
బడుగు, బలహీనులు చెప్పినా కూడా ఆలోచించరు
వాళ్ల ఆలోచనా విధానమే తప్పు...
పేదలపై మరోసారి సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు
పేదల కోసం పీ–4 అంటూ నిండు సభలో అవమానించిన వైనం..
గతంలోనూ ఎస్సీలు, బీసీలనుద్దేశించి దారుణంగా మాట్లాడిన బాబు
ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ హేళన
తమాషాలు చేస్తున్నారా.. మీ తోకలు కత్తిరిస్తా అంటూ నాయీ బ్రాహ్మణులపై హూంకరింపు
నేనేసిన రోడ్లపై నడుస్తున్నారు.. నేనిస్తున్న రేషన్ తింటున్నారు.. నాకు ఓటెందుకు వేయరన్న బాబు
యథారాజా అన్నట్టు.. టీడీపీ నేతలదీ అదే ధోరణి.. దళితులు.. మీకెందుకురా రాజకీయాలు అన్న చింతమనేని
ఎస్సీలు శుభ్రంగా ఉండరన్న ఆదినారాయణరెడ్డి
భగ్గుమంటున్న బీసీ, ఎస్సీ, పేద వర్గాలు
సాక్షి, అమరావతి: ‘‘ఈ బడుగు, బలహీన వర్గాల ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు... ఇప్పుడొచ్చారు.. సగం మంది వెళ్లిపోయారు. వారి ఆలోచన అంతా.. మీటింగ్ అయింది.. మా పని అయిపోయింది..! అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుబడుతున్నా.. మిమ్మల్ని కాదు.. అదే ఇక్కడున్న వాళ్లంతా ఉన్నారు.. వీళ్లకి ఓపిక ఉంది. బంగారు కుటుంబాలకు ఓపిక లేదు.. మార్గదర్శకులకు ఓపిక ఉంది. అంటే వాళ్లు నేర్చుకున్నారు. అది నేర్పాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే నేను పట్టుదలగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి జీవితాల్లో వెలుగులు తెస్తా..!’’
ఈ వ్యాఖ్యలు చూశారా..! 40 ఏళ్ల రాజకీయ అనుభవం, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు దళిత, బలహీన వర్గాల నుద్దేశించి ఆదివారం నిర్వహించిన పీ 4 సభలో మాట్లాడిన దారుణమైన మాటలివీ!! దళితులు, బడుగు, బలహీనవర్గాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో మళ్లీ నోరు పారేసుకున్నారు. బడుగు, బలహీనవర్గాల ఆలోచన ఆ పూట వరకే ఉంటుందని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు.
వాళ్లు చెప్పినా కూడా ఆలోచించరని నిందించారు. వచ్చాం.. మీటింగ్ అయిపోయింది.. మా పని అయిపోయిందని అనుకుంటూ ఉంటారని.. వాళ్ల ఆలోచనా విధానమే తప్పని వ్యాఖ్యానించారు. పేదలను ధనికులను చేస్తానంటూ జీరో పావర్టీ పీ–4 పేరుతో నిర్వహించిన సభలోనే వారిపై తనకున్న ఏహ్య భావాన్ని ఆయన బయటపెట్టారు. గతంలోనూ చంద్రబాబు పలు సందర్భాల్లో ఎస్సీ, బీసీ వర్గాలను నేరుగా దూషించి వారి పట్ల తనకున్న చులకన భావాన్ని చాటుకున్నారు. దీనిపై ఎస్సీ, బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి.
చంద్రబాబుకు దళితులు, బీసీలంటే ఎప్పుడూ చులకన భావమేనని, తమను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేçస్తున్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..? అని గతంలో వారి పుట్టుకనే హేళన చేసిన హీనమైన భావజాలం చంద్రబాబుదని మండిపడుతున్నారు. నాడు తమ బాధలు చెప్పుకునేందుకు సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను.. ‘మీ తోకలు కత్తిరిస్తా..! తమాషాలు చేస్తున్నారా? మిమ్మల్ని ఇక్కడి వరకూ రానివ్వడమే తప్పు..’ అంటూ హూంకరించిన నిర్వాకం ఆయనదే.
నేనిచ్చిన బియ్యం తింటున్నారు. నేనేసిన రోడ్లపై నడుస్తున్నారు... నాకెందుకు ఓటు వేయరు... అంటూ నంద్యాల ఉప ఎన్నికల ప్రచార సమయంలో బ్లాక్‌మెయిల్ తరహాలో పేదలను చంద్రబాబు బెదిరించారు. అందుకు అనుగుణంగానే టీడీపీ నేతలు దళితులు, బీసీల పట్ల తరచూ హీన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు, పదవులు..?’ అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక సభలో ఎస్సీల పట్ల అవమానకరంగా మాట్లాడటం తెలిసిందే. ‘ఎస్సీలు శుభ్రంగా ఉండరు. వాళ్లు దగ్గరకు వస్తే వాసన వస్తుంది.
వాళ్లకి చదువు రాదు..’ అంటూ టీడీపీలో ఉండగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దారుణంగా మాట్లాడారు. తాజాగా చంద్రబాబు వారి పట్ల తనకున్న చులకన భావాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. బడుగు, బలహీన వర్గాలకు అసలు ఆలోచనలే ఉండవని, డబ్బులు ఇస్తే మీటింగ్‌కు వస్తారనే రీతిలో అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. పేదలను గొప్పోళ్లను చేస్తానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ తన ప్రసంగం వినలేక వెళ్లిపోతున్న వారిని చూసి చంద్రబాబుకు కోపం కట్టలు తెంచుకుంది. వారి పట్ల తన మనసులో ఉన్న మాటను వెళ్లగక్కి బడుగులంటే తనకు ఏమాత్రం గిట్టదని మరోసారి రుజువు చేసుకున్నారు.
చరిత్రలో ఎవరూ చేయలేదు..
పేదరికం లేని సమాజం కోసం పీ–4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇది వినూత్న కార్యక్రమమని, కొత్త ప్రయోగమని, ఇంతవరకూ చరిత్రలో ఎవరూ అమలు చేయలేదని తెలిపారు. వెలగపూడి సచివాలయం సమీపంలో నిర్వహించిన సభలో జీరో పావర్టీ పీ–4 కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు ప్రారంభించారు.

పథకం లోగో, పోర్టల్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. శాయోజీరావు సహాయం వల్లే అంబేడ్కర్ ఎదిగారని, శివసుబ్రహ్మణ్యం అయ్యర్ వల్ల అబ్దుల్ కలాం ముందుకెళ్లారన్నారు. కలాంను రాష్ట్రపతిని చేయడంలో తన పాత్ర కూడా ఉందన్నారు. ఎన్టీఆర్ లేకపోతే తాను కూడా అందరిలా మామూలుగానే ఉండేవాడినన్నారు. హైదరాబాద్ దశ, దిశ మారడానికి తాను చేసిన ఆలోచనలే కారణమన్నారు.
పీ–4 గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. ఇప్పటికీ పైకి రాని కుటుంబాలు 20 శాతం ఉన్నాయని, మార్గదర్శులుగా ఉండేవారు బంగారు కుటుంబాలతో కలసి పని చేయాలన్నారు. తలసరి ఆదాయం 2028–29 నాటికి రూ.5.42 లక్షలు, 2047కి రూ.55 లక్షలు చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. టాప్ టెన్‌లో ఉన్న పది శాతం శ్రీమంతులు అట్టడుగున్న ఉన్న 20 శాతం మందిని పైకి తెచ్చే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
పవన్ దొరకడం నా అదృష్టం..
2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ 2.0 సాధించడమే తన లక్ష్యమని, పీ–4 అందుకు మార్గదర్శి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆగస్టు 15 నాటికి ఈ కార్యక్రమాన్ని ఒక రూపం తీసుకొచ్చి మళ్లీ ఉగాది నాటికి ప్రగతిని ప్రజలకు వెల్లడిస్తామన్నారు. 2029కి రాష్ట్రం జీరో పావర్టీలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే ప్రపంచమే ఆచరించే పరిస్థితికి వస్తుందన్నారు. పవన్ కల్యాణ్ లాంటి మిత్రుడు దొరకడం తన అదృష్టమని, ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.
చంద్రబాబు రెండు మూడు తరాల కోసం ఆలోచిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాగా 20 లక్షల బంగారు కుటుంబాలను పైకి తెచ్చే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన విధాన పత్రంలో తెలిపింది. సంపన్న కుటుంబాలు పీ 4 ప్లాట్‌ఫామ్‌లోకి లాగిన్ అయి కనీసం ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుని మార్గదర్శి కుటుంబంగా నిలవాలని కోరింది.
⇒ మంగళగిరికి చెందిన గొర్రెల పెంపకందారు కడియం నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా, విజయవాడకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మాన్యుయేల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా పీ 4 పథకం ప్రారంభం సందర్భంగా ప్రకటించారు. నరసింహ తన పిల్లల్ని చదివించాలని కోరగా గ్రీన్‌కో ఎనర్జీ అధినేత చలమలశెట్టి అనిల్‌కుమార్ మార్గదర్శిగా ముందుకొచ్చారు. ఇమ్మాన్యుయేల్ తన కూతుర్ని ఎంబీబీఎస్ చదివించాలని కోరగా మెయిల్ సంస్థల అధినేత మేఘా కృష్ణారెడ్డి వారికి మార్గదర్శిగా ముందుకొచ్చారు. కృష్ణా జిల్లాలోని తన సొంత మండలం గుడ్లవల్లేరు బాధ్యత మొత్తం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఇంత హీనంగా మాట్లాడతారా?
పేదల విషయంలో మొదటి నుంచి చంద్రబాబుది ఫ్యూడలిస్టు భావజాలమే. ఎస్సీలు, బీసీల పట్ల ఆయన మాటలు, చేతలు ఎప్పుడూ లోకువగానే ఉంటాయి. బడుగు, బలహీనవర్గాల గురించి అంత హీనంగా మాట్లాడడం సరికాదు. వారికి ఆలోచనలు లేవని చెప్పడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అలాంటి మాటలు మాట్లాడతారా? ఇప్పుడే కాదు.. అనేక సందర్భాల్లో ఎస్సీలు, బీసీల గురించి తక్కువగా మాట్లాడారు. ఆయనకిది తగదు. వెంటనే దళితులు, బడుగు వర్గాలకు క్షమాపణ చెప్పాలి.
– చింతపల్లి గురుప్రసాద్, బహుజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు
బాబులో రెండో వ్యక్తి బయటకొచ్చాడు
చంద్రబాబు చేతలకి, మాటలకి పొంతన ఉండదు. పేదలను ఎప్పుడూ అవమానిస్తారు. ఇప్పుడు మరోసారి అవమానించారు. ఎస్సీలు, దళితులంటేనే ఆయనకు పడదు. పేదల కోసమని నిర్వహించిన సభలో జనం వెళ్లిపోతున్నారని సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏమిటి? చంద్రబాబులో రెండో వ్యక్తి బయటపడ్డాడు. ఆయన్ను దళిత, బీసీలు నమ్మకూడదు. ఆయన తన మాటలను ఉపసంహరించుకోవాలి.
– నత్తా యోనారాజు మాల మహానాడు నాయకుడు
గుణపాఠం తప్పదు
పేదలకు మేలు చేయకపోగా వారి గురించి తరచూ అవమానకరంగా మాట్లాడడం చంద్రబాబుకే చెల్లింది. పీ–4 మీటింగ్ అని పిలిచి ఒక్కరికి మేలు చేయకపోగా తిట్లు బహుమతిగా ఇస్తారా? బీసీ, ఎస్సీలను తిట్టడానికి బహిరంగ సభ పెడతారా? పేదల గురించి ఇంత అన్యాయంగా మాట్లాడిన రాజకీయ నాయకుడు దేశంలో మరొకరు లేరు. వారికి ఆలోచనలే లేవని అనడం అహంకారం. త్వరలోనే బీసీలు, ఎస్సీలు ఆయనకు గుణపాఠం చెబుతారు.
– ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి
పేదలు తన బానిసలుగా ఉండాలనే ఆలోచన బాబుది
పేదలు ఎప్పుడూ తమ బానిసలుగా ఉండాలనే ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు. జీరో పావర్టీ పీ–4 సభలో దాన్ని బయటపెట్టారు. ఎస్సీ, బీసీల గురించి అంత నీచంగా మాట్లాడడం దారుణం. గతంలోనూ ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని నీచంగా మాట్లాడారు. పేదలు ఎప్పుడూ తమ కాళ్ల దగ్గరే ఉండాలనే ఆలోచన చంద్రబాబుది.
– కైలే అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే
అసలు మనిషి బయటపడ్డాడు..
చంద్రబాబులోని అసలు మనిషి పీ–4 మీటింగ్‌లో బయటపడ్డాడు. వారి కోసమని మీటింగ్ పెట్టి తిట్టడం ఏమిటి? సభకు వచ్చిన జనం వెళ్లిపోతుంటే ఇష్టం వచ్చినట్లు తిడతారా? పేదలు కూడా సంపన్నుల్లా అలోచించాలని చెప్పి వారిని తిట్టడం అన్యాయం. బీసీలు, ఎస్సీలను చంద్రబాబు ఎప్పుడూ గౌరవించలేదు. అనేకసార్లు అవమానించారు. ఇప్పుడు మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు.
– జోగి రమేష్, మాజీ మంత్రి