దక్షిణ ఏపీ వైపు కదిలి మరింత బలహీనపడే అవకాశం
నేడు దక్షిణ కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షాలకు ఆస్కారం
పల్నాడు జిల్లాలో కుండపోత
నీట మునిగిన పంటలు.. తడిచిపోయిన ధాన్యం
తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు
సాక్షి, విశాఖపట్నం/బొల్లాపల్లి: వాయుగుండం బలహీనపడి.. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ–నైరుతి దిశగా కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చి అల్పపీడనంగా బలహీనపడనుంది.
మంగళవారం నాటికి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల వైపు ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతం వద్ద మరింత బలహీనపడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో నేడు, రేపు అక్కడక్కడా వానలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తాయని..ఈ నేపథ్యంలో 25 వరకు దక్షిణ కోస్తా తీరం వైపు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
అకాల వర్షం ముంచేసింది..
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు 4 గంటలపాటు భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు పొంగిపొర్లాయి. రైతులకు అపార నష్టం వాటిల్లింది. కోత కోసి పొలాల్లో ఉంచిన వరి ఓదెలు నీట మునిగాయి. పలుచోట్ల ఆరబెట్టిన ధాన్యం కూడా తడిచిపోయింది.
ధాన్యం విక్రయించే సమయంలో కురిసిన అకాల వర్షం తమను నిండా ముంచేసిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పలుకూరు, కనుమలచెరువు, పేరూరుపాడు, వెల్లటూరు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.
Comments
Please login to add a commentAdd a comment