అవధుల్లేని ఆనందం | Millions of people are crazy about YouTube | Sakshi
Sakshi News home page

అవధుల్లేని ఆనందం

Published Fri, Oct 6 2023 5:19 AM | Last Updated on Fri, Oct 6 2023 7:41 AM

Millions of people are crazy about YouTube - Sakshi

డబ్బుల సంగతేమో కానీ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా 114 మిలియన్ల యూట్యూబ్‌ చానళ్లు ఉన్నాయి. అంటే  11 కోట్లకు పైగానే. ఈ విశ్వంలోని సుమారు 800 కోట్ల జనాభాలో సగటున ప్రతి 72 మందికి ఒక చానల్‌ అన్నమాట. ఇటీవల విడుదలైన రజినీకాంత్‌ సినిమా ‘జైలర్‌’లో రజినీ ఐదేళ్ల మనవడు రుత్విక్‌ కూడా ఓ చానల్‌ నడుపుతుంటాడు. వీడియో చిత్రీకరణకు తాత రజినీ సాయం తీసుకుంటుంటాడు. ‘ఏదో ఒక వీడియో తీసేసి అప్‌లోడ్‌ చేసెయ్‌..’ అని తాత సలహా ఇస్తే.. ‘బాగోలేని వీడియోలకు సంబంధించి కామెంట్స్‌లో జనం ఎలా గడ్డి పెడతారో చూడు’ అని సమాధానం చెప్పడం ఆకట్టుకుంటుంది.

ఆయా రంగాల్లో రాణిస్తున్న వారు తమ గురించి, తమకు తెలిసింది ప్రజలకు తెలియజేసి, వారి మెప్పు పొందాలని ఉబలాట పడుతుండటం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఇలా నిర్ణయించుకున్న మరుక్షణమే యూ ట్యూబ్‌ చానల్‌ పెట్టేస్తున్నారు. ఇలా ఆవిర్భవించిన చానళ్ల ద్వారా వంటింట్లో వంటలు మొదలు రాకెట్‌ తయారీ వరకు ఎవరికి ఏ సందేహం వచ్చినా ఇట్టే సమాధానం దొరుకుతోంది. ఏ చానల్‌కు సంబంధించిన వీడియోను ఎంత ఎక్కువ మంది చూస్తారో ఆ చానల్‌ పెట్టిన వాళ్లకు అంతగా డబ్బులొస్తాయి.

ఇదంతా ఎవరు ఏ అంశానికి అత్యంత ప్రభావితమవుతారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఇటీవలి కాలంలో మన ఇండియన్స్, ప్రత్యేకించి పలువురు తెలుగు యూ ట్యూబర్స్‌ కూడా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చానళ్లు, వీడియోలు వీక్షిస్తున్న వారి అభిరుచుల్లో వచ్చిన మార్పులు ఆశ్చర్యంగొలుపుతున్నాయి.      – వీఏవీ రంగాచార్యులు, ఏపీ సెంట్రల్‌ డెస్క్‌ 

కొందరికి ఖేదం.. మరికొందరికి మోదం 
యూ ట్యూబ్‌ చానల్‌ స్టార్ట్‌ చేసి.. కొందరేమో లక్షలు, కోట్లకు పడగలెత్తుతుంటే మరికొందరు మాత్రం నెలలు, ఏళ్ల తరబడి కష్టపడుతున్నా, కనీసం మానిటైజేషన్‌కు నోచుకోవడం లేదు. ఎలాగోలా మానిటైజేషన్‌ అయినా వారు అప్‌లోడ్‌ చేసే వీడియోలు వైరల్‌ కావడం లేదంటూ వాపోతుంటారు. ఇందుకు వారు యూ ట్యూబ్‌ ఆల్గారిథమ్‌ ఫాలో కాకపోవడమే. ఏ తరహా కంటెంట్‌ను జనం కోరుకుంటున్నారనేది గమనించి.. వీడియోలు రూపొందించుకోవాలి.

ఒక్కోసారి సీరియస్‌ అంశాలు సైతం వైరల్‌ అవుతుంటాయి. అయితే అది ప్రజల అవసరాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌కు సంబంధించి మన తెలుగు కుర్రాడు స్టార్ట్‌ చేసిన ‘వశిష్ట 360’ చానల్‌ విశేష ఆదరణ పొందింది. ఆ వీడియోల ఆధారంగా ప్రచురించిన పుస్తకాల ద్వారా అతను కోట్లాది రూపాయలు ఆర్జించాడు. 

వరల్డ్‌ నంబర్‌ వన్‌ 
మిస్టర్‌ బీస్ట్‌ అనే యువకుడు (అసలు పేరు జిమ్మి డొనాల్డ్‌సన్‌) తన 13వ ఏట చానల్‌ స్టార్ట్‌ చేశాడు. మొదట్లో ‘ఐ పుట్‌ 100 మిలియన్‌ ఆర్బీజ్‌ ఇన్‌ మై ఫ్రెండ్స్‌ బ్యాక్‌ యార్డ్‌’ అనే వీడియోకు 100 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ప్రతి వీడియోకు సగటున 150 మిలియన్‌ వ్యూస్‌ ఉన్నాయి. సముద్రంలో ఒంటరిగా ఏడు రోజులు గడపడం, షోల రీ క్రియేషన్, ఒక డాలర్‌ నుంచి ఒక మిలియన్‌ డాలర్స్‌ వరకు హోటల్‌ గదులు.. ఇలా ప్రతి వీడియో కొత్తదనంతో, విచిత్రంగా ఉండటం విశేషం.

ఉదాహరణకు.. పేద్ద మాల్‌లోకి వెళ్లి.. 15 నిమిషాల్లో ఎవరేం కావాలన్నా కొనుక్కుని బిల్లింగ్‌ కోసం లైన్‌లో నిలుచుంటే ఆ బిల్లు తానే చెల్లిస్తానని చెప్పడం.. నిజంగానే చెల్లించడం. ఇతడి ప్రతి వీడియో రియాలిటీతో స్ట్రెయిట్‌గా సబ్జెక్ట్‌లోకి వెళ్తుంది. ఎక్కడా సుత్తి ఉండదు. ఒక్కో వీడియో షూటింగ్‌కు వారం పది రోజులు కష్టపడినా, తుదకు ఆ వీడియో నిడివి కేవలం 15–20 నిమిషాలే ఉంటుంది.

ఇతను తన వీడియోల ద్వారా వచ్చే మొత్తంలో చాలా వరకు పేద ప్రజల కోసమే వెచ్చిస్తాడు. పాతికేళ్ల ఈ యువకుడు గత ఏడాది యూ ట్యూబ్‌ ద్వారా అత్యధికంగా సంపాదించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఏకంగా 82 మిలియన్‌ డాలర్లు సంపాదించారు. మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.700 కోట్లు పైమాటే. అంటే రోజుకు దాదాపు రూ.2 కోట్లు. ఫోర్బ్స్‌ 2023 టాప్‌ క్రియేటర్స్‌ ఇన్‌ వరల్డ్‌ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.   

అభిరుచుల్లో మార్పు 
♦   ప్రపంచాన్ని అన్వేషించడం అనేది ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. కొత్త విషయాలను తెలుసుకోవడంతో పాటు వారి వారి అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పు­డు అప్‌డేట్‌ అవ్వడం కోసం చాలా మంది సామాజిక మాధ్యమాలను ఫాలోఅవుతున్నారు.  
♦   ఈ విషయంలో ఇప్పటిదాకా యూ ట్యూబ్‌ అతిపెద్ద ఫ్లాట్‌ఫాం. ఈ స్థానాన్ని ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ ఆక్రమించేస్తోంది. యువతరం అంతా ఇన్‌స్టాలోనే మునిగి తేలుతోంది. 
♦   40–50 శాతం యువత స్క్రీన్‌ టైమ్‌ సగటున రోజూ 4 నుంచి 10 గంటలు ఉంటోంది. ఇంత సమయం స్క్రీన్‌ కోసం కేటాయించడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇది న్యూరో, కంటి, మానసిక సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.  
♦   యువ దంపతుల దాంపత్య జీవితంలోనూ ఇది చిచ్చు రేపే ప్రమాదం ఉందని చెబుతున్నారు. నెగెటివ్‌ అంశాల పట్ల మనసు మళ్లడం సహజమే అయినా అస్తమానం అదే అలవాటుగా మారి అనుకరించే ప్రమాదం ఉందని చెబుతున్నారు.  
♦   ఇలా విద్యార్థుల స్క్రీన్‌ టైమ్‌ పెరగడం వల్ల పాఠ్యాంశాల పట్ల అటెన్షన్‌ స్పాన్‌ తగ్గిపోతోంది. 
 ♦ఈ సమస్యలన్నింటికీ స్వీయ నియంత్రణే మార్గం అని నిపుణులు చెబుతున్నారు. 

అది డోపమైన్‌ ఎఫెక్ట్‌ 
జనరేషన్, జనరేషన్‌కు ప్రజల అభిప్రాయాలు, అభిరుచులు మారుతుంటాయి. ఇందుకు సహజంగా 15 ఏళ్లు పడుతుంది. అయితే ఇటీవలి కాలంలో టెక్నాలజీలో మార్పుల∙ప్రభావం వల్ల రెండేళ్లలోనే అభిరుచులు మారిపోతున్నాయి. ఇదివరకు బాగా కష్టపడే వాళ్లు మాత్రమే డబ్బు సంపాదించే వారు. మనం ఇన్నాళ్లు చెత్తా, చెదారం అనుకున్న కంటెంట్‌తో కూడా రూ.లక్షలు, కోట్లు సంపాదించేస్తున్నారు.

యాలకలు, లవంగాలు అంటూ చేస్తున్న వీడియోలకు కూడా లక్షల్లో లైక్‌లు వస్తున్నాయి. ఇదంతా ‘హ్యాపీనెస్‌’ అనే సూత్రం. ఉదాహరణకు ఒక రోజంతా కష్టపడి ఒక పుస్తకం చదివితే ఎంత ఆనందం వస్తుందో.. ఒక నిమిషం పాటి రీల్‌/షాట్‌ చూస్తే అంతే ఆనందం వస్తుంది. కొన్ని పిచ్చి పనులను చూసినప్పుడు కూడా కొందరి మనసు అలానే స్పందించి డోపమైన్‌ అనే న్యూరోట్రాన్స్‌మీటర్‌ హార్మోన్‌ రిలీజ్‌ అవుతోంది.  ఈ తరహా డోపమైన్‌కు జనం అలవాటు పడిపోయారు.      – విశేష్ , సైకాలజిస్ట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement