కేసులు నీరుగార్చే కుట్ర | Chandrababu TDP Govt conspiracy on corruption cases on them | Sakshi
Sakshi News home page

కేసులు నీరుగార్చే కుట్ర

Published Wed, Oct 23 2024 3:44 AM | Last Updated on Wed, Oct 23 2024 3:44 AM

Chandrababu TDP Govt conspiracy on corruption cases on them

7 కేసుల్లో సీఎం చంద్రబాబు, ఇతర కేసుల్లో నలుగురు మంత్రులు నిందితులు 

తుది నివేదికలో వారి పేర్లు తొలగించే పథకం

దర్యాప్తు అధికారులకు వేధింపులు, తీవ్ర ఒత్తిళ్లు.. చార్జిషీట్లను న్యాయస్థానానికి సమర్పించకుండా కుట్ర 

కీలక ఆధారాలను ప్రభుత్వ పెద్దలు తారుమారు చేసే ఆస్కారం.. గవర్నర్‌ నుంచి అనుమతి కోరే ప్రక్రియకు ఆటంకాలు 

చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయనున్న ఈడీ.. అందుకే ముందుగానే కేసులను పక్కదారి పట్టించే కుతంత్రం 

డీజీపీకి లేఖ రాసిన మాజీ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు.. దర్యాప్తు అధికారులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి 

కేసుల విచారణలో న్యాయస్థానానికి సహకరించాలని వినతి 

స్కిల్‌ స్కామ్‌ కేసులో అధికారులను బెదిరించేలా తాజాగా బాబు వ్యాఖ్యలు 

బెయిల్‌ మంజూరు సందర్భంగా సుప్రీం విధించిన షరతులు నిర్భీతిగా ఉల్లంఘన

ఈ కేసులకు సంబంధించి సీఎం చంద్రబాబు ఎదుట ప్రదర్శించేందుకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఎలా రూపొందించాలో దర్యాప్తు అధికారులకు కొందరు సీనియర్‌ ఉన్నతాధికారులు నిర్దేశించారు. ప్రధాన నిందితుడికి తనపై ఉన్న కేసులకు సంబంధించిన దర్యాప్తు వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించడం దేశంలో ఇదే తొలిసారి. ఆ కేసులను ఎప్పటిలోగా నీరుగార్చాలో దర్యాప్తు అధికారులకు గడువు కూడా విధించారు.

ఇప్పటికే స్కిల్‌ స్కామ్‌లో దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ.. చంద్రబాబుతోపాటు ఆయన మంత్రివర్గ సహచరుల పాత్రపై దర్యాప్తు మొదలు పెట్టాల్సి ఉంది. ఈ కీలక తరుణంలో ఈ  కేసులకు సంబంధించిన కీలక రికార్డులు చంద్రబాబుతోపాటు ఇతర నిందితులకు అందుబాటులో ఉన్నాయి. దాంతో రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉంది. 
– ఆధారాలు, న్యాయపరమైన అంశాలతో డీజీపీకి పొన్నవోలు లేఖ  

ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ప్రస్తుత ప్రభుత్వంలో నలుగురు మంత్రులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వారిపై అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు అనుమతించాలని గవర్నర్‌ను కోరే ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. ఆ ప్రతిపాదనను మంత్రివర్గం అజెండాలో చేర్చే సాహసం అధికారులు చేయగలరా? అలాంటప్పుడు వారి అవినీతిపై దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది?
– ఆధారాలు, న్యాయపరమైన అంశాలతో డీజీపీకి పొన్నవోలు లేఖ

సాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై నమోదైన ఏడు కేసుల నుంచి ఆయన పేరు తొలగించేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు..’ అని మాజీ అదనపు అడ్వకేట్‌ జనరల్, సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి... డీజీపీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు దృష్టికి తెచ్చారు. ‘ప్రభుత్వ ఒత్తిడితో ప్రస్తుత పోలీస్, సీఐడీ ఉన్నతాధికారులు ఆ కేసుల విచారణలో న్యాయస్థానానికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. 

చార్జ్‌షీట్లను న్యాయస్థానానికి పునఃసమర్పించకుండా ఉద్దేశపూర్వ­కంగా తొక్కిపెడుతున్నారు. తద్వారా కేసుల దర్యాప్తు సాగకుండా అడ్డుకుంటున్నారు’ అని వెల్లడించారు. ‘చంద్రబాబుపై అవినీతి కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారు. అప్పటి సీఐడీ అదనపు డీజీ సంజయ్, సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇన్‌చార్జ్‌ కె.రఘురామ్‌రెడ్డిని హఠాత్తుగా బదిలీ చేసి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. 

సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు నిందితులుగా ఉన్న ఈ కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని అభ్యర్థిస్తూ ఓ సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయాన్ని కూడా పొన్నవోలు తన లేఖలో ప్రస్తావించారు. ఈ మేరకు డీజీపీకి ఆయన లేఖ రాశారు. కేసుల దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ న్యాయస్థానానికి పూర్తిగా సహకరించాలని... దర్యాప్తు అధికారులకు రక్షణగా నిలవాలని అందులో డీజీపీని కోరారు. పూర్తి ఆధారాలతో, న్యాయపరమైన అంశాలను ఉటంకిస్తూ డీజీపీకి రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ..

చంద్రబాబు పేరు తొలగించే కుట్ర.. ఉన్నతాధికారులకు బెదిరింపులు
రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కేసు సహా దర్యాప్తులో ఉన్న ఏడు కేసుల్లో నిందితుల జాబితా నుంచి ప్రధాన నిందితుడు చంద్రబాబు పేరు తొలగించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. అందుకోసం సీఐడీ, పోలీసు ఉన్నతాధికారులను తీవ్రంగా ఒత్తిడి చేస్తోంది. ఆ కేసుల తుది దర్యాప్తు నివేదికను న్యాయస్థానానికి సమర్పించే ముందు నిందితుల జాబితా నుంచి చంద్రబాబు పేరు తొలగించాల్సిందేనని దర్యాప్తు అధికారులను ఒత్తిడి చేస్తూ బెదిరిస్తోంది. 

దర్యాప్తు నివేదికలను తారుమారు చేయాల్సిందేనని అధికారులను వేధిస్తున్నారు. తద్వారా ప్రధాన నిందితుడైన చంద్రబాబును ఈ కేసుల నుంచి సులువుగా బయటపడేయవచ్చన్నది అసలు ఉద్దేశం. సాక్షులుగా న్యాయస్థానం ఎదుట 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఇచ్చిన అధికారులపై ఈ కేసులను నెట్టేయాలని కుట్ర పన్నింది.

చార్జిషీట్లను తొక్కిపెట్టారు
చంద్రబాబుపై ఉన్న కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం మరో కుట్రకు పాల్పడింది. స్కిల్‌ స్కామ్, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్, ఫైబర్‌ నెట్, అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసులకు సంబంధించిన చార్జిషీట్లను సీఐడీ గతంలోనే న్యాయస్థానానికి సమర్పించింది. దీనిపై కొంత వివరణ కోరుతూ న్యాయస్థానం వాటిని ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ మధ్య సీఐడీకి పంపింది. 

అప్పటి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు ఆ అంశాలకు సంబంధించి కేస్‌ స్టడీలతో వివరాలను సీఐడీ అధికారులకు నివేదించారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఆ కేసులను నీరుగార్చేలా సీఐడీపై ఒత్తిడి చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆ చార్జ్‌షీట్లను ఈ రోజు వరకూ న్యాయస్థానానికి సమర్పించలేదు. ఆ కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు ఎలాంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. 

టీడీపీ ప్రధాన కార్యాలయానికి నిధులు
ఏడు కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులు అక్రమ మార్గంలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి చెందిన బ్యాంకు ఖాతాలకు చేరాయని సీఐడీ అధికారులు ఇప్పటికే ఆధారాలతో సహా గుర్తించారు. కానీ ఆ కేసుల దర్యాప్తునకు టీడీపీ ప్రధాన కార్యాలయం సహకరించడం లేదని సీఐడీ న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. 

అంటే ఈ కేసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నది సుస్పష్టం. ప్రస్తుతం చంద్రబాబు సీఎంగా ఉండటంతో ఆ కేసుల దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారు. 

దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారు
ఆ ఏడు కేసుల దర్యాప్తు వేర్వేరు దశల్లో ఉంది. ఆ కేసులను దర్యాప్తు  చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కార్యాలయాన్ని 2024 జూన్‌ నుంచి ఆగస్టు 14 వరకు  మూసివేశారు. డీజీపీ ఆదేశాలతో సిట్‌ అధికారులు ఆ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ కేసులను దర్యాప్తు చేస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు అదనపు డీజీ (సీఐడీ) ఎన్‌.సంజయ్, సిట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఐజీ  కె.రఘురామ్‌రెడ్డిని హఠాత్తుగా బదిలీ చేశారు. వారికి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోంది. 

నిందితులుగా చంద్రబాబు, మంత్రులు.. అందుకే కేసులు నీరుగార్చే కుట్ర
ఈ ఏడు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. సాధారణ పరిపాలన శాఖ, శాంతి–భద్రతల శాఖలను స్వయంగా నిర్వహిస్తున్న ఆయన ఈ కేసుల దర్యాప్తును నియంత్రిస్తున్నారు. ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారుల పనితీరుపై వార్షిక నివేదికలను ఆమోదించే స్థానంలో ఆయనే ఉన్నారు. దాంతో నాలుగు చార్జ్‌షీట్లపై న్యాయస్థానం కోరిన వివరణలను ఐపీఎస్‌ అధికారులు సమర్పించలేకపో­తున్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబే కాకుండా ఇతర నిందితులు కూడా ఈ కేసుల సాక్షులను ప్రభావితం చేసే కీలక స్థానాల్లో ఉన్నారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులు, సాక్షులపై వేధింపులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు, మరో నలుగురు మంత్రులు ఈ ఏడు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అందుకే అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు గవర్నర్‌ అనుమతి కోరడం లేదు. 

కక్ష సాధింపు చర్యలకు తార్కాణం.. 
ఫిర్యాదు చేశారనే మధుసూదన్‌రెడ్డిపై వేధింపులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత కక్షపూరితంగా అధికారులను వేధిస్తున్నారో చెప్పేందుకు ఐఆర్‌ఏఎస్‌ అధికారి ఎం. మధుసూదన్‌రెడ్డి ఉదంతమే తార్కాణం. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఫైబర్‌నెట్‌ కుంభకోణంపై సంస్థ ఎండీ హోదాలో ఆయన  సీఐడీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రధాన నిందితుడిగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ప్రస్తుతం ఆ పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దీన్ని దృష్టిలో పెట్టుకుని కక్షపూరితంగా ఎం.మధుసూదన్‌రెడ్డిని సస్పెండ్‌ చేయించారు. డిప్యుటేషన్‌ పూర్తయి ఆయన తన మాతృశాఖకు వెళ్లడానికి మూడు రోజుల ముందు సస్పెండ్‌ చేయడం గమనార్హం. దీనిపై ఆయన పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్‌పై స్టే విధించింది. ఈ కేసుల దర్యాప్తు అధికారులకు ప్రస్తుత ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా వేధిస్తోంది. 

గవర్నర్‌ అనుమతి ప్రక్రియకు మోకాలడ్డు
ఈ కేసులో నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణకు గవర్నర్‌ అనుమతి కోరే ప్రక్రియను గతంలో డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి చేపట్టారు. కానీ ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండగా మరో నలుగురు మంత్రులుగా ఉన్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్‌ అనుమతి కోరే ప్రక్రియను ప్రస్తుత సీఐడీ అదనపు డీజీ, డీజీపీ కొనసాగిస్తారనే నమ్మకం  లేదు. గవర్నర్‌ అనుమతి కోరే ప్రతిపాదనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రివర్గం ముందు ఉంచాలి. కానీ ముఖ్యమంత్రి నియంత్రణలో విధులు నిర్వర్తించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలనకు తెస్తారనే నమ్మకం లేదు. 

మళ్లీ అదే పదవుల్లో నిందితులు.. కీలక రికార్డుల తారుమారుకు అవకాశం
గతంలో టీడీపీ ప్రభుత్వంలో సీఆర్‌డీఏ చైర్మన్‌గా ఉన్న చంద్రబాబు, వైస్‌ చైర్మన్‌  పి.నారాయణ అసైన్డ్‌ భూములు, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు 
కుంభకోణాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం వారిద్దరూ మళ్లీ అదే పదవుల్లో ఉన్నారు. ఆ కేసుల్లో న్యాయస్థానం ఎదుట సీఆర్‌పీసీ 164  కింద సాక్ష్యం ఇచ్చిన అధికారులు ప్రస్తుతం చంద్రబాబు, నారాయణ నియంత్రణలో ఉన్నారు. ఈ కేసుల్లో మరికొందరు సాక్షులను విచా­రించాల్సి ఉంది. మరోవైపు ఈ కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్లు, రిమాండ్‌ రిపోర్టులు, కొల్లగొట్టిన భూములకు సంబంధించిన కీలక రికార్డులన్నీ చంద్రబాబు, నారాయణకు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ కేసుల్లో సాక్షులను బెదిరించేందుకు, రికా­ర్డులను తారుమారు చేసేందుకు వారిద్దరికీ పూర్తి అవకాశం ఉంది. 

ఈడీ దర్యాప్తు భయంతో..
మనీ లాండరింగ్‌కు కూడా పాల్పడిన ఈ కేసుల వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి గతంలోనే సీఐడీ నివేదించింది. స్కిల్‌ స్కామ్‌ కేసులో సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే ఈడీ ఇప్పటివరకు పరిమిత స్థాయిలో దర్యాప్తు నిర్వహించింది. స్కిల్‌ స్కామ్‌ కేసులో షెల్‌ కంపెనీ డిజైన్‌టెక్‌కు చెందిన ఆస్తులను జప్తు చేయడంతోపాటు నలుగురు నింది­తులను అరెస్ట్‌ కూడా చేసింది. స్కిల్‌ స్కామ్‌ కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఈడీకి సమర్పించింది. 

ఆ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబు బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులు డిపాజిట్‌ అయినట్లు సీఐడీ గుర్తించింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో కొందరు బ్యాంకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కేవైసీ వివరాలు తీసుకోకుండానే నోట్ల మార్పిడి చేసినట్లు కూడా ఆధారాలు సేకరించింది. 

ఆ వివరాలతో పాటు స్కిల్‌ స్కామ్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ కుంభకోణం, ఫైబర్‌ నెట్‌ కుంభకోణం, అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసులకు సంబంధించి న్యాయస్థానంలో సమర్పించిన చార్జ్‌షీట్లను ఈడీకి ఇప్పటికే సీఐడీ సమర్పించింది. వాటి ఆధారంగా చంద్రబాబుతోపాటు ఇతర ప్రధాన నిందితులపై ఈడీ ఇంకా దర్యాప్తు మొదలు పెట్టాల్సి ఉంది. దీంతో ఈ కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం సీఐడీపై ఒత్తిడి తెస్తోంది. 

దర్యాప్తు అధికారులకు రక్షణగా ఉండండి.. నిష్పక్షపాత విచారణకు సహకరించండి
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతోపాటు మరో నలుగురు మంత్రులు నిందితులుగా ఉన్న ఆ ఏడు కేసుల దర్యాప్తు సమగ్రంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. ఆ కేసుల్లో దర్యాప్తు అధికారులపై ఎలాంటి వేధింపులకు పాల్పడకుండా, బలవంతపు చర్యలు తీసుకోకుండా వారికి డీజీపీ రక్షణ కవచంలా నిలవాలి. 

తమ అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ నిందితులకు కొమ్ముకాయడం అంటే నేరానికి పాల్పడినట్టేనని వేరే గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఈ కేసులకు సంబంధించి వాస్తవాలను న్యాయస్థానానికి సమర్పించాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. కేసుల విచారణలో న్యాయస్థానానికి డీజీపీ పూర్తిగా సహకరించాలి.

బాబు బరితెగింపు 
బెయిల్‌ నిబంధనల ఉల్లంఘన 
స్కిల్‌ స్కామ్‌తోసహా తనపై ఉన్న అవినీతి కేసుల దర్యాప్తును ప్రభావితం చేస్తున్న సీఎం చంద్రబాబు న్యాయస్థానం ఆదేశాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారు.  స్కిల్‌స్కామ్‌ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టమైన షరతులు విధించింది. ఈ కేసుకు సంబంధించిన అంశాలను మీడియా ఎదుటగానీ మరెక్కడాగానీ మాట్లాడకూడదని స్పష్టం చేసింది. అనంతరం పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు కూడా షరతులు విధించింది. 

అయితే చంద్రబాబు తాను న్యాయస్థానాలకు అతీతమన్నట్టు వ్యవహరిస్తూ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే రీతిలో వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. తాజాగా ‘ఆహా’లో నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న ‘అన్‌ స్టాపబుల్‌’ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. అందులో స్కిల్‌ స్కామ్‌ కేసు గురించి చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించడం గమనార్హం. 

తనను అకారణంగా అరెస్ట్‌ చేశారని.. తాను ఏ తప్పూ చేయలేదని వ్యాఖ్యలు చేశారు. కేసు ఇంకా విచారణలో ఉండగానే తనకు తానే తీర్పు ఇచ్చేశారు! తద్వారా స్కిల్‌ స్కామ్‌ కేసు గురించి మాట్లాడవద్దన్న న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారు.  అంతేకాదు.. తాను ఎవరినీ విడిచిపెట్టబోనంటూ దర్యాప్తు అధికారులను బెదిరించే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కేసుల్లో నిందితుల వివరాలు
నారా చంద్రబాబు (ముఖ్యమంత్రి):  ఏడు కేసుల్లో నిందితుడు
⇒ పొంగూరు నారాయణ (మున్సిపల్‌ శాఖ మంత్రి): ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ కుంభకోణం, అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసుల్లో నిందితుడు
⇒ నారా లోకేశ్‌ (విద్యా శాఖ మంత్రి): ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ కుంభకోణం కేసులో నిందితుడు
⇒ కె.అచ్చెన్నాయుడు (వ్యవసాయ శాఖ మంత్రి): స్కిల్‌ స్కామ్‌ కేసులో నిందితుడు
⇒ కొల్లు రవీంద్ర (ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి): మద్యం కుంభకోణం కేసులో నిందితుడు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement