బులీమియాతో బాధపడుతున్న వ్యక్తులు సాధారణంగా ఆరోగ్యకరమైన బరువుతో ఉంటారు. బింజ్ ఈటింగ్ రుగ్మత ఉన్న వ్యక్తులు సాధారణంగా అధిక బరువు/ఊబకాయం కలిగి ఉంటారు.
– సైకాలజిస్ట్ విశేష్
Comments
Please login to add a commentAdd a comment