‘పెళ్లంటే నూరేళ్ల పంట, అది పండాలి కోరుకున్న వారి ఇంట పండాలి’... అనే పాట ఒకప్పుడు చాలా పాపులర్. ఈతరం ఒక్కసారి కూడా విని ఉండదు. ఈ పాటలాగే పెళ్లి కూడా పాతబడిపోతోంది. ఈ మాట అంటే చాలామందికి కోపం రావచ్చు. కానీ పెళ్లి స్వరూపం మారిపోతోందనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెళ్లి స్థానంలో లివ్ ఇన్ రిలేషన్‌షిప్ వచ్చేస్తోంది. పెళ్లికి ముందే ఒకే ఇంట్లో కలిసి ఉండే జంటల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
ఇది ఎక్కడకు వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. అయితే పెళ్లయినా, లివ్ ఇన్ అయినా మరెలాంటి బంధమైనా నిలబడాలంటే ఏడు సూత్రాలు పాటించాలని ‘ఫ్యామిలీ జర్నల్’ జరిపిన సైకాలజికల్ రీసెర్చ్‌లో వెల్లడైంది. ఈ ఏడు సూత్రాలు పాటించడం ద్వారా జీవిత భాగస్వాముల మధ్య ప్రేమ, సామరస్యం వెల్లివిరుస్తుందని ఆ అధ్యయనం చెబుతోంది. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం.
లోపాలను బలాలుగా మార్చుకోగల సామర్థ్యం..
పెళ్లంటే చాలా సవాళ్లు ఉంటాయి. భార్యాభర్తల్లో లోపాలుంటాయి, దిగులుపడే సందర్భాలు ఉంటాయి. ఆ సవాళ్లను ఎలా పరిష్కరించుకుంటారు, వారి లోపాలను ఎలా మార్చుకుంటారనేదే వారి బంధంలోని బలాన్ని నిర్ణయిస్తుం దని ఈ అధ్యయనంలో వెల్లడైంది. కష్టసమయాల్లో ఒకరికొకరు ఓదార్పు, మద్దతు, ప్రోత్సాహం అందిస్తూ కలిసి సమస్యలు ఎదుర్కోవడమే తొలిమెట్టు.
కలిసి పంచుకోవడం కీలకం..
‘నా స్పేస్ నాకు కావాలి’ అంటూ గొడవపడే జంటలు మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు. పెళ్లంటేనే కలిసి జీవితాన్ని పంచుకోవడం. ఇద్దరూ కలిసి ఆనందించే చర్యల ద్వారా తమదైన ప్రపంచాన్ని సృష్టించుకోవడం అవసరమని ఈ అధ్యయనం హైలైట్ చేస్తుంది. ఇలా చేయడం జంట మధ్య భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. అందువల్ల తరచుగా కలిసి నడవడం, వంటచేయడం, పరస్పర హాబీలను ప్రోత్సహించుకోవడం లాంటి పనులు చేయాలి.
విభేదాలు, మార్పును సహించడం..
పెళ్లంటే భిన్న వ్యక్తిత్వాలున్న ఇద్దరు కలిసి ఒకటిగా జీవించడం. అంటే వారిద్దరి మధ్య విభేదాలు సహజం. వాటిని అంగీకరించడం, సహించడం అవసరం. అలాగే బంధంలో, భాగస్వామిలో వచ్చే మార్పును ముప్పుగా భావించకుండా, దాన్ని పరిణామానికి ఒక అవకాశంగా చూడాలి. విభేదాలతో విడిపోకుండా, అవి ఒకరి గురించి మరొకరు మరింత తెలుసుకోవడానికి అమూల్యమైన అవకాశాలుగా వినియోగించుకోవాలి.
రాజీతోనే విభేదాలు పరిష్కారం..
వైవాహిక జీవితంలో విభేదాలు సహజం. తప్పెవరిదైనా విభేదాలను పరిష్కరించు కోవడానికి రాజీ పడటం అవసరం. అలా రాజీపడి విభేదాలను పరిష్కరించుకోగల జంటలు ఎక్కువ సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తారని అధ్యయనం చెబుతోంది. అందువల్ల లోపాల గురించి విమర్శించుకునే బదులు బలాలు, సానుకూల లక్షణాలను ప్రశంసించడంపై దృష్టి పెట్టండి. ఒకరిపట్ల మరొకరికి అవగాహన, కృతజ్ఞత కలిగి ఉండటం సామరస్య వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.
అప్పుడప్పుడైనా మెచ్చుకోవాలి..
భార్య వంట చేస్తే లొట్టలేసుకుంటూ తినడం, భర్త బంగారం కొనిస్తే తీసుకోవడమే కాదు.. వారికెప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? చిన్న చిన్న విషయాలకు కూడా థాంక్స్ చెప్పడం అవసరమని అధ్యయనం నొక్కి చెబుతుంది. అలా చేయడం జంట మధ్య ప్రేమ, అనుబంధాన్ని పెంపొందిస్తుంది. అందుకే మీ పార్ట్‌నర్ సహకారాన్ని, లవ్ సిగ్నల్స్‌ను గుర్తించి అభినందించేందుకు ప్రయత్నించండి.
బంధంలో నిబద్ధత..
భారతదేశంలో పెళ్లంటేనే జీవితకాల బంధం. అది విజయవంతం కావాలంటే నిబద్ధత కీలకం. జీవితంలో వచ్చే చెడు కాలాలను దాటి బంధం నిలబడాలంటే జంటలో అంకితభావం, పట్టుదల అవసరం. అన్నింటికంటే వైవాహిక బంధమే ముఖ్యమైనదని గుర్తించి, దాన్ని కాపాడుకోవడానికి సమయం వెచ్చించాలి. అలా కాల పరీక్షను తట్టుకుని నిలబడే ప్రేమ, విశ్వాసాలకు పునాదిని నిర్మించుకోవచ్చు.
తనను తాను గౌరవించుకోవాలి..
ఆరోగ్యకరమైన సంబంధాలకు ఆత్మగౌరవం ఆధారం. అది మీరు మీ భాగస్వామితో వ్యవహరించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. బలమైన ఆత్మగౌరవం ఉన్నవారు సంతృప్తికరమైన సంబంధాలను కొనసాగించడానికి మెరుగ్గా సన్నద్ధమవుతారని అధ్యయనం సూచిస్తోంది. ఆత్మగౌరవం లేనివారు చిన్నచిన్న విషయాలకు కూడా నొచ్చుకుని గొడవపడుతుంటారు. అందుకే ముందుగా మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, ప్రేమించుకోండి. అది మీ వైవాహిక బంధానికి పునాదిగా నిలుస్తుంది.
ఇవి చదవండి: Father's Day 2024: హాయ్..! నాన్న..!!
Comments
Please login to add a commentAdd a comment