Vishesh
-
ప్రాణాలు తీసే అభిమానం సరికాదు!
పుష్ప-2 సినిమా విడుదలై సంచలనం సృష్టిస్తోంది. కానీ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండటం మనసును కలచివేస్తోంది.అసలెందుకిలా జరుగుతోంది? సినిమాల పట్ల ఇంత వేలంవెర్రి ఎందుకు? టికెట్ల ధరలు వేల రూపాయల్లో ఉండటమేంటి? అందుకు ప్రభుత్వాలు అనుమతించడమేంటి? వేలకు వేలు పెట్టి టికెట్లు కొనడమే కాకుండా, ప్రాణాలకు తెగించి మరీ బెనిఫిట్ షో చూడాలనే ఇంత పిచ్చి అభిమానం ఎందుకు ఏర్పడుతోంది? దీన్ని ఎలా నివారించాలి? అని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.మనదేశంలో సినీ పరిశ్రమ కేవలం వినోదంగా మాత్రమే కాకుండా ఒక మతంలా మారిపోయింది. సినిమా హీరోలను దేవుళ్లుగా భావించడం, వారి సినిమా అందరికంటే ముందుగా చూడటం గొప్పగా భావించే మైండ్ సెట్ గా మారిపోయింది.ఫ్యాన్స్ మానసిక స్థితిఅభిమానుల్లో చాలామంది తమ అభిమాన నటులతో మానసికంగా అనుబంధం ఏర్పరచుకుంటారు. వారితో మమేకమవుతారు. వారిలో తమను చూసుకుంటారు. అభిమాన హీరో సినిమా విజయాన్ని తమ విజయంగా భావిస్తారు. అది వారి వ్యక్తిగత జీవితంలోని లోటుపాట్లనుంచి తాత్కాలిక ఉపశమనాన్నిస్తుంది. అంటే సామాన్య వ్యక్తి నిజ జీవితంలో సాధించలేని విజయాన్ని తమ హీరో విజయంలో చూసుకుని సంతృప్తి చెందుతాడు. ముఖ్యంగా పిల్లలు ఆ హీరోలకు అనుకరిస్తారు. ఈ దుర్ఘటనలో గాయపడిన శ్రీతేజ్ తనను తాను పుష్పలా భావించుకునేవాడని, అతన్ని అందరూ పుష్ప అని పిలిచేవారని తండ్రి చెప్పడం మనం గుర్తించాలి.మరోవైపు మొదటి రోజు మొదటి షో చూడటం వల్ల వచ్చే థ్రిల్, ఎక్సయిట్మెంట్ మనలో ఆనందాన్ని కలిగించే డోపమైన్ అనే రసాయనం ఎక్కువగా స్రవించేందుకు కారణమవుతుంది. దాంతో ఆ అనుభవం ఎక్సయిటింగ్ గా అనిపిస్తుంది. అందుకే ప్రతీ మూవీ మొదటిరోజు చూసేందుకు, అందుకోసం ఎన్ని వేల రూపాయలైనా ఖర్చుపెట్టేందుకు ఉర్రూతలూగుతుంటారు.మొదటిరోజు మొదటి షో చూసిన ఫ్యాన్స్ తమను తాము ప్రత్యేక వ్యక్తులుగా, ఇతరుల కంటే గొప్పగా భావిస్తుంటారు. అలా తమ గ్రూప్ లో ఒక గుర్తింపును పొందాలనుకునే కోరికను ఇది తెలియపరుస్తుంది. అంతేకాదు, ఫ్యాన్స్ గ్రూప్ లో ఉన్నవారిపై కనిపించని ఒత్తిడి ఉంటుంది. మొదటి రోజు మొదటి షోను మిస్ అవ్వకుండా చూడటం తప్పనిసరి బాధ్యతగా ఫీలవుతుంటారు. ఇది గుంపు ప్రవర్తన (Herd Behaviour)తో ముడిపడి ఉంటుంది.గుంపులో ఉన్న వ్యక్తులు వారి వ్యక్తిగత బాధ్యతను కోల్పోతారు. అభిమానుల ఆసక్తి, ఉత్తేజం వేగంగా పాకిపోతుంది, చిన్న అవాంతరాలు కూడా పెద్ద సంఘటనలుగా మారతాయి. తొక్కిసలాట జరిగినప్పుడు భయాందోళనలు పెరిగి అందరూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది ప్రమాదాలకు కారణమవుతుంద. సంధ్య ధియేటర్ వద్ద జరిగింది ఇదే.నిర్మాతల వ్యాపారాత్మక ధోరణి... బాహుబలితో మొదలైన పాన్ ఇండియా మూవీల హవా పుష్ప-2తో ఒక మేనియాగా మారింది. దీన్ని వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వారిని ప్రోత్సహిస్తూ భారీగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇస్తున్నాయి. ప్రజల భావోద్వేగాలను వీలైనంతగా సొమ్ము చేసుకునే కమర్షియల్ ఆపర్చునిజానికి ఇది నిలువెత్తు నిదర్శనం.వ్యాపారాత్మక ధోరణి తప్ప, అభిమానుల బలహీనతలను సొమ్మి చేసుకోవడం నిర్మాతల నైతికలోపంగా భావించవచ్చు. కానీ టికెట్ ధరలు విపరీతంగా పెంచడం సినిమాను సామాన్య ప్రజలకు దూరం చేస్తుందన్న విషయాన్ని వారు గుర్తించడం లేదు.ఇదీ చదవండి: బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా?మరోవైపు, భారీ రద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్‌కు రావడం అల్లు అర్జున్ చేసిన తప్పని చెప్పక తప్పదు. ఆ సమయంలో తాను కనిపిస్తే తనను చూసేందుకు అభిమానులు ఎగబడతారని, తొక్కిసలాట జరగవచ్చని గుర్తించి ఉండాల్సింది. ఆయనా పని చేయలేదు. సరే ఆయన వచ్చారు. ధియేటర్ యాజమాన్యం, పోలీసులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేకపోయారు. ఫలితంగా ఒక నిండుప్రాణం బలయ్యింది. అందరూ బాధ్యత తీసుకోవాలి.. • ఇలాంటి సంఘటనలు చూశాకైనా ఫ్యాన్స్ మేల్కోవాల్సిన అవసరం ఉంది. తమ ప్రాధాన్యతలను పునరాలోచించుకోవాలి. ప్రాణాలకంటే సినిమా ఎక్కువ కాదని గుర్తించి మసలు కోవాల్సిన అవసరం ఉంది. • పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు తమ అభిమానుల ఆలోచనలపై ప్రభావం చూపించగలగాలి. వాళ్ళ అభిమానులు జవాబుదారీతనం కలిగి ఉండేలా చేసే ప్రయత్నాలు చేయాలి.• నిర్మాతలు ఆర్థిక ప్రయోజనాలకు మించిన బాధ్యతను గుర్తించాలి, మెరుగైన వినోదం సరసమైన ధరలకు అందించేందుకు ప్రయత్నించాలి. • మీడియా కూడా సినిమా ప్రచార కార్యక్రమాల ప్రసారం విషయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.-సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
బుల్లీయింగ్... సైబర్ బుల్లీయింగ్...
బుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ ప్రపంచవ్యాప్తంగా యువతను ప్రభావితం చేసే సమస్యలుగా మారాయి. సాధారణంగా బుల్లీయింగ్ అంటే భౌతిక హింస, మాటలతో అవమానించడం, సామాజికంగా బహిష్కరించడం, పుకార్లు. డిజిటల్ టెక్నాలజీ వల్ల సైబర్ బుల్లీయింగ్ వచ్చేసింది. ఇది సోషల్ మీడియా, టెక్స్టింగ్ లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా జరిగే బుల్లీయింగ్. తామెవ్వరో తెలీకుండా కామెంట్ చేసే అవకాశం ఉండటంతో దీనికి హద్దే లేకుండా పోతోంది. కాదేదీ అనర్హం..బుల్లీయింగ్ చిన్న సమస్య కాదు. దీనివల్ల చాలామంది విద్యార్థులు, ముఖ్యంగా యువత నిరంతర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బుల్లీయింగ్ చేసేవారికి ప్రత్యేక కారణమేదీ అవసరం లేదు. తమ ఆధిక్యతను ప్రదర్శించడం కోసం బాధితుల్లో ఏదో ఒక అంశాన్ని తీసుకుని బుల్లీయింగ్ చేస్తుంటారు. అది వారి రూపం నుంచి అకడమిక్ పర్ఫార్మెన్స్ వరకూ ఏదైనా కావచ్చు. దీంతో బాధితులకు ‘నాకు మద్దతుగా ఎవ్వరూ లేరు, నాకిది భద్రమైన ప్రదేశం కాదు’ అనిపిస్తుంటుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడని టీనేజర్ లేడనే చెప్పవచ్చు. దీంతో సైబర్ బుల్లీయింగ్ వ్యక్తిగత జీవితానికీ విస్తరించింది. టీనేజ్లోనే ఎందుకు ఎక్కువ?టీనేజర్లు తమ వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, సామాజిక సంబంధాలు వంటి అంశాలను అన్వేషించే సమయంలో వారు మరింత సున్నితంగా ఉంటారు. స్నేహితుల నుంచి అనుకూలత పొందడం కోసం ప్రయత్నిస్తుంటారు. దీన్ని బుల్లీయర్లు దుర్వినియోగం చేస్తుంటారు. నివారణ వ్యూహాలుబుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ ప్రభావాలను అర్థం చేసుకోవడం మొదటి దశ మాత్రమే. ఈ సమస్యలను పరిష్కరించడానికి పాఠశాలలు, తల్లిదండ్రులు, కమ్యూనిటీల భాగస్వామ్యంతో సమర్థవంతమైన వ్యూహాలు అవసరం. కొన్ని ముఖ్యమైన వ్యూహాలు:1. బుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ హానికరమైన ప్రభావాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుసుకోవడం చాలా అవసరం. అవగాహన కార్యక్రమాలు యువతను బుల్లీయింగ్ ప్రవర్తనలను గుర్తించేందుకు ప్రోత్సహిస్తాయి.2. పాస్‌వర్డ్స్‌ని పంచుకోవద్దని స్పష్టంగా చెప్పండి. మానసికంగా ప్రేరేపించేదాన్ని గుర్తించి నిరోధించండి.3. మీ టీన్‌తో ఓపెన్‌గా మాట్లాడండి. వారి అనుభవాలను తెలుసుకుని, వారికి సురక్షితమైన వాతావరణం కల్పించండి.4. వారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకు అవసరమైన ధైర్యాన్నివ్వండి. వారి మంచి లక్షణాలను గుర్తించి అభినందించండి.5. బుల్లీయింగ్ గురించి మీతో చెప్పుకునే స్వేచ్ఛనివ్వండి. వాళ్లను జడ్జ్ చేయకుండా సమస్యను అర్థం చేసుకోండి. 6. సానుకూలమైన స్నేహాలు ఒక రక్షణ కవచంలా ఉంటాయి. వారి స్నేహాలను ఆరోగ్యకరమైన దిశలో ప్రోత్సహించండి.7. పాఠశాల లేదా కళాశాలలో బుల్లీయింగ్ చోటు చేసుకుంటే.. ఉపాధ్యాయులు, కౌన్సిలర్లతో కలిసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. బుల్లీయింగ్ వ్యతిరేక విధానాలు స్పష్టంగా అమలయ్యేలా చూడండి. 8. బుల్లీయింగ్ని చూస్తూ ఉండకుండా, వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రోత్సహించండి. 9. తీవ్రత నుంచి బయటపడటానికి బ్రీదింగ్, మెడిటేషన్, జర్నలింగ్ వంటి సాధనాలు నేర్పండి.10. పిల్లలు తల్లిదండ్రులను గమనిస్తూ వారిని అనుకరిస్తుంటారు. అందుకే మీరు ప్రతి సమస్యను శాంతంగా పరిష్కరించి చూపడానికి ప్రయత్నించాలి. 11. సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సాయం తీసుకోవడం మంచిది.తీవ్ర ప్రభావం..బుల్లీయింగ్ అనుభవించిన పిల్లల్లో దీర్ఘకాలంలో వారి మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అది ఈ విధంగా ఉంటుంది:1. ఎక్కువగా అవమానాలు, ఛీత్కారాలు పిల్లల్లో ఆత్మగౌరవాన్ని తగ్గిస్తాయి. 2. బుల్లీయింగ్ వల్ల కలిగే ఒత్తిడి కలతకు, డిప్రెషన్‌కు దారితీస్తుంది.3. బుల్లీయింగ్ బాధితులు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. పదిమంది ఉండే పరిసరాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. 4. బుల్లీయింగ్ వల్ల ఇతరులపై నమ్మకం పోతుంది. అది వారి స్నేహాలకు ప్రతిబంధకంగా మారుతుంది.5. అకడమిక్ పర్ఫార్మెన్స్ కూడా ప్రభావితం అవుతుంది. తరచుగా పాఠశాలకు వెళ్లడం మానేస్తారు, తద్వారా చదువులో వెనకబడతారు. 6. బుల్లీయింగ్ తీవ్రమైన సందర్భాల్లో పిల్లలు ఆత్మహత్య గురించి ఆలోచించే అవకాశాలు కూడా ఉంటాయి. -
కుటుంబ బాధ్యతల్లో బ్యాలెన్స్ అవసరం
అంజలి ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టి, పెరిగింది. తండ్రి ప్రధాన ఆదాయదారుడిగా ఉండగా, తల్లి ఇంటిని నిర్వహిస్తూ, పిల్లలను చూసుకునేవారు. ఇంట్లో ఎవరేం చేయాలనే విషయంలో స్పష్టత ఉండేది. ఈ వాతావరణంలో పుట్టి, పెరిగిన అంజలికి భార్యాభర్తలు ఎవరేం చేయాలనే విషయంపై ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. డిగ్రీ పూర్తి చేశాక అంజలికి రాజుతో వివాహమైంది. రాజు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుండగా అంజలి హౌస్ వైఫ్ బాధ్యతలను ఆనందంగా స్వీకరించింది. ఇద్దరూ సంతోషంగా గడిపేవారు. ఒక బిడ్డ పుట్టాక బిడ్డను చూసుకుంటూ ఇంటిపనులు చేయడం అంజలికి కష్టంగా ఉండేది. ఇద్దరు బిడ్డలు పుట్టాక అది మరింత కష్టంగా మారింది. ఉదయాన్నే లేచి రాజుకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ సిద్ధం చేయడం, పిల్లల కార్యకలాపాలను నిర్వహించడం, ఇంటి పనులు చూసుకోవడంతో చాలా అలిసిపోయేది. రాజు కొంత సహాయం చేసినప్పటికీ అది అంజలి ఆశించిన స్థాయిలో ఉండేది కాదు. దాంతో అంజలి చాలా ఒత్తిడిని అనుభవించేది. నిరంతర సమస్యలుక్రమక్రమంగా అంజలికి శారీరక శ్రమతో పాటు, మానసిక శ్రమ కూడా పెరిగింది. భర్త, పిల్లల అవసరాలను అర్థం చేసుకుని, సమయానికి అన్నీ మకూర్చే క్రమంలో అంజలి తన అవసరాలను నిర్లక్ష్యం చేసేది. తాను అనుభవిస్తున్న ఒత్తిడిని రాజుకు చెప్పడంలో ఇబ్బంది పడేది. ఆమె తన అవసరాలను చెప్పగానే, రాజు వాటిని నిర్లక్ష్యం చేసేవాడు లేదా తప్పుగా అర్థం చేసుకునేవాడు. లేదంటే తాను ఆఫీసులో ఎంత స్ట్రెస్ అనుభవిస్తున్నాడో చిట్టా విప్పవాడు. అలా మాట్లాడుతుంటే అంజలి మనసు చివుక్కుమనేది. ‘ఇదేంటి ఈ మనిషి నేను చెప్పేది వినడు, నా కష్టం పట్టించుకోడు’ అనిపించేది. కాలం గడిచేకొద్దీ, కుటుంబంకోసం రాజు కష్టపడుతున్నా, అదే కుటుంబంకోసం తాను పడుతున్న కష్టాన్ని గుర్తించడంలేదని బాధపడేది. అది వారిద్దరి అనుబంధం, ఆప్యాయతలపై ప్రభావం చూపించింది. రాజును కేవలం భర్తగా కంటే రూమ్మేట్ గా చూడటం ప్రారంభించింది. మరోవైపు భార్యగా తన బాధ్యతలు సరిగా నిర్వర్తించడం లేదని బాధపడేది. ఇది ఆమెను అపరాధభావనలోకి చెట్టింది. తనలో మరింత నిరాశను, అంతర్గత ఘర్షణను సృష్టించింది.ఇవన్నీ కలిసి అంజలి మానసిక ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావం చూపాయి. ఆందోళన పెరిగింది. ఆత్మవిశ్వాసం తగ్గింది. నేను మంచి భార్యనైతే ఇలా ఆలోచించేదాన్ని కాదనే అపరాధభావం పెరిగి పెద్దదైంది. దాన్నుంచి బయటపడేందుకు ఇంటిపనుల కోసం మరింత సమయం వెచ్చించేంది. అది మళ్లీ ఆమె అలసటను, అసంతృప్తిని పెంచేది. దాంతో అప్పుడప్పుడూ రాజుపై అరిచేది, గొడవపడేది. అది వారి మధ్య దూరాన్ని మరింత పెంచింది. చికిత్స లక్ష్యాలు... పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న అంజలి కౌన్సెలింగ్ కోసం మా క్లినిక్ కు వచ్చింది. తన మానసిక స్థితిని పూర్తిగా వివరించింది. తన ఆందోళనను తగ్గించడంతోపాటు, రాజుతో తన బంధాన్ని బలపరిచేందుకు సహాయం చేయాలని కోరింది. మొదటి సెషన్ లో ఆమెతో మాట్లాడాక, రెండో సెషన్ కు రాజుతో పాటు రావాలని సూచించాను. రెండో సెషన్ లో వారిద్దరితో మాట్లాడాక కౌన్సెలింగ్ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. అంజలి, రాజులు పరస్పర అవసరాలను, భావాలను, ఆందోళనలను వ్యక్తపరచడానికి అవసరమైన వాతావరణాన్ని అభివృద్ధి చేయడం. వైవాహిక బాధ్యతలు, భావోద్వేగాలను పంచుకోవడం ద్వారా బంధాన్ని సరిదిద్దడం, సమాన భాగస్వామ్యాన్ని స్థాపించడం. కుటుంబ రోల్స్, బాధ్యతలు, భాగస్వామ్య భావనలను ప్రభావితం చేసే వ్యక్తిగత విలువలు, అంచనాలు, సామాజిక ప్రభావాలను అన్వేషించడం. •ఒత్తిడి, ఆందోళన, నిరాశను మేనేజ్ చేసేందుకు అవసరమైన స్కిల్స్ ను అభివృద్ధి చేయడం. చికిత్స సాగిన విధానంరాజు, అంజలి మధ్య బంధాన్ని, కమ్యూనికేషన్ ను మెరుగుపరిచేందుకు ప్రొటోకాల్ రూపొందించాను. అందులో మొదటిది I Sentences. అంజలి రాజును బ్లేమ్ చేయడం కాకుండా, తన భావాలను వ్యక్తం చేయడానికి ‘‘నేనిలా అనుకుంటున్నాను, నేనిలా ఫీలవుతున్నాను’’ అని ‘ఐ సెంటెన్సెస్’ ఉపయోగించడం ప్రారంభించింది. దాంతో రాజు తనను బ్లేమ్ చేస్తుందనే భావన లేకుండా ఓపెన్ గా వినడం మొదలుపెట్టాడు. రాజు అలా వినడం అంజలికి సంతృప్తినిచ్చింది. కుటుంబంలో ఏ పనులు ఎవరు చేయాలనే విషయంపై ఇద్దరూ ఒక అంగీకారానికి వచ్చారు. వారానికోసారి ఈ అంశంపై ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి అంగీకరించారు. ఇది అంజలిపై పని ఒత్తిడి భారాన్ని, ఒత్తిడికి లోనవుతున్నాననే భావనను అధిగమించడానికి ఉపయోగపడింది. వారానికోసారి ఇద్దరూ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవడం, ఒకరి కష్టాన్ని మరొకరు శ్రద్ధగా ఆలకించడం, సహాయాన్ని ఆఫర్ చేయడం వారిద్దరి మధ్య బంధం, అనుబంధం పెరిగేందుకు సహాయపడింది. దీంతోపాటు మరికొన్ని థెరప్యూటిక్ టెక్నిక్స్ పాటించడం ద్వారా ఆరునెలల్లో వారి మధ్య బంధం బలపడింది. ఇప్పుడు ఇద్దరూ ప్రశాంతంగా, ప్రేమానురాగాలతో జీవిస్తున్నారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066ww.psyvisesh.com -
ప్రేమాకర్షణలు సహజం.. శాశ్వతం కావు
ఇంట్లో టీనేజర్స్ ఉన్నారంటే తల్లిదండ్రులకు గుండెల్లో గుబులే. ఎప్పుడేం మాట్లాడతారో, ఏం చేస్తారో, ఏ గొడవ తీసుకొస్తారో అని! అన్నింటికంటే భయపెట్టే అంశం.. ప్రేమ వ్యవహారాలు. పెళ్లికి ముందు శృంగారం కూడా పెరిగిందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే అంశం. కానీ కాలంతో పాటు అన్నీ మారుతూ ఉంటాయి. ఈ కాలం పిల్లలకు రిలేషన్స్, బ్రేకప్స్ సర్వసాధారణమయ్యాయి. కొందరు ఈ రిలేషన్స్‌లో పడి చదువును నిర్లక్ష్యం చేస్తే, మరికొందరు బ్రేకప్ వల్ల అనేక మానసిక సమస్యలకు లోనవుతున్నారు. అందుకే పిల్లలు ప్రేమలో పడ్డారని తెలియగానే అభ్యంతరం వ్యక్తం చేస్తారు. కొందరైతే తిడతారు, కొడతారు, కంట్రోల్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు. దీనివల్ల టీనేజర్లలో తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత పెరగడం తప్ప ఆశించిన ప్రయోజనాలు నెరవేరవు. దీనికన్నా టీనేజర్లతో ఓపెన్‌గా మాట్లాడటం, సరైన గైడెన్స్‌ను అందించడమే మంచిదని గుర్తించాలి. అదెలాగో ఈరోజు తెలుసుకుందాం. సెక్సువల్ డెవలప్మెంట్..సెక్సువల్ డెవలప్మెంట్ అనేది సహజమైన పరిణామం. పీరియడ్స్, వెట్ డ్రీమ్స్ లాంటి శారీరక మార్పులు, అపోజిట్ సెక్స్ పట్ల ఆసక్తి లాంటి భావోద్వేగ మార్పులు మొదలవుతాయి. ఇదంతా వారికి కొత్తగా, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్‌తో చర్చిస్తారు. లేదా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తారు. అందులో తప్పుడు సమాచారం అందే ప్రమాదం ఉంది. అందుకే ఈ అంశాలపై తల్లిదండ్రులే చర్చించాలి. అలా చర్చించడంలో ఎలాంటి తప్పూ లేదని గుర్తించాలి. ప్రేమ, ఆకర్షణ..టీనేజ్‌లో ప్రేమ, ఆకర్షణ సహజమైన భావోద్వేగాలు. నచ్చిన వ్యక్తి పట్ల బలమైన ఆకర్షణను కలిగి ఉంటారు. అదే ప్రేమ అని భ్రమపడుతుంటారు. ఇది చూసి తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. కానీ చాలా సందర్భాల్లో ఈ ఆకర్షణ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కొందరిలో ఎక్కువకాలం కొనసాగవచ్చు. అయినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు.పిల్లలను జడ్జ్ చేయకుండా, వారి క్రష్, లవ్ గురించి ఓపెన్‌గా మాట్లాడండి, తప్పొప్పులు, పర్యవసానాల గురించి చర్చించండి. అప్పుడే వాళ్లు తమ భావోద్వేగాలను సరైన రీతిలో అర్థం చేసుకోగలుగుతారు. సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.టీనేజ్ సెక్స్..యవ్వనంలో సెక్స్ అనే అంశం చాలా సున్నితమైనది. యవ్వనంలో వచ్చే హార్మోన్ మార్పుల వల్ల లేదా సోషల్ మీడియా లేదా ఫ్రెండ్స్ ప్రభావం వల్ల టీనేజ్ సెక్స్ పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఈ దశలో టీనేజర్లకు సరైన గైడెన్స్ అవసరం. అది ఫ్రెండ్స్ ద్వారానో, పోర్న్ ద్వారానో వచ్చేకంటే, పేరెంట్స్ ద్వారా అందడం అవసరం. భయపెట్టడం, నియంత్రించడం కంటే గైడెన్స్ ద్వారానే పిల్లలను సరైన దారిలో నడపగలమని గుర్తించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలు ఎలాంటి సందేహాలనైనా అడగడానికి, వారి భావాలు పంచుకోవడానికి అవకాశాన్ని ఇవ్వాలి ∙సెక్సువల్ డెవలప్మెంట్, రిలేషన్స్ గురించి కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలి ∙ తాత్కాలిక ఆకర్షణలు, టీనేజ్ లవ్, సంపూర్ణ ప్రేమ మధ్య తేడాలు అర్థం చేసుకునేందుకు సహాయపడాలి ∙సోషల్ మీడియా ప్రభావం, స్నేహితుల ఒత్తిళ్లను అర్థం చేసుకోవడానికి సహాయపడాలి ∙టీనేజర్ల ఫ్రీడమ్, తల్లిదండ్రుల గైడె¯న్స్ మధ్య బ్యాలె¯న్స్ సాధించాలి ∙పేరెంట్స్ చర్చించలేని అంశాల గురించి చెప్పేందుకు సైకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి.టీనేజర్లు చేయాల్సింది..టీనేజ్‌లో జరిగే మార్పుల గురించి చదవాలి, అవగాహన పెంచుకోవాలి. పేరెంట్స్‌తో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవాలి టీనేజ్ లవ్, ఇన్‌ఫాచ్యుయేషన్ సహజమైన విషయాలని, శాశ్వతం కావని గుర్తించాలి తొందరపాటు చర్యల వల్ల వచ్చే ఎమోషనల్ పెయిన్ గురించి అవగాహన పెంచుకోవాలి ఈ వయసులో ప్రేమ వ్యవహారాల కంటే అకడమిక్ సక్సెస్ ముఖ్యమని అర్థం చేసుకుని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి కొత్త ఆసక్తులు, హాబీలను కనుగొనేందుకు సమయం కేటాయించాలి మైండ్‌ఫుల్‌నెస్, జర్నలింగ్, నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం వంటి పనుల ద్వారా ఎమోష¯న్స్ను నియంత్రించుకోవడం ప్రాక్టీస్ చేయాలి సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేసుకోవాలి. నిజమైన సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలి ఒత్తిడి, ఆందోళన లేదా నిరాశగా అనిపిస్తే సైకాలజిస్ట్‌తో మాట్లాడి సహాయం తీసుకోవాలి. -
Health: అంతా మెదడులోనే ఉంది..
మీ ఇంట్లో టీనేజర్లు ఉన్నారా? వాళ్లతో డీల్ చేయడం కష్టమనిపిస్తోందా? ‘అయ్యో, వాళ్లతో వేగలేక చస్తున్నాం’ అంటున్నారా? అయితే ఈ వ్యాసం మీకోసమే.నిజంగానే టీనేజర్లను డీల్ చేయడం ఒక ప్రత్యేకమైన, సవాళ్లతో కూడుకున్న ప్రయాణం. ఎందుకంటే టీనేజ్ అనేది అనేకానేక ఎమోషనల్, సోషల్, కాగ్నిటివ్ మార్పులు జరిగే సమయం. అందుకే ఆ వయసులో చాలా దుడుకుగా, దూకుడుగా ఉంటారు. ఎవరే సలహా ఇచ్చినా పట్టించుకోరు. ఎదురు మాట్లాడతారు. అందువల్లే ఈ వయసు పిల్లలతో తల్లిదండ్రులకు తరచు గొడవలు అవుతుంటాయి. దీన్నుంచి బయటపడాలంటే ఈ దశలో జరిగే మార్పులను అర్థం చేసుకోవడం, ఆ అవగాహనతో మార్గనిర్దేశం చేయడం అవసరం.మెదడులో అల్లకల్లోలం..టీనేజర్‌ను అర్థం చేసుకోవాలంటే ముందుగా వారిలో జరిగే మార్పులను అర్థం చేసుకోవాలి. శారీరక మార్పులంటే కంటికి కనిపిస్తాయి. కానీ మెదడులో జరిగే మార్పులు కనిపించవుగా! నిజానికి అవే టీనేజర్ల ప్రవర్తనలోని విపరీతాలకు కారణం. టీనేజ్‌లో మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు వేగాలతో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ప్రణాళిక, భావోద్వేగాల నియంత్రణ, నిర్ణయాలు తీసుకునే శక్తికి బాధ్యత వహించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ (మెదడులో ముందుభాగం) టీనేజ్‌లో పూర్తిగా అభివృద్ధి చెందదు. దీనికి విరుద్ధంగా భావోద్వేగాలను, ఎమోషన్స్, రివార్డ్స్‌ను నియంత్రించే లింబిక్ వ్యవస్థ చాలా చురుకుగా ఉంటుంది.పూర్తిగా అభివృద్ధి చెందని ప్రీఫ్రంటల్ కార్టెక్స్, అతిగా స్పందించే లింబిక్ సిస్టమ్ కలసి టీనేజర్ల ప్రవర్తనలో, భావోద్వేగాల్లో అల్లకల్లోలం సృష్టిస్తాయి. అందువల్లనే టీనేజర్లు ఇంపల్సివ్, రిస్కీ, ఎమోషనల్ ప్రవర్తనలను ప్రదర్శిస్తుంటారు. తరచుగా కొత్త అనుభవాలను వెతకడానికి, రిస్క్స్ తీసుకోవడానికి, షార్ట్ టర్మ్ రివార్డ్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు.భావోద్వేగ నియంత్రణ కష్టం..ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల టీనేజర్లు మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ రియాక్షన్స్, ఒత్తిడిని తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు. మరోవైపు భయం, ఆందోళనను ప్రాసెస్ చేసే అమిగ్డలా చురుగ్గా ఉంటుంది. అది టీనేజర్లకు ఎదురయ్యే సవాళ్లు, బెదిరింపులకు అతిగా స్పందించేలా చేస్తుంది. ఇది భావోద్వేగ అస్థిరతకు కారణమవుతుంది. టీనేజర్ల మూడీనెస్, రెబలియస్నెస్కు కారణాలివే అని అర్థం చేసుకోవడం వల్ల వారిపై ముద్రలు వేయకుండా, వారిని చక్కగా డీల్ చేసేందుకు వీలవుతుంది. భావోద్వేగాలతో నిర్ణయాలు..ప్రీఫ్రంటల్ కార్టెక్స్, లింబిక్ వ్యవస్థ మధ్య పరస్పర చర్య టీనేజర్ల నిర్ణయ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తార్కికంగా ఆలోచించి, పర్యవసానాలను అర్థం చేసుకోగలిగినప్పటికీ వారి నిర్ణయాలు తరచుగా ఫ్రెండ్స్ ప్రభావంతో ఎమోషనల్‌గా మారతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే తక్షణం సోషల్ రివార్డ్ అందుకోవడమే ముఖ్యమవుతుంది.డోపమైన్ ప్రభావం.. టీనేజర్ల ప్రవర్తనలో మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఆనందం, బహుమతితో అనుసంధానమైన డోపమైన్ గణనీయమైన మార్పులకు లోనవుతుంది. ఇది గుర్తింపు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, కొత్త అనుభవాల కోసం పరుగుపెట్టేలా చేస్తుంది. ఇదే డోపమైన్ వ్యసనాలు, ప్రమాదకర ప్రవర్తనలకూ కారణమవుతుంది. అందువల్ల ఈ వయసులో క్రీడలు, సృజనాత్మకత, సామాజిక పరిచయాలు అవసరం.టీనేజర్‌తో ఇలా ప్రవర్తించాలి..– మీ టీనేజర్ మెదడు అభివృద్ధి చెందుతూ ఉందని, అది హఠాత్ప్రవర్తనకు, మానసిక కల్లోలానికి కారణం కావచ్చని గుర్తించాలి. అందుకే ఓపికగా, సానుభూతితో అర్థం చేసుకోవాలి.– టీనేజర్స్ స్వేచ్ఛను కోరుకుంటారు, అది అవసరం కూడా. అయితే వారితో చర్చించి దానికి హద్దులను సెట్ చేయాలి.– ఎమోషన్స్‌ను ఎలా ప్రదర్శించాలో.. ఒత్తిడి, కోపం, నిరాశను ఎలా ఎదుర్కోవాలో మీ ప్రవర్తన ద్వారా మీ టీనేజర్‌కు చూపించాలి.– ఆలోచనలను పంచుకునే వాతావరణాన్ని కల్పించాలి. తానేం చెప్పినా జడ్జ్ చేయకుండా ఉంటారనే భరోసా ఇవ్వాలి.– టీనేజర్లలో రిస్క్ టేకింగ్ ఉంటుంది. అయితే అది సురక్షితమైన వాతావరణంలో ఉండేలా ప్రోత్సహించాలి.– స్నేహితుల గురించి తెలుసుకోవాలి. వారిలో సానుకూల ప్రభావం ఉన్నవారితో స్నేహాన్ని ప్రోత్సహించాలి.– తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే పరిణామాల గురించి అవగాహన కలిగించాలి. మార్గనిర్దేశం చేయాలి.– తప్పులు చేయడానికి, వాటి నుంచి నేర్చుకోవడానికి స్వేచ్ఛను ఇవ్వాలి. గైడెన్స్, సపోర్ట్ ఉండాలి.– టీనేజర్‌ను పెంచడం సవాళ్లతో కూడుకున్న పని. అందువల్ల సెల్ఫ్ కేర్ పై దృష్టిపెట్టాలి. అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోలి.– మానసిక ఆరోగ్యంపై టెక్నాలజీ ప్రభావం గురించి చర్చించాలి. స్క్రీన్ టైమ్, సోషల్ మీడియా వినియోగంపై పరిమితులను సెట్ చేయాలి.– సైకాలజిస్ట్ విశేష్ ఇవి చదవండి: మెదడు.. మోకాల్లోకి.. -
సకాలంలో స్పందిస్తే ఆత్మహత్యలను నివారించవచ్చు
ఆత్మహత్య లేదా బలవన్మరణం అత్యంత బాధాకరమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 8,00,000 మంది ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. జాతీయ నేర పరిశోధన బ్యూరో (NCRB) ప్రకారం, 2021లో మన దేశంలో 1,64,033 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అంటే, రోజుకు 450 బలవన్మరణాలు. ప్రతి నాలుగు నిమిషాలకో జీవితం కోల్పోవడం. ఇవి కేవలం సంఖ్యలు మాత్రమే కాదు. వ్యక్తుల నిశ్శబ్ద బాధను ప్రతిబింబిస్తాయి. ప్రతి ఆత్మహత్యకు, 20 కి పైగా ఆత్మహత్యాయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆత్మహత్యలను నివారించే ప్రయత్నాలను ప్రోత్సహించడం, అవగాహన పెంచడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ‘ఆత్మహత్య నివారణ దినోత్సవం’ జరుపుకుంటాం. అవగాహన లోపమే ప్రధాన సమస్య.. భారతదేశంలో ఆత్మహత్యలను నివారించడంలో ప్రధాన అడ్డంకి, మానసిక ఆరోగ్యం చుట్టూ ఉండే అపహాస్యం. డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్న అనేక మంది సహాయం కోసం బయటకు రావడానికి సిగ్గుపడుతున్నారు. ఈ మౌనం ప్రమాదకరం, ఇది ప్రజలను ఒంటరితనం, నిరాశలోకి నెట్టేస్తుంది. ఇవన్నీ కలిసి బలవన్మరణం వైపు నెట్టేస్తాయి. కొన్ని ముఖ్యమైన గణాంకాలు... దేశంలో మొత్తం బలవన్మరణాల్లో 34.5 శాతం 18-30 ఏళ్ల మధ్య ఉన్న యువకులే.బలవన్మరణాల్లో 71 శాతం పురుషులే. మహిళల్లో 15-39 ఏళ్ల మధ్యవారే ఎక్కువ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.సామాజిక, ఆర్థిక సమస్యలు వల్ల 10,881 మంది రైతులు 2021లో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.కొన్ని ప్రధాన కారణాలు... పరీక్షల ఒత్తిడి, పోటీ, భవిష్యత్తు పట్ల భయంతో 2021లో 13,089 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.ఉద్యోగాలు కోల్పోవడం, అప్పులు, పేదరికం ఆత్మహత్యకు ప్రధాన కారణాలుగా ఉంటాయి.కుటుంబ విభేదాలు, వివాహ పరమైన సమస్యలు కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు చికిత్స లేకపోతే తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలు ఆత్మహత్య నివారణలో ప్రతి ఒక్కరూ పాత్ర పోషించవచ్చు. అందుకోసం ముందుగా ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలను గుర్తించాలి. అవి... నేను చనిపోవాలని అనుకుంటున్నాను" లేదా "నేను పుట్టకపోయినా బాగుండేది" అంటూ ఆత్మహత్య గురించి మాట్లాడటం.కత్తి, తాడు, నిద్రమాత్రలు లాంటి వాటిని సమకూర్చుకోవడం. ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండాలని కోరుకోవడం. ఒక రోజు అత్యంత సంతోషంగా, మరుసటి రోజు తీవ్ర నిరుత్సాహంగా ఉండటం వంటి మూడ్ స్వింగ్ కలిగి ఉండటం. సమస్యలో చిక్కుకున్నట్లు, బయటపడే మార్గం లేనట్లు, నిస్సహాయంగా ఉన్నట్లు మాట్లాడటం. మద్యం లేదా మాదకద్రవ్యాల వాడకం పెరగడం. తిండి, నిద్రలాంటి సాధారణ దినచర్యలలో మార్పు. డ్రగ్స్ వాడటం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి ప్రమాదకర లేదా స్వీయ-విధ్వంసక పనులు చేయడం తన వస్తువులను, వ్యవహారాలను ఇతరులకు అప్పజెప్పడం. మళ్లీ కనిపించనట్లుగా వీడ్కోలు చెప్పడం. వ్యక్తిత్వంలో ఆకస్మిక మార్పులు, తీవ్ర ఆత్రుత లేదా ఆందోళన చెందడం. మీరేం చేయవచ్చు... మీ సన్నిహితుల్లో ఎవరిలోనైనా ఎవరికైనా ఆత్మహత్య యత్నం లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మాట్లాడండి. మీ మద్దతును, సహాయాన్ని, సహకారాన్ని అందించండి. మీకు సాధ్యం కాదనుకున్నప్పుడు సైకాలజిస్ట్ ను సంప్రదించండి. ఆత్మహత్య గురించి అడగడాన్ని భయపడవద్దు. ఇది వాళ్లకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తుంది. జడ్జ్మెంట్ లేకుండా, ప్రేమగా వారు చెప్పేది వినండి. వారు ఒంటరిగా ఉన్నారని అనిపించనీయకుండా సపోర్ట్ చేయండి. ఒంటరిగా వదిలిపెట్టకుండా సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లండి. వారి దగ్గర ఉన్న కత్తులు, తాళ్లు, మాత్రల్లాంటి ప్రమాదకరమైన వస్తువులు తీసివేయండి. మీరు లేదా మీకు తెలిసినవారు ఆత్మహత్య ఆలోచనలకు గురవుతున్నట్లయితే, వెంటనే హైదరాబాద్ లో ఉన్న రోష్ణి ఆత్మహత్యల నివారణ సంస్థకు (081420 20033 ⋅ 081420 20044) ఫోన్ చేసి సహాయం పొందండి. అప్పటికీ మీకు ఉపశమనం కలగకపోతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ సహాయం తీసుకోవాలి.సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.comగమనిక:ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
అతిగా కాఫీ తాగడం కూడా ఒక వ్యసనమేనని మీకు తెలుసా!?
రవికుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. 29 సంవత్సరాలు. కాలేజీ రోజుల్లో అర్ధరాత్రి చదువుల కోసం కాఫీ తాగడం మొదలుపెట్టాడు. క్రమంగా అది అలవాటుగా మారింది. ఉద్యోగంలో చేరాక పనిలో ఒత్తిడి తట్టుకోవడానికి కాఫీ తీసుకోవడం ఎక్కువైంది. మొదట్లో రోజూ ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగేవాడు. కొన్ని సంవత్సరాలుగా అది రోజుకు ఐదారు కప్పులకు పెరిగింది.ప్రతి కప్పులో సుమారు 100–150 మి. గ్రా. కెఫీన్ ఉంటుంది. కాఫీతో పాటు కోలా, ఎనర్జీ డ్రింక్స్ కూడా తాగడం వల్ల అతను రోజూ 600 మి. గ్రా. కంటే ఎక్కువ కెఫీన్ తీసుకుంటున్నాడు. ఇది రోజువారీ పరిమితి కంటే 400 మి. గ్రా. ఎక్కువ. ఇప్పుడు కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్ తాగకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాడు. మానాలని ప్రయత్నించినా సాధ్యంకావట్లేదు. కాఫీ మానేస్తే విపరీతంగా తలనొప్పి. నిద్ర పట్టట్లేదు. డాక్టర్‌ను కలిశాడు. అతను కాఫీకి అడిక్ట్ అయ్యాడని, మానేయమని చెప్పాడు. మానేశాడు. మళ్లీ తలనొప్పి, నిద్ర పట్టకపోవడం మామూలయ్యాయి. దాంతో డాక్టర్ సలహా మేరకు సైకాలజిస్ట్‌ని సంప్రదించాడు. సైకాలజీ అనగానే ఆశ్చర్యపోయాడు రవికుమార్. ‘ఏంటి సర్, కాఫీ తాగడమేమైనా మెంటల్ ఇల్నెసా? దానికి కూడా సైకాలజిస్ట్‌ను కలవాలా?’ అని అడిగాడు.‘అతిగా ఏ పని చేసినా అది వ్యసనమే. కాఫీ వ్యసనంగా మారడం, దాన్నుంచి బయటపడలేకపోవడం కూడా ఒక మానసిక సమస్యే. ఒక పద్ధతి ప్రకారం దాన్నుంచి బయటపడాలి. అందుకు సైకోథెరపీ అవసరం’ అని డాక్టర్ చెప్పారు. దాంతో సైకాలజిస్ట్‌ని సంప్రదించాడు రవికుమార్.మూడు నెలల చికిత్స తర్వాత, రవి విజయవంతంగా రోజుకు ఒక కప్పు కాఫీకి మాత్రమే పరిమితమయ్యాడు. విత్ డ్రాయల్ లక్షణాలేవీ కనిపించలేదు. కెఫీన్ పై ఆధారపడకుండానే పని చేయగలుగుతున్నాడు. ఇప్పుడు మరింత ఎనర్జిటిక్‌గా, కంట్రోల్డ్‌గా ఉంటున్నాడు.కెఫీన్ వ్యసనం లక్షణాలు..– కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్ తాగనప్పుడు తలనొప్పి.– పని ముగించుకుని అలసిపోయినప్పటికీ, రాత్రి నిద్ర పట్టకపోవడం, దీర్ఘకాలిక నిద్ర లేమి.– తక్కువ వ్యవధిలో ఎక్కువ కాఫీ తాగినప్పుడు విశ్రాంతి లేకపోవడం, ఆత్రుత, చికాకు. – స్ట్రాంగ్ కప్ కాఫీ లేకుండా దినచర్య మొదలుపెట్టలేకపోవడం. పని, మీటింగ్స్ అన్నీ కెఫీన్పై ఆధారపడటం. – కెఫీన్ తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నించినప్పుడు, పనితీరు పేలవంగా మారడం. – ఉద్యోగంలో పని ఒత్తిడిని, డిమాండ్స్‌ను ఎదుర్కోవడానికి ఎక్కువ కెఫీన్ తీసుకోవడం. – సరైన ఆహారం, వ్యాయామం వంటి వాటిని వదిలేయడం. శక్తి కోసం కెఫీన్ పై మాత్రమే ఆధారపడటం.విత్ డ్రాయల్ లక్షణాలు..– కాఫీ మానేసిన 24 గంటల్లో తీవ్రమైన తలనొప్పి.– విపరీతమైన అలసట, మామూలు పనులు కూడా చేయలేకపోవడం.– ఆందోళన, కుంగుబాటు.. ఏదో కోల్పోయిన ఫీలింగ్, ఏదో జరుగుతుందన్న భయం. – పనిపై ఏమాత్రం దృష్టి పెట్టలేకపోవడం, గడువులోపు పూర్తి చేయలేకపోవడం, చేసిన పనిలో తప్పులు.నిదానంగా, పద్ధతిగా..హఠాత్తుగా కాఫీ మానేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని గుర్తించిన రవి, వైద్యుని సలహా మేరకు మొదట రోజుకు నాలుగు కప్పులు మాత్రమే తీసుకున్నాడు. ఆ తర్వాత మూడు, ఆ తర్వాత రెండు కప్పులకు పరిమితమయ్యాడు. – నెమ్మదిగా కెఫీన్ లేని కాఫీ, హెర్బల్ టీలకు మారాడు. ఒత్తిడిని తట్టుకునేందుకు కాఫీపై ఆధారపడకుండా ఉండటానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) చికిత్స తీసుకున్నాడు. – కెఫీన్ పై ఆధారపడకుండా పని సంబంధిత ఒత్తిడిని నిర్వహించడానికి మెలకువలను నేర్చుకున్నాడు. – మైండ్‌ఫుల్‌నెస్, శ్వాస వ్యాయామాలు, పని సమయంలో విరామాల ద్వారా ఒత్తిడిని అధిగమించాడు. సమతుల ఆహారం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, స్థిరమైన నిద్రతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాడు. కెఫీన్ నుంచి వచ్చే శక్తిని సరైన పోషకాహారం, శారీరక శ్రమ ద్వారా వచ్చే సహజ శక్తితో భర్తీ చేశాడు.– అతను కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్ వైపు వెళ్లినప్పుడు వారిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా మద్దతుగా నిలిచారు.– సైకాలజిస్ట్ విశేష్ -
మజిల్స్ రిలాక్సయితే మనసూ రిలాక్సవుతుంది! ఎలా అంటే..?
ప్రపంచం పరుగెడుతోంది. ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణమయ్యాయి. వీటిని ఎదుర్కొనే అత్యంత ప్రభావవంతమైన పద్ధతుల్లో ఒకటే ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ (PMR). అమెరికన్ వైద్యుడు ఎడ్మండ్ జాకబ్సన్ 1920లో అభివృద్ధి చేసిన ఈ పద్ధతి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతోంది. ఆయన పేరు మీదే దీన్ని జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ (PMR) అంటున్నారు.శరీరం, మనసు వేర్వేరు కాదని, రెండూ ఒకటిదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయనే ఆలోచనపై ఈ టెక్నిక్ ఆధారపడి ఉంటుంది. ఇది ఒక సులువైన, శక్తిమంతమైన టెక్నిక్. దీన్ని ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీ. మన శరీరంలోని కండరాల (మజిల్స్)ను నిర్దిష్ట క్రమంలో టెన్షన్ చేయడం, రిలాక్స్ చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతతను సాధించడమే జేపీఎమ్మార్ (PMR). ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది. దీర్ఘకాలిక నొప్పులున్న వారికి ఉపయోగపడుతుంది. ఈ టెక్నిక్ ద్వారా పబ్లిక్ స్పీకింగ్, పరీక్షలు లేదా మెడికల్ టెస్టుల సమయంలో కలిగే ఒత్తిడినీ తగ్గించుకోవచ్చు. అదెలా చేయాలో తెలుసుకుందాం.ఎలాంటి అంతరాయం కలగని ప్రశాంతమైన, సౌకర్యవంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి. రిలాక్సింగ్ చైర్ లేదా మంచం మీద పడుకోవాలి.వదులుగా ఉండే, సౌకర్యవంతమైన దుస్తులను ధరించాలి. మన కదలికలకు ఇబ్బంది కలిగించే వస్తువులను తీసేయాలి.నిండుగా ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టాలి. ఇది శరీరాన్ని, మనసును విశ్రాంతికి సిద్ధం చేస్తుంది.పాదాల నుంచి తల దాకా ప్రతిభాగంలోని కండరాలను ఐదు నుంచి పది సెకన్ల వరకు వీలైనంత గట్టిగా పట్టి ఉంచాలి. తర్వాత నిదానంగా సడలించాలి.దాదాపు 20 నుంచి 30 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోవాలి. నెమ్మదిగా నిండుగా ఊపిరి తీసుకోవాలి. కండరాలు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఎలా అనిపిస్తుందో గమనించాలి.అన్ని కండరాల సమూహాలను సడలించిన తర్వాత, పూర్తి విశ్రాంతిని ఆస్వాదించడానికి కొంత సమయం కేటాయించాలి. మెల్లగా.. నిండుగా ఊపిరి తీసుకోవడం ద్వారా ఒత్తిడి నెమ్మదిగా కరిగిపోతుంది.కాసేపటి తర్వాత నెమ్మదిగా కళ్లు తెరచి, శరీరాన్ని సున్నితంగా కదిలించడం మొదలపెట్టాలి. మైకంగా ఉంటే మరి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.మంచి ఫలితాలు పొందడానికి ఈ ఎక్సర్సైజ్ ను క్రమం తప్పకుండా రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ప్రాక్టీస్ చేయాలి.టెన్షన్, రిలాక్సేషన్ సమయాల్లో శరీరం, మనసు ఎలా స్పందిస్తున్నాయో గమనించాలి.అవసరాన్ని బట్టి, సౌకర్యానికి అనుగుణంగా కండరాలకు ఒత్తిడిని, విశ్రాంతినిచ్చే సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలి. JPMR ప్రాక్టీస్ చేయడమిలా..– కాలి వేళ్లను గట్టిగా ముడుచుకుని, ఆపై వాటిని రిలాక్స్ చేయాలి.– కాలి వేళ్లను తల వైపు లాగుతూ కండరాలను బిగించి, తర్వాత నిదానంగా సడలించాలి.– మీ తొడ కండరాలను బిగించి, ఆపై సడలించాలి.– కడుపు కండరాలను బిగించి, నిదానంగా సడలించాలి.– నిండుగా ఊపిరి తీసుకుని.. అలాగే పట్టి ఉంచాలి. కాసేపటి తర్వాత శ్వాస వదిలి విశ్రాంతి తీసుకోవాలి.– వీపును కొద్దిగా వంచి, ఆపై నిదానంగా యథాస్థితికి రావాలి.– పిడికిలిని గట్టిగా బిగించి, ఆపై వదలాలి.– మోచేతులను వంచి, కండరాలను బిగించి, ఆ తర్వాత సడలించాలి.– భుజాలను చెవుల వైపు లేపి.. ఆపై వదలాలి.– తలను సున్నితంగా వెనక్కి నొక్కాలి. గడ్డాన్ని ఛాతీ మీదకు లాగాలి. ఆపై విశ్రాంతి తీసుకోవాలి.– కనుబొమలను పైకి లేపడం ద్వారా నుదిటిని బిగించి, ఆపై వదిలేయాలి.– కళ్లు గట్టిగా మూసుకొని, ఆ తర్వాత నెమ్మదిగా వదిలి విశ్రాంతి తీసుకోవాలి.– దవడను బిగించి, ఆపై విశ్రాంతి తీసుకోవాలి.– పెదాలను గట్టిగా ఒత్తి పట్టి, ఆపై వదిలేయాలి.– సైకాలజిస్ట్ విశేష్ఇవి చదవండి: ఇమామ్ కజిన్ : ఓ సిటీలోని ఒక కాలనీలో.. -
Health: ఒత్తిడి, ఆందోళనను తగ్గించే.. 5–4–3–2–1 టెక్నిక్!
అరుణ్ ఒక ఐటీ ప్రొఫెషనల్. 28 ఏళ్లుంటాయి అతనికి. ఈ మధ్య కాలంలో విపరీతంగా ఆందోళన పడుతున్నాడు. దాంతో పని మీద దృష్టి నిలపడం కష్టంగా మారింది అతనికి. కంప్యూటర్ ముందు కూర్చుంటే ఏవేవో ఆలోచనలు చికాకు పెడుతున్నాయి. ఆపాలని ప్రయత్నించినా ఆగడంలేదు. దానివల్ల గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఊపిరి ఆడటం లేదు. చేతులు చెమటలు పడుతున్నాయి. ఒళ్లంతా బిగుసుకుపోయినట్లు అనిపిస్తోంది. ఈ సంకేతాలన్నీ తనకు ఏదైనా ఐపోతుందేమోనన్న భయాన్ని, ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ఈ పరిస్థితి పని మీదా ప్రభావం చూపి మేనేజర్ నుంచి వార్నింగ్స్ అందుకునేలా చేస్తోంది. నలుగురితో కలవలేకపోతున్నాడు. ఫ్రెండ్స్‌కు, పార్టీలకు దూరమయ్యాడు. నిద్ర పట్టడం లేదు. పట్టినా తరచూ మెలకువ వస్తోంది.అరుణ్ ఆందోళనకు గల కారణాలను లోతుగా పరిశీలించినప్పుడు.. అతనికి ఇటీవల ప్రమోషన్ వచ్చింది. దాంతో పని, బాధ్యతలు పెరిగాయి. అన్నిటిలో పర్ఫెక్ట్గా ఉండాలని, అన్ని పనులూ పర్ఫెక్ట్గా చేయాలనే అతని తీరు ఒత్తిడిని పెంచింది. ఫలితంగా అతని జీవితంలోకి ఆందోళన ప్రవేశించి అతలాకుతలం చేస్తోంది. అరుణ్ యాంగ్జయిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని పరీక్షల ద్వారా నిర్ధారణ అయింది. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ మొదలైంది. తాత్కాలిక ఉపశమనం కోసం 5–4–3–2–1 టెక్నిక్‌నీ ఫాలో అయ్యాడు. దాంతో అతను కొంత ఊరట పొందాడు. థెరపీ ద్వారా కొన్ని సెషన్లలోనే తన ఆందోళనను అధిగమించి హాయిగా పనిచేసుకోగలుగుతున్నాడు.5–4–3–2–1 గ్రౌండింగ్ టెక్నిక్..ఒత్తిడి, ఆందోళనను మేనేజ్ చేసేందుకు 5–4–3–2–1 గ్రౌండింగ్ ఒక పవర్ఫుల్ టెక్నిక్. మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. మీ పంచేంద్రియాలను నిమగ్నం చేయడం ద్వారా, ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టి.. మీకు బాధ కలిగించే ఆలోచనల నుంచి మీ దృష్టిని మళ్లించుకోవచ్చు. మీ ఆలోచనలపై కంట్రోల్, ఎమోషనల్ బ్యాలె¯Œ ్సను సాధించి ప్రశాంతతను పొందవచ్చు.మీరు చూడగలిగే 5 విషయాలను గుర్తించండి..మీ చుట్టూ ఒకసారి పరికించి ఐదు విభిన్న విషయాలను గమనించండి. అవి వస్తువులు, రంగులు, ఆకారాలు లాంటివి ఏవైనా కావచ్చు. వాటిని గమనించడానికి కొంత సమయం కేటాయించండి. ఇది మిమ్మల్ని బాధపెట్టే ఆలోచనల నుంచి మీ దృష్టిని బాహ్యప్రపంచంవైపు మళ్లించడానికి సహాయపడుతుంది.మీరు తాకగల 4 విషయాలను గుర్తించండి..మీ దుస్తులు, కుర్చీ, కంప్యూటర్ మౌస్ లాంటి మీరు తాకగల నాలుగు వస్తువులను గుర్తించండి. వాటిని తాకడం ద్వారా మీరు పొందుతున్న అనుభూతులపై దృష్టి పెట్టండి. ఇది మిమ్మల్ని మీ తక్షణ శారీరక అనుభూతులతో మళ్లీ కనెక్ట్ అవ్వడంలో సహాయపడుతుంది.మీరు వినగలిగే 3 విషయాలను గుర్తించండి..మీ చుట్టూ ఉన్న శబ్దాలను జాగ్రత్తగా వినండి. మీ కంప్యూటర్ శబ్దం, ట్రాఫిక్ ధ్వని, మీ శ్వాస శబ్దం లాంటివి ఏవైనా కావచ్చు. వాటిపై శ్రద్ధ చూపడం వల్ల మీ దృష్టిని అంతర్గత ఒత్తిళ్ల నుంచి∙దూరం చేసుకోవచ్చు.మీరు వాసన చూడగల 2 విషయాలను గుర్తించండి..మీ చుట్టూ ఉన్న వాతావరణంలో రెండు భిన్నమైన వాసనలను గుర్తించడంపై దృష్టి పెట్టండి. ఏవీ లేకుంటే అగర్బత్తి, కర్పూరం, డియోడరెంట్, పెర్ఫ్యూమ్ లాంటివి ఉపయోగించండి. ఆ పరిమళాలు మీ చుట్టూ ఉన్న వాతావరణంతో మీరు కనెక్ట్ అవ్వడానికి దోహదపడతాయి.మీరు రుచి చూడగలిగే ఒక విషయాన్ని గుర్తించండి..చివరగా, ఒక రుచిపై దృష్టి పెట్టండి. అది అంతకు ముందు మీరు తాగిన పానీయం లేదా తిన్న చాక్లెట్ లాంటిది ఏదైనా కావచ్చు. లేదంటే మీ నోటిలో ప్రస్తుతం ఎలాంటి రుచి ఉందో గమనించండి. ఇది మీ దృష్టిని రుచి ద్వారా ప్రస్తుత క్షణానికి తీసుకువస్తుంది.. ఇంద్రియ అనుభవాన్ని పూర్తి చేస్తుంది. -
పిల్లలు.. గర్భంలో ఉన్నప్పుడే తల్లి గొంతును గుర్తిస్తారు! అయితే ఈ సామర్థ్యం..
పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలనే విషయాన్ని అర్జునుడు తన భార్య సుభద్రకు చెప్తుండగా గర్భంలో ఉన్న అభిమన్యుడు విని నేర్చుకున్నాడని మహాభారతంలో చదువుకున్నాం. అది నిజమేనని నమ్మేవాళ్లే ఎక్కువ. ఆ నమ్మకాన్ని వ్యాపారం చేసుకుంటూ, గర్భంలోని బిడ్డలకు కూడా పాఠాలు నేర్పిస్తున్నవారూ ఉన్నారు. అయితే అదంతా నిజమేనా? అనే సందేహం ఉంది. అందుకే తల్లిదండ్రులను, శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరచే శిశు సామర్థ్యాల గురించి తెలుసుకుందాం. పిల్లలను మరింత బాగా అర్థం చేసుకుని పెంచేందుకు ఇవి తల్లిదండ్రులకు ఉపయోగపడతాయి.శిశువులకు అసాధారణ వినికిడి సామర్థ్యాలు ఉన్న మాట నిజం. పెద్దలు నిమిషానికి 14 వేల వైబ్రేషన్స్‌ని స్వీకరిస్తే, పిల్లలు 20 వేల వైబ్రేషన్స్‌ని స్వీకరిస్తారు. గర్భం దాల్చిన 24వ వారం నుంచి పిండాలు బాహ్య వాతావరణం నుంచి శబ్దాలను గుర్తించగలవని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భంలో ఉన్నప్పుడే తల్లి గొంతును గుర్తిస్తారు. అయితే ఈ సామర్థ్యం స్వరాన్ని గుర్తించడానికి మాత్రమే పరిమితం. పద్మవ్యూహాన్ని అర్థం చేసుకునేటంత తెలివితేటలు ఉండవు. ఇక పుట్టిన వారం రోజుల నుంచే తల్లి గొంతును, ఇతరుల గొంతు నుంచి వేరు చేస్తారని డికాస్పర్, ఫీఫెర్(1980) చేసిన పరిశోధనలో వెల్లడైంది.శిశువులు అమ్మభాషకు, వేరే భాషలకు మధ్య తేడాను గుర్తించగలరంటే మీరు నమ్మగలరా? కానీ పెదవి కదలికలు, ముఖ కవళికలను గమనించడం ద్వారా ఆ తేడాను గుర్తించగలరని వీకమ్ ఎటేల్ (2007) అధ్యయనంలో వెల్లడైంది. దీన్నిబట్టి పిల్లల చూపు ఎంత చురుగ్గా ఉంటుందో అర్థమైంది కదా!శిశువుల పరిశీలనా సామర్థ్యం కేవలం భాషాభివృద్ధికే పరిమితం కాదు. 18 నెలల వయసు గల పిల్లలు.. ఇతరులు మాట్లాడటానికంటే ముందే ముఖకవళికలు, బాడీ లాంగ్వేజ్‌ను గమనించి వారి ఉద్దేశాలను, భావోద్వేగాలను అర్థం చేసుకోగలరని మెల్ట్జాఫ్ (1995) కనుగొన్నారు.పిల్లలు.. వాళ్లేం నేర్చుకుంటారని కొట్టిపడేయకండి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి శిశువుల మెదళ్లు తయారుగా ఉంటాయని కుహ్ల్ (2004) నొక్కి చెప్పారు. భాషను నేర్చుకునే సామర్థ్యం.. బాల్యంలోనే గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఐదేళ్ల లోపు ఐదు భాషలు ఏకకాలంలో నేర్చుకోగలరు.అమ్మ పోలికా? నాన్న పోలికా? ఇకపై గొడవ పడకండి. నవజాత శిశువులు ఎక్కువగా తండ్రులను పోలి ఉంటారని సూచించే ఆధారాలు ఉన్నాయి. జన్యు పరీక్షలనేవి రాకముందే తండ్రెవరో గుర్తించడానికి ప్రకృతి పరంగా ఈ సారూప్యత ఏర్పడి ఉండవచ్చని బ్రెస్సన్, గ్రాస్సీ (2004) పేర్కొన్నారు.పుట్టుకతోనే పిల్లలకు సంఖ్యల పట్ల సహజమైన ఇన్ట్యూషన్ ఉంటుంది. అంతేకాదు వివిధ పరిణామాల మధ్య తేడాను గుర్తించగలరు. కూడిక, తీసివేతల మధ్య ప్రాథమిక అవగాహన కలిగి ఉంటారని గిynn (1992) అధ్యయనంలో వెల్లడైంది.శిశువులు మనిషి ముఖాలనే కాదు, జంతువుల ముఖాల మధ్య తేడానూ గుర్తించగలరు. అయితే వయసుతో పాటు మనుషులతో ఎక్కువ సమయం గడపడం వల్ల, మనుషుల ముఖాలను గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది. జంతువుల ముఖాల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం తగ్గిపోతుందని పాస్కాలిస్తోపాటు ఇతరులూ (2002) కనుగొన్నారు.నవజాత శిశువులు తల్లి పాలనే కాదు, తల్లి వాసనకూ ప్రాధాన్యాన్నిస్తారు. తల్లి వాసన తగిలినవెంటనే శిశువులు ప్రశాంతంగా ఉంటారని మాక్ఫర్లేన్ (1975) కనుగొన్నారు. ఇది తల్లితో బంధం బలపడటంలో, ఆహారాన్ని అందించడంలో సహాయపడుతుంది.మనిషి మనుగడ సాగించాలంటే కమ్యూనికేషన్ అవసరం. అది పిల్లలు పుట్టుకతోనే నేర్చుకుంటారు. శిశువులు ముఖకవళికలను అనుకరించగలరని, ముఖ సంజ్ఞలను పునరావృతం చేయగలరని మెల్ట్జాఫ్, మూర్ (1977) గమనించారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌కు మూలం బాల్యంలోనే ఉంది.శిశువులు తమ అనుభవాలను జ్ఞాపకాలుగా గుర్తుంచుకుంటారు. ఈ జ్ఞాపకాలు జీవితంలో తర్వాత స్పష్టంగా గుర్తుకు రాకపోవచ్చు, కానీ అవి ప్రవర్తనను, ప్రాధాన్యాలను ప్రభావితం చేస్తాయి. అందుకే శిశువులకు అందమైన అనుభవాలను అందించడం తల్లిదండ్రుల బాధ్యత.– సైకాలజిస్ట్ విశేష్ -
అందంగా లేననే అనుమానం..!?
అంజలి సింగ్.. ఢిల్లీకి చెందిన విద్యార్థి. 21 ఏళ్లు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లి తెలుగు, తండ్రి పంజాబీ. ఆమెకు తన బాడీ ఇమేజ్ గురించి అసంతృప్తి. అదెంతవరకు వెళ్లిందంటే.. 24 గంటలూ దాని గురించే ఆలోచించేంతగా. తను అట్రాక్టివ్‌గా లేననే మాట మనసులో తిరుగుతూనే ఉంటుంది. దాంతో ఒకటికి పదిసార్లు అద్దంలో చూసుకోవడం, కనిపించిన లోపాలను సరిచేసుకోవడానికి గంటలు గంటలు వెచ్చించడం ఆమెకు అలవాటుగా మారిపోయింది.సోషల్ మీడియా ప్రభావం..తన డిజైనర్ పనికోసం ప్రేరణ పొందేందుకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను స్క్రోల్ చేయడం ఆమె ఆందోళనకు మూలంగా మారింది. పూర్తిగా మేకప్ వేసుకున్న, భారీగా ఎడిట్ చేసిన మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల పిక్స్ చూసి, వాళ్లతో పోల్చుకుంటుంది. తను వాళ్లలా స్లిమ్‌గా లేనని, అందుకే తాను ఆకర్షణీయంగా లేనని బాధపడుతుంది.కేలరీల కొలత..స్లిమ్ అవ్వడం కోసం కేలరీలను నిశితంగా ట్రాక్ చేస్తుంది. ఏది తిన్నా, తాగినా కేలరీలు లెక్కేసుకుంటుంది. త్వరగా బరువు తగ్గుతారని ట్రెండ్ అయిన కీటో డైట్ కూడా పాటించింది. యాంగ్జయిటీ ఎక్కువైనప్పుడు విపరీతంగా తినేసి, ఆ వెంటనే గిల్టీగా ఫీలై కొన్ని రోజులపాటు భోజనం పూర్తిగా మానేస్తోంది. ఇవన్నీ కలసి తనకు మరిన్ని ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టాయి.సామాజిక ఒత్తిడి..అంజలి నాన్న తరఫు బంధువులందరూ తెల్లగా, ఫిట్‌గా ఉంటారు. దాంతో వాళ్లు అంజలిని కలసినప్పుడల్లా ‘కొంచెం స్లిమ్‌గా, కాస్త ఛాయ మెరుగ్గా ఉంటే అందంగా ఉండేదానివి’ అని కామెంట్ చేస్తుంటారట. వాస్తవానికి అంజలి అందంగానే ఉంటుంది. కానీ బంధువుల మాటలు, సోషల్ మీడియాలో కనిపించే జీరోసైజ్ మోడల్స్, ఇన్‌ఫ్లూయెన్సర్లతో పోల్చుకోవడం ఆమె అభద్రతాభావానికి కారణమయ్యాయి. వాటికి తోడు ఫ్రెండ్స్ కూడా బరువు తగ్గడం గురించి, డైటింగ్ గురించి తరచూ మాట్లాడటం తన ఆందోళనను మరింత తీవ్రం చేసింది. తాను అట్రాక్టివ్‌గా లేననే ఆలోచనతో పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లడం మానేసింది. ఎలాగైనా స్లిమ్‌గా, ఫిట్‌గా కావాలనే కోరిక తనపై ఒత్తిడిని పెంచుతోంది. అన్నీ కలసి ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉన్నతస్థాయికి చేరాలనే కోరికను అడ్డుకుంటున్నాయి.థెరపీతో పరిష్కారం..అంజలిలాగే చాలామంది యువతులు జీరోసైజ్ కోసం కష్టపడుతుంటే, యువకులు సిక్స్ ప్యాక్ బాడీ కోసం జిమ్‌లలో చెమటోడుస్తున్నారు. ఇలాంటివారు ముందుగా చేయాల్సింది అమితాభ్బచ్చన్, రజనీకాంత్లకు సిక్స్ ప్యాక్‌లు లేవని.. అందరూ ఐశ్వర్యారాయ్‌లా ఉండలేరని గుర్తించాలి. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, న్యూరో లింగ్విస్టిక్ సైకోథెరపీ ద్వారా బాడీ ఇమేజ్ పట్ల అంజలి.. తనకున్న నెగెటివ్ భావనలను, వాటికి మూలకారణాలను అర్థం చేసుకుంది. ఐదు సెషన్లలోనే తన సమస్యను అధిగమించింది.పాజిటివ్ బాడీ ఇమేజ్ కోసం..మీ బాడీ ఇమేజ్ పట్ల మీకున్న ప్రతికూల, విమర్శనాత్మక ఆలోచనలను గుర్తించండి. అవి వాస్తవికతపై ఆధారపడి ఉన్నాయా లేక సోషల్ స్టాండర్డ్స్ ద్వారా వక్రీకరించబడ్డాయా? అనేది గమనించండి.– మీ ప్రతికూల ఆలోచనలను గుర్తించాక, ‘నా ఫ్రెండ్‌తో నేనిలాగే మాట్లాడతానా? ఇలాగే విమర్శిస్తానా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.– అవాస్తవికమైన బాడీ ఇమేజ్ ప్రమాణాలను ప్రోత్సహించే సోషల్ మీడియా అకౌంట్స్‌కు దూరంగా ఉండండి.– ఆకారం కంటే ఆరోగ్యం ముఖ్యమని గ్రహించండి. డా¯Œ ్స, యోగా లేదా ఈత వంటి వాటిని రోజూ ప్రాక్టీస్ చేయండి.– అద్దం ముందు నిలబడి మీ సానుకూల లక్షణాలపై దృష్టి పెట్టండి. ‘ఎవరి అందం వారిదే’, ‘నేను ప్రత్యేకం’, ‘నేను అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాను’ అని చెప్పుకోండి.– బాడీ ఇమేజ్‌తో కాకుండా టాలెంట్‌తో స్ఫూర్తి పంచే కళాకారులు, డిజైనర్లు, క్రియేటర్లను అనుసరించండి. మీరు ఎలా ఉన్నారనేది కాకుండా, మిమ్మల్ని మీరుగా అంగీకరించే స్నేహితులతో కనెక్ట్ అవ్వండి.– ఈ సెల్ఫ్–హెల్ప్ టిప్స్ సరిపోవనిపిస్తే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. – డా. సైకాలజిస్ట్ విశేష్ -
ఈ దొంగతనమనేది ఒక పెద్ద జబ్బు.. చివరికి?
‘నాకు 45 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. హ్యాపీ ఫ్యామిలీ మాది. నాకున్న సమస్యను ఎలా చెప్పాలో తెలియడం లేదు. సిగ్గుగా ఉంది. అదేంటంటే.. కొన్నాళ్లుగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నా. కొలీగ్స్ బ్యాగ్స్లోంచి చిన్నచిన్న వస్తువులు తీసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్లినా వాళ్లకు తెలియకుండా ఏదో ఒకటి దొంగిలిస్తున్నా. స్పూన్, ఫోర్క్లాంటి వాటికీ కక్కుర్తి పడుతున్నా.ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోతున్నా. మొన్న సూపర్ మార్కెట్లో దొరికిపోయేదాన్నే. అదృష్టవశాత్తు బయటపడ్డా. గూగుల్‌లో బ్రౌజ్ చేస్తే ఇది క్లెప్టోమేనియా అనే మానసిక సమస్య అని తెలిసింది. దీనికి పరిష్కారం ఏంటి? దీన్నుంచి నేను బయటపడ్డం ఎలా?’ అంటూ తన పరిస్థితిని వివరించింది మాధవి.నిజమే మాధవి చెప్పినదాన్ని బట్టి అవన్నీ క్లెప్టోమేనియా లక్షణాలే. ఆమె సమస్యను ఎనలైజ్ చేయడానికి ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవలసి వచ్చింది. మాధవి స్వస్థలం బెంగళూరు. బాగా చదవాలని, అన్నిట్లో ఫస్ట్ ఉండాలని చిన్నతనం నుంచే నూరిపోశారు పేరెంట్స్. వాళ్లను సంతోషపెట్టేందుకు కష్టపడి చదివి వాళ్లు కోరుకున్నట్లే అన్నీట్లో ఫస్ట్ ఉండేది ఆమె.ఆ క్రమంలో చాలా ఒత్తిడి అనుభవించింది. చదువైపోయి, మంచి ఉద్యోగమూ సాధించింది. కెరీర్ కూడా బాగుంది. అయినా ఆమెలో ఏదో స్ట్రెస్, ఇన్సెక్యూరిటీ, సెల్ఫ్ క్రిటిసిజం. రెండేళ్ల నుంచి క్లెప్టోమేనియాతో బాధపడుతోంది. తప్పని తెలిసినా కంట్రోల్ చేసుకోలేని స్థితి ఆమెది. ఎవరైనా పట్టుకుంటే అవమానమనే భయం, సిగ్గు, ఆందోళనతో చితికిపోతోంది. ఈ ఆందోళన తగ్గించుకోవడానికి మళ్లీ దొంగతనం చేస్తోంది. అలా చేస్తేనే తనకున్న ఆందోళన తగ్గుతోందట.మెదడులో మార్పులే కారణం... సాధారణంగా ఎవరైనా విలువైన వస్తువులు దొంగిలిస్తారు. కానీ ఏమాత్రం విలువలేని చిన్నచిన్న వస్తువులను దొంగిలించకుండా ఉండలేకపోవడం క్లెప్టొమేనియా ప్రధాన లక్షణం. ఆ తర్వాత భయం, ఆందోళన, అపరాధభావం. వాటినుంచి తప్పించుకునేందుకు మళ్లీ మరో దొంగతనం. ఇదో వలయంలా సాగుతుంది. క్లెప్టోమేనియాకు కచ్చితమైన కారణాలు తెలియవు. మెదడులోని మార్పులు కారణం కావచ్చని, లేదా ఒత్తిడిని అధిగమించేందుకు దొంగతనం అలవాటు కావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.అయితే మెదడులో సెరటోనిన్ అనే రసాయనానికి ఈ రుగ్మతకు సంబంధం ఉందని తెలుస్తోంది. అలాగే చిన్నచిన్న వస్తువులను దొంగిలించినప్పుడు వచ్చే ఎగ్జయిట్మెంట్ మెదడులో డోపమైన్ విడుదలకు కారణం కావచ్చు. దాంతో అలాంటి ఎగ్జయిట్మెంట్ కోసం మళ్లీమళ్లీ దొంగతనం చేస్తుంటారు. ఇంకా మెదడులోని ఓపియాయిడ్ వ్యవస్థ కూడా కారణం కావచ్చు. అలాగే ఇబ్బందికరమైన కోరికల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించుకునేందుకు కూడా దొంగతనం చేయవచ్చు.చికిత్స తప్పనిసరి అవసరం..అరుదుగా ఉండే ఈ రుగ్మత గురించి ఎవరికైనా చెప్పుకుంటే అవమానమని చాలామంది చికిత్సకు దూరంగా ఉంటారు. ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ క్లెప్టోమేనియాను స్వయంగా అధిగమించడం కష్టం. దానికి కచ్చితంగా చికిత్స అవసరం. ఇందులో మందులు లేదా సైకోథెరపీ, లేదా రెండూ అవసరమవుతాయి.అనారోగ్యకరమైన, ప్రతికూల ప్రవర్తనలను, నమ్మకాలను గుర్తించి, వాటిని ఆరోగ్యకరమైన వాటితో భర్తీ చేయడంలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉపయోగపడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో దొంగతనం చేయాలని ట్రిగ్గర్ అవుతుందో గుర్తించాలి. కాగ్నిటివ్ రీ స్ట్రక్చరింగ్,సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్, కౌంటర్ కండిషనింగ్, కోవర్ట్ సెన్సిటైజేషన్, ఎవర్షన్ థెరపీ టెక్నిక్స్ ద్వారా మాధవి మూడు నెలల్లో తన సమస్య నుంచి బయటపడగలిగింది.అయితే ఇది మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందువల్ల నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి రివ్యూ సెషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఆమె ఫాలో అయింది. ఇప్పుడు మాధవి ఏ దొంగతనాలూ చేయకుండా ప్రశాంతంగా జీవిస్తోంది. – సైకాలజిస్ట్ విశేష్ -
అందరూ మెచ్చుకుంటున్నా.. లోలోపల అనుమానం!?
డేవిడ్ ప్రతిష్ఠాత్మక టెక్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. చాలా ప్రాజెక్టులు చేశాడు. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉన్నాడు. కొలీగ్స్, సీఈఓ కూడా అతని పనిని మెచ్చుకుంటారు. అయినా ఏదో భయం. తనను మోసగాడు అనుకుంటారేమోననే భయం! దానివల్ల సరిగా పనిచేయలేక పోతున్నాడు. డేవిడ్ ‘ఇంపోస్టర్ సిండ్రోమ్’తో బాధపడుతున్నాడని అర్థమైంది. దాంతో అతని బాల్యంలోకి వెళ్లాల్సి వచ్చింది.పర్ఫెక్ట్ పేరెంటింగ్ ప్రభావం..డేవిడ్ తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులు. బాల్యం నుంచి డేవిడ్‌ను బాగా ప్రోత్సహించేవారు. చదువులోనే కాదు, అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉండాలని తరచుగా చెప్పేవాళ్లు. ఏ చిన్న తప్పు చేసినా వెంటనే సరిదిద్దేవాళ్లు. డేవిడ్ మంచి గ్రేడ్లు, ర్యాంకులు సాధించినా.. ఏ తప్పూ లేకుండా చేయాలనే ఒత్తిడి అనుభవించేవాడు. ఏ చిన్న తప్పు జరిగినా దాన్ని పెద్ద ఫెయిల్యూర్‌గా చూసేవాడు.స్కూల్, కాలేజీ రోజుల్లో బాగానే ఉన్నా యూనివర్సిటీకి వెళ్లేసరికి డేవిడ్ పై ఒత్తిడి తీవ్రమైంది. కంప్యూటర్ సై¯Œ ్సలో కాంప్లెక్స్ కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోవడానికి తాను కష్టపడుతుండగా, తన ఫ్రెండ్స్ ఈజీగా అర్థం చేసుకోవడం చూసి ఒత్తిడికి లోనయ్యేవాడు. తాను అందరూ అనుకున్నంత తెలివైన వాడినేం కాదని, అందుకే ఇప్పుడు కంప్యూటర్ సై¯Œ ్సను అర్థం చేసుకోవడానికి కష్టపడుతున్నానని అనుకునేవాడు. ఆ విషయం ఎవరికీ చెప్పలేక, చెప్పుకోలేక లోలోపల మథనపడేవాడు.మీ అపనమ్మకమే సమస్య.. తనపై తనకు అపనమ్మకమున్నా డేవిడ్ టాలెంట్ వల్ల టాప్ టెక్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు పొందాడు. అతని టాలెంట్‌ను అందరూ మెచ్చుకునేవారు. కానీ డేవిడ్ లోలోపల మాత్రం అంతా లక్ వల్లే జరిగిందని, తనకేం పెద్ద టాలెంట్ లేదని, ఆ విషయం ఎప్పుడో ఒకసారి, ఎవరో ఒకరు కనుక్కుంటారనే భయపడుతుండేవాడు. ప్రాజెక్టులు సక్సెస్ అవ్వడానికి టీమ్ మెంబర్సే కారణమని అనుకునేవాడు. తనను తాను నిరూపించుకోవాలని నిరంతరం ఒత్తిడి అనుభవించేవాడు. పనులను వాయిదా వేసేవాడు. ఇవన్నీ కలసి అతన్ని డిప్రెషన్లోకి తోసేశాయి. నిద్ర సమస్యలు మొదలయ్యాయి. టాలెంట్ ఉన్నా, ఉందని అందరూ చెప్తున్నా, మెచ్చుకుంటున్నా.. అలాంటి టాలెంటేం లేదని సందేహపడటం, తన మోసం బయట పడుతుందని భయపడటాన్ని ‘ఇంపోస్టర్ సిండ్రోమ్’ అంటారు.ఈ సిండ్రోమ్ నుంచి బయటపడాలంటే..మీ లోపల నిరంతరం విమర్శిస్తుండే వాడి స్వరాన్ని గుర్తించండి. మీ అర్హత, యోగ్యత, సాధించిన విజయాలతో వాడి మాటలను సవాల్ చేయండి.ఊరికే మీపై మీరు సందేహపడుతూ బాధపడకుండా.. మీపై మీరు నమ్మకం పెంచుకోవడానికి మీరు సాధించిన విజయాలు, పూర్తయిన ప్రాజెక్టులను సమీక్షించండి.మీ నైపుణ్యాలు, ప్రతిభను అభినందించడానికి సమయాన్ని వెచ్చించండి. గ్రాటిట్యూడ్ డైరీ రాయండి.చిన్నదైనా పెద్దదైనా మీ ప్రోగ్రెస్‌ను గుర్తించి, సెలబ్రేట్ చేసుకోండి. ఇది మీరు మరింత సాధించడానికి ప్రేరేపిస్తుంది.మీ మనసులోని భావాలను స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబసభ్యుల సహాయం తీసుకోండి.క్రిటికల్ లేదా పర్ఫెక్షనిస్ట్ పేరెంటింగ్, దానివల్ల ఏర్పడే ఒత్తిడి వల్ల వచ్చే ఇంపోస్టర్ సిండ్రోమ్‌ను అధిగమించాలంటే మీపై మీరు నమ్మకం పెంచుకోవాలి. అలా జరగాలంటే ఈ సూచనలు పాటించాలి.Fail అంటే first attempt in learning అని రీఫ్రేమ్ చేయండి. ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించి, దాన్నుంచి పాఠాలు నేర్చుకోండి.మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని కాకుండా, మీ స్కిల్స్ పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోండి.అన్నిటికంటే ముఖ్యంగా, ఇంపోస్టర్ సిండ్రోమ్ అనేది ఒక మానసిక సమస్యే తప్ప మీ సామర్థ్యాలకు కొలమానం కాదని గుర్తించండి. మీ ప్రతికూల ఆలోచనలను సవాలు చేయడం ద్వారా, మీ ప్రతిభకు సంకేతాలను గుర్తించడం ద్వారా మీపై మీరు నమ్మకాన్ని తిరిగి సాధించుకోవచ్చు.– సైకాలజిస్ట్ విశేష్ -
ఏదో మిస్ అవుతున్నానబ్బా అని.. పదే పదే ఈ సందేహమా?
సారిక ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాను స్క్రోల్ చేయడం ఆమెకు మానుకోలేని అలవాటుగా మారింది. తన ఫ్రెండ్స్, ఆన్లైన్ ఫ్రెండ్స్ పెట్టిన వెకేషన్ పోస్టులు, కెరీర్ సక్సెస్ పిక్స్ లాంటివి చూసి ఆందోళన చెందుతోంది, అసంతృప్తికి లోనవుతోంది.కెరీర్లో అవకాశాలు పోతాయనే భయంతో విపరీతంగా పనిచేస్తోంది. అయినా వెనుకబడిపోతాననే ఆందోళన. కొలీగ్స్ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెక్ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు బిజినెస్ మీటింగ్స్ అంటే ఉత్సాహంగా వెళ్లేది. ఈ మధ్య ఇతరుల ప్రెజెంటేషన్లతో పోల్చుకుని ఆందోళన చెందుతోంది. తరచుగా బిజినెస్ మీటింగ్స్‌కు డుమ్మా కొడుతోంది. అది ఆమె ఒంటరితనాన్ని మరింత పెంచుతోంది.ఏదో మిస్ అవుతున్నాననే బాధతో గిటార్‌ను, పెయింటింగ్‌ను పక్కన పడేసింది. ఏం చేయాలో తెలియక సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూంటుంది. అలా అర్ధరాత్రి వరకూ మేల్కొంటోంది. ఆ తర్వాత కూడా సరిగా నిద్ర పట్టడం లేదు. పగలంతా చికాకుగా ఉంటోంది. ఇవన్నీ ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులతో సంబంధాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి ప్రయత్నించింది. అయినా ఫలితం కనిపించకపోవడంతో ఫ్రెండ్ సలహాతో కౌన్సెలింగ్‌కు వచ్చింది.‘నేను తప్ప అందరూ నాకంటే ఎక్కువ సక్సెస్ సాధిస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. నేను అన్నీ మిస్ అవుతున్నాను’ అని చెప్పింది. సారిక ‘ఏదో మిస్ అవుతన్నాననే భయం (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్–ఫోమో)తో బాధపడుతోందని అర్థమైంది. సారికలానే ఈ జనరేషన్లో చాలామంది ఈ సమస్యతో సతమతమవుతుంటారు.కారణాలు..– ప్రతి మనిషి జీవితంలోనూ కష్టం, సుఖం ఉంటాయి. జయాపజయాలు ఉంటాయి. కానీ ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఆనందకరమైన అంశాలను మాత్రమే పంచుకుంటారు. ఇవి వాస్తవికతను వక్రీకరిస్తాయి. ఫోమోకు కారణమవుతాయి. – సారిక తన జీవితాన్ని ఆన్లైన్లో చూసే పర్ఫెక్ట్ లైఫ్‌లతో పోల్చుకుంటోంది. తనకలాంటి జీవితం లేదని అసంతృప్తి, తానలా సాధించలేకపోతున్నాననే అసమర్థతా భావనలతో కుంగిపోతోంది. – నిజ జీవితంలో కంటే కూడా సోషల్ మీడియాలో అందరూ తనను ఆమోదించాలని, మెచ్చుకోవాలని కోరుకుంటోంది. తన పోస్ట్‌లకు, ఫొటోలకు లైక్స్ రాకపోతే తీవ్ర నిరాశ చెందుతోంది.లక్షణాలు..– సోషల్ మీడియా అప్డేట్స్ను నిరంతరం చెక్ చేయాలనే ఆలోచన, చెక్ చేయకుండా ఉండలేకపోవడం ఫోమో ప్రధాన లక్షణం..– ఏదో మిస్ అవుతున్నాననే భయం, ఆందోళన..– సోషల్ మీడియా సెలబ్రిటీలతో పోల్చుకోవడం వల్ల తానలా లేననే దిగులు, డిప్రెషన్..– ఇంటి పనులు, ఆఫీసుపనులపై దృష్టి పెట్టలేకపోవడం..– తనకన్నా మంచి జీవితం గడుపుతున్నట్లు కనిపించే ఇతరుల పట్ల అసూయ..– అర్ధరాత్రి వరకూ సోషల్ మీడియా వాడకం వల్ల నిద్రలేమి..సెల్ప్ హెల్ప్ టిప్స్..– సోషల్ మీడియాను చెక్ చేయడానికి నిర్దిష్ట సమయాలను పెట్టుకోండి. – చెక్ చేయాలనే కోరికను తగ్గించుకోవడానికి మీ స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా యాప్స్‌ను తొలగించండి. కనీసం నోటిఫికేషన్స్‌ను ఆపేయండి. – మీ జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి పెట్టండి. ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ఉండాల్సిన విషయాలను రాయండి. – మీకు స్ఫూర్తినిచ్చే, ఆనందాన్ని అందించే అకౌంట్స్‌ను మాత్రమే అనుసరించండి. ఆందోళన కలిగించే అకౌంట్స్‌ను అనుసరించవద్దు. – స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి, సానుకూల భావాలను పెంపొందించే అర్థవంతమైన పరిచయాలను పెంచుకోండి. – ఆనందాన్ని, సంతృప్తిని కలిగించే హాబీలను అలవాటు చేసుకోండి. – మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి. ఆ వ్యాయామాలు.. ఏదో కోల్పోతున్నామనే ఆందోళనను తగ్గించేందుకు, వర్తమానంలో బతికేందుకు సహాయపడతాయి.– అప్పటికీ మీ సమస్య తగ్గకపోతే ఏమాత్రం మొహమాటపడకుండా, భయపడకుండా సారికలా సైకాలజిస్ట్‌ను కలవండి. – కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) ఆందోళన తగ్గించేందుకు సహాయ పడుతుంది. మీ విలువను, బంధాల విలువను గుర్తిస్తారు. మళ్లీ మీ జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెడతారు. – డా. సైకాలజిస్ట్ విశేష్ -
ఎంత ప్రయత్నించినా.. నిద్ర పట్టడంలేదు!
విజయ్ ఒక ప్రముఖ ఎమ్మెన్సీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. మరో సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లిచేసుకున్నాడు. జీవితంలోనూ, ఉద్యోగంలోనూ త్వరత్వరగా ప్రమోషన్లు అందుకున్నాడు. కానీ గత మూడు నెలలుగా రాత్రిళ్లు నిద్రపట్టక నానా ఇబ్బందులు పడుతున్నాడు. సాధారణంగా ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం.కానీ విజయ్‌కు త్వరగా మెలకువ వస్తుంది. ఆ తర్వాత అస్సలు నిద్ర పట్టదు. ఉదయం చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు వస్తుంది. ఏ పనిౖ పెనా శ్రద్ధ నిలవడంలేదు. నిరంతరం నిద్ర గురించిన ఆలోచనలే. పనిలో ఎక్కువ తప్పులు జరుగుతున్నాయి. దాంతో ఆఫీసులో రెడ్ స్లిప్ వచ్చింది.ఏం చేయాలో అర్థంకాక, స్లీపింగ్ పిల్స్ వాడటం ఇష్టంలేక కౌన్సెలింగ్‌కి వెళ్లాడు. ఫస్ట్ సెషన్లోనే అతను నిద్రలేమి (ఇన్ సోమ్నియా)తో బాధపడుతున్నట్టు తేలింది. ముగ్గురిలో ఒకరు ఇలాంటి రుగ్మతతో బాధపడుతున్నారు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నాయేమో చెక్ చేయించుకోమని సూచించారు.ఎలాంటి శారీరక కారణాలు లేవని పరీక్షల్లో తేలింది. ఆ తర్వాత రెండు వారాలపాటు ఏ సమయంలో నిద్రపోతున్నాడో, ఏ సమయంలో మేల్కొంటున్నాడో డైరీ రాయమని సూచించారు. విజయ్ భార్యతో మాట్లాడి స్లీప్ ఆప్నియా లేదా రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటివి లేవని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత రిలాక్సేషన్ టెక్నిక్స్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా విజయ్ కొద్దివారాల్లో తన నిద్రలేమిని అధిగమించగలిగాడు.నిద్రలేమికి కారణాలు..- దీర్ఘకాలిక నిద్రలేమికి రకరకాల కారణాలున్నాయి. ఒత్తిడి, పని, పాఠశాల, ఆరోగ్యం, డబ్బు లేదా కుటుంబం గురించిన ఆందోళనలు రాత్రిపూట మన మనస్సును చురుకుగా ఉంచుతాయి, నిద్రను కష్టతరం చేస్తాయి. - షిఫ్ట్ లను తరచుగా మార్చడం లేదా వివిధ టైమ్ జోన్లలో ప్రయాణించడం వల్లా శరీరంలోని గడియారానికి (సర్కేడియన్ రిథమ్స్) భంగం కలుగుతుంది- ఒక్కోరోజు ఒక్కో సమయంలో పడుకోవడం, మేల్కోవడం, మంచంపై ఉన్నప్పుడు తినడం, టీవీ చూడటం, పనిచేయడం, స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం లాంటివి నిద్రను డిస్టర్బ్ చేస్తాయి. - యాంగ్జయిటీ, డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతలు..- మధుమేహం, ఉబ్బసం, గుండె జబ్బుల వల్ల లేదా వాటికి వాడుతున్న మందులు..- స్లీప్ ఆప్నియా, రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటి స్లీప్ డిజార్డర్స్..- రాత్రిళ్లు నికోటిన్, ఆల్కహాల్, కెఫీన్ ఉన్న పదార్థాలు, పానీయాలను తీసుకోవడమూ నిద్రలేమికి కారణమవుతాయి.మంచి అలవాట్లతో మంచి నిద్ర..మంచి అలవాట్లు నిద్రలేమిని నివారించడంలో సహాయపడతాయి.- వారాంతాలు సహా ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మేల్కోవడం చేయాలి. - రోజూ వ్యాయామం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది.- పగలు అస్సలు నిద్రపోవద్దు, లేదా పరిమితం చేసుకోవాలి. - కెఫీన్, ఆల్కహాల్, నికోటిన్లను పరిమితం చేయాలి.. వీలైతే పూర్తిగా మానేయాలి. - నిద్రవేళకు ముందు భారీగా తినొద్దు, తాగొద్దు. - పడకగదిని కేవలం నిద్ర కోసమే ఉపయోగించాలి. - గోరువెచ్చని నీటితో స్నానం, చదవడం లేదా శ్రావ్యమైన సంగీతం వినడం ద్వారా నిద్రకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టించుకోవాలి. - ఇవన్నీ చేసినా నిద్ర పట్టనప్పుడు సైకాలజిస్ట్‌ను కలవడం తప్పనిసరి. - నిద్రకు దూరంచేసే నెగెటివ్ ఆలోచనలు, చర్యలను సీబీటీ ద్వారా నియంత్రించవచ్చు. ఇది స్లీపింగ్ పిల్స్ కంటే ప్రభావవంతంగా ఉంటుంది. - లైట్ థెరపీ, స్టిములస్ కంట్రోల్ థెరపీ లాంటివి శరీరాన్ని, మనసును మంచి నిద్రకు సిద్ధం చేస్తాయి. - ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ టెక్నిక్, బయోఫీడ్ బ్యాక్, బ్రీతింగ్ టెక్నిక్స్ లాంటివి కూడా నిద్రవేళల్లో ఆందోళనను తగ్గించడానికి ఉపయోగపడతాయి.ఎవరి నిద్ర వారిదే..నిద్ర అలవాట్లు, అవసరాలు ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఉంటాయి. అందువల్ల తక్కువ నిద్రపోయేవాళ్లందరికీ నిద్రలేమి ఉన్నట్లు కాదు. నిపుణులు అనేక రకాల నిద్ర లక్షణాలను సాధారణంగా పరిగణిస్తారు. - త్వరగా పడుకొని, త్వరగా లేచేవారిని ఎర్లీబర్డ్స్ అంటారు. - గుడ్లగూబల్లా రాత్రంతా మేలుకుని, ఆలస్యంగా పడుకుని, ఆలస్యంగా లేచేవారిని గుడ్లగూబలనే అంటారు. - ఇతరుల కంటే తక్కువ నిద్ర అవసరమైన వారిని షార్ట్ స్లీపర్స్ అంటారు. - పోలీసు, సైన్యం లాంటి విభాగాల్లో ఉండేవారు ఎప్పుడంటే అప్పుడు మేల్కొనేలా ఉంటారు. వారిని లైట్ స్లీపర్స్ అంటారు.– సైకాలజిస్ట్ విశేష్ -
ఈ 5 ఎక్సర్‌సైజ్‌లతో.. మీ ఓవర్ థింకింగ్‌కి చెక్!
‘మీకున్న అతి పెద్ద సమస్య ఏమిటి?’ అని ప్రశ్నిస్తే పదిమందిలో ఏడుగురు ‘అతిగా ఆలోచించడం’ అని సమాధానమిస్తారు. ఇది ఒత్తిడిని, ఆందోళనను పెంచుతుంది, త్వరగా అలసిపోయేలా చేస్తుంది. ఈ ఐదు ఎక్సర్‌సైజ్‌లను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా ‘ఓవర్ థింకింగ్’కి చెక్ పెట్టవచ్చు.ఎప్పడు అతిగా ఆలోచిస్తున్నారో గుర్తించాలి..రోజులో ఏ సమయంలో, దేని గురించి అతిగా ఆలోచిస్తున్నారో, ఆ సమయంలో మీ శరీరంలో ఏయే భాగాలు బిగుసుకుని ఉంటున్నాయో గమనించాలి. అలాంటి పరిస్థితుల్లోనూ ఏ పని చేస్తున్నప్పుడు మీకు తక్కువ నెగెటివ్ ఆలోచనలు వస్తున్నాయో కూడా గుర్తించాలి. ఉదాహరణకు మీరు జిమ్‌కి వెళ్లినప్పుడు లేదా ఫన్నీ పాడ్‌కాస్ట్ వింటున్నప్పుడు ఆందోళన చెందకపోవచ్చు. ఇలాంటి వాటిని గుర్తించడం, ఆచరించడం ఓవర్ థింకింగ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సహాయ పడుతుంది.‘మీ ఆలోచనలకు’ దూరంగా జరగాలి..మీరు ఆలోచనల సుడిగుండంలో పడి మునిగిపోతున్నప్పుడు దానికి దూరంగా జరగాలి. గోడ మీది ఈగలా లేదా జడ్జిలా మీ ఆలోచనలకు దూరంగా జరిగి వాటిని గమనించాలి. ఇలా ఒక అడుగు వెనక్కు వేసి మీ ఆలోచనలను మీరు గమనించడం ద్వారా మీ భావోద్వేగాల తీవ్రత తగ్గిందని మీకు అర్థమవుతుంది. అంతే కాదు, మీ ఆలోచనల చానెల్‌ను మార్చే శక్తి మీకుందని మీరు గుర్తిస్తారు.‘ఎందుకు’ నుంచి ‘ఎలా’కు మారాలి..ప్రతికూల ఆలోచనలను నిర్మాణాత్మక ఆలోచనతో భర్తీ చేయడానికి సులభమైన మార్గం ‘ఎందుకు’ నుంచి ‘ఎలా’కు మారడం. అంటే ‘నాకే ఎందుకిలా జరిగింది?’, ‘నేనే ఎందుకు చేయాలి?’ లాంటి ప్రశ్నల నుంచి దారి మళ్లించుకుని ‘నేను ఎలా ముందుకు వెళ్ళగలను?’ అని ప్రశ్నించుకోవాలి. ఉదాహరణకు, మీ ఫ్రెండ్ మీకు చెప్పిన సమయానికి రాకపోతే, మెసేజ్‌కి స్పందించకపోతే.. ఎందుకలా చేశారని అతిగా ఆలోచించి మనసు పాడుచేసుకోకుండా, ఆ సాయంత్రాన్ని ఆనందంగా ఎలా మార్చుకోవచ్చనే దానిపై దృష్టి పెట్టాలి. ఇలా చేయడం ద్వారా, మీరు నెగెటివ్ ఓవర్ థింకింగ్ నుంచి మంచి ప్లానింగ్‌కి మారతారు.రీషెడ్యూల్ చేయాలి..అతిగా ఆలోచించడానికి రోజులో పది, పదిహేను నిమిషాలు ప్రత్యేకంగా కేటాయించుకోవాలి. ప్రతిరోజూ అదే సమయంలో కూర్చుని దానిపై ఆలోచించాలి . రోజూ అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మిగతా సమయాల్లో ఆ అతి ఆలోచనలు మీ మనసును చుట్టుముట్టవు.పేపర్ పై పెట్టండి..ఒక అనుభవం లేదా ఫీలింగ్స్‌ని ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఊరికే దాని గురించి అతిగా ఆలోచించకుండా, వాటిని పేపర్ పై రాసుకోవాలి. మొదటి రోజు: మిమ్మల్ని వేధిస్తున్న విషయం గురించి రాయడానికి 15 నుంచి 20 నిమిషాలు వెచ్చించాలి.రెండో రోజు: ఆ అనుభవం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసిందో రాసుకోవాలి.మూడో రోజు: ఆ అనుభవం మీ ప్రస్తుత జీవితానికి ఎలాంటి సంబంధం కలిగి ఉందో, భవిష్యత్తులో ఎలా ఉండాలని కోరుకుంటున్నారో కూడా రాసుకోవాలి. ఇలా రాయడం మీ భావోద్వేగాల లోతుల్లోకి వెళ్లడానికి సహాయపడుతుందని, క్రమేమీ మిమ్మల్ని డిప్రెషన్‌కి దూరం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.పేపర్ పై పెట్టండి..ఒక అనుభవం లేదా ఫీలింగ్స్‌ని ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఊరికే దాని గురించి అతిగా ఆలోచించకుండా, వాటిని పేపర్ పై రాసుకోవాలి. మొదటి రోజు: మిమ్మల్ని వేధిస్తున్న విషయం గురించి రాయడానికి 15 నుంచి 20 నిమిషాలు వెచ్చించాలి.రెండో రోజు: ఆ అనుభవం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసిందో రాసుకోవాలి.మూడో రోజు: ఆ అనుభవం మీ ప్రస్తుత జీవితానికి ఎలాంటి సంబంధం కలిగి ఉందో, భవిష్యత్తులో ఎలా ఉండాలని కోరుకుంటున్నారో కూడా రాసుకోవాలి. ఇలా రాయడం మీ భావోద్వేగాల లోతుల్లోకి వెళ్లడానికి సహాయపడుతుందని, క్రమేమీ మిమ్మల్ని డిప్రెషన్‌కి దూరం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.ఈ ఐదు ఎక్సర్‌సైజ్‌లను రోజూ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఓవర్ థింకింగ్ నుంచి తప్పించుకోవచ్చు. అప్పటికీ తగ్గకపోతే ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ని సంప్రదించాలి. – డా. విశేష్, సైకాలజిస్ట్ -
ఈ తరానికి అవసరమైన సప్తపది..
‘పెళ్లంటే నూరేళ్ల పంట, అది పండాలి కోరుకున్న వారి ఇంట పండాలి’... అనే పాట ఒకప్పుడు చాలా పాపులర్. ఈతరం ఒక్కసారి కూడా విని ఉండదు. ఈ పాటలాగే పెళ్లి కూడా పాతబడిపోతోంది. ఈ మాట అంటే చాలామందికి కోపం రావచ్చు. కానీ పెళ్లి స్వరూపం మారిపోతోందనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెళ్లి స్థానంలో లివ్ ఇన్ రిలేషన్షిప్ వచ్చేస్తోంది. పెళ్లికి ముందే ఒకే ఇంట్లో కలిసి ఉండే జంటల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.ఇది ఎక్కడకు వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. అయితే పెళ్లయినా, లివ్ ఇన్ అయినా మరెలాంటి బంధమైనా నిలబడాలంటే ఏడు సూత్రాలు పాటించాలని ‘ఫ్యామిలీ జర్నల్’ జరిపిన సైకాలజికల్ రీసెర్చ్‌లో వెల్లడైంది. ఈ ఏడు సూత్రాలు పాటించడం ద్వారా జీవిత భాగస్వాముల మధ్య ప్రేమ, సామరస్యం వెల్లివిరుస్తుందని ఆ అధ్యయనం చెబుతోంది. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం.లోపాలను బలాలుగా మార్చుకోగల సామర్థ్యం..పెళ్లంటే చాలా సవాళ్లు ఉంటాయి. భార్యాభర్తల్లో లోపాలుంటాయి, దిగులుపడే సందర్భాలు ఉంటాయి. ఆ సవాళ్లను ఎలా పరిష్కరించుకుంటారు, వారి లోపాలను ఎలా మార్చుకుంటారనేదే వారి బంధంలోని బలాన్ని నిర్ణయిస్తుం దని ఈ అధ్యయనంలో వెల్లడైంది. కష్టసమయాల్లో ఒకరికొకరు ఓదార్పు, మద్దతు, ప్రోత్సాహం అందిస్తూ కలిసి సమస్యలు ఎదుర్కోవడమే తొలిమెట్టు.కలిసి పంచుకోవడం కీలకం..‘నా స్పేస్ నాకు కావాలి’ అంటూ గొడవపడే జంటలు మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు. పెళ్లంటేనే కలిసి జీవితాన్ని పంచుకోవడం. ఇద్దరూ కలిసి ఆనందించే చర్యల ద్వారా తమదైన ప్రపంచాన్ని సృష్టించుకోవడం అవసరమని ఈ అధ్యయనం హైలైట్ చేస్తుంది. ఇలా చేయడం జంట మధ్య భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. అందువల్ల తరచుగా కలిసి నడవడం, వంటచేయడం, పరస్పర హాబీలను ప్రోత్సహించుకోవడం లాంటి పనులు చేయాలి.విభేదాలు, మార్పును సహించడం..పెళ్లంటే భిన్న వ్యక్తిత్వాలున్న ఇద్దరు కలిసి ఒకటిగా జీవించడం. అంటే వారిద్దరి మధ్య విభేదాలు సహజం. వాటిని అంగీకరించడం, సహించడం అవసరం. అలాగే బంధంలో, భాగస్వామిలో వచ్చే మార్పును ముప్పుగా భావించకుండా, దాన్ని పరిణామానికి ఒక అవకాశంగా చూడాలి. విభేదాలతో విడిపోకుండా, అవి ఒకరి గురించి మరొకరు మరింత తెలుసుకోవడానికి అమూల్యమైన అవకాశాలుగా వినియోగించుకోవాలి.రాజీతోనే విభేదాలు పరిష్కారం..వైవాహిక జీవితంలో విభేదాలు సహజం. తప్పెవరిదైనా విభేదాలను పరిష్కరించు కోవడానికి రాజీ పడటం అవసరం. అలా రాజీపడి విభేదాలను పరిష్కరించుకోగల జంటలు ఎక్కువ సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తారని అధ్యయనం చెబుతోంది. అందువల్ల లోపాల గురించి విమర్శించుకునే బదులు బలాలు, సానుకూల లక్షణాలను ప్రశంసించడంపై దృష్టి పెట్టండి. ఒకరిపట్ల మరొకరికి అవగాహన, కృతజ్ఞత కలిగి ఉండటం సామరస్య వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.అప్పుడప్పుడైనా మెచ్చుకోవాలి..భార్య వంట చేస్తే లొట్టలేసుకుంటూ తినడం, భర్త బంగారం కొనిస్తే తీసుకోవడమే కాదు.. వారికెప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? చిన్న చిన్న విషయాలకు కూడా థాంక్స్ చెప్పడం అవసరమని అధ్యయనం నొక్కి చెబుతుంది. అలా చేయడం జంట మధ్య ప్రేమ, అనుబంధాన్ని పెంపొందిస్తుంది. అందుకే మీ పార్ట్నర్ సహకారాన్ని, లవ్ సిగ్నల్స్‌ను గుర్తించి అభినందించేందుకు ప్రయత్నించండి.బంధంలో నిబద్ధత..భారతదేశంలో పెళ్లంటేనే జీవితకాల బంధం. అది విజయవంతం కావాలంటే నిబద్ధత కీలకం. జీవితంలో వచ్చే చెడు కాలాలను దాటి బంధం నిలబడాలంటే జంటలో అంకితభావం, పట్టుదల అవసరం. అన్నింటికంటే వైవాహిక బంధమే ముఖ్యమైనదని గుర్తించి, దాన్ని కాపాడుకోవడానికి సమయం వెచ్చించాలి. అలా కాల పరీక్షను తట్టుకుని నిలబడే ప్రేమ, విశ్వాసాలకు పునాదిని నిర్మించుకోవచ్చు.తనను తాను గౌరవించుకోవాలి..ఆరోగ్యకరమైన సంబంధాలకు ఆత్మగౌరవం ఆధారం. అది మీరు మీ భాగస్వామితో వ్యవహరించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. బలమైన ఆత్మగౌరవం ఉన్నవారు సంతృప్తికరమైన సంబంధాలను కొనసాగించడానికి మెరుగ్గా సన్నద్ధమవుతారని అధ్యయనం సూచిస్తోంది. ఆత్మగౌరవం లేనివారు చిన్నచిన్న విషయాలకు కూడా నొచ్చుకుని గొడవపడుతుంటారు. అందుకే ముందుగా మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, ప్రేమించుకోండి. అది మీ వైవాహిక బంధానికి పునాదిగా నిలుస్తుంది.ఇవి చదవండి: Father's Day 2024: హాయ్..! నాన్న..!! -
బుల్లీయింగ్‌ను నిర్లక్ష్యం చేయొద్దు..
రేచల్ చురుకైన విద్యార్థిని. ఆటల్లో, పాటల్లో, చదువులో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుంటుంది. స్కూల్లో ఏ ఫంక్షన్ ఉన్నా తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అయితే గత ఏడాదిగా తన ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయింది. 15ఏళ్ల టీనేజర్లో ఉండే చురుకుదనం కనిపించడంలేదు. టీచర్లు గుర్తించి అడిగారు, ఏమీ చెప్పలేదు. దాంతో పేరెంట్స్‌ను పిలిపించి చెప్పారు. వాళ్లు అడిగినా ఏమీ చెప్పలేదు. మరోవైపు టెస్టుల్లో మార్కులు తగ్గుతున్నాయి. ఏం చేయాలో అర్థంకాక కౌన్సెలింగ్‌కు తీసుకువచ్చారు.రేచల్ ఆందోళగా కనిపించింది. ఐ కాంటాక్ట్ ఇవ్వడంలేదు. వినిపించీ వినిపించకుండా మాట్లాడుతోంది. నెమ్మదిగా తనను మాటల్లో పెట్టాను. ఫాదర్‌కు ట్రాన్స్ఫర్ కావడంతో రెండేళ్ల కిందటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చామని చెప్పింది. సిటీకి రావడం మొదట్లో తనకు ఉత్సాహంగా ఉన్నా పాత స్నేహితులకు, సుపరిచితమైన వాతావరణానికి దూరంకావడం తనకు బాధగా ఉందని, తరచుగా కడుపునొప్పి కూడా వస్తోందని చెప్పింది. అది యాంగ్జయిటీ వల్ల వచ్చే సొమాటిక్ సింప్టమ్ అని అర్థమైంది. సైకోడయాగ్నసిస్ ద్వారా ఆమె తీవ్ర ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతోందని నిర్ధారణైంది.కొత్త స్కూల్లో ఒక బ్యాచ్ తన మాటలు, ఉచ్చారణ, డ్రెస్సుల గురించి ఎగతాళి చేస్తోందని ఆ తరువాతి సెషన్లో చెప్పింది. ఆమె గురించి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని, తన సోషల్ మీడియా పోస్టులను అపహాస్యం చేస్తున్నారని చెప్పింది. ఇటీవల నేరుగానే బెదిరిస్తున్నారని, ఏం చేయాలో అర్థం కావడంలేదని కంటనీరు పెట్టుకుంది. రేచెల్లానే దాదాపు 20 శాతం మంది విద్యార్థులు, విద్యార్థినులు బుల్లీయింగ్ బాధితులవుతున్నారు. అది వారిని మానసికంగా, విద్యాపరంగా చాలా దెబ్బతీస్తుంది. కొన్ని సెషన్ల థెరపీ అనంతరం రేచల్ బుల్లీయింగ్ నుంచి బయటపడి, తిరిగి తన సంతోషాన్ని వెనక్కు తెచ్చుకోగలిగింది.ఎలా ఎదుర్కోవాలి?బుల్లీయింగ్ ఎదురైనప్పుడు పిల్లలు కొన్ని చిట్కాలు పాటించాలి. పేరెంట్స్ అండగా నిలవాలి. అవసరమైతే సైకాలజిస్టుల సహాయం తీసుకోవాలి. – మీ బలాలు, ప్రతిభను గుర్తించండి. పాజిటివ్ సెల్ఫ్ టాక్‌ను ప్రాక్టీస్ చేయండి. అవి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. – ఒత్తిడి, ఆందోళనను నియంత్రించుకునేందుకు బ్రీతింగ్, రిలాక్సేషన్, మైండ్ ఫుల్నెస్ టెక్నిక్స్‌ను ప్రాక్టీస్ చేయండి. – మీ భావాలను, అవసరాలను స్పష్టంగా వ్యక్తపరచడం నేర్చుకోండి. – మీకు మద్దతుగా ఉండే స్నేహితుల సహాయం తీసుకోండి. – బుల్లీయింగ్ జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలు, పరిస్థితులకు దూరంగా ఉండండి. – తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి.పేరెంట్స్ ఏం చేయాలి?– మీ పిల్లలు అన్ని ఫీలింగ్స్, అభిప్రాయాలు స్వేచ్ఛగా మాట్లాడేలా, పంచుకునేలా ప్రోత్సహించండి.– శారీరక, మౌఖిక, సైబర్ బుల్లీయింగ్ గురించి అవగాహన కల్పించండి. – బుల్లీయింగ్ జరిగినప్పుడు ఎలా స్పందించాలో పిల్లలతో ప్రాక్టీస్ చేయించండి. – కాన్ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్ టెక్నిక్ట్స్ ప్రాక్టీస్ చేయించండి. – తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా ప్రోత్సహించండి. – బుల్లీయింగ్ గురించి టీచర్స్‌తో, స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడండి. – బుల్లీయింగ్ వల్ల మీ బిడ్డ ఎమోషనల్‌గా బాధపడుతుంటే వెంటనే సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి. – కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ), ఫ్యామిలీ థెరపీ ద్వారా సైకాలజిస్ట్ మీకు సహాయం చేస్తారు.ఎందుకు బెదిరిస్తారు? ప్రతి వ్యక్తీ గుర్తింపును కోరుకుంటారు. ఆటలు, మాటలు, పాటలు, ప్రవర్తన లేదా ప్రతిభ ద్వారా గుర్తింపును సాధించుకుంటారు. అవేమీ లేనివారు ఇతరులను ఏడిపించడం ద్వారా గుర్తింపును సాధించాలనుకుంటారు. అయితే ఎవ్వరూ అలా పుట్టరు. రెండు మూడేళ్ల వయసులో పిల్లల దూకుడు ప్రవర్తనను నియంత్రించకపోతే వారు పెద్దయ్యాక ఇతరులను బెదిరించేవారిగా మారవచ్చు. వారిని అలాగే వదిలేస్తే వారిలో నేరప్రవృత్తి పెరిగి భార్యాపిల్లలను కొట్టడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి పిల్లలకు కూడా ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం.ఎందుకు ఆపరు?బుల్లీయింగ్‌ను చాలామంది గమనించినా ఆపే ప్రయత్నం చేయరు. ఆపితే తమను కూడా టార్గెట్ చేస్తారని భయపడతారు. కొందరు తాము చేయలేనిదాన్ని వాళ్లు చేస్తున్నారని చూసి ఆనందిస్తారు. మరికొందరు దాన్ని ఫన్‌లా తీసుకుని నవ్వుతారు. ఈ మౌనం, నవ్వు ఎగతాళి చేసేవారికి ప్రోత్సాహకంగా మారుతుంది. ఇక సైబర్ బుల్లీయింగ్ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ట్రోల్ చేయడమే ప్రధానంగా సోషల్ మీడియా పేజీలు, వీడియోలు రావడం, వాటిని పలువురు షేర్ చేయడం గమనించవచ్చు.– సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) -
సెల్ఫోన్ల నుంచి.. పిల్లల్ని కాపాడుకోవడం ఎలా?
‘మా బాబు ఉదయం లేచిన దగ్గర్నుంచీ మొబైల్ ఫోన్లోనే ఉంటాడండీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు’ ఒక తండ్రి ఆవేదన.‘మా పాపకు ఇన్‌స్టా రీల్స్ పిచ్చి పట్టుకుంది. చదువు పక్కనపెట్టి మరీ రీల్స్ చేస్తోంది. ఎంత చెప్పినా వినడం లేదు’ ఒక తల్లి ఆక్రోశం.‘స్కూల్‌కు మొబైల్ ఫోన్ తీసుకురాకూడదని రూల్ ఉన్నా స్టూడెంట్స్ పట్టించుకోవడం లేదు. మేం పాఠం చెప్తుంటే వాళ్లు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు’ ఒక టీచర్ ఫిర్యాదు.‘వాళ్లు లైబ్రరీలకు వెళ్లారు, పుస్తకాలు చదివారు. థియేటర్లకు వెళ్లారు, సినిమాలు చూశారు. మేం స్మార్ట్‌ఫోన్‌లో చూసి నేర్చుకుంటున్నాం, ప్రాజెక్టులు చేస్తున్నాం. రీల్స్ చేస్తున్నాం, చూస్తున్నాం. తప్పేంటీ?’ ఈ తరం విద్యార్థి ప్రశ్న.సోషల్ మీడియాతోనే చిక్కు..పిల్లల మీద స్మార్ట్‌ఫోన్ ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా సైకాలజిస్టులు అధ్యయనాలు జరుపుతున్నారు. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జోనాథన్ హైద్ కూడా అందులో ఒకరు. 16 ఏళ్లు వచ్చేవరకు పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వకూడదని సోషల్ సైకాలజిస్ట్ అయిన హైద్ బలంగా వాదిస్తున్నారు. పిల్లలకు సురక్షితం కాని విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయని, వాటి నుంచి కంట్రోల్ చేసుకునే శక్తి, అనుభవం పిల్లలకు ఉండదని అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ఒక నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. వాటి నుంచి పిల్లలను కాపాడుకోలేకపోతే యువకుల మానసిక ఆరోగ్యానికి హాని కలగవచ్చని హెచ్చరించింది.సమస్య ఎక్కడ మొదలైంది?ఒకటి రెండు తరాలకు ముందు.. పాఠశాలంటే తప్పకుండా ఆటస్థలం ఉండేది. ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామ తరగతి ఉండేది. కాలక్రమేణా పాఠశాలలు ఇరుకిరుకు భవనాలకు మారాయి. ఆటస్థలాలు దూరమయ్యాయి. ఆ సమయంలోనే స్మార్ట్ఫోన్లు వచ్చాయి, ఆటల స్థానాన్ని ఆక్రమించాయి. పిల్లలు ఆటల్లో కొట్టుకోవడం లేదని, దెబ్బలు తగలడం లేదని, చేతులు విరగడం లేదని, ఇంట్లోనే సురక్షితంగా ఉంటున్నారని తల్లిదండ్రులు సంతోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలెడ్జ్‌ను ఇంటర్నెట్ అందుబాటులోకి తెస్తుందనీ, పిల్లలు తెలివైన వారుగా తయారవుతారనీ ఆశపడ్డారు. పిల్లలను వాస్తవ ప్రపంచంలోని ప్రమాదాల నుంచి రక్షించుకున్నామే తప్ప ఆన్లైన్ ప్రపంచంలోని ప్రమాదాలను పసిగట్టలేకపోయాం. ఫలితంగా పిల్లలు స్మార్ట్‌ఫోన్ వలలో చిక్కుకుపోయారు.మారకపోతే ప్రమాదమే..ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లో అబ్బాయిలు వీడియో గేమ్స్, యూట్యూబ్ కోసం ఎక్కువగా వాడుతుంటే, అమ్మాయిలు ఐnట్ట్చజట్చఝ, టn్చpఛిజ్చ్టి లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి ఎక్కువగా వాడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. అలాగే అబ్బాయిల కంటే అమ్మాయిలు తమ ఎమోష¯Œ ్స గురించి ఎక్కువగా మాట్లాడతారని, పంచుకుంటారని వెల్లడైంది. ఈ పరిస్థితి మారకపోతే యువతలో నిరుత్సాహం, ఆందోళన స్థాయి పెరుగుతుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 30 నుంచి 40 శాతం మంది డిప్రెషన్ లేదా యాంగ్జయిటీతో బాధపడుతున్నారని, 30శాతం మంది ఆత్మహత్మ గురించి ఆలోచిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఏటికి ఆ ఏడు ఇది పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు.ఐదు అంచెల్లో పరిష్కారం..1. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్‌ఫోన్ ఇవ్వకూడదు. అది వారి మెదడు ఎదుగుదలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లల కదలికలు తెలుసుకోవాలనుకుంటే బేసిక్ మొబైల్ ఫోన్ ఇస్తే సరిపోతుంది.2. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పిల్లల కోసం రూపొందించలేదు. అవి పిల్లలకు హానికరం. బాల్యంలోనే వాటికి పరిచయం అయితే తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.3. పిల్లల ధ్యాసను పక్కదారి పట్టించడంలో స్మార్ట్‌ఫోన్‌దే ప్రధాన పాత్ర. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలల్లోకి స్మార్ట్‌ఫోన్‌ను అనుమతించకూడదు. ఫోన్ లేకపోతే పాఠాలపై శ్రద్ధ పెడతారు, స్నేహితులతో సమయం గడుపుతారు.4. స్మార్ట్ఫోన్లకు దూరం చేస్తే పిల్లలకు పేరెంట్స్‌పై కోపం పెరుగుతుంది. ప్రాజెక్ట్ వర్క్‌ల కోసం విద్యార్థులందరూ డెస్క్ టాప్ లేదా లాప్ టాప్లే వాడాలని పాఠశాలలు ఆదేశాలివ్వాలి.5. పిల్లలను ఫోన్ ఆధారిత బాల్యం నుంచి వెనక్కు తీసుకురావాలి. ఆటలు ఆడుకునే బాల్యాన్ని అందించాలి.– సైకాలజిస్ట్ విశేష్ -
పిల్లల్లో కోపం హద్దులు దాటితే.. ఇలాగే జరుగుతుంది..!
అరుణ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. కానీ వాడిని చూస్తే క్లాస్ మొత్తానికీ హడల్. ఓసారి ఏదో అన్నాడని క్లాస్మేట్ గొంతు పిసికాడు. మరోసారి క్లాస్ టీచర్‌పైనే పుస్తకం విసిరేశాడు. ఇంకోసారి ఏకంగా ప్రిన్సిపాల్ పైనే అరిచేశాడు. దాంతో పలుమార్లు స్కూల్లో కౌన్సెలింగ్ చేయించారు. పేరెంట్స్‌ను స్కూల్‌కి పిలిపించి హెచ్చరించారు. కానీ అరుణ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో క్లాస్ టీచర్ సలహా మేరకు కౌన్సెలింగ్ సెంటర్‌కు వెళ్ళారు. పేరెంట్స్‌తో మాట్లాడాక అరుణ్ ప్రవర్తనకు మూలం ఇంటి వాతావరణంలోనూ, చూస్తున్న సీరియల్స్‌లోనూ ఉందని తేలింది.హింసాత్మక ప్రవర్తన..పిల్లల చుట్టూ ఉండే విభిన్న అంశాలు హింసాత్మక ప్రవర్తన, ధోరణిని పెంచుతాయి. అది వయసును బట్టి కొట్టడం, తన్నడం, కొరకడం, జంతువులను బాధించడం నుంచి ఇతరులపై దాడిచేయడం, కాల్పులు వంటి నేరపూరిత చర్యల వరకు ఉంటుంది. ఇలాంటి హింసాత్మక, విధ్వంసక ప్రవర్తనను సకాలంలో నియంత్రించకపోతే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. పిల్లల్లో హింసాత్మక ప్రవర్తనకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు చిన్నప్పటి నుంచే కనిపిస్తాయి. తల్లిదండ్రులు వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.పిల్లల్లో హింసకు కారణాలు..పిల్లల్లో హింసాత్మక ప్రవర్తన పెరగడానికి కారకాలేంటో తెలుసుకోవడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఏడు సంవత్సరాల పాటు అధ్యయనం జరిపారు. శారీరక శిక్ష, దూకుడు ఆలోచనలు, దూకుడు ప్రవర్తన, ఆత్మగౌరవ లేమి లాంటివి హింసాత్మక ప్రవర్తనకు కారకాలని తేలింది. మరికొన్ని కారణాలు.. 1. శారీరక, మానసిక, శాబ్దిక, లైంగిక దోపిడీకి గురికావడం.2. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, మంచి ఇంటి వాతావరణాన్ని అందించకపోవడం..3. బాధాకరమైన సంఘటనలకు గురికావడం లేదా నిరంతర ఒత్తిడిని అనుభవించడం..4. బెదిరింపుల బాధితుడుగా ఉండటం లేదా తానే బెదిరించడం..5. మద్యం, గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాల వాడకం..6. టెలివిజన్‌లో హింసాత్మక ప్రోగ్రామ్‌లు చూడటం..7. కత్తులు, తుపాకులు లాంటివి ఇంట్లో కంటికెదురుగా ఉండటం..8. చాలా వాస్తవికమైన ఫస్ట్–పర్సన్ షూటర్ గేమ్స్ లాంటివి ఆడటం ఉదా.. పబ్జీ గేమ్.. 9. అఈఈ, అఈఏఈ, బైపోలార్ డిజార్డర్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలు..నిరోధించడమిలా..హింసాత్మక ప్రవర్తనను ప్రేరేపించే కారకాలకు దూరం చేస్తే హింసాత్మక ప్రవర్తన తగ్గుతుందని లేదా నిరోధించవచ్చని అధ్యయనాలు చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాల్య, కౌమారదశల్లో ఇల్లు, సమాజం, మీడియా ద్వారా హింసకు గురికావడాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి. ఇంకా..1. కోపం, చిరాకులను సరైన రీతిలో ఎలా వ్యక్తం చేయాలో నేర్పించాలి.2. తన చర్యలకు, పరిణామాలకు తనదే బాధ్యతని గుర్తించేలా తయారుచేయాలి. 3. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, టీవీ, వీడియోలు, చలనచిత్రాలతో సహా పిల్లల స్క్రీన్ విషయంలోనూ హింస లేకుండా పర్యవేక్షించాలి. 4. అన్నిటికీ మించి మంచి కుటుంబ వాతావరణాన్ని అందించాలి. 5. బడిలో, పరిసరాల్లోని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలి. 6. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోపం తగ్గకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి. 7. సైకాలజిస్ట్‌లు పిల్లల కోపానికి కారణాలు లేదా మానసిక సమస్యలను వీలైనంత త్వరగా గుర్తించి సైకోథెరపీ ద్వారా సహాయపడతారు.కోపం సాధారణ భావోద్వేగం..కోపం మనందరిలో ఉండే ఒక సాధారణ భావోద్వేగం. అయితే చిన్న పిల్లలకు తమ కోపాన్ని ఎలా వ్యక్తం చేయాలో, లేదా ఎలా నియంత్రించుకోవాలో తెలియదు. బొమ్మలు పగలగొట్టవచ్చు, స్నేహితులను నెట్టివేయవచ్చు, కొట్టవచ్చు. వయసు పెరిగేకొద్దీ కోపం నియంత్రించుకోవడం తెలుస్తుంది. కానీ అరుణ్‌లా కొందరిలో ఆ నియంత్రణ శక్తి ఉండదు. హెచ్చరిక సంకేతాలు.. 1. తరచుగా అదుపులేని కోపం2. సులువుగా నిరాశ చెందడం 3. చాలా సున్నితంగా ఉండటం 4. తరచు చిరాకు పడటం 5. ఇంపల్సివ్గా వ్యవహరించడం 6. తరచుగా బెడ్‌ను పాడుచేయడంసైకాలజిస్ట్ విశేష్(psy.vishesh@gmail.com)ఇవి చదవండి: Mother's Day-2024: తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం! -
'విడిపోతామని విపరీతమైన భయం'! అసలు కారణమేంటి?
భారతికి ఇద్దరు పిల్లలు. భర్త భరత్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. భారతి గతంలో పనిచేసినప్పటికీ, ప్రస్తుతం పిల్లలకోసం ఇంట్లోనే ఉంటోంది. కానీ పిల్లలను స్కూల్‌కు పంపాలంటే విపరీతంగా భయపడుతోంది. వాళ్లు తనకు దూరమవుతారేమోనని ఆందోళన చెందుతోంది. స్కూలుకెళ్తే పిల్లలు దూరమవుతారనే భయమేంటోయ్ అని భరత్ జోక్ చేసినా ఆమె ఆందోళన తగ్గకపోగా, భర్త ఎక్కడ దూరమవుతాడోననే భయమూ మొదలైంది. నీవన్నీ పిచ్చి భయాలని భర్త ఎంత చెప్పినా ఆమెకు ధైర్యం రావడం లేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో కౌన్సెలింగ్‌కి అటెండ్ అయింది.భారతితో మాట్లాడుతున్న క్రమంలో ఆమె చిన్నప్పుడు తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో పెరిగిందనే విషయం తెలిసింది. తల్లిదండ్రుల మధ్య గొడవల వల్ల ఆమెను హాస్టల్లో ఉంచారని చెప్పింది. పేరెంట్స్ ఎక్కడ విడిపోతారోనని రోజూ భయపడేదాన్నని, తాను భయపడినట్లు వాళ్లు విడిపోయారని బాధపడింది. అప్పటినుంచీ ఒంటరిగానే ఉంటున్నానని, కానీ ఒంటరితనం విపరీతమైన ఆందోళనను పెంచిందని చెప్పింది. భారతి గురించి పూర్తిగా తెలుసుకున్నాక ఆమె సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్‌తో బాధపడుతోందని అర్థమైంది. ఇష్టమైన వ్యక్తి నుంచి విడిపోతామనే భయమే ఈ డిజార్డర్. ఇది పిల్లల్లో సహజం. అయితే భారతిలానే కొందరు పెద్దల్లో కూడా ఉంటుంది.ఎప్పడు మొదలవుతుంది?విడిపోతామనే ఆందోళన సాధారణంగా ఎనిమిది నెలల వయసు నుంచి ప్రారంభమవుతుంది. ఈ వయస్సులో పిల్లలను విడిచిపెట్టి తల్లిదండ్రులు పక్కకు వెళ్లినప్పడు ఆందోళన చెందుతారు. రెండేళ్ల వయసు వచ్చేసరికి తల్లిదండ్రులు తమను వదిలి వెళ్లరని, తిరిగి వస్తారని అర్థం చేసుకోవడం మొదలుపెడ్తారు. అయితే కొందరిలో ఇది ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. జీవిత భాగస్వామితో లేదా రక్తసంబంధీకులు, స్నేహితులతో విడిపోతామని ఆందోళన చెందుతుంటారు.పిల్లల్లో సెపరేషన్ యాంగ్జయిటీకి కారణాలు..సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ జన్యుపరమైనది కావచ్చు. ఇది కుటుంబ పరంగానూ రావచ్చు. జీవితంలో జరిగే సంఘటనలూ కారణం కావచ్చు. ఉదాహరణకు..కుటుంబ సభ్యుల మరణంతల్లిదండ్రులు విడిపోవడం తల్లిదండ్రులు లేకపోవడంవలస వెళ్లాల్సి రావడంపాఠశాల మార్పుతల్లిదండ్రుల్లో ఆందోళనతల్లిదండ్రుల మద్య వ్యసనందత్తతకు వెళ్లడంపెద్దల్లో కారకాలు..ప్రియమైన వ్యక్తిని కోల్పోవడంకఠినమైన పెంపకంజీవితంలో నిత్యం సవాళ్లు, ఒత్తిళ్లుచిన్నతనంలో ఆందోళన రుగ్మతపిల్లల్లో కనిపించే లక్షణాలు..పిల్లల్లో తరచుగా ప్రీస్కూల్, డేకేర్ సమయంలో ఇది ప్రారంభమవుతుంది. మిమ్మల్ని వదిలివెళ్లడానికి బిడ్డ నిరాకరించవచ్చు, కోపం ప్రదర్శించవచ్చు. · కుటుంబ సభ్యులకు ఏదైనా చెడు జరుగుతుందనే భయం· ఒంటరిగా మిగిలిపోతానేమోనని భయం· తప్పిపోతామేమో, ఎవరైనా ఎత్తుకెళ్తారేమోననే భయం· పీడ కలలు· నిద్రలో మూత్రం పోయడంపెద్దల్లో కనిపించే ఇతర లక్షణాలు..· ఇష్టమైన వారు దగ్గర లేనప్పుడు భయాందోళనలు · ప్రియమైన వ్యక్తి గాయపడతారనే భయం · ఎవరితోనూ కలవకపోవడం · ఏకాగ్రత కోల్పోవడం.జీవితంపై తీవ్ర ప్రభావం..సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అది పాఠశాల, ఉద్యోగ జీవితం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కడుపు నొప్పి, తలనొప్పి, తల తిరగడం, వికారం, వాంతులు, అతిసారం, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. వీటితో పాటు డిప్రెషన్, ఇతర యాంగ్జయిటీ డిజార్డర్స్, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్లూ తలెత్తవచ్చు.నివారించడమెలా?సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్‌ను నివారించడానికి ఎలాంటి మార్గాలూ లేవు. అయితే పిల్లల్లో ఈ సమస్య రాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు కొన్ని చర్యలు తీసుకోవచ్చు. · నమ్మకమైన బేబీ సిట్టర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా వేరుగా ఉండటం ప్రాక్టీస్ చేయాలి..· కొద్ది సమయంపాటు విడిగా ఉండటం పిల్లలకు అలవాటు చేయాలి..· ఎక్కడైనా వదిలివెళ్లినప్పుడు, చెప్పిన సమయానికి రావడం ద్వారా నమ్మకాన్ని పెంచాలి.. · అయినప్పటికీ పిల్లల్లో ఆందోళన కనిపిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను కలవాలి..· కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా ఈ రుగ్మతకు చికిత్సను అందించొచ్చు. · డయలెక్టికల్ బిహేవియరల్ థెరపీతో పాటు ఫ్యామిలీ థెరపీ, గ్రూప్ థెరపీ కూడా ఎమోషనల్ మేనేజ్మెంట్లో సహాయపడతాయి. · అవసరమైతే సైకియాట్రిస్ట్‌ను కలసి మందులు తీసుకోవాల్సి ఉంటుంది.— సైకాలజిస్ట్ విశేష్ -
Health: మీరు ఈ తొమ్మిది అలవాట్లు వదులుకుంటే.. సక్సెస్ గ్యారంటీ!
‘పదే పదే ఏం చేస్తామో అదే మనం. ఎక్సలెన్స్ అనేది ఒక పని కాదు, ఒక అలవాటు’ అంటాడు అరిస్టాటిల్. ఉదయం లేచిన దగ్గర్నుంచీ మనం చేసే పనులే మన అలవాట్లుగా మారతాయి. అవే మన విజయాన్ని నిర్ణయిస్తాయి. తొమ్మిది అలవాట్లు 90శాతం సమయాన్ని వృథా చేస్తాయని సైకాలజిస్టులు గుర్తించారు. వాటిని మార్చుకునే మార్గాలు కూడా సూచించారు. వాటిని తెలుసుకుని ఆచరించడం ద్వారా మీరు జీవితంలో అనుకున్నది సాధించవచ్చు. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం.1. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం..అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం ఒక కాగ్నిటివ్ డిస్టార్షన్. అలా అనుకోవడం వల్ల ఏ చిన్న తప్పు జరిగినా మొత్తం నాశనమైందంటూ బాధపడుతుంటారు. అందుకే అందరిలోనూ, అన్నిటిలోనూ.. చిన్నవో, పెద్దవో లోపాలు ఉంటాయనే విషయాన్ని అంగీకరించాలి. పాజిటివ్స్‌ను చూస్తూ ముందుకు సాగాలి.2. మల్టీ టాస్కింగ్..ఒకేసారి పలు పనులు చేయడం గొప్ప విషయంగా భావిస్తుంటారు. కానీ నిజానికి మెదడు ఒకసారి ఒక అంశంపైనే ఫోకస్ చేయగలదు. ఈ విషయం అర్థంకాక మల్టీ టాస్కింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతుంటారు. దీన్ని అధిగమించేందుకు ‘పోమోడోరో టెక్నిక్’ ఉపయోగించండి. అంటే, ఒక పని మొదలుపెట్టాక 20 నిమిషాల పాటు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ధ్యాస పెట్టడం. ఆ పని పూర్తయ్యాకనే మరో పని ప్రారంభించడం.3. చేసిందే చేస్తూ భిన్నమైన ఫలితాలను ఆశించండి..చేసిన పనే చేస్తుంటే వచ్చిన ఫలితాలే వస్తాయి. భిన్నమైన ఫలితాలు రావాలంటే భిన్నంగా ప్రయత్నించాలి. అందుకే మీ అలవాట్లను ట్రాక్ చేయండి. అందులో ఏవి పునరావృతం అవుతున్నాయో గుర్తించండి. అవసరమైతే వాటిని మార్చుకోండి. 4. ప్రతిదానికీ ‘అవును‘ అని చెప్పడం..కొందరికి మొహమాటం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరేం అడిగినా ‘నో’ చెప్పలేక, ‘ఎస్’ చెప్పేస్తుంటారు. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల ‘నో’ చెప్పడం నేర్చుకోండి. ఎందువల్ల మీరు ఆ పని లేదా సహాయం చేయలేరో వివరించడం నేర్చుకోండి. 5. వాయిదా వేయడం..ఎప్పటిపని అప్పుడు చేయకుండా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉండటం మిమ్మల్ని విజయానికి దూరం చేస్తుంది. మీ కలలను నాశనం చేస్తుంది. మిమ్మల్నో పరాజితుడిగా నిలుపుతుంది. అందుకే నిద్ర లేవగానే, ఉదయాన్నే ముఖ్యమైన పనిని చేయడం అలవాటుగా మార్చుకోండి. అలా చేయడం ఈ రోజే మొదలుపెట్టండి. నెల రోజుల్లో అది అలవాటుగా మారుతుంది. 6. అతిగా ఆలోచించడం..వర్తమానం కంటే ఎప్పడో జరిగిన వాటి గురించో లేదా ఏదో జరుతుందనో అతిగా ఆలోచిస్తూ ఎక్కువ బాధపడతాం. అందుకే మీ ఆలోచనలను ఎప్పటికప్పుడు పుస్తకంలో లేదా డైరీలో రాసుకోండి. నాలుగు రోజుల తర్వాత అందులో ఎన్ని నిజమయ్యాయో, ఎన్ని నిజం కాలేదో పరిశీలించండి. ఆలోచనలన్నీ నిజం కావని, అతిగా ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని మీకే అర్థమవుతుంది. 7. క్లోజ్డ్ మైండ్ సెట్..చాలామంది ‘నాకు లెక్కలు రావు’, ‘నాకు ఇంగ్లిష్ రాదు’ అని క్లోజ్డ్ మైండ్ సెట్‌తో ఉంటారు. కానీ మనందరం ఒకే రకమైన మెదడుతో పుట్టాం. ఆ తర్వాతే అన్నీ నేర్చుకుంటాం. అంటే, మనందరం లెర్నింగ్ మెషి¯Œ లా పుట్టాం. అందువల్ల ఏదైనా నేర్చుకోవచ్చనే ‘గ్రోత్ మైండ్ సెట్’ను అలవరచుకోండి. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండండి. 8. నెగెటివ్ వ్యక్తులు..కొంతమంది మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని నిరంతరం నిరాశపరుస్తూ ఉంటారు, మీ ఉత్సాహాన్ని తమ మాటలతో నీరు కారుస్తుంటారు. అలాంటి వారిని గుర్తించి దూరంగా ఉండండి. మీ లక్ష్యసాధనను ప్రోత్సహించే వ్యక్తులకు దగ్గరవ్వండి. వారితో స్నేహం చేయండి. 9. బాధిత మనస్తత్వం..ప్రపంచమంతా అన్యాయంగా ఉందని, అందరూ ద్రోహమే చేస్తారని కొందరు నిత్యం ఏడుస్తూనే ఉంటారు. అది విక్టిమ్ మైండ్ సెట్. అలా ఆలోచిస్తూ ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, మానసిక సమస్యల పాలవుతారు. అందుకే తక్షణం ఆ మైండ్ సెట్ నుంచి బయటపడండి. ఇతరులపై నిందలు వేయడం ఆపండి. మీ చర్యలకు, మీ జయాపజయాలకు మీరే బాధ్యత తీసుకుని ముందుకు సాగండి.— సైకాలజిస్ట్ విశేష్ -
ఈ తరం తీరే వేరు!.. ఆనందం తక్కువ ఎందుకంటే...
జీవితానికి అర్థం, పరమార్థం జీవించడమే, ఆనందంగా జీవించడమే. మనం ఉద్యోగం సాధించినా, ఇల్లు కట్టించినా, కారు కొన్నా, విదేశీ ప్రయాణం చేసినా, మరే పని చేసినా సరే.. లక్ష్యం ఆనందం. ఆనందాన్ని వెంబడించడమనేది శాశ్వతమైన మానవ ప్రయత్నం. అయితే కాలంతో పాటు దాన్ని సాధించే మార్గాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా ప్రతి 15 సంవత్సరాలను ఒక జనరేషన్గా పరిగణిస్తారు. జనరేషన్ జనరేషన్ కూ ప్రాధాన్యాలు మారుతూ ఉంటాయి. 1965-80 మధ్య పుట్టిన జనరేషన్-ఎక్స్ వారికి ఆర్థిక భద్రత సాధించడం, పిల్లలు సాధించేలా చూడటం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సాధించడమే లక్ష్యంగా ఉండేది. అందులోనే వారు ఆనందాన్ని పొందేవారు. 1981-1996 మధ్య పుట్టిన జనరేషన్-వై వారికి వ్యక్తిగత ఎదుగుదల, మంచి కుటుంబ జీవితం ఆనందాన్నిచ్చేవి. వారితో పోల్చినప్పుడు 1997-2012 మధ్య పుట్టిన జనరేషన్-జీ వారిలో ఆనందం తగ్గిందని, కేవలం మూడింట రెండు వంతుల మంది మాత్రమే సంతోషంగా ఉన్నారని గాలప్ సర్వే కనుగొంది. యుక్త వయసులోకి ప్రవేశించినప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కారణం తెలుసా? ఈ తరం వారికి ఆర్థిక భద్రత, వ్యక్తిగత ఎదుగుదల కంటే కూడా పని చేయడంలో ప్రయోజనం (sense of purpose) ముఖ్యం. ఆ క్లారిటీ ఉన్నప్పుడు, ఉన్నవారు మాత్రమే సంతోషంగా జీవిస్తున్నారు. నా పనికి ప్రయోజనం ఉందా? ఈ తరం వారికి కార్పొరేట్ నిచ్చెనలు ఎక్కడంపైనే, మెటీరియలిస్టిక్ విజయాలు సాధించడంపైనే దృష్టి ఉంటుందని చాలామంది విమర్శిస్తుంటారు. కానీ అదంతా అబద్ధమని సర్వేలో తేలింది. పాత తరాలకు భిన్నంగా జనరేషన్-జీ వారు తమ పనికి, జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలని కోరుకుంటున్నారు. అయితే, ఈ తరం వారికి అందుబాటులో ఉన్న ఉద్యోగాలలో ఈ అంతర్గత ప్రేరణ లేదు. ఆఫీసుల్లో ఏ అంశంపైనైనా బహిరంగంగా మాట్లాడే స్వభావం, దాన్ని భరించలేని పాతకాలపు వర్క్ ప్లేస్ లు వారిలో అసంతృప్తిని పెంచుతున్నాయి. అంటే ఈ తరం వారికి భారీగా జీతాలు అందుకోవడం లేదా ప్రమోషన్లు పొందడం కంటే కూడా తాము చేస్తున్న పనివల్ల ఎవరికైనా, ఏదైనా ప్రయోజనం ఉందా? వారి జీవితాలను ప్రభావితం చేయగలుగుతున్నామా? అనేది చాలా ముఖ్యం. అలాంటి ప్రయోజనం ఉన్నప్పుడే పనిలో ఆనందాన్ని పొందుతున్నారు. ఈ మూడూ ఉంటేనే సంతోషం జనరేషన్-జీ ఆనందంలో ప్రయోజనంతోపాటు మరో మూడు అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని గాలప్ అధ్యయనం గుర్తించింది. అవి... రీఛార్జ్, రిలాక్సేషన్: హైపర్ కనెక్టివిటీ వల్ల ప్రపంచం నిరంతరం మేల్కొనే ఉంటుంది. అందువల్ల చాలామందికి నిద్ర కరువవుతోంది. తగినంత విశ్రాంతి, నిద్ర పొందడం ఆనందానికి మార్గమవుతోంది. బలమైన సామాజిక సంబంధాలు: సోషల్ మీడియా యుగంలో ఒక్కొక్కరికీ వేలల్లో, లక్షల్లో ఆన్లైన్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల ప్రేమ, మద్దతు పొందడం చాలా ముఖ్యం. వారితో సన్నిహిత సంబంధాలే సంతోషానికి మార్గాలవుతాయి. పోలికనుండి తప్పించుకోవడం: సోషల్ మీడియాలో లేదా మరెక్కడైనా నిరంతరం ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. జనరేషన్-జీలో ఈ కంపేరిజన్ ట్రాప్ చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి అవగాహన పెంచుకోవడం, ప్రతీ వ్యక్తి ప్రత్యేకమని గుర్తించి ముందుకు సాగడం ఆనందం జీవనం కోసం అద్భుతమైన వ్యూహం. విద్యాసంస్థలు, కార్యాలయాలు ఈ అంశాలను గుర్తించి జనరేషన్-జీ దీర్ఘకాలిక ఆనందాన్ని సాధించడంలో మద్దతునివ్వాల్సిన అవసరం ఉంది. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!!
"ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారింది. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఏ మూలనున్న వారితోనైనా స్నేహించే, సంభాషించే అవకాశం దొరుకుతోంది. మరోవైపు ముక్కూమొహం తెలియని వారిపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి, బాధపెట్టి ఆనందించే ట్రోల్స్ అనే ప్రత్యేక జాతిని సృష్టించింది. చక్కగా అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లిష్ మాట్లాడిన బెండపూడి విద్యార్థులను, పిల్లలని కూడా చూడకుండా విపరీతంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వం నుంచి ఇంటి స్థలాన్ని పొందిన వివాహితను అసభ్య పదజాలంతో ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారు. సినీ తారలు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్.. వారని వీరని లేదు, అందరూ ట్రోలింగ్ బారిన పడ్డవారే!" అదోరకమైన శాడిజం.. జీవితంలో ఎలాంటి గుర్తింపులేని, ఎవరూ పట్టించుకోని వ్యక్తులకు ఆన్లైన్లో ఐడెంటిటీ బయటపడకుండా మాట్లాడగలగటం ధైర్యాన్నిస్తుంది. తమను ఎవరూ పట్టుకోలేరనే ధైర్యంతోనే నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడుతుంటారు. నిజానికి వీరిలో లోతైన అభద్రత ఉంటుంది. దాన్నుంచి బయట పడేందుకు, ఇతరుల అటెన్షన్‌ను పొందేందుకు ట్రోలింగ్‌ను ఒక సాధనంగా చేసుకుంటారు. ఎమోషనల్ కంట్రోల్ లేనివారు కూడా ట్రోలింగ్‌ను ఎంచుకుంటారు. ట్రోల్స్‌లో నార్సిసిజం, మాకియవెల్లియనిజం, శాడిజం ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. నార్సిసిజం అంటే విపరీతమైన స్వీయప్రేమ. వీరికి విపరీతమైన అటెన్షన్ కావాలి. దానికోసం ఇతరులను ట్రోల్ చేస్తుంటారు. మన రియాక్షన్ నుంచి వారికి కావాల్సిన అటెన్షన్ పొందుతారు. మాకియ వెల్లియన్ ట్రోల్స్ మానిప్యులేట్ చేయడానికి అబద్ధాలు, మోసం ఉపయోగిస్తారు. వారిలో ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు. ఇతరులు బాధపడుతుంటే లేదా బాధపెట్టి ఆనందించడమే శాడిజం. శాడిస్ట్ ట్రోల్స్ సంబంధంలేని అంశాలలో కూడా చేరి బాధపెట్టి ఆనందిస్తుంటారు. బలమైన కోటను నిర్మించుకోవాలి.. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ట్రోలింగ్ తప్పలేదని, మీరు ఒంటరి కాదని గుర్తించండి. ట్రోలింగ్ ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా, మీ చుట్టూ బలమైన కోటను నిర్మించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీరు సున్నిత మనస్కులైతే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఉన్నా, ట్రోలింగ్ జరుగుతున్నంతకాలం డియాక్టివేట్ చేసుకోవాలి. ట్రోల్‌కు ప్రతిస్పందించడమంటే మృగానికి ఆహారం అందివ్వడమే. వారు కోరుకునే గుర్తింపు వారికి అందివ్వడమే. అందువల్ల కష్టమైనప్పటికీ ట్రోల్స్‌ను విస్మరించడమే వారి నుంచి తప్పించుకునే మార్గం. అప్పుడే వారు నిరాయుధులవుతారు, ఆకలితో అలమటిస్తారు. ట్రోల్స్‌ను నిరోధించడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందించిన రిపోర్టింగ్ మెకానిజాన్ని ఉపయోగించండి. వారిని బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి, వారి అకౌంట్ డిలీట్ అయ్యేలా రిపోర్ట్ చేయండి. ట్రోలింగ్ మీ కంటే ట్రోల్ గురించి ఎక్కువగా వెల్లడిస్తుంది. వారి నీచ మనస్తత్వం అందరికీ తెలిసేలా చేస్తుంది. అందువల్ల ట్రోల్స్ గురించి బాధపడకండి. మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోకండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆన్లైన్ గ్రూపుల మద్దతు తీసుకోండి. మీ విలువను మీకు గుర్తు చేయగల, మీకు సహాయం చేయగల వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి. ట్రోలింగ్ వల్ల ఆందోళన, నిరాశ, దిగులు, ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి. ట్రోల్స్ 2 రకాలు.. ట్రోలింగ్ చేసేవారిని ట్రోల్ అంటారు. వీరు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటారు. వ్యక్తిగతంగా ఇతరులను ట్రోల్ చేసి ఆనందించేవారు. వీరివల్ల కాస్తంత బాధే తప్ప ప్రమాదం ఉండదు. కానీ ఒక సంస్థ కోసమో, రాజకీయ పార్టీ కోసమో వ్యవస్థీకృతంగా ట్రోల్ చేసేవారు ప్రమాదకరంగా ఉంటారు. ఎందుకంటే వారిలో ఒకరు ట్రోలింగ్ మొదలుపెడితే వందల్లో, వేలల్లో, లక్షల్లో ట్రోల్ చేస్తారు. వారికి ఆయా సంస్థ లేదా పార్టీల మద్దతు కూడా ఉండటంతో విపరీతంగా రెచ్చిపోతారు. ఇవి కొన్నిసార్లు ఆన్లైన్ యుద్ధాలుగా మారవచ్చు. ట్రోలింగ్ సంకేతాలను గుర్తించాలి.. ట్రోల్స్ నుంచి తప్పించుకోవాలంటే ముందు వారి లక్షణాలను, ప్రవర్తనను గుర్తించాలి. అప్పుడే వారికి దూరంగా ఉండవచ్చు. అందుకే వాటిని గుర్తించడం అవసరం. మీతో గొడవపడటం, మిమ్మల్ని రెచ్చగొట్టి, బాధపడేలా చేయడమే ట్రోల్స్ లక్ష్యం. అందుకోసం అవమానకమైన భాష ఉపయోగిస్తారు వాస్తవాలను వక్రీకకరిస్తారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించి, సామాజిక ఉద్రిక్తతలను సృష్టించాలని ప్రయత్నిస్తుంటారు. చర్చను వాదనగా మారుస్తారు. మీ రూపం, విలువలు, విశ్వాసాలను కించపరుస్తూ మాట్లాడతారు. కొందరు మరింత దిగజారి బూతులు కూడా తిడతారు. — సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) ఇవి చదవండి: Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో -
అందమైన జీవితం కోసం ఐన్ స్టీన్ సూత్రాలు
ఐన్ స్టీన్.. ఈ పేరు వినగానే చింపిరి జుత్తుతో కనిపించే ఓ పెద్దాయన గుర్తొస్తాడు కదా. కాస్తంత చదువుకొని ఉంటే శక్తి నిత్యత్వ సూత్రం E = mc² గుర్తొస్తుంది. ఇంకా.. సాధారణ సాపేక్షత సిద్ధాంతం గుర్తొస్తుంది. 20వ శతాబ్దపు మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఐన్ స్టీన్ కేవలం భౌతికశాస్త్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన శాంతికాముకుడు, రాజకీయ కార్యకర్త, చురుకైన జాత్యహంకార వ్యతిరేకి, నోబెల్ బహుమతి గ్రహీత. ఆయన జీవితం నుంచి, మిత్రులకు రాసిన ఉత్తర ప్రత్యుత్తరాల నుంచి ఆయన చెప్పిన జీవన సూత్రాలను ఈరోజు తెలుసుకుందాం. మీ సమయాన్ని, కృషిని ముఖ్యమైన విషయాలపై వెచ్చించండి మనం ఏదైనా పని చేయాలంటే శక్తిని వెచ్చించాలి. అలాగే రోజువారీ నిర్ణయాలు తీసుకోవడానికి మానసిక శక్తిని వెచ్చించాలి. ఉదయం ఏ బ్రేక్ ఫాస్ట్ తినాలనే దాని దగ్గర్నుంచి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఆఫీస్ కు ఎలా వెళ్లాలి లాంటి వాటికోసం మానసిక శక్తిని వెచ్చించడం వల్ల ఉత్పాదక శక్తి తగ్గుతుంది. అందుకే చాలామంది టాప్ అచీవర్స్ ఇలాంటి చిన్నచిన్న విషయాలకు ప్రాథాన్యం ఇవ్వరు. ఉదాహరణకు ఐన్ స్టీన్ కు మంగలి దగ్గరకు సమయం వృథా చేసుకోవడం ఇష్టం ఉండదు, అందుకే ఆ చింపిరి జుట్టు. ఇక ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఎప్పడూ బ్లూ జీన్స్ మాత్రమే ధరిస్తాడు. అమెజాన్ జెఫ్ బెజోస్, ఫేస్బుక్ జుకర్ బర్గ్ కూడా అంతే. ఏ డ్రెస్ వేసుకోవాలనే నిర్ణయం కోసం తమ మానసిక శక్తిని వెచ్చించకుండా ముఖ్యమైన నిర్ణయాల కోసం ఆదా చేసుకుంటారు. ఎంత కష్టమైనప్పటికీ మీరు ఇష్టపడే పనులే చేయండి ఐన్ స్టీన్ అంటే కేవలం భౌతిక శాస్త్రం మాత్రమే కాదు. ఆయన వయోలిన్ వాయిస్తాడు. పడవ కూడా నడుపుతాడు. తనకు మనసు బాలేనప్పుడు, ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు ఆయనీ పనులు చేస్తాడు. అలాగని ఐన్ స్టీన్ గొప్ప సెయిలర్ కాదు. కనీసం ఈత కూడా రాదు. పడవ బోల్తాకొట్టి మునిగిపోతుంటే జాలర్లు కాపాడిన సందర్భాలున్నాయి. అయినా ఎందుకు సెయిలింగ్ చేస్తాడంటే... ‘‘సముద్రంలో విహారయాత్ర ప్రశాంతతనిస్తుంది. విభిన్న దృక్కోణాలనుండి ఆలోచించడానికి అద్భుత అవకాశాలు కల్పిస్తుంది’’ అని ఆయనే చెప్పాడు. అందుకే మీ సబ్జెక్ట్ తో పాటు మీరు ఆనందించే ఒక హాబీని అలవాటు చేసుకోండి. అందులో మీరేం నిష్ణాతులు కావాల్సిన అవసరంలేదు. అది మీకు కావాల్సిన మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఫలితంగా మీ ఒత్తిడి తగ్గుతుంది, మీ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. పజిల్ మైండ్‌సెట్‌ను కలిగి ఉండండి. జీవితంలో అనేకానేక సమస్యలు వస్తుంటాయి. వాటికి భయపడి పారిపోతే జీవితం దుర్భరంగా మారుతుంది. సమస్యలను పజిల్ లా చూసి పరిష్కరించుకునే మైండ్ సెట్ ఉంటే వాటిని పరిష్కరించడానికి మీరు కొత్త విధానం గురించి ఆలోచించవచ్చు. ఐన్‌స్టీన్ అలాగే చేసేవాడు. తనకు ఎదురైన ప్రతి కష్టాన్ని ఒక పజిల్‌గా చూసి పరిష్కరించుకునేవాడు. ఉదాహరణకు ఐన్ స్టీన్ కు ముందు చాలామంది శాస్త్రవేత్తలు కాంతి వేగంతో కదిలే వస్తువులను చూశారు. కానీ ఐన్‌స్టీన్ మాత్రమే దాన్ని ఒక పజిల్ లా చూశాడు. సాపేక్ష సిద్ధాంతంతో పరిష్కరించాడు. అందుకే తప్పొప్పుల గురించి ఆలోచించకుండా పజిల్ పరిష్కారంపై దృష్టి పెట్టండి. మిమ్మల్ని ఆకర్షించే విషయాల గురించి లోతుగా ఆలోచించండి ‘‘మీకు ఆసక్తిని కలిగించే ప్రశ్న ఎదురైతే సంవత్సరాల తరబడి దాన్నే పట్టుకుని ఉండండి. లోతుగా అన్వేషించండి. దానిపై పట్టు సాధించండి. అంతేతప్ప సులువుగా అందే విజయాలతో సంతృప్తి చెందకండి’’ అని ఐన్ స్టీన్ కూడా ఒక లేఖలో చెప్పారు. అంతేకాదు.. ‘‘సమస్య క్లిష్టతను చూసి కుంగిపోకూడదు. ప్రయత్నిస్తే దేన్నయినా అర్థం చేసుకోవడం కష్టమేం కాదు. కావాల్సిందల్లా పట్టువిడవని ప్రయత్నం మాత్రమే’’ అని తన స్నేహితుడు డేవిడ్ బోమ్ కు రాసిన ఉత్తరంలో చెప్పాడు. ఉదాహరణకు నేను ఎస్వీ యూనివర్సిటీలో చదివేటప్పుడు ఒక వ్యక్తిని కలిశాను. ఆయన ప్రపంచంలో అత్యధిక డిగ్రీలున్న వ్యక్తి. కానీ ఏ ఒక్క సబ్జెక్ట్ లోనూ లోతైన అవగాహన లేదు. దీన్నే హారిజంటల్ లెర్నింగ్ అంటారు. అంటే.. అన్నీ పైపైన నేర్చుకోవడం. నేనేమో పాతికేళ్లుగా ‘జీనియస్’ అనే ఒకే పదాన్ని పట్టుకుని ఉన్నా. దాని పూర్వాపరాలు, లోతుపాతులు అర్థం చేసుకునేందుకు, పిల్లల్లోని జీనియస్ ను వెలికితీసే మార్గాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా. దీన్నే వర్టికల్ లెర్నింగ్ అవసరం. ఏ రంగంలోనైనా పట్టు సాధించి, పేరు ప్రఖ్యాతులు సాధించాలంటే ఈ వర్టికల్ లెర్నింగ్ అవసరం. రాజకీయాలు మిమ్మల్ని ఆవేశంతో లేదా నిరాశతో నింపనివ్వవద్దు. మనం రాజకీయాలకు దూరంగా ఉన్నా, రాజకీయాలు మనల్ని నిత్యం అనేక విధాలుగా ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అలాగని ఆ రాజకీయాల్లో మునిగి, మీ లక్ష్యాన్ని జారవిడుచుకోకండి. రెండో ప్రపంచయుద్ధం అనంతరం ఇజ్రాయిల్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోమని ఐన్ స్టీన్ ను కోరారు. ‘‘రాజకీయాలు తాత్కాలికం. కానీ నా ఫార్ములాలు శాశ్వతం’’ అంటూ ఆ ఆఫర్ ను తిరస్కరించాడు. జీవితం ప్రశాంతంగా సాగాలంటే ఈ సూత్రాన్ని పాటించాలి. సోషల్ మీడియా కాలంలో ఇది చాలా అవసరం. స్నేహితుడు, పరిచయస్తుడు లేదా పూర్తిగా అపరిచితుడు చేసిన పోస్ట్ వల్ల ఎలా కోపంతో ఊగిపోయామో లేదా గంటలు గంటలు వాదించామో ఒక్కసారి గుర్తుచేసుకోండి. దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని, ఎవరి అభిప్రాయమూ మారదని తెలిసినా అలా సమయం వృథా చేస్తూనే ఉంటాం. మీరు రాజకీయాల్లో రాణించాలనుకుంటే అందులో సమయం వెచ్చించండి, లేదంటే దాని మానాన దాన్ని సాగనివ్వండి. మీరు ప్రశాంతంగా ఉండండి. అధికారానికి గుడ్డి విధేయత సత్యానికి అతి పెద్ద శత్రువు నోబెల్ గ్రహీత జోహన్నెస్ స్టార్క్ వంటివారు కూడా ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని వ్యతిరేకించడంతోపాటు, దానికి వ్యతిరేకంగా ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి జాతీయవాదాన్ని చేర్చి ఐన్ స్టీన్ పై దాడి ప్రారంభించారు. ఈ కుతంత్రాలు హాస్యాస్పదమైనవి, హానిచేయనివిగా ఐన్ స్టీన్ మొదట భావించినప్పటికీ, వాటిని తట్టుకోలేక అమెరికా పారిపోవాల్సి వచ్చింది. అందుకే "అధికారానికి గుడ్డిగా విధేయత చూపడం సత్యానికి అతిపెద్ద శత్రువు" అని చెప్పాడు. సోషల్ మీడియా కాలంలో, ఫేక్ న్యూస్ యుగంలో ఇది మరింత ముఖ్యమైనది. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు, అధికారంలో ఉన్నవారి చుట్టూ మేధావులు కూడా చేరి భజనలు చేయడం మీరు గమనించే ఉంటారు. అలా చేయడం ‘మంద మనస్తత్వం’, ‘సామూహిక పిచ్చితనం’ అంటాడు ఐన్ స్టీన్. అందుకే అధికారాన్ని గుడ్డిగా విధేయత చూపకండి. విమర్శనాత్మక దృష్టితో చూడండి. సైన్స్, సత్యం, విద్య అందరికీ... కొందరికి మాత్రమే కాదు 1930లలో వలస వెళ్లి 1940లో పౌరసత్వం పొందిన తర్వాత కూడా ఐన్‌స్టీన్ తరచుగా యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేవాడు. బానిసత్వం, జాత్యహంకారానికి వ్యతిరేకంగా గొంతు విప్పేవాడు. అందుకే FBI 1932లో ఐన్‌స్టీన్‌పై ఒక ఫైల్‌ను ప్రారంభించింది. అయినా ఆయన అదరలేదు, బెదరలేదు. అమెరికాలోని తొలి నల్లజాతి కళాశాల అయిన లింకన్ యూనివర్శిటీని సందర్శించి ఉపన్యాసాలు ఇచ్చాడు. "సత్యం కోసం శోధించే హక్కు, సత్యమని భావించే వాటిని ప్రచురించి, బోధించే హక్కు" ఉండాలని ఉద్యమించాడు. సైన్స్ ద్వారా వెలికితీసిన ఆవిష్కరణలు, ఫార్ములాలు ఏ జాతికి, దేశానికి లేదా వర్గానికి చెందినవి కావు, మానవాళి అందరికీ చెందినవని ఎలుగెత్తి చాటాడు. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్ గా మారుతున్న కాలంలో ఈ దృక్పథం మరింత అవసరం. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com