
నేడు, రేపు వర్షాలు
సాక్షి, అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర వాయవ్య దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఉత్తర, ఈశాన్య దిశగా తిరిగి దిశ మార్చుకుని మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడనున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో పలుచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే మంగళవారం నంద్యాల జిల్లా దొర్నిపాడు, వైఎస్సార్ జిల్లా మద్దూరులో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 25 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎగసిపడుతున్నసముద్ర కెరటాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మంగళవారం సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. సముద్ర తీరంలో భీకరమైన శబ్దాలతో అలజడి నెలకొనడంతో మత్స్యకారుల వేట సాగలేదు. రెండు రోజులుగా అలల ఉధృతి మారుతోంది. దాదాపు ఐదు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి.
తిరుపతి జిల్లా, గూడూరు నియోజకవర్గం, తూపిలిపాళెం, కొండూరుపాళెం, అంజలాపురం, శ్రీనివాసపురం, ఓడపాళెం, మొనపాళెం, వైట్‌కుప్పం, పూడికుప్పం, నవాబుపేట, పూడిరాయిదొరువు సముద్రం ఒడ్డున మత్స్యకారులు తమ బోట్లను లంగరు వేశారు. – వాకాడు