యువనేత సమర్పించు 104 స్కామ్‌ | Ready for exploitation in the name of diagnostic tests | Sakshi
Sakshi News home page

యువనేత సమర్పించు 104 స్కామ్‌

Published Wed, Apr 9 2025 5:20 AM | Last Updated on Wed, Apr 9 2025 5:20 AM

Ready for exploitation in the name of diagnostic tests

రోగ నిర్ధారణ పరీక్షల పేరిట దోపిడీకి సమాయత్తం

పరీక్షల నిర్వహణకు ఒక్కో ఎంఎంయూకు నెలకు రూ.1.55 లక్షల మేర చెల్లించేలా ప్రణాళిక

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దోపిడీకి ఆస్కారం లేకుండా ఉచితంగా పరీక్షలు

గ్రామ స్థాయిలో విలేజ్‌ క్లినిక్స్‌లో అందుబాటులో 14 రకాల కిట్‌లతో వైద్య పరీక్షలు

పీహెచ్‌సీల్లో 63 రకాల రక్త పరీక్షలు 

104 గ్రామానికి వెళ్లిన రోజు సీహెచ్‌వోల ద్వారా రక్త నమూనాలు సేకరించి పీహెచ్‌సీకి తరలించేందుకు ఆస్కారం

ఇన్ని వనరులను పక్కనపెట్టి ప్రజా ధనాన్ని కొల్లగొట్టేందుకు కూటమి పెద్దలు స్కెచ్‌ వేశారని విమర్శలు

సాక్షి, అమరావతి: స్కామ్‌ల కోసమే కొత్త కొత్త స్కీమ్‌­లను ప్రవేశపెట్టడంలో చంద్రబాబును మించిన నాయకుడు ఇంకొకరు ఉండరు. నీరు–చెట్టు, ఇసుక, మద్యం, ప్రజారోగ్య శాఖ.. ఇలా ఆయన కుంభకోణాల ట్రాక్‌ రికార్డులో పెద్ద చిట్టానే ఉంటుంది. ఈ పరంపరలో 2014–19 మధ్య రక్త పరీక్షల పేరిట మెడాల్‌ కుంభకోణానికి పాల్పడినట్టే  ఇప్పుడు వైద్య శాఖలో మరో స్కామ్‌కు సమా­యత్తం అవుతు­న్నారు. 108 అంబులెన్స్‌లు, 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్స్‌ (ఎంఎంయూ), ఎమ­ర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌(ఈఆర్‌సీ) నిర్వహణ కాంట్రాక్ట్‌ను ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ‘యువ’ నేత తన అస్మదీయ సంస్థకు కట్టబెట్టేలా చక్రం తిప్పారు. 

అత్యవసర సేవల్లో అనుభవం లేనప్పటికీ ఐదేళ్ల కాలానికి ఏకంగా రూ.3 వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను తమ వారి సంస్థకు దక్కేలా అడ్డగో­లుగా నిబంధనలు రూపొందించారు. సేవ­లను మరింత బలోపేతం చేస్తున్నామంటూ 104 ఎంఎంయూల్లో రోగ నిర్ధారణ పరీక్షల పేరిట పెద్ద దోపిడీకి స్కెచ్‌ వేశారని విశ్వసనీయ సమాచారం. 

పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో రక్త పరీ­క్షల నిర్వహణను మెడాల్‌ ద్వారా చేపట్టి 2014–19 మధ్య రూ.300 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఇలానే గ్రామీణ ప్రజలకు 104 ఎంఎంయూల్లో రోగ నిర్ధా­రణ పరీక్షల పేరిట రూ.840 కోట్ల మేర ప్రజాధ­నా­నికి యువనేత ఎసరు పెట్టారని సమాచారం.

ఒక్కో ఎంఎంయూకు నెలకు రూ.1.55 లక్షలు
గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా గత ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రవేశ­పెట్టారు. 104 ఎంఎంయూలకు కొత్తగా 904 వాహ­నా­లను సమకూర్చారు. ‘ఫ్యామిలీ డాక్టర్‌’ కింద పీహెచ్‌సీల్లోని వైద్యులు 104 వాహనాల్లో తమ పరిధిలోని గ్రామాలను నెలలో రెండుసార్లు పర్యటి­స్తున్నారు.  ఈ వాహనాల్లో పలు రోగ నిర్ధారణ పరి­క­రాల సమకూర్చి, గ్రామాల్లోనే ప్రజలకు ల్యాబ్‌ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. 

ఒక్కో ఎంఎంయూలో రోజుకు 30 మందికి వైద్య పరీక్షలు చేసేలా నెలకు రూ.1.60 లక్షలు ఖర్చు అవుతుందన్న అంచనాతో 104, 108 నిర్వహణ టెండర్‌లలోనే వైద్య పరీక్షల అంశాన్ని చేర్చారు. యువ నేతకు అస్మదీయ సంస్థ వైద్య పరీక్షల కోసం రూ.1.55 లక్షల వరకు టెండర్‌లలో కోట్‌ చేసినట్టు వెల్లడవుతోంది. కాంట్రాక్టరే వాహనాల్లో ల్యాబ్‌ పరి­క­రాలు సమకూర్చుకుని, పరీక్షలు చేయాలనేది నిబ­ంధన. 

ఈ నేపథ్యంలో నెలకు 904 ఎంఎంయూ­లకు రూ.14 కోట్లపైనే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.168 కోట్ల చొప్పున ఐదేళ్ల కాంట్రాక్ట్‌ కాలానికి వైద్య పరీక్షల సేవల కోసమే ప్రభుత్వం రూ.840 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద దోపిడీకి తెరతీసినట్టు తెలు­స్తోంది. ఇప్పటికే గ్రామ స్థాయిలో విలేజ్‌ క్లినిక్‌లో 14 రకాల టెస్ట్‌ కిట్‌లు అందుబాటులో ఉంటు­న్నాయి. గ్రామాలకు నాలుగైదు కి.మీ. దూరంలో ఉండే పీహెచ్‌సీల్లోని ల్యాబ్‌లలో 63 రకాల వైద్య పరీక్షలకు వీలుంటోంది. 

ఇలా ప్రభుత్వం పరిధి­లోనే ఎంతో పకడ్బందీ వ్యవస్థ ఉండగా, ఎంఎంయూ­ల్లో వైద్య పరీక్షల పేరిట భారీ ఎత్తున ప్రజా­ధనం ఖర్చు చేయడానికి సిద్ధం అవ్వడం ఏంటని వైద్య వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇది కూడా 2014–19 మధ్య వైద్య శాఖలో చోటు చేసుకున్న మెడాల్‌ స్కామ్‌ వంటిదేనని అందరూ అనుకుంటున్నారు. 

ఏమిటా మెడాల్‌ స్కామ్‌?
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదిక రక్త పరీక్షల నిర్వహణ పేరిట వైద్య శాఖలో 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. పరీక్షల నిర్వహణ కాంట్రాక్ట్‌ను అప్పట్లో ‘మెడాల్‌’ అనే ప్రభుత్వ పెద్ద జేబు సంస్థకు కట్ట­బెట్టారు. 32 పరీక్షలకు రూ.235గా రేటు ఖరారు చేశారు. రోగి నుంచి నమూనా తీసి ఒకే పరీక్ష చేసి­నా సరే నిర్దేశించిన మొత్తం ప్రభుత్వం చెల్లించేలా కాంట్రాక్ట్‌ నిబంధనలున్నాయి. దీంతో ప్రజాధనం లూటీనే లక్ష్యంగా ప్రభుత్వ వైద్యులను కాంట్రాక్ట్‌ సంస్థ మేనేజ్‌ చేసుకుని, అవసరం లేకున్నా రోగు­లకు పరీక్షలు చేసి బిల్లులు పెట్టడం ద్వారా రూ.300 కోట్లు కొట్టేసింది.  

అవినీతి కోసం రూపొందించిన ఈ స్కీమ్‌ను పద్ధతి ప్రకారం చేయడం కోసం తొలుత పైలట్‌గా, అనంతరం రాష్ట్రం మొత్తం అమలు చేశారు. ఇప్పుడు కూడా 104 ఎంఎంయూ­ల్లో రోగ నిర్ధారణ పరీక్షల ప్రవేశపెట్టడం కోసం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పైలట్‌గా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం రాష్ట్రం మొత్తం అమలు చేసేలా ప్రణాళికలున్నాయి. అప్ప­ట్లో మెడాల్‌కు అడ్డదారుల్లో కాంట్రాక్ట్‌ కట్టబెట్టారు. ఈ సంస్థ ఒక నమూనాకు రూ.235కు మరో సంస్థ రూ.145కు కోట్‌ చేశాయి. కానీ ఎక్కువకు కోట్‌ చేసినా మెడాల్‌కే కాంట్రాక్ట్‌ను ముట్టజెప్పారు.

వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గ్రామ స్థాయిలో 10,032 విలేజ్‌ క్లినిక్స్‌ను ఏర్పాటు చేశారు. 105 రకాల మందులు, 14 రకాల రోగ నిర్ధారణ కిట్‌లు అందుబాటులోకి తెచ్చారు. ఏడాది పొడ­వునా బీపీ, షుగర్‌ బాధితులు, గర్భిణులు, వృద్ధులకు ఇక్కడ వైద్య సేవలు అందుతున్నాయి. నెలలో రెండుసార్లు 104లలో పీహెచ్‌సీ వైద్యులు విలేజ్‌ క్లినిక్‌లను సందర్శించి, రోజంతా గ్రామంలో ఉంటూ వైద్య సేవలందిస్తు­న్నారు. 

కూటమి ప్రభుత్వం చెబు­తున్న వైద్య పరీక్షలు 104 గ్రామానికి వెళ్లిన రోజు మాత్రమే నిర్వహిస్తారు.  చంద్రబాబు ప్రభు­త్వానికి చిత్త­శుద్ధి ఉంటే అందుబాటులో ఉన్న వ్యవస్థలనే వాడుకునేదని వైద్య నిపుణులు అభిప్రాయప­డుతున్నారు. విలేజ్‌ క్లినిక్స్‌లో బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్హత ఉన్న కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌ (సీహెచ్‌వో)లు ఉన్నారు. వీరికి రోగుల నుంచి రక్తనమూనాలు సేకరించడంలోనూ అనుభవం ఉంది. ఈ క్రమంలో 104 గ్రామానికి వచ్చిన రోజు వైద్యులు సూచించిన రోగుల నుంచి నమూ­నాలు సేకరించి ఆస్పత్రు­లకు తరలిస్తే ఉచితంగా 63 రకాల పరీక్షలు చేయడానికి వీలు­ంది. 

వాటి ఫలితాల ఆధారంగా వైద్యుడు సీహెచ్‌­వోలకు వర్చువల్‌గా అవసరమైన మందులు సూచిస్తే సీహెచ్‌వో, ఏఎన్‌ఎం, ఆశాల ద్వారా నేరుగా రోగి ఇంటి వద్దకు డెలివరీ చేయవచ్చు.   స్పెషలిస్ట్‌ కన్సల్టేషన్‌ అవసరమైతే విలేజ్‌ క్లినిక్‌ నుంచే టెలీమెడిసిన్‌ ద్వారా అవ­కాశం ఉంది. ఒకవేళ మెరుగైన వైద్యం అవ­సరమైతే గ్రామంలోని ఆరోగ్య సిబ్బంది ద్వారా­నే ప్రభుత్వా­స్పత్రులు/ఆరోగ్యశ్రీ నెట్‌­వర్క్‌ ఆస్ప­త్రు­లకు రెఫర్‌ చేసే ఆస్కారం ఉంది. కానీ, ఇంత పకడ్బందీ వనరులను కాదని చంద్ర­బాబు ప్రభు­త్వం 104లో ఔట్‌సోర్సింగ్‌ పరీక్ష­లను ప్రవే­శ­పెట్టడం వెనుక ప్రజారోగ్య పరిరక్షణ కన్నా, దురు­ద్దేశమే ఎక్కువగా ఉందని స్పష్టం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement