
విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎంఆర్ కళాశాల వద్ద గ్రూప్–2 పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు
బాబు సర్కార్ నిర్లక్ష్యం క్షోభను మిగిల్చింది.. గ్రూప్–2 అభ్యర్థుల భావోద్వేగం
తీవ్ర గందరగోళం మధ్య గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష
ఈ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని అభ్యర్థుల ఆగ్రహం
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లే గందరగోళం సృష్టించారు
పరీక్ష వాయిదా పడుతుందంటూ 3 రోజులుగా డ్రామా
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాటకమాడారు
మా భావోద్వేగాలతో ఆడుకున్నారు..
ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు..
బాగా ప్రిపేర్ అయినా పరీక్ష సరిగ్గా రాయలేకపోయాం
పరీక్ష వాయిదావేస్తే ప్రభుత్వానికేం నష్టం? ఇంత మానసిక క్షోభకు గురిచేసిన ఈ సర్కారును వదిలిపెట్టం
బాబు సర్కారు తీరుపై గ్రూప్–2 అభ్యర్థుల ఆగ్రహం
లక్షలాది మంది గ్రాడ్యుయేట్లలోనూ తీవ్ర అసహనం..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చూపిస్తామని స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: అర్ధరాత్రి వరకు ఆందోళనలు.. అడ్డగింతలు.. అరెస్టులు.. తరలింపులు.. తీవ్ర ఉత్కంఠ మధ్య ప్రభుత్వం ఏపీపీఎస్సీ గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష నిర్వహించి తమ జీవితాలతో ఆడుకుందని రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు తమను నమ్మించి నిండా ముంచారని, తమ జీవితాలతో చెలగాటం ఆడారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ తీరుతో తీవ్ర మనస్థాపానికి గురయ్యామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వమే ఇంత గందరగోళం సృష్టించిందని, ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదని ధ్వజమెత్తారు. రోస్టర్ విధానంలో తప్పులున్నాయని తొలుత చెప్పిందే టీడీపీ అని, అలాంటప్పుడు అది సరిచేయకుండా ఎలా పరీక్ష నిర్వహిస్తారని నిలదీశారు. పరీక్ష వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు.
ప్రభుత్వ వైఖరి వల్లే తమ సమయం వృథా అయిందని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దోబూచులాట మధ్య పరీక్ష నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం పరీక్ష ఉందనగా, శుక్రవారం రాత్రి వాయిదాకు అనుకూలంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ ట్వీట్ చేసి ఆశలు రేపారని.. ఇప్పుడింత గందరగోళం జరుగుతుంటే ఆయన మాత్రం ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో ఇండియా–పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ కూర్చున్నారని విరుచుకుపడ్డారు.
తమను ఇంత దగా చేసిన కూటమి సర్కారును ఊరికే వదిలి పెట్టం అని.. ‘బాయ్‌కాట్ ఎమ్మెల్సీ ఎలక్షన్’ కాదు.. ‘ఎన్నికల్లో పాల్గొందాం.. కూటమికి గట్టిగా బుద్ధి చెబుదాం’ నినాదంతో తమ సత్తా చాటుతామని శపథం చేశారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను ఏ విధంగా ముంచిందో కళ్లారా చూశామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము కూడా తమ శక్తి ఏపాటిదో చూపిస్తామని లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ స్పష్టం చేస్తున్నారు. ఇంతటి గందరగోళం సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గమని కోపంతో రగిలిపోయారు.
పచ్చి దగా.. దుర్మార్గం
‘పరీక్ష వాయిదా పడుతుందని సాక్షాత్తు విద్యా శాఖ మంత్రి ట్వీట్ చేసినప్పుడు నమ్మకుండా ఎలా ఉంటాం? పరీక్షపై సమీక్షిస్తున్నాం అంటూ ప్రభుత్వం గందరగోళం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి అయోమయమే. ఎటూ పాలుపోని పరిస్థితి. టెన్షన్‌తో రాత్రంతా నిద్రపోలేదు. ఈ గందరగోళంలేకుండా ఉండివుంటే పరీక్ష ఇంకా బాగా రాసి ఉండేదాన్ని’ అని తిరుపతికి చెందిన సౌజన్య ఆవేదన వ్యక్తం చేసింది.
‘రోస్టర్ విధానంలో తప్పులున్నాయని ప్రభుత్వంలోని పెద్దలు చెప్పినా, దీన్ని సవరించకుండా పరీక్ష నిర్వహించడమేంటి? రేపు న్యాయపరమైన చిక్కులతో పరీక్ష రద్దయితే.. మా కష్టమంతా వృథానే కదా? ఇంత గందరగోళం మధ్య పరీక్ష నిర్వహించడం దుర్మార్గం కాదా?’ అని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన హరి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు పరీక్ష వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటని శ్రీకాకుళంకు చెందిన గణేష్ ప్రశ్నించాడు. పరీక్ష జరుగుతుందో లేదో ముందు రోజు రాత్రి వరకు తేల్చకపోతే ఎలా అంటూ కడపకు చెందిన మూల బిందు మాధవి నిలదీసింది.
ఇది చంద్రబాబు మార్కు రాజకీయం
‘ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్‌ల ప్రకటనల వల్ల పరీక్ష వాయిదా పడుతుందని భావించాను. చివరి నిమిషం వరకు స్పష్టత లేకపోవడంతో తీవ్రంగా ఆందోళన చెందాను. పరీక్షకు బాగా ప్రిపేర్ అయినప్పటికీ తీవ్రంగా కలత చెందాను. పరీక్షను సరిగా రాయలేకపోయాను. ఇది చంద్రబాబు మార్కు రాజకీయం’ అంటూ విజయవాడకు చెందిన కె.కాంతారావు మండిపడ్డాడు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కోసం 92 వేల మందిని మోసం చేశారని నంద్యాలకు చెందిన హుస్సేన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ ఏమి చేసుకోలేరనే అభిప్రాయంతోనే ప్రభుత్వ పెద్దలు ఇలా మా జీవితాలతో ఆడుకున్నారన్నారు. ఇంత టెన్షన్ ఎన్నడూ పడలేదన్నారు. ప్రభుత్వం, ఏపీపీఎస్సీ కలిసి ఆడిన డ్రామా అని నిప్పులు చెరిగారు.
అంతా టెన్షన్.. టెన్షన్..
⇒ పరీక్షకు కొన్ని గంటల ముందు వరకు అభ్యర్థుల భవితవ్యంతో ప్రభుత్వం ఆటలాడింది. పరీక్ష వాయిదా పడుతుందని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం ఓ వైపు ప్రకటించడం.. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోను పరీక్ష కొనసాగుతుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేయడం.. వెరసి అసలు పరీక్ష ఉంటుదా.. లేదా? అన్న సందిగ్ధంలో అభ్యర్థులు ఉండిపోయారు.
ఈ క్రమంలో పరీక్ష వాయిదా పడుతుందని ప్రకటించిన ప్రభుత్వాన్ని పూర్తిగా నమ్మిన అభ్యర్థులు తమకు కేటాయించిన సెంటర్లున్న ప్రాంతాలకు వెళ్లకుండా నిలువునా మోసపోయారు. రెండు వ్యవస్థల విరుద్ధ ప్రకటనలతో మీ మాంసలో మరికొందరు పరీక్ష ఉంటుందో ఉండదో తెలియక చాలా మంది సమయానికి సెంటర్లకు చేరుకోలేకపోయారు. దీంతో చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు.
⇒ గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని శనివారం అర్ధరాత్రి వరకు అభ్యర్థులు ఆందోళన చేశారు. తాము కూడా వాయిదా వేయమని సర్వీస్ కమిషన్‌ను కోరామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించడం, కానీ చైర్మన్ అంగీకరించలేదని ఆరోపణలు చేయడం వంటి నాటకీయ పరిణామాల మధ్య ఆదివారం పరీక్ష నిర్వహించారు. ఉదయం 9.45 తర్వాత అభ్యర్థులను అనుమతించేది లేదని సర్వీస్ కమిషన్ ప్రకటించడంతో సమయం దాటాక వచ్చిన మరికొంత మంది పరీక్షకు దూరమయ్యారు. గ్రూప్–2 పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేశారు.
అర నిమిషం ఆలస్యం అవడంతో పరీక్షకు దూరమైన కొండబాబు, శ్యామల
⇒ ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించి, 92,250 మందిని మెయిన్స్‌కి ఎంపిక చేశారు. వీరికి 2024 జూలైలో మెయిన్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. అయితే, సాధారణ ఎన్నికల అనంతరం జూన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్‌డీఏ కూటమి ఏపీపీఎస్సీ చైర్మన్‌ను అర్ధంతరంగా తొలగించింది. దాదాపు 3 నెలల పాటు కమిషన్‌కు చైర్మన్ లేకుండా చేయడంతో జూలైలో జరగాల్సిన మెయిన్స్ డిసెంబర్‌కు వాయిదా వేశారు.
⇒ అక్టోబర్‌లో ఏఆర్ అనురాధను చైర్మన్‌గా నియమించి పరీక్షను ఫిబ్రవరి 23కి మార్చారు. సరిగ్గా పరీక్షకు వారం రోజుల ముందు కూటమి నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారు. హైకోర్టు పరీక్ష నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో ఏపీపీఎస్సీ తన ప్రక్రియను ప్రారంభించింది. అయితే, ఈనెల 20 నుంచి పరీక్షపై అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
⇒ రోస్టర్‌లో జరిగిన తప్పులను సరిచేసి మెయిన్స్ నిర్వహించాలన్న డిమాండ్‌తో అభ్యర్థులు రోడ్లపైకి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ అంశంపై చివరి వరకు స్పందించని ప్రభుత్వం.. ఈనెల 21న రాత్రి మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ ట్వీట్‌తో పరీక్ష వాయిదా పడుతుందన్న అభిప్రాయాన్ని సూత్రప్రాయంగా వెల్లడించింది.
పరీక్షకు ఒక్కరోజు ముందు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసి పరీక్ష వాయిదా వేయాలని కోరడం, సాయంత్రం సీఎం చంద్రబాబునాయుడు పరీక్ష వాయిదాపై సర్వీస్ కమిషన్ చైర్మన్ అంగీకరించలేదని వాయిస్ లీక్ చేసి తప్పును చైర్మన్‌పైకి నెట్టే ప్రయత్నం చేశారు. సర్వీస్ కమిషన్ చరిత్రలో అత్యంత ఉత్కంఠ వాతావరణంలో జరిగిన పరీక్షగా గ్రూప్–2 మెయిన్స్ నిలిచింది.
గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష పూర్తి
ఏపీపీఎస్సీ ఆదివారం నిర్వహించిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో జరిగిన పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్లలో పరీక్ష నిర్వహించినట్లు సర్వీస్ కమిషన్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లో 175 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 905 పోస్టులకు 92,250 మంది మెయిన్స్‌కు అర్హత సాధించగా, 86,459 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
ఆదివారం ఉదయం జరిగిన పేపర్–1కు 79,599 మంది హాజరు కాగా, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్–2కి 79,451 మంది అభ్యర్థులు హాజరైనట్టు కమిషన్ పేర్కొంది. విశాఖపట్నం జిల్లాలో 16 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకే లైజన్ అధికారులు సంబంధిత మెటీరియల్‌తో కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా పత్రాలను స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి పోలీసు భద్రత నడుమ పరీక్షా కేంద్రాలకు తరలించారు.
డ్రోన్లతో పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను పర్యవేక్షించారు. ఉదయం వచ్చిన వారిలో కొంత మంది మధ్యాహ్నం జరిగిన పరీక్షకు హాజరు కాలేదు. కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఒక అభ్యరి్థకి పరీక్ష రాస్తున్న సమయంలో బీపీ తగ్గటంతో అస్వస్థతకు గురయ్యాడు. పోలీసు భద్రత నడుమ అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
మమ్మల్ని మోసం చేశారు
గ్రూప్–2 పరీక్ష వాయిదా పడుతుందంటూ మమ్మల్ని మోసం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే వార్తలు రావడంతో మేలుకున్నట్లు కలరింగ్ ఇచ్చారు. అభ్యర్థుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి లోకేశ్, సీఎం చంద్రబాబు ప్రకటనలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ డబుల్ గేమ్ ఆడారు. చివరకు చేతులెత్తేశారు. మేమంతా.. ఇది డబుల్ గేమ్ అని తెలియని అమాయకులమా? మమ్మల్ని మానసికంగా హింసించారు.
– హుస్సేన్‌బాషా, నంద్యాల
భావోద్వేగాలతో ఆడుకుంటారా?
గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష వాయిదా అంటూ వార్తలు వచ్చాయి. గ్రూప్–2లో రోస్టర్ విధానం ప్రకటించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాం. రోస్టర్‌లో తప్పులు ఉన్నాయంటూ టీడీపీయే గతంలో పలు మార్లు చెప్పింది. ఇప్పుడు వారే అధికారంలో ఉన్నారు. కానీ విద్యార్థుల భావోద్వేగాలతో ఆడుకుంటూ వచ్చారు. పరీక్ష వాయిదా పడుతుందంటూ మమ్మల్ని డైవర్ట్ చేసి నాశనం చేశారు. నిరుద్యోగులను వంచిస్తే ఫలితం ఎలా ఉంటుందో ప్రభుత్వానికి త్వరలోనే తెలిసి వస్తుంది.
– రవికుమార్, తిరుపతి
ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు
తొలుత ఏపీపీఏస్సీ అధికారులు గ్రూప్–2 మెయిన్ పరీక్ష ఆదివారం జరగుతుందన్నారు. కానీ పరీక్షపై సమీక్షిస్తున్నాం.. వాయిదా పడుతుందంటూ ప్రభుత్వ పెద్దల ప్రకటనలు హల్‌చల్ చేశాయి. పరీక్షపై గందరగోళం సృష్టించారు. పరీక్ష జరుగుతుందో లేదో అనే అనుమానం కలిగింది. శనివారం అర్ధరాత్రి వరకు పరీక్ష నిర్వహణపై స్పష్టత లేదు. అంతా గందరగోళం. రాత్రంతా టెన్షన్‌తో గడిపా. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడటం దారుణం. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు, అధికారులు ఓవరాక్షన్ చేశారు. గతంలో ఏ పరీక్షప్పుడూ ఇలా వ్యవహరించలేదు.
– సౌజన్య, తిరుపతి
ఫలితం అనుభవిస్తారు..
ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవాలనేది నా కల. తాడిపత్రి నుంచి విశాఖపట్నం వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాను. గ్రూప్–2 మెయిన్స్ కోసం అహోరాత్రులు కష్టపడి చదివాను. రోస్టర్ విధానంలో తప్పులున్నాయని, ప్రభుత్వంలోని పెద్దలే చెప్పినా, దీన్ని సవరించకుండా పరీక్ష నిర్వహించడమేంటి? న్యాయ చిక్కులతో రేపు పరీక్ష రద్దయితే.. మా కష్టమంతా వృథానే కదా? అందుకే మేము ఆందోళన చేశాం. కానీ మా బాధను ప్రభుత్వం అర్థం చేసుకోలేదు. నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటమాడింది. ఇది ఎంతమాత్రం భావ్యం కాదు. ఇందుకు ఫలితం చవిచూడక తప్పదు.
– హరి, తాడిపత్రి
ప్రభుత్వం తీరు దారుణం
గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు బాధించింది. రాత్రి పొద్దుపోయే వరకు పరీక్ష జరుగుతుందో లేదో అనే టెన్షన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఖరి కారణంగా మా సమయం వృథా అయింది. ఈ గందరగోళం మధ్య పరీక్ష వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటో అర్థం కాలేదు. ప్రతి సంవత్సరం రెగ్యులర్‌గా వదిలే పోస్టులు కావని తెలిసినప్పటికీ, ఈ పరీక్ష నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహించడం దారుణం.
– మూల బిందు మాధవి, కడప
తప్పులు ఎందుకు సరిదిద్ద లేదు?
రిజర్వేషన్ రోస్టర్‌లో తప్పులు ఉన్నాయని చెప్పింది టీడీపీనే. ఇప్పుడు అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా.. అలాంటప్పుడు ఆ తప్పులు సరిదిద్దాక పరీక్ష నిర్వహించాలన్న కనీస విషయాన్ని విస్మరించడం దారుణం. ఏపీపీఎస్సీ తమ మాట వినలేదని చెప్పడం భావ్యం కాదు. అలా చెప్పడం ప్రభుత్వ పెద్దలకు ఇన్సల్ట్.
– ఎ.ఢిల్లేశ్వరరావు, శ్రీకాకుళం
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
గ్రూప్–2 పరీక్ష నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఒక వైపు రోస్టర్ సమస్య ఉన్నప్పటికీ దాన్ని సకాలంలో పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరి నిమిషంలో పరీక్షలు రద్దు చేయాలంటూ ఏపీపీఎస్సీకి లేఖ రాయడం నాటకమే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందుగానే సరైన నిర్ణయం తీసుకొని ఉండేది.
– మేఘన, ఒంగోలు
ప్రభుత్వం, ఏపీపీఎస్సీ కలిసి ఆడిన డ్రామా
రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల గ్రూప్–2 పరీక్ష రాసిన అభ్యర్థులందరం డైలమాలో పడ్డాం. ఇది సీఎం చంద్రబాబు తనకున్న రాజకీయ అనుభవంతో ఆడిన డ్రామా అని చాలా స్పష్టంగా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ అనుసరించిన విధానం వల్ల పరీక్ష ఉంటుందా, ఉండదా.. అనే విషయంలో చాలా గందరగోళానికి గురయ్యాను. ప్రభుత్వం, ఏపీపీఎస్సీ కలిసి ఆడిన డ్రామాగా భావిస్తున్నా. ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో ఇలా ఆడుకోకూడదు.
– కె.కాంతారావు, విజయవాడ
నిరుద్యోగులతో రాజకీయం దుర్మార్గం
రోస్టర్ విధానం పాటించకుండా అభ్యర్థులను చివరి ఘడియ వరకు ఉత్కంఠకు గురిచేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి తీవ్రమైన గందరగోళానికి తెరలేపింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే ఇంత డ్రామా ఆడింది. కష్టపడి చదివాం. తీరా పరీక్ష రాసే సమయంలో తీవ్రంగా టెన్షన్ పడ్డాం. నిరుద్యోగులతో రాజకీయం చేయడం దుర్మార్గం.
– రౌతు రామచంద్రులు, విజయనగరం
నిరుద్యోగులను మోసం చేస్తారా?
గ్రూపు–2 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకే కాలయాపన చేసేందుకు పూనుకుంది. రోస్టర్‌లో తప్పులున్నాయని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఒప్పుకున్నారు. మరి అలాంటప్పుడు లోపాలు సరి చేసి మరో 10 రోజులు తర్వాత పరీక్ష జరిపితే వచ్చే నష్టమేముంది? కోర్టు తీర్పు అంటూ మరికొంత కాలం కాలయాపన చేసి ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రభుత్వం పూనుకోవడం దారుణం.
– గుడిపాటి చంద్రశేఖర్, కండాపురం, నెల్లూరు జిల్లా
అర నిమిషం ఆలస్యంతో పరీక్షకు దూరం
ఓ అభ్యర్థి అర నిమిషం ఆలస్యంతో మెయిన్స్ పరీక్షకు దూరమైన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. విశాఖ గ్రామీణ ప్రాంతం రొంగలినాయుడుపాలేనికి చెందిన అభ్యర్థి కొండబాబుకు విశాఖపట్నం ద్వారకానగర్‌లోని బీవీకే కళాశాలలో సెంటర్ కేటాయించారు. ఉదయం 9.45 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించి, సమయం దాటగానే గేట్లు మూసివేశారు. ఇంటి నుంచి బస్సులో బయలుదేరిన కొండబాబు సెంటర్‌కు రావడం అర నిమిషం ఆలస్యమైంది. దీంతో అతన్ని లోనికి అనుమతించలేదు.
తాను ఈ పరీక్ష కోసం ఏడేళ్లుగా కష్టపడుతున్నానని, లోనికి అనుమతించాలని ఎంత ప్రాధేయపడ్డా సిబ్బంది అనుమతివ్వలేదు. దీంతో తాను పడ్డ శ్రమ వృథా అయిందని కన్నీరు పెట్టుకుంటూ వెనుదిరిగాడు. మరో ఘటనలో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలానికి చెందిన డి.శ్యామలకు విశాఖపట్నంలోని విజయం స్కూల్లో సెంటర్ కేటాయించారు. ఈమె ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో పరీక్ష రాయలేకపోయింది. ఎంతో కష్టపడి మెయిన్స్‌కి సిద్ధమయ్యానని, ఐదు నిమిషాల ఆలస్యంతో తాను పరీక్ష రాయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment